
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, దామెర వరంగల్ : మద్యానికి బానిసై తరచూ వేధింపుపులకు గురి చేస్తున్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనే భావనతో పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన నేరంపై మహిళకు జీవిత కారాగారశిక్ష విధించారు. ఈ మేరకు శుక్రవారం వరంగల్ మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.శైలజ సంచలన తీర్పు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముగంటి బాలకిషన్ కథనం ప్రకారం కేసు, తీర్పు వివరాలిలా ఉన్నాయి
బెల్ట్‌షాపు నడుపుతూ మద్యానికి బానిసై...
వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ల్యాదెల్ల గ్రామానికి చెందిన ఎరుబాటి మల్‌హల్‌రావు, లలితకు 2002లో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితంతో ఆకాష్, నక్షత్ర జన్మించారు. ఓ పక్క వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూనే బెల్టు షాపు నిర్వహిస్తూ జీవనం కొనసాగించే మల్‌హల్ రావు మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో మల్‌హల్‌రావు మద్యానికి బానిపై భార్యను తరచూ వేధించేవాడు. ఈక్రమంలో పలుమార్లు పంచాయతీ నిర్వహించినా మార్పు రాలేదు. 2015 జూలై 6న రాత్రి భార్యాభర్తలు గొడవపడుతుండగా.. ఎప్పుడూ జరిగేదనే భావనతో మల్‌హల్‌రావు తండ్రి మోతయ్య రైస్‌మిల్లులో పనికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి వెనుక వూపు వెళ్లి చూడగా ఆయన కుమారుడు కాలిపోయి పడి ఉన్నాడు. అయితే, తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఇది ముమ్మాటికీ హత్యేనని చెబుతూ మోతయ్య ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణలో నేరం అంగీకారం..
ఆత్మకూరు పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో మల్‌హల్‌రావు భార్య లలిత పోలీసులకు లొంగిపోయింది. తరచూ తాగిన మైకంలో తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుండడంతో భర్తను చంపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. 2015 జూలై 6న రాత్రి 7 గంటలకు గొడవ పడి బయటకు వెళ్లిన హల్‌హల్‌రావు తిరిగి ఇంటికి రాలేదు. అయితే, అర్ధరాత్రి 12 గంటలకు లలిత బయటకు రాగా.. తాగిన మైకంలో ఇంటి వెనుక పడి ఉన్న భర్త కనిపించాడు. ఈ మేరకు ఇంట్లోని పెట్రోల్ తీసుకొచ్చి ఆయనపై పోసి నిప్పంటించి సజీవంగా కాల్చి చంపింది. అయితే, తాగిన మైకంలో స్పృహ లేకుండా ఉండడంతో మల్‌హల్‌రావు ఎలాంటి కేకలు, అరుపులు చేయకుండా మంటల్లో కాలిపోయాడు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. లలితపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ జడ్జి శైలజ తీర్పు వెల్లడించారు. కేసును సీఎం ఎంరవికుమార్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ రమేషబాబు పర్యవేక్షించారు. 31 మంది సాక్షులను కానిస్టేబుల్ డి.వెంకటనారాయణ కోర్టులో ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment