Warangal Crime News
-
నకిలీ గడ్డి మందుల ముఠా అరెస్ట్
సాక్షి, వరంగల్: నకిలి విత్తనాలతో పాటు గడువు తీరిన పురుగుల మందులను విక్రస్తున్న ముఠా గుట్టును వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నకిలీ విత్తనాలు, మందులతో పాటు నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మూడు ముఠాలకు చెందిన 13మందిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అలాగే ఇద్దరు ఫర్టిలైజర్ షాప్ యాజమానులపై కూడా కేసు నమోదయ్యింది. ఈ దాడిలో నిందితుల నుంచి 75 లక్షల విలువైన నకిలీ, గుడువు తీరిన పురుగుల మందు, నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మందుల తయారీకి అవసరమైన రసాయనాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీ బాటిల్స్, ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టుబడ్డ మందుల్లో 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, 30 లక్షల రూపాయల విలువ గల నకిలీ పురుగు మందులు, 3 లక్షల 53వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందు ఉన్నట్లు సిపి రంగనాథ్ తెలిపారు. గడువు తీరిన మందులు సైతం విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో నిఘా పెట్టగా ముఠాల గుట్టురట్టయిందని, కల్తీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీరియస్ యాక్షన్ చేపట్టామన్నారు. కల్తీలతో మోసానికి పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తామని పేర్కొన్నారు. మందులు కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని సిపి రంగనాథ్ రైతులకు సూచించారు. -
భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన భర్త
సాక్షి, ఏటూరునాగారం: కట్టుకున్న భర్త భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన సంఘటన మండల కేంద్రంలోని తీగలవాయి ప్రాంతంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. ఏటూరునాగారం మండలకేంద్రంలోని తీగలవాయి ప్రాంతానికి చెందిన గునిగంటి ప్రవీణ్‌కుమార్‌తో ఇదే మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ హనుమాన్ నగర్‌కు చెందిన గొసు్కల జ్యోతి, నర్సయ్య కుమార్తె శిరీషతో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. స్థానికంగా ఇద్దరూ నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది బాబు కూడా ఉన్నాడు. అనాథగా మారిన బాలుడు బుధవారం భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో భర్త ప్రవీణ్‌కుమార్ భార్య శిరీషపై పెట్రోల్ పోసి నిప్పంటించగా మంటలు వ్యాప్తి చెంది శిరీష ఒల్లు కాలిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిరీషను భర్త ప్రవీణ్ ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు భర్త ప్రవీణ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. భార్య మృతదేహాన్ని వదిలేసి పారిపోయి తన నివాసానికి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ కృష్ణయ్య నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తల్లి మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో బాలుడు ఉన్నాడు. -
స్టేషన్ ఎదుట కలకలం.. రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, వరంగల్: భూ వివాదంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం చోటుచేసుకుంది. ఆయన పరిస్థితి ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటన కలకలం రేపింది. కమలాపూర్ పోలీసుస్టేషన్ ఎదుట 20 రోజుల్లో ఇది రెండో ఆత్మహత్యాయత్నం ఘటన కావడం గమనార్హం. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం మర్రిపల్లికి చెందిన కుందూరు సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి కుటుంబీకులు సుమారు 50 ఏళ్ల కిందట తమ మేనమామ పింగిళి శ్రీరాంరెడ్డి నుంచి 11 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందులో 1.17 ఎకరాల భూమిని చందుపట్ల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ భర్త చందుపట్ల సరోత్తంరెడ్డి అండతో వీరి మేనత్త పింగిళి శ్రీమతిదేవి ఆక్రమించుకుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీమతిదేవి ఆ భూమిలో వరి నాట్లు వేయగా శ్రీనివాస్‌రెడ్డి అడ్డుకున్నాడు. దీనిపై కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 24వ తేదీన కేసు నమోదైంది. ఆ భూమిలోకి ఎవరూ వెళ్లవద్దని పోలీసులు ఆదేశించారు. అయితే బుధవారం శ్రీమతిదేవి సంబంధీకులు వెళ్లడంతో సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అడ్డుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవద్దని, రెవెన్యూ అధికారులు లేదా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డిని ఎస్ఐ పరమేశ్ బెదిరింపులకు గురి చేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసుల నుంచి తనకు న్యాయం జరగడం లేదనే శ్రీనివాస్ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి పోలీస్‌స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన ఎస్ఐ జె.పరమేశ్ వెంటనే శ్రీనివాస్‌రెడ్డిని కమలాపూర్ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డి కోలుకుంటున్నాడని, ఆయన ఆత్మహత్యాయత్నానికి పోలీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా ఇలాంటి సంఘటన కమలాపూర్ పోలీసుస్టేషన్ ఎదుట 20 రోజుల్లో ఇది రెండోది. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియుడిపై కేసు
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండల పరిధి నల్లగుంట గ్రామ శివారు దేవాదుల పైపులైను సమీపాన ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నల్లగుంటకు చెందిన ధరంసోతు రాజేష్, భూపాలపల్లి జిల్లా మంజూర్‌నగర్‌కు చెందిన ఓ యువతి(16) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇంట్లో తెలియడంతో తల్లితో పాటు బంధువులు యువతిని ప్రశ్నించినట్లు తెలిసింది. పెళ్లికి నిరాకరిస్తారనే భయంతో సదరు యువతి గురువారం రాత్రి 8 గంటల సమయంలో నల్లగుంటకు వచ్చి రాజేష్‌తో కలిసి గ్రామసమీపాన ఉన్న దేవాదుల పైపులైన్ వద్దకు చేరుకుని పురుగుల మందు తాగారు. అపస్మారకస్థితిలో ఉన్న రాజేష్ తెల్లవారుజామున స్నేహితులకు ఫోన్ చేయగా.. వారిద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రేమికులిద్దరిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజేష్‌ను మల్లంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి, యువతిని వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువతి మైనర్‌గా పోలీసులు పేర్కొంటున్నారు. రాజేష్‌పై కేసు నమోదు తమ కూతురు గురువారం రాత్రి 7 గంటలకు కిరాణా సామగ్రి తీసుకురావడానికి వెళ్లి తిరిగిరాలేదని యువతి తల్లి శుక్రవారం ఉదయం భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దూరపు బంధువైన ధరంసోతు రాజేష్‌పై అనుమానం ఉందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్ తెలిపారు. -
దారి గొడవలో గాయపడ్డ మహిళలు.. పరిస్థితి విషమం
సాక్షి, వరంగల్: అర్బన్ జిల్లాలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన దారి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గొడవలో ప్రశ్నించిన ఒక కుటుంబానికి చెందిన మహిళలపై కర్రలతో చితకబాదిన దారుణ ఘటన ఖిల్లా వరంగల్ వసంతపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. తీవ్రగాయలైన వారిని హాస్పిటల్‌కు తరలిచించారు. ప్రస్తుం వారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... దారి విషయంలో గుండెకారి బాబు, గుండెకారి జగదీష్ అనే అన్నదమ్ముల కుటుంబాలు గత కొద్దికాలం నుంచి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య మాట మాట పెరగడంతో జగదీష్ కుటుంబ సభ్యులు కర్రలతో దాడికి దిగారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా పశువులను కొట్టినట్లు కర్రలతో చితక బాదారు. ఈ దాడిలో బాబు భార్యతో పాటు, అడ్డుకున్న మరో మహిళ తలకు కూడా తీవ్ర గాయలయ్యాయి. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించారు. తలకు గట్టి గాయాలు కావడంతో వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు పెర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గీసు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదుగురు స్నేహితులను కబళించిన ప్రమాదం
అందరూ మంచి స్నేహితులు.. అందులో ఓ మిత్రుడి సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఆనందంగా కార్యక్రమం ముగించుకున్నాక ఒక మిత్రుడిని స్వస్థలంలో దింపడానికి కారులో బయలుదేరారు. అప్పుడే తెల్లవారుతోంది. మసక మసక చీకటికి తోడు నిద్ర ఆవహించే సమయమది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు. కనులు తెరుస్తూ మూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు వాహనదారులు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ కారును ఢీకొనడంతో భారీ శబ్దం. తేరుకునేలోపే అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు విగతజీవులుగా మారారు. సాక్షి, దామెర(వరంగల్) : మిత్రుడి సోదరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన స్నేహితులను మృత్యురూపంలో వచ్చిన ఇసుక లారీ పొట్టన పెట్టుకుంది. గమ్యం చేరకముందే కారులో అందరూ విగతజీవులుగా మారారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ అర్బన్ జిల్లా పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాష్(23), పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేష్(23), హసన్పర్తికి చెందిన గజవెల్లి రోహిత్(20), ములుగుకు చెందిన కొండబోయిన నరేష్(23), వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్ షాబీర్(19) మృత్యువాత పడ్డారు. మృతుల్లో అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. వివరాలు.. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గజవెల్లి రోహిత్(20), కండె జయప్రకాష్(23), షేక్ సాబీర్(19), మేకల రాకేష్(23) వీరంతా నగరంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తుండగా కొండవేన నరేష్(23) మాత్రం ములుగుకు చెందిన వాడు. జయప్రకాష్ నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతుండా మిగతావారంతా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మేకల రాకేష్ బంధువైన మేకల ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకల కోసం మంగళవారం అర్ధరాత్రి అందరూ కలుసుకుని కేక్ కట్ చేసిన అనంతరం విందు చేసుకున్నారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున నరేష్‌ను ములుగులో దింపడానికి కారులో బయలు దేరారు. ఈ క్రమంలో దామెర మండలంలోని పసరగొండ క్రాస్ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీ కొట్టింది. కారు నుజ్జునుజ్జు కావడమే కాకుండా అందులోని వారంతా విగతజీవులుగా మారారు. విషయం తెలియగానే సంఘటనా స్థలాన్ని పరకాల ఏసీపీ శ్రీనివాస్, ఆత్మకూరు, శాయంపేట సీఐలు వెంకటేశ్వర్రావు, రంజిత్ కుమార్, ఎస్సై భాస్కర్ రెడ్డి, రాజబాబులు చేరుకొని కారులో ఇరుక్కుపోయిన మృత దేహాలను బయటికి తీసి మార్చురీకి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మేకల చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిన్నంటిన బంధువుల రోదనలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు కుటుంబాల సభ్యుల రోదలను మిన్నుముట్టాయి. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించగా బంధువులు పెద్ద ఎత్తున మార్చూరీకి చేరుకున్నారు. చేతికొచ్చిన చెట్టంత కొడుకులను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, వారి స్నేహితుల బోరున విలపించారు. బైక్ పెట్టి కారు అద్దె..? జయప్రకాష్ అలియాస్ చందు తన బైక్‌ను హన్మకొండలోని హనుమాన్‌నగర్‌లో ఓ వడ్డీ వ్యాపారి వద్ద తనకా పెట్టి ఆ డబ్బుతో కారును అద్దెకు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే బైక్ రైడర్‌గా పేరున్న జయప్రకాష్ ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడని సమాచారం. ప్రైవేట్ కంపెనీలో.. మేకల రాకేష్... వరంగల్ : వరంగల్ పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల చంద్రమౌళి, స్వరూప దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు రాకేష్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం మహేశ్వరీని ప్రేమించి పెళ్లి చేసుకోగా రెండు నెలల క్రితం పాప జన్మించింది. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో కుటుంబం సభ్యులు విలపిస్తున్నారు. బేకరీలో పనిచేస్తూ.. షేక్‌సాబీర్.. నర్సంపేట రూరల్ : వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన షేక్ యాకూబ్– నూర్జాన్ దంపతుల కుమారుడు సాబీర్(19). చిన్నతనంలో తండ్రి యాకూబ్ మృతిచెందాడు. సాబీర్ కొంతకాలంగా వరంగల్ పోచమ్మమైదాన్‌లోని ఒక బేకరీలో పనిచేస్తూ ఆటోనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. సాబీర్ తల్లి ఖానాపూర్ బీసీ హాస్టల్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విలిపస్తున్నారు. బైక్ రైడింగ్‌లో ఫేమస్..జయప్రకాష్ హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన మేడి జయప్రకాష్(23) అలియాస్ చందు కమ్యూనిస్టు నాయకుడిగా పేరున్న నర్సయ్యకు ఒక్కేఒక్క కుమారుడు. దీంతో తల్లిదండ్రులు చిన్న నాటి నుంచి గారాబంగా పెంచారు. పాఠశాల విద్యతోనే చదువు మానేసిన జయప్రకాష్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. బైక్ రైడింగ్‌లో ఫేమస్ అయిన ఇతడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభిమాని. అయితే ఈనెల 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో మంగళవారం కాళేశ్వరానికి వెళ్లి అక్కడి నుంచి బొగత జలపాతం చేరుకుని పుట్టిన రోజు వేడుకుల జరుపుకున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. క్యాటరింగ్, డెకరేషన్ : రోహిత్ నయీంనగర్ : హన్మకొండ నయీంనగర్ లష్కర్ సింగారానికి చెందిన గజవల్లి రోహిత్(20) అలియాస్ కెన్ని స్వస్థలం హసన్‌పర్తి మండలం వంగపాడు గ్రామం. రోహిత్ తాత గజవల్లి శంభులింగం చిందు నాటకాలు చేసే వారు. రోహిత్ తండ్రి గజవల్లి యాదగిరి ఎల్లాపూర్‌లో పాస్టర్‌గా పని చేస్తున్నారు. ఏళ్ల క్రితమే శంభులింగం తన కుమారులతో హనుమకొండ లష్కర్ సింగారానికి వచ్చి నివసిస్తున్నారు. రోహిత్ పదో తరగతి మధ్యలోనే మానేసి క్యాటరింగ్, డెకరేషన్ పనులు చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచయమైన వారితో కలసి వెళ్లి మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. కొండవేన నరేష్.. ములుగు రూరల్: ములుగుకు చెందిన కొండవేన సరోజన–సాంబయ్య దంపతుల కుమారుడు నరేష్. అతడి తండ్రి 20 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. నరేష్ కొంతకాలం హైదరాబాద్‌లో పని చేసుకుంటూ జీవనం కొనసాగించి.. కొంత కాలంగా ములుగులో ఉంటున్నాడు. ప్రాణాలు దక్కించుకున్న ప్రవీణ్ మేకల ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న అనంతరం ప్రవీణ్ కూడా కారులో వెళ్లాల్సి ఉంది. అయితే కారులో ఐదుగురే కూర్చునే వీలుండడంతో ప్రవీణ్ ఇంటి వద్దే ఉండిపోయాడు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి వరకు తనతో ఆనందంగా ఉన్న మిత్రులందరూ ఒక్కసారిగా విగత జీవులుగా మారడంతో ప్రవీణ్ బోరున విలపించాడు. అతి వేగం కూడా కారణమే.. కారు అతి వేగం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు చెపుతున్నారు. కారులో ఉన్న వారు సీట్ బెల్టులు పెట్టుకొని ప్రయాణిస్తున్నా బెలూన్లు తెరుచుకుని అవి పూర్తిగా పగిలి పోయాయని తెలిపారు. కారు వేగంగా వెళ్లకుంటే ప్రాణాలు దక్కేవని పేర్కొంటున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ పసరగొండ క్రాస్ వద్ద బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇన్చార్జి డీసీపీ వెంకటలక్ష్మి మధ్యాహ్నం పరిశీలించారు. ఘటన జరగడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె వెంట ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట్, ఆత్మకూర్ సీఐలు వెంకటేశ్వర్ రావు, రంజిత్ కుమార్, ఎస్సైలు భాస్కర్‌రెడ్డి, రాజబాబు ఉన్నారు. -
కన్నతల్లినే కడతేర్చాడు...
దుగ్గొండి : నవమాసాలు మోసింది.. తాను పునర్జన్మ పొందుతూ కుమారుడికి జన్మనిచ్చింది. పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చింది.. చనిపోయాక తలకొరివిపెట్టి పున్నామ నరకం నుండి విముక్తి కల్పిస్తాడనుకుంటే ఆ కొడుకే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కర్రతో మోది కడతేర్చడంతో పాటు శవాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పరారయ్యాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం శివాజినగర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళితే... మండలంలోని శివాజినగర్ గ్రామానికి చెందిన కుసుంబ కమలాబాయి(65) భర్త కుసుంబ లింగయ్య 30 ఏళ్ల క్రితమే మరో వివాహం చేసుకుని హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. అప్పటినుండి కమలాబాయి తన కుమారుడు కుసుంబ రాజేందర్, కూతుళ్లు సుకినె రజిత(మాజీ జడ్పీటీసీ) మరో కూతురు రజినిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు జరిపించింది. ప్రస్తుతం ఆమె కుమారుడితోనే కలిసి ఉంటుండగా, కమలాబాయితో ఆమె కుమారుడు రాజేందర్ తరచూ డబ్బుల విషయంలో గొడవ పడేవాడు. ‘నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి.. ఎవరికి ఇచ్చావు. తీసుకురాపో.. గ్రామంలో నీ పేరిట ఉన్న గుంట ఇంటి స్థలాన్ని అమ్మి నాకు ఇవ్వు.. నెలనెలా పించన్ డబ్బులు నాకే ఇవ్వాలి’ అని గొడవ పడుతుండేవాడు. ఇదే క్రమంలో సోమవారం రాజేందర్ భార్య రాజేంద్ర పొలం పనులకు వెళ్లగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రాజేందర్ తన తల్లి కమలాబాయితో గొడవ పడ్డాడు. ఇదేక్రమంలో మాటమాట పెరగగా కర్రతో కొట్టి చంపాడు. అనంతరం తనకేం తెలియదన్నట్లు ఇంటికి తాళం వేసి తన ద్విచక్రవాహనంపై పారిపోయాడు. ఇది ఇంటికి ఎదురుగా ఉన్న ఓ చిన్నారి గమనించి కమలాబాయి కూతురు సుకినె రజితకు వివరించింది. దీంతో రజిత పరుగు పరుగున వచ్చి కిటికీలోంచి చూడగా తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉంది. విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రె డ్డి శివాజీనగర్ చేరుకుని వివరాలు ఆరా తీ శారు. ఏసీపీ ఫణీందర్, సీఐ సతీష్‌బాబు, ఎ స్సై రవికిరణ్ చేరుకుని కుమార్తె రజిత ఇచ్చి న ఫిర్యాదు మేరకు కుసుంబ రాజేందర్– రా జేంద్ర దంపతులపై కేసు నమోదు చేశారు. -
భర్తకు బీమా చేసి హత్య చేసిన భార్య
కాజీపేట అర్బన్: మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసిగి వేసారిన భార్య అతడిని హత్య చేయాలని నిర్ణయించింది. అయితే.. కుటుంబ పెద్దను హత్య చేస్తే తర్వాత తమ పరిస్థితి ఏమిటని ఆలోచించిన ఆమె.. రూ.20 లక్షలకు బీమా చేయించి మరీ ఘాతుకానికి పాల్పడింది. ఈ హత్యకు భర్త సోదరి, బావ సహకారం కూడా తీసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హన్మకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి ఈ కేసు వివరాలన మీడియాకు వెల్లడించారు. పర్వతగిరి మండలం హత్యా తండాకు చెందిన బాదావత్ వీరన్న భార్య యాకమ్మతో కలసి పున్నేలు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దోబీగా పనిచేసేవాడు. లాక్‌డౌన్‌తో పాఠశాలను మూసివేయగా ఖాళీ మద్యం సీసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. (ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఎస్సై ) మద్యానికి బానిసైన వీరన్న భార్యను వేధించడం.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. భార్య పలుమార్లు హెచ్చరించినా మార్పు రాలేదు. దీంతో యాకమ్మ భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ఇందుకు చెన్నారావుపేటలో నివాసం ఉండే వీరన్న సోదరి భూక్యా బుజ్జి, బావ భూక్యా బిచ్చాల సహకారం కోరింది. వారు అంగీకరించడంతో అందరూ కలసి హత్యకు పథక రచన చేశారు. తొలుత గ్రామంలోని గ్రామీణ బ్యాంకులో రూ.20 లక్షలకు వీరన్న పేరిట బీమా చేయించారు. తర్వాత ఈనెల 19వ తేదీన నెక్కొండ ప్రాంతంలో సైకిల్‌పై ఖాళీ మద్యం సీసాలను విక్రయించేందుకు వీరన్న వెళ్లగా.. ఆ సమాచారాన్ని భూక్యా బిచ్చాకు అందజేసింది. నెక్కొండలో సాయంత్రం వీరన్నను కలసిన బిచ్చా.. తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని హత్యాతండాకు బయలుదేరాడు. మార్గమధ్యలో మద్యం తాగి తమ వ్యవసాయ భూమి వద్దకు రాత్రి 11.45 గంటలకు తీసుకెళ్లగా.. అప్పటికే భార్య యాకమ్మ, సోదరి బుజ్జి ఉన్నారు. అందరూ కలసి వీరన్నకు తాడుతో ఉరి వేసి హత్య చేశారు. బతికి ఉన్నాడన్న అనుమానంతో ముఖంపై బండరాయితో కొట్టి పక్కనే ఉన్న కెనాల్లో పడేశారు. అనంతరం బిచ్చా, బుజ్జి తమ స్వగ్రామానికి వెళ్లిపోగా.. యాకమ్మ తన భర్తను ఎవరో హత్య చేశారని నటించడం మొదలు పెట్టింది. దీంతో పర్వతగిరి ఇన్స్పెక్టర్ పి.కిషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా.. అయితే, సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా అనుమానం రావడంతో పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ హత్య తామే చేశామని వారు అంగీకరించారు. దీంతో నిందితులు యాకమ్మ, బిచ్చా, బుజ్జిలను అరెస్టు చేశారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన మామూనూర్ ఏసీపీ శ్యాంసుందర్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ పి.కిషన్, ఎస్సైలు ప్రశాంత బాబు, నర్సింగరావు, సురేష్‌తో పాటు, కానిస్టేబుళ్లను సీపీ రవీందర్ అభినందించారు. -
వరంగల్‌లో విషాదం.. రిజర్వాయర్‌లో పడి..
సాక్షి, వరంగల్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బీమారంలో ఉన్న పుట్టలమ్మ రిజర్వాయర్‌లో పడి గురువారం ముగ్గురు బాలురు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. బీమారానికి చెందిన దొడ్డిపాటి మనివిత్ (11), దొడ్డిపాటి మహేష్ బాబు(14), మ్యూనికుంట్ల విష్ణు తేజ (14) ఈ ముగ్గురు బాలురు సైకిల్‌పై వెళ్లి పుట్టలమ్మ రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి పిల్లలు గల్లంతు కావటంతో స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లని దింపి గాలింపు చర్యలు చేపట్టారు. (ఆయన గొంతు విన్నాక.. కన్నీళ్లు ఆగలేదు! ) సమాచారం అందుకున్న కేయూసీ పోలీసులు హుటాముటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు మృతదేహాలను వెలికి తీయగా.. వారిని మనివిత్, మహేష్ బాబుగా గుర్తించారు. మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. ఇక ఈ దుర్ఘటనతో బాధితుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బిడ్డల కోసం తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. (తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..) -
రఫికా కూతురుపైనా ఆత్యాచారం..?
సాక్షి ప్రతినిధి, వరంగల్: గొర్రెకుంట హత్యల ఘటన నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్‌పై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు వరంగల్ పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. రఫీకా కూతురు(15)పైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు వీరు ఆధారాలు సేకరించారు. దీంతో సంజయ్‌పై పోక్సో చట్టం కూడా ప్రయోగించే అవకాశం ఉంది. 9 మంది హత్య కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ అంతకు ముందు మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫికను రైలు నుంచి నిడదవోలు వద్ద కిందకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెకు కూతురు సిర్దాస్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్ ఉన్నారు. మహ్మద్ మక్సూద్ ఆలం కుటుంబసభ్యులు మృతి చెందడం.. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన రఫిక పిల్లలు ముగ్గురికి దిక్కెవరు? అన్న చర్చ జరుగుతోంది. అయితే రఫిక అలియాస్ చోటీ భర్త ఏమయ్యాడు? అసలు ఆయన ఉన్నాడా? లేడా? ఆయనను కూడా సంజయ్‌కుమార్ యాదవ్ ఏమైనా చేసి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఖైదీ నంబర్ 4414) -
సంజయ్ మొబైల్ సెర్చ్ హిస్టరీ అంతా అవే!
సాక్షి, వరంగల్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది మంది హత్య కేసుతో కదిలివచ్చిన పోలీస్ వాహనాలు, పలు విభాగాల అధికారుల హడావిడితో అట్టుడికిన గొర్రెకుంట ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని బార్దాన్ గోదాంలో పని చేసే వలస కూలీలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 9 మంది బావిలో శవాలై తేలిన కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును త్వరగా ఛేదించడానికి ఆరు పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సై స్థాయి నుంచి ఐపీఎస్‌ల వరకు పోలీస్ అధికారులు, హైదరాబాద్ నుంచి సిటీ క్లూస్ టీం, టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీ కోర్, సీసీఎస్, ఎస్బీ, ఇంటలిజెన్స్ విభాగం... ఇలా పోలీస్ శాఖలోని దాదాపు అన్ని ముఖ్య విభాగాలు పని చేశాయి. బావిలో మృత దేహాలు తేలిన ఈనెల 21 నుంచి 24 వరకు గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతం పోలీస్ వాహనాల రాకపోకలతో బిజీగా మారింది. తొమ్మిది మందిని ఎవరు హత్య చేసి ఉంటారా అనే అంశంపై ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురు చూశారు. 6 ప్రత్యేక బృందాలు కేవలం 72 గంటల్లోనే హంతకుడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ( మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం) ఓకే గూగుల్‌ను ఫుల్‌గా వాడేశాడు.. ఈ కేసులో నిందితుడు సంజయ్ కుమార్ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. 10 మందిని చంపిన అతడిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. సంజయ్ 3వ తరగతి వరకు చదువుకున్నా గతంలో ఢిల్లీలోని ఓ సెల్‌ఫోన్ షాపులో పని చేసిన అనుభవంతో ఇంటర్ నెట్ ఉపయోగించడంలో దిట్ట. తనకున్న పరిజ్ఞానాన్ని నేరాలు చేయడం, తర్వాత తప్పించుకోవడం ఎలా అన్న విషయాలకే ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ టూల్లోని 'ఓకే.. గూగుల్' ఆప్షన్ ద్వారానే నేరాలకు అవసరమైన సమాచారాన్ని పొందాడు. ఓకే గూగుల్.. అంటూ ఎక్కువ కాలం మత్తునిచ్చే టాబ్లెట్ల పేరు ఏవని తెలుసుకుని తన ప్రణాళికను విజయవంతంగా అమలు చేశాడు. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో పోలీసులు అతడి సెల్‌ఫోన్‌తో పాటు మృతుల సెల్ఫోన్ల కాల్ డేటా ఆధారంగా హంతకుడిని త్వరగా గుర్తించారు. అంతే కాకుండా హంతకుడు తన సెల్‌ఫోన్ ద్వారా యూట్యూబ్, గూగుల్ సెర్చ్ ద్వారా ఏఏ విషయాలను పరిశీలించాడనేవి పోలీసులకు క్లూస్‌గా మారాయి. ( ఖైదీ నంబర్ 4414 ) నిందితుడి వద్దనుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు అతడు వరంగల్‌లోని ఒక మెడికల్ షాపులో ఎక్కువ ధర చెల్లించి కొన్ని మాత్రలు కొనుగోలు చేసినట్టు సమాచారం. మత్తు కోసం చాలా మంది వ్యసనపరులు ఇలాంటి మందులను దొంగచాటుగా కొనుగోలు చేస్తుంటారు. సంజయ్ ఇదే కోవకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇక సంజయ్ సెల్ ఫోన్ సెర్చ్ హిస్టరీ అంతా నేర పూరిత అంశాలు, అశ్లీల చిత్రాలు, వీడియోలతోనే నిండి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మహిళలతో బెడ్ రూమ్‌లో ఉన్న ఫోటోలు, నెట్లో డౌన్లోడ్ చేసిన అశ్లీల వీడియోలు వందల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. మనిషిని హత్య చేయడం సంజయ్‌కి టీ తాగినంత తేలిక. అతడిలో అపరాధ భావం మచ్చుకైనా కానరావడం లేదని తెలుస్తోంది. విచారణలో పోలీసులను కూడా ముప్పుతిప్పలు పెట్టినట్టు సమాచారం. ఆపస్మారక స్థితిలో ఉన్న తల్లి, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యల వద్ద గుక్కపట్టి ఏడుస్తున్న మూడేళ్ల బాలుడి కన్నీళ్లు కూడా సంజయ్‌ను కదిలించలేకపోయాయి. ఆ చిన్నోడి ఏడుపు తన నేరానికి అడ్డు అవుతుందని భావించి కొట్టి, గొంతు పిసికి, ప్రాణం ఉండగానే బావిలో పడేశానని పోలీసుల విచారణలో సంజయ్ ఒప్పుకున్నాడు. ( పూడ్చి పెట్టారు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది?) సంజయ్ సైకిల్ కీలకంగా మారిన సీసీ కెమెరాలు మృతులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావడం, హంతకుడు ఎవరో తెలియకపోవడంతో తొలుత పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. అయితే గొర్రెకుంట ప్రాంతంతోపాటు వరంగల్ వెంకట్రామా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఈ ఫుటేజీల్లో సంజయ్ వరుసగా ఐదు రోజులుగా సైకిల్‌పై వచ్చి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తొమ్మిది మందిని హత్య చేసిన తీరుతో పాటు వీటన్నింటికి కారణమైన రఫికా హత్య వివరాలు తెలుసుకోవడం పోలీసులకు సులువైంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ఎంతటి క్లిష్టమైన కేసునైనా సులభంగా చేధించవచ్చునని మరోసారి నిరూపితమైందని పోలీసులు చెబుతున్నారు. -
మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం
వివాహితతో ఏర్పడిన పరిచయం ఆపై సాన్నిహిత్యంగా.. అది కూడా దాటిపోయి శారీరకంగా సంబంధానికి దారి తీసింది.. అంతటితో ఆగక ఆమె కుమార్తెతోనూ సంబంధం ఏర్పర్చుకోవాలని భావించగా గుర్తించిన వివాహిత తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.. ఆమెను అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసిన నిందితుడు, ఆమె కోసం ఆరా తీసిన కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యాడు.. ఈ కుటుంబంలోని ఆరుగురికి తోడు పక్కనే ఉన్న పాపానికి మరో ముగ్గురు బలి కాగా.. మొత్తం తొమ్మిది మంది మృతదేహాలు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట వద్ద బావిలో తేలిన ఘటన రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. ఈ కేసును 72 గంటల్లో ఛేదించిన పోలీసులు బీహార్‌కు చెందిన నిందితుడు సంజయ్‌కుమార్‌ను యాదవ్‌ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తొలుత తాను మహిళను హత్య చేశానని.. ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తొమ్మిది హత్యలు చేసినట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు వివరాలను మీడియాకు సీపీ రవీందర్ సోమవారం సాయంత్రం వెల్లడించారు. సాక్షి ప్రతినిధి వరంగల్ / కాజీపేట అర్బన్ / గీసుకొండ : ఒక తప్పు చేస్తే అలాంటి తప్పు మరోసారి జరగకుండా చూసుకోవాలి.. అప్పుడే మనిషిలో పరివర్తన వచ్చినట్లు లెక్క! కానీ ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూ వెళ్తే దానికి అంతమనేదే ఉండదు. అచ్చంగా తొమ్మిది మృతదేహాలు లభించిన కేసులో నిందితుడు ఇలాగే చేస్తూ పోయాడు. గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో లభించిన మృతదేహాల విషయంలో ఆత్మహత్యలా, హత్యలా అనే కోణం దర్యాప్తు చేసిన పోలీసులకు సీసీ ఫుటేజీల రూపంలో ఓ తీగ దొరికింది. ఆ తీగ ఆధారంగా ముందుకెళ్లగా నిందితుడు దొరికాడు. విచారణ సందర్భంగా.. ఈ తొమ్మిది హత్యలకు గతంలో తానే చేసిన ఓ హత్య నాంది అని నిందితుడు చెప్పడం గమనార్హం. కేసు వివరాలను వెల్లడిస్తున్న సీపీ రవీందర్, పక్కన అధికారులు పని కోసం వచ్చాక పరిచయం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బార్దాన్ గోదాంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా(40) పనిచేసేవారు. వీరితో పాటు మక్సూద్ కుమారులు షాబాజ్(19), సోహిల్ ఆలం(18)తో పాటు ఆయన కుమార్తె బుష్రా ఖాతూన్, ఆమె కుమారుడు బబ్లూ నివసించేవారు. ఈక్రమంలో బార్దాన్ పనికి వచ్చిన బీహార్ వాసి సంజీవ్ కుమార్ యాదవ్‌కు వీరితో పరిచయం ఏర్పడింది. ఇంతలోనే మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా(31) భర్తతో విడిపోయాక ముగ్గురు పిల్లలతో కలిసి పని కోసం వచ్చింది. ఆమెతోనూ çసంజయ్ పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు తనకు హోటళ్లలో తినడం ఇబ్బందిగా ఉందని చెబుతూ డబ్బు చెల్లించేలా మాట్లాడుకుని రఫీకా ఇంట్లో భోజనం చేయడం ఆరంభించాడు. ఆ పరిచయం సాన్నిహిత్యానికి.. ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహితతో పాటు ఆమె కుమార్తెతో.. మక్సూద్ సమీప బంధువైన రఫీకాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమె కుటుంబం మకాంను సంజయ్ జాన్‌పాకకు మార్చాడు. అక్కడ అద్దె ఇంటిని తీసుకుని వారితోనే ఉండసాగాడు. అప్పటికే యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెపై సంజయ్ కన్ను పడింది. ఈ విషయం రఫీకాకు తెలియగా నిలదీయడమే కాకుండా త్వరగా తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయసాగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన సంజయ్.. బంధువులతో మాట్లాడాలంటూ పశ్చి మ బెంగాల్ బయలుదేరదీశాడు. విశాఖ వైపు గరీభ్‌ర థ్ రైలులో మార్చి 6న వెళ్లే క్రమంలో అప్పటికే సి ద్ధం చేసుకున్న నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రఫీకా మెడకు చున్నీ బిగింగి రైలు నుంచి ఏపీలోని నిడదవోలు వద్ద తోసివేశాడు. ఆ తర్వాత రాజమండ్రిలో దిగి మరో రైలులో వరంగల్ వచ్చాడు. ఆమె ఎటు వెళ్లింది..? తాపీగా వచ్చిన సంజయ్ పని చేసుకుంటున్నాడు. అయితే, రఫీకా విషయమై నిషా సంజయ్‌ను గట్టిగా అడగసాగింది. పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఈ కుటుంబం అడ్డు కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు సంజయ్ సైకిల్ కొడుకు పుట్టిన రోజే అందరికీ చివరి రోజు సంజయ్‌కుమార్ యాదవ్.. మక్సూద్ ఆలం కుటుంబాన్ని హతమార్చేందుకు ఈనెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెక్కీ నిర్వహించాడు. ప్రతీరోజూ సైకిల్‌పై వారు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వస్తూ పరిశీలించాడు. ఈ కుటుంబంలో ఐదుగురికి తోడు పక్కన మరో భవనం పైభాగంలో నివాసముంటున్న బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంను గుర్తించాడు. చివరకు ఈనెల 20వ తేదీన మక్సూద్ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం పుట్టినరోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన నిద్రమాత్రలను మక్సూద్ ఆలం కుటుంబంతో మాటల్లో ఉండగా పప్పు కూరలో కలిపాడు, అదే విధంగా శ్రీరాం, శ్యాం ఆహారంలో కూడా కలిపాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లు, సామగ్రి ఒక్కరొక్కరిని.. రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో చేరుకోగా ఒకరి వెంట ఒకరిని గోనె సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. గోదాం – బావి మధ్య ఉన్న ప్రహరీపై ఆయన ఒక్కరొక్కరిని ఉంచాడు. ఆ పై తాను గోడ దూకి వారిని తీసుకెళ్లి బావిలో పడవేయసాగాడు. ఉదయం 5.30 గంటలకు మృతులు వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసి వస్తువులు, సెల్ఫోన్లు తీసుకుని జాన్‌పాక చేరుకున్నాడు. 6 బృందాలు... 72 గంటలు తొమ్మిది మంది మృతి చెందిన కేసును వరంగల్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని విభాగాల అధికారులతో కలిపి ఆరు బృందాలు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా సంజయ్‌ను గుర్తించగా.. సోమవారం సాయంత్రం మీడియాకు సీపీ డాక్టర్ వి.రవీందర్ వివరాలు వెల్లడించారు. కాగా, తొలుత హత్యకు గురైన రఫీకా ముగ్గురు పిల్లలను బాలసదనంలోకి చేర్చినట్లు వివరించారు. కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ ఇన్చార్జి డీసీసీ వెంకటలక్ష్మి, ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి ఇన్స్పెక్టర్లు శివరామయ్య, కిషన్, ఇన్స్పెక్టర్లు నందిరాంనాయక్, జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్, రమేష్‌కుమార్‌ను సీపీ అభినందించారు. రంజాన్ జరుపుకోకుండానే.. రంజాన్ జరుపుకునేందుకు ముస్లిం కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటాయి. అదే తరహాలో మక్సూ ద్ ఆలం కుటుంబం కూడా కొత్త బట్టలు, సరుకులు కొనుగోలు చేశారు. కానీ వారిని మృత్యువు వెంటాడింది. ఆ కుటుంబంలో ఒక్కరూ బతికి లేకపోవడంతో పండుగ జరుపుకోలేకపోయారు. రెండున్నర అడుగల ఎత్తులో బావిగోడ మృతదేహాలు తేలిన బావి చుట్టూ ప్రహారీ ఉంది. ఒకచోట మాత్రం మట్టితో 2.5 అడుగుల గోడ ఉంది. అక్కడి నుంచే సంజయ్.. మత్తులో ఉన్న వారిని బావిలోకి తోసినట్లు చెబుతున్నారు. పాపం.. ఆ ముగ్గురు తొలుత మక్సూద్ కుటుంబంలోని ఆరుగురిని మాత్రమే సంజయ్ అంతం చేయాలనుకున్నాడు. కానీ వారి ఇంటి పక్కనే ఉండే బీహార్ కార్మికులు శ్రీరాం, శ్యాంతోపాటు పని ఉందని చెప్పడంతో వచ్చిన షకీల్ కూడా బలయ్యారు. మార్చురీలోనే మృతదేహాలు ఎంజీఎం : బావిలో తేలిన తొమ్మిది మంది మృతదేహాలు ఇంకా ఎంజీఎం మార్చురీలోనే ఉన్నా యి. కేసు ఓ కొలిక్కి వచ్చినా సోమవారం రంజా న్ కావడంతో మంగళవారం మృతదేహాల ను ఖ ననం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎప్పుడేం జరిగిందంటే... దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తొమ్మిది హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితుడి వివరాలను సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బావిలో నాలుగు మృతదేహాలు తేలిన రోజు నుంచి నిందితుడి వివరాలు వెల్లడించిన సోమవారం వరకు జరిగిన ఘటనల వివరాలివి.. నిందితుడు సంజయ్‌ను తీసుకొస్తున్న పోలీసులు 21 – 05 – 2020 : గురువారం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో సాయిదత్తా ట్రేడర్స్ ఆధ్వర్యాన నిర్వహించిన బార్దాన్ సంచులను కేంద్రానికి ఆటోడ్రైవర్‌ను అక్కడకు పంపించారు. నిల్వ ఉన్న సంచులను తీసుకురావాలని సూచించారు. ఆటో డ్రైవర్ ఉదయం 7 గంటలకు వెళ్లగా అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో యజమానులకు సమాచారం ఇచ్చాడు. దీంతో యజమానులు భాస్కర్, సంతోష్ చేరుకుని చూడగా ఎవరూ లేకపోవడంతో పనిపై బయటకు వెళ్లారని భావించారు. మళ్లీ కాసేపటికి వెళ్లి చూడగా కూడా లేకపోవడంతో బీహార్ కార్మికులు ఉండే భవనం ఎక్కి చూడగా పక్కనే పాడుబడిన వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు తేలడాన్ని గమనించి గీసుకొండ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సాయంత్రం వరకు మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా ఆలం(40), కుమార్తె బుష్రా ఖాతూన్(20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారు బబ్లూ మృతదేహాలను వెలికితీశారు. ఘటనా స్థలాన్ని ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి సీఐలు జూపల్లి శివరామయ్య, కిషన్, ఎస్‌లు రహీం, నాగరాజు పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్స్క్వార్డ్ను రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. మ«ధ్యాహ్నం 2నుంచి రాత్రి 8 గంటల వరకు గాలించినా ఏ ఆధారమూ లభించకపోవడంతో నలుగురు ఎలా మృతి చెంది ఉంటారనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయారు. 22 – 05 – 2020 : శుక్రవారం ఉదయం 7 గంటలకు బావి వద్దకు స్థానికులు వెళ్లి చూడగా ఓ మృతదేహం తేలుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌తో పాటు పోలీసు అధికారులు చేరుకుని సిబ్బందితో గాలించారు. దీంతో తొలుత మక్సూద్ ఆలం స్నేహితుడు, కరీమాబాద్‌కు చెందిన మహ్మద్ షకీల్(38) మృతదేహం బయటపడినా ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత బావిలోని నీటిని మోటార్ సాయంతో తోడుతుండగా చొప్పున నాలుగు మృతదేహాలు లభించాయి. ఇందులో మక్సూద్ పెద్ద కుమారుడు షాబాజ్, బీహార్ కార్మికుడు శ్రీరాంకుమార్షా, మక్సూద్ చిన్న కుమారుడు మహ్మద్ సుహేల్, బీహార్ కార్మికుడు శ్యాంకుమార్షా మృతదేహాలను వెలికితీసి వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. బార్దాన్ గోదాంలోని మక్సూద్ కుటుంబం నివాసం ఉండే రెండు గదులతో పాటు, బీహార్ కార్మికులు ఉండే డాబా పైగదులు, బావి పరిసర ప్రాంతాల్లో క్లూస్‌టీం ఆధారాల కోసం పలు నమూనాలు సేకరించింది. వండి తినకుండా మిగిలిపోయిన అన్నం, ఆకుకూర పప్పు, కూల్‌డ్రింక్స్ ఖాళీ బాటిళ్లను తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ రవీందర్ సందర్శించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, హరిత సందర్శించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు. 23 – 05 – 2020 : శనివారం సంఘటనా స్థలానికి సెంట్రల్ విజిలెన్స్ అధికారుల బృందం, హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ విభాగం అధికారులు చేరుకుని సాంకేతిక పరమైన అంశాలను పరిశీలించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు పలు కోణాల్లో పరిశోధనలు చేశారు. మృతదేహాల పోస్టుమార్టం నివేదికను పరిశీలించారు. ప్రాణాలతో ఉండగానే బావిలో పడేశారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కాల్‌డేటా ఆధారంగా సంజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని ఘటనాస్థలికి తీసుకుని వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ తరహాలో పరిశీలించారు. డీసీసీ వెంకటలక్ష్మి నేతృత్వంలో ఐదు గంటల పాటు పరిశీలన జరిపారు. ♦ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సీపీని ఆదేశించారు. ♦ రాత్రి తొమ్మిది మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. నీట మునిగాక మృతి చెందినట్లు ప్రాథమికంగా నివేదిక అందజేశారు. 24 – 05 – 2020 : ఆదివారం ♦ డీజీపీ కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి డైరెక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో పది మంది క్లూస్ టీం బృందాన్ని పంపించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సిటీ క్లూస్ టీంతో పాటు ట్రెయినీ ఐపీఎస్ అధికారులు యోగేశ్ గౌతం, అఖిలేష్, రీజినల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ భాస్కర్, పోలీస్ అధికారులు ఘటనా స్థలంలో మరిన్ని ఆధారాల కోసం అణువణువు అన్వేషించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ అన్వేషణ సాగింది. ♦ సివిల్ పోలీస్ అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీకోర్, సీసీఎస్ టీం, క్లూస్‌టీం, హైదరాబాద్ సిటీ క్లూస్‌టీం, ఎస్బీ, ఇంటలిజెన్స్ విభాగం అధికారులు పలు కోణాల్లో కేసు మిస్టరీని ఛేదించడం కోసం కృషి చేశారు. 25 – 05 – 2020 : సోమవారం ♦ నిందితుడు సంజయ్‌కుమార్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు. ఆ తర్వాత హత్యల వెనుక ఉన్న కారణాలను సీపీ వెల్లడించారు. ఒక్కడే అంతా చేశాడా? గీసుకొండ సమీపంలోని గొర్రెకుంట వద్ద తొమ్మిది మందిని హత్య చేసిన ఘటనలో నిందితుడు ఒక్కడేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంజయ్ ఒక్కడే తొమ్మిది మంది తినే ఆహారంలో నిద్రమాత్రలు కలపడం.. వారు మత్తులోకి జారుకున్నాక ఒక్కరొక్కరిని తీసుకొచ్చి బావిలో పడేయడం.. ఇదంతా తెల్లవారుజాము వరకు జరిగిందని చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. అయితే, పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని చెబుతుండడంతో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. పట్టించిన సీసీ కెమెరాలు తొమ్మిది మంది మృతదేహాలు బావిలో తేలిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేరే రాష్ట్రం నుంచి పని కోసం వచ్చిన వారు కావడం.. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక తనువు చాలించారని తొలిరోజు ప్రచారం సాగింది. ఇంతలోనే వేరే కారణంగా ఉండొచ్చని తేలగా.. మరుసటి రోజు ఐదు మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు ఆరు బందాలను ఏర్పాటు చేశారు. గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ కేసులో కీలకంగా మారాయి. ఈ పుటేజీల్లో సంజయ్ సైకిల్‌పై వరుసగా ఐదు రోజులుగా వచ్చినట్లు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా తొమ్మిది హత్యలు చేసిన తీరుతో పాటు వీటన్నింటికీ కారణమైన రఫీకా హత్య వివరాలు వెల్లడించాడు. అలాగే, మక్సూద్ కుటుంబం వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులు కూడా కొంత మేర పరిశోధనలో ఉపయోగపడినట్లు సమాచారం. -
అర్ధరాత్రి వేళ.. అగ్నిప్రమాదం
సాక్షి, హన్మకొండ : అందరూ నిద్రిస్తున్న వేళ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా.. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భవనం పూర్తిగా దెబ్బతిని స్లాబ్ లోపలి చువ్వలు బయటకు రావడం ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తుండగా దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు నైట్ వాచ్మెన్ అంజనేయులు, ఇతర ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. ఏబీకే మాల్లోని రెండో అంతస్తులో మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఏర్పాటుకు అద్దెకు తీసుకున్నారు. కార్యాలయానికి అనువుగా తీర్చిదిద్దుతున్న పనులు చివరి దశకు చేరుకోగా.. కార్మికులు రెండో అంతస్తులో నిద్రించారు. ఇందులో కొందరు తెల్లవారుజామున మూత్రవిసర్జనకు నిద్ర లేవగా మంటలు కనిపించడంతో ఫైర్ స్టేషన్‌కే కాకుండా భవనంలోని ఇతర సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేశారు. దీంతో హన్మకొండ ఫైర్ ఆఫీసర్ నాగరాజు నేతృత్వంలో సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల ద్వారా చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనలో పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్ కార్యాలయంలోని ఏసీల తదితర సామగ్రి దెబ్బతిన్నదని అసిస్టెంట్ మేనేజర్ బి.రామారావు తెలిపారు. అయితే, పై అంతస్తుల్లో ఉన్న కార్యాలయాలకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ మాల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీజియన్ కార్యాలయం, ఏపీజీవీబీతో పాటు చిట్‌ఫండ్ కార్యాలయాలు, మెడికల్ షాపులు ఉన్నాయి. -
బిర్యానీ గొడవ.. ఆపై హత్య
సాక్షి, గీసుకొండ(పరకాల): గ్రేటర్ వరంగల్ నగరం జాన్‌పిరీలు వద్ద ఉన్న సాయివైన్స్‌లో పని చేసే వర్కర్ సంగ రమేశ్ హత్య కేసులో నిందితుడు రామగిరి ప్రభాకర్‌ను అరెస్టు చేసినట్లు గీసుకొండ సీఐ శివరామయ్య తెలిపారు. సోమవారం సాయంత్రం గీసుకొండ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సాయివైన్స్ వద్ద గడిచిన ఆరు సంవత్సరాలుగా రామగిరి ప్రభాకర్ పాన్‌షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. అదే వైన్స్‌లో సంగ రమేశ్ క్లీనర్‌గా పని చేస్తుండగా.. ఈ నెల 9న హోళీ పండుగ రోజు రాత్రి 12.30 గంటలకు మృతుడు రమేశ్ అక్కడే ఉన్న ప్రభాకర్‌ను బిర్యానీ కావాలని అడగటంతో తన సెల్‌ఫోన్ ద్వారా ఆర్డర్ చేయడానికి ప్రయత్నింగా ఫోన్లో బ్యాలెన్స్ లేకపోవడంతో వీలు కాలేదు. వేరే వారి ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తానని రమేశ్ కోరగా అందుకు ప్రభాకర్ ఒప్పుకోకపోగా డబ్బులు ఇవ్వనని బుకాయించాడు. అయితే బిర్యానీ తెప్పిస్తానని చెప్పి ఎందుకు మాటమార్చావని రమేశ్ అతడిని తిట్టడంతో దాన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకర్ గతంలో తన పాన్‌షాపును తీసివేయిస్తానని బెదరించిన అతడిని ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నాడు. అర్ధరాత్రి వైన్‌షాపు ముందు నిద్రిస్తున్న రమేశ్‌ను తిట్టి, కాళ్లతో తన్ని, బీరుసీసా పగులగొట్టి దాంతో రమేశ్ మెడపై పొడవడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్ అక్కడినుంచి పారిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తుండగా వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద గుర్తించి సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ శివరామయ్య తెలిపారు. హత్య జరిగిన వారం రోజుల్లోనే నిందితుడిని గీసుకొండ పోలీసులు పట్టుకోవడం విశేషం. విలేకర్ల సమావేశంలో ఎస్సైలు అబ్దుల్ రహీం, నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కోర్టులో లొంగిపోనున్న ప్రదీప్‌రెడ్డి?
సాక్షి, కాజీపేట అర్బన్ : ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోకు ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సూత్రదారి పింగిళి ప్రదీప్‌రెడ్డి సోమవారం కోర్టులో లొంగిపోనున్నట్లు పుకార్లు శికార్లు చేస్తున్నాయి. ఆనంద్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి మధ్య ఇసుక వ్యాపారం నిమిత్తం 80 లక్షల లావాదేవీల చెల్లింపులో భాగంగా శనిగరంకు చెందిన శనిగరం గ్రామానికి చెందిన పింగిళి ప్రదీప్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, రమేష్ ఈనెల 7న కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆనంద్‌రెడ్డిని కమలాపూర్ మండలం హన్మకొండలో కిడ్నాప్ చేసి భూపాలపల్లి జిల్లా రామారం అడవుల్లో గట్టమ్మగుడి దగ్గర దారుణంగా హత్య చేశారు. లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య మృతుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగానే.. ప్రదీప్‌రెడ్డిపై అనుమానం ఉందని మృతుడు ఆనంద్‌రెడ్డి సోదరుడు శివకుమార్‌రెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు శివరామకృష్ణ, శంకర్, మధుకర్‌లను అరెస్టు చేసి వాహనాన్ని, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగి వారం అవుతున్నా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లోనే 2 స్పెషల్ టీంలు.. ఆనంద్‌రెడ్డి హత్య కేసును వరంగల్ కమిషనరేట్ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు నాలుగు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి రెండు స్పెషల్ టీంలు ముగ్గురు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్‌లోని హోటళ్లలో బస చేశారనే సమాచారంతో తనిఖీలు చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. విక్రమ్ రెడ్డి ఎవరు? ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు పింగిళి ప్రదీప్‌రెడ్డి మిత్రుడుగా పేర్కొంటున్న విక్రమ్‌రెడ్డి ఎవరు అనే కోనంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విక్రమ్‌రెడ్డి బంధువులు పోలీస్ విభాగంలో ఉన్నారని, ఇందుమూలంగానే అరెస్ట్ పర్వం ఆలస్యం అవుతుందనే అనుమానం తలెత్తుతుంది. -
కవలలపై కీచక తండ్రి అఘాయిత్యం
సాక్షి, కాజీపేట అర్బన్ : కంచె చేను మేసిన చందంగా కన్న తండ్రి, మేనమామ కలిసి మైనర్లు అయిన కవలలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇది. దీనికి సంబంధించి వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా షీ టీమ్స్ ఏసీపీ బాబురావు శుక్రవారం రాత్రి వివరాలు వెల్లడించారు. వరంగల్ కాశిబుగ్గలోని శ్రీనివాసకాలనీకి చెందిన దంపతులకు 14 ఏళ్ల కవలల కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరి తండ్రి, మేనమామ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, మూడేళ్ల నుంచి మేనమామ, ఏడాది కాలంగా తండ్రి బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అయితే, ఎవరికైనా చెబితే ఏమవుతుందోనన్న భయంతో బాలికలు లోలోపల కుమిలిపోతున్నారు. ఇటీవల వేధింపులు తీవ్రంగా కావడంతో తాము చదువుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు విషయాన్ని వెల్లడించారు. దీంతో ఉపాధ్యాయులు షీ టీంకు సమాచారం ఇవ్వగా.. నిందితులను అదుపులోకి తీసుకుని ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు. మామ లైంగిక వేధింపులు.. కోడలి ఆత్మహత్య నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం మామునూరు: అభం శుభం తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారిపై 58 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన శుక్రవారం మధ్యా హ్నం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. తిమ్మాపురం గ్రామంలోని ఓ కాలనీకి చెందిన దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. వీరి ఇంటి పక్కన ఉన్న పొలంలో ఐనవో లు మండలం గర్నెపల్లికి చెందిన చిదురాల యాకయ్య(58) పాలేరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా మొక్కజొన్న కంకులు ఇస్తానని చేనులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించా డు. ఇంతలోనే పానను పిలుస్తూ తల్లి రాగా యాకయ్య పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆయనను బాలిక తల్లిదండ్రులు పట్టుకుని దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించా రు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చంపేస్తే అప్పు తప్పుతుందని..
గోవిందరావుపేట: అప్పు తీసుకున్న డబ్బు ఇప్పుడే ఇవ్వాలంటూ కూర్చున్న దేవేందర్‌రెడ్డిని హత్య చేస్తే మిగతా చిన్నచిన్న అప్పులను తీర్చేయవచ్చని.. ఇదేక్రమంలో హత్య చేశాక మృతదేహాన్ని రాత్రి మాయం చేయాలని భావించాడు.. ఇదే ఆలోచనతో బేకరీ లోపలికి తీసుకెళ్లిన దేవేందర్‌రెడ్డిని తీవ్రంగా కొట్టాక చనిపోయాడనుకుని బయటకు వచ్చాక సునీల్‌రెడ్డి కనిపించాడు.. అంతసేపటి వరకు ఒకటే హత్య చేయాలని అనుకున్న నిందితుడు.. రెండో హత్యకు కూడా సిద్ధమయ్యాడు. దీంతోనే సునీల్‌ను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్యకు పాల్పడ్డాడు. ఇదీ ములుగు జిల్లా పస్రాలో సోమవారం రాత్రి జరిగిన హత్యకు సంబంధించి నిందితుడు, బేకరీ యజమాని దయానంద్ అలియాస్ దయ పన్నాగంగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. రూ.6లక్షల అప్పు.. కర్ణాటకకు చెందిన దయానంద్ తన మామ ప్రభుతో కలిసి పస్రాలో కొన్నేళ్ల క్రితం బేకరీ ప్రారంభించారు. అయితే, అప్పులు ఎక్కువ కావడంతో కొద్దికాలం క్రితం ఊరు వదిలేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆరునెలల క్రితం వచ్చిన వారు పస్రాలోనే కొత్తగా బేకరీ తెరిచారు. అప్పటికే ఉన్న అప్పులకు తోడు మరికొన్ని అప్పులు చేశారు. ఈ క్రమంలో దయకు రూ.6లక్షలు అప్పు ఇచ్చిన దేవేందర్‌రెడ్డి నుంచి ఒత్తిడి పెరిగింది. సోమవారం కూడా దేవేందర్‌రెడ్డి తన స్నేహితుడైన ఫొటో జర్నలిస్ట్ సునీల్‌రెడ్డితో కలిసి పస్రా వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మంతనాలు సాగించినా డబ్బు తిరిగి ఇవ్వడంలో ఎలాంటి పురోగతి కానరాలేదు. తనకు స్థానిక వ్యాపారి ఒకరు డబ్బు ఇవ్వాల్సి ఉందని చెప్పగా.. దేవేందర్, సునీల్ ఆయన వద్దకు వెళ్లి ఆరా తీశారు. అయితే, దయకు తాను డబ్బు పెద్దగా ఇచ్చేది లేదని.. కొంతమొత్తమే ఉన్నా తనకు కుమార్తె వివాహం ముగిశాక ఇస్తానని చెప్పాడు. (ఫొటో జర్నలిస్ట్ దారుణ హత్య) ఇస్తావా.. ఇవ్వవా? వ్యాపారి మొండిచేయి చూపడంతో దేవేందర్, సునీల్ మళ్లీ దయ బేకరీ వద్దకు వచ్చారు. దేవేందర్‌రెడ్డి తనకు ఇవ్వాల్సిన రూ.6లక్షల విషయమై మళ్లీ ప్రశ్నించాడు. ఉదయం నుంచి నచ్చచెప్పినా వినడం లేదని భావించిన దయ.. తొలుత దేవేందర్‌రెడ్డిని హత్య చేసి అప్పు వదిలించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే భావనతో పక్కనే ఉన్న మామ ప్రభుకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రి 7–30 గంటలకు బేకరీకి వచ్చిన దేవేందర్‌రెడ్డిని బేకరీలో వెనక ఉన్న బట్టీ వద్దకు తీసుకెళ్లి విచక్షణా రహితంగా తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో చనిపోయాడని భావించి శవాన్ని రాత్రికి మాయం చేయాలనే ఆలోచనతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలా రాగానే సునీల్‌రెడ్డి కనిపించడంతో దయా తన ఆలోచన మార్చుకున్నాడని సమాచారం. ‘ఇంటికి పోయి మాట్లాడుకుందాం.. అక్కడ నీకు అన్ని విషయాలు, నా ఇబ్బందులు చెబుతా’ అంటూ సునీల్‌రెడ్డిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో దయ మామ, భార్య బేకరీలో ఉన్నారు. ఈ మేరకు ఇంటికి వెళ్లగానే అక్కడ ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సునీల్‌రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రక్తపు మడుగులో దేవేందర్.. దయ, సునీల్‌రెడ్డి ఇంటికి వెళ్లాక పనిపై ప్రభు బేకరీలోని బట్టీ వద్దకు వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో దేవేందర్‌రెడ్డి కనిపించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన స్థానికుల సాయంతో 108లో ములుగు ఆస్పత్రికి చేర్చాడు. ఇంతలోనే దయ భార్య బేకరీ నుంచి ఇంటికి వెళ్లగా లోపలి నుంచి గొడవ వినిపించినట్లు సమాచారం. ఉదయం నుంచి అప్పు విషయమై జరుగుతున్న గొడవగానే ఆమె భావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దయ రక్తపు మరకలు కడుక్కుంటూ ఇంటి నుంచి బయటకు రావడాన్ని చూసిన ఆమె ఏదో జరిగిందని ఊహించినట్లు సమాచారం. ఆ తర్వాత దయా రోడ్డుపైకి రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇంతలోనే దయ నేరుగా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, వరంగల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి గంగాదేవిపల్లి సమీపంలో సంభవించింది. పోలీసుల వివరాల ప్రకారం.. చనిపోయిన యువకులు గంగాదేవిపల్లికి చెందిన ఇట్ల జగదీష్(19), న్యాల నవీన్(20), జనగామ జిల్లా నర్మెట్ట మాన్సింగ్ తండాకు చెందిన లకావత్ గణేష్(21)గా గుర్తించారు. ముగ్గురు ద్విచక్ర వాహనంపై వరంగల్ నుంచి గంగాదేవిపల్లికి వెళ్తుండగా.. వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కోట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన ఘటన స్థానికులను కలిచివేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన జగదీష్, న్యాల నవీన్‌ల మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. -
కి‘లేడీ’ అరెస్టు
సాక్షి, భీమారం(వరంగల్): వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుంటున్న కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేయూ పోలీస్‌స్టేషన్ పరిదిలో ఇలాంటి సంఘటనలు వెలుగు చూశాయి. ఈమేరకు నిఘా వేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి ఆరు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కేయూసీ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు వివరాలు వెల్లడించారు. హుస్నాబాద్ మండలం హైసమ్మవాగు తండాకు చెందిన భూక్య రజిత యాదవ నగర్, పెద్దమ్మగడ్డ ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది. నమ్మకస్తురాలిగా ఉంటూ ఉదయం ఎవరూలేని ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలు చేస్తోంది. ఆ తర్వాత ఇళ్లు ఖాళీ చేసి మరో ఏరియాకు మకాం మార్చేది. ఇదిలా ఉండగా రెడ్డిపురం క్రాస్ వద్ద సోమవారం అనుమానాస్పదంగా కనిపించిన రజితను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలు వెలుగు చూశాయి. పెద్దమ్మగడ్డ, యాదవనగర్ ప్రాంతాల్లో చోరీ చేసినట్లు ఆమె అంగీకరించగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డేవిడ్‌రాజు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు హరికృష్ణ, రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళ ఫిర్యాదుతో సీఐడీ విచారణ
సాక్షి, వరంగల్: మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లుపై గతేడాది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్సీఎస్)కు బాధితురాలు ధరావత్ శకుంతల ఫిర్యాదు చేయగా విచారణ అధికారిగా కమిషన్ సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ను నియమించింది. ఈ మేరకు బుధవారం డీఎస్పీ రవికుమార్ రైస్‌మిల్లు వద్దకు వచ్చి ఫిర్యాదు చేసిన వారితో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న వారిని విచారించారు. 2010లో ధరావత్ శకుంతల ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రైజెస్ పథకంలో రూ.50 లక్షల సబ్సిడీతో రూ.3 కోట్లతో రైస్‌మిల్లు పొంది రూ.1.93 కోట్ల పెట్టుబడితో రైస్‌మిల్లు ఏర్పాటు చేసుకున్నారు. రూ.89,50 లక్షలు కెనరా బ్యాంక్ రుణం అందజేయగా.. ప్రభుత్వం నుంచి రూ.40 లక్షల సబ్సిడీ విడుదల చేసింది. ప్రతినెలా 1.29 లక్షలు బ్యాంక్ అప్పు చెల్లించే విధంగా ప్రీమియం ఏర్పాటు చేసుకోగా ప్రతినెలా ప్రీమియం చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు మిల్లును వేలం వేసి అమ్మేశారు. దీనిపై ధరావత్ శకుంతల మిల్లును వేలం వేసి తనకు నష్టం చేశారంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రస్థాయి నుంచి ఆ ఫిర్యాదుపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్‌్సకు బదిలీ చేసింది. దీనిపై సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ను విచారణ అధికారిగా నియమించగా బుధవారం రైస్‌మిల్లు వద్ద విచారించారు. -
ఎవరైనా.. ఎక్కడి నుంచైనా!
వరంగల్ క్రైం: సైబర్ నేరాలకు సంబంధించి ఇకపై ఎవరైనా.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయొచ్చని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలి పారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం సైబర్ విభా గం ఆధ్వర్యాన ‘సైబర్ పోలీసు పోర్టల్’పై పోలీసు స్టేషన్ల రైటర్లకు ఒక రోజు శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా సీపీ రవీందర్ మాట్లాడుతూ దేశంలో సైబర్ నేరాలను నియంత్రించి నేరస్తులను పట్టుకోవడంతో పాటు బాధితుల ఫిర్యాదులను ఎక్కడి నుంచైనా స్వీకరించేందుకుగాను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆరి్డనేషన్ సెంటర్ పేరుతో పోర్టల్‌ను ప్రారంభించిందని తెలిపారు. దీని వల్ల సైబర్ బాధితులు నేరుగా http://cybercrime.gov.in ద్వారా తమ నమోదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ పోర్టల్ ద్వార అందిన ఫిర్యాదులను రాష్ట్ర సైబర్, జిల్లా సైబర్ విభాగాల ద్వారా సంబంధించి పోలీసు స్టేషన్లకు బదిలీ చేస్తారని చెప్పారు. ఆ వెంటనే విచారణ ప్రారంభమవుతుందని వివరించారు. కమిషరేట్‌లో ఓ కేసు ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఓ మహిళ వ్యక్తిగత ఫొటోలను పరిచయం ఉన్న వ్యక్తి ఫేస్బుక్లో పెట్టాడని సీపీ రవీందర్ తెలిపారు. ఈ విషయమై మహిళ ఫిర్యాదు చేయగా సైబర్ విభాగం అధికారులు ఫేస్బుక్లో ఫొటోలు తొలగింపచేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మేరకు సైబర్ క్రైం పోర్టల్‌పై సిబ్బంది అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజలకు వివరించాలని సూచించారు. సదస్సులో అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్, ఐటీ కోర్ విభాగం ఇన్స్పెక్టర్లు జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్, ప్రశాంత్, సైబర్ సిబ్బంది కిషోర్, రాజు, దినేష్, ఆంజనేయులు, రత్నాకర్, నరేష్ పాల్గొన్నారు. -
తండ్రీకొడుకుల గంజాయి స్మగ్లింగ్
సాక్షి, నెక్కొండ: గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సంపేట ఏసీపీ ఫణీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతారం గ్రామానికి చెందిన కొంగర యేసు, వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం హరిశ్చంద్రు తండా గ్రామానికి చెందిన జాటోతు రాజ్‌కుమార్, జాటోతు సీతారాం(పరారీలో ఉన్నాడు).. పశ్చిమ గోదావరి జిల్లా చింతూరులో గంజాయి కొనుగోలు చేసి స్మగ్లింగ్‌కు చేస్తున్నారు. నిందితుల్లో జాటోతు సీతారాం అక్రమ దందాలకు పాల్పడుతుండేవాడు. ఆయన కుమారుడు, ఎంకాం చదివిన రాజ్‌కుమార్ కూడా తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తండ్రి మార్గాన్ని ఎంచుకున్నాడు. వీరిద్దరితోపాటు మరొకరి సాయంతో పశ్చిమగోదావరి జిల్లా నుంచి గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడే వారు. ఈ నెల 9న నెక్కొండకు రైలు మార్గం ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా వేయగా రెండు సంచులతో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో రాజ్‌కుమార్, యేసును అదుపులోకి తీసుకోగా పక్కనే ఉన్న సీతారాం ఉడాయించాడు. ఈ మేరకు రూ.12 లక్షల విలువైన శుద్ధి చేసిన 60 కిలోల(30 ప్యాకెట్లు) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి తీసుకొచి్చన గంజాయిని రైలు మార్గంలో మహరాష్ట్రకు తరలించే క్రమంలో అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ తిరుమల్, ఎస్సై నవీన్‌కుమార్, ఏఎస్సై ప్రతాప్‌సింగ్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
రిజర్వాయర్‌లో యువతి మృతదేహం
సాక్షి, కాజీపేట: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి రిజర్వాయర్‌లో గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం నీటిపై యువతి మృతదేహం తేలియాడుతోందని స్థానికులు అందించిన సమాచారం మేరకు ఏసీపీ రవీంద్రకుమార్, సిబ్బంది చేరుకుని బయటకు తీయిం చారు. బూడిద రంగు టాప్, తెలుపు రంగు ప్యాంటు ధరించిన ఆమె కుడి చేతికి ఎరుపు దారం, చెవికి కమ్మల బుట్టలు, ముత్యంతో కూడిన ముక్కు పుల్ల ధరించి ఉందని తెలిపారు. చెప్పులు రిజర్వాయర్ కట్టపై ఉండటంతో ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేసి వేశారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి వివరాలు తెలిసిన వారు 94910 89128, 94407 95212, 94407 00506 నంబర్లకు ఫోన్ చేయాలని ఏసీపీ కోరారు. -
నమ్మితే.. నయవంచనే!
సాక్షి వరంగల్ : ప్రేమకు పునాది నమ్మకం.. ఆ నమ్మకమే యువతుల పట్ల మరణ శాసనంగా మారుతోంది. ప్రేమ. ప్రేమా అంటూ తియ్యటి మాటలు చెప్పి యువతలను ఆకర్షించడం.. ఆ పైన సెల్ నంబర్ దొరికితే చాలు అమ్మాయి తనదేనని గర్వంగా స్నేహితులకు చెబుతున్న ఘటనలు కోకోల్లలుగా జరుగుతున్నాయి. ఇందులోలో కొన్ని ఘటనలు విషాదంగా ముగుస్తుండడం కుటుంబీకులకు తీరని ఆవేదనను మిగులుస్తున్నాయి. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు సంఘటనల్లో చివరకు అమ్మాయిలు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా యువతులపై జరుగుతున్న దాడుల వల్ల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవువుతున్నారు. ప్రేమ పేరుతో వంచించే నయ వంచకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కళాశాలలకు వెల్లిన తమ పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ప్రతి రోజు పరీక్షే అవుతోంది. ప్రమాదం ఎవరి రూపంలో వచ్చి ఏం చేస్తుందో తెలియక ప్రతీ క్షణం టెన్షన్‌తో బ్రతకాల్సిన పరిస్థితులు చాలా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి. సంఘటనల జరిగాక పోలీసులు ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా నిందితులు, మిగతా వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. పేద కుటుంబం.. ప్రేమ మోసం నగరంలో నాలుగు నెలల్లో జరిగిన రెండు సంఘటనల్లో రెండు పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు అమ్మయిలు తనువు చాలించాల్సి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆగస్టు 10 జరిగిన సంఘటనలో సమ్మయ్యనగర్కు చెందిన పదో తరగతి విద్యార్థిని వెన్నెలపై ఇద్దరు అత్యాచారం చేశారు. దీంతో ఆమె ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక, బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు కొయ్యడ తిరుపతితో పాటు మరో మైనర్ బాలుడు జైలు పాలయ్యారు. ఇంతలోనే మరో అమ్మాయి ప్రేమకు బలైంది. దీన్దయాళ్నగర్కు చెందిన గాదం మానస పేద కుటుంబానికి చెందిన యువతి. ఆమె తల్లిదండ్రులు గాదెం స్వరూప, మల్లయ్య గీసుగొండ మండలం కొమ్మాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. ముగ్గురు పిల్లల్లో ఒకరి వివాహం చేయగా, మరో ఇద్దరిని కూరగాయలు అమ్మి చదివిస్తున్నారు. తల్లిదండ్రులకు తోడుగా షాపులో పనిచేస్తున్న క్రమంలో పులి సాయిగౌడ్ పరిచయం పెంచుకుని ఆ తర్వాత సెల్ నంబర్ తీసుకుని, ముందుగా చాలా మర్యాదగా మాట్లాడుతూ దగ్గరయ్యాడు. ఆ తర్వాత ప్రేమ మొదలుపెట్టాడు. అనంతరం తన కోసం బయటకు రాకుంటే చస్తానని బెదిరించి చివరకు బయటకు వచ్చిన తరువాత బలవంతంగా అత్యాచారం జరిపి హత్య చేయడం ఆ కుటుంబాన్ని ఎంతో కుంగుబాటుకు గురిచేసింది. ఈ రెండు సంఘటనల్లో అమ్మాయిలు కేవలం సెల్ఫోన్లలో నిందితులు ప్రేమగా మాట్లాడిన మాటలకు పొంగిపోయి... ఇంట్లో వారికి చెప్పకుండా నిందితుల వెంట వెళ్లి ప్రాణాలను కోల్పోయారు. మానస హత్యలో నిందితుడు సాయిగౌడ్ సుమారు ఆరు గంటల పాటు మృత దేహంతో ప్రయాణం చేసి , చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం. ఏం జరుగుతుందో... ఇంట్లో ఈడు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడే ఏం జరుగుతుందో కూడా పట్టించుకోని తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కళాశాలలకు వెళ్లే అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర రూ.వేల విలువైన సెల్ఫోన్లు ఉంటున్నాయి. వీటి ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో, ఎవరితో ఎంత సేపు మాట్లాడుతున్నారో పట్టించుకునే తీరిక చాలా మంది తల్లిదండ్రులకు ఉండడం లేదు. కమిషనరేట్ పరిధిలో ప్రతీ వారం షీ టీమ్స్ అధికారులు ఈవ్‌టీజర్లకు కౌన్సెలింగ్ ఇస్తుండగా.. ఇందులో 80 శాతం మంది కళాశాల విద్యార్థులే ఉంటున్నారు. అయితే, కౌన్సెలింగ్ తర్వాత కూడా చాలామందిలో మార్పు రాకపోవడం ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది. మృతదేహం వద్ద నివాళుర్పించిన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఎంజీఎం : అత్యాచారం, హత్యకు గురైన మానస మృతహం వద్ద ప్రభుత్వ చీఫ్ వినయ్‌భాస్కర్ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మానస మృతదేహాన్ని సందర్శించి కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు ఘటనకు పాల్పడిన నిందింతుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కాగా, పోస్టుమార్టం అనంతరం మానస మృతదేహాన్ని స్వగ్రామమైన కొమ్మాలకు తరలించగా రాత్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
వరంగల్ హత్య కేసును చేధించిన పోలీసులు
సాక్షి, వరంగల్ : జిల్లాలో కలకలం రేపిన యువతి హత్యకేసును గంటల వ్యవధిలో పోలీసులు చేధించారు. వరంగల్‌లోని దీన్ దయాల్ నగర్‌కు చెందిన యువతి మానస బుధవారం భద్రకాళి ఆలయానికి వెళ్లి హంటర్ రోడ్డులో అనుమానాస్పదంగా మృతి చెందిన విషమం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కేసులో నిందితుడిని సుబేదారి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఒక కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వరంగల్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. పోలీస్ కమిషనర్ వి. రవీందర్ మాట్లాడుతూ.. కేసులో అరెస్టు చేసిన నిందితుడు జనగాం జిల్లా ఘన్పూర్ మండలం నెమలిగొండ్ల గ్రామానికి చెందిన పులి సాయిగౌడ్‌గా తెలిపారు. ‘నిందితుడు హంటర్‌రోడ్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. హత్యకు గురైన మానస హంటర్‌రోడ్డులోని నీలమ్ జంక్షన్ వద్ద తండ్రితో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తూనే.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వచ్చిపోయే క్రమంలో ఆరు నెలల క్రితం ఇరువురి మధ్య పరిచయం ఏర్పడిందని, కొన్ని రోజుల నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు’ సీపీ పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం మానస పుట్టిన రోజు కావడంతో సాయిగౌడ్ తనను కలిసేందుకు రమ్మని చెప్పాడు. మానస భద్రకాళి గుడికి వెళ్ళి వస్తానని తన తల్లికి చెప్పి బయటకు వచ్చింది. సాయి సూచన మేరకు మానస కాజీపేట చేరుకోగా.. కారులో వచ్చిన సాయి తనను తీసుకొని వెళ్లి చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారులోనే మానసపై హత్యాచారం చేసాడు. ఈ క్రమంలో మానస అక్కడికక్కడే మరణించడంతో ఆ హత్యా నేరం తనపై రాకుండా ఉండేందుకు తన మిత్రుల సహాయం కోరాడు. అనంతరం అక్కడికి చేరుకున్న నిందితుని మిత్రులు శవంగా పడి ఉన్న మానసను చూసి సాయికి సహయం చేసేందుకు అంగీకరించగపోగా, అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. దీంతో కంగారు పడ్డ సాయి ఒంటరిగానే మానస మృతిదేహాన్ని కారులో వేసుకోని చీకటి అయ్యే వరకు శివారు ప్రాంతంలో తిరిగాడు. అనంతరం మానస హత్యను సహజంగా చిత్రికరించేందుకు ఓ కాలేజీ సమీపంలోని బట్టల షాపులో డ్రెస్ కోనుగోలు చేసి, తిరిగి కారులో హంటర్ రోడ్‌లోని న్యూశాయంపేట రైల్వేట్రాక్ వద్ద రక్త సిక్తమైన మృతురాలి బట్టలను తొలగించి కొత్త బట్టలను మృతదేహానికి వేశాడు. అక్కడి నుంచి మానసను ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో పడేసి అనంతరం నిందితుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. కూతురు తిరిగి ఇంటికి రాలేదని కంగారు పడ్డ మానస తల్లిదడ్రులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మానస తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు దర్యాప్తు నిర్వహించి నిందితుడు సాయిగౌడ్‌ను గురువారం మద్యాహ్నం తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక నిందితుడి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకోని కోర్టులో హాజరు పరుచనున్నట్లు సీపీ తెలిపారు. -
500 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, వరంగల్: గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 500 కిలోల గంజాయి, రెండు నాటు తుపాకులు, 11 రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తి, బొలెరో వాహనం, ఐదు సెల్ఫోన్లు, రూ.1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. నిందితుల్లో వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన దండెబోయిన సుమన్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అన్నవరానికి చెందిన వంతల విజయ్, గిమ్మెల రంగారావు, వంతల నర్సింగరావు, మరో నిందితుడు బాల నేరస్తుడు ఉన్నాడని చెప్పారు. -
టాటా చెప్పేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లెదుటే కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం. తన అక్కకు టాటా చెప్పేందుకు వెళ్లిన చిన్నారిని మృత్యువు బస్సు రూపంలో కబళించగా.. అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన తమ కూతురు ఇక లేదనే చేదు నిజాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుళ్లూ.. గోపురాలు తిరిగితే దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడే తీసుకెళ్లాడంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సాక్షి, సంగెం: అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన చిన్నారిని ప్రైవేట్ స్కూల్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాధ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకా రం.. అక్క స్కూల్‌కు వెళ్తుంటే టాటా చెప్పేం దుకు వెళ్లి చెల్లెలు తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాధ సంఘటన ఇది. స్థానికులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కాట్రపల్లికి చెందిన కర్ర జ్యోత్స్న, అమరేందర్‌రెడ్డిలకు సమ్మిత, మనస్విత(రెండున్నర సంవత్సరాలు) సంతానం ఉన్నారు. పెద్దకూతురు వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్ క్యాంపులోని పాత్‌ఫైండర్ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతుంది. బుధవారం బస్సు హారన్ విని తల్లి పెద్ద కూతురు సమ్మితను స్కూల్ బస్సు ఎక్కించడానికి చిన్న కూతురును తీసుకుని ఇంటి సమీపంలోని రోడ్డు వరకు వెళ్లింది. రోడ్ అటు వైపు దాటి ఆగిఉన్న బస్సులో పెద్ద కూతురును ఎక్కించింది. చిన్న కూతురును తీసుకుని బస్సు ముందు నుంచి ఇంటికి వస్తుండగా బస్సు డ్రైవర్ కాగితాల లింగమూర్తి ఆజాగ్రత్తగా ముందుకు వెళ్లడంతో బస్సు ముందు టైర్ కిందపడిన చిన్నారి మనస్విత తల పైనుంచి వెళ్లడంతో రోడ్‌పై ఉన్న కర్ర రాజిరెడ్డి, మిలుకూరి రామచంద్రారెడ్డి, మందాటి రాజేశ్వర్‌రెడ్డి చూసి కేకలు వేయడంతో బస్సును నిలిపివేశాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చిన్నారి మృతిచెందింది. చిన్నారి మనస్విత తండ్రి అమరేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కాగా, చిన్నారి మృతిచెందడంతో కుటుంబసభ్యులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. -
మార్ఫింగ్ ఫొటోలతో అశ్లీల చాటింగ్..!
సాక్షి, వరంగల్: సామాజిక మాధ్యమాల నుంచి యువతుల ఫొటోలను సేకరించాక మార్ఫింగ్ చేసి ఆ ఫొటోలతో ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరుస్తున్నాడు.. ఆ ఖాతా ద్వారా యువతులతో చాటింగ్‌కు దిగేవాడు.. అయితే, అశ్లీలంగా చాటింగ్ చేయకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు... అలా అంగీకరించని ఓ యువతి ఫొటోలను మిత్రులకు పంపించడంతో విషయం బయటపడగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధ్యుడైన ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్టు చేశారు. ధర్మారం వాసి... వరంగల్ రూరల్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి(మైనర్) ఇన్‌స్టాగ్రాంలోని యువతల ఫొటోలను సేకరిస్తున్నాడు. ఆ తర్వాత అశ్లీలకరమైన ఫొటోతో మార్ఫింగ్ చేసి ఆ ఫొటో ద్వారా నకిలీ ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరిచేవాడు. ఆ ఖాతా ద్వారా తనతో అశ్లీలకరంగా చాటింగ్ చేయాలని.. లేకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను తన కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు. ఈక్రమంలో ఓ యువతిని బెదిరిస్తూనే మార్ఫింగ్ చేసిన ఆమె ఫొటోను కాలేజీకి సంబంధించిన గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఖంగుతిన్న సదరు యువతి తల్లిదండ్రులు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించి యువతల ఫొటోలను మార్ఫింగ్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని మట్టెవాడ పోలీసుల సహకారంతో బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఫిర్యాదు అందుకున్న అతితక్కువ సమయంలోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి, మట్టెవాడ ఇన్స్పెక్టర్ తౌటం గణేష్‌తో పాటు ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్లు కిషోర్‌కుమార్, రాజు, దినేష్, ఆంజనేయులు, రత్నాకర్, నరేష్‌ను సీపీ రవీందర్ అభినందించారు. -
క్షుద్రపూజలు చేయించిందని వేధించడంతో..
సాక్షి, హసన్‌పర్తి(వరంగల్): క్షుద్ర పూజలు చేయించావంటూ ఓ కుటుంబం చేస్తున్న వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ అర్బన్ హసన్‌పర్తి మండలం హరిశ్చంద్రు నాయక్ తండాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. హరిశ్చంద్రునాయక్ తండాకు చెందిన కవిత(18) పదో తరగతి పూర్తిచేసింది. ఆమెకు జ్యోతితో పాటు మరో ఇద్దరు యువతులు స్నేహితులు ఉన్నారు. ఇటీవల కోమటిపల్లిలో జ్యోతి ఫొటోకు క్షుద్రపూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు కవితే కారణమని జ్యోతి, ఆమె తండ్రి బిక్షపతి, సోదరుడు అనిల్ వేధించడం ప్రారంభించారు. క్షుద్ర పూజలు ఎవరు చేశారు, ఎవరు చేయించారో చెప్పాలని వేధించారని కవిత బంధువులు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారే బెదిరింపులకు గురి చేశారని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో వారి వేధింపులు భరించలేక కవిత స్థానికంగా ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు జ్యోతి, బిక్షపతి, అనిల్ వేధింపులతోనే కవిత ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. జ్యోతి ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు
సాక్షి, దామెర వరంగల్ : మద్యానికి బానిసై తరచూ వేధింపుపులకు గురి చేస్తున్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనే భావనతో పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన నేరంపై మహిళకు జీవిత కారాగారశిక్ష విధించారు. ఈ మేరకు శుక్రవారం వరంగల్ మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.శైలజ సంచలన తీర్పు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముగంటి బాలకిషన్ కథనం ప్రకారం కేసు, తీర్పు వివరాలిలా ఉన్నాయి బెల్ట్‌షాపు నడుపుతూ మద్యానికి బానిసై... వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ల్యాదెల్ల గ్రామానికి చెందిన ఎరుబాటి మల్హల్రావు, లలితకు 2002లో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితంతో ఆకాష్, నక్షత్ర జన్మించారు. ఓ పక్క వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూనే బెల్టు షాపు నిర్వహిస్తూ జీవనం కొనసాగించే మల్హల్ రావు మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో మల్హల్రావు మద్యానికి బానిపై భార్యను తరచూ వేధించేవాడు. ఈక్రమంలో పలుమార్లు పంచాయతీ నిర్వహించినా మార్పు రాలేదు. 2015 జూలై 6న రాత్రి భార్యాభర్తలు గొడవపడుతుండగా.. ఎప్పుడూ జరిగేదనే భావనతో మల్హల్రావు తండ్రి మోతయ్య రైస్‌మిల్లులో పనికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి వెనుక వూపు వెళ్లి చూడగా ఆయన కుమారుడు కాలిపోయి పడి ఉన్నాడు. అయితే, తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఇది ముమ్మాటికీ హత్యేనని చెబుతూ మోతయ్య ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నేరం అంగీకారం.. ఆత్మకూరు పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో మల్హల్రావు భార్య లలిత పోలీసులకు లొంగిపోయింది. తరచూ తాగిన మైకంలో తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుండడంతో భర్తను చంపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. 2015 జూలై 6న రాత్రి 7 గంటలకు గొడవ పడి బయటకు వెళ్లిన హల్‌హల్‌రావు తిరిగి ఇంటికి రాలేదు. అయితే, అర్ధరాత్రి 12 గంటలకు లలిత బయటకు రాగా.. తాగిన మైకంలో ఇంటి వెనుక పడి ఉన్న భర్త కనిపించాడు. ఈ మేరకు ఇంట్లోని పెట్రోల్ తీసుకొచ్చి ఆయనపై పోసి నిప్పంటించి సజీవంగా కాల్చి చంపింది. అయితే, తాగిన మైకంలో స్పృహ లేకుండా ఉండడంతో మల్హల్రావు ఎలాంటి కేకలు, అరుపులు చేయకుండా మంటల్లో కాలిపోయాడు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. లలితపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ జడ్జి శైలజ తీర్పు వెల్లడించారు. కేసును సీఎం ఎంరవికుమార్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ రమేషబాబు పర్యవేక్షించారు. 31 మంది సాక్షులను కానిస్టేబుల్ డి.వెంకటనారాయణ కోర్టులో ప్రవేశపెట్టారు. -
కన్నపేగునే కబళించారు!
సాక్షి, దామెర(వరంగల్) : మద్యానికి బానిసై ఇంట్లో గొడవలకు కారణమవుతున్న ఓ కొడుకును తల్లిదండ్రులే కడతేర్చారు. ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. హృదయ విదారక ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల దంపతుల పెద్ద కుమారుడు మహేష్ చంద్ర (42). మహేష్ భార్య రాధికను డబ్బుల కోసం వేధిస్తుండటం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆమె ఇటీవల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మహేష్ మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు మహేష్‌ను ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలనార్పి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే సజీవ దహనమయ్యాడు. పరకాల ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట సీఐ ఎస్.వెంకటేశ్వర్రావు, ఎస్సై భాస్కర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులుగా భావిస్తున్న కడారి ప్రభాకర్, విమలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గ్రామస్తులు మహేశ్ తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తొలుత గొంతు కోసి హత్య చేసి.. ఆ తరువాత..
సాక్షి, నెక్కొండ(వరంగల్): వృద్ధ తల్లిదండ్రులపై మమకారాన్ని మరచిన కన్న కొడుకు, మనువడు కలిసి కిరాతకంగా గొంతు కోసి కడతేర్చిన ఘటనలో నిందితులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి పరిధిలోని భూక్యా తండాలో వృద్ధ దంపతులు భూక్యా దస్రూ – బాజిని స్వయాన కుమారుడు, మనవడు కలిసి బుధవారం రాత్రి సజీవ దహనం చేసిన విషయం విదితమే. అయితే, సజీవ దహనం కాదని.. తొలుత గొంతు కోసి హత్య చేశాక.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించారని తేలింది. ముందుగా నిందితులు కేతురాం, వెంకన్నలు బుధవారం సాయంత్రం భూక్యా దస్రూ – బాజి ఇంటికి వెళ్లి వెళ్లగానే దస్రూపై దాడికి పాల్పడి గొంతు కోశాడు. ఆ తరువాత తల్లి బాజిపై దాడికి పాల్పడుతుండగా ప్రాధేయపడినా గొంతు కోసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎవరికి అనుమానం కలగకుండా ఉండేందుకు ఇంట్లో, శవాలను మం చంపై ఉంచి పెట్రోలు పోసి, నిప్పు అంటించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిందితుల కు గాయాలయ్యాయని వారు చెప్పారు. వృద్ధ దంపతులు వారి పనులు వారే చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండేవారని.. అలాంటిది సజీవ దహనం చేస్తే కనుక కేకలు వినిపించేవని తండా వాసులు చెబుతున్నారు. హత్య చేశాక మంచంపై వేసి పెట్రోలు వేసి నిప్పు అంటివచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది..! నెక్కొండ మండలం మడిపల్లి పరిధిలోని భూక్యా తండాకు చెందిన దస్రూకు ఇద్దరు కుమారులు కేతురాం, వీరన్నతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. దస్రూకు ఉన్న భూమిలో పెద్దకొడుకు కేతురాంకు 3–30 ఎకరాలు, చిన్నకొడుకు వీరన్నకు 4 ఎకరాలు బీడు భూమి పంచి ఇచ్చాడు. అయితే కానిస్టేబుల్ అయిన వీరన్న భార్య ఝాన్సీతో ఏర్పడిన గొడవలతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలోనే తన నాలుగు ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టాడు. దీంతో ఏడేళ్ల క్రితం దస్రూ మూడో కుమార్తె భద్రమ్మ ఆ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపింది. వీరన్న రెండో వివాహం చేసుకున్న కొన్నేళ్లకు అనారోగ్యంతో మృతి చెందాడు. తన తమ్ముడికి అర ఎకరం భూమి ఎక్కువ ఇచ్చావని. సోదరి అయిన భద్రమ్మ కొనుగోలు చేసిన భూమి విషయంలో అప్పటి నుంచి కేతురాం గొడవ చేస్తున్నాడు. భూమి సాగు చేసినేందుకు వచ్చిన క్రమంలో కేతురాం కుటుంబ సభ్యులు దాడి చేశారని భద్రమ్మ పేర్కొన్నారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కోర్టులో కేసు వేశామని తెలిపింది. తరచూ గొడవలు జరుగుతుండడంతో ఈనెల 30న బుధవారం నెక్కొండ సీఐ పెద్దన్నకుమార్.. దస్రూ, బాజి, కుమార్తె భద్రమ్మ కుటుంబ సభ్యులు, కేతురాం కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులను పిలిచి విచారణ చేశారు. భద్రమ్మ దగ్గర నాలుగు ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ ఉందని, ఆమెకే సాగు హక్కు ఉందని స్పష్టం చేయడంతో సమస్య పరిష్కారమైందని భావించినట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత తండాకు వెళ్తే గొడవలు జరుగుతాయని పోలీసులు చెప్పడంతో భద్రమ్మ తాము నివాసముంటున్న ఖమ్మం వెళ్లిపోయింది. ఇంతలోనే సాయంత్రం తన తల్లిదండ్రులను కేతరాం, వెంకన్న పొట్టన పెట్టుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు చేతబడి చేయించారని అనుమానం కేతురాం చిన్నకుమారుడు బాలకృష్ణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మూఢనమ్మకాలను నమ్మిన కేతురాం తన తల్లిదండ్రులే చేతబడి చేయించారని అనుమానం పెంచుకున్నాడు. అటు భూమి విషయం కొడుకు అనారోగ్యం విషయంలో తనకు అన్యాయం జరిగిందని కేతురాం కక్ష కట్టి కన్న తల్లిదండ్రులనే కడ తేర్చారని తండాలో చర్చించుకుంటున్నారు. తండ్రి వద్ద ఉన్న భూమిలో వాటా ఇవ్వాలని కొంత కాలంగా కేతురాం ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దస్రూ తన వాటాగా ఉంచుకున్న 2–5 ఎకరాల భూమిలో చిన్న కోడలుకు అర ఎకరం ఇవ్వగా అమ్ముకుంది. అలాగే, కేతురాంకు అర ఎకరం ఇచ్చి, మరో అర ఎకరం దస్రూ అమ్మకున్నాడు. మిగిలిన ఎకరం భూమితో పాటు దస్రూ నివసిస్తున్న ఇంటిని ఇప్పుడే తన పేర చేయాలని కేతురాం కొంతకాలంగా పట్టుబడుతున్నాడు. తన తదనంతరం మాత్రమే ఇస్తానని దస్రూ చెప్పడంతో కేతురాం కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. కాగా, నిందితులను కఠనంగా శిక్షించాలని దస్రు కుమార్తెలు కమలమ్మ, భద్రమ్మ, యాకమ్మ కుటుంబ సభ్యులు విలపిస్తూ కోరారు. భద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ పెద్దన్నకుమార్, ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. -
‘ట్రిమ్‌విజన్’ పేరిట 230 మందికి టోకరా
సాక్షి, వరంగల్: నిరుద్యోగుల ఆశలను సొమ్ము చేసుక్ను మరో సంస్థ బోర్డు తిప్పేసింది. వరంగల్ దేశాయిపేటలోని ట్రిమ్‌విజన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటేడ్ ముందు వందల మంది బాధితులు బుధవారం సాయంత్రం ఆందోళనకు దిగే వరకు కూడా నిర్వాహకులు చేసిన మోసం బయటపడలేదు. ‘విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తాం.. నూరు శాతం ఉద్యోగం గ్యారంటీ.. దుబాయ్, అమెరికా ఏ దేశమైనా సరే ఉద్యోగానికి మాది భరోసా’ అని ట్రీమ్ విజన్ సంస్థ చేసిన ప్రకటనలకు మోసపోయిన నిరుద్యోగులు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. వందలాది మంది నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి విదేశాలకు చెక్కేసిన నిర్వాహకుల తీరు నిరుద్యోగులను కంట తడి పెట్టిస్తోంది. రూ.20వేల నుంచి రూ.60వేల వరకు వరంగల్ దేశాయిపేటలో ట్రిమ్‌విజన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటేడ్ పేరిట మట్టెవాడకు చెందిన సీ.హెచ్.స్నేహలత కార్యాలయాన్ని తెరిచారు. దుబాయిలో ఉద్యోగం... రూ.వేలు, రూ.లక్షల్లో వేతనాలు అంటూ ఊరించి సుమారు 230 మంది నుంచి రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు అందినంత వసూలు చేశారు. స్థానికురాలే కావడంతో నగరానికి చెందిన పలువురు నమ్మి డబ్బు అప్పగించారు. గత ఎనిమిది నెలలుగా నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపి డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. డబ్బుతో పాటు అభ్యర్థుల అర్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్టులు, కూడా తీసుకున్నారు. ఇదిగో వీసా.. అదిగో వీసా అంటూ సుమారు ఆరు నెలలుగా నమ్మించి కాలయాపన చేశారు. ట్రీమ్ విజన్ సంస్థ కార్యాలయం చుట్టూ నిరుద్యోగులు చెప్పులరిగేలా తిరుగుతుండగా.. నిర్వాహకులు రూ.60 లక్షలతో దుబాయికి ఉడాయించినట్లు అందిన సమాచారంతో కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఉన్న ఉద్యోగం వదిలి.. దుబాయిలో ఉద్యోగం వస్తుంది.. రేపో.. మాపో వీసా రానుందనే నమ్మకంతో పలువురు ఇక్కడ చేస్తున్న ఉద్యోగాలను కూడా వదిలేశారు. ఇప్పుడు నిర్వాహకులు బోర్డు తిప్పేసినట్లు తెలియడంతో బాధితులు కుటుంబ సభ్యులతో వచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఇంతేజార్గంజ్ పోలీసులు రంగంలో దిగి బాధితులను శాంతింపచేశారు. అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. బాధితులు ఫిర్యాదు చేస్తే సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశాం... ట్రీమ్ విజన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు సుమారు 230 మంది నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఇందులో సుమారు 30 మందికి డబ్బు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. మిగిలిన బాధితులు ఆందోళనకు దిగగా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్వాహకురాలు సీహెచ్.స్నేహలతపై కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం. – అశోక్‌కుమార్, ఇంతేజార్గంజ్ ఎస్సై -
వాటర్ ట్యాంక్ ఎక్కిన సర్పంచ్
డోర్నకల్: మోడల్ స్కూల్ హాస్టల్ ప్రారంభోత్సవ శిలాఫలకంపై తన పేరు సక్రమంగా రాయకుండా అవమానించారంటూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామ సర్పంచ్ స్థానిక వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. చిలుకోడు జీపీ పరిధి మోడల్ స్కూల్లో శనివారం హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తన పేరు తప్పుగా రాయడమే కాకుండా చివరన చిన్న అక్షరాలతో రాశారని ఆరోపిస్తూ సర్పంచ్ రాయల వెంకటేశ్వర్రావు ప్రారంభోత్సవానికి ముందే గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. తనను అవమానించిన ఇద్దరు వ్యక్తులతో పాటు సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని, లేకుంటే తిక్కడి నుంచి దూకుతానని హెచ్చరించాడు. సర్పంచ్‌కు మద్దతుగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగడంతో ట్రాఫక్ స్తంభించింది. సీఐ జె.శ్యాంసుందర్, ఎస్సై నాగభూషణం ట్యాంకు వద్దకు చేరుకుని సర్పంచ్‌తో మాట్లాడాడు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పినా ఒప్పుకోలేదు. సుమారు నాలుగు గంటల పాటు సర్పంచ్ ట్యాంక్‌పైనే ఉండగా గ్రామస్తులు రోడ్డుపై బైటాయించారు. మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్ వచ్చి చెప్పినా ససేమిరా అనండంతో చివరకు సర్పంచ్ మద్దతుదారులతో పోలీసులు చర్చలు జరిపి అవమానించిన వారిపై ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామని సూచించగా కిందకు దిగివచ్చిన సర్పంచ్ రాతపూర్వకగా ఫిర్యాదు అందజేశాడు. -
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
సాక్షి, వరంగల్ : జిల్లాలోని రెండు వేర్వేరు గ్రామాల్లో పిడుగు పడి ఇద్దరు మరణించారు. మృతులు ఆత్మకూరు మండలం, అక్కంపేట గ్రామానికి చెందిన మహిళ పూలమ్మ(40), గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన రైతు దూడయ్య(45)గా అని గ్రామస్తులు తెలిపారు. జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు కూడా పడడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
కారుతో ఢీకొట్టి కిడ్నాప్ చేసిన కేసులో వీడిన మిస్టరీ!
సాక్షి, బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట శివారులో ఈనెల 5న దంపతులు బైక్‌పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి భార్యను కిడ్నాప్ చేసిన సంఘటనలో నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, నర్మెట సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పారుపెల్లికి చెందిన బండ తిరుపతి– భాగ్యలక్ష్మి దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైనది. భాగ్యలక్ష్మికి అన్నదమ్ములు లేక పోవడంతో తిరుపతి ఇళ్లరికం వెళ్లాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న వీరికి ఒక పాప ఉంది. భాగ్యలక్ష్మి తండ్రి ఆర్ఎంపీగా సేవలందిస్తున్నాడు. ఆయన వద్దకు పక్క గ్రామమైన బొందుగులకు చెందిన మరో ఆర్ఎంపీ పుట్ట బాల్‌నర్సయ్య వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కొంతకాలం నుంచి తిరుపతి భార్యపై అనుమానంతో వేధించసాగాడు. ఈ విషయాన్ని భాగ్యలక్ష్మి బాల్‌నర్సయ్యకు చెప్పడంతో తిరుపతిని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశారు. పక్కా పథకం ప్రకారం.. భాగ్యలక్ష్మి ప్రియుడు బాల్‌నర్సయ్య మిత్రుడు అమరాజు సిద్ధులు హైదరాబాద్‌లో బీడీఎల్‌లో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ పథకం గురించి నర్సయ్య సిద్దులుకు మూడు నెలల క్రితం తెలుపగా మహబూబాద్ జిల్లా బయ్యా రం మండలం గంధంపల్లికి చెందిన మల్సూర్, కేసముద్రం మండలానికి చెందిన లక్ష్మీనారాయణతో కలిసి హత్య చేయడానికి ఒప్పుకుంటారు. ఇందుకుగాను రూ.5 లక్షలు సుపారీ మాట్లాడుకోగా బాల్న్సయ్య అడ్వాన్స్‌గా రూ. లక్ష ఇవ్వగా ఆ ముగ్గురు పంచుకున్నారు. ఈ డబ్బుతో హత్యకు అవసరమైన కా>రును సిద్ధులు ఆలేరు పట్టణంలో రూ.17వేలతో కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఈనెల 5న తిరుపతి, భాగ్యలక్ష్మి జనగామ ఆస్పత్రికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తుండగా పోచన్నపేట శివారులో కారులో వచ్చి ఢీకొట్టా రు. ఈ ఘటనలో గాయపడిన తిరుపతిని పొల్లోకి లాక్కెళ్లి జే వైరుతో ఉరిపెట్టారు. ఆ సమయంలో గొర్లకాపర్లు రావడంతో గాయపడిన భాగ్యలక్ష్మిని కారులో తీసుకుని పోచన్నపేటకు వెళ్లారు. అక్కడి నుంచి బాల్‌నర్సయ్య భాగ్యలక్ష్మి జనగామకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అయితే సంఘటన స్థలంలో అపస్మారకస్థితిలోకి వెళ్లిన తిరుపతిని అటుగా వచ్చిన వారు గమనించి 108లో జనగామ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ మల్లేష్, ఎస్సై రంజిత్‌రావు వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నలుగురు అరెస్టు స్వాధీనం చేసుకున్న వాహనం వద్ద డీసీపీ, ఏసీపీ పోలీసులు; మాట్లాడుతున్న జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి దర్యాప్తులో భాగంగా నర్మెట సీఐ సంతోష్‌కుమార్ ఆదేశాలతో ఎస్సై రంజిత్‌రావు, ప్రొహిబిషన్ ఎస్సై ప్రశాంత్ బొందుగుల గ్రామంలోని ఇంట్లో బాల్నర్సయ్యతో సహా అతడికి సహకరించిన సిద్ధులు, లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశా రు. విచారణ చేపట్టగా హత్యాయత్నం ఘటనలో భాగ్యలక్ష్మి పాత్ర ఉందని తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి మ న్సూర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, రూ.30,430 నగదు, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హత్యాయత్నం కేసులు రెండు రోజుల్లోనే ఛేదించిన ఎస్సైలు రంజిత్‌రావు, ప్రశాంత్‌లను డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ సంతోష్‌కుమార్ అభినందించారు. -
రుధిర దారులు
ఇంకో రోజు గడిస్తే సద్దుల బతుకమ్మ.. ఆ తర్వాత మరో రోజుకు దసరా పండుగ.. ఆయా పండుగలకు సంబంధించి ఆ కుటుంబాలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి.. కుటుంబీకులతో కలిసి ఆనందంగా పర్వదినాలు జరుపుకోవాలని సిద్ధమవుతున్నాయి.. ఇంతలోనే పెనువిషాదం! రోడ్డు ప్రమాదాల రూపంలో ఎదురొచ్చిన మృత్యువు ఎనిమిది మందిని బలి తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని దేవరుప్పుల మండలం బంజర స్టేజీతో పాటు ఆత్మకూరు మండలం కటాక్షపూర్ సమీపాన శుక్రవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఓ ఘటనలో భార్యాభర్తలు వారి కుమారుడితో పాటు మరో ఘటనలు మామ, మేనల్లుడు, సమీప బంధువులు మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. సాక్షి, వరంగల్: ఉమ్మడి జిల్లాలోని రెండు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందడంతో మరో నాలుగు రోజుల్లో దసరా పండుగ జరుపుకోవాల్సిన ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తున్న నలుగురు మృతి చెందగా.. ఇందులో మామ, మేనల్లుడు, బావబామ్మర్దులు ఉన్నాయి. ఇక మరో ఘటనలో సోదరుడిని పరామర్శించి తల్లిదండ్రులతో కలిసి పండుగ జరుపుకునేందుకు వెళ్తున్న భార్యాభర్తలు, వారి ఐదు నెలల కుమారుడు దుర్మరణం పాలవడం కలిచివేసింది. ఓ ప్రమాదానికి అతివేగం, అజాగ్రత్తే కారణమని పోలీసులు తేల్చిచెప్పారు. దేవరుప్పుల మండలం బంజర వద్ద ఓ ప్రమాదం, ఆత్మకూరు మండలం మహ్మద్‌గౌస్‌పల్లి వద్ద శుక్రవారం ఈ ప్రమాదాలు జరిగాయి. బంధువుల మృతదేహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటగా.. ఆస్పత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకుల ఆర్తనాదాలతో మార్మోగాయి. శుభాకార్యానికి వెళ్తుండగా... జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన బోగ సోమనర్సయ్య(40) జనగామలోని వీవర్స్ కాలనీలో స్థిరపడ్డారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం బంధువుల జన్మదిన వేడుకలకు ఆయనతోపాటు ఒకే సామాజిక వర్గం(పద్మశాలి)కు చెందిన హైదరాబాద్ వాస్తవ్యుడు, మేనల్లుడు చింతకింది మణిదీప్(18), జనగామ వీవర్స్ కాలనీకీ చెందిన బోగ రోహిత్, ప్రమీల, ఎల్లంలకు చెందిన బిర్రు సుధీర్‌కుమార్, రమాదేవితో స్విప్ట్ కారు(టీఎస్ 27–9772)లో శుక్రవారం ఉదయం బయలుదేరారు. సుమారు 11 గంటలకు బంజర స్టేజీ సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు రాగానే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంకు చెందిన వృద్ధుడు జక్కులు రాములు వృద్ధుడు టీవీఎస్ ఎక్సెల్‌పై బంక్ నుంచి బంజర వైపు రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆయనను తప్పించబోయే క్రమంలో జనగామ వైపు ఎదురుగా వస్తున్న కారు(టీఎస్ 10యూ 2344)ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ మేరకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ పగిలిపోయి చింతకింది మణిదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, ఎదురుగా వస్తున్న కారులో పెద్దమడూరుకు చెందిన వర్రె మహేష్(24), కొమ్ము కృష్ణ(32), కర్రె అశోక్, చెరుకు సందీప్, దండబోయిన ఉమేష్ తీవ్రగాయాలపాలయ్యారు. రెండు కార్లలోని ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో క్షతగాత్రులతో సహా స్థానిక ఎస్సై బి.రామారావు సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ బోగ సోమనర్సయ్య, కొమ్ము కృష్ణ మృతి చెందగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించిన వర్రె మహేష్ కూడా మృతి చెందగా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరణంలోను వీడని బంధుత్వం, స్నేహం బోగ సోమనర్సయ్య మృతదేహం; చింతకింది మనిదీప్; వర్రె మహేష్; కొమ్ము కృష్ణ బంజర స్టేజీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన నలుగురి నడుమ బంధుత్వం, స్నేహం ఉంది. బోగ సోమనర్సయ్య తమ రక్తససంబంధీకులు, బంధువులతో అన్యోన్యంగా ఉండే క్రమంలో ఆయనతోపాటు అక్క కొడుకు, మేనల్లుడు చింతకింది మణిదీప్ మరణంలోనూ కలిసే వెళ్లారు. ఇక పెద్దమడూరుకు చెందిన వర్రె మహేష్, కొమ్ము కృష్ణ ఒకే సామాజికవర్గాని(యాదవ)కి చెందిన యాదవులు కావడంతో పాటు చిన్ననాటి నుంచి స్నేహంతో పాటు బంధుత్వం(బావబామ్మర్దులు) కూడా ఉంది. ఆస్పత్రిలో మిన్నంటిన ఆర్తనాదాలు జనగామ ఏరియా ఆస్పత్రి వద్ద రోదిస్తున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువులు బంజర స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల్లో నలుగురు మండల వాసులే కాగా మరొకరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నా అందరి నడుమ బంధుత్వం ఉంది. దీంతో ఘటన జరగగా జనగామ ఏరియా ఆస్పత్రికి చేరుకున్న బంధుమిత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనతో మృతి చెందిన బోగ సోమర్సయ్య నీర్మాల వాసికావడమేగాక అత్తగారు ఇదే మండలం కడవెండి కావడంతో ఆ రెండు గ్రామాలతోపాటు జనగామ వీవర్స్ కాలనీలో విషాదం అలుముకుంది. ఇక పెద్దమడూరులో ఊరుకు అరిష్టమని ఏడొద్దుల సద్దుల బతుకమ్మ రోజే ఇద్దరు గ్రామస్తుల దుర్మరణంతోపాటు నలుగురు గాయపడడంతో గ్రామం మూగబోయినట్లయింది. ఇక ఆస్పత్రి వద్ద సోమనర్సయ్య భార్య మాధవి, కొమ్ము కృష్ణ భార్య రేణుక, కుటుంబ సభ్యులు ‘అయ్యో తమ పిల్లల భవిత ఎట్టా.. తమకు ఆదెరువు ఎట్టా...దేవుడా మేమేం పాపం చేశాం..’ అంటూ చేసిన రోదనలు కలిచి వేశాయి. -
అదృశ్యం.. ఆపై అస్తిపంజరంగా..
సాక్షి, ములుగు: భర్త మరణించిన అనంతరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఏర్పడిన వ్యక్తిగత సంబంధం మహిళ ప్రాణాలను బలికొంది. నమ్మిన వ్యక్తితో వెళ్లిన మహిళ అదే వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన ములుగు మండలంలోని జాకారం గ్రామపంచాయతీ పరిధిలోని గట్టమ్మ ఆలయ పరిసర అటవీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో గురువారం కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని పత్తిపల్లి జీపీ పరిధిలోని కొడిశలకుంట గ్రామానికి నూనావత్ రాధ(45) భర్త సారయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు రాజుతో కలిసి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రాధతో అదే గ్రామానికి చెందిన జాటోతు భోజ్యానాయక్ సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. గత నెల 18వ తేదీన రాధ భోజ్యనాయక్తో గట్టమ్మకు మొక్కులు చెల్లించడానికి వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆలయానికి కిలోమీటరు దూరంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వెంట తెచ్చిన స్కార్ప్‌తో రాధను హతమార్చాడు. ఆత్యహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భోజ్యానాయక్ స్కార్ప్‌తో చెట్టుకు ఉరి వేసుకొని రాధ మృతి చెందినట్లుగా కట్టిపడేశాడు. అందరూ ఆత్మహత్యగా భావిస్తారని గుట్టుచప్పుడు కాకుండా స్వగ్రామానికి వెళ్లాడు. ఫిర్యాదుతో.. తల్లి కనిపించకపోవడంతో కుమారుడు నూనవత్ రాజు గత నెల 28న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ములుగు రెండో ఎస్సై డీవీ ఫణీ నేతృత్వంలో పోలీసులు మృతురాలి కాల్ డేటాను సేకరించారు. చివరి రెండు రోజుల్లో భోజ్యానాయక్తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతడు రాధను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. భోజ్యానాయక్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన వెళ్లి చూడగా రాధ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారింది. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అందించారు. నిందితుడిపై 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ దేవేందర్‌రెడ్డి వివరించారు. సమావేశంలో ఎస్సైలు బండారి రాజు, డీవీ ఫణీ పాల్గొన్నారు. రోధనలతో మిన్నంటిన గట్టమ్మ గుట్ట రాధ మృతదేహం కుళ్లిపోయి అస్థిపంజరంగా దర్శనమివ్వడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. రోధలనతో గట్టమ్మ గుట్ట పరిసర ప్రాంతాలు మిన్నంటాయి. అస్థిపంజరం మాత్రమే ఉండడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడే ఖననం చేశారు. -
ఆర్డీఓ సంతకం ఫోర్జరీ..
సాక్షి, నెల్లికుదురు: తొర్రూర్ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య సంతకం ఫోర్జరీ చేసిన కేసులో కొండపల్లి కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్ పంపించినట్లు తొర్రూర్ సీఐ వి.చేరాలు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్‌తో కలసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఇసుక అక్రమంగా రవాణా చేసేందుకు తన సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చేసినట్లు తొర్రూర్ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య ఆగస్టు 19న నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన నెల్లికుదురు ఎస్సై దర్యాప్తు ప్రారంభించారు. మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ వీఆర్ఓ కొండపల్లి నర్శింగరావు కుమారుడు కొండపల్లి కిరణ్‌కుమార్ నెల్లికుదురు తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్‌తో కుమ్మక్కై ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేశారు. ఇసుక రవాణాకు ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు ట్రాక్టర్ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇసుక కూపన్లు సరఫరా చేశారు. ఈ తతంగం ఈ ఏడాది జనవరి నుంచి కొనసాగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు ఏ1 కొండపల్లి కిరణ్ కుమార్‌ను ఈనెల 1న రాత్రి అరెస్టుచేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. అయితే ఏ2 నిందితుడు నెల్లికుదురు తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్ పరారీలో ఉన్నట్లు సీఐ చేరాలు తెలిపారు. వెలుగు చూసింది ఇలా.. బ్రాహ్మణకొత్తపల్లికి చెందిన కొండపల్లి నర్సింగరావు నెల్లికుదురు తహసీల్ కార్యాలయం ఏర్పాటైన కొద్ది సంవత్సరాలు వీర్‌ఓగా పనిచేశాడు. 2009లో నర్సింగరావుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో అతడి కుమారుడు కిరణ్‌కుమార్ రెవెన్యూ అధికారులతో కుమ్మకై తండ్రి స్థానంలో వీఆర్ఓగా చేరాడు. బ్రాహ్మణకొత్తపల్లితో పాటు మధనతుర్తితో పనిచేశాడు. 2010లో బ్రాహ్మణకొత్తపల్లికి ప్రభుత్వం పంటల నష్టం కింద గ్రామానికి మంజూరు చేసిన సుమారు రూ.80వేలు తన ఒక కుటుంబానికే వాడుకుని అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ విషయమై గ్రామస్తులు అప్పటి ట్రెయినీ కలెక్టర్ అంబేడ్కర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి కొండపల్లి నర్సింగరావును వీఆర్ఓ పోస్టు నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల్లికుదురు తహసీల్దార్ కార్యాలయంలో కిరణ్‌కుమార్ హవా కొనసాగుతూనే ఉందని.. ఎట్టకేలకు పాపం పడిందని ప్రజలు అనుకుంటున్నారు. -
ఏడాది క్రితం భార్యకు ప్రేమ లేఖ ఇచ్చాడని..
సాక్షి, వాజేడు: తన భార్యకు ఏడాది క్రితం ప్రేమలేఖ ఇచ్చాడనే కోపంతో కోడిని కోసే కత్తితో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని ప్రగళ్లపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొప్పునూరు గ్రామానికి చెందిన వేల్పుల నగేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన హిమామ్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కాగా నగేష్ హిమామ్ భార్యకు ఏడాది క్రితం ప్రేమిస్తున్నానని లెటర్ ఇచ్చాడు. విషయం తెలుసుకున్న హిమామ్ దాన్ని మనసులో దాచుకున్నాడు. మంగళవారం నగష్ హిమామ్ చికెన్ సెంటర్‌కు రాగా ఈ విషయమై ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశం పట్టలేక హిమామ్ కత్తితో నగేష్‌పై దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో నగేష్ మొఖంపై గాయాలయ్యాయి. వైద్యం చేయించున్న అనంతరం బాధితుడు నేరుగా వాజేడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపారు. గాయపడిన నగేష్ -
వివాహేతర సంబంధం: ప్రియుడి సాయంతో ఘాతుకం
సాక్షి, మహబూబాబాద్: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడు, ఆయన స్నేహితులతో కలిసి హత్య చేయించింది ఓ భార్య.. అయితే, ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ఈ మేరకు భార్య, ఆమె ప్రియుడు, ఇందుకు సహకరించిన మరొకరిని అరెస్టు చేయడంతో పాటు, హత్యకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంగళి కాలనీకి చెందిన ఇన్నారపు నవీన్ పెయింటర్‌గా పనిచేస్తుండగా ఆయన భార్య శాంతితో కలిసి జీవిస్తున్నాడు. అయితే, మరో పెయింటర్ అయిన దాసరి వెంకటేష్‌తో శాంతికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన నవీన్ తన భార్యను గట్టిగా హెచ్చరించాడు. ఈ విషయంలోనే రెండేళ్ల క్రితం దాసరి వెంకటేష్, పద్దం నవీన్ కలిసి ఇన్నారపు నవీన్‌ను ఊరి బయటకు తీసుకువెళ్లి దేహశుద్ది చేశారు. అనంతరం కూడా దాసరి వెంకటేష్, శాంతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా ప్రతిసారి ఇన్నారపు నవీన్ తన భార్యను హెచ్చరిస్తున్నాడు. అయితే, తన భర్తను అడ్డు తొలగిస్తేనే మంచిదని శాంతి చెప్పడంతో వెంకటేష్ అంగీకరించాడు. ఇందులో భాగంగా గతనెల 21వ తేదీన శాంతి తన తల్లిగారిల్లయిన రేగడి తండాకు వెళ్లి రాత్రి 9 గంటలకు మటన్ తీసుకురావాలని తన భర్త నవీన్‌కు ఫోన్లో చెప్పింది. దీంతో ఆయన హోండా యాక్టివాపై రేగడి తండాకు బయలుదేరగా.. ఈ విషయాన్ని శాంతి తన ప్రియుడు వెంకటేష్‌తో పాటు ఆయన స్నేహితుడు పద్దం నవీన్‌కు చేరవేసింది. దీంతో మధ్యలో కాపుకాచిన వెంకటేష్ ఆయన స్నేహితుడు నవీన్ కలిసి ఇన్నారపు నవీన్‌ను ఆపి రోడ్డు పక్కకు లాక్కెళ్లి రాడ్‌తో తలపై కొట్టడమే కాకుండా మెడకు టవల్‌తో ఉరి బిగించి హత్య చేశారు. ఆ తర్వాత రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని వేసి, దానిపై బండి పడవేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మద్యం గ్లాసులు.. సీసా మూతే ఆధారం రోడ్డు ప్రమాదంలో ఇన్నారపు నవీన్ మృతి చెందినట్లు తెలియడంతో పోలీసులు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా అక్కడ మద్యం సేవించిన ప్లాస్టిక్ గ్లాసులు, మద్యం బాటిల్ మూత, ప్లాస్టిక్ వాటర్ బాటిల్, నేలపై ఉన్న రక్తపు మరకలు, చిల్లర డబ్బు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్రావు నేర స్థలంలో లభించిన మద్యం బాటిల్‌పై ఉన్న బార్కోడ్ ఆధారంగా వైన్స్‌ను గుర్తించి వెళ్లి ఆరా తీశారు. మార్గమధ్యలో సీసీ కెమెరాల్లో కనిపించిన వ్యక్తులతో పాటు మృతుడి భార్య శాంతి కాల్‌డేటాను ఆరా తీయగా.. పలుమార్లు వెంకటేశ్‌తో మాట్లాడినట్లు తేలింది. దీంతో శాంతితో పాటు దాసరి వెంకటేష్, పద్దం నవీన్‌ను మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం అదుపులోకి విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు కేసులో పకడ్బందీగా విచారించిన కురవి ఎస్సై జె.శంకర్రావు, వారి సిబ్బందిని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఆంగోతు నరేష్కుమార్, మహబూబాబాబాద్ రూరల్ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్రావు పాల్గొన్నారు. -
మహిళపై మాజీ కార్పొరేటర్ దాడి
సాక్షి, కరీమాబాద్: నగరంలోని 9వ డివిజన్ ఖిలావరంగల్ మద్యకోటలో సోమవారం భూ వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాల మద్య గొడవ జరగడంతో మహిళకు గాయాలయ్యాయి. మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం. ఖిలావరంగల్ మద్యకోటలోని వాకింగ్ గ్రౌండ్ సమీపంలో ఉన్న ఎకరం స్థలం తమదంటే తమదని మాజీ కార్పొరేటర్ కొప్పుల శ్రీనివాస్, ముప్ప శ్రీలత గొడవలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో శ్రీలత ఆమె భర్త సోమవారం వివాదాస్పద స్థలంలోని పంటపొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొప్పుల శ్రీనివాస్‌కు ముప్ప శ్రీలతలకు మద్య గొడవ జరిగింది. దీంతో శ్రీనివాస్ శ్రీలతను కర్రతో కొట్టడంతో తలకు గాయమైంది. ఈ గొడవలో మరో వ్యక్తికి కూడా గాయమైంది. తీవ్రంగా గాయపడిన శ్రీలతతో పాటు ఆమె సంబందీకులు మిల్స్‌కాలనీ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం గాయాలైన శ్రీలతను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించి.. దాడికి పాల్ప డిన కొప్పుల శ్రీనివాస్‌పై, అతనితో ఉన్న కొప్పుల మొగిలీపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసును ఎస్సై వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు. -
నాడు ప్రేమన్నాడు.. నేడు కాదన్నాడు
వరంగల్ చౌరస్తా: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడి ఇంటి ఎదుట బాధిత యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన సంఘటన వరంగల్ 16వ డివిజన్లో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. లక్ష్మిపురానికి చెందిన పోలెపాక సృజన్‌కు అదే ప్రాంతానికి చెందిన యువతి పరిచమైంది. ఆరేళ్ల కిందట ప్రేమ పేరుతో వెంబడించడం, యువతి తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో వెళ్లి మాట్లాడటం చేశాడు. కాల క్రమేణ శారీరకంగా బలవంతం చేశాడు. అందుకు యువతి నిరాకరించడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లొంగదీసుకున్నాడు. పెళ్లి విషయంపై యువకుడి తల్లి విజయ, చెల్లెలికి వివరించిగా, వారు అంగీకరించినట్లు తెలిపింది. నెల రోజుల క్రితం పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిలదీయగా చేసుకోనని, తిట్టి పంపించాడు. దీంతో యువతికి ఇంతేంజార్ గంజ్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఇద్దరిని పిలిచి వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులు తీసుకురావాలని సూచించారు. అంగీకరించిన సృజన్ మర్నాడు మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. దీంతో బాధిత యువతి తల్లిదండ్రులతో కలిసి యువకుడి ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని, వివాహం జరిపించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీసాల ప్రకాశ్, టీఆర్ఎస్ నాయకుడు సీతయ్య తదితరులు యువతికి అండగా మద్దతు పలికారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి యువకుడిని మందలించగా, మరో యువతిని ఒక రోజు ముందే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు సృజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఇంతేంజార్ గంజ్ పోలీసులు తెలిపారు. -
హెచ్ఎం వర్సెస్ టీచర్
విద్యారణ్యపురి: కడిపికొండలోని జిల్లాపరిషత్ హైస్కూల్లోని హెచ్ఎం జయమ్మ, అదే స్కూల్లో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా వెంకటకరుణాకర్‌కు మధ్య కొంత కాలంగా విబేధాలు నెలకొన్నాయి. ఇరువురు పరస్పరం డీఈఓకు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు వెంకటకరుణాకర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా.. బెరింపులకు గురిచేస్తున్నారని హెచ్ఎం జయమ్మ 15సార్లకు పైగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోకున్నా.. చార్జెస్ ప్రేమ్ చేశారని తెలిసింది. మరోవైపు వెంకటకరుణాకర్ కూడా హెచ్ఎం జయమ్మపై డీఈఓకు పలు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ కార్యదర్శి రమేష్‌బాబుతో పరిశీలన చేయించారు. ఈ అంశంపై ఆయన నివేదిక ఇవ్వగా... హెచ్ఎం జయమ్మ చెప్పినట్లు ఉపాధ్యాయుడు వినడం లేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తాం కడిపికొండ జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం జయమ్మ, వెంకటకరుణాకర్‌కు మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరిపించాక వెంకటకరుణాకర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ కె.నారాయణరెడ్డి వివరణ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితమే ఆయనపై చార్జెస్ ఫ్రేమ్ చేశామన్నారు. ఒకటి, రెండురోజుల్లో విద్యాశాఖకు సబంధించిన వారితో విచారణ జరిపించాక చర్యల్లో భాగంగా ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తామని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు కడిపికొండ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జయమ్మ ఈనెల 13న సంబంధిత పరిధిలోని పోలీస్టేషన్లో మ్యాథ్స్ స్కూల్‌అసిస్టెంట్ వెంకటకరుణాకర్‌పై ఫిర్యాదు చేశారు. పాఠశాలలో తన వద్దకు వెంకటకరుణాకర్ వచ్చి రిజిస్టర్లో సంతకం చేయబోగా.. సర్వీస్‌బుక్ ఇవ్వాలంటూ తాను ఇచ్చిన మెమో, నోటీసులు తీసుకోవాలని సూచించానని తెలిపారు. సరేనని నమ్మబలికి హాజరు రిజిస్టర్లో సంతకం చేశాక మెమో, నోటీసుబుక్ను తన ముఖంపై కొట్టడంతో పాటు కులం, లింగ వివక్షతతో దూషించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఏసీసీ ఈనెల 16న హైస్కూల్‌కు వెళ్లి కూడా విచారణ జరిపినట్లు సమాచారం. -
రాత్రంతా జాగారం చేసిన కడిపికొండ
సాక్షి, కాజీపేట: ఏడ్చీ ఏడ్చీ ఇంకిపోయిన కన్నీళ్లు.. తమ వారేమయ్యారోనని అంతు లేని ఎదురుచూపులు.. సురక్షితంగా బయటపడిన వారు ఎలా ఉన్నారోనని ఆవేదన.. వచ్చివెళ్లే వారి పరామర్శలు.. రాత్రి మొత్తం జాగారం.. ఇదీ కడిపికొండ గ్రామంలోని పరిస్థితి! పాపికొండల విహారయాత్రకు వెళ్లి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులు 14 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఇంకో ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ఏడుగురి ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాయి. కాగా, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ పాపికొండలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న వారిలో న్యూశాయంపేట వాసి హేమంత్ కూడా ఉన్నట్లు తెలియడంతో గల్లంతైన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా, బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృతదేహాలు సోమవారం అర్ధరాత్రి 2.30 గంటలకు స్వస్థలానికి చేరగా కుటుంబీకులకు అప్పగిం చారు. దీంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. అలాగే, సురక్షితంగా బయటపడిన ఐదుగురికి రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స చేసిన అనంతరం అంబులెన్స్‌లో ఇక్కడకు పంపించగా మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక సోమవారం ఉదయం వరకు రంపచోడవరం చేరుకున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌లు అక్కడి మంత్రులు, అధికారులతో మాట్లాడుతూ మృతదేహాల తరలింపు, గల్లంతైన వారి గాలింపు చర్యలను సమీక్షించారు. కాజీపేట మండలంలోని కడిపికొండ కన్నీటి సంద్రంగా మారింది.. గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే.. ‘అంతు’చిక్కని తమ వారి ఆచూకీ కోసం రోదనలు.. మృతి చెందినట్లు తేలిసిన వారి కుటుంబాల్లో మిన్నంటిన ఆర్తదానాలు.. సురక్షితంగా బయటపడిన వారి బంధువులు తమ వారు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తూనే.. సహచరులు గల్లంతు కావడంపై ఆవేదన... ఇదీ గ్రామంలో సోమవారం నెలకొన్న పరిస్థితి! తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం చోటు చేసుకున్న బోటు ప్రమాదంలో కడిపికొండకు చెందిన 14 మంది చిక్కుకుకోవడం తెలిసింది. ఇందులో ఐదుగురు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరి మృతదేహాలు ఆదివారం రాత్రే బయటపడ్డాయి. ఇక మిగిలిన ఏడుగురి ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాలు టీవీలు చూస్తూ.. పరామర్శకు వచ్చిన వారిని ఆరా తీస్తూ రాత్రంగా గడిపారు. వెలగని పొయ్యి గల్లంతైన వారితో పాటు మృతి చెందిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. అలాగే, సురక్షితంగా బయటపడిన వారి కుటుంబీకులు తమ వారి కోసం ఎదురుచూడడం కనిపించింది. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు గ్రామంలోని వారి గృహాల్లో పొయ్యి వెలగలేదు. మిగతా గ్రామస్తులు ముందుండి వంటలు చేయించి భోజనాలు పెట్టిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. పాండవుల గుట్టల్లో పాపికొండలు ప్లాన్ కడిపికొండకు చెందిన బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, సివ్వి వెంకటస్వామి, బస్కే రాజేంద్రప్రసాద్, బస్కే అవినాష్, దర్శనాల సురేష్, ఆరెపల్లి యాదగిరి, గొర్రె రాజేందర్, కొండురి రాజ్‌కుమార్, కొమ్ముల రవి, గొర్రె ప్రభాకర్, బస్కే ధర్మరాజు, బస్కే రాజేందర్, బస్కే వెంకటస్వామి ఐదేళ్లుగా వాకింగ్ చేస్తున్నారు. వీరిలో సివ్వి వెంకటస్వామి, బస్కే వెంకటస్వామి రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు కాగా గొర్రె ప్రభాకర్ రైల్వే బుకింగ్ క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా వారిలో కొందరు టీఆర్ఎస్లో కొనసాగుతుండగా.. ఇంకొందరు ఆటో డ్రైవర్లు, పెయింటర్లుగా జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతీరోజూ కడిపికొండ నుండి రాజీవ్‌గృహ కల్ప సముదాయం వరకు వాకింగ్ చేయడం ఆనవాయితీ. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మాదిగ మహరాజ్ కుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ సంఘం ద్వారా పాపికొండల టూర్‌కు వెళ్లాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. రైలు టికెట్లు కూడా బుక్ చేసుకున్నప్పటికీ ఆ సమయంలో భారీ వర్షాలు కురవడంతో టికెట్లు రద్దు చేసుకున్నారు. అయినా విహారయాత్రకు వెళ్లాలనే కాంక్షతో పాండవుల గుట్టకు వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడే మాట్లాడుకునే క్రమంలో ఎలాగైనా పాపికొండలు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మళ్లీ టూర్‌ను ప్లాన్ చేసుకుని సరదాగా వెళ్లి వచ్చారు. అనంతరం పాండవుల గుట్ట టూర్ నుండి పాపికొండల టూర్‌కు ప్లాన్ వేసారు. ఇటీవల వాతావరణం అనుకూలించగా రైల్వే బుకింగ్ క్లర్క్ గొర్రె ప్రభాకర్ 14 మందికి రైలు టికెట్లు బుక్ చేశారు. కంటిమీద కునుకులేదు.. కడిపికొండకు చెందిన 14 మంది పాపికొండల టూర్‌కు వెళ్లి బోటు ప్రమాదంలో చిక్కుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు తమ వారి ఆచూకి లభిం చిందా లేదా.. మృతి చెందారా, ఏదైనా సమాచారం అందుతుందా అంటూ ఆదివారం రాత్రంతా జాగారం చేశారు. వీరికి తోడు కడిపికొండ వాసులు కూడా ఉండడంతో ఊరంతా జాగారం చేసినట్లయింది. మృత్యుంజయులు పాపికొండల విహారయాత్రకు వెళ్లిన కడిపికొండకు చెందిన 14 మందిలో సురక్షితంగా బయటపడ్డ బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, ఆరెపల్లి యాదగిరి, గొర్రె ప్రభాకర్, దర్శనాల సురేష్‌ను రంపచోడవరం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందజేయగా... సోమవారం ఉదయకల్లా అక్కడకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, వరంగల్ ఎంపీ పసునూని దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించారు. తక్షణ వైద్యఖర్చుల నిమిత్తం రూ.10వేలు అందజేయడంతో పాటు వైద్యులు మాట్లాడారు. అనంతరం వరంగల్ నుంచి వెళ్లిన కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ అజయ్ తదితరులు అంబులెన్స్‌లో తీసుకురాగా.. సోమవారం రాత్రి 11.30 గంటలకు హన్మకొండకు చేరుకోగానే మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. టూర్సాగిందిలా.. కాజీపేట నుంచి శుక్రవారం రాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరిన వారు శనివారం ఉదయం 5.45 నిమిషా లకు రాజమండ్రి చేరుకున్నారు. ఓ లాడ్జిలో సేద తీరి.. గైడ్ సాయంతో రూ.3వేల టూర్ ప్యాకేజీ మాట్లాడుకున్నారు. శనివారం ఉదయం రాజమండ్రి పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఆదివారం ఉదయం 11.30 నిమిషాలకు దేవిపట్నం ప్రాంతానికి చేరుకుని బోటులో పాపికొండల టూర్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 12.35 నిమిషాలకు కచ్చులూరుకు బోటు చేరుకోగా గోదావరి ఉగ్రరూపానికి మునిగిపోయింది. దీంతో లైఫ్ జాకెట్లు ధరించిన ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా వారు గల్లంతు కాగా.. బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృతదేహాలు మాత్రమే వెలుగు చూశాయి. ప్రమాద ఘటనలో న్యూశాయంపేట వాసి గోదావరిలో బోటు మునిగిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మరొకరు కూడా ఉన్నట్లు సోమవారం సాయంత్రానికి తెలిసింది. హన్మకొండ హంటర్‌రోడ్డులోని న్యూశాయంపేటకు చెందిన దోమల హేమంత్ గల్లంతైన వారిలో ఉన్నట్లు సమచారం. హైదరాబాద్‌లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో విధులు కొనసాగిస్తున్న హేమంత్ స్నేహితులతో కలిసి పాపికొండలు టూర్‌కు వెళ్లాడు. బోటు ముగినిపోయినట్లు తెలియడంతో హేమంత్ తండ్రి భూమయ్య, తల్లి పద్మావతి కన్నీరుమున్నీరయ్యారు. కాగా, భూమయ్య టైలరింగ్ వృత్తి కొనసాగిస్తూ ముగ్గురు కుమారులను చదివించారు. ఇప్పుడు హేమంత్ గల్లంతైనట్లు తెలియడంతో ఆయన రోదిస్తున్నారు. బస్కే అవినాష్ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి ; బస్కే రాజేందర్ కుటుంబీకులు రెండు మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృత దేహాలు కూడా కడిపికొండకు చేరుకున్నాయి. ఈ మేరకు రంపచోడవరం ఆస్పత్రిలో పోస్టుమార్టం కార్యక్రమాలు త్వరగా పూర్తయ్యేలా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ఆతర్వాత అంబులెన్స్‌లో కడిపికొండకు తీసుకురాగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మృతదేహాలు చేరుకోగానే కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పరామర్శించిన మంత్రులు గోదావరి నదిలో బోటు ప్రమాదంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడ్డ బస్కే దశరధం, బస్కే వెంకటస్వామి, గొర్రె ప్రభాకర్, దర్శనాల సురేష్, ఆరెపల్లి యాదగిరి రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితులు సమీక్షిచేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బాధితులను పరామర్శించిన సమయంలో తెలంగాణ మంత్రులు కూడా ఉన్నారు. ఇక కాజీపేట ఇన్స్పెక్టర్ అజయ్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకన్నారు. రెండు శాఖలు 13 మంది ఇంజనీర్లు.... వరంగల్: పాపికొండల విహార యాత్రకు రెండు ప్రాంతాలు, రెండు శాఖలకు చెందిన 13 మంది ఇంజనీర్లు వెళ్లిన ట్లు తెలిసింది. ఇందులో హైదరాబాద్ పోలీసు హౌజింగ్ శాఖకు చెందిన ఏఈలు ఏడుగురు ఉండగా ఆదిలాబాద్ జిల్లాకు విద్యు త్ శాఖ ఏఈలు ఆరుగురు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ హౌజింగ్ ఏఈల్లో ప్రమాదం నుంచి నలుగురు బయట పడగా ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో హన్మకొండ న్యూశాయంపేటకు చెందిన హేమంత్ కూడా ఉన్నట్లు తెలియడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఐదు అంబులెన్స్‌లు... అధికారులు తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో చిక్కుకున్న జిల్లా వాసులను అండగా నిలిచేందుకు ఇక్కడి నుంచి అధికారులు ఆదివారం రాత్రే వెళ్లారు. జిల్లా నుంచి ఐదు అంబులెన్స్‌లతో పాటు కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ అజయ్ వెళ్లారు. ఈ మేరకు ఓ అంబులెన్స్‌లో బస్కె రాజేందర్, బస్కె అవినాష్ మృతదేహాలతో పాటు సురక్షితంగా బయటపడిన మరో ఐదుగురికి ఇంకో అంబులెన్స్‌లో పంపించారు. నదిలో పడ్డాక లైఫ్ జాకెట్ దొరికింది.. రాజమండ్రి నుంచి పాపికొండలు.. అక్కడి నుంచి భద్రాచలం వెళ్లాలన్నది మా ప్లాన్. బోటు ప్రయాణం సాగుతుండగా ఒక్కసారిగా కుదిపినట్లు అయ్యింది. అందులో ఉన్నవారంతా కేకలు పెడుతుండగానే బోటు మనిగిపోయింది. మునిగిన బోటు ఒక్కసారిగా పైకి లేచింది. ఆ క్షణంలోనే నాతో పాటు కొందరం బయటపడ్డాం. అప్పటి వరకు నాకు లైఫ్ జాకెట్ లేదు. బోటులో ఉన్న కొన్ని జాకెట్లు నీటిపై తెలియడుతుండగా ఒక్కటి వేసుకుని ఈదడం మొదలు పెట్టాను. సుమారు 15 నిమిషాల తరువాత స్థానిక జాలర్లు నన్ను రక్షించారు. అలా నేను బతికి బయట పడ్డాను. నదిలో పడ్డాక మళ్లీ ఈ లోకాన్ని చూస్తాననని ఊహించ లేదు. – బస్కే వెంకటస్వామి, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సంబంధిత వార్తలు... నిండు గోదారిలో మృత్యు ఘోష -
పండగ వేళ విషాదం
సాక్షి, జనగామ(వరంగల్) : వినాయక చవితి ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. పండగ సరుకుల కోసం సంతకు వెళ్లి వస్తుండగా.. మృత్యువు రూపంలో దూసుకువచ్చిన ఓ కారు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన జనగామ మండలం పెంబర్తి వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించిన ఎస్సై శ్రీనివాస్ తెలిపాన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన జూకంటి జహంగీర్(40), కొమురయ్య, సిద్ధులు వినాయక చవితి పండగ సరుకులతో పాటు ఇతర పనుల నిమిత్తం ద్విచక్రవాహనాలపై జనగామ జిల్లా బచ్చన్నపేట సంతకు వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా స్వగ్రామానాకి వెళ్లే ఎక్స్(టంగుటూరు) రోడ్డు మలుపు వద్ద ముగ్గురు కలవడంతో రహదారి పక్కన కాసేపు ఆగి మాట్లాడుకుంటుండగా వరంగల్ వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి, రాంగ్ రూట్లో వీరు నిలబడిన ప్రదేశానికి దూసుకొచ్చింది. కారువేగాన్ని గమనించిన వారు తప్పించుకునే లోపే వారిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జూకంటి జహంగీర్ అక్కడిక్కడే మృతిచెందగా, సిద్ధులు, కొమురయ్యలకు తీవ్రగాయాలు కాగా క్షతగాత్రులను 108లో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. కాగా, మృతిచెందిన జహంగీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
ఫోర్జరీ సంతకంతో డబ్బులు స్వాహా..
సాక్షి, వరంగల్ : మహిళా సంఘం బాగోగులు చూడాల్సిన ఓ ‘సీఏ’ సంఘం సభ్యులను మోసం చేసి, ఫోర్జరీ సంతకంతో డబ్బులు ‘డ్రా’ చేసింది. సొంతంగా వాడుకున్న విషయమై ఏపీఎంకు చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. మహిళా సంఘం డబ్బులు సంఘం బాధ్యులు దుర్వినియోగం చేయకుండా నెల నెలా సంఘం లెక్కలు చూడాల్సిన సీఏ మహిళా సంఘం డబ్బులు రూ.70 వేలను బ్యాంక్ నుంచి డ్రా చేసిన సంఘటన నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామంలో జరిగింది. ఈ విషయాన్ని అయ్యప్ప పొదుపు సంఘం సభ్యురాలు, గ్రామ 4వ వార్డు సభ్యురాలు తోపుచర్ల పద్మ ఆదివారం ఏపీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గ్రామానికి చెందిన సాయిరాఘవ పొదుపు సంఘం సీఏ సుజాత సంఘానికి సంబంధించిన డబ్బులను నెక్కొండ ఏపీజీవీబీ నుంచి డిసెంబర్ 2018లో రూ.10వేలు, మార్చి 2019లో రూ.20 వేలు, ఏప్రిల్‌లో రూ.40 వేలను బ్యాంక్ నుంచి డ్రా చేసినట్లు ఆమె తెలిపారు. సంఘానికి సంబంధించి నెల నెలా లెక్కలు ఉండడంతో రికార్డులు, ముద్రలు, బ్యాంక్ పాస్ పుస్తకాలు సీఏ వద్ద ఉండేవన్నారు. దీంతో మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మరో 8 మంది సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి, తీర్మాణం రాసి బ్యాంక్ అధికారులను మోసం చేసి డబ్బులను తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు ఆమె వివరించారు. ఈ నెల 17న తాను బ్యాంక్ వెళ్లగా ఈ విషయం తెలిసిందని ఆమె పేర్కొన్నారు. సంఘం సభ్యులందరూ బ్యాంక్ అధికారుల ఎదుట హాజరైతేనే సంఘానికి రుణం మంజూరు చేయాల్సి ఉండగా కేవలం సీఏను నమ్మి ఎలా డబ్బులు డ్రా చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఏపీఎం శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. విచారణ చేసి డబ్బులు స్వాహాకు పాల్పడిన సీఏ సుజాతపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏపీఎం తెలిపారు. -
ఇస్మార్ట్ ‘దొంగ’ పోలీస్!
కాళేశ్వరం: రూ.30వేల జీతం.. పేరైన కంపెనీలో ఆపరేటర్ ఉద్యోగం.. యువకున్ని చూస్తే అచ్చం పోలీసులాగా ఉండే దేహదారుఢ్యం.. ఇదంతా బాగానే ఉన్నా పోలీస్ యూనిఫాంను పోలిన డ్రెస్సుతో అందరిని ఇస్మార్ట్‌గా బెదిరిస్తున్నాడు ఈ దొంగ పోలీస్!. అసలు విషయం ఏమిటంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లిపంపుహౌస్లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అమర్జిత్సింగ్ భూమ్ప్రెసర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి నెలకు రూ.30వేల జీతం కూడా వస్తుంది. కానీ వక్రబుద్ధితో పోలీస్‌లా డ్రెస్సు వేసుకొని అంతర్రాష్ట్ర వంతెన వద్ద వచ్చిపోయే ఆటోవాలాలను బెదిరిస్తూ డబ్బులు వసూళ్లకు పూనుకున్నాడు. అనుమానం వచ్చిన ఆటోవాలాలు శనివారం సాయంత్రం కాళేశ్వరం పోలీసులకు దొంగ పోలీస్‌పై సమాచారం ఇవ్వగా స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన పద్ధతిలో లాఠీకి పని చెప్పారు. అయితే అతడిపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కంపెనీ వారు రావడంతో వదిలిపెట్టారు. గతంలోనూ మద్యం తీసుకు వెళ్తున్న వ్యక్తులను ఇదే డ్రెస్సులో వచ్చి మద్యం బాటిళ్లు లాక్కున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతగాడి వ్యవహారం వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయింది. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, వరంగల్ అర్బన్ : పరీక్షలు ఫెయిల్ కావడంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వంగర ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం వంగర గ్రామానికి చెందిన వొల్లాల రమేష్–రాణి దంపతుల రెండో కుమారుడైన వొల్లాల నిశాంత్(21) హైదరాబాద్‌లో బీటెక్ తృతీయ సంవత్సరం చదవుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికొచ్చాడు. సప్లిమెంటరీ ఫలితాల్లో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున నిశాంత్ తండ్రి రమేష్ పని నిమిత్తం హైదరాబాద్‌కు, తల్లి వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నిశాంత్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుని మృతదేహంపై పడి తల్లిదండ్రులు రమేష్, రాణి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు
సాక్షి, వరంగల్: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి లో బుధవారం చోటు చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. దొడ్ల నరేష్(22) కొన్ని నెలలుగా మతి స్థిమితం కోల్పోయాడు. బుధవారం తల్లి లక్ష్మితో కలిసి వ్యవసాయ భూమిలో పంటకు మందు కొట్టేందుకు వెళ్లారు. తల్లి నీళ్లు తాగేందుకు కొంతదూరం వెళ్లగా నరేష్ వద్ద ఉన్న పురుగుల మందు తాగాడు. గమణించిన తల్లి స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం చిట్యాల సామాజిక ఆరోగ్యానికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. కాగా, మతిస్థిమితం కోల్పోయిన నరేష్ గతంలో కూడా రెండుసార్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్సాడ్డాడని తెలిపారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పల్లె నర్సింగ్ తెలిపారు. ఉరి వేసుకుని మరో యువకుడు.. కాజీపేట: ప్రభుత్వ ఐటీఐ చదువులో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మానసిక ఆవేదనతో క్షణికావేశానికిలోనై ఓ యువకుడు బుధవారం కాజీపేట ప్యారడైజ్ ఫంక్షన్హాల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ అజయ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. రామకృష్ణకాలనీకి చెందిన తాండ్ర అరవింద్(20) ఇటీవల ఐటీఐలో ఫెయిల్ అయ్యాడు. కొద్ది రోజులుగా మిత్రులతో కలిసి క్యాటరింగ్ పనులకు వెళ్తున్నాడు. చదువులో వెనుకబడిపోయాననే బాధతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపాడు. మహిళా ఆత్మహత్యాయత్నం.. నర్మెట: ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానకి పాల్ప డింది. ఈ సంఘటన మండలంలోని ఆగాపేటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొన్నేళ్లుగా వ్యవసా యం కలసిరాకపోవడంతో రైతు శిల్వారెడ్డి అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది కూడా వర్షాలు కురవకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు భార్య సబీనమ్మ బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఎంజీఎంకు తరలించారు. -
బైకుల దొంగ అరెస్ట్
సాక్షి, వరంగల్: మండలంలో ఈనెల 10న 2 మోటార్‌సైకిళ్లు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు గార్ల, బయ్యారం సీఐ వై.రమేష్ తెలిపారు. బుధవారం గార్ల పోలీస్‌స్టేషన్‌లో మోటార్‌సైకిళ్ల చోరీకి సంబందించిన వివరాలను సీఐ విలేకరులకు వెల్లడించారు. గార్లలో గత 2 నెలల క్రితం బంధువుల ఇళ్లకు వచ్చిన మహ్మద్ రఫిక్ గార్లలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10న అర్ధరాత్రి గార్లకు చెందిన పతంగి ప్రవీణ్, గద్దపాటి రాము తమ ఇళ్ల ముందర మోటార్‌సైకిళ్లు పెట్టి, ఉదయాన్నే లేచిచూడగా మోటార్ సైకిళ్లు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు గార్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు గార్ల ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి గార్లలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మహ్మద్ రఫిక్ మోటార్‌సైకిళ్ల చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. నాటినుంచి పరారీలో ఉన్న నిందితుడు బుధవారం సత్యనారాయణపురం క్రాస్‌రోడ్ వద్ద చోరీ చేసిన అప్పాచీ, స్కూటీ మోటార్‌సైకిళ్లను వేరే వ్యక్తులకు అమ్ముతుండగా గార్ల పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి రూ.1లక్ష విలువ గల 2 మోటార్‌సైకిళ్లను స్వాధీన పరుచుకుని, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతీ గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని శాంతి భద్రతలను కాపాడుకోవడంలో పోలీసులతో ప్రజలు భాగస్వాములు కావాలని సీఐ కోరారు. కాగా, మోటార్‌సైకిళ్ల చోరీ నిందితుడిని పట్టుకున్న ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించి, వీరికి త్వరలో రివార్డులు అందజేస్తామని తెలిపినట్లు సీఐ రమేష్ విలేకరులకు తెలిపారు. -
వరంగల్: దొంగల ముఠా అరెస్ట్
సాక్షి, కాజీపేట అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు క్రైం ఏసీపీ బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా సీసీఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీకి చెందిన కోటగిరి సునీల్, కోటగిరి రాజు, చెట్టె ప్రసాద్, చెట్టె సురేష్‌లతో పాటు దామెర మండలంలోని ఊరుగొండ గ్రామానికి చెందిన మేకల రాములు ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. సమీపబంధువులైన ఈ ఐదుగురు జల్సాలకు మోజులో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. 2005 నుంచి చోరీలకు పాల్పడడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నిందితులు గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శాయంపేట, పరకాల, గీసుకొండ, మామూనూర్, ఆత్మకూర్, ఇంతేజార్గంజ్, మట్టెవాడ, కాజీపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడగా పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు తరలించామన్నారు. ఈనెల 5వ తేదిన కాజీపేట బాపూజీనగర్‌లోని ఓ ఇంట్లో మహిళను తాగేందుకు నీరివ్వమని మాయమాటలు చెప్పి ఇంట్లో ఉన్న నగల బ్యాగును దొంగిలించారు. దీంతో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 2015లో ఖమ్మం జిల్లా ఇల్లంద ప్రాంతంలో ఇదే విధంగా చోరీలకు పాల్పడడంతో సీసీఎస్ పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులకు సంబంధించిన ఫొటోలను సేకరించి వారి కదలికపై దృష్టి సారించారు. కాగా శుక్రవారం చోరీ చేసిన బంగారాన్ని హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్యాసింజర్ ఆటోలో కాజీపేట రైల్వే స్టేషన్‌కు వస్తున్నట్లు సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు రైల్వే స్టేడియం వద్ద గస్తీ నిర్వహించారు. అనుమానాస్పదంగా తారసపడిన ముఠాను విచారించగా చోరీలకు పాల్పడిన విషయాన్ని ఒప్పుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. క్రైం ఏసీపీ బాబురావు, కాజీపేట ఏసీపీ నర్సింగరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రవిరాజు, శ్రీనివాస్‌రావు, కాజీపేట ఇన్స్పెక్టర్ అజయ్, ఎఎస్సై శివకుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు అహ్మద్‌పాషా, జంపయ్య, కానిస్టేబుళ్ నజీరుధ్ధీలను సీపీ రవీందర్ అభినందించారు. -
బడి ఉంటే బతికేటోళ్లు బిడ్డా..
సాక్షి, కురవ(వరంగల్) : పండుగ ఆ ఇంట్లో చీకట్లను నింపింది.. తొలి ఏకాదశి పర్వదినం ఆ ఇంటికి దుర్ధిన్నాన్ని తెచ్చిపెట్టింది.పండుగ కావడంతో బడికి సెలవు ఇచ్చారు.. బడి ఉంటే బతికేటోళ్లు కదా బిడ్డాలారా.. అంటూ తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు గుండెల్నిపిండేసింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం గ్రామానికి చెందిన చింతనూరి శ్రీను, హైమ ల కుమారులు సూర్యతేజ(8) మూడో తరగతి, విశాల్(5) ఒకటో తరగతి చదువుతున్నారు. వీరి స్వగ్రామం తొర్రూరు మండలం వెంకటాపురం కాగా బతుకుదెరువుకోసం పదేళ్ల క్రితం మోద్గులగూడెంలో ఉంటున్నారు. తిర్మలాపురంలోని తిరుమల వర్మీ కంపోస్టు తయారీ కేంద్రంలో గత సంవత్సర కాలంగా పనిచేస్తూ కుటుంబంతోసహా అక్కడే నివాసముంటున్నారు. శుక్రవారం పాఠశాలకు సెలవు ఉండడంతో సూర్యతేజ, విశాల్, మరో స్నేహితుడు పుల్సర్ ఈశ్వర్‌తో కలిసి పాఠశాలకు ఎదురుగా ఉన్న మర్రికుంటలో ఈతకు వెళ్లారు. సూర్యతేజ, విశాల్‌లు కుంటలోకి దిగారు. నీరు ఎక్కువగా ఉండడంతో వారిద్దరూ అందులో మునిగిపోయారు. దీంతో ఒడ్డు మీదున్న స్నేహితుడు ఈశ్వర్ పరుగెత్తుతూ వచ్చి గ్రామస్తులకు విషయాన్ని చెప్పాడు. గ్రామస్తులు కుంట వద్దకు వెళ్లేసరికే అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న కురవి ఎస్సై నాగభూషణం శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం పరిశీలించారు. గ్రామంలో విషాదఛాయలు అన్నదమ్ములిద్దరూ కుంటలో పడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బడి ఉంటే బతికేటోళ్లు కదరా బిడ్డలూ అంటూ తల్లి హైమ రోదిస్తున్నతీరు చూసినవారంతా కన్నీటిపర్యంతమయ్యారు. కడుపున పుట్టిన ఇద్దరు కుమారులు ఒకే రోజు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చుడం ఎవరివల్ల కాలేదు. -
లిఫ్టు ఇచ్చాడు.. దోపిడీ చేశాడు..!
సాక్షి, జనగామ(వరంగల్) : తన వ్యక్తిగత పనిపై వెళ్లేందుకు రహదారిపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళకు లిఫ్ట్ ఇచ్చి ద్విచక్రవాహనదారుడు దోపిడీకి పాల్పడిన ఘటన ఆదివారం చంపక్‌హిల్స్ డంపింగ్ యార్డు వద్ద చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓబుల్‌కేశ్వాపూర్– పెద్దపహాడ్ ఎక్స్‌రోడ్డు వద్ద జనగామకు వచ్చేందుకు ఓ మహిళ బస్సు కోసం ఎదురు చూస్తుంది. అదే సమయంలో అటుగా వస్తున్న ద్విచక్రవాహదారుడు ఆమెకు లిఫ్టు ఇస్తానని బైక్‌పై ఎక్కించుకున్నాడు. చంపక్‌హిల్స్ డంపింగ్ యార్డు వద్దకు రాగానే వ్యక్తిపై అనుమానం వచ్చిన సదరు మహిళ కేకలు వేయడంతో నోరును గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. అరిస్తే చంపేస్తానని బెదిరిస్తూ ఆమె బ్యాగులో ఉన్న పర్సుతో పాటు సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
యువకుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా..!
సాక్షి, వరంగల్ : ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటిముందు ఆందోళన చేపట్టింది. మాయమాటలతో తనను లోబర్చుకుని గర్భం దాల్చడానికి కారకుడయ్యాడని, న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. సద్దాం అనే యువకుడు అదే గ్రామానికి చెందిన అప్సరా అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అతని ఇంటిముందు ఆందోళన చేస్తున్న యువతికి ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామం సర్పంచ్ యశోద తదితరులు మద్దతుగా నిలిచారు. అయితే, యువతిని ఇష్టపడిన మాట వాస్తవమేనని, ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పానని సద్దాం వెల్లడించాడు. అప్సరా వేరేవారి మాయమాటల్లో పడి ఆందోళన చేస్తోందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను డీఎన్ఏ టెస్టుకు సిద్దం. నా వల్లనే ఆమె గర్భం దాల్చిందని రుజువైతే.. ఏ శిక్షకైనా రెడీ. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కానీ, ఆమె వేరేవారి మాయమాటల్లో పడి ఆందోళన చేస్తోంది’ అన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
కాయ్.. రాజా కాయ్..!
కామారెడ్డి క్రైం: క్రీడాకారులకు రూ.కోట్లు కుమ్మరిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఐపీఎల్–12 క్రికెట్ మ్యాచ్‌లు అదే స్థాయిలో బెట్టింగ్ రాయుళ్ల జీవితాల్లో చీకట్లను నింపుతున్నాయి. బెట్టింగ్‌లు నేరమని చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిసినా యువత అటువైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుత వేసవిలో కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌లపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ముఖ్యంగా యువకులు బెట్టింగ్ మాయలో పడి తమ డబ్బును, సెల్ఫోన్లను, మోటర్ బైకులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో అనధికారిక అంచనా ప్రకారం ప్రతిరోజు రూ.లక్షల్లో బెట్టింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో బెట్టింగులు నడుస్తున్నట్లు తెలిసింది. కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు లక్షల్లో చేతులు మారుతున్నాయని తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఒక్క బాన్సువాడ పట్టణంలోనే ప్రతీ రోజు రూ.500 నుంచి రూ. వేలు, లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బెట్టింగ్‌లకు పాల్పడుతూ తమ ఆస్తులను కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. పలువురు పారిశ్రామికేవేత్తల మధ్య రూ.లక్ష చొప్పున బెట్టింగ్ సాగినట్లు తెలిసింది. ఇలా వందలాది మంది ఐపీఎల్ జట్లపై నమ్మకంతో గెలుపు, ఓటములను చూపుతూ బెట్టింగులకు పాల్పడుతున్నారని తెలిసింది. పోలీసుల నిఘా అవసరం ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న బెట్టింగులపై పోలీసుల నిఘా కొరవడింది. బెట్టింగులకు పాల్పడుతున్న వారు సెల్ఫోన్లు వినియోగిస్తూ కేవలం ఫోన్లలోనే లావాదేవీలు కొనసాగిస్తుండడంతో పోలీసులకు సమాచారం అందడం లేదు. ఎవరు బెట్టింగులకు పాల్పడుతున్నారనే విషయమై పక్కా సమాచారం లేక వారు మిన్నకుండిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో బెట్టింగులపై ప్రత్యేకంగా సమాచారాన్ని రాబట్టి, కొందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటే, బెట్టింగులను నియంత్రించేందుకు వీలవుతుందని పరిశీలకులు అంటున్నారు. అనేక కుటుంబాలు బెట్టింగ్ జాడ్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, బెట్టింగులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొంటున్నారు. సెల్ఫోన్లలోనే చర్చలు.. ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే బెట్టింగులకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు మధ్యవర్తులుగా అవతారమెత్తి బెట్టింగ్ డబ్బులపై సెల్ఫోన్లలో బేరమాడుతున్నారు. నేటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుంది? ఏ జట్టు ఓడి పోతుందనే? అంశంపై బేరమాడుతూ డబ్బులను ఫిక్స్ చేస్తున్నారు. మ్యాచ్‌లు కొనసాగిన తర్వాత గెలుపు/ఓటములపై ఫలితాలు రాగానే డబ్బుల కలెక్షన్ ప్రారంభిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రధానంగా ఇండ్లలో, దుకాణాల్లో కూర్చొని బెట్టింగ్ బేరాలను నడిపిస్తున్నారు. ఒకవేళ ఓడిపోయిన పక్షంలో డబ్బులు లేకపోతే తమ సెల్ఫోన్లు, మోటర్ బైకులను ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల్ల యువకులే బెట్టింగుల్లో అధికంగా పాల్గొంటున్నారు. చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు, కూలీ పనులు చేసుకొనేవారు త్వరగా డబ్బులు సంపాధించవచ్చనే దురాశతో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగులకు దిగుతున్నారు. కొన్నిసార్లు బెట్టింగుల్లో గెలుపొందడంతో ముందు, వెనకా చూడకుండా తమ డబ్బులను బెట్టింగుల కోసం వెచ్చిస్తున్నారు. దీంతో కొందరు సర్వం కోల్పోతుండగా, మరి కొందరు డబ్బులు సంపాదిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. బెట్టింగుల కారణంగా ఆయా కుటుంబాలపై ప్రభావం చూపుతోంది. బెట్టింగ్‌లకు ఆకర్షితులవుతూ... నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఏరియాల్లో కూడా బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లో సైతం చాలా మంది వీటిపై ఆసక్తిని చూపుతున్నారు. టాస్‌తోనే బెట్టింగ్ దందా ప్రారంభం కాగా, పేవరేట్ జట్టు, నాన్ ఫేవరేట్ జట్ల పేరుతో బెట్టింగ్‌లు కడుతున్నారు. జట్లతో పాటు మ్యాచ్ సమయంలో రన్లు, సింగిల్‌లు, డబుల్, ఫోర్లు, సిక్స్‌లు, రనౌట్లు, స్టంప్‌లు ఇలా ప్రతి దానికి బెట్టింగ్ కడుతున్నారు. బెట్టింగ్‌ల కోసం ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్నారు. ఇటీవలి కాలంలో అందుబాటు లోకి వచ్చిన యాప్‌ల ద్వారా బ్యాంక్ లావాదేవీలను కూడా నిర్వహిస్తున్నారు. డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఫోన్ పే, తేజ్, పేటీఎం యాప్‌లను వాడుతున్నారు. వీటి ద్వారా సులభంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 1:2, 1:4, 1:5 అంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. బెట్టింగ్‌లు కాస్తూ యువత దానికి బానిసలుగా మారి ప్రతిరోజు ఆర్థికంగా నష్టపోగా వారి కుటుంబాలు చిధ్రమవుతున్నాయి. బెట్టింగ్‌లకు ఆకర్షితులవుతూ... నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఏరియాల్లో కూడా బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లో సైతం చాలా మంది వీటిపై ఆసక్తిని చూపుతున్నారు. టాస్‌తోనే బెట్టింగ్ దందా ప్రారంభం కాగా, పేవరేట్ జట్టు, నాన్ ఫేవరేట్ జట్ల పేరుతో బెట్టింగ్‌లు కడుతున్నారు. జట్లతో పాటు మ్యాచ్ సమయంలో రన్లు, సింగిల్‌లు, డబుల్, ఫోర్లు, సిక్స్‌లు, రనౌట్లు, స్టంప్‌లు ఇలా ప్రతి దానికి బెట్టింగ్ కడుతున్నారు. బెట్టింగ్‌ల కోసం ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్నారు. ఇటీవలి కాలంలో అందుబాటు లోకి వచ్చిన యాప్‌ల ద్వారా బ్యాంక్ లావాదేవీలను కూడా నిర్వహిస్తున్నారు. డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఫోన్ పే, తేజ్, పేటీఎం యాప్‌లను వాడుతున్నారు. వీటి ద్వారా సులభంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 1:2, 1:4, 1:5 అంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. బెట్టింగ్‌లు కాస్తూ యువత దానికి బానిసలుగా మారి ప్రతిరోజు ఆర్థికంగా నష్టపోగా వారి కుటుంబాలు చిధ్రమవుతున్నాయి. సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం బెట్టింగ్‌లకు పాల్పడడం చట్ట రీత్యా నేరం. ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. నిఘా పెంచుతాం. బెట్టింగులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటాం. మాకు సమాచారం అందించాలి. –మహేష్‌గౌడ్, సీఐ, బాన్సువాడ. -
ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
వరంగల్ క్రైం: ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకోని బ్యాగుల్లోని బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజ్ తెలిపారు. వారి నుంచి 30 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీసీఎస్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆం«ధ్రప్రదేశ్ రాష్త్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన గండికోటి నూకాలమ్మ అలియాస్ ఉయ్యాల కుమారి, ఉయ్యాల మరియమ్మ అలియాస్ బుజ్జిలు స్నేహితులు. జల్సాగా బతకాలను ఆలోచనతో వారు దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఈ మేరకు వారు ఇద్దరు మరొక మహిళ కడమ్మతో కలిసి దొంగతనాలు చేశారు. 2013 నుంచి 2017 వరకు విజయవాడ, గుంటూరుల్లో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డారు. 2017లో పోలీసులకు దొరకడంతో ఒక సారి జైలుకు కూడా వెళ్లారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 1న ఆటోలో ప్రయాణిస్తున్న ఖమ్మం ప్రాంతానికి చెందిన తంగిళపల్లి కరుణ బ్యాగులో బంగారు ఆభరణాలను వారు చోరీ చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో నిందితులు తిరగుతున్నట్లు వరంగల్ ఏసీపీ నర్సయ్యకు సమాచారం రావడంతో ఇద్దరు మహిళలను అధుపులోకి తీసుకున్నారు. వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో మరియమ్మ, నూకలమ్మలను అరెస్ట్ చేశారు. కడమ్మ పరారీలో ఉంది. నిందితులను సకాలంలో గుర్తించిన ఏసీపీ నర్సయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజ్, ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై అశోక్‌కుమార్, సీసీఎస్ ఏఎస్సై ఫర్వీన్, హెడ్‌కానిస్టేబుళ్లు రవికుమార్, జంపయ్య, కానిస్టేబుళ్లు మహ్మద్‌అలీ, రవీందర్‌రెడ్డి, మీర్ మహ్మద్ అలీ, సంతోష్, నరేష్, రాంరెడ్డి, కుమారస్వామి, మహిళ కానిస్టేబుల్ కవితను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ అభినందించారు. -
ప్రాణం తీసిన ఆస్తి తగాదా
కేసముద్రం: కడుపున పుట్టిన కొడుకే కన్న తండ్రి పాలిట కాలయముడయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకే ఆస్తి కోసం తండ్రిపై దాడిచేసి హతమార్చిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె శివారు ముత్యాలమ్మ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మ తండాకు చెందిన భుక్యా మంగ్యా(53)–చంద్రమ్మ దంపతులకు కుమారుడు వీరన్న, మగ్గురు కుమార్తెలున్నారు. వారు తమకున్న 4ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నా రు. మంగ్యా ఇద్దరు కుమార్తెలతోపాటు, కొడుకు పెళ్లి చేశాడు. యేడాదిన్నర క్రితం చంద్రమ్మ అనారోగ్యంతో గురవడంతో చికిత్స చేయించా రు. ఆమె వైద్య ఖర్చుల కోసం రూ.7లక్షల అప్పు తీసుకువచ్చారు. అనంతరం చంద్రమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. వైద్య ఖర్చు ల కోసం చేసిన రూ.7లక్షల అప్పును తీర్చడానికి భూమిని అమ్మాలంటూ తండ్రితో వీరన్న తరచు గొడవ పడుతున్నాడు. భూమిని అమ్మవద్దంటూ తండ్రి వాదిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మళ్లీ భూమి విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆగ్రహనికి గురైన కొడుకు తండ్రిపై దాడిచేయడానికి ప్రయత్నించా డు. అతడు పరుగెత్తుకుంటూ వెళ్తుండగా నెట్టివేశాడు. దీంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిన మంగ్యా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందా డు. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలున్న వారంతా కేకలు పెడుతూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంగ్యాను లేపిచూడగా అప్పటికే మృతిచెంది నట్లు వారు గుర్తించారు. తాతయ్య చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని మనుమండ్లు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ వెంకటరత్నం, ఎస్సై సతీష్‌లు ఆదివారం పరీశీలించారు. మృతుడి తమ్ముడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మానుకోట ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వీరన్నను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి
వరంగల్ క్రైం: ప్రేమను నిరాకరించిదనన్న అక్కసుతో పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీ వ్రంగా గాయపడిన తోపుచర్ల రవళి(22) మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం యశోద ఆస్పత్రిలో కన్ను మూసింది. హన్మకొండ రాంగనర్‌లో ఫిబ్రవరి 27న లలితారెడ్డి హాస్టల్ ముందు ప్రేమోన్మాది పెండ్యాల సాయిఅన్వేష్ చేతిలో దాడికి గురైన విద్యార్థిని ఆరు రోజుల పాటు నరకం అనుభవించి మృత్యువు ఒడిలోకి చేరింది. ఐసీయూలో ఆరు రోజుల నరకయాతన.. ఫిబ్రవరి 27వ తేదీన హన్మకొండలోని రాంనగర్లో ఉదయం 9.05 గంటలకు హాస్టల్ నుంచి నడుచుకుంటూ వస్తున్న రవళిపై ప్రేమోన్మాది సాయిఅన్వేష్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన తరువాత చివరగా తన స్నేహితురాలు కావ్యతో నిందితుని వివరాలు చెప్పింది. ఆ తరువాత ఎంజీఎం ఆస్పత్రికి ఉదయం 9.30 గంటలకు చేరుకున్న రవళి మధ్యాహ్నం 12 గంటల వరకు చికిత్స పొందింది. మెరుగైన వైద్యం కోసం హైదరబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా 3.15 గంటలకు యశోద ఆస్ప త్రిలో ఐసీయూలో చేర్చారు. అప్పటి నుంచి సోమవారం సాయంత్రం 6.10 గంటల వరకు ప్రాణా లతో పోరాడింది. ఆరు రోజుల పాటు నరకయాతన అనుభవించి చివరకు రవళి ప్రాణాలను వదిలింది. శ్వాస నాళాలు ఉబ్బి.. పెట్రోల్ దాడిలో గాయపడిన రవళి ముఖం ఎక్కువ మొత్తంలో కాలిపోయింది. తీవ్రమైన గాయాల వల్ల శ్వాసనాళాలు ఉబ్బిపోయాయి. చర్మంపై ఉన్న మూడు పొరలు పూర్తి స్థాయిలో దెబ్బతిని, ఊపిరితిత్తులు పాడైపోయాయి. ప్లేట్లేట్స్ తగ్గిపోయాయి. శ్వాస నాళాలు దెబ్బతినడం వల్ల శ్వాస తీసుకోలేక మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఐసీయూలో ఆరు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. నేడు గాంధీలో పోస్టుమార్టం.. మృతదేహానికి సోమవారం పంచనామా అనంతరం ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సెంట్రల్ జైల్లో ప్రేమోన్మాది సాయిఅన్వేష్ 27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపిం చారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడు సాయిఅన్వేష్పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటంతో నిందితుడు సాయి అన్వేష్‌పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు. హన్మకొండ ఇన్స్పెక్టర్ సంపత్‌రావు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. హైదరబాద్‌లో పంచనామా నిర్వహించిన తరువాతనే పోస్టుమార్టం చేపడుతారు. ఆరు రోజుల పాటు హన్మకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ ఎస్సై రవళి ఆరోగ్య పరిస్థితిని దగ్గర ఉండి పర్యవేక్షించారు. సెంట్రల్ జైల్లో పేమోన్మాది సాయిఅన్వేష్ పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా కాల్చిన ప్రేమోన్మాది సాయిఅన్వేష్ వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. హన్మకొండ పోలీసులు 27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. న్యాయమూర్తి 14 రోజుల రిమైండ్ విధించారు. మృతురాలు రవళి ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడు సాయిఅన్వేష్పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటం నిందితుడు సాయి అన్వేష్‌పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు. రవళి మృతిపై మంత్రి ఎర్రబెల్లి సంతాపం పాలకుర్తి: ఇటీవల హన్మకొండలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ రవళి సోమవారం మృతి చెందింది. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తిలో విలేకరులతో మాట్లాడారు. రవళి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రవళి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. అత్యంత భాధకరం పెట్రోల్ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ రవళి మృతి చెందటం అత్యంత బాధాకరం. ప్రేమోన్మాది సాయిఅన్వేష్ను అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇన్స్పెక్టర్ సంపత్‌రావును హైదరాబాద్‌కు పంపించి పోస్టుమార్టం నిర్వహిస్తాం. పోలీసు శాఖాపరంగా సరైన అధారాలు కోర్టుకు అందజేసి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటాను. యువతులు, మహిళలను ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. షీ టీమ్స్, 100కు డయల్ చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రవీందర్, సీపీ సంగెం : రవళి స్వగ్రామం రామచంద్రాపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంగెం ఎస్సై ఎం.నాగరాజు పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంగళవారం రవళి మృతదేçహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్న క్రమంలో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. మరో తల్లికి గర్భశోకం లేకుండా చూడాలి.. ప్రేమ పేరుతో రవళిని వేధించి చివరకు పెట్రోల్ పోసి నిప్పటించి తన పైశాచికానికి బలి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి. అతడికి విధించిన శిక్షను చూసి మరో మృగాడు ఏ ఆడపిల్ల వైపు కూడా కన్నెత్తి చూడకూడదు. రవళి తల్లితండ్రులకు కలిగిన గర్భశోకం మరే తల్లిదండ్రులకు రాకుండా చూడాలి. ప్రేమ పేరుతో వేధించే వారి పట్ల చట్టాలు కఠినంగా అమలు చేయాలి. బొంపల్లి జయశ్రీ, సర్పంచ్, రామచంద్రాపురం ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి.. సమాజంలో అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ముందుకు పోతున్న ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి. దీంతో వారిని కళాశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రేమ పేరుతో వేధించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఒక్కగానోక్క కూతురును పొట్టన పెట్టుకున్న అన్వేష్‌ను కఠినంగా శిక్షించాలి. రవళి తల్లిదండ్రులకు తగిన న్యాయం జరిగేలా అతనిని శిక్షించాలి. కత్తి రాధిక, ఎంపీటీసీ సభ్యురాలు,రామచంద్రాపురం -
ప్రేమికుడు మోసం చేశాడని.. యువతి ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్ : ఓ యువకుడు తనను ప్రేమించడంతో పాటు పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టౌన్ ఎస్సై సీహెచ్.రమేష్‌బాబు కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్‌కు చెందిన బూర్గుల యాకమ్మ, పాపయ్య మనుమరాలు బూర్గుల ప్రవళిక(19)కు తల్లి ఉపేంద్రమ్మ చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో ఆమె అమ్మమ్మ ఇంటి వద్దే ఉంటోంది. ఇదే కాలనీకి చెందిన బల్లెం మార్కయ్య కుమారుడు చంటి, ప్రవళికలు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్ద మనుషుల వద్ద పంచాయితీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ప్రవళికను పెళ్లి చేసుకుంటానని చంటి కాగితం కూడా రాసి ఇచ్చాడు. అనంతరం పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బల్లెం చంటిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. మృతదేహన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. -
ఘరానా మోసం
పర్వతగిరి: అతి ఆశ, అమాయకత్వం వారి గొప్ప ముంచింది. తక్కువ ధరకు బంగారం అందిస్తామన్న మోసగాళ్ల మాటలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నకిలీ బంగారం చేతిలో పెట్టి రూ.4లక్షల ఘరానా మోసానికి పాల్పడిన సంఘటన రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఇస్లావత్ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ధరంసోత్ హుక్యా తెలిపిన వవరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తన ఫోన్ నంబర్ సేకరించి తమ ఇంటి వద్ద పెద్ద ఎత్తున బంగారం ఉందని, తులానికి రూ.20వేలకు అందిస్తామని మాయమాటలు చెప్పాడు. ఇది నమ్మిన హుక్యా బల్లారి వెళ్లి రూ.4లక్షలు చెల్లించి బంగారం తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చి చెక్ చేసే సరికి నకిలీ బంగారమని తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. అలా మొదలైంది.. తండాకు చెందిన హుక్యా అన్నయ్య వెంకన్నకు తరచూ బంగారం ఉంది తక్కువ ధరకు ఇస్తామని దుండగులు ఫోన్ చేస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వెంకన్న మేం కూలీ పనిచేసుకుంటాం మా వద్ద డబ్బులు లేవు అని చెప్పినప్పటికీ దుండగులు మళ్లీ మళ్లీ ఫోన్ చేసి ఇబ్బందిపెట్టారు. పదే పదే ఫోన్ చేస్తుడడంతో తమ ఇంటికి బంగారాన్ని చూపించాలనడంతో దుండగుడు నెక్కొండ మండల కేంద్రానికి వచ్చి రెండు చిన్న బంగారు బిళ్లలను అప్పగించి కేవలం రూ.500 తీసుకుని వెళ్లాడు. తదుపరి రెండు రోజు తర్వాత ఫోన్ చేసి అసలు బంగారమో నకిలీదో తేల్చుకుని రండి మీకు ఎంత బంగారం కావాలంటె అంత అప్పగిస్తాను తులానికి రూ.20వేల చొప్పున అని మాయ మాటలతో నమ్మించాడు. పక్కనే ఉన్న హుక్యా గతంలో ఇచ్చిన బంగారాన్ని చెక్ చేయించాడు. నిజమైన బంగారమని తేలడంతో ఇతరుల వద్ద అప్పుగా రూ. 4.50లక్షలు తీసుకువచ్చి వెంకన్నతో పాటు మరో వ్యక్తితో బల్లారి బయలుదేరారు. బల్లారి వద్ద దబ్బులను దుండగుల చేతిలో పెట్టి నకిలీ బంగారం తీసుకు వచ్చారు రౌడీలకు బయపడి... దుండగుడు నకిలీ బంగారం ఇచ్చాడని నిర్ధారణకు వచ్చిన హుక్యా, వెంకన్న వారిని నిలిదిసేందుకు బయపడ్డారు. డబ్బులు చెల్లించి నకిలీ బంగారం తీసుకునే సమయంలో సుమారు ఇరవై మంది పక్కనే ఉన్నట్లు తెలిపారు. ప్రాణాలను రక్షించుకోవాలనే తపనతో అక్కడి నుండి బయపడి వెనక్కి తిరిగారు. పోలీసులు ఫోన్ చెసినప్పటికీ.. కర్ణాటక పోలీసులు కొద్ది రోజులకు దుండగులను పట్టుకుని విచారిస్తున్న సమయంలో వారి ఫోన్ నంబర్లు బయటపడ్డాయి. ఫోన్ సమాచారంతో పోలీసులు బాధితుడికి ఫోన్ చేసి బల్లారికి వచ్చి పిటిషన్ ఇవ్వాలని తెలిపినప్పటికీ బాధితుడు బయపడి బల్లారికి వెల్లడం మానేశాడు. పోలీసులు మాత్రం దుండగులను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిడుతు ఫిర్యాదు చేస్తే సహకారం అందిస్తామని కర్ణాటక పోలీసులు తెలిపినట్లు సమాచారం. స్థానిక పోలీసులు సహకరించి డబ్బులు ఇప్పించాలని బాధిడుతు, అతడి భార్య వేడుకుంటున్నారు. -
మందలించినందుకు యువతి..
ఖానాపురం: ఉరేసుకొని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కోమటిపల్లి తండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్య సుభద్ర(20) ఇంటి వద్ద సరిగా పనులు చేయడం లేదు. దీంతో తల్లి గుగని పనులు చేయకుండా ఖాళీగా ఉంటే ఎలా అంటూ మందలించి అన్నారంకు వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సుభద్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి కుటుంభ సభ్యులు ఇంటికి చేరుకుని చూడగా ఉరేసుకొని ఉంది. మృతురాలి అన్న భూక్య శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గుట్కా కేంద్రాలపై దాడులు
వరంగల్ క్రైం: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను అమ్ముతున్న కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం దాడులు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం...సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని గోకుల్‌నగర్‌కు చెందిన కొమురవెల్లి వేణుమాధవ్ హుజురాబాద్‌కు చెందిన శ్రీనివాస్ గుట్కా సరఫరా దారుని నుంచి గుట్కాలు తీసుకుని అమ్ముతున్నాడు.ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్నాం.. సరఫరా దారుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.72వేల విలువ గల గుట్కాలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం నింధితులను సుబేదారి ఎస్సై సత్యనారాయణకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీపీ తెలిపారు. ప్రైవేట్ హాస్టల్లో గుట్కాలు స్వాధీనం హన్మకొండ పోలీసు స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా గుట్కాలు సరఫరా చేస్తున్న వీరమల్ల కార్తీక్‌ను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన వీరమల్ల కార్తీక్ హన్మకొండలోని కిషన్‌పురలో మహర్షి ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ నగరంలోని పాన్‌షాపులకు గుట్కాలను సరఫరా చేస్తున్నాడు. నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న కార్తీక్ గత కొంత కాలంగా గుట్కాల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు నింధితున్ని అదుపులోకి తీసుకుని నిందితుని నుంచి రూ.50వేల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. తదుపరి చర్యల కోసం నిందితున్ని హన్మకొండ ఎస్సై శ్రీనా«ధ్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నందిరాంనాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
యూట్యూబ్ చూసి తుపాకుల తయారీ
వరంగల్ క్రైం: యూట్యూబ్ చూసి తుపాకులు తయారుచేసి జనగామ జిల్లా మొండ్రాయి పాలకుర్తిలో ఈ నెల 15న అర్ధరాత్రి దోపిడీకి పాల్పడిన ఆరుగురి దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. కమిషనరేట్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నకిలీ నక్సలైట్ ముఠాను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో జనగామ జిల్లా కొడకండ్ల మండలం చెరువు ముందు తండాకు చెందిన ఇస్లావత్ శంకర్, నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన నారబోయిన మల్లేష్, నల్గొండ జిల్లా చిట్యాల మండలం, పేరపల్లికి చెందిన గంగాపురం స్వామి, అలియాస్ మల్లేష్, పాలకుర్తి మండలం చెన్నూరుకి చెందిన పిట్టల శ్రీనివాస్, చెన్నూరు గ్రామానికి చెందిన చీలూరి పరమేశ్, నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎన్జి కొత్తపల్లికి చెందిన సరిపంగి విప్లవ్‌లు ఉన్నారని సీపీ తెలిపారు. ముఠాగా ఏర్పడి.. ప్రధాన నిందితుడు ఇస్లావత్ శంకర్ మరో నిందితుడు గంగారపు స్వామితో కలిసి 2018లో జనశక్తి పార్టీ అనుబంధ సంస్థ అయిన రైతు సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. జనశక్తి పేరుతో మరోసారి డబ్బులు సంపాధించాలనే ఆలోచనతో గంగారపు స్వామి పిట్టల శ్రీనివాస్, నారబోయిన మల్లేశంను ప్రధాన నిందితుడు ఇస్లావత్ శంకర్‌కు పరిచయం చేశాడు. వీరంత ఒక ముఠాగా ఏర్పడి పలుసార్లు వివిధ ప్రాంతాల్లో కలుసుకొని అసెంబ్లీ ఎన్నికల ముందు స్వామిని గ్రామంలో కలుసుకున్నారు. జనశక్తి పేరుతో డబ్బులు సంపాధించాలంటే ఆయుధాలు అవసరం కావడంతో పిట్టల శ్రీనివాస్ తుపాకులు తయారు చేశాడు. డిసెంబర్ 31న దోపిడీకి ప్రణాళిక.. బొమ్మలు తయారు చేసే నైపుణ్యం కలిగిన పిట్టల శ్రీనివాస్ యూట్యూబ్ చూసి తుపాకులు తయారు చేశాడు. సైకిల్ బొంగులు, కర్ర, డ్రమ్స్, రాగిరేకు ఇలా... అందుబాటులో ఉండే వస్తువులతో నాటు తుపాకులతో పాటు అవసరమైన బులెట్లను తయారు చేశాడు. దీనికి తోడు మరో నిందితుడు స్వామి గతంలో తన దగ్గర ఉన్న 12 బోర్ తూటాలను అందించాడు. కొడకండ్ల మండలంలోని మద్యం షాపులను లక్ష్యంగా చేసుకున్న ముఠా సభ్యులు మొదట డిసెంబర్ 31న దోపిడీకి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఆ రోజు రాత్రి జనం ఎక్కువగా ఉండంతో ప్రణాళిక మార్చుకున్నారని సీపీ వివరించారు. సమానంగా వాటాలు 15న ఇస్తావత్ శంకర్ ఇంటి దగ్గర ముఠా సభ్యులు అందరూ కలుసుకుని శంకర్ మద్యం షాపు దగ్గర కాపు కాయగా మిగితా నిందితులు మొండ్రాయి, పాలకుర్తి రోడ్డులో తుపాకులతో కాపుకాచి దోపిడీకి సిద్ధం అయ్యారు. తిరుమల మద్యం దుకాణం నిర్వహకులు రూ.6.70 లక్షలు తీసుకుని ముగ్గురు ఒకే వాహనంపై వెళ్తుండగా మద్యం షాపు దగ్గర ఉన్న శంకర్ మిగితా సభ్యులకు సమాచారం ఇచ్చాడు. డబ్బులతో వస్తున్న షాపు నిర్వాహకుల ద్విచక్రవాహనాన్ని రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి గాలిలో కాల్పలు జరిపి డబ్బులను డబ్బులు తీసుకుని వెళ్లారు. దోపిడీ అనంతరం నిందితులు సొమ్మును సమాన వాటాలుగా పంచుకుని వివిధ ప్రాంతాలకు పారిపోయారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు స్థానిక పోలీసులతో పాటు పది ప్రత్యేక బృందాలు పనిచేశాయని సీపీ తెలిపారు. నిందితులు శంకర్ , మల్లేష్, స్వామిలు ముగ్గరు చెరువు ముందు తండాలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు రాజు, సతీష్‌లు వారిని అదుపులోకి తీసుకోని విచారించగా శ్రీనివాస్, పరమేశ్, విప్లవ్‌లు చెన్నూరులో ఉన్నట్లు తెలిపడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని సీపీ రవీందర్ వివరించారు. రూ.5.56 లక్షలు స్వాదీనం.. నిందితుల నుంచి దోపిడీ చేసిన సొమ్ము నుంచి రూ.5,56,650 నగదు, మూడు తపంచాలు,10 తూటాలు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అధికారులకు అభినందనలు.. నిందితులను సకాలంలో గుర్తించి సొమ్మును రికవరీ చేసిన వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ మధుసూధన్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి, పాలకుర్తి ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు సతీష్, రాజు, టాస్క్‌ఫోర్స్, ఐటీకోర్, సైబర్ విభాగం, స్పెషల్ పార్టీ పోలీసులను సీపీ అభినందించారు. -
ప్రేమ కోసం విద్యార్థిని.. పరువు కొసం ప్రియుడి తండ్రి
వెంకటాపురం(ఎం): సంక్రాంతి పండుగ వేళ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకొని మృతిచెందడంతో మండల పరిధిలోని పాలంపేట గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మండలంలోని పాలంపేటకు చెందిన బోడ సుమలత–సంజీవయ్య దంపతుల పెద్ద కూతురు సింధూజ(18) మండలంలోని జవహర్‌నగర్ మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం హైదారాబాద్‌లో ఉంటున్నారు. సంక్రాంతి సెలవులకు ఈనెల 10న సాయంత్రం సింధూజ పాలంపేటలోని తన పెద్దనాన్న రవి ఇంటికి వచ్చింది. సింధూజ పాలంపేటకు చెందిన కొండబత్తుల రమేష్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు తెలిసింది. ఈనెల 14న సింధూజ ఇంటివద్దే ఉదయం 10 గంటలకు పురుగుల మందు తాగడంతో కుటుంబసభ్యులు ము లుగు ప్రభుత్వ ఆస్పత్రికి తర లించగా చికిత్స పొం దుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరిస్థితి విషమించి మృతి చెందింది. తన కూతురు కడుపునొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని సింధూజ తల్లి సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సింధూజ తల్లిదండ్రులు ఆమె ఫోన్ డాటాను పరిశీలించారు. సింధూజ మృతికి ఇదే గ్రామానికి చెందిన కొండబత్తుల రమేష్ కారణమని 15న ఉదయం వెంకటాపురం పోలీసులకు ఆమె తల్లి దండ్రులు మరోసారి ఫిర్యాదు చేశారు. అలాగే రమేష్ ఇంటి ఎదుట మృతదేహంతో మంగళవారం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో విరమించారు. ఈ క్రమంలో కొండబత్తుల రమేష్ తండ్రి రాజు సాయంత్రం ఇంటివద్దే పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యల మృతి చెందాడు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన
జఫర్‌గఢ్: రెండేళ్ల పాటు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగిన సంఘటన మండలంలోని హిమ్మత్‌నగర్‌లో గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుడికందుల కుమార్, స్వరూప దపంతుల కూతురు అశ్వినితో మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన మేర్గు ఎల్లగౌడ్, శోభ దంపతుల కుమారుడు మేర్గు శ్రీకాంత్ ప్రేమాయణం సాగించాడు. అశ్విని మైనర్ కావడంతో రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. అయితే గత డిసెంబర్ 31న అమ్మాయి ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోవమని నిలదీయగా అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ విషయంపై అమ్మాయి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు ఇరువర్గాలకు సంబంధించిన పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించి అశ్వినిని పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఇందుకు శ్రీకాంత్, అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో కలత చెందిన అశ్విని, కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఇంటి ఎదుట నిరసన తెలుపగా మహిళలు, పలువురు కుల పెద్దలు ఆమెకు మద్దతుగా నిలిచారు. ప్రియురాలు నిరసనకు దిగిన సమయంలో ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై వెంకటకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని ఆమెకు, కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు శాంతించలేదు. అశ్వినికి న్యాయం జరిగే తాము ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో వారు రాత్రి వరకు నిరసన కొనసాగించారు. -
గ్రానైట్ లారీ ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ఎల్కతుర్తి: మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ గ్రానైట్ లారీ మరో గ్రానైట్ లారీని ఢీ కొట్టిన సంఘటనలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సూరారం బస్‌స్టేజీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ జీ కథనం ప్రకారం...కరీంనగర్ జిల్లా రేకూర్తికి చెందిన రొంటాల కిషన్(అలియాస్) కిషన్‌రెడ్డి(47), కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన క్లీనర్ ఎస్కె. అక్రమ్‌సందానీ(35) గ్రానైట్ లారీని కరీంనగర్ నుంచి కాకినాడకు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో గల సూరారం బస్‌స్టేజీ సమీపంలోని కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై మరో గ్రానైట్ లారీని అతి వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న గ్రానైట్ రాళ్లు క్యాబిన్‌పై పడి నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్ జీ, ఎస్సై శ్రీధర్‌లు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కిషన్‌రెడ్డిని బయటకు తీసేక్రమంలోనే పరిస్థితి విషమించి మృతి చెందాడని సీఐ వివరించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇద్దరు మృతదేహాలను బయటకు తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ముందు లారీలో ఉన్న డ్రైవర్ శ్రీరాంమూర్తి, క్లీనర్ రవికుమార్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మృతుల కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ మార్చురీకి తరలించినట్లు సీఐ తెలిపారు. మృతులు ఇద్దరికీ భార్య పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన లారీ విఘ్నేశ్వర ట్రాన్స్‌పోర్టుకు చెందింది కాగా మరో లారీ శరభ క్వారీకి చెందిందని పోలీసులు తెలిపారు. -
ప్లాట్ల పేరుతో ఘరానా మోసం..
బచ్చన్నపేట/జనగామ: మండల కేంద్రంలో పలువురికి హైదరాబాద్‌లో ప్లాట్లు ఇప్పిస్తానని డబ్బులను తీసుకొని రూ.4లక్షల రూపాయలతో ఉడాయించిన ఘటన మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై రంజిత్‌రావు కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన బొమ్మ నర్సింహులుకు చేనేత మగ్గాలు ఉన్నాయి. ఈ మొగ్గాలను నేయడానికి హైదరాబాద్, ఎల్బీ నగర్, సాయిసప్తగిరి కాలనీకి చెందిన శింగం కిష్టయ్య 4 నెలల క్రితం వచ్చాడు. గడిచిన 4 నెలలుగా మగ్గం నేచుకుంటూ గ్రామంలో అందరితో చనువు పెంచుకున్నాడు. హైదరాబాద్‌లో ప్రభుత్వం నిరుపేదలకు ప్లాట్లు ఇస్తుందని, ఆ ప్లాట్ కావాలంటే ముందుగా రూ. 20 వేలు చెల్లించి బుక్ చేసుకోవాలని తెలిపాడు. తక్కువ ధరకే ప్లాట్ వస్తుండడంతో దాదాపు 20 మంది 20 వేల చొప్పున రూ.4 లక్షల వరకు కిష్టయ్యకు అందించారు. ఉన్నట్టు ఉండి కిష్టయ్య వారం రోజులుగా కనిపించడం లేదు. డబ్బులు ఇచ్చిని వారు ఎక్కడ వెదికినా అతని ఆచూకీ కనిపించలేదు. ఈ విషయమై బొమ్మ నర్సింహులు స్థానిక పోలీస్ స్టేషన్లో, అలాగే జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డికి కూడా బుధవారం ఫిర్యాదు ఇచ్చాడని ఎస్సై రంజిత్‌రావు తెలిపారు. ఈ వివరాల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా బాధి తులు మాట్లాడుతూ మగ్గం నేసుకుని నెల నెల వ చ్చే మిగులు డబ్బులతో బతికే తమ లాంటి కుటుంబాలను మోసం చేసిన వ్యక్తిని పట్టుకోవా లని కోరారు. తమలాంటి వారు మోసపోకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో అపశ్రుతి
హసన్‌పర్తి: కొత్త సంవత్సరం వేడుకలు మూడు కుటుంబాల్లో విషాదం నింపాయి. వేడుకల్లో పాల్గొని వస్తుండగా ఓ ఆటో డ్రైవర్ అనుమానా స్పద స్థితిలో మృతిచెందగా, వేడుకల అనంతరం నిద్రిస్తున్న క్రమంలో ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో చనిపోయింది. ఓ యువకుడు మూత్రవిసర్జనకు వెళ్లి డ్రెయినేజీ వద్ద పడి ప్రాణాలు వదిలాడు.పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని 58వ డివిజన్ వంగపహాడ్‌కు చెందిన దోమ అరుణ్(28)కు భార్య కళ్యాణి, ఆరు నెలల కూతురు ఉన్నారు. అరుణ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి బైరాన్‌పల్లి శివారులోని ఓ మామిడితోటలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఆటోలో తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఈ క్రమంలో అతడు మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో మృతిచెంది కనిపించాడు. హత్యచేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ కాగా దోమ అరుణ్‌ను హత్య చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన న్యూయర్ గొడవలే హత్యకు కారణంగా వారు పేర్కొంటున్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం ఆటో బోల్తాపడడంతో అరుణ్ మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. ఇంటికి వచ్చే క్రమంలో మూలమలుపు వల్ల ఆటో బోల్తాపడినట్లు పేర్కొంటున్నారు. భయపడ్డారా ? వంగపహాడ్ శివారులోని మూలమలుపు వద్ద ఆటో బోల్తాపడిన దృశ్యాన్ని అదే మార్గంలో వస్తున్న అతడి స్నేహితులు చూసినట్లు తెలిసింది. ఆటోను పక్కకు జరి పి దాని కిందన ఉన్న అరుణ్‌ను పరిశీలించగా ఎలాంటి చలనం లేకపోవడంతో భయపడిన ఆ యువకులు ఎవరికి చెప్పకుండా మరో మార్గం నుంచి ఇంటికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కాగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ విందు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అరుణ్‌తోపాటు న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విచారణ చేçస్తున్నాం.. అరుణ్ మృతిపై విచారణ చేపడుతున్నట్లు ఎస్పై సుధాకర్ తెలిపారు. వివిధ కోణాల్లో విచారిస్తున్నట్లు చెప్పారు. ఆటో బోల్తాపడడంతో అరుణ్ మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. –సుధాకర్, ఎస్సై -
క్రిస్మస్కు వచ్చి.. కానరాని లోకాలకు
బచ్చన్నపేట: కిస్మస్ వేడుకలకు వచ్చిన ఇద్దరు విద్యార్థులకు అవే చివరి గడియలయ్యాయి. ఆడు తూ పాడుతూ పలకరించిన ఆ బాలురు లేరనే సరికి గ్రామస్తులంతా కన్నీరు మున్నీరయ్యారు. కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన బంగారు రాజు, హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన ఏసురాజులను హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలోని ఫీచర్ ఫౌండేషన్ అనాథాశ్రమంలో చదువుల నిమిత్తం చేర్పించారు. వీరిద్దరికి తండ్రులు లేరు. తల్లులు పలువురు ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మృతులు ఏసు రాజు (12) 7వ తరగతి, బంగారి రాజు(15) 9వ తరగతి చదువుతున్నారు. బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కంత్రి బాపురాజు, ప్రశాంత్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి నిరుపేద విద్యార్థులు పడుతున్న కష్టాలను చూడలేక 2004 సంవత్సరంలో ఫీచర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. అప్పటి నుంచి పలువురు నిరుపేద విద్యార్థులను చేర్పించుకొని వారికి విద్యా బుద్ధులను నేర్పించి ప్రయోజకులను చేస్తున్నారు. వారు ప్రతి సంవత్సరం సొంత గ్రామమైన కేసిరెడ్డిపల్లికి క్రిస్టమస్ పండుగకు వచ్చి నిరుపేదలకు దుప్పట్లను, పాఠశాల విద్యార్థులకు బుక్కులను, పెన్నులను ఉచితంగా పంపిణీ చేస్తారు. అదే క్రమంలో కేసిరెడ్డిపల్లికి 30 మంది విద్యార్థులతో వచ్చిన బృంద సభ్యులు శుక్రవారం నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఆ బృందంలోని ఇద్దరు బంగారి రాజు, ఏసురాజులు స్నానం చేయడానికి గ్రామ చివర ఉన్న మల్లంకుంట్లకు వెళ్లారు. ఇటీవల మిషన్ కాకతీయ పథకంలో చెరువు మరమ్మతు పనులను చేయడంతో చెరువును లోతుగా తవ్వారు. ఆ గుంతలోకి వెళ్లిన ఇద్దరు రాజులు ఒకరి కొకరు చేతులను అందించుకొని నీటిలో మునిగారు. వీరితో పాటు స్నానానికి వచ్చిన ఇమ్మానియేల్ అనే విద్యార్థి వారిని బయటకు లాగడానికి చేతిని అందించేందుకు ప్రయత్నం చేసినా లాభం లేక పోయింది. ఈ విషయాన్ని బృంద సభ్యులకు తెలుపగా వారంతా పరుగు పరుగున వచ్చే సరికే వారు మునిగి పోయారు. విషయాన్ని పోలీసులకు తెలుపగా ఘటనా స్థలానికి నర్మెట సీఐ మల్లేష్ యాదవ్, ఎస్సై రంజిత్‌రావు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
కమలాపూర్(హుజూరాబాద్): వివాహేతర సంబంధానికి అడ్డు రావడమే కాకుండా ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్తూ పరువు తీస్తున్నాడన్న కక్షతోనే కమలాపూర్‌కు చెందిన బైరి విజయ్‌కుమార్ అనే యువకుడు దుస్తులు వ్యాపారి బైరి రాజనర్సును బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాజీపేట ఏసీపీ కె.నర్సింగ్‌రావు తెలిపారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కమలాపూర్‌లో సెల్ షాపు నడుకునే విజయ్‌కుమార్ గత కొంత కాలంగా కమలాపూర్‌కే చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం రాజనర్సు వారిద్దరు కలిసి ఉండగా చూసి విషయాన్ని విజయ్‌కుమార్ తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో విషయం కాస్తా బయటకు పొక్కింది. దీంతో విజయ్‌కుమార్ రాజనర్సు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజనర్సు సదరు మహిళను బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో రాజనర్సును కొట్టాలని, అవసరమైతే హత మార్చాలని విజయ్‌కుమార్ నిర్ణయించుకున్నాడు. అప్పటికే రాజనర్సు విజయ్‌కుమార్‌కు కొంత మొత్తం డబ్బులు బాకీ ఉండగా ఆ డబ్బులు ఇవ్వాలని ఈ నెల 18న రాత్రి ఫోన్ చేయగా 8 గంటల ప్రాంతంలో రాజనర్సు వచ్చి విజయ్‌కుమార్‌కు రూ.120, ఆ పక్కనే ఉన్న మరో దుకాణాదారుడికి కొన్ని డబ్బులు ఇచ్చి పోతున్న క్రమంలో అతన్ని విజయ్‌కుమార్ పిలిచి తనకు మందు తాగించాలని కోరడంతో రాజనర్సు సరేనన్నాడు. చెరువు కట్టపై నుంచి రాజనర్సును ద్విచక్ర వాహనం ఎక్కించుకుని పెద్ద తూము వద్దకు వెళ్లారు. చెరువు తూములో కూర్చుని మందు సేవిస్తున్న క్రమంలో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ప్రస్తావ వచ్చింది. దీంతో తీవ్ర వాగ్వాదం చేసుకుంటూ చెరువుకట్టపైకి వచ్చారు. కోపంతో ఉన్న విజయ్‌కుమార్ అక్కడే ఉన్న ఓ బండరాయితో కొట్టగా రాజనర్సు తల వెనుక భాగంలో తగిలి కింద పడిపోయాడు. ఆ తర్వాత అదే బండరాయితో నుదుటి పైభాగంలో బలంగా మోది చంపాడు. అనంతరం శవాన్ని చెరువు కట్టపై నుంచి ఈడ్చుకెళ్లి పెద్దతూముపై ఉంచాడు. ఈ హత్యకు సంబంధించి ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు దొరుకనప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి ఒక ఫోన్ కాల్ డాటా ఆధారంగా నిందితుడిని గుర్తించామని వివరించారు. అతడి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, మొబైల్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ హత్యా ఘటనలో నిందితుడిని చాకచక్యంగా గుర్తించి, పట్టుకున్న స్థానిక ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, సహకరించిన ఎస్సైలు సూర్యప్రకాష్, టీవీఆర్ సూరి, పోలీసు సిబ్బందిని సీపీ రవీందర్, ఏసీపీ అభినందించారు. -
218 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నెల్లికుదురు (మహబూబాబాద్) : 218క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకుని లారీ సీజ్ చేసి 15మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తొర్రూర్ డీఎస్పీ జి.మదన్‌లాల్, సీఐ వి.చేరాలు, ఎస్సై పెండ్యాల దేవేందర్‌లతో కలసి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నెల్లికుదురు, చిన్నగూడూరు, నర్శింహులపేట మండలాల్లో పోలీసులు అలర్ట్‌గా ఉన్నప్పటికీ రేషన్ బియ్యం, ఇసుక అక్రమ దందాలు నిర్వహిస్తున్నారని వారిపై ప్రత్యేక నిఘా పెంచనున్నట్లు తెలిపారు. మండలంలోని శ్రీరామగిరి, వావిలాల, బంజర, ఆలేరు గ్రామాలల్లోని రేషన్ డీలర్లు తండ్రీకొడుకులు సంద సీతయ్య, కుమారుడు సంద అనిల్ (ఇద్దరు), ఆవుల సంధ్యారాణి, భర్త వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, గొట్టె నర్సయ్యలతో మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామానికి చెందిన బానోతు రాములు, వేముల రామారావు, జంగిలిగొండకు చెందిన కొయ్యాల కొమురెల్లి, వావిలాల గ్రామానికి చెందిన మార్త యుగేందర్, ఓ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న గోగుల ప్రశాంత్(సాక్షికాదు), శామకూరి వెంకన్న, చిన్నముప్పారం గ్రామానికి చెందిన ఒబిలిశెట్టి నర్సయ్య, ఈస్ట్‌గోదావరి జిల్లా అద్దెటిగల్ మండల కేంద్రానికి చెందిన గొలుసు శ్రీనివాసరావులు కుమ్మకై పీడీఎస్ బియ్యాన్ని వివిధ గ్రామాల్లో సేకరించినట్లు తెలిపారు. సేకరించిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్‌కు వచ్చిన సమాచారంతో పోలీసు సిబ్బందితో కలసి వెళ్లి మండల కేంద్రంలోని క్రాస్ రోడ్ వద్ద వాహానాల తనిఖీ నిర్వహిస్తుండగా 218క్వింటాళ్ళ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్, మరో వ్యక్తి పోలీసులను చూసి పారిపోతున్నారని తెలిపారు. వారిని పట్టుకుని విచారించి తనిఖీ చేయగా లారీలో రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం లోడు లారీని సీజ్ చేసి, 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బానోతు రాములు, సంద అనిల్, అవుల వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, ఒబిలిశెట్టి నర్సయ్య, గొలుసు శ్రీనివాసరావు ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగిల వారు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి రెండోసారి భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్సై దేవేందర్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. రివార్డులు అందజేస్తామని తెలిపారు. బియ్యం వ్యాపారంలో డీలర్లు ఉండటం విచారకరం ప్రభుత్వ సొమ్ము తింటూ రేషన్ బియ్యం దందాలో నలుగురు డీలర్లు, వారి కుటుంబ సభ్యులు ఇద్దరు ఉండడం విచారకరమని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈ వ్యాపారంలో ఎంతటివారు ఉన్నా వదిలిపెట్టేది లేదని, రేషన్ డీలర్లపై, అక్రమ వ్యాపారంలో అరెస్టు అయిన వారిపై పీడీయాక్టును ఉపయోగించేందుకు నివేదికను కలెక్టర్‌కు అందిస్తామన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గణపురం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామంలో చోటు చేసుకుంది. గణపురం ఎస్సై గోవర్థన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుందయ్యపల్లె గ్రామానికి చెందిన బిల్లా రాంరెడ్డి(52) శనివారం సాయంత్రం పని మీద చెల్పూరు గ్రామానికి వెళ్లాడు. రాత్రి సమయంలో ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం వెతికారు. కాని ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉద యం చెల్పూరు గ్రామంలోని అన్నపూర్ణ సినిమా థియేటర్ వెనుక ప్రాంతంలోని మర్రి చెట్టు కింద రాంరెడ్డి మృతి చెంది ఉన్నాడని తెలిసింది. రాంరెడ్డి తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావం జరిగి వుండడంతో ఎవరైన తలపై బండ రాళ్లతో నైనా, లేద కర్రలతో నైన కొట్టి చంపి ఉంటారా లేదా రాంరెడ్డి మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బండరాయి పై జారి పడి తీవ్ర రక్త స్రావం జరిగి మృతి చెందాడా అనే అనుమానాలు ఉన్నాయని ఎస్సై తెలిపారు. రాంరెడ్డి వివాద రహితుడని అతనిని చంపాల్సిన అవసరం ఎవరికి లేదని గ్రామస్తులు అంటున్నారు. మృతుడికి భార్య స్వరూప, ఒక కూతురు వున్నారు. మృతుడు భార్య స్వరూప తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి వుండవచ్చని ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఘటన స్థలాన్ని క్లూస్‌టీం, డాగ్స్క్వాడ్లతో తనిఖీ చేయించారు. ములుగు డీఎస్పీ విజయ పార్థసారధి, సీఐ సార్ల రాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మెడికల్ రిపోర్టు ఆధారంగా రెండురోజుల్లో కేసు వివరాలు వెల్లడి కానున్నాయి. -
ఏసీబీ వలలో ఇరిగేషన్ ఇంజినీర్లు
వరంగల్ క్రైం: రూ. 1.5లక్షలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఇంజినీర్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మిషన్ కాకతీయ పనుల్లో వర్ధన్నపేట మండలం కొనారెడ్డి చెరువు మరమ్మతు పనులను టెండర్ ద్వారా సాధించుకున్న కాంట్రాక్టర్ గంకిడి శ్రీనివాస్‌రెడ్డి నుంచి ఎస్టిమేట్ కోసం వరంగల్ ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో పనిచేసే టెక్నికల్ డీఈ వాంసని రఘుపతి, ఏఈ గాడిపెల్లి గౌరిలక్ష్మీలు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సందర్భంగా వరంగల్ రేంజ్ డీఎస్పీ కె.భద్రయ్య అధికారులు పట్టుబడిన వివరాలను వెల్లడించారు. వర్ధన్నపేట మండలంలోని కోనారెడ్డి చెరువు పనులకు అవసరమైన డిటేల్ ఎస్టిమేట్ కోసం ఎస్ఈ కార్యాలయంలో పనిచేసే టెక్నికల్ డీఈ–1 వాంసని రఘుపతి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. రూ.2.25 కోట్ల చెరువు పనిని టెండర్ ప్రక్రియ ద్వారా దక్కించుకుంటే ఆ డబ్బులలో నుంచి 1 శాతం(రూ.2.25లక్షలు) డబ్బులు ఇస్తానే...ఎస్టిమేట్ ఇస్తామని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ గంకిడి శ్రీనివాస్‌రెడ్డి పలు మార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఎస్టిమేట్ ఇవ్వలేదని దీంతో ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టెక్నికల్ డీఈ రఘుపతితో కాం ట్రాక్టర్ మాట్లాడి రూ.1.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ మంగళవారం మధ్యాహ్నం ఫోన్లో డీఈ రఘుపతితో మాట్లాడగా ఏఈ గాడపెల్లి గౌరిలక్ష్మీకి డబ్బులు ఇవ్వాలని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. కాం ట్రాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి కార్యాలయంకు వెళ్లి నేరుగా ఏఈ గౌరిలక్ష్మీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ భద్రయ్య తెలిపారు. కోర్టులో హాజరుపరుస్తాం... ఏసీబీకి చిక్కిన డీఈ రఘుపతి, ఏఈ గౌరిలక్ష్మీలను అరెస్టు చేసి వారి నుంచి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని హైదరబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ భద్రయ్య తెలిపారు. దీంతో పాటు డీఈ రఘపతికి సంబంధించిన దేశాయిపేట, గిర్మాజీపేటలో ఉన్న ఇండ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదా యంకు మంచి ఆస్తులు ఉన్నట్లు వెలువడితే మరో కేసు కూడా నమోదు అవుతుందని తెలిపారు. ఈ దాడులలో ఇన్స్పెక్టర్లు వాసల సతీష్, వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు. ఇంజినీరింగ్ శాఖలపై నిఘా వరంగల్ ఏసీబీ అధికారులకు వచ్చిన ఫిర్యాదుతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగి ఇంజినీరింగ్ శాఖలపై పెద్ద ఎత్తున నిఘా ఉంచారు. అవినీతికి ఆస్కారం ఉన్న ఇంజనీరింగ్ శాఖలో ఇటీవల ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఆర్ అండ్ బీ ఏఈ కోటేశ్వర్‌రావును పట్టుకున్న మూడు నెలల్లోనే మరో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు పట్టుబడటం ఇంజినీరింగ్ శాఖల్లో కలకలం రేపుతోంది. కాంట్రాక్టు పనులకు బిల్లులు చేయటానికి అధికారులు పెద్ద మొత్తంలో పర్సంటేజీలు డిమాండ్ చేయడం, సకాలంలో బిల్లులు రాకపోవడం, కాళ్లకు ఉన్న చెప్పులు అరిగేలా తిరుగుతున్న అధికారులు కనికరం చూపకపోవడంతో కాంట్రాక్టర్లు ఏసీబీ అధికారులను అశ్రయిస్తున్నారు. మిషన్ కాకతీయ పనులతో పాటు మిషన్ భగీరథ« పనులు చేస్తున్న ఇంజినీరింగ్ అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో పాటు పంచాయతీరాజ్ కార్యాలయంలో కొంత మంది అధికారులు బహిరంగంగా డబ్బులు డిమాండ్ చేసిన విషయం ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. -
మద్యం మత్తులో ఎస్సైని దూషించి.. వీరంగం
నల్లబెల్లి: మద్యంమత్తులో పోలీస్‌స్టేషన్ ఎదుట ఇద్దరు యువకులు శనివారం అర్థరాత్రి వీరంగం సృష్టించిన సంఘటన రూరల్ జిల్లా నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సై నరేందర్‌రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఆదివారం అర్థరాత్రి పెట్రోలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రాంతీర్థం శివారు బిల్‌నాయక్‌తండాకు చెందిన మాలోత్ నమ్కు, మాలోత్ రాజా రతన్‌సింగ్‌లతో పాటు మరికొందరు శనిగరం క్రాస్ రోడ్డు జాతీయ రాహదారి సమీపంలో పబ్లిక్ ప్లేస్‌లో మద్యం సేవిస్తూ కనిపించారు. పోలీస్ వాహనంలో ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది అక్కడి వెళ్తున్న క్రమంలో కొందరు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నమ్కు, రాజారతన్‌సింగ్‌లు మాత్రం అక్కడే నిలుచున్నారు. ఇంతరాత్రి ఇక్కడ ఎందుకు ఉన్నారని వారిని పోలీసులు ప్రశ్నిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో మద్యంమత్తులో ఉన్న యువకులు ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. పబ్లిక్ ప్లేసులో మద్యం తాగినందుకు కేసు నమోదు చేస్తామని ఎస్సై వారికి తెలియజేస్తూ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీస్ వాహనాన్ని ద్విచక్రంపై వెంబడిస్తూ పీఎస్‌కు చేరుకొని సుమారు రెండుగంటల పాటు ఎస్సైతో పాటు పోలీసులపై పరుషపదజాలాన్ని ఉపయోగిస్తూ దూషించారు. ఎస్సై, పోలీసులు క్షమాపన చేప్పేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని హంగామ సృష్టించారు. ఫ్రెండ్లీ పోలీస్ కావడంతో చేసేది ఎమిలేక చూస్తూ ఉండి పోయారు. కేసు నమోదు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బిల్‌నాయక్‌తండా గ్రామానికి చెందిన మాలోత్ నమ్కు, మాలోత్ రాజా రతన్‌సింగ్‌లు మద్యంమత్తులో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అయ్యో.. రైతన్నా
ఆరుగాలం కష్టం చేసి జీవించే రైతన్నకు అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. ఏ పనిచేయాలన్నా ప్రాణాల మీదకే వస్తున్నాయి. కొందరు ప్రమాదవశాత్తు చనిపోతుండగా కొందరు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. శుక్రవారం అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా దుక్కి దమ్ము చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతిచెందాడు. అప్పుల బాధతో.. గణపురం: చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జయశంకర్ జిల్లా గణపురం మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపురం మండల కేంద్రానికి చెందిన పాశికంటి రాజయ్య(45) తనకున్న కొద్దిపాటి భూమితో పాటు నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడికి తెచ్చిన అప్పులు పెరిగాయి. పంట దిగుబడి రాక అప్పులు తీర్చలేక శుక్రవారం తన చేను వద్దకు వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో క్రిమీ సంహారక మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమీప వ్యవసాయ భూముల్లో ఉన్న రైతులు గమనించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ములుగు సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో రాజయ్య మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య సుగుణ, కుమార్తె , కుమారుడు ఉన్నారు. పురుగు మందు తాగి .. గార్ల(ఇల్లందు): ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగు మందు సేవించి ఓ రైతు మృతిచెందిన సంఘటన శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పూమ్యా తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గార్ల మండలం పూమ్య తండాకు చెందిన ఇస్లావత్ పంతు(46) కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పత్తి చేను కోసం తెచ్చిన పురుగు మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇరుగు పొరుగు వారు చూసి హుటాహుటిన పంతును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందా డు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం. కుమారుడు కల్యాణ్ ఫిర్యాదు మేరకు ఏఎస్సై యాకుబ్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి కొత్తగూడ(ములుగు): ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన సంఘటన కొత్తగూడ మండలం కోనాపురంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతిరెడ్డి కిషన్‌రెడ్డి తనకున్న జాన్‌డీయర్ ట్రాక్టర్‌కు రోటోవేటర్‌తో నారుమడి దమ్ముచేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కన ఉన్న గుంతలోకి ఒక టైర్ దిగడంతో ఒకవైపు బోల్తాపడింది. ఘటనలో కిషన్‌రెడ్డి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పద్దర్మ మంత్రి చందూలాల్ తనయుడు ధరంసింగ్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని పరామర్శించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తాహెర్‌బాబా తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష
ఎల్కతుర్తి : తనను శారీరకంగా వాడుకుని తీరా పెళ్లి చేసుకొమ్మంటే తప్పించుకు తిరుగుతున్న ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు దీక్షకు దిగిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీపతి శ్వేత ఇంటర్ చదివే రోజుల్లో అదే మండలానికి చెందిన సట్ల సుధీర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేత హైదరాబాద్‌లోని ఓ బ్యూటీషియన్ సంస్థలో సభ్యురాలిగా పని చేస్తోంది. సుధీర్ సైతం హెచ్‌డీఎఫ్‌సీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఓ అద్దె గదిలో సహజీవనం చేస్తున్నారు. గదిలోనే తాళి సైతం కట్టాడని శ్వేత తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పెద్ద మనుషులు కలుగజేసుకుని పెళ్లి కోసం ప్రయత్నాలు చేశారు. దీనికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం తాను లేని సమయంలో గదిలోకి ఎవరో యువకుడు వచ్చాడంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, తనను అనుమానిస్తూ గొడవపడ్డాడని.. అప్పటి నుంచి తాను పెళ్లి చేసుకోనంటూ తప్పించుకు తిరుగుతున్నాడని స్వేత బోరున విలపించింది. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు.పెద్ద మనుషులు సైతం పట్టించుకోలేదు. దీంతో తాను ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగినట్లు తెలిపింది. బాధితురాలి మౌనపోరాటానికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉండగా సుధీర్ తండ్రి మల్లయ్య తనను ఓ విలేకరి రూ. 5లక్షలు ఇస్తే సముదాయిస్తానని, లేకుంటే ఇంటి ముందు బైఠాయిస్తుందని చెప్పాడని, తాను డబ్బులు ఇవ్వకపోవడంతో అనుకున్న ప్రకారం ఇలా జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. -
పిల్లలు కావడం లేదని భార్యను...
నల్లబెల్లి: మూడుముళ్లు వేసి కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పిల్లలు కావడం లేదని కట్టుకున్న భార్య చిక్కుడు అశ్విని(25)ని భర్త ముకేష్ హత్య చేసిన సంఘటన ఆలస్యంగా మండలంలోని బోల్లోనిపల్లిలో గురువారం వెలుగుచూసింది. మృతురాలి తల్లిదండ్రులు ఉస్తం భద్రమ్మ, వెంకటయ్య, సోదరుడు అశోక్‌ల కథనం ప్రకారం... పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన భద్రమ్మ, వెంకటయ్య దంపతుల కుమార్తె అశ్వినిని ఆరేళ్ల క్రితం మండలంలోని బోల్లోనిపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు ముకేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరి దాంపత్య జీవితం రేండేళ్ల వరకు సజావుగానే సాగింది. కుల వృత్తిలో భాగంగా కాటిపాపల కథలు చెబుతూ జీవనం కొనసాగించేవారు. పిల్లలు కావడం లేదని ఆస్పత్రులు తిరుగుతున్నారు. అశ్విని గర్భసంచిలో లోపం ఉండడంతో పిల్లలు కావడం లేదని వైద్యులు చెప్పడంతో రెండేళ్లుగా ముకేష్తో పాటు కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. కుల వృత్తిలో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాయిగూడెంకు కథలు చెప్పేందుకు అశ్విని, ముకేష్ దంపతులు వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు కావడం లేదు బంధువుల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొంటానని అశ్వినితో గొడవపడి భర్తతో పాటు అతని బంధువులు కలిసి మంగళవారం కొట్టిచంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రాయిగూడెంలో చంపిన తమ బిడ్డను గుట్టుచప్పుడుగా బోల్లోనిపల్లికి తీసుకవచ్చి దహన సంస్కారాలు చేసేందుకు ప్రయత్నించిన అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఎస్సై నరేందర్‌రెడ్డిని వివరణ కోరగా మృతదేహాన్ని తీసుకొని సంఘటన జరిగిన నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేయాలని మృతురాలి బంధువులకు సూచించడంతో మృతదేహాంతో వారు అక్కడికి వెళ్లారని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఆత్మకూరు(పరకాల): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన దామెర మండలం ఒగ్లాపూర్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... దుగ్గొండి మండలం లక్ష్మిపురంకు చెందిన గద్దల వినోద్(25), మంద శ్యామ్‌సుందర్, సింగారపు ప్రణయ్, ఆత్మకూరు మండలం పెంచికలపేటకు చెందిన డ్రైవర్ కలకోటి సుమన్(21) పెంచికలపేటలో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వరంగల్‌కు కారులో వెళ్తున్నాడు. కారును ఒగ్లాపూర్‌లోని పవర్‌గ్రిడ్ సమీపంలో ఎదురుగా ములుగు వైపు వెళుతున్న లారీ ఢీకొట్టడంతో కారు డ్రైవర్ సుమన్, గద్దల వినోద్‌లు అక్కడికక్కడే మృతిచెందగా మంద శ్యామ్సుందర్కు తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్‌కు తరలించారు. అలాగే సింగారపు ప్రణయ్‌కు గాయాలు కాగా స్థానికంగా చికిత్స పొందుతున్నాడు. గద్దల వినోద్ స్వేరోస్ శిక్షణా కేంద్రంలో పనిచేస్తున్నాడు. సుమన్, శ్యామ్‌సుందర్ మృతి పలువురిని కలచివేసింది. ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఓనర్ ఇంటి ముందు ఆందోళన.. పెంచికలపేటకు చెందిన కారుడ్రైవర్ కలకోటి సుమన్ మృతదేహంతో పెంచికలపేటకు చెందిన కారు యజమాని పసుల రాజేష్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రాజేష్ కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది. కారు యజమానిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. -
భార్యను చంపిన భర్త..ఆత్మహత్య
సాక్షి, కరీమాబాద్: భార్యను గొడ్డలితో నరికి తాను సమీపంలోని రైలు పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని అండర్ రైల్వేగేట్ 23వ డివిజన్ ఎస్ఆర్ఆర్ తోటలోని హనుమాన్ గుడి వీధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ పోలీసులు, కుటుంబ సభ్యుల, స్థానికుల కథనం ప్రకారం... ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో చాలా కాలంగా ఊగ చిన్న,కన్నమ్మ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఉగ చిన్న (57)తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ తన భార్య కన్నమ్మ(52)తో గొడవకు దిగడంతో పాటు కొట్టేవాడు. ఈ క్రమంలో శుక్రవారం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కన్నమ్మను మద్యం మత్తులో ఉన్న చిన్న అతి కిరాతరంగా కన్నమ్మను గొడ్డలితో తలపై నరికి చంపాడు. అక్కడి నుంచి పారిపోయిన చిన్న సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళం చెవి కోసం మనవరాలు ప్రియదర్శిని కన్నమ్మ చనిపోయి ఉన్న విషయాన్ని చూసి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ లోగా మిల్స్‌కాలనీ సీఐ దయాకర్, ఎస్సై భీమేష్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు తీసుకుని పంచనామా చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అదే విధంగా వరంగల్ జీఆర్పీ పోలీసులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న చిన్న మృతదేహాన్ని సైతం ఎంజీఎంకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా కన్నమ్మ–చిన్నలకు నాగలక్ష్మి, శ్రీలత, లావణ్య, శివ ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడని స్థానికులు చెబుతున్నారు. మిన్నంటిన కూతుళ్ల రోదనలు అటు తల్లిని చంపి, ఇటు తండ్రి కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో వారి కూతుర్లు నాగలక్ష్మి, లావణ్యల రోదనలు మిన్నంటాయి. తన తల్లి తమను పండ్లు, కూరగాయలు, కంకులు అమ్మి సాదుకుందని, తమకు ఎలాంటి లోటు లేకుండా పెంచిందని ఏడుస్తూ గుర్తు చేశారు. తమ తండ్రి చిన్న తాగుడుకు బానిసై తమ కుటుంబాన్ని ఏనాడు పట్టించుకోలేదని బోరున విలపించారు.