
రాజ్యం అండదండలతో పట్టపగలు ఢిల్లీ రాజవీధుల్లో చెలరేగిపోయిన ముష్కర మూకలు చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకుండా 3,000 మందిని ఊచకోత కోసిన ఉదంతాల్లో ఆలస్యంగానైనా బాధితులకు న్యాయం దక్కుతోంది. ఆ మారణహోమం జరిగి నిరుడు అక్టోబర్‌కు నలభైయ్యేళ్లు కాగా, ఒక కేసులో అప్పటి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌కు రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి.
ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను హతమార్చిన కేసులో ఒక యావజ్జీవ శిక్ష, గృహదహనానికి ప్రేరేపించిన కేసులో మరో యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈ ఊచకోతకు సంబంధించి వేరే కేసులో సజ్జన్ 2018 నుంచి యావ జ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. దేశ విభజన సమయంలో పెద్ద యెత్తున జరిగిన హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలు, లూటీలు, ఆస్తుల ధ్వంసం ఉదంతాల తర్వాత దేశ చరిత్రలో 1984 నాటి నరమేధం అతి పెద్దది.
ఇలాంటి ఉదంతాల్లో మూకలు ఉన్మాదంతో దాడులు చేయటం కనబడుతుంది. ఈ దాడుల వెనక ఎప్పుడూ సంఘటిత నేరగాళ్ల ముఠా ఉంటుంది. వీరికి రాజకీయ నాయకుల అండదండలుంటాయి. రాజకీయాల్లో తమ మాటే చెల్లు బాటు కావాలని, తమ పేరు చెబితే జనమంతా హడలెత్తిపోవాలని ఈ ముఠాల వెనకున్న నేతలు కోరుకుంటారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన నివాస గృహంలోనే ఒకచోటి నుంచి మరో చోటుకు వెళ్తుండగా అంగరక్షకులు ఆమెను తుపాకులతో కాల్చిచంపిన అనంతరం ఢిల్లీలోనూ, వేరే రాష్ట్రాల్లోనూ ఈ మారణహోమం కొనసాగింది.
ఇందిర హంతకులు సిక్కులు గనుక, ఆ ఉదంతానికి ప్రతీకారంగా సిక్కు మతానికి చెందిన ఎవరినైనా చంపుకుంటూ పోవాలని స్పష్టమైన ఆదేశాలున్న పర్యవసానంగానే ఈ దుర్మార్గం సాగింది. ‘ఉన్మాద మూకలు ఇల్లిల్లూ తిరిగి మారణహోమం సాగిస్తున్నాయి. దయచేసి కాపాడండ’ంటూ పోలీస్ స్టేషన్లకు పోయి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.
హంతక ముఠాలు పట్టపగలు నడివీధుల్లో స్వైరవిహారం చేస్తున్నా దిక్కూ మొక్కూ లేదంటే అలాంటి నేరగాళ్లు మరింతమంది పుట్టుకొస్తారు. సమాజానికి పీడలా తయారవుతారు. ప్రతీకారం పేరుతో మరికొన్ని ముఠాలు రంగప్రవేశం చేస్తాయి. పర్యవసానంగా శాంతిభద్రతలు కరువవు తాయి.
వరసగా మూడు నాలుగు రోజులపాటు ఈ మాదిరి ఉదంతాలు తీవ్ర స్థాయిలో కొనసాగినా పోలీసులు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోతే ఆనాడు ప్రజాతంత్ర హక్కుల ప్రజాసంఘం (పీయూడీఆర్), పౌరహక్కుల ప్రజాసంఘం(పీయూసీఎల్) నాయకులు విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో బాధిత కుటుంబాల నుంచి వివరాలు కనుక్కుని హత్యలు, సజీవ దహనాలు, అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసాలు, గృహదహనాల వివరాలతో రోజుల వ్యవధిలోనే ‘ఎవరు నేరస్తులు?’ పేరుతో పుస్తకం ప్రచురించారు. ఒకపక్క ఢిల్లీ నగరంలో దారుణాలు కొనసాగుతుