అయిదుగురు విద్యార్థుల పరిస్థితి విషమం: వైద్యులు
హైదరాబాద్: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీ కొన్న ఘటనలో గాయపడిన విద్యార్థుల్లో అయిదుగురు పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యంపై శనివారం ఉదయం యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. మరో 15 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మరికాసేపట్లో వారందరిని జనరల్ వార్డుకు తరలిస్తామని చెప్పారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.