15 రోజుల పాటు 2 గంటలు స్టేషన్ డ్యూటీ చేయాలని జడ్జి తీర్పు
బంజారాహిల్స్: మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారకుడైన ఓ యువకుడితో పాటు ఆయన స్నేహితురాలికి న్యాయమూర్తి విభిన్నమైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వెస్ట్‌మారేడుపల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే తీగుళ్ల దయాసాయిరాజ్ (27), ఆయన స్నేహితురాలు గత నెల 27న ఫిలింనగర్ సమీపంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఓ విందులో మద్యం తాగారు. అర్ధరాత్రి 2.30 గంటలకు దయాసాయిరాజ్ తన బెంజ్ కారు (టీఎస్ 10ఎఫ్‌ఎఫ్ 9666)లో స్నేహితురాలిని పక్కన కూర్చోబెట్టుకుని మితిమీరిన వేగంతో వస్తున్నాడు.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్డునంబర్–45 వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డివైడర్‌తో పాటు విద్యుత్ స్తంభం ధ్వంసమయ్యాయి. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరిద్దరినీ గత నెల 28న న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరికి న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ప్రతిరోజూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి రిసెప్షన్‌లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఫిర్యాదుదారులకు, బాధితులకు నవ్వుతూ స్వాగతం పలకాలని తీర్పునిచ్చారు.
రిసెప్షన్‌లో కూర్చొనే రెండు గంటల పాటు ముఖానికి మాస్క్ కూడా ధరించవద్దని షరతు విధించారు. బెయిల్ మంజూరైన నాటి నుంచి 15 రోజుల పాటు రోజూ ఠాణాకు రావాలని, రిసెప్షన్‌లో కూర్చోవాలని, ఆ తర్వాత పోలీసుల సమక్షంలో హాజరైనట్లుగా సంతకం చేయాలని తీర్పునిచ్చారు. దీంతో దయాసాయిరాజ్‌తో పాటు ఆయన స్నేహితురాలు రోజూ ఠాణాకు వచ్చి రిసెప్షన్‌లో కూర్చుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment