school van
-
బరితెగిస్తున్న ‘బడి డ్రైవర్లు’!
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఏటా స్కూల్ ఆటోలపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించడం ఆనవాయితీ. సాధారణంగా జూన్, జూలై నెలల్లో ఈ తనిఖీలు జరుగుతూ ఉంటాయి. అయితే నగరంలో పాఠశాలలకు విద్యార్థుల్ని తరలించే ఆటోల డ్రైవర్లు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు గతవారం రెండు రోజుల పాటు వరుస తనిఖీలు చేపట్టాయి. ఫలితంగా రెండు రోజుల్లో 3221 కేసులు నమోదయ్యాయి. చిన్నారులను పాఠశాలలకు తరలించే ఆటోల భద్రత అంతంత మాత్రంగా ఉన్నట్లు ఈ తనిఖీల్లో బయటపడింది. ఫిట్నెస్ మాట అటుంచితే డ్రైవర్లకు కనీసం లైసెన్స్ లేనట్లు గుర్తించారు. అలాంటి 10 మంది డ్రైవర్లను ప్రత్యేక బృందాలు పట్టుకున్నాయి. ఉదయం..సాయంత్రం తనిఖీలు... స్కూలు ఆటోడ్రైవర్లు ప్రధానంగా చేసే ఉల్లంఘన ఓవర్ లోడింగ్. అనివార్య కారణాల నేపథ్యంలో అత్యధికంగా పాఠశాలకు విద్యార్థులు ఆటోల్లోనే వస్తుంటారు. నిబంధనల ప్రకారం వీటిలో ఆరుగురు విద్యార్థుల్ని మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉన్నా... అనేక మంది ఆటోడ్రైవర్లు ఎనిమిది నుంచి పది మందిని తరలిస్తూ ఉంటారు. ఇది అత్యంత ప్రమాదహేతువు కావడంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు బుధవారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. కేవలం ఓవర్ లోడింగ్‌గా పిలిచే ఎక్స్ట్రా స్కూల్ చిల్డ్రన్ ఉల్లంఘనపైనే కాకుండా ప్రతి ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకుగాను స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఆయా బృందాలు స్కూళ్లు తెరిచే, మూతపడే సమయాల్లోనే తనిఖీలు చేపడుతున్నాయి. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఆయా స్కూళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ఆరింటిపై దృష్టి... ప్రత్యేక బృందాలు ప్రధానంగా ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తదితర పత్రాలతో పాటు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేయడం, ఓవర్ లోడింగ్, మైనర్ డ్రైవింగ్ అంశాలపై దృష్టి సారించాయి. వీటితో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక బృందాలు త్వరలో స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల్ని తరలించే వాహనాల డ్రైవర్లు, తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిబంధనలు, భద్రత అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. కొందరు తల్లిదండ్రులు తమ ద్విచక్ర వాహనాలపై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను స్కూళ్లకు తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పరిమితికి మించి చిన్నారులను తీసుకువచ్చే తల్లిదండ్రులకూ అవగాహన కల్పించనున్నారు. అన్నీ తనిఖీ చేసుకోండి... భవిష్యత్‌లోనూ ఇలాంటి ప్రత్యేక డ్రైవ్స్ కొనసాగిస్తాం. బడి పిల్లల భద్రతలో తల్లిదండ్రులతో సహా అందరూ భాగస్వాములు కావాలి. ఓవర్లోడింగ్ వాహనాల్లో పిల్లల్ని పంపకూడదు. యాజమాన్యాలతో పాటు వీరు కూడా డ్రైవర్లు, వాహనం స్థితిగతులు, పత్రాలు తనిఖీ చేసుకోవాలి. ఈ తరహా వాహనాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటూ 9010203626తో పాటు ‘ట్రాఫిక్ లైవ్’ యాప్‌ను వినియోగించుకోవచ్చు. పాఠశాల యాజమాన్యాలు సైతం 2011 మార్చ్ 16న రవాణా శాఖ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలి.– అనిల్‌కుమార్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
వ్యాన్‌లో నలుగురు విద్యార్థుల సజీవ దహనం
-
వ్యాన్‌లో నలుగురు విద్యార్థుల సజీవ దహనం
చంఢీఘర్: పంజాబ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో శనివారం ఓ స్కూలు వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. లాంగోవాల్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 12 మంది విద్యార్థులు ఉండగా, నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. భారత్‌లో బాలుడి హత్యకు లండన్‌లో కుట్ర! వ్యాన్‌లో మంటలు ఎలా చెలరేగాయో అనేదానిపై విచారణ జరుపుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఘన్‌శ్యాం తోరీ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటన గురించి సమాచారం అందగానే ఘటనా స్థలానికి సంగ్రూర్ ఎస్డీఎం, తహసీల్దార్లను పంపినట్లు చెప్పారు. ఇక విద్యార్థులకు అత్యవసర వైద్యం అందించేందుకు పలువురి డాక్టర్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండి: పక్కింటి మహిళతో ప్రేమాయణం.. 14 ఏళ్ల తర్వాత డాక్టర్‌గా..!) -
లోయలోకి వ్యాన్: ఎనిమిది మంది చిన్నారుల మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్ మంగళవారం ప్రమాదానికి గురైంది. 18 మంది విద్యార్థులతో వెళ్తున్న వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంతో కంగ్సాలి ప్రాంతంలో లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ఎనిమిది విద్యార్థులు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్నవిపత్తు నివారణ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టింది. ఘటనపై స్పందించిన స్థానిక పోలీసు అధికారి ఎనిమిది మంది విద్యార్థులు మరణించినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో మొత్తం 18మంది విద్యార్థులు ఉన్నారని, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
21 మంది విద్యార్థులను రక్షించి డ్రైవర్‌మృతి
అన్నానగర్: విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతుండగా గుండెపోటుకు గురై వ్యాన్ డ్రైవర్ మృతిచెందాడు. ఆరుముగనేరిలో బుధవారం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతుండగా వ్యాన్ డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు ఏర్పడింది.అతడు వ్యాన్ వేగాన్ని తగ్గించడంతో అక్కడున్న ఇంటి ప్రహరీ గోడను ఢీకొని వ్యాన్ ఆగింది. వ్యాన్‌లో ఉన్న 21 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వ్యాన్ డ్రైవర్ మృతిచెందాడు. తూత్తుక్కుడి జిల్లా ఆత్తూర్–పున్నక్కాయల్ రోడ్డు ప్రాంతానికి చెందిన మోహన్‌రాజ్ (45). ఇతను ఆరుముగనేరిలో ప్రైవేట్ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం పాఠశాల వ్యాన్‌లో విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళుతున్నాడు. వ్యాన్‌లో 21 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆరుముగనేరి బజార్ దాటి రామరాజపురం ప్రాంతంలో వెళుతుండగా హఠాత్తుగా మోహన్‌రాజ్‌కి గుండెపోటు ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన మోహన్‌రాజ్ వ్యాన్ పేగాన్ని తగ్గించి, ఎడమ వైపుగా వ్యాన్ని తిప్పిన స్థితిలో స్టేరింగ్‌పై కుప్పకూలిపోయాడు. వ్యాన్ నేరుగా రోడ్డు పక్కనున్న ఇంటి ప్రహరీ గోడను ఢీకొని ఆగింది. వ్యాన్‌లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డారు. స్పృహతప్పిన మోహన్‌రాజ్‌ను స్థానికులు తిరుచెందూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మోహన్‌రాజ్ అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
అక్కకోసం వెళ్లిన చిన్నారి మృత్యువొడిలోకి..
సాక్షి, హుజూరాబాద్‌రూరల్: అమ్మఒడిలోంచి దిగి ఆ బాలుడు ఇప్పుడిప్పుడే నడవడం నేర్చుకుంటున్నాడు. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిన అక్క తిరిగిరావడంతో సంబరంతో తీసుకురావడానికి తల్లితో వెళ్లాడు. ఇంతలోనే స్కూల్‌వ్యాన్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ బాలుడి ప్రాణం తీసింది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి స్కూల్‌వ్యాన్ టైర్లకింద పడి నలిగిపోయాడు. ఈ ఘటన హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామం లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్కపల్లి సంజీవ్– రాధికలకు కుమార్తె హర్షిణి, కొడుకు శశ్వాంత్(4)ఉన్నారు. హర్షిణి జమ్మికుంట పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఒకటోతరగతి చదువుతోంది. శుక్రవారం సాయంత్రం హర్షిణి దింపేందుకు స్యూల్‌వ్యాన్ వచ్చిది. కూతురును తీసుకెళ్లేందుకు రాధిక వస్తున్న క్రమంలో అమ్మ కొంగును పట్టుకొని శశ్వాంత్ వ్యాన్‌పుట్‌బోర్డు వరకు వచ్చాడు. హర్షిణి, రాధిక ఇంటికి వస్తుండగా శశ్వాంత్ పుట్‌బోర్డు వద్దనే ఉండిపోయాడు. గమనించని డ్రైవర్ వ్యాన్‌ను ముందుకు నడపడంతో శశ్వాంత్ టైర్లకిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గమనించిన రాధిక కొడుకు మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. టౌన్ సీఐ వాసంశెట్టి మాధవి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంజీవ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ తెలిపారు. -
స్కూల్ వ్యాన్ బోల్తా
మలాపూర్ : ఓ ప్రైవేట్ స్కూల్‌వ్యాన్ అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తాపడిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి శివారులో బుధవారం జరి గింది. ఈ ప్రమాదంలో టీచర్, క్లీనర్ సహా ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. హసన్‌పర్తితోపాటు కమలాపూర్‌లో హైటెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థకు చెందిన స్కూల్ వ్యాన్లలో హసన్‌పర్తితోపాటు కమలాపూర్‌లోని తమ పాఠశాలలకు విద్యార్థులను తరలిస్తుంటారు. బుధవారం కమలాపూర్ పాఠశాలకు విద్యార్థులను తరలించిన అనంతరం ఏపీ 36 టీఏ 1764 స్కూల్వ్యాన్ను హసన్పర్తికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో స్కూల్ వ్యాన్ కానిపర్తి శివారులోని ఓ పంట కాల్వ కల్వర్టు వద్దకు రాగానే ఎదురుగా ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ వస్తుండడంతో డ్రైవర్ వ్యాన్‌ను కొంతమేర రోడ్డుకు కిందికి దింపి వెళ్తూ ఎదురుగా వస్తున్న వాహనాలకు సైడ్ ఇచ్చాడు. అక్కడ ఉన్న పంట కాల్వ కల్వర్టు వద్ద ఇరువైపులా రోడ్డు కోతకు గురై రోడ్డు కుదించుకుపోయి ఉండడాన్ని డ్రైవర్ గమనించకపోవడంతో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. కాల్వ పక్కనే ఉన్న ఓ చెట్టు ఆసరాతో వ్యాన్ పూర్తిగా పడిపోకుండా ఓ పక్కకు పూర్తిగా ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న క్లీనర్ కొడారి శ్రీకాంత్, హసన్‌పర్తి పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న పాఠశాల నిర్వాహకుల సోదరి, మండలంలోని గూడూరుకు చెందిన బింధు, కవలలైన ఆమె కుమారులు అయ్యప్ప, మణికంఠకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా చెట్టు ఆసరాతో వ్యాన్ పూర్తిగా పల్టీ కొట్టకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. సమాచారం అందుకున్న ఎస్సై సూర్యప్రకాష్, తహసీల్దార్ సత్యనారాయణ యాదవ్, ఎంఈఓ రాంకిషన్‌రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదకరంగా పంట కాల్వ కల్వర్టు.. కమలాపూర్-హన్మకొండ మార్గంలో కానిపర్తి శివారులో ఉన్న పంట కాల్వ ప్రమాదకరంగా మారింది. రోడ్డు నిర్మాణ సమయంలో అక్కడ కల్వర్టు నిర్మించకుండా వదిలేయడంతో రోడ్డు కోతకు గురవుతూ కుచించుకుపోతోంది. ఇప్పటికే అక్కడ ఒక ధాన్యం ట్రాక్టర్‌తోపాటు పలు వాహనాలు పడిపోయి పలువురు గాయపడ్డారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వ్యాన్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు.. కానిపర్తి శివారులో బోల్తాపడ్డ వ్యాన్ ఫిట్‌నెస్‌పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాన్ ఫిట్నెస్ లేకపోవడంతోపాటు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే డ్రైవర్‌కు అక్కడ రోడ్డు కోతకు గురైన కల్వర్టు ఉందనే విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యాన్ తోలడంతోనే ప్రమాదం జరిగిందని, కొన్ని స్కూల్ వ్యాన్లలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ఫిట్నెస్ లేని స్కూల్ వ్యాన్లను సీజ్ చేయాలని కోరుతున్నారు. -
వ్యానా.. బోనా..?
దేవరకొండ : ఈ ఫొటో చూడండి.. బోనులో కుక్కపిల్లల మాదిరిగా చిన్నవ్యాన్లో ఈ చిన్నారులను కుక్కారు. ఇది చందంపేట మండలం తెల్దేవర్పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాల చిన్న పిల్లలను స్కూల్‌కు చేరవేసే చేసే సెవన్ సీటర్ ఆటో. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఆ చుట్టుపక్కల తండాలకు విద్యార్థులను ఇలా కిక్కిరిసేలా ఎక్కించుకుని ఇళ్లకు చేరుస్తున్నారు. ఏడుగురు ప్రయాణించాల్సిన ఆటోలో 25 మందిని తరలిస్తున్నారంటే.. ఎంత ప్రమాదకరమో ఇట్టే తెలిసిపోతుంది. శుక్రవారం 25 మంది చిన్నారులను ఒకరిపై ఒకరిని కూర్చోబెట్టుకుని వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఓ లారీకి ఈ ఆటోకు మధ్య ప్రమాదం తప్పడంతో.. ఆ లారీడ్రైవర్‌తో ఆటోడ్రైవర్ గొడవ పడుతూ ‘సాక్షి’కి ఇలా కనిపించాడు. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు, చైల్డ్ రైట్స్ కమిషన్, విద్యాశాఖ అధికారులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
స్కూల్ వ్యాన్‌పై పడ్డ హైఓల్టేజ్ కరెంటు వైర్
బిహార్ : హైఓల్టేజ్ కరెంటు ప్రసరిస్తున్న వైరు తిగి స్కూల్ వ్యాన్‌పై పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించగా, 11 మందికి పైగా గాయాలపాలైయ్యారు. ఈ ఘటన బిహార్‌లోని బనియపుర్లో చోటు చేసుకుంది. హైఓల్టేజ్ వైరు వ్యాన్‌పై పడ్డంతో విద్యార్థులకు కరెంటు షాక్ కొట్టింది. అందులో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి తీవ్రంగా ఉండగ తర్వాత ఇద్దరు విద్యార్థులు మరణించారు. విద్యార్థులు ఆ సమయంలో షాక్ కొట్టి విలవిలాడారని స్థానికులు తెలిపారు. ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డ్రైవర్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం వల్లే...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కుశి నగర్లో పాఠశాల వ్యాన్ రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుని 13 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. వ్యాన్ డ్రైవర్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. గురువారం ఆయన సంఘటన స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను ఓదార్చారు. అనంతరం సీఎం యోగీ మీడియాతో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతున్నాడని, అతడి చెవిలో ఇయర్‌ఫోన్స్ కూడా ఉన్నాయని తెలిపారు. అందువల్లే, క్రాసింగ్ వద్ద సెక్యూరిటీ గార్డు సంకేతాలిస్తున్నా డ్రైవర్‌కి వినిపించలేదని వివరించారు. డ్రైవర్... పాఠశాల నుంచే ఫోన్ మాట్లాడుతూ వ్యాన్ నడుపుకుంటూ వచ్చాడని, అయినప్పటికీ సదరు పాఠశాల యాజమాన్యం అతడిని ఎందుకు ప్రశ్నించలేదన్న విషయంపై తాము విచారణ చేపడతామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి పియూష్ గోయల్‌తో కూడా చర్చించినట్లు సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కాగా మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయలైనవారికి బీఆర్డీ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. చదవండి...ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం -
విద్యాసంస్థల్లో డ్రగ్స్ కలకలం బాధాకరం
హైదరాబాద్ : విద్యా సంస్థల్లో డ్రగ్స్ కలకలం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలతో సంబంధమున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. దానికి తోడు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. డ్రగ్స్ కేసు దర్యాప్తులో మీడియాతో పాటు విచారణ సంస్థలు సంయమనం పాటించాలని కోరారు. ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని డీఈవోలకు కడియం సూచించారు. తప్పంతా విద్యా సంస్థలను నిందించడం సరికాదని కడియం శ్రీహరి అన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై కాలేజీలు, విద్యా సంస్థలు కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులతో పాటు సూళ్లలో ఉపాధ్యాయులు కూడా ఓ కంట కనిపెట్టాలని ఆయన సూచించారు. -
స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న లారీ:15 మందికి గాయాలు
-
స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న లారీ:15 మందికి గాయాలు
నంద్యాల(కర్నూలు జిల్లా): నంద్యాల పట్టణంలోని శాంతిరామ్ ఆసుపత్రి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల వ్యాన్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో వ్యాను రోడ్డుపక్కనున్న గుంతలో పడిపోయింది ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వరదనీటిలో చిన్నారులు..
