
చిన్నారిని చిదిమేసిన స్కూల్ వ్యాన్
చందుర్తి : స్కూల్ వ్యాన్‌డ్రైవర్ నిర్లక్ష్యం రెండేళ్ల చిన్నారి ప్రాణాలు బలిగొంది. అప్పటిదాకా అన్నతో కలిసి ఆడుకున్న చెల్లెలిని వ్యాన్ చిదిమేసింది. చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన తుప్పతి పల్లవి- పర్శరాములు శనివారం వ్యవసాయ పనులకు వెళ్లగా వారి కుమార్తె అశ్విత(2),కుమారుడు జశ్వంత్(4) ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటున్నారు. లింగంపేటకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ జోగాపూర్‌లో విద్యార్థులను దింపేందుకు వచ్చింది.
డ్రైవర్ బొడపట్ల రాజేందర్ నిర్లక్ష్యంగా వ్యాన్ నడపడంతో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆశ్వితపైనుంచి వ్యాన్ దూసుకెళ్లింది. చిన్నారి తల చిట్లి అక్కడికక్కడే మృతిచెందింది. ఆగ్రహం చెందిన గ్రామస్తులు డ్రైవర్‌ను చితకబాదగా పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాము పనికి వెళ్లేప్పుడు ఆడుకుంటూ ఉన్న చిన్నారి తిరిగివచ్చే సరికి విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ప్రమాదం జరిగిన తీరు గ్రామస్తులను కలిచివేసింది.