స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి మృతి
తోటపల్లిగూడూరు : స్కూల్ వ్యాన్ కింద పడి చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం కృష్ణారెడ్డిపాళెంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. పేడూరు పంచాయతీ కృష్ణారెడ్డిపాళెంకు చెందిన కటకం రాజా, పావని దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరి ఏడాది వయసున్న ఆఖరి కుమారుడు ఈశ్వర్ ఇంట్లో నుంచి దోగాడుతూ రోడ్డుపైకి వచ్చాడు. శుక్రవారం తోటపల్లిగూడూరు ఇన్‌ఫాంట్ జీసస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు చెందిన వ్యాన్ గ్రామంలోకి వచ్చింది. పిల్లలను దింపి వెనుదిరుగుతున్న సమయంలో రోడ్డుమీదకు వచ్చిన చిన్నారిని గమనించకపోవడంతో వ్యాన్ చిన్నారిపై ఎక్కింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరి ఆడపిల్లల తర్వాత పుట్టిన మగబిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందంతో రాజా, పావని దుఃఖసాగరంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.