ఆల్విన్ కాలనీ: అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి ఓ పాఠశాల యాజమాన్యం స్కూల్ నడపగా...చిన్నారులు వరదనీటిలో చిక్కుకుని అల్లాడిపోయారు. కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు శనివారం ధరణీనగర్లోని చిన్నారులను పాఠశాలకు తీసుకువెళ్ళడానికి కాలనీలోకి వచ్చింది. ఆ సమయంలో రహదారిపై భారీగా వరదనీరు ఉండడంతో సైలెన్సర్లోనికి నీరు వెళ్లి బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, మీడియా సిబ్బంది బస్సును రోడ్డు వరకు తోసి చిన్నారులను కాపాడారు. మరో బస్సును తీసుకువచ్చి పిల్లలను సురక్షితంగా తీసుకువెళ్లారు. -
వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు
-
స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి మృతి
తోటపల్లిగూడూరు : స్కూల్ వ్యాన్ కింద పడి చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం కృష్ణారెడ్డిపాళెంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. పేడూరు పంచాయతీ కృష్ణారెడ్డిపాళెంకు చెందిన కటకం రాజా, పావని దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరి ఏడాది వయసున్న ఆఖరి కుమారుడు ఈశ్వర్ ఇంట్లో నుంచి దోగాడుతూ రోడ్డుపైకి వచ్చాడు. శుక్రవారం తోటపల్లిగూడూరు ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు చెందిన వ్యాన్ గ్రామంలోకి వచ్చింది. పిల్లలను దింపి వెనుదిరుగుతున్న సమయంలో రోడ్డుమీదకు వచ్చిన చిన్నారిని గమనించకపోవడంతో వ్యాన్ చిన్నారిపై ఎక్కింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరి ఆడపిల్లల తర్వాత పుట్టిన మగబిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందంతో రాజా, పావని దుఃఖసాగరంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యూపీలో ఘోరం
- స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న రైలు - 8 మంది చిన్నారుల మృతి - వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భదోహి : ఉత్తరప్రదేశ్‌లో సోమవారం ఓ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టడంతో 8 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 14 మంది పిల్లలు గాయపడ్డారు. కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద సోమవారం డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యాన్‌ను నడపడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘోసియా టౌన్‌షిప్‌లోని టెండర్హార్ట్ పాఠశాలకు చెందిన మినీ బస్సు సమీప ఆరు పల్లెల్లో 6-14 ఏళ్ల వయసు చిన్నారులను రోజూ పాఠశాలకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం చిన్నారులతో బయల్దేరింది. కటక్-మధోసింగ్ స్టేషన్ల నడుమ ఉన్న రైల్వే గేట్ నంబర్ 26 వద్దకు మినీ బస్సు చేరుకుంది. అక్కడ వారణాసి-అలహాబాద్ ప్యాసింజర్ రైలు వేగంగా దూసుకొస్తోంది. ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్న వ్యాను డ్రైవర్.. రైలు వస్తున్న విషయాన్ని పట్టించుకోలేదు. గేట్‌మిత్ర ఎర్రజెండా చూపి హెచ్చరించినా ఫలితం లేకపోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గేట్‌ను క్రాస్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాడు. చూస్తుండగానే రైలు వ్యాన్‌ను ఢీకొంది. వ్యాను సమీపంలోని పొలంలో ఎగిరిపడింది. గాయపడ్డ చిన్నారులు, డ్రైవర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. రఘటనపై రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.20 వేల చొప్పున ప్రకటించారు. బిహార్‌లో 10 మంది మృతి ముజాఫర్పూర్: బిహార్‌లోని ముజాఫర్ఫూర్ జిల్లా జాఫా గ్రామం వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ఆటో ఢీకొని 10 మంది దుర్మరణం చెందారు. -
మృత్యు వాహనం
♦ బస్టాప్‌లో పాలిటెక్నిక్ విద్యార్థిని ఢీ కొట్టిన స్కూల్ వ్యాన్ ♦ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి.. నల్లకుంటలో ఘటన ♦ మృతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన సాయిప్రకాశ్గా గుర్తింపు హైదరాబాద్: బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని స్కూల్ వ్యాన్ రూపంలో మృత్యువు కబళిం చింది. నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం గొల్లపల్లికి చెందిన బూస సాయిప్రకాశ్(21) ఇబ్రహీం పట్నంలోని రాజమహేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ డిప్లమా మూడో సంవత్సరం చదువుతున్నాడు. దీంతో పాటు వీఎస్టీలో అప్రెంటీస్ చేస్తున్నారు. ఓయూలో ఎంసీజే చదువుతున్న సోదరుడు సతీశ్ హాస్టల్ రూమ్‌లో నాన్బోర్డర్గా ఉంటున్నాడు. శుక్రవారం వీఎస్టీకి వెళ్లేందు కు ఉదయం 6.35 గంటలకు లక్కీ కేఫ్ చౌరస్తాలోని బస్టాప్ వద్ద బస్సు కోసం సాయిప్రకాశ్ వేచి చూస్తున్నాడు. అదే సమయంలో ఓయూ నుంచి పాఠశాల విద్యార్థులను తీసుకుని వస్తున్న మెటాడోర్(ఏపీ 10టీ3022) వ్యాన్ అదుపు తప్పి సాయిప్రకాశ్‌ను బలంగా ఢీకొంది. దీంతో సాయిప్రకాశ్ తలకు బలమైన గాయా లై అక్కడికక్కడే మృతిచెందాడు. వ్యాన్ అదే వేగంతో దూసుకెళ్లి బస్టాప్ పక్కనే ఉన్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాం క్ వద్ద ఫుట్‌పాత్ పైకి ఎక్కి కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టింది. పెద్దగా శబ్దం రావడంతో అక్కడి ఏటీఎం వద్దనున్న సెక్యూరిటీ గార్డు నర్సింహా పరుగెత్తుకు వచ్చి వ్యాన్‌లో భయం తో ఏడుస్తున్న విద్యార్థులను బయటకు తీశాడు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. పోలీసు లు ప్రమాద స్థలానికి చేరుకుని సాయిప్రకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి పెదనాన్న కుమారుడు పి.నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన రామంతాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన మెటాడోర్ డ్రైవర్ బి.లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని సాయిప్రకాశ్ కుటుంబ సభ్యులకు అప్పగించారు. వాహనం బ్రేకు లు ఫెయిలై ప్రమాదం జరిగిందా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యానగర్ లో స్కూల్ వ్యాన్ బీభత్సం
హైదరాబాద్: నగరంలోని విద్యానగర్ లో ఓ స్కూల్ వ్యాను బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యానగర్ బస్టాండ్ సమీపంలో శుక్ర వారం ఉదయం బస్సు కోసం ఎదురు చూస్తున్న వారిపై వేగంగా వచ్చిన స్కూల్ బస్సు దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న సాయి ప్రకాశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. -
స్కూల్ వ్యాన్ ను ఢీకొన్న లారీ
ఆదోని టౌన్ (కర్నూల్ జిల్లా) : పాఠశాల నుంచి విద్యార్థులతో తిరిగొస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏడో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులతో పాటు టీచరు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఆదోని పట్టణ శివారు ప్రాంతం చెరగుట్ట క్రాస్‌రోడ్డులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆదోనిలోని కారుణ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాఠశాల అనంతరం టాటా మ్యాజిక్ వాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా చెరగుట్ట వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో టాటామ్యాజిక్ లోని విద్యార్థులు చందన, పూర్ణ, అక్షయ, ఉమా మహేష్, టీచర్ షమీంబీ, క్లీనర్ వెంకటేశ్ గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీకొన్న స్కూల్ వ్యాన్
- ఎనిమిది మందికి గాయాలు - ఒకరి పరిస్థితి విషమం మంతని: విద్యార్థులను స్కూల్‌కి తీసుకెళుతున్న వ్యాన్ చెట్టుకు ఢీకొనగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం రామకృష్ణాపురంలో జరిగింది. మేరి మీడియా పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులను టాటా ఏసీ వాహనంలో స్కూలుకి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో వ్యాన్ పట్టీలు విరిగిపోయాయి. దీంతో అదుపు తప్పిన వ్యాన్ చెట్టుకు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. అందులో పోలు నరేష్(9) అనే విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ అసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూలు వ్యాను ఢీకొని ఒకరి మృతి
నెల్లూరు: బస్సు కోసం నిలబడి ఉన్న వృద్ధురాలిని స్కూలు వ్యాను ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలం జువ్వలగుంటపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వరలక్ష్మమ్మ(60) బస్సు కోసం గ్రామ మలుపులో వేచి ఉండగా స్థానిక ప్రైవేట్ స్కూలు వ్యాను ఆమెను ఢీకొంది. ఈ ఘటనలో వరలక్ష్మమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. -
బడి పేరు పెట్టుకున్న వ్యాధి ‘స్కూల్ సోర్స్’!
మెడి క్షనరీ ఆ వ్యాధి పేరు ‘స్కూల్ సోర్స్’. అంటే బడికి వెళ్తే వచ్చే పుండ్లు అని అర్థం. కానీ ఇవి బడికి వెళ్లడం వల్ల రావు. స్కూల్‌కు వెళ్లే వయసు పిల్లల్లో ఎక్కువగా వచ్చే చర్మవ్యాధి కాబట్టి దీనికి ఆ పేరు. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. దీన్ని ఇంగ్లిష్‌లో ‘ఇంపెటిగో’ అంటారు. ఇది స్టెఫలోకోకస్ ఆరియస్ లేదా గ్రూప్ ఏ, బీ హీమోలైటిక్ స్టెఫలోకోకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అయితే ఇది పెద్దగా ప్రమాదకరం కాదు. (అయితే అప్పుడే పుట్టిన పిల్లల్లో ఇది ప్రమాదకరం). యాంటీబాక్టీరియల్ పూత మందులు, వ్యాధినిరోధకతను పెంచే మందులతో దీనికి చికిత్స చేస్తారు. -
స్కూల్ వ్యాన్ బోల్తా: విద్యార్థులకు గాయాలు
నెల్లూరు: నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో రహదారిపై బుధవారం స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. కొత్తపేట గ్రామస్తులు వెంటనే స్పందించి గాయపడ్డిన విద్యార్థులకు నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థుల్లో 15 మంది స్వల్పంగా.... మరో ఐదుగురు అధికంగా గాయపడ్డారని తెలిపారు. నందు అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అధిక వేగంతో వెళ్తున్న బస్సు... రహదారి వాలుగా ఉండటంతో ఒక్కసారిగా బస్సు పక్కనున్న పొలాల్లోకి దూసుకువెళ్లి... బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. -
రెండు స్కూలు వ్యాన్లకు నిప్పు
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన రెండు వ్యాన్లకు దుండగులు నిప్పంటించారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఓ వ్యాను పూర్తిగా దగ్ధం కాగా, మరో వ్యాన్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు. -
స్కూల్ వ్యాన్ బోల్తా
ఒక స్కూల్ వ్యాన్ బోల్తాపడటంతో పది మంది విద్యార్థులు గాయపడిన సంఘటన మర్రిపూడి మండలంలో శనివారం జరిగింది. చెంచిరెడ్డిపల్లి నుంచి 54 మంది విద్యార్థులతో బయలుదేరిన స్కూల్‌వ్యాన్ ఆర్కే పల్లి రోడ్డు నుంచి టంగుటూరు-పొదిలి ఆర్అండ్బీ రహదారి వద్ద మలుపు తిరుగుతుండగా బోల్తాపడింది. మర్రిపూడి : ఓ స్కూల్ వ్యాన్ బోల్తాపడటంతో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన అంకేపల్లి రోడ్ నుంచి టంగుటూరు-పొదిలి ఆర్అండ్బీ రహదారి వద్ద శనివారం జరిగింది. వివరాలు.. పొదిలికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ మండలంలోని చెంచిరెడ్డిపలి ్లనుంచి బయల్దేరి కూచిపూడి, అంకేపల్లి గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుని పొదిలి బయల్దేరింది. ఆ సమయంలో వ్యాన్‌లో సుమారు 54 మంది విద్యార్థులు ఉన్నారు. అంకేపల్లి రోడ్ నుంచి టంగుటూరు-పొదిలి ఆర్అండ్బీ రహదారి వద్ద మలుపు తిరుగుతుండగా వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేయకుండా డ్రైవర్ వీరారెడ్డి పరారయ్యాడు. విద్యార్థుల అరుపులు.. కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏడుపులు.. కేకలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వ్యాన్ అద్దాలు పగుగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. గాయపడిన పాలుగుండ్ల శ్రీజ, రామిరెడ్డి, బోదా మధు, యూ.సుదర్శ్‌న్‌రెడ్డి, దామిరెడ్డి సింహాద్రి, బాదం శైలజతో పాటు మరో ముగ్గురు విద్యార్థులను 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెన్నపూస సురేష్‌కు చెయ్యి గూడ జారింది. పాలుగుండ్ల శ్రీజ కాలుకు తీవ్రగాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. వ్యాన్ బోల్తాపడిన ప్రదేశంలో మైలురాయి అడ్డుపడటంతో ప్రాణాపాయం తప్పింది. పర్లంగ్ రాయిలేకుంటే వ్యాన్ మరో రెండుమూడు పల్టీలు కొట్టి లోతైన గుంతలో పడేదని, ప్రాణ నష్టం కూడా జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సై బీవీవీ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
పొద్దున్నే ఘోరం!
స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న లారీ చిన్నారులకు గాయాలు కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు తిరుచానూరు: విరిసీవిరియని ముద్దమందారాల్లాంటి చిన్నారులను నిద్ర లేపి, స్నానం చేయించి, మెరిసే యూనిఫాం వేసి, గో రు ముద్దలు తినిపించి, మధ్యాహ్నానికి క్యారేజీ ఇచ్చి, స్కూలు బ్యాగ్ చేత పట్టుకుని రోడ్డుదాకా వచ్చారు తల్లులు. స్కూ లు బస్సు రాగానే అందులోకి ఎక్కించి టాటా చెప్పారు. పాఠశాలలో చదువుకుంటున్న తమ చిన్నారుల బంగారు భ వితను తలచుకుంటూ ఇంటికొచ్చారు. ఇంట్లో అడుగు పెట్టీపెట్టకముందే టీవీ లో ‘స్కూలు వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముప్పై మందికి గాయాలు’ అంటూ స్క్రోలింగ్. దీనిని చూడగానే ఆ తల్లులు తల్లడిల్లిపోయారు. తమ బిడ్డలకేమైందో అంటూ ఆందోళన చెందారు. ఉరుకుల పరుగుల మీద యాక్సిడెంట్ జరిగిన స్థ లానికి చేరుకున్నారు. ఈ సంఘటన బు ధవారం తిరుచానూరు సమీపంలో జరి గింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూలు వ్యాన్‌ను తీసుకుని డ్రైవర్ ఎప్పటిలానే బుధవారం ఉదయం వెళ్లాడు. తిరుచానూరు చుట్టు పక్కల గ్రామాల్లోంచి 30 మంది విద్యార్థులను వ్యాన్‌లో ఎక్కించుకున్నాడు. స్కూలుకు వచ్చే క్రమంలో తనపల్లి క్రాస్ వద్ద జాతీయరహదారి లోకి వచ్చాడు. వ్యాన్ డ్రైవర్ ఏమరుపా టో, అప్పుడే వచ్చిన లారీ డ్రైవర్ వేగ మో, విద్యార్థుల దురదృష్టమో తెలియదుగానీ.. వ్యాన్‌ను లారీ ఢీకొంది. దీంతో ఒక్కసారిగా విద్యార్థుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. స్థానికులు స్పం దించారు. వ్యాన్ కిటికీల్లోంచి చిన్నారుల ను వెలుపలకు తీశారు. 108లో రుయా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే టీవీల్లో ఈ విషయం స్క్రోలింగ్ రావడం మొదలైంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆం దోళనగా అక్కడకు చేరుకున్నారు. పిల్లలు ఆస్పత్రిలో ఉన్నారనగానే మరిం త కంగారు పడ్డారు. కన్నీరు మున్నీరవు తూ అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు గాయాలతో ఉన్న బిడ్డలను చూసి భోరుమన్నారు. వారిని చూడగానే చిన్నారు లూ పెద్దపెట్టున ఏడుపు మొదలు పె ట్టారు. వీరిని సముదాయించడం నర్సులకు తలకు మించిన భారంగా మారిం ది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరి తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. తాము తినీ తినకా, కూలీ నాలి చేసుకుంటూ కూడబెట్టుకున్న డ బ్బుతో పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపుతుంటే మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ నిలదీశారు. ఆస్పత్రి లో బిక్కచూపులు చూస్తున్న, ఏడుస్తున్న చిన్నారులు.. వారిని ఆ స్థితిలో చూడలేక తల్లడిల్లే తల్లిదండ్రులు.. ఈ దృశ్యం ప్ర తి ఒక్కరినీ కలచి వేసింది. విషయం తెలిసి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పిల్లలకు సరైన చికిత్స అందించాలని ఆస్పత్రి వర్గాలను ఆదేశిం చారు. అక్కడే ఉన్న పాఠశాల చైర్మన్‌తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర మాదానికి కారణమైన వాహనాలు, డ్రైవర్లపైన కేసు నమోదు చేస్తామని తెలి పారు. -
చిన్నారిని చిదిమేసిన స్కూల్ వ్యాన్
చందుర్తి : స్కూల్ వ్యాన్‌డ్రైవర్ నిర్లక్ష్యం రెండేళ్ల చిన్నారి ప్రాణాలు బలిగొంది. అప్పటిదాకా అన్నతో కలిసి ఆడుకున్న చెల్లెలిని వ్యాన్ చిదిమేసింది. చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన తుప్పతి పల్లవి- పర్శరాములు శనివారం వ్యవసాయ పనులకు వెళ్లగా వారి కుమార్తె అశ్విత(2),కుమారుడు జశ్వంత్(4) ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటున్నారు. లింగంపేటకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ జోగాపూర్‌లో విద్యార్థులను దింపేందుకు వచ్చింది. డ్రైవర్ బొడపట్ల రాజేందర్ నిర్లక్ష్యంగా వ్యాన్ నడపడంతో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆశ్వితపైనుంచి వ్యాన్ దూసుకెళ్లింది. చిన్నారి తల చిట్లి అక్కడికక్కడే మృతిచెందింది. ఆగ్రహం చెందిన గ్రామస్తులు డ్రైవర్‌ను చితకబాదగా పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాము పనికి వెళ్లేప్పుడు ఆడుకుంటూ ఉన్న చిన్నారి తిరిగివచ్చే సరికి విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ప్రమాదం జరిగిన తీరు గ్రామస్తులను కలిచివేసింది. -
స్కూలు వ్యాను కిందపడి చిన్నారి మృతి
వేముల : మండలంలోని గొందిపల్లె గ్రామంలో శుక్రవారం సాయంత్రం చిన్నారి నందిని (3) స్కూలు వ్యాను కిందపడి మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని నాగభూషణం తన చిన్నారి నందిని మలవిసర్జన కోసం రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. చిన్నారికి కాపలాగా అక్కడే ఉన్నాడు. అదే సమయంలో వేంపల్లెకు చెందిన వివేకానంద స్కూలు వ్యాను పిల్లలను ఎక్కించుకొని గొందిపల్లెకు వచ్చింది. అక్కడ చిన్నారి తండ్రి ఉండటం డ్రైవర్ గమనించాడు. స్కూలు వ్యాను డ్రైవర్ పిల్లలను దించారు. అక్కడే తిప్పుకొని తిరిగి వెళుతున్న సమయంలో చిన్నారి తండ్రి లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లారని డ్రైవర్ బస్సును కదిలిచ్చారు. అయితే చిన్నారి తండ్రికి ఫోన్ రావడంతో రోడ్డు అటువైపు వెళ్లగా.. తండ్రి కోసం చిన్నారి కూడా వెళుతుండటం డ్రైవర్ గమనించలేదు. దీంతో స్కూలు బస్సు చిన్నారి తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి తండ్రి నాగభూషణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్రకుమార్ తెలిపారు. రోదించిన తల్లిదండ్రులు : స్కూలు బస్సు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమార్తె మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బస్సు చిన్నారి తలపై వెళ్లడంతో చూసేందుకు హృదయవిదారకంగా మారింది. ఈ సంఘటన తెలిసి గ్రామస్తులంతా అక్కడ చేరుకుని చిన్నారి మృతిని చూసి చలించిపోయారు. -
ప్రశాంత్, వరుణ్ పరిస్థితి విషమం: వైద్యులు
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట దుర్ఘటనలో గాయపడిన విద్యార్థులలో ప్రశాంత్, వరుణ్ గౌడ్ల పరిస్థితి విషమంగా ఉందని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై బుధవారం మధ్యాహ్నం వైద్యులు మాట్లాడుతూ... ఆ ఘటనలో గాయపడిన శరత్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దర్శన్‌గౌడ్, ఫాతిమా, నితూష పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులును డిశ్చార్జ్ చేసినట్లు వివరించారు. -
మసాయిపేట ఘటన: నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమం
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ఘటనలో గాయపడిన విద్యార్థుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆదివారం విద్యార్థుల ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వరుణ్ గౌడ్, వైష్ణవి, ప్రశాంతి, తరుణ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. మరో నలుగురు విద్యార్థులను ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచామన్నారు. ఎనిమిది విద్యార్థులను సాధారణ వార్డుకు తరలించినట్లు చెప్పారు. మరో నలుగురిని సాయంత్రంలోగా సాధారణ వార్డుకు తరలిస్తామన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
'తరుణ్, వైష్ణవి, ప్రశాంత్‌ల పరిస్థితి విషమం'
-
'తరుణ్, వైష్ణవి, ప్రశాంత్‌ల పరిస్థితి విషమం'
హైదరాబాద్: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైల్ ఢీ కొన్న ఘటనలో తరుణ్ గౌడ్, వైష్ణవి, ప్రశాంత్‌ల పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శరత్, శ్రావణి, శిరీసలను అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు. మరో ఎనిమిది మంది విద్యార్థులను సాయంత్రంలోపు జనరల్ వార్డుకు తరలిస్తామని చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు విద్యార్థుల ఆరోగ్యంపై మరో బులెటన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమం
-
అయిదుగురు విద్యార్థుల పరిస్థితి విషమం: వైద్యులు
హైదరాబాద్: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీ కొన్న ఘటనలో గాయపడిన విద్యార్థుల్లో అయిదుగురు పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యంపై శనివారం ఉదయం యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. మరో 15 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మరికాసేపట్లో వారందరిని జనరల్ వార్డుకు తరలిస్తామని చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
సర్కారు స్కూళ్లకు ప్రమాద ఘంటికలు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్:జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒకప్పుడు విద్యార్థులతో కిటకిటలాడినవన్నీ ప్రస్తుతం పిల్లలు లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నా వాటిలో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఏటా విద్యార్థుల నమోదు తిరోగమనంలో ఉంటోంది.పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఏటా ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ఉన్నత విద్యార్హతలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నా..ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు లేక వెలవెలబోతున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో కొన్ని చోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సమాన సంఖ్యలో ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 34 శాతం పడిపోయిన నమోదు: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు ఏటా పడిపోతోంది. 2012-13 విద్యా సంవత్సరం, 2013-14 విద్యా సంవత్సరాల్లో పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పరిశీలిస్తే వాస్తవం అవగతమవుతుంది. జిల్లాలో 2011-12 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు 4,78,746 మంది నమోదు కాగా, 2012-13 విద్యా సంవత్సరంలో 4,77,024 మంది చేరారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3,14,479 మంది మాత్రమే చేరారు. అంటే గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 1,62,545 మంది పిల్లలు తగ్గారు. జిల్లాలోని 56 మండలాల్లో కేవలం మూడు మండలాల్లో మాత్రమే ఈ ఏడాది విద్యార్థుల నమోదు స్వల్పంగా పెరగగా మిగిలిన 53 మండలాల్లో విద్యార్థుల నమోదు భారీగా పడిపోయింది. ఒంగోలు మండలంలో గత విద్యా సంవత్సరంలో 34,395 మంది విద్యార్థులు చేరగా ఈ సంవత్సరం కేవలం 7,900 మంది మాత్రమే చేరారు. చీరాల మండలంలో 13,062 మంది, గిద్దలూరులో 9,328 మంది, మార్కాపురంలో 8,206 మంది, ఇతర మండలాల్లో విద్యార్థులు వేలసంఖ్యలోనే తగ్గారు. బల్లికురవ మండలంలో 270 మంది, కొత్తపట్నంలో 236 మంది, కారంచేడులో 21 మంది విద్యార్థులు పెరిగారు. ప్రభుత్వ పాఠశాలలకు బలహీన వర్గాల విద్యార్థులు కూడా దూరమవుతున్నారు. గత విద్యాసంవత్సరంతో పోల్చుకుంటే వెనుకబడిన తరగతుల విద్యార్థులు 31 శాతం, గిరిజన విద్యార్థులు (ఎస్టీ) 24 శాతం, షెడ్యూల్డు కులాల విద్యార్థులు (ఎస్సీ) 20 శాతం మంది తగ్గారంటే ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట ఎంతగా దిగజారుతుందో తెలుస్తోంది. బీసీ విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో 1,77,775 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉండగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో వారి సంఖ్య 1,22,652కు పడిపోయింది. అంటే 55,123 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. ఎస్సీ విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో 1,34,225 మంది ఉండగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆ సంఖ్య 1,07,693కు పడిపోయింది. అంటే 26,532 మంది ఎస్సీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. ఎస్టీ విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో 27,911 మంది ఉండగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో 21,143 మంది మాత్రమే ఉన్నారు. అంటే 6768 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఏటా వందల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా ఆశించిన మేర ఫలితాలు సాధించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం గోచరిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం కలిగించి పిల్లల నమోదు పెంచి పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
యూపీలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రుచ్ జిల్లాలో నర్సరీ చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన పాఠశాల వ్యాన్ డ్రైవర్ అనిల్ కుమార్ బెరియను శుక్రవారం అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. స్కూల్ వ్యాన్ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. శుక్రవారం ఆ చిన్నారితోపాటు పలువురు విద్యార్థులను డ్రైవర్ వ్యాన్‌లో స్కూల్‌కు తీసుకువెళ్లాడు. అయితే విద్యార్థులందరిని స్కూల్ వద్ద దింపాడు. కానీ మూడేళ్ల చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. అనంతరం ఆ చిన్నారిని ఇంటి వద్ద దింపాడు. ఆ చిన్నారి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దాంతో ఆ కుటుంబ సభ్యులకు ఆగ్రహాంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గత అర్థరాత్రి నిందితుడిని పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితునిపై దాడికి ఆ చిన్నారి కుటుంబసభ్యులతోపాటు ఇరుగుపోరుగు వారి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అత్యాచారం జరిగిందని వైద్యులు దృవీకరించారు. -
స్కూల్ వ్యాన్ బోల్తా: విద్యార్థులకు స్వల్ప గాయాలు
తిమ్మాపూర్ మండలం అలగనూరు వద్ద గౌతమి స్కూల్ వ్యాన్ బుధవారం ఉదయం బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను వ్యాన్ నుంచి బయటకు తీశారు. అనంతరం వారిని ప్రాధమిక చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగమే ఆ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. ఆ ఘటనలో డ్రైవర్, క్లీనర్ కూడా స్వల్ప గాయాపడ్డారు. వారు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాన్ బోల్తా పడటంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దాంతో ట్రాఫిక్ పోలీసులు రంగప్రవేశం చేసి వ్యాన్‌ను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు.