పంట కాల్వ కల్వర్టులో పడిపోయిన స్కూల్ వ్యాన్
మలాపూర్ : ఓ ప్రైవేట్ స్కూల్‌వ్యాన్ అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తాపడిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి శివారులో బుధవారం జరి గింది. ఈ ప్రమాదంలో టీచర్, క్లీనర్ సహా ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. హసన్‌పర్తితోపాటు కమలాపూర్‌లో హైటెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు.
ఈ విద్యాసంస్థకు చెందిన స్కూల్ వ్యాన్లలో హసన్‌పర్తితోపాటు కమలాపూర్‌లోని తమ పాఠశాలలకు విద్యార్థులను తరలిస్తుంటారు. బుధవారం కమలాపూర్ పాఠశాలకు విద్యార్థులను తరలించిన అనంతరం ఏపీ 36 టీఏ 1764 స్కూల్‌వ్యాన్‌ను హసన్‌పర్తికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో స్కూల్ వ్యాన్ కానిపర్తి శివారులోని ఓ పంట కాల్వ కల్వర్టు వద్దకు రాగానే ఎదురుగా ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ వస్తుండడంతో డ్రైవర్ వ్యాన్‌ను కొంతమేర రోడ్డుకు కిందికి దింపి వెళ్తూ ఎదురుగా వస్తున్న వాహనాలకు సైడ్ ఇచ్చాడు.
అక్కడ ఉన్న పంట కాల్వ కల్వర్టు వద్ద ఇరువైపులా రోడ్డు కోతకు గురై రోడ్డు కుదించుకుపోయి ఉండడాన్ని డ్రైవర్ గమనించకపోవడంతో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. కాల్వ పక్కనే ఉన్న ఓ చెట్టు ఆసరాతో వ్యాన్ పూర్తిగా పడిపోకుండా ఓ పక్కకు పూర్తిగా ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న క్లీనర్ కొడారి శ్రీకాంత్, హసన్‌పర్తి పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న పాఠశాల నిర్వాహకుల సోదరి, మండలంలోని గూడూరుకు చెందిన బింధు, కవలలైన ఆమె కుమారులు అయ్యప్ప, మణికంఠకు స్వల్ప గాయాలయ్యాయి.
కాగా డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా చెట్టు ఆసరాతో వ్యాన్ పూర్తిగా పల్టీ కొట్టకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. సమాచారం అందుకున్న ఎస్సై సూర్యప్రకాష్, తహసీల్దార్ సత్యనారాయణ యాదవ్, ఎంఈఓ రాంకిషన్‌రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
ప్రమాదకరంగా పంట కాల్వ కల్వర్టు..
కమలాపూర్-హన్మకొండ మార్గంలో కానిపర్తి శివారులో ఉన్న పంట కాల్వ ప్రమాదకరంగా మారింది. రోడ్డు నిర్మాణ సమయంలో అక్కడ కల్వర్టు నిర్మించకుండా వదిలేయడంతో రోడ్డు కోతకు గురవుతూ కుచించుకుపోతోంది. ఇప్పటికే అక్కడ ఒక ధాన్యం ట్రాక్టర్‌తోపాటు పలు వాహనాలు పడిపోయి పలువురు గాయపడ్డారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
వ్యాన్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు..
కానిపర్తి శివారులో బోల్తాపడ్డ వ్యాన్ ఫిట్‌నెస్‌పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాన్ ఫిట్‌నెస్ లేకపోవడంతోపాటు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే డ్రైవర్‌కు అక్కడ రోడ్డు కోతకు గురైన కల్వర్టు ఉందనే విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యాన్ తోలడంతోనే ప్రమాదం జరిగిందని, కొన్ని స్కూల్ వ్యాన్లలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ఫిట్‌నెస్ లేని స్కూల్ వ్యాన్లను సీజ్ చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment