Minister Suresh Prabhu
-
అద్భుతంగా చర్లపల్లి రైల్వే టర్మినల్
సాక్షి, సిటీబ్యూరో: చర్లపల్లిలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రైల్వే టర్మినల్ ప్రత్యేకతలివి. ఈ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవల నగరంలో పర్యటించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు గ్రీన్‌ఫీల్డ్ రైల్వే టర్మినళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి.. చర్లపల్లి, వట్టినాగులపల్లిలో ఈ తరహా టర్మినళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లిలో నాలుగో టర్మినల్ నిర్మించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రూ.360 కోట్ల అంచనా వ్యయంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించనున్న ఈ టర్మినల్ కోసం రైల్వే శాఖ ఇప్పటికే రూ.30 కోట్లు కేటాయించింది. తాజాగా రైల్వే మంత్రి ప్రకటన నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఈ పర్యావరణహిత టర్మినల్‌ను అంతర్జాతీయ హంగులతో నిర్మించేం దుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ► స్టేషన్ చుట్టూ గ్రీన్‌ఫీల్డ్ (పచ్చని పరిసరాలు) అభివృద్ధి చేస్తారు. కాలుష్యానికి తావులేకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తారు. బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. ► స్టేషన్ అంతటా సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తారు. సోలార్ విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం. ► భూగర్భ జలాల పెంపు, వాననీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు నిర్మిస్తారు. వాటర్ రీసైక్లింగ్ యూనిట్లూ ఏర్పాటు చేస్తారు. ► కాగిత రహిత స్టేషన్‌గా అభివృద్ధి చేస్తారు. టికెట్ వివరాలు ప్రయాణికులకు ఎస్సెమ్మెస్ రూపంలో పంపిస్తారు. ► రైళ్ల రాకపోకల వివరాలు, ఇతర ప్రకటనలు ప్రయాణికులు తెలుసుకునేందుకు ప్రతీ ప్లాట్ఫామ్లో డిస్ప్లే బోర్డులు ఉంటాయి. ► ఎంటర్టైన్మెంట్, షాపింగ్, విశ్రాంతి గదులు తదితర సదుపాయాలు ఉంటాయి. -
రైల్వే అధికారుల ఉరుకులు పరుగులు
ప్రధానితో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పర్యటన అభివృద్ధి పనులు సిద్ధం చేయాలని ఢిల్లీ నుంచి హుకుం పాత హామీల్లో అమలుకాని వాటిని ప్రారంభించాలని అధికారుల నిర్ణయం హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావటం అంటే ఇదే... ఉన్నట్టుండి రోజున్నర పాటు రైల్వేశాఖ మంత్రి హైదరాబాద్‌లో ఉండాల్సి రావటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులకు చిక్కులొచ్చి పడ్డాయి. అనుకోకుండా రైల్వేమంత్రి ఓ రాత్రి హైదరాబాద్‌లో ఉండాల్సి రావటంతో ఆయన కోసం కొత్తగా ‘అభివృద్ధి కార్యక్రమా’న్ని వెతుక్కోవాల్సిన అగత్యం అధికారులకు ఏర్పడింది. దీంతో ఇప్పటికిప్పుడు ఏం పనిని సిద్ధంచేయాలో తెలియక అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈనెల 8న దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ సంఘ్ స్వర్ణోత్సవాల్లో రైల్వే మంత్రి పాల్గొనాలి. కానీ కేసీఆర్ విజ్ఞాపన మేరకు ఈ నెల 7న ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఆయన ప్రారంభోత్స వాల్లో సికింద్రాబాద్-సిద్దిపేట-కరీంనగర్ రైల్వేలైను శంకుస్థాపన కూడా ఉంది. దీంతో ప్రధాని వెంట రైల్వే మంత్రి కూడా ఆ రోజు రావాల్సి వచ్చిం ది. దీంతో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ నుంచి అధికారులకు సమాచారం అందింది. దీంతో పాత హామీల్లో అమలుకాని వాటిని దుమ్ముదులిపి ప్రారంభించాలని నిర్ణయించారు. -
యూపీలో ఘోరం
- స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న రైలు - 8 మంది చిన్నారుల మృతి - వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భదోహి : ఉత్తరప్రదేశ్‌లో సోమవారం ఓ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టడంతో 8 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 14 మంది పిల్లలు గాయపడ్డారు. కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద సోమవారం డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యాన్‌ను నడపడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘోసియా టౌన్‌షిప్‌లోని టెండర్హార్ట్ పాఠశాలకు చెందిన మినీ బస్సు సమీప ఆరు పల్లెల్లో 6-14 ఏళ్ల వయసు చిన్నారులను రోజూ పాఠశాలకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం చిన్నారులతో బయల్దేరింది. కటక్-మధోసింగ్ స్టేషన్ల నడుమ ఉన్న రైల్వే గేట్ నంబర్ 26 వద్దకు మినీ బస్సు చేరుకుంది. అక్కడ వారణాసి-అలహాబాద్ ప్యాసింజర్ రైలు వేగంగా దూసుకొస్తోంది. ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్న వ్యాను డ్రైవర్.. రైలు వస్తున్న విషయాన్ని పట్టించుకోలేదు. గేట్‌మిత్ర ఎర్రజెండా చూపి హెచ్చరించినా ఫలితం లేకపోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గేట్‌ను క్రాస్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాడు. చూస్తుండగానే రైలు వ్యాన్‌ను ఢీకొంది. వ్యాను సమీపంలోని పొలంలో ఎగిరిపడింది. గాయపడ్డ చిన్నారులు, డ్రైవర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. రఘటనపై రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.20 వేల చొప్పున ప్రకటించారు. బిహార్‌లో 10 మంది మృతి ముజాఫర్పూర్: బిహార్‌లోని ముజాఫర్ఫూర్ జిల్లా జాఫా గ్రామం వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ఆటో ఢీకొని 10 మంది దుర్మరణం చెందారు. -
‘వాతావరణం’ అనుకూలించ లేదట!
అందుకే రైల్వే మంత్రి రాలేదట.. రైల్వే జోన్ ప్రకటనపై సరికొత్త ఎత్తుగడ మరోసారి విశాఖ వాసులకు దగా విశాఖపట్నం: చిన్నపాటి వర్షం వస్తే చాలు.. చిన్నపిల్లలు దానిని ఆసరాగా తీసుకుని బడికె ళ్లడం మానేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి రైల్వే జోన్‌పై ప్రకటన నుంచి తప్పించుకోవడానికి ఆ వర్షాన్నే ఆసరాగా చేసుకున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే జోన్‌పై ప్రకటన చేస్తారంటూ నానా హంగామా చేశారు. ఆయన విశాఖ రావడమే తరువాయి అన్నంతగా ప్రచారం సాగించారు. దీంతో తమ చిరకాల కల నిజంగా సాకారమవుతుందని విశాఖ వాసులు తెగ సంబరపడ్డారు. ఇంతలో 24 గంటలైనా గడవక ముందే వారి పర్యటన రద్దయిపోయింది. అందుకు వర్షాలు, వాతావరణం అడ్డుపడ్డాయన్నమాట! పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్రలో తేలికపాటి వానలే కురుస్తున్నాయి. ఆవర్తనమంటే అల్పపీడనం కన్నా బలహీనంగా ప్రభావం చూపుతుంది. ఈదురుగాలులు, పెనుగాలులకూ ఆస్కారమివ్వదు. ప్రశాంత వాతావరణంతో వానలు కురుస్తాయి తప్ప ఎలాంటి అనర్థాలకు తావివ్వదు. భారీ వర్షాలూ కురవవు. విమాన సర్వీసులూ రద్దు కావు.. కాలేదు. కానీ బంగాళాఖాతంలో ఆవర్తనంతో తలెత్తిన వాతావరణ పరిస్థితుల వల్ల ఈనెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు, రైల్వే మంత్రి సురేష్ ప్రభుల విశాఖ పర్యటన రద్దయినట్టు అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వాస్తవానికి విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదన్న విషయం ఇప్పటికే పలుమార్లు రుజువయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనీ తేటతెల్లమయింది. ఇంతలో సాక్షాత్తూ రైల్వే మంత్రి సురేష్ ప్రభు కొత్తగా మన రాష్ట్రం నుంచే రాజ్యసభకు ఎన్నికవడంతో రైల్వే జోన్‌కు మోక్షం కలుగుతుందని అంతా ఆశపడ్డారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, టీడీపీ నేతలు సురేష్ ప్రభు విశాఖ వస్తున్నారని, జోన్‌పై ఆయన ఇక్కడే అనుకూల ప్రకటన చేస్తారని ఊదరగొట్టారు. పత్రికలు, టీవీ చానళ్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఈసారి నెపాన్ని వర్షం, వాతావరణంలపైకి నెట్టేసి రైల్వే మంత్రి తన పర్యటనను రద్దు చేసుకుని తప్పించుకున్నారు. రైల్వే జోన్ ఆశలపై నీళ్లు చల్లారు. విశాఖ వాసుల్ని మరోసారి దగా చేశారు. మోకాలికీ, బోడి గుండుకూ ముడిపెట్టారన్న సామెతను నిజం చేస్తున్నారంటూ జనం నిట్టూరుస్తున్నారు. -
‘రాజధాని’ మిస్సైతే..‘మహారాజా’ స్వాగతం
న్యూఢిల్లీ: రాజధాని రైళ్లలో టికెట్ తీసుకున్నా.. చివరి నిమిషం వరకు బెర్తు ఖరారు కాని ప్రయాణికులకు శుభవార్త. రాజధాని రైలు ప్రయాణం మిస్సైందనే చింత అక్కర్లేదు. ఇలాంటి ప్రయాణికులకు మహారాజా (ఎయిర్ ఇండియా మస్కట్) స్వాగతం పలకనున్నాడు. రాజధాని టికెట్ ఖరారు కాని ప్రయాణికులు కొంతమొత్తం అదనంగా చెలిస్తే వీరిని ఎయిర్ ఇండియా విమానంలో గమ్యస్థానానికి చేర్చేలా.. ఐఆర్సీటీసీ, ఎయిర్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. వారం రోజుల్లోనే ఈ సదుపాయం మొదలుకానుందని సమాచారం. అయితే రాజధాని ఏసీ ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని.. సెకండ్, థర్డ్ ఏసీ ప్రయాణికులు రూ.2వేల వరకు చెల్లిస్తే సరిపోతుందని ఎయిర్ ఇండియా చీఫ్ అశ్వని లొహానీ తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాలకు విమాన సేవలు మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, వెయిటింగ్ లిస్టులో, ఆర్ఏసీలో ఉన్న ప్రయాణికులు 139కు డయల్ చేసి తమ టికెట్‌ను రద్దుచేసుకోవచ్చని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఢిల్లీలో తెలిపారు. అయితే రైలు బయలుదేరేందుకు 4 గంటల ముందు వరకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుందన్నారు. -
రైల్వేకు కొత్త శోభ తీసుకొస్తాం
లోక్‌సభ చర్చలో మంత్రి సురేశ్ ప్రభు న్యూఢిల్లీ: రైల్వేలోని వివిధ విభాగాలకు కేటాయింపులు తగ్గడంతో నిర్వహణ, భద్రతపై ప్రభావం పడుతుందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మంగళవారం విమర్శించారు. రైల్వే నిధుల కేటాయింపు (2016-17)పై లోక్‌సభలో చర్చను ప్రారంభిస్తూ.. రూ. లక్ష కోట్ల జాతీయ రైలు భద్రత నిధి కోసం ఎంత కేటాయించారని ప్రశ్నించారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న రైల్వేల్ని పునర్ నిర్మించడంతో పాటు పునరుత్తేజం తీసుకొస్తామంటూ కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు సమాధానమిచ్చారు. కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నామని, జపాన్ నుంచి రూ.లక్ష కోట్ల రుణం తీసుకుంటున్నామని తెలిపారు. రైల్వే బడ్జెట్ బాగున్నా.. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని టీడీపీ ఎంపీ తోట నరసింహం అన్నారు. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కోరారు. హైదరాబాద్, అమరావతి మధ్య హైస్పీడ్ రైలు నడపాలని కోరారు. రైల్వే బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వి.వరప్రసాద్‌రావు అన్నారు. పార్లమెంటు సమాచారం.. వ్యవసాయ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని రూ. 553.14 కోట్లకు పెంచామని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్‌భాయ్ కుందారియా లోక్‌సభకు తెలిపారు. వ్యవసాయ సంబంధ కారణాలతో 116 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో 57, పంజాబ్‌లో 56 మంది, తెలంగాణలో ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు మరో 6 రాష్ట్రాల్లో కరువు పరిస్థితులున్నాయని, ఆ రాష్ట్రాల్లో ఉపాధి హామీ కింద మరో 50 రోజులు అదనంగా పని కల్పిస్తామని తెలిపారు. వందకోట్లకుపైగా రుణాలు చెల్లించాల్సిన 701 మంది ప్రభుత్వ బ్యాంకులకు రూ. 1.63 లక్షల కోట్ల మొండి బకాయిలున్నారని కేంద్రం రాజ్యసభకు వెల్లడించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కొత్త జీతభత్యాల అమలుతో ప్రభుత్వంపై రూ.1.02 లక్షల కోట్ల భారం పడుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 2,400 గెజిటెడ్ అధికారులు అవినీతికి పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా నివేదిక అందజేశారు. -
గంటకు 160 కిలోమీటర్లు
దేశంలో అత్యంత వేగమైన రైలు గతిమాన్ షురూ ♦ గంటన్నరలో ఢిల్లీ నుంచి ఆగ్రాకు న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగమైన రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు మంగళవారం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. శుక్రవారం మినహాయించి వారానికి ఆరు రోజులు హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్ వరకు ఈ రైలు నడుస్తుంది. నిజాముద్దీన్ స్టేషన్లో ఉదయం 8.10కి బయలుదేరి ఆగ్రాకు 9.50కి చేరుతుంది. తిరిగి ఆగ్రాలో సాయంత్రం 5.50కి ప్రారంభమై నిజాముద్దీన్ స్టేషన్‌కు రాత్రి 7.30కి చేరుకుంటుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ ట్రైన్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్‌కార్ బోగీలు, 8 ఏసీ చైర్ కార్ బోగీలు ఉన్నాయి. ప్రతీసీట్‌లో పుష్బ్యాక్ సీటింగ్ సౌకర్యం ఉంది. అలాగే సీటు వె నుక ఎల్సీడీ టీవీ అమర్చారు. బయో టాయిలెట్స్, ఫ్రీ మల్టీమీడియా సర్వీసెస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్‌కార్ టికెట్ ధర రూ. 1,500, ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 750గా నిర్ణయించారు. కాగా ఇదే తరహా ట్రైన్లను కాన్పూర్-ఢిల్లీ, చండీగఢ్-ఢిల్లీ, హైదరాబాద్- చెన్నై, నాగ్‌పూర్ -సికింద్రాబాద్ తదితర 9 రూట్లలో ప్రారంభించేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
ప్రాజెక్టులు సరే..పైసలేవి ప్రభు!
►మౌలిక వసతులతోపాటు రైళ్ల వేగం రెట్టింపు చేస్తామన్న మంత్రి ►ఉద్యోగుల జీతాలు పెంచితే రైల్వేపై రూ.30 వేల కోట్ల భారం ►ప్రయాణ, సరుకు రవాణా చార్జీలు యథాతథం ►మరి నిధులు ఎక్కడ్నుంచి తెస్తారంటున్న నిపుణులు ►కష్టకాలం అంటూనే.. కొత్త రైళ్లు, ప్రాజెక్టుల ప్రకటన న్యూఢిల్లీ ‘‘భారత రైల్వే వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. ప్రస్తుతం అత్యంత కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది..’’ బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించిన నిష్టుర సత్యమిది! మరి బడ్జెట్ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించిందా? మంత్రి ప్రతిపాదనలు రైల్వేను పట్టాలెక్కించే విధంగానే ఉన్నాయా? కొందరు నిపుణులు మాత్రం బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని పేర్కొంటున్నారు. ఓవైపు డబ్బులు లేవంటూనే.. మరోవైపు కొత్త రైళ్లు, కొత్త ప్రాజెక్టులు ప్రకటించడాన్ని చూస్తుంటే మంత్రి నేల విడిచి సాము చేసినట్టుగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. రైల్వేకు కొత్త ఊపిరులూదుతామని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్న మంత్రి.. బడ్జెట్లో అందుకు కావాల్సిన ఆదాయ మార్గాలను స్పష్టంగా చూపలేదు. భారత రైల్వేల ద్వారా ఏటా 700 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. 100 కోట్ల టన్నుల సరుకును రవాణా చేస్తోంది. వీటిద్వారా గణనీయమైన ఆదాయం సాధిస్తామని కిందటేడాది బడ్జెట్లో ప్రకటించారు. కానీ ఆ మేరకు ఆదాయం ఆర్జించలేదు. ఈసారి బడ్జెట్లో ప్రయాణికుల చార్జీల ద్వారా అదనంగా 12.4 శాతం ఆదాయాన్ని పొందుతామని, కిందటేడాది కన్నా అదనంగా మరో 5 కోట్ల టన్నుల సరుకును రవాణా చేస్తామని మంత్రి చెప్పారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి ఈ పరిమిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కానీ రద్దీ మార్గాల్లో సాధారణ ప్రయాణికుల కోసం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ వంటి కొత్త రైళ్లను ప్రకటించడంలో సంయమనం పాటించలేదని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీన్ దయాల్ కోచ్‌లు, ఉదయ్ పేరుతో డబుల్ డెక్కర్ సర్వీసులను ప్రకటించడం కేవలం ప్రయాణికులను సంతృప్తిపరిచేందుకే అని అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రస్తుతం గంటకు 30 కి.మీ. ఉన్న రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేస్తామని, అందుకు 2,800 కి.మీ. మార్గాన్ని నిర్మిస్తామని చెప్పారు. వీటితోపాటు రైళ్లు, రైల్వే స్టేషన్లలో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వీటన్నింటికీ భారీగా నిధులు కావాలి. అదీగాకుండా ఏడో వేతన సవరణ కమిషన్ సిఫారసుల ప్రకారం 13 లక్షల రైల్వే ఉద్యోగులకు జీతాలు పెంచితే రూ.30 వేల కోట్ల భారం పడుతుంది. రైల్వే వ్యవస్థ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పిన మంత్రి.. వీటన్నింటికీ ఎక్కడ్నుంచి నిధులు తెస్తారన్న అంశాన్ని మంత్రి స్పష్టంగా చెప్పలేదు. అటు ప్రయాణికుల చార్జీలు, సరు రవాణా చార్జీలను ఏమాత్రం ముట్టుకోకుండా ఇంత పెద్దఎత్తున నిధులు ఎక్కడ్నుంచి తెస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
రైల్వే వేడుకలో రగడ
సాక్షి, చెన్నై: దక్షిణ రైల్వే నేతృత్వంలో తాంబరం రైల్వే కాలనీ మైదానం వేదికగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేశారు. తాంబరం నుంచి చెంగల్పట్టు వైపుగా మూడో రైల్వే మార్గం పనులు, కళ్లకురిచ్చి- చిన్న సేలం మధ్య రైల్వే మార్గం విస్తరణ పనులు అందులో ఉన్నాయి. అలాగే, తిరుచ్చి రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మించిన ఎస్కలేటర్ ప్రారంభోత్సవం, చెన్నై సెంట్రల్, తిరువనంత పురం స్టేషన్లలో ప్రయాణికుల కోసం దుప్పట్లు, దిండుల విక్రయాలకు, సెంట్రల్ నుంచి షాలిమార్‌కు వారంతపు రైలుకు జెండా ఊపడం తదితర అంశాలు ఈ వేడుకలో ఉన్నాయి. ఇందులో ముఖ్య అతిథిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పాల్గొని తాంబరం- చెంగల్పట్టు మూడో ట్రాక్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఇతర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వారంతపు రైలు సేవలకు జెండా ఊపారు. ఇంత వరకు బాగానే ఉన్నా, డీఎంకే రాజ్య సభ సభ్యుడు తిరుచ్చి శివను ప్రసంగానికి ఆహ్వానించడం వివాదానికి దారి తీసినట్టు అయింది. వాదులాట: తిరుచ్చి శివ తన ప్రసంగంలో రైల్వే అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తిరుచ్చి రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్ ఏర్పాటుకు తన నియోజకవర్గ నిధి నుంచి రూ. 95 లక్షలు ఇచ్చినట్టు ప్రకటించారు. అయితే, రైల్వే అధికారుల ప్రకటనలో ఎక్కడా తాను కేటాయించినట్టుగా పేర్కొనక పోవడం విచారకరంగా వ్యాఖ్యానించా రు. తిరుచ్చిలో జరగాల్సిన వేడుకను తాంబరానకి మార్చారని, ఈ వేడుకను బహిష్కరించాలని తొలుత తాను భావించినట్టు పేర్కొన్నారు. అయితే, మంత్రి సురేష్ ప్రభు పిలుపుతో ఇక్కడికి వచ్చానని, అధికార వేడుకల్ని సైతం రాజకీయం చేయడం తగదంటూ పరోక్షంగా అన్నాడీఎంకే సర్కారును ఉద్దేశించి స్పందించారు. ఇంతలో వేదిక మీదున్న రాష్ట్ర మంత్రి చిన్నయ్య మైక్ అందుకుని వ్యంగ్యాస్త్రంతో కూడిన ఓ సామెతను గుర్తు చేస్తూ తీవ్రంగానే స్పందించి తన సీట్లో కూర్చున్నారు. మంత్రికి ఇరు వైపులా చిన్నయ్య, శివ కూర్చోవడమే కాదు, ఇద్దరూ వాగ్యుద్ధానికి దిగారు. ఇద్దరు ఏవో తిట్టుకుంటున్నట్టుగా స్పందించడంతో తన ప్రసంగానికి పిలుపు వచ్చినట్టుగా చటుక్కున అక్కడి నుంచి లేచిన మైక్ అందుకున్నారు. అప్పటికి కూడా వేదికపై తమ సీట్లలో ఉన్నట్టుగా తిరుచ్చి శివ, చిన్నయ్య వాదులాడుకుంటూ ఉండడంతో పక్కనే ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ జోక్యం చేసుకుని ఇద్దరిని బుజ్జగించాల్సి వచ్చింది. అంత వరకు ఈ ఇద్దరి వాదులాట వేదిక ముందున్న వాళ్లనే కాదు కేంద్ర మంత్రిని సైతం విస్మయానికి గురి చేసినట్టు అయింది. నిధుల పెంపు: రైల్వే మంత్రి సురేష్ ప్రభు తన ప్రసంగంలో తమిళనాడుకు రైల్వే పథకాల్లో పెద్ద పీట వేస్తున్నామన్నారు. తమ హయంలోనే భాగస్వామ్యం పెరిగిందన్నారు. 1.5 శాతం మేరకు నిధుల్ని పెంచామని, కొత్త పథకాలను, రైళ్లను అందిస్తూ వస్తున్నామని వివరించారు. తమిళనాడు ప్రభుత్వం, కేంద్రం సమష్టిగా పథకాల్ని అమలు చేస్తున్నాయని, మున్ముందు మరిన్ని పథకాలు తమిళనాడుకు దరి చేరుతాయని వ్యాఖ్యానించారు. -
'ఇండియన్ కంటే గోవన్ గొప్ప'
పణాజి: 'ఈ దేశంలో పుట్టిన అందరికీ ఇండియన్ అనే ఐడెంటిటీ గొప్పగా అనిపించొచ్చు. కానీ గోవా ప్రజలకు మాత్రం ఇండియన్‌గా కంటే గోవన్ అనే గుర్తింపే గొప్పది..' ఇవేవో ప్రాంతీయ ఉద్యమకారులు చేసిన వ్యాఖ్యలు కాదు. సాక్షాత్తు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు అన్న మాటలు. శనివారం గోవాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ కామెంట్లు చేశారు. 'ఓసారి గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజాతో కలిసి పోర్చుగల్ వెళ్లను. అక్కడివాళ్లందరూ ప్రాన్సిస్‌ను ఇండియన్‌గా కంటే గోవన్ గానే గుర్తించడం నన్ను ఆశ్చర్యపరిచింది. భౌగోళికంగా గోవా మిగిలిన అన్ని రాష్ట్రాల వంటిదే కావచ్చు కానీ చారిత్రక, సంస్కృతిక వారసత్వాల దృష్ట్యా ఈ రాష్ట్రానికి ఓ ప్రత్యేకత ఉంది' అని సురేశ్ ప్రభు అన్నారు. తన అత్తారిల్లు కూడా గోవాలోనే ఉందని, సతీమణి ఉమ పణాజీ సమీపంలోని రిబాందర్ లో పుట్టిపెరిగారని పేర్కొన్నారు. -
దేశంలోనే తొలి ఏసీ డెము రైలు ప్రారంభం
కొచ్చి: దేశంలోనే తొలి ఏసీ డీజిల్ ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్(డీఈఎంయు) రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆదివారం కేరళలో ప్రారంభించారు. అంగమలై-ఎర్నాకుళం-త్రిపునితుర-పిరవోం మార్గంలో నడిచే ఈ రైలులో ఏసీ సౌకర్యం కూడా కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు సౌకర్యం ద్వారా పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రైళ్లను మరిన్నింటిని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. ఏసీ కోచ్‌లో 75 మంది కూర్చునే విధంగా సీట్లు అమర్చినట్లు తెలిపారు. -
కనికరించని ‘ప్రభు’
రెడ్ సిగ్నల్ వ్యాగన్‌కు కొత్త మెలిక గల్లంతైన కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ మూడేళ్లకిత్రమే మంజూరు ఆవిరైన రైల్వేవర్సిటీ ఆశలు జిల్లాలో పెరగనున్న రైళ్ల వేగం కొత్త రైళ్ల భారం ఎంపీలపైనే.. హన్మకొండ : పార్లమెంట్లో గురువారం రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో బల్లార్షా- కాజీపేట-విజయవాడ మధ్య మూడోలైను నిర్మాణానికి నిధులు కేటాయించడం మినహా ఒరిగింది శూన్యం. రాష్ట్రస్థాయి ప్రాజెక్టులుగా గుర్తింపు తెచ్చుకున్న రైల్వేకోచ్ కర్మాగారం, వ్యాగన్ వర్క్‌షాప్, కాజీపేటకు డివిజన్ హోదా వంటి కీలక అంశాలన్నీ టెక్నాలజీమంత్రం మాటున మరుగున పడిపోయాయి. జిల్లావాసులు బడ్జెట్‌పై నిరాశ చెందారు. వ్యాగన్ గల్లంతు బడ్జెట్లో వ్యాగన్ పరిశ్రమకు నిధులు కేటాయిస్తారని అంతా ఆశించారు. ఇటీవల భూసేకరణ పూర్తికావడం, అంతకుముందే సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీకి ఈ అంశంపై లేఖ రాయడంతో నిధులు కేటారుుస్తారని అందరూ భావించారు. కానీ, సురేష్‌ప్రభు అందరి అంచనాలు తలకిందులు చేశారు. రాబోయే మూడు నెలల కాలంలో ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో వ్యాగన్ల తయారీ, లీజుకు ఇవ్వడం వంటి అంశాలపై ‘వ్యాగన్ ఇన్వెస్ట్మెంట్ స్కీం’పై సమాలోచనలు చేస్తామంటూ కొత్త మెలిక పెట్టారు. మూడు నెలల తర్వాత కొత్తగా రూపుదిద్దుకునే విధివిధానాలపై కాజీపేట వ్యాగన్ వర్క్‌షాప్ భవితవ్యం ఆధారపడి ఉంది. విభజన హామీలదీ అదేదారి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణలో రైలు బోగీల తయారీ కర్మాగారం (రైల్ కోచ్‌ఫ్యాక్టరీ) ఏర్పాటుకు గల అంశాలను పరిశీలించాలని రైల్వేశాఖకు ఆదేశాలు జారీ చేశారు. గత బడ్జెట్లో ఈ అంశంపై మూడు నెలల కాలపరిమితితో రైల్వేశాఖ కమిటీ ఏర్పాటు చేసింది. కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై సానుకూల స్పందన రాకపోవడంతో జిల్లావాసులు నిరాశకు లోనయ్యూరు. అదేవిధంగా విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న సికింద్రాబాద్ డివిజన్‌ను విభజించి కాజీపేట కేంద్రంగా మరో కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి ఉన్న డిమాండ్‌ను రైల్వేమంత్రి పెడచెవిన పెట్టారు. ఆవిరైన రైల్వేవర్సిటీ ఆశలు భారతీయ రైల్వేల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థల సహకారంతో రైల్వే వర్సిటీ ఏర్పాటు చేయనున్నామంటూ ఎన్డీఏ మధ్యంతర రైల్వేబడ్జెట్‌లో పేర్కొంది. వరంగల్ నగరంలో కాజీపేటకు అత్యంత సమీపంలో నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్, వరంగల్) ఉండటంతో వరంగల్‌లో ఈ వర్సిటీ ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. కానీ రైల్వేశాఖ ప్రధాని నరేంద్రమోడీ సొంత నియోజకర్గమైన ఐఐటీ-వారణాసిలో ఈ విద్యాసంస్థను నెలకొల్పుతున్నట్లుగా ప్రకటన చేశారు. దానితో వరంగల్‌లో రైల్వేవర్సిటీ ఆశలు గల్లంతయ్యాయి. సర్వేలతో సరి గత బడ్జెట్లో మంజూరై నిధుల కోసం ఎదురు చూస్తున్న భద్రాచలం రోడ్డు- కొవ్వూరు రైల్వేమార్గానికి ఈ బడ్జెట్లో మొండిచేయి ఎదురైంది. కేవలం రూ.కోటి కేటాయించారు. డోర్నకల్-మిర్యాలగూడ మార్గం సర్వేకు మరోసారి సర్వే కోసం రూ.14.57 లక్షలు, పాలకుర్తి- స్టేషన్‌ఘన్‌పూర్-సూర్యాపేట మార్గం సర్వేకు రూ 24.50 లక్షలు, హసన్‌పర్తి-కరీంనగర్ మార్గం సర్వేకు రూ 14.5 లక్షలు కేటాంచారు. జిల్లా మీదుగా వెళ్తూ ఇదే పరిధిలోకి వచ్చే మణుగూరు-రామగుండం రైల్వేమార్గానికి మరోసారి సర్వే చేపట్టాలంటూ రూ.50 లక్షలు కేటాయించారు. మూడోసారి మూడోలైన్ ఢిల్లీ-చెన్నై గ్రాండ్‌ట్రంక్ మార్గంలో ఉన్న బల్లార్షా- కాజీపేట-విజయవాడ మార్గం అత్యంత రద్దీతో ఉంటుంది. ట్రాఫిక్ పరంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ మార్గంలో మూడోలైను నిర్మిస్తామంటూ మూడేళ్ల కిందట అప్పటి రైల్వేమంత్రి త్రివేది ప్రకటించారు. మూడేళ్లుగా పనులు ముందుకు సాగలేదు. ఈ బడ్జెట్ ఈ మార్గానికి ప్రాధాన్యత దక్కింది. ట్రిప్లింగ్ కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు మార్గాల్లో కాజీపేట-విజయవాడ ఒకటి. 219.6 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గానికి రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. దీనితో పాటు 220 కిలోమీటర్ల నిడివిగల బల్లార్షా-కాజీపేట మార్గంలో ట్రిప్లింగ్‌కు రూ.46.19 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కాజీపేట బైపాస్ మార్గంలో డబ్లింగ్‌కు రూ.4.50 కోట్లు కేటాయించారు. హైస్పీడ్ రైళ్లకు అవకాశం దేశంలో తొమ్మిది మార్గాల్లో రైళ్ల గరిష్ట వేగాన్ని 110-130 నుంచి 160-200 కిలోమీటర్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ కేటగిరిలోకి విజయవాడ-కాజీపేట సెక్షన్ రానుంది. డోర్నకల్-వరంగల్ల మధ్య ట్రాక్ అనువుగా ఉందా లేదా అనే అంశాన్ని ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ ఈ మార్గంలో పర్యటించి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గత బడ్జెట్లో సికింద్రాబాద్-విజయవాడ, కాజీపేట-నాగ్‌పూర్‌ల మధ్య హైస్పీడ్ రైళ్లు నడిపేందుకు అధ్యయనం చేస్తామని ప్రకటించారు. ఆ పనులు ఎంత వరకు వచ్చాయనేది గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివరించలేదు. వై-ఫై సౌకర్యం ఏ కేటగిరిలో ఉన్న రైల్వే స్టేషన్లలో వై-ఫై సౌక ర్యం కల్పిస్తామంటూ రైల్వేమంత్రి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఏ కేటగిరిలో వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ రెండు స్టేషన్లలో త్వరలో వై-ఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. అదేవిధంగా యాత్రికులు ఎక్కువగా వచ్చే స్టేషన్లలో స్వయంసేవా పద్ధతిలో లాకర్లను అందుబాటులోకి తెస్తామంటూ మంత్రి సురేశ్‌ప్రభు చెప్పారు. ఈ కోటాలో వరంగల్, కాజీపేటలకు వచ్చే యాత్రికులు, ప్రయాణికులకు లాకర్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే కాజీపేటకు రెండు లిఫ్టులు మంజూరు కాగా నిధులలేమి కారణంగా పనులు ఆగిపోయాయి. ముఖ్యమైన స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటుకు రూ.120 కోట్లు కేటాయించారు. వీటితోపాటు ప్రధాన స్టేషన్లలో మినరల్ వాటర్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు వాటర్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఉన్న కాజీపేట, వరంగల్, జనగామ, డోర్నకల్, మహాబూబాబాద్ స్టేషన్లలో ఈ మిషన్లు అందుబాటులోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది. వీటితో పాటుగా జిల్లాలో నాలుగు ఆర్వోబీ లేదా ఆర్యూబీలకు నిధులు మంజూరైనట్లుగా తెలుస్తోంది. ఎంపీలపైనే భారం బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్ల అంశాన్ని కొలిక్కి తెస్తామంటూ మంత్రి ప్రకటించారు. దానితో కొత్త రైళ్లు, ప్రాజెక్టులను జిల్లాకు సాధించాల్సిన బాధ్యత జిల్లాకు చెందిన ఎంపీలపై ఉంది. కాజీపేట-షిరిడీ, భద్రాచలంరోడ్డు-డోర్నకల్-తిరుపతి, భద్రాచలం రోడ్డు-కాగ జ్నగర్ల మధ్య కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్లు చిరకాలంగా ఉన్నాయి. గత బడ్జెట్లో ప్రకటించిన ముంబై-కాజీపేట రైలును ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశాన్ని పేర్కొనలేదు. త్వరితగితన సరుకులు రవాణా చేసేందుకు ట్రాన్స్‌పోర్టు లాజిస్టిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా 30 చోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పుతామన్నారు. దీనికి ప్రధాన అర్హత ఖాళీ రైల్వేస్థలాలు అందుబాటులో ఉండటం. డోర్నకల్ సమీపంలో రైల్వేకు వందల ఎకరల స్థలం అందుబాటులో ఉంది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ అంశంపై దృష్టి పెట్టడం మంచింది. బొగ్గు, ఉక్కు పరిశ్రమలు ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ కొత్త మర్గాలు నిర్మిస్తామంటూ మంత్రి సురేశ్‌ప్రభు సెలవిచ్చారు. దాని ప్రకారం మణుగూరు-రామగుండం రైల్వేలైనుకు ప్రత్యేకంగా నిధులు రాబట్టాల్సి ఉంది. దేశంలో మరో నాలుగు చోట్ల రైల్వే రీసెర్చ్ సెంటర్లు నెలకొల్పుతామంటూ మంత్రి ప్రకటన చేశారు. కనీసం ఈ రీసెర్చ్ సెంటరైనా వరంగల్‌కు దక్కేలా ప్రజాప్రతినిధులు బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపు కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కాజీపేటలో స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.కొత్త డివిజన్ల ఏర్పాటుపై ఎంపీలతో కమిటీ వేస్తామంటూ మంత్రి ప్రకటించారు. కాజీపేట డివిజన్ సాధన దిశగా ఎంపీలు తమ గళం విప్పాల్సిన అవసరం ఉంది. -
‘ప్రభు’ కరుణిస్తారా..!
నేడు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి సురేష్ ప్రభు నత్తనడకన శ్రీకాళహస్తి-నడిగుడి, కడప-బెంగళూరు రైల్వే మార్గాలు తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఊపు రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజానీకం పెట్టుకున్న కొండంత ఆశలు మంత్రి సురేష్‌ప్రభు సాకారం చేస్తారా.. గత రైల్వే మంత్రుల తరహాలోనే నీళ్లు చల్లుతారా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటున్న నేపథ్యంలో సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది. విభజన నేపథ్యంలో రాష్ట్ర రైల్వే శాఖ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన శ్రీకాళహ స్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టులకు రైల్వే శాఖ నిబంధనలను సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను కేంద్రం ఏమేరకు అంగీకరిస్తున్నదనేది నేడు తేలిపోనుంది. తిరుపతి గాంధీరోడ్డు: నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు గురువారం లోక్‌సభలో పూర్తిస్థాయి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కానీ జిల్లాలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇందులో ప్రధానమైన రైలు మార్గాల పరిస్థితి అంతంత మాత్రమే. ఇది జిల్లా పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతకంగా మారింది. అపార ఖనిజ సంపదకు.. వ్యవసాయ ఉత్పత్తులకు.. పర్యాటక రంగానికి పెట్టింది పేరైన జిల్లా అభివృద్ధిలో మాత్రం అథమస్థానంలో ఉండడానికి ప్రధాన కారణం రైలు మార్గాలు సక్రమంగా లేకపోవడమేనని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా పశ్చిమ మండలాల్లో పారిశ్రామిభివృద్ధికి బాటలు వేసేలా కడప, మదనపల్లి, బంగారుపేట, బెంగళూరు రైల్వే మార్గాన్ని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ప్రతిపాదించారు. తూర్పు మండల సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా శ్రీకాళహస్తి, నడికుడి మార్గాన్ని మంజూరు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. వాటా నిధుల కేటాయింపునకు సాకుగా.. నిధుల లభ్యత లేదనే సాకుచూపి ఆరెండు రైల్వే మార్గాలను మంజూరు చేసేందుకు అప్పట్లో రైల్వే శాఖ అంగీకరించలేదు. దీంతో ఆ మార్గాలకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అప్పట్లో వైఎస్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 2008-09 రైల్వే బడ్జెట్లో ఆరెండు మార్గాలను మం జూరు చేసింది. 2008-09, 2009-10 బడ్జెట్లో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ఆరెండు రైల్వే మార్గాలకు రాష్ట్రప్రభుత్వం చెల్లించిన వాటా నిధులు ఇచ్చారు. ఫలితంగా కడప -బెంగళూరు, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే మార్గాల పనులను కేంద్రం ప్రారంభించింది. ప్రస్తుతం కడప- బెంగళూరు రైల్వే మార్గం పనులు 129 కోట్ల రూపాయల వ్యయంతో కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21.59 కిలోమీటర్ల మేర సాగుతోంది. శ్రీకాళహస్తి -నడికుడి రైల్వే మార్గం సర్వే పనులు 2010 నాటికి పూర్తయ్యాయి. పనులు మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఐదేళ్లల్లో పూర్తి కావాల్సిన ఈ బడ్జెట్లో ఎన్నటికీ పూర్తవుతుందో రైల్వే శాఖ ఒక అంచనాకు రాలేక పోతోంది. దీనికి ప్రధాన కారణం వైఎస్ హఠాత్తు మరణం తర్వాత శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే మార్గాలకు రాష్ట్రం ప్రభుత్వం తనవాటా నిధులను విడుదల చేయకపోవడమే ఇదే సాకుగా చూపి రైల్వే శాఖ కూడా ఆ మార్గాలకు నిధులు కేటాయించడం లేదు. ఈ నేపథ్యంలో సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు రైల్వే శాఖే నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కోరడం గమనార్హం. డివిజన్ పోయి జోన్ వచ్చే .. గుంతకల్లు డివిజన్, గుంటూరు డివిజన్లలో కొన్ని భాగాలు వేరు చేసి తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు రాజకీయ పారిశ్రామిక వర్గాల ప్రతిపాదనలు కూడా పంపాయి. గురువారం రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత వస్తుందో రాదో చూడాల్సి వుంది. రైళ్ల సంఖ్య పెరగాలి తిరుపతి నుంచి షిరిడీ, విశాఖ, సికింద్రాబాద్‌లకు దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ముంబయి- హౌరా, అహ్మదాబాద్, ఢిల్లీలకు గరీబ్థ్ ్రరై లు ప్రతిపాదనలు చాలా కాలంగా పెండిం గ్లో ఉన్నాయి. వీటిని మంజూరు చేయాలి. తిరుపతి నుంచి బెంగళూరు, చెన్నై, మదురై, త్రివేండ్రం, ఢిల్లీ, విశాఖ, కోల్‌కతా తదితర ప్రధాన నగరాలకు, పారిశ్రామిక కేంద్రాలకు, పుణ్యక్షేత్రాలకు రైళ్ల సంఖ్య పెంచాలి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి తిరుపతి రైల్వే స్టేషన్లో యుద్ధప్రాతిపదికన అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి. తిరుపతి-కాట్పాడి మధ్య రెండు లేన్ల మార్గాన్ని తిరుపతి నుంచి ధర్మవరం మీదుగా సికింద్రాబాద్, ముంబ యి రైలు మార్గాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పెంచాలి. ఉద్యోగుల కోర్కెలు తిరుపతిలో రైల్వే ఆసుపత్రి, ఉద్యోగుల పిల్లల కోసం వైద్య కళాశాల స్థాపించాలి. రైల్వే స్టేషన్లో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలి. పెరిగిన రైళ్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఉద్యోగాలను నియమించాలి.రైల్వే భద్రతా విభాగంలో 2లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. హెచ్ఆర్ఏ 20 శాతం చెల్లించాలి, ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మించాలి. -
‘కూత’లేనా!
ఏలూరు/తాడేపల్లిగూడెం : కేంద్ర రైల్వే బడ్జెట్ స్వరూపం ఎలా ఉంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. విశాఖను ప్రత్యేక రైల్వేజోన్‌గా ప్రకటిస్తారా, మన జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఈసారైనా నిధులు ఇస్తారా.. ఎప్పటిలా ఉసూరుమనిపిస్తారా అనేది కొద్దిగంటల్లోనే తేలిపోనుంది. ఎంపీలు మాత్రం జిల్లాలోని రైల్వే సమస్యలను, అవసరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఈసారి సానుకూల స్పందన ఉంటుం దని చెబుతున్నారు. వీటికి మోక్షం కలిగేనా.. ఏటా రైల్వే బడ్జెట్లో జిల్లా ప్రజలకు మొండిచెయ్యే దక్కుతోంది. రాకపోకలు, సరుకుల రవాణా ద్వారా రైల్వేకు రూ.70 కోట్లకు పైగా ఆదాయం జిల్లా నుంచి సమకూరుతోంది. అయినా ఏ స్టేషన్లో చూసినా అక్కడి సౌకర్యాలు ప్రయాణికులను అసహనానికి గురి చేస్తున్నాయి. కొవ్వూరు-భద్రాచలం మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా నలుగుతోంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.745 కోట్లకు చేరింది. ఈ ైరె ల్వే లైను పూర్తయితే కొత్తగూడెం, సింగరేణి, మణుగూరు బొగ్గు గనుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సింహాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌కు బొగ్గు తరలించడానికి ఉపయోగపడుతుంది. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ ప్రతిపాదన దశలోనే ఉంది. భీమవరం-నిడదవోలు-గుడివాడ బ్రాంచి లైన్ డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హాల్ట్‌ల సంగతేంటో.. ఏలూరు ైరె ల్వేస్టేషన్‌లో కోరమాండల్, గౌహతి, కరియ-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ లేదు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ మీదుగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలన్న డిమాండ్ నెరవేరడం లేదు. తాడేపల్లిగూడెంస్టేషన్లో 1, 2 ప్లాట్‌ఫారాలకు లిఫ్టు సౌకర్యం కల్పించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ప్రయోజనం లేకపోతోంది. ఇక్కడి ఫుట్ బ్రిడ్జిని మూడో నంబర్ ప్లాట్‌ఫామ్ వరకు విస్తరిం చే ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉంది. కాకినాడ నుంచి భావనగర్ మధ్య ప్రతి గురువారం నడిచే రైలు, విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ (స్వర్ణజయంతి), దిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్, విశాఖ పట్నం-కొల్లాం తదితర రైళ్లకు హాల్ట్ ఇవ్వడం లేదు. నరసాపురం నుంచి రోజుకు 23 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా ఒక్కటే ప్లాట్‌ఫాం ఉంది. ఒక్కటే ఫిట్‌లైన్ ఉండటంతో స్టేషన్‌కు వచ్చి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిర్వహణ కోసం మచిలీపట్నం పంపించాల్సి వస్తోంది. ఎక్స్‌ప్రెస్‌లు నిలిపేలా చర్యలు విశాఖపట్నం వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలపాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. ఈ డిమాండ్ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ఎస్కలేటర్ ఏర్పాటుకు కృషి చేస్తాం. - మాగంటి బాబు, ఏలూరు ఎంపీ సమగ్ర ప్రతిపాదనలు ఇచ్చాం జిల్లాలోని రైల్వే సమస్యలకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు ఇచ్చాం. ఈ సారైనా వాటికి మోక్షం కలుగుతుందని ఆశిస్తున్నాం. వైజాగ్‌ను ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించాలని, విజయవాడ, రాజ మండ్రి వైజాగ్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు నడపాలని కోరాం. పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం రైల్వే స్టేసన్లలో సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు వివిధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను నడపాలని కోరాం. కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణం వంటి అంశాలనూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. - తోట సీతారామలక్ష్మి, రాజ్యసభ సభ్యులు దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి జిల్లాలో దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన ప్రాజెక్ట్‌లు, సమస్యలపై ప్రతిపాదనలు ఇచ్చాం. బ్రాంచిలైన్ డబ్లింగ్ పనులు, విద్యుదీకరణతో పాటు భీమవరం, పాలకొల్లు రైల్వేగేట్ల వద్ద ఓవర్ బ్రడ్జిల నిర్మాణానికి నిధులు కేటాయించాలని అడిగాం. బడ్జెట్లో వాటికి స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నాం. - గోకరాజు గంగరాజు, నరసాపురం ఎంపీ -
వంద రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్‌పై ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్లో 100 కంటే ఎక్కువ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తాజా బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటు రాష్ట్రాలకు కొత్త రైళ్లను తీసుకొచ్చే సూచనలు కనిస్తున్నాయి. ప్రతి ఏడాది సుమారు 150-180 కొత్త రెళ్లను బడ్జెట్లో ప్రవేశపెట్టేవారు. గతేడాది 160 రైళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగానే ఈ ఏడాది కూడా మరో వందకి పైగా రెళ్లను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా నూతన బడ్జెట్ 2015-16 ను ఫిబ్రవరి 26న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అధనంగా నిధులు సమకూర్చడంతో పాటు వాటిని అభివృద్ధి చేయాలని ఆయన ఆలోచిస్తున్నారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. రైళ్లపై ప్రముఖ బ్రాండ్ కంపెనీలు 'కోకా కోలా ఎక్స్‌ప్రెస్', 'హల్దీరామ్' ప్రకటనలు తీసుకునేందుకు మంత్రి సురేశ్ ప్రభు సిద్ధమైనట్టు సమాచారం. జనరల్, సెకండ్ క్లాస్ బోగీలుండే 'సాధారణ్ ఎక్స్‌ప్రెస్' రైలు సర్వీసులను సామాన్యులకు అందుబాటులో ఉండేలా తీసుకురానున్నారు. కొన్ని ముఖ్య ప్రాంతాలకు సందర్శకులను దృష్టిలో ఉంచుకుని కొత్త సర్వీసులను ప్రవేశపెట్టనున్నారు. -
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో వైఫై సేవలు మొదలు
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించేవారికి సోమవారం నుంచి వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిద్వారా వీరు ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు స్టేషన్ ప్రాంగణంలో ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడమే మా లక్ష్యం. సైన్సు, సాంకేతిక సేవలను ముఖ్యంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులోభాగంగానే ఈ రైల్వేస్టేషన్లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరైంది. ఈ స్టేషన్‌లోని 16 ప్లాట్‌ఫాంలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి 30 నిమిషాలపాటు ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఆ తర్వాత కూడా కావాలంటే ప్రయాణికులు స్క్రాచ్ కార్డులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ. 25 వెచ్చించి కార్డును కొనుగోలు చేస్తే అరగంటపాటు, రూ. 35 కార్డును కొనుగోలు చేస్తే గంటపాటు ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ కార్డు 24 గంటలపాటు మాత్రమే చెల్లుతుంది. ఇవి ఈ స్టేషన్‌కు చెందిన పహర్‌గంజ్, అజ్మీరీ గేట్ల వద్ద అందుబాటులో ఉంటాయి’అని పేర్కొన్నారు. త్వరలో అన్ని ప్రధాన స్టేషన్లలోనూ... వైఫై సేవలను త్వరలో అన్ని ప్రధాన స్టేషన్లలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ‘హై ఫై కాదు వైఫై తప్పనిసరిగా సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండాలనేది ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల. ఈ సేవలు ఏ కొందరికో పరిమితం కారాదు. స్టేషన్లతోపాటు త్వరలో రైళ్లలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. ఇది ఆరంభం మాత్రమే. ఏ ఒక్క స్టేషన్‌కో దీనిని మేము పరిమితం చేయదలుచుకోలేదు. రైల్ టెల్ సంస్థ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 50 లక్షలు. ఈ వెసులుబాటును కొనసాగించేందుకు ప్రతి ఏడాది రూ. 16 లక్షల మేర నిధులను వెచ్చిస్తాం. ఈ నెలాఖరులోగా ఆగ్రా, అహ్మదాబాద్, వారణాసి రైల్వేస్టేషన్లలోనూ ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తాం’అని ఆయన పేర్కొన్నారు.