బరితెగిస్తున్న ‘బడి డ్రైవర్లు’! | Hyderabad Traffic police Special Drive on School Autos | Sakshi
Sakshi News home page

బరితెగిస్తున్న ‘బడి డ్రైవర్లు’!

Published Mon, Feb 17 2020 7:18 AM | Last Updated on Mon, Feb 17 2020 7:18 AM

Hyderabad Traffic police Special Drive on School Autos - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఏటా స్కూల్‌ ఆటోలపై ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహించడం ఆనవాయితీ. సాధారణంగా జూన్, జూలై నెలల్లో ఈ తనిఖీలు జరుగుతూ ఉంటాయి. అయితే నగరంలో పాఠశాలలకు విద్యార్థుల్ని తరలించే ఆటోల డ్రైవర్లు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు గతవారం రెండు రోజుల పాటు వరుస తనిఖీలు చేపట్టాయి. ఫలితంగా రెండు రోజుల్లో 3221 కేసులు నమోదయ్యాయి. చిన్నారులను పాఠశాలలకు తరలించే ఆటోల భద్రత అంతంత మాత్రంగా ఉన్నట్లు ఈ తనిఖీల్లో బయటపడింది. ఫిట్‌నెస్‌ మాట అటుంచితే డ్రైవర్లకు కనీసం లైసెన్స్‌ లేనట్లు గుర్తించారు. అలాంటి 10 మంది డ్రైవర్లను ప్రత్యేక బృందాలు పట్టుకున్నాయి.  

ఉదయం..సాయంత్రం తనిఖీలు...
స్కూలు ఆటోడ్రైవర్లు ప్రధానంగా చేసే ఉల్లంఘన ఓవర్‌ లోడింగ్‌. అనివార్య కారణాల నేపథ్యంలో అత్యధికంగా పాఠశాలకు విద్యార్థులు ఆటోల్లోనే వస్తుంటారు. నిబంధనల ప్రకారం వీటిలో ఆరుగురు విద్యార్థుల్ని మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉన్నా... అనేక మంది ఆటోడ్రైవర్లు ఎనిమిది నుంచి పది మందిని తరలిస్తూ ఉంటారు. ఇది అత్యంత ప్రమాదహేతువు కావడంతో అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు బుధవారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. కేవలం ఓవర్‌ లోడింగ్‌గా పిలిచే ఎక్స్‌ట్రా స్కూల్‌ చిల్డ్రన్‌ ఉల్లంఘనపైనే కాకుండా ప్రతి ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకుగాను స్థానిక ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఆయా బృందాలు స్కూళ్లు తెరిచే, మూతపడే సమయాల్లోనే తనిఖీలు చేపడుతున్నాయి. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఆయా స్కూళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నాయి. 

ప్రధానంగా ఆరింటిపై దృష్టి...
ప్రత్యేక బృందాలు ప్రధానంగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ తదితర పత్రాలతో పాటు డ్రైవర్‌కు బ్రీత్‌ ఎనలైజ్‌ పరీక్ష చేయడం, ఓవర్‌ లోడింగ్, మైనర్‌ డ్రైవింగ్‌ అంశాలపై దృష్టి సారించాయి. వీటితో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక బృందాలు త్వరలో స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల్ని తరలించే వాహనాల డ్రైవర్లు, తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిబంధనలు, భద్రత అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. కొందరు తల్లిదండ్రులు తమ ద్విచక్ర వాహనాలపై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను స్కూళ్లకు తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పరిమితికి మించి చిన్నారులను తీసుకువచ్చే తల్లిదండ్రులకూ అవగాహన కల్పించనున్నారు.  

అన్నీ తనిఖీ చేసుకోండి...
భవిష్యత్‌లోనూ ఇలాంటి ప్రత్యేక డ్రైవ్స్‌ కొనసాగిస్తాం. బడి పిల్లల భద్రతలో తల్లిదండ్రులతో సహా అందరూ భాగస్వాములు  కావాలి. ఓవర్‌లోడింగ్‌ వాహనాల్లో  పిల్లల్ని పంపకూడదు. యాజమాన్యాలతో పాటు వీరు కూడా డ్రైవర్లు, వాహనం స్థితిగతులు, పత్రాలు తనిఖీ చేసుకోవాలి. ఈ తరహా వాహనాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటూ 9010203626తో పాటు ‘ట్రాఫిక్‌ లైవ్‌’ యాప్‌ను వినియోగించుకోవచ్చు. పాఠశాల యాజమాన్యాలు సైతం 2011 మార్చ్‌ 16న రవాణా శాఖ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలి.– అనిల్‌కుమార్, సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement