
వెల్లువలా వచ్చిపడుతున్న ప్రయాణికులు, రివాజు తప్పకుండా ఆలస్యంగా వచ్చిపోయే రైళ్లు, ఉన్న గందరగోళాన్ని ఒకింత పెంచే అనౌన్స్‌మెంట్లు, ఏమూలకూ సరిపోని మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఏకమై 45 నిమిషాలపాటు ఏకధాటిగా సృష్టించిన తీవ్ర గందరగోళ స్థితి శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు దారితీసి 18 మంది ప్రాణాలను బలి తీసుకుంది.
ఈ మరణాలకు సంతాపం ప్రకటించటం, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేయటం సరే... జరిగిన ఘోర ఉదంతానికి నైతిక బాధ్యత వహించాల్సిందెవరు? ఇలాంటివి పునరావృత్తం కానీయ బోమని చెప్పేదెవరు? మన దేశంలో ఎప్పుడు జనసమ్మర్దం అధికంగా ఉంటుందో, ఏ చర్యలు అవసరమో అధికార యంత్రాంగానికి తెలియక కాదు. అందుకు సంబంధించి ఇప్పటికే బోలెడు చేదు అనుభవాలున్నాయి.
కానీ ఎన్ని జరుగుతున్నా గుణపాఠం నేర్వని మనస్తత్వమే ఈ విషాద ఘటనకు దారితీసింది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని 30 మంది ప్రాణాలు బలై పక్షం రోజులు కాలేదు. అదే ప్రయాగ్‌రాజ్‌కు బయల్దేరిన భక్తులకు ఢిల్లీ రైల్వే స్టేషనే ఈసారి మృత్యుఘంటిక మోగించిందంటే నేరం ఎవరిదనుకోవాలి?
తొక్కిసలాట జరిగిన అజ్మీరీ గేట్ టెర్మినల్ గురించి ఉత్తరాదిలో పనిచేసే రైల్వే ఉన్నతాధికారులకూ, ప్రత్యేకించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అధికారులకూ తెలియంది కాదు. సాధారణ దినాల్లో సైతం ఆ టెర్మినల్ కిక్కిరిసివుంటుంది. ఢిల్లీ మెట్రో రైల్‌ను నేరుగా అనుసంధానం చేసే ప్రాంతమది. పైపెచ్చు వాహనాల పార్కింగ్‌కు అనువైనది. యూపీ మీదుగా వెళ్లాల్సిన రైళ్లు ఆగే అయిదు ప్లాట్ ఫాంలు అజ్మీరీ గేట్ టెర్మినల్ ప్రాంతంలోనే ఉన్నాయి. దానికితోడు ఇప్పుడు కుంభమేళా సంరంభం కొనసాగుతోంది.
తగిన ప్రణాళిక రూపొందించుకుని, అదనపు జాగ్రత్తలు తీసుకోవడా నికి ఈ కారణాలు చాలవా? సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలలోపు బయల్దేరే రైళ్లను అందు కోవటానికి వచ్చే జనరల్ కంపార్ట్‌మెంట్ ప్రయాణికులకు అక్కడ రోజూ 7,000 టిక్కెట్లు విక్రయి స్తారు. కానీ శనివారం రోజు కేవలం రెండు గంటల వ్యవధిలో అదనంగా మరో 2,600 మందికి టిక్కెట్లు విక్రయించారు.
అంటే రిజర్వేషన్‌లేని ప్రయాణికుల సంఖ్య దాదాపు పదివేలు! ఇంత మంది టికెట్ల తనిఖీ అసాధ్యం. కనుక టికెట్ లేకుండా ప్రయాణించేవారు ఇంతకు మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంటారని ఒక అంచనా. అందుబాటులో ఉన్న బోగీలెన్నో, జారీ చేయాల్సిన టికెట్లెన్నో కనీస అంచనాకు రాకపోవటం... అవసరమైన పోలీసు బలగాలను సమకూర్చుకోవాలన్న స్పృహ లోపించటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 20 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
వారు సైతం ఈ తొక్కిస లాట సమయంలో ‘బతుకుజీవుడా’ అనుకుంటూ పక్కకుపోయారు. పర్యవసానంగా ‘రక్షించండి...’ అంటూ ఆర్తనాదాలు చేస్తున్నవారి కోసం పోర్టర్లే రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వారే గనుక ఆపద్బాంధవుల్లా రాకపోతే మరింతమంది మృత్యువాత పడేవారు. కుంభమేళా సందర్భంగా డిమాండ్ ఎక్కువుంది గనుక ఉన్న రైళ్లను సమయానికి నడిపుంటే ఇంత జనసమ్మర్దం ఉండేది కాదు.
ఎంతో జాప్యం జరిగి ఒకదాని వెనక మరొకటిగా వరసపెట్టి మూడు రైళ్లుండటం వల్ల 14, 15 నంబర్ ప్లాట్‌ఫాంలపై వేలాదిమంది పడిగాపులు పడుతున్నప్పుడే ప్రయాగ్‌రాజ్ వెళ్లే ప్రత్యేక రైలుపై వెలువడిన అనౌన్స్‌మెంట్ తీవ్ర గందరగోళానికి దారితీసి తొక్కిసలాట జరగిందంటున్నారు.
మన దేశం వరకూ చూస్తే తొక్కిసలాటల్లో దాదాపు 80 శాతం మతపరమైన పవిత్ర దినాల్లో, తీర్థయాత్రల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు 2013లో ఒక అధ్యయనం తేల్చిచెప్పింది. భారీగా వచ్చి పడే ప్రజానీకాన్ని నియంత్రించటానికి జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ ఆ ఏడాదే సవివరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడు సాంకేతికత మరింత విస్తరించి సీసీ కెమెరాలు, డ్రోన్‌ల వంటివి అందుబాటులోకొచ్చాయి.
వీటి సాయంతో ఎప్పటికప్పుడు కంప్యూటర్ మానిటర్ లలో పర్యవేక్షిస్తూ అవసరమైన చోటకు బలగాలను తరలించటానికి, చర్యలు తీసుకోవటానికి పుష్క లంగా అవకాశాలున్నాయి. ఎక్కడో మారుమూల అడవుల్లో నక్సలైట్లను అణచడానికి వినియోగి స్తున్నామంటున్న సాంకేతికత దేశ రాజధాని నగరంలో కొలువుదీరిన రైల్వే స్టేషన్‌లో ఎందుకు ఆచూకీ లేకపోయిందో పాలకులు చెప్పగలరా?
విషాదం చోటుచేసుకున్నప్పుడల్లా దాన్ని తక్కువ చేసి చూపటానికి, అంతా నియంత్రణలో ఉందని చెప్పటానికి పాలకులు తెగ తాపత్రయపడుతుంటారు. 2015లో రాజమండ్రిలో తన కళ్ల ముందే పుష్కరాల్లో 29మంది భక్తులు ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు ఎంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో ఎవరూ మరిచిపోరు. మొన్నటికి మొన్న తిరుపతి తొక్కిసలాట జరిగినప్పుడూ ఆయనది అదే వైఖరి.
ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఉదంతంలోనూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్‌ల ప్రహసనం సైతం అలాగే వుంది. శ్రావణబెళగొళ, స్వర్ణాలయం వంటి చోట్ల ఇంతకు మించి ఎన్నో రెట్లు అధికంగా భక్తులు తరలివస్తారు. కానీ ఎప్పుడూ ఎలాంటి అపశ్రుతులూ చోటు చేసుకో లేదు. ఇందుకు వారు అనుసరిస్తున్న నియంత్రణ చర్యలేమిటో అధ్యయనం చేయాలన్న స్పృహ కూడా ఎవరికీ ఉన్నట్టు లేదు.
ఈ విషాదం చెప్పే గుణపాఠాన్ని గ్రహించకపోతే, తప్పు తమది కానట్టు ప్రవర్తిస్తే మళ్లీ మళ్లీ ఇలాంటివే చోటు చేసుకుంటాయి. కమిటీలు, విచారణల తంతు సరే... నిర్దిష్టంగా తాము గ్రహించిందేమిటో, ఇకపై తీసుకోబోయే చర్యలేమిటో ప్రకటిస్తే జనం సంతోషిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment