న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు మొదలు | Wi-fi service launched at New Delhi railway station | Sakshi
Sakshi News home page

న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు మొదలు

Published Mon, Dec 8 2014 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

Wi-fi service launched at New Delhi railway station

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించేవారికి సోమవారం నుంచి వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిద్వారా వీరు ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు స్టేషన్ ప్రాంగణంలో ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడమే మా లక్ష్యం. సైన్సు, సాంకేతిక సేవలను ముఖ్యంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.
 
 ఇందులోభాగంగానే ఈ రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరైంది. ఈ స్టేషన్‌లోని 16 ప్లాట్‌ఫాంలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి 30 నిమిషాలపాటు ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఆ తర్వాత కూడా కావాలంటే ప్రయాణికులు స్క్రాచ్ కార్డులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ. 25 వెచ్చించి కార్డును కొనుగోలు చేస్తే అరగంటపాటు, రూ. 35 కార్డును కొనుగోలు చేస్తే గంటపాటు ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ కార్డు 24 గంటలపాటు మాత్రమే చెల్లుతుంది. ఇవి ఈ స్టేషన్‌కు చెందిన పహర్‌గంజ్, అజ్మీరీ గేట్ల వద్ద అందుబాటులో ఉంటాయి’అని  పేర్కొన్నారు.
 
 త్వరలో అన్ని ప్రధాన స్టేషన్లలోనూ...
 వైఫై సేవలను త్వరలో అన్ని ప్రధాన స్టేషన్లలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ‘హై ఫై కాదు వైఫై తప్పనిసరిగా సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండాలనేది ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల. ఈ సేవలు ఏ కొందరికో పరిమితం కారాదు. స్టేషన్లతోపాటు త్వరలో రైళ్లలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. ఇది ఆరంభం మాత్రమే. ఏ ఒక్క స్టేషన్‌కో దీనిని మేము పరిమితం చేయదలుచుకోలేదు. రైల్ టెల్ సంస్థ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 50 లక్షలు. ఈ వెసులుబాటును కొనసాగించేందుకు ప్రతి ఏడాది రూ. 16 లక్షల మేర నిధులను వెచ్చిస్తాం. ఈ నెలాఖరులోగా ఆగ్రా,  అహ్మదాబాద్, వారణాసి రైల్వేస్టేషన్లలోనూ ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తాం’అని ఆయన పేర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement