తొక్కిసలాట మరణాలపై తప్పుడు లెక్కలు.. లోక్‌సభలో అఖిలేష్‌ ఫైర్‌ | Akilesh Yadav lash out BJP in Parliament Over Maha Kumbh Stampede Count | Sakshi
Sakshi News home page

తొక్కిసలాట మరణాలపై తప్పుడు లెక్కలు.. లోక్‌సభలో అఖిలేష్‌ ఫైర్‌

Published Tue, Feb 4 2025 1:26 PM | Last Updated on Tue, Feb 4 2025 1:50 PM

Akilesh Yadav lash out BJP in Parliament Over Maha Kumbh Stampede Count

న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. ఈ దుర్ఘటనలో మరణాలు దాస్తున్నారంటూ.. ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కుంభమేళా సందర్భంగా యోగి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపైనా మండిపడ్డ ఆయన.. తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?.. అసలైన లెక్క బయటపెట్టండి.. అంటూ ప్రసంగించారు.

రాష్ట్రపతి బడ్జెట్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు పార్లమెంట్‌ మంగళవారం కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ క్రమంలో.. కుంభమేళా దుర్ఘటనపై అఖిలేష్‌ యాదవ్‌ ప్రసంగించారు. ‘‘మహా కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరం. యూపీ ప్రభుత్వం 30 మంది చనిపోయారని, 60 మందికి గాయాలయ్యాయని చెబుతోంది. కానీ, విపక్షాలు ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నాయని అంటున్నాయి. బడ్జెట్‌ విషయంలో సరైన లెక్కలు చెప్పే ఈ ప్రభుత్వం.. కుంభమేళా మరణాల సంఖ్యను మాత్రం ఎందుకు దాస్తోంది. అసలు ఈ దుర్ఘటనకు బాధ్యత ఎవరిది? ఇప్పటిదాకా ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు అని అఖిలేష్‌ ప్రశ్నించారు.

కుంభమేళా తొక్కిసలాట ఘటనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించాలి. మరణాలు, గాయపడ్డవాళ్లు, వాళ్లకు అందుతున్న చికిత్స, అక్కడి వైద్య సిబ్బంది, రవాణా సదుపాయలు, వైద్యం.. ఇలా అన్నింటి గురించి చర్చ జరగాలి అని ఆయన డిమాండ్‌ చేశారాయన. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపేంతదాకా యోగి సర్కార్‌ సంతాపం ప్రకటించకపోవడంపైనా అఖిలేష్‌ విరుచుకుపడ్డారు. అలాగే.. పెట్టుబడుల విషయంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాల ఇంజిన్లు మాత్రమే కాదు.. భోగీలు కూడా ఢీ కొట్టుకున్నాయని ఎద్దేవా చేశారు.   

ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి.. మౌని అమావాస్య పురస్కరించుకుని అమృత స్నానాల కోసం భక్తులు పోటెత్తారు. అఖాడా ఘాట్‌ల వద్ద ఒక్కసారిగా తోపులాట జరగడంతో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు మృతి చెందగా, గాయపడ్డవాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటలకు పరిస్థితి అదుపులోకి రావడంతో పుణ్య స్నానాలు యథాతధంగా కొనసాగాయి. చివరకు.. ఘటనలో 30 మంది మరణించినట్లు అక్కడి పోలీసు అధికారులు  సాయంత్రం ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement