యూపీలో ఘోరం
- స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న రైలు
- 8 మంది చిన్నారుల మృతి
- వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే
భదోహి : ఉత్తరప్రదేశ్‌లో సోమవారం ఓ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టడంతో 8 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 14 మంది పిల్లలు గాయపడ్డారు. కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద సోమవారం డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యాన్‌ను నడపడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘోసియా టౌన్‌షిప్‌లోని టెండర్‌హార్ట్ పాఠశాలకు చెందిన మినీ బస్సు సమీప ఆరు పల్లెల్లో 6-14 ఏళ్ల వయసు చిన్నారులను రోజూ పాఠశాలకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం చిన్నారులతో బయల్దేరింది. కటక్-మధోసింగ్ స్టేషన్ల నడుమ ఉన్న రైల్వే గేట్ నంబర్ 26 వద్దకు మినీ బస్సు చేరుకుంది. అక్కడ వారణాసి-అలహాబాద్ ప్యాసింజర్ రైలు వేగంగా దూసుకొస్తోంది.
ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్న వ్యాను డ్రైవర్.. రైలు వస్తున్న విషయాన్ని పట్టించుకోలేదు. గేట్‌మిత్ర ఎర్రజెండా చూపి హెచ్చరించినా ఫలితం లేకపోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గేట్‌ను క్రాస్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాడు. చూస్తుండగానే రైలు వ్యాన్‌ను ఢీకొంది. వ్యాను సమీపంలోని పొలంలో ఎగిరిపడింది. గాయపడ్డ చిన్నారులు, డ్రైవర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. రఘటనపై రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.20 వేల చొప్పున ప్రకటించారు. బిహార్‌లో 10 మంది మృతి
ముజాఫర్పూర్: బిహార్‌లోని ముజాఫర్ఫూర్ జిల్లా జాఫా గ్రామం వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ఆటో ఢీకొని 10 మంది దుర్మరణం చెందారు.