New Delhi Railway Station
-
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
ఢిల్లీ : కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో (New Delhi Railway Station Stampede) తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనపై కేంద్రం, భారతీయ రైల్వే శాఖపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్వే కోచ్‌లో నిర్ధిష్ట ప్రయాణికుల సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. ట్రైన్ టికెట్లు ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నారని మండిపడింది. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ఇవాళ (ఫిబ్రవరి 19) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పైవిధంగా స్పందించింది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం (ఫిబ్రవరి 17,2025) రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పరిమితికి మించి టికెట్లను ఎందుకు అమ్ముతున్నారని అటు కేంద్రాన్ని, ఇటు రైల్వే శాఖను ప్రశ్నించింది.ఈ సందర్భంగా రైల్వే ప్రమాదాల్ని నివారించేందుకు ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్రం,రైల్వే శాఖకు పలు సూచనలు ఇచ్చింది.రైల్వే చట్టం సెక్షన్ 147 ప్రకారం, ఒక కోచ్‌లో ప్రయాణికుల సంఖ్య పరిమితి ఉండాలి. ఈ చట్టం ప్రకారం పరిమితికి మించి ప్రయాణికుల్ని అనుమతిస్తే 1,000 రూపాయల జరిమానా,అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు.ఈ చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్న చట్టాల్ని అమలు చేయండి. టిక్కెట్లు అమ్మే ప్రక్రియను కట్టుదిట్టం చేయండి. భవిష్యత్‌లో రైల్వే ప్రమాదాల్ని నివారించవచ్చు. జస్టిస్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. రద్దీ సమయాల్లో కొంతమేర పరిమితి మించినా, ఆ స్థాయిలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ఈ అంశంపై నిర్లక్ష్యం చేస్తే ఈ తరహా దుర్ఘటనకు దారి తీస్తుంది’ అని అన్నారు. రైల్వే శాఖ తరుఫున ప్రముఖ అడ్వకేట్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మార్చి 26కి వాయిదా వేసింది. -
Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఫిబ్రవరి 15న రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు. ఈ ఘటన అనంతరం రైల్వేశాఖ దీనిపై దర్యాప్తునకు ఒక కమిటీని నియమించింది. అదేవిధంగా దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు మూడు నూతన విధానాలను అనుసరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.ఇవే ఆ మూడు విధానాలు1. హోల్డింగ్ ఏరియాను ఏర్పాటురైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని 60 ప్రధాన రైల్వేస్టేషన్లలో హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏరియాల్లో రైలు ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు వచ్చే వరకూ వేచివుండాల్సివుంటుంది. రైలు వచ్చిన తరువాతనే ప్రయాణికులంతా క్రమపద్ధతిలో వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఈ వ్యవస్థను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఆనంద్ విహార్ స్టేషన్, లక్నో, వారణాసి, మొగల్సరాయ్, కాన్పూర్, ఝాన్సీ, పట్నా, ముంబై, సూరత్, బెంగళూరు, హౌరా తదితర స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు.2. ప్రయాణికులకు అవగాహనరైల్వేస్టేషన్లలో ముందుజాగ్రత్త చర్యలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులెవరూ మెట్లపై కూర్చోకూడదని విజ్ఞపి చేయనున్నారు. పలువురు ప్రయాణికులు మెట్లపై కూర్చోవడం వలన ఆ మెట్లపై ఎక్కేవారికి, దిగేవారికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గుర్తించిన దరిమిలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.3 సూచనలు, సలహాల స్వీకరణవివిధ రైల్వేస్టేషన్లలో రైల్వే అధికారులు ఆరు నెలలపాటు ప్రత్యేక అవగాహనా ప్రచారాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులకు, ప్లాట్‌ఫారాల వద్ద పనిచేసే సిబ్బంది, స్టాల్స్ నిర్వహిస్తున్న దుకాణదారులకు రైల్వే అధికారులు పలు సూచనలు చేయనున్నారు. అలాగే వారి నుంచి రద్దీ నియంత్రణకు అవసరమైన సలహాలను కూడా స్వీకరించనున్నారు. ఇది కూడా చదవండి: ‘అద్దాలు పగులగొడితే.. ఈడ్చుకెళ్లాల్సిందే’ -
జనం ప్రాణాలంటే విలువేది?
వెల్లువలా వచ్చిపడుతున్న ప్రయాణికులు, రివాజు తప్పకుండా ఆలస్యంగా వచ్చిపోయే రైళ్లు, ఉన్న గందరగోళాన్ని ఒకింత పెంచే అనౌన్స్మెంట్లు, ఏమూలకూ సరిపోని మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఏకమై 45 నిమిషాలపాటు ఏకధాటిగా సృష్టించిన తీవ్ర గందరగోళ స్థితి శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసి 18 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మరణాలకు సంతాపం ప్రకటించటం, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేయటం సరే... జరిగిన ఘోర ఉదంతానికి నైతిక బాధ్యత వహించాల్సిందెవరు? ఇలాంటివి పునరావృత్తం కానీయ బోమని చెప్పేదెవరు? మన దేశంలో ఎప్పుడు జనసమ్మర్దం అధికంగా ఉంటుందో, ఏ చర్యలు అవసరమో అధికార యంత్రాంగానికి తెలియక కాదు. అందుకు సంబంధించి ఇప్పటికే బోలెడు చేదు అనుభవాలున్నాయి. కానీ ఎన్ని జరుగుతున్నా గుణపాఠం నేర్వని మనస్తత్వమే ఈ విషాద ఘటనకు దారితీసింది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని 30 మంది ప్రాణాలు బలై పక్షం రోజులు కాలేదు. అదే ప్రయాగ్‌రాజ్‌కు బయల్దేరిన భక్తులకు ఢిల్లీ రైల్వే స్టేషనే ఈసారి మృత్యుఘంటిక మోగించిందంటే నేరం ఎవరిదనుకోవాలి? తొక్కిసలాట జరిగిన అజ్మీరీ గేట్ టెర్మినల్ గురించి ఉత్తరాదిలో పనిచేసే రైల్వే ఉన్నతాధికారులకూ, ప్రత్యేకించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అధికారులకూ తెలియంది కాదు. సాధారణ దినాల్లో సైతం ఆ టెర్మినల్ కిక్కిరిసివుంటుంది. ఢిల్లీ మెట్రో రైల్‌ను నేరుగా అనుసంధానం చేసే ప్రాంతమది. పైపెచ్చు వాహనాల పార్కింగ్‌కు అనువైనది. యూపీ మీదుగా వెళ్లాల్సిన రైళ్లు ఆగే అయిదు ప్లాట్ ఫాంలు అజ్మీరీ గేట్ టెర్మినల్ ప్రాంతంలోనే ఉన్నాయి. దానికితోడు ఇప్పుడు కుంభమేళా సంరంభం కొనసాగుతోంది. తగిన ప్రణాళిక రూపొందించుకుని, అదనపు జాగ్రత్తలు తీసుకోవడా నికి ఈ కారణాలు చాలవా? సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలలోపు బయల్దేరే రైళ్లను అందు కోవటానికి వచ్చే జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణికులకు అక్కడ రోజూ 7,000 టిక్కెట్లు విక్రయి స్తారు. కానీ శనివారం రోజు కేవలం రెండు గంటల వ్యవధిలో అదనంగా మరో 2,600 మందికి టిక్కెట్లు విక్రయించారు. అంటే రిజర్వేషన్లేని ప్రయాణికుల సంఖ్య దాదాపు పదివేలు! ఇంత మంది టికెట్ల తనిఖీ అసాధ్యం. కనుక టికెట్ లేకుండా ప్రయాణించేవారు ఇంతకు మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంటారని ఒక అంచనా. అందుబాటులో ఉన్న బోగీలెన్నో, జారీ చేయాల్సిన టికెట్లెన్నో కనీస అంచనాకు రాకపోవటం... అవసరమైన పోలీసు బలగాలను సమకూర్చుకోవాలన్న స్పృహ లోపించటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 20 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారు సైతం ఈ తొక్కిస లాట సమయంలో ‘బతుకుజీవుడా’ అనుకుంటూ పక్కకుపోయారు. పర్యవసానంగా ‘రక్షించండి...’ అంటూ ఆర్తనాదాలు చేస్తున్నవారి కోసం పోర్టర్లే రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వారే గనుక ఆపద్బాంధవుల్లా రాకపోతే మరింతమంది మృత్యువాత పడేవారు. కుంభమేళా సందర్భంగా డిమాండ్ ఎక్కువుంది గనుక ఉన్న రైళ్లను సమయానికి నడిపుంటే ఇంత జనసమ్మర్దం ఉండేది కాదు. ఎంతో జాప్యం జరిగి ఒకదాని వెనక మరొకటిగా వరసపెట్టి మూడు రైళ్లుండటం వల్ల 14, 15 నంబర్ ప్లాట్‌ఫాంలపై వేలాదిమంది పడిగాపులు పడుతున్నప్పుడే ప్రయాగ్‌రాజ్ వెళ్లే ప్రత్యేక రైలుపై వెలువడిన అనౌన్స్మెంట్ తీవ్ర గందరగోళానికి దారితీసి తొక్కిసలాట జరగిందంటున్నారు. మన దేశం వరకూ చూస్తే తొక్కిసలాటల్లో దాదాపు 80 శాతం మతపరమైన పవిత్ర దినాల్లో, తీర్థయాత్రల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు 2013లో ఒక అధ్యయనం తేల్చిచెప్పింది. భారీగా వచ్చి పడే ప్రజానీకాన్ని నియంత్రించటానికి జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ ఆ ఏడాదే సవివరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడు సాంకేతికత మరింత విస్తరించి సీసీ కెమెరాలు, డ్రోన్ల వంటివి అందుబాటులోకొచ్చాయి. వీటి సాయంతో ఎప్పటికప్పుడు కంప్యూటర్ మానిటర్ లలో పర్యవేక్షిస్తూ అవసరమైన చోటకు బలగాలను తరలించటానికి, చర్యలు తీసుకోవటానికి పుష్క లంగా అవకాశాలున్నాయి. ఎక్కడో మారుమూల అడవుల్లో నక్సలైట్లను అణచడానికి వినియోగి స్తున్నామంటున్న సాంకేతికత దేశ రాజధాని నగరంలో కొలువుదీరిన రైల్వే స్టేషన్లో ఎందుకు ఆచూకీ లేకపోయిందో పాలకులు చెప్పగలరా?విషాదం చోటుచేసుకున్నప్పుడల్లా దాన్ని తక్కువ చేసి చూపటానికి, అంతా నియంత్రణలో ఉందని చెప్పటానికి పాలకులు తెగ తాపత్రయపడుతుంటారు. 2015లో రాజమండ్రిలో తన కళ్ల ముందే పుష్కరాల్లో 29మంది భక్తులు ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు ఎంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో ఎవరూ మరిచిపోరు. మొన్నటికి మొన్న తిరుపతి తొక్కిసలాట జరిగినప్పుడూ ఆయనది అదే వైఖరి. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఉదంతంలోనూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్ల ప్రహసనం సైతం అలాగే వుంది. శ్రావణబెళగొళ, స్వర్ణాలయం వంటి చోట్ల ఇంతకు మించి ఎన్నో రెట్లు అధికంగా భక్తులు తరలివస్తారు. కానీ ఎప్పుడూ ఎలాంటి అపశ్రుతులూ చోటు చేసుకో లేదు. ఇందుకు వారు అనుసరిస్తున్న నియంత్రణ చర్యలేమిటో అధ్యయనం చేయాలన్న స్పృహ కూడా ఎవరికీ ఉన్నట్టు లేదు. ఈ విషాదం చెప్పే గుణపాఠాన్ని గ్రహించకపోతే, తప్పు తమది కానట్టు ప్రవర్తిస్తే మళ్లీ మళ్లీ ఇలాంటివే చోటు చేసుకుంటాయి. కమిటీలు, విచారణల తంతు సరే... నిర్దిష్టంగా తాము గ్రహించిందేమిటో, ఇకపై తీసుకోబోయే చర్యలేమిటో ప్రకటిస్తే జనం సంతోషిస్తారు. -
Delhi Stampede: రెండు రైళ్లు.. ఒకే పేరు
న్యూఢిల్లీ: రెండు రైళ్లకు ఒకేలాంటి పేరు. ఇరుకైన ఓవర్ బ్రిడ్జి. సమాచార లోపం. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటకు ఇవే ప్రధాన కారణాలని తేలింది. మహా కుంభమేళాకు బయల్దేరిన ప్రయాణికుల్లో చాలామంది 14వ నంబర్ ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కోసం భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. ‘ప్రయాగ్‌రాజ్ స్పెషల్’ రైలు 12వ ప్లాట్‌ఫాంపైకి వచ్చినట్లు ప్రకటన రావడంతో తమ రైలే ఫ్లాట్‌ఫాం మారిందని భావించారు. భారీ జనసందోహం నడుమ ఏమాత్రం ఆలస్యమైనా రైలు అందదేమోనని భయపడ్డారు. 12వ ప్లాట్‌ఫాంకు చేరేందుకు ఉన్నపళంగా పరుగులు తీశారు. ఓవర్ బ్రిడ్జిపైకి దారితీసే మెట్ల మార్గంపైకి వేలాదిగా ఎగబడ్డారు. దానికి తోడు ఓవర్ బ్రిడ్జి కూడా సన్నగా ఉంది. వాటిపై ప్రయాణికులు పరస్పరం నెట్టేసుకుంటూ దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోయారు. చాలామంది ఊపిరాడక కన్నుమూశారు. పోలీసులు హెచ్చరిస్తున్నా అరుపులు కేకలతో ఏమీ విన్పించలేదు. ఈ దారుణంలో మృతుల సంఖ్య ఆదివారం 18కి పెరిగింది. వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. 30 మంది గాయపడ్డారు. తొక్కిసలాట తర్వాత మెట్ల మార్గం, ఓవర్ బ్రిడ్జిపై ఎక్కడ చూసినా చెప్పులు, చిరిగిన బ్యాగులే కనిపించాయి. రెండు రైళ్లకు ప్రయాగ్‌రాజ్ పేరుండడం అయోమయానికి దారి తీసిందని పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే శాఖ కూడా విచారణకు ఆదేశించింది. వాస్తవానికి న్యూఢిల్లీ స్టేషన్ నుంచి శనివారం నాలుగు రైళ్లు ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరాల్సి ఉంది. వాటిలో మూడు ఆలస్యమయ్యాయి. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యమయ్యాయి. దాంతో ఆ ఐదు రైళ్లలో వెళ్లాల్సిన వారంతా ప్లాట్‌ఫాంలపైనే ఉండిపోవడంతో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఆదివారమూ అదే రద్దీ దుర్ఘటన జరిగినా న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆదివారం కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా కొనసాగింది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి వేలాది మంది తరలివచ్చారు. రైళ్లు ఎక్కడానికి పడరాని పాట్లు పడ్డారు. అధికారులు సైతం నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.సమాచార లోపానికి తోడు ప్రయాణికులు గందరగోళానికి గురికావడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. విచారణకు కమిటీ తొక్కిసలాటపై దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రిన్సిపల్ స్టేషన్‌లోని వీడియో ఫుటేజీ అందజేయాలని అధికారులను ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు,తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది. వైష్ణవ్ రాజీనామా చేయాలితొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ ఆదివారం డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రమే ఆయన్ను తొలగించాలన్నారు. రైల్వేస్టేషన్‌కు వేలాది మంది జనం తరలివచ్చినా భద్రతా ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ‘‘దేశంలో ఇప్పుడు రెండు హిందూస్తాన్లు ఉన్నాయి. ఒక హిందూస్తాన్లో పాలకులు తమ మిత్రులకు స్వయంగా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయిస్తున్నారు. మరో హిందూస్తాన్లో సామాన్యులు ఇలా రైల్వేస్టేషన్లలో బలైపోతున్నారు. కుంభమేళాలో వీఐపీ సంస్కృతి నడుస్తోంది’’ అని ఆక్షేపించారు.రాష్ట్రపతి, ప్రధాని సంతాపం ఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటనపై పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. -
కుంభమేళాపై లాలూ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:మహాకుంభమేళాపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మహాకుంభమేళాకు అసలేమైనా అర్థం..పర్థం ఉందా..?అది ఓ అర్థం లేని వ్యవహారం’ అని లాలూ అన్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం చెందడం దురదృష్టకరమని వ్యాఖ్యానించే సందర్భంలో లాలూ మహా కుంభమేళాపై ఈ వ్యాఖ్యలు చేశారు.రైల్వేశాఖ విఫలమవడం వల్లే న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగిందన్నారు. రైల్వే మంత్రి దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందేనన్నారు.అయితే మహాకుంభమేళాపై లాలూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు హిందువులపై ఆర్జేడీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని బీహార్ బీజేపీ చీఫ్ మనోజ్శర్మ అన్నారు. బిహార్ ఎన్నికలు వస్తున్న వేళ ఓ వర్గం వారిని బుజ్జగించేందుకే లాలూ మహాకుంభమేళాను టార్గెట్ చేశారని శర్మ మండిపడ్డారు. -
రాజధానిలో ఘోరం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వార్తలొచ్చాయి. శనివారం రాత్రి 9.55 గంటలకు 13, 14వ నంబర్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఘటనాస్థలిలో భక్తుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. భయంతో జనం తమ చిన్నారులను భుజాలపైకి ఎత్తుకుని, బ్యాగులు పట్టుకుని పరుగెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తొక్కిసలాటకు కారణాలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడి కాలేదు. అయితే ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన రెండు రైళ్లు ఆలస్యంగా రావడంతో అప్పటికే వేచిఉన్న భక్తులు త్వరగా ఎక్కేందుకు ప్రయత్నించడం, కిక్కిరిసిన జనం కారణంగా తొక్కిసలాట జరిగినట్టు వార్తలొచ్చాయి. ఊపిరాడక స్పృహ తప్పిన కొందరిని సమీప ఆస్పత్రులకు తరలించారు. దాదాపు 12 మందిని లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే అగి్నమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పారు. ఘటనపై రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా ట్లాడారు. ‘‘14వ నంబర్ ప్లాట్‌ఫామ్ ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అక్కడ వేచి ఉన్నారు. అదే సమయానికి రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిని ఎక్కాల్సిన ప్రయాణికులు 12, 13, 14వ నంబర్ ప్లాట్‌ఫామ్‌లపై వేచి ఉన్నారు. దీంతో ప్లాట్‌ఫామ్‌లపై జనం ఊహించనంతగా పెరిగిపోయి చివరకు 14వ నంబర్ ప్లాట్‌ఫామ్, 16వ నంబర్ ప్లాట్‌ఫామ్ ఎస్కలేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. కమర్షియల్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్టర్(సీఎంఐ) తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్ ప్రతి గంటకు 1,500 టికెట్లు విక్రయించింది. ఊహించనంతగా ప్రయాణికులు వచ్చారు.అందుకే పరిస్థితి అదుపు తప్పింది’’ అని డీసీపీ మల్హోత్రా చెప్పారు. ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉంది. ఘటనాస్థలికి వెంటనే రైల్వే పోలీస్, ఢిల్లీ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే చేరుకున్నాయి. వారాంతం కావడంతో అధికంగా వచ్చిన భక్తుల రాకపోకల కోసం అదనపు రైళ్లను నడుపుతున్నాం’’ అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. -
అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్.. నెటిజన్ల విమర్శల ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్‌ను చూశారు కదా! వీటిని మన రైల్వే మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం పోస్ట్ చేసింది. పునరుద్ధరణ తరువాత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఎన్డీఎల్ఎస్) ఇలా ఉండబోతోందని పేర్కొంది. ఆధునికంగా కనబడుతున్నా.. ఆ టవర్స్‌పై నెటిజన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 అంతస్తుల జంట భవనాల్లో మల్టీ లెవల్ పార్కింగ్, పికప్, డ్రాప్ జోన్స్, 91 బస్‌బేలు, 1,500 ఈసీఎస్ పార్కింగ్లు ఉంటాయని, షాపులు, ఆఫీసులు, ఓ పెద్ద హోటల్ నిర్వహణకు సరిపడా స్థలముంటుందని రైల్వే శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ను 5వేల మంది రీట్వీట్ చేశారు. ► ఓ రైల్వే స్టేషన్‌కు అంత సంక్లిష్టమైన డిజైన్ అవసరమా? ► నిర్మాణానికి ఎక్కువ టైమ్ తీసుకోవడమే కాదు.. ఆ అద్దాల నుంచి వచ్చే ఉష్ణోగ్రత వేసవిలో ఢిల్లీ టెంపరేచర్‌ను మరింత పెంచుతుంది. ► డిజైన్ బాగానే ఉంది కానీ.. చూడ్డానికి 2025 ప్లాన్‌లా ఉంది. దానికోసం భూసేకరణ ఎలా చేస్తారు? బయట ఉన్న పహడ్గంజ్ నివాసితులను ఏం చేస్తారు? ► హైప్డ్ డిజైన్‌తో అనవసరమైన ఖర్చు. సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా కట్టలేమా? ఆధునికత పేరుతో ధరలు పెంచుతారు. ఆ భారం ప్రయాణికులపైనే పడుతుంది. ► మన నిర్మాణాలు మన సంస్కృతిని ప్రతిబింబించాలి. ఇది ఎక్కడినుంచో కాపీ కొట్టినట్టు ఉంది. అంటూ విమర్శల వర్షం కురిపించారు. చదవండి: ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్ చార్జీ రూ.112 -
రైల్వే స్టేషన్లో దారుణం.. మహిళను మెయింటెనెన్స్ రూమ్‌లోకి లాక్కెళ్లి..
దేశంలో కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు రైల్వే ఉద్యోగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన బాధితురాలు(30) రెండేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితుడి ద్వారా నిందితుల్లో ఒక్కడైన సతీష్.. ఆమెకు పరిచయమయ్యాడు. అనంతరం, ఆమెకు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పాడు. ఈ క్రమంలోనే గురువారం సతీష్ ఆమెకు ఫోన్ చేసి తమ కొత్త ఇంటికి, తన కొడుకు పుట్టినరోజు వేడుకకు రావాలని ఆమెను ఆహ్వానించాడు. సరేనని చెప్పిన బాధితురాలు.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కీర్తి నగర్ మెట్రో స్టేషన్లో సతీష్‌ను కలుసుకుంది. ఆమెను.. సతీష్ అనంతరం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి.. బాధితురాలని రైల్వే స్టేషన్‌లోని 8-9 ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ మెయిన్టేనెన్స్ రూమ్‌లో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. Woman gang-raped by railway employees at New Delhi station; 4 arrested https://t.co/TREgTlDj5f — The Nations 🌐 (@nation_365) July 23, 2022 కాగా, బాధితురాలు.. తెల్లవారుజామున 3.27 గంటలకు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. పోలీసులు వెంటనే స్టేషన్‌కు చేరుకుని ఆమెను రక్షించినట్టు రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. నిందితులు సతీష్ కుమార్, వినోద్ కుమార్, మంగళ్ చంద్, జగదీష్ చంద్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విద్యార్థినితో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన -
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం
-
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఫ్లాట్‌ఫాం 8లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కాగా స్టేషన్లో నిలిచి ఉన్న ఛండీఘడ్-కొచువెల్లి ఎక్స్‌ప్రెస్ బోగీల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ నుంచి ప్రయాణికులను అక్కడ నుంచి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
ఢిల్లీ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
-
ఢిల్లీ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపు రావడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. ఆదివారం ఉదయం ఢిల్లీ రైల్వే స్టేషన్లో రైళ్లను ఆపివేసి బాంబ్ స్క్వాడ్ జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును బాంబుతో పేల్చివేస్తామని ముంబై ఏటీఎస్ అధికారులకు ఈమెయిల్ వచ్చింది. వారు వెంటనే రైల్వే బోర్డును అప్రమత్తం చేశారు. దీంతో ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన, సమీపంలో వస్తున్న రైళ్లను ఎక్కడిక్కడ ఆపివేశారు. ఘజియాబాద్ వద్ద లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఆపివేసి తనిఖీలు చేశారు. శనివారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ ఉగ్రవాదులు దాడి చేసిన మరుసటి రోజు బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భద్రత సిబ్బంది క్షుణ్నంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు. అనంతరం రైళ్లు బయల్దేరాయి. -
భువనేశ్వర్ - రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
-
భువనేశ్వర్ - రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న భువనేశ్వర్ - రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్‌లో చెలరేగిన ఈ మంటలు ఇతర బోగీలకు వ్యాపించాయి. సుమారు ఆరు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అలాగే పక్కనే నిలిచి ఉన్న మరో రైలుకు కూడా మంటలు వ్యాపించాయి. రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. స్టేషన్ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఏసీ కోచ్‌లో ప్రయాణీకులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు 16 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో వైఫై సేవలు మొదలు
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించేవారికి సోమవారం నుంచి వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిద్వారా వీరు ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు స్టేషన్ ప్రాంగణంలో ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడమే మా లక్ష్యం. సైన్సు, సాంకేతిక సేవలను ముఖ్యంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులోభాగంగానే ఈ రైల్వేస్టేషన్లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరైంది. ఈ స్టేషన్‌లోని 16 ప్లాట్‌ఫాంలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి 30 నిమిషాలపాటు ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఆ తర్వాత కూడా కావాలంటే ప్రయాణికులు స్క్రాచ్ కార్డులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ. 25 వెచ్చించి కార్డును కొనుగోలు చేస్తే అరగంటపాటు, రూ. 35 కార్డును కొనుగోలు చేస్తే గంటపాటు ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ కార్డు 24 గంటలపాటు మాత్రమే చెల్లుతుంది. ఇవి ఈ స్టేషన్‌కు చెందిన పహర్‌గంజ్, అజ్మీరీ గేట్ల వద్ద అందుబాటులో ఉంటాయి’అని పేర్కొన్నారు. త్వరలో అన్ని ప్రధాన స్టేషన్లలోనూ... వైఫై సేవలను త్వరలో అన్ని ప్రధాన స్టేషన్లలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ‘హై ఫై కాదు వైఫై తప్పనిసరిగా సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండాలనేది ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల. ఈ సేవలు ఏ కొందరికో పరిమితం కారాదు. స్టేషన్లతోపాటు త్వరలో రైళ్లలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. ఇది ఆరంభం మాత్రమే. ఏ ఒక్క స్టేషన్‌కో దీనిని మేము పరిమితం చేయదలుచుకోలేదు. రైల్ టెల్ సంస్థ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 50 లక్షలు. ఈ వెసులుబాటును కొనసాగించేందుకు ప్రతి ఏడాది రూ. 16 లక్షల మేర నిధులను వెచ్చిస్తాం. ఈ నెలాఖరులోగా ఆగ్రా, అహ్మదాబాద్, వారణాసి రైల్వేస్టేషన్లలోనూ ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తాం’అని ఆయన పేర్కొన్నారు. -
నేటి నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో వై-ఫై సేవలు
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు వై-ఫై సదుపాయం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ సేవను ప్రారంభిస్తారు. రైల్ టెల్ అనే ైరె ల్వే ప్రభుత్వ రంగ సంస్థ ఈ సేవను అందుబాటులోకి తేనుంది. ప్రయాణికులకు వై- ఫై సేవను అందించడం కోసం స్టేషన్‌లోని అన్నిప్లాట్ఫారాలపై ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ైరె ల్వే అధికారి బుధవారం తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే ఏ్టషన్లో వై-ఫై సదుపాయానికి ప్రయాణికుల నుంచి ప్రతిస్పందనను బట్టి నగరంలోని మిగతా ప్రధాన స్టేషన్లలో వై-ఫై సేవలను అందించడంపై నిర్ణయం తీసుకుంటారు. బెంగళూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఇప్పటికే ఈ సదుపాయం లభిస్తోంది. బెంగళూరు రైల్వే స్టేషన్లో అక్టోబర్‌లో ఈ సేవలను ప్రవేశపెట్టారు. దేశంలోని అన్ని ఏ, ఏ1 కేటగిరీ రైల్వే స్టేషన్లతో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ఎంపిక చేసిన 400 రైళ్లలో ప్రయాణికులకు వై-ఫై సేవలు అందిస్తామని అప్పటి రెల్వే మంత్రి సదానందగౌడ రైలు బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ సేవలను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. -
సివిక్ సెంటర్లో లేజర్ షో
న్యూఢిల్లీ: నగరం నడిబొడ్డున ఉన్న పురపాలక సంస్థల పరిపాలనా కేంద్రం సివిక్ సెంటర్లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున మువ్వన్నెల రంగులతో లేజర్ షో ఏర్పాటు చేయనున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) తన ప్రధాన కార్యాలయంలో లేజర్ షోకు ఏర్పాట్లు చేసింది. ఇంకా ఆ రోజున వీధి ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మొదటిసారిగా తాము లేజర్ షోను ఏర్పాటు చేస్తున్నామని ఎన్డీఎంసీ పౌర సంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ చెప్పారు. ఆ రోజు సాయంత్రం తమ ప్రధాన కార్యాలయం రంగుల హరివిల్లుగా మారిపోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సూత్రప్రాయంగా అనుమతి లభించిందని చెప్పారు. చీకటి పడిన వెంటనే దాదాపు నాలుగు గంటల పాటు ఈ షో కొనసాగుతుందన్నారు. కరోల్‌బాగ్‌లోని అజ్మల్ ఖాన్ పార్కులో 12, 13 తేదీల్లో మేళా నిర్వహిస్తామని, ఇటీవల జాతీయ ప్రాదేశిక ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన వీధి ప్రదర్శన ‘రహగిరి’ని సాయంత్రం 4.00 నుంచి 7.00 గంటల మధ్య ప్రదర్శిస్తామని మాన్ చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలో కొన్ని గంటల పాటు వాహనాలు కనిపించకపోవడం ప్రజలకు ఆసక్తిగా మారగలదని ఆయన పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) కూడా 68వ స్వాతంత్య్ర దినోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎస్డీఎంసీ ఇంటింటి పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలు పౌర స్పృహను ప్రదర్శించాలని కోరే లక్ష కరపత్రాలను ముద్రించామని వాటిని స్కూలు పిల్లలు పంచి పెడతారని ఎస్డీఎంసీ పీఆర్ఓ ముఖేశ్ యాదవ్ చెప్పారు.