ప్రశాంతంగా ప్రారంభమైన కొత్త ఏడాది
‘డిసెంబర్ 31’ బందోబస్తు విజయవంతం
తనిఖీల్లో చిక్కిన 2,646 మంది డ్రంక్ డ్రైవర్లు
పంజగుట్ట పరిధిలో చిక్కిన వ్యక్తికి 550 కౌంట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ... ఈ ‘ముగ్గురు పోలీసులు’ ఏర్పాటు చేసిన బందోబస్తు, విధించిన ఆంక్షలు ఫలితాలనిచ్చాయి. కొత్త సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జరిగాయి. మొత్తమ్మీద ఒక్క ప్రమాదం కూడా నమోదు కాకుండా జీరో యాక్సిడెంట్ నైట్‌గా చేయడంలో అధికారులు సఫలీకృతమయ్యారు. స్థానిక పోలీసులతో పాటు అదనపు బలగాలూ మంగళవారం రాత్రంతా విధుల్లోనే ఉన్నాయి.
నగరంలోని కీలక ప్రాంతాలతో పాటు ఇన్నర్/ఔటర్ రింగ్ రోడ్‌ల్లోనూ నిరంతరం ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. వేడుకలు నిర్వహించే, జరుపుకొనేవారు సైతం ఇతరులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. మద్యం తాగి వాహనాలు పడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం తదితర ఉల్లంఘనలపై ట్రాఫిక్ విభాగాల అధికారులు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించారు. మొత్తమ్మీద మూడు కమిషనరేట్లలోనూ కలిపి 2,646 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు.
కొన్నింటికి మినహాయింపు..
గతంలో జరిగిన ప్రమాదాలు, ఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసేశారు. ప్రత్యామ్నాయ మార్గం లేని కారణంగా బేగంపేట, డబీర్‌పురా వంటి కొన్ని ఫ్లైఓవర్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. పీవీ నరసింహారావు మార్గ్, ఎన్టీఆర్ మార్గ్‌లతో పాటు హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల వాహనాలను అనుమతించలేదు. పీవీ ఎక్స్‌ప్రెస్ వేలోనూ కొన్ని ఆంక్షలు కొనసాగాయి. కమిషనరేట్లలోని ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు వాహన చోదకుల వేగాన్ని నియంత్రించారు. పోలీసులు, ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా డిసెంబర్ 31 ప్రశాంతంగా పూర్తయింది. బుధవారం తెల్లవారుజాము 2 గంటల తర్వాత ఫ్లైఓవర్లు, 3 గంటలకు ట్యాంక్‌బండ్, 5 గంటలకు నెక్లెస్‌రోడ్, ఓఆర్‌ఆర్‌ల్లోకి సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించారు.
చుక్కేసి.. చిక్కేశారు!
పోలీసు విభాగం ఎన్ని సూచనలు చేసినా.. ఎంతగా హెచ్చరించినా.. మందుబాబులు మాత్రం మారలేదు. డిసెంబర్ 31 నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం తాగి అనేక మంది వాహనాలు నడిపేశారు. ఈ నేపథ్యంలో మూడు కమిషనరేట్లలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 2,646 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ కమిషరేట్ పరిధిలోనే 1,184 మంది చిక్కారు. సైబరాబాద్‌లో 839 మంది, రాచకొండలో 619 మంది పట్టుబడ్డారు. వీరిలో ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువ మంది ఉన్నారు. మంగళవారం రాత్రి 9 నుంచి బుధవారం తెల్లవారుజాము 5 గంటల వరకు ఈ చెకింగ్స్ నడిచాయి.
చిక్కిన మందుబాబుల నుంచి వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. వీరికి కుటుంబం సభ్యుడు లేదా సంరక్షకుడి సమక్షంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆపై వీరిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. 100 ఎంఎల్ రక్తంలో 30 ఎంజీ కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటే దాన్ని డ్రంక్ డ్రైవింగ్‌గా పరిగణిస్తారు. ఈ పరిమాణాన్నే సాంకేతికంగా బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) అంటారు. పంజగుట్ట ట్రాఫిక్ ఠాణా పరిధిలోని వెంగళ్‌రావునగర్ పార్క్ దగ్గర మంగళవారం రాత్రి 10.53కు చిక్కన ద్విచక్ర వాహన చోదకుడికి ఏకంగా ఈ కౌంట్ 550 వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment