
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఫిబ్రవరి 15న రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు. ఈ ఘటన అనంతరం రైల్వేశాఖ దీనిపై దర్యాప్తునకు ఒక కమిటీని నియమించింది. అదేవిధంగా దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు మూడు నూతన విధానాలను అనుసరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
ఇవే ఆ మూడు విధానాలు
1. హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు
రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని 60 ప్రధాన రైల్వేస్టేషన్లలో హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏరియాల్లో రైలు ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు వచ్చే వరకూ వేచివుండాల్సివుంటుంది. రైలు వచ్చిన తరువాతనే ప్రయాణికులంతా క్రమపద్ధతిలో వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఈ వ్యవస్థను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఆనంద్ విహార్ స్టేషన్, లక్నో, వారణాసి, మొగల్‌సరాయ్, కాన్పూర్, ఝాన్సీ, పట్నా, ముంబై, సూరత్, బెంగళూరు, హౌరా తదితర స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు.
2. ప్రయాణికులకు అవగాహన
రైల్వేస్టేషన్లలో ముందుజాగ్రత్త చర్యలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులెవరూ మెట్లపై కూర్చోకూడదని విజ్ఞపి చేయనున్నారు. పలువురు ప్రయాణికులు మెట్లపై కూర్చోవడం వలన ఆ మెట్లపై ఎక్కేవారికి, దిగేవారికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గుర్తించిన దరిమిలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
3 సూచనలు, సలహాల స్వీకరణ
వివిధ రైల్వేస్టేషన్లలో రైల్వే అధికారులు ఆరు నెలలపాటు ప్రత్యేక అవగాహనా ప్రచారాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా ప్రయాణికులకు, ప్లాట్‌ఫారాల వద్ద పనిచేసే సిబ్బంది, స్టాల్స్ నిర్వహిస్తున్న దుకాణదారులకు రైల్వే అధికారులు పలు సూచనలు చేయనున్నారు. అలాగే వారి నుంచి రద్దీ నియంత్రణకు అవసరమైన సలహాలను కూడా స్వీకరించనున్నారు.
ఇది కూడా చదవండి: ‘అద్దాలు పగులగొడితే.. ఈడ్చుకెళ్లాల్సిందే’
Comments
Please login to add a commentAdd a comment