
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్ మంగళవారం ప్రమాదానికి గురైంది. 18 మంది విద్యార్థులతో వెళ్తున్న వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంతో కంగ్‌సాలి ప్రాంతంలో లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ఎనిమిది విద్యార్థులు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్నవిపత్తు నివారణ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టింది. ఘటనపై స్పందించిన స్థానిక పోలీసు అధికారి ఎనిమిది మంది విద్యార్థులు మరణించినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో మొత్తం 18మంది విద్యార్థులు ఉన్నారని, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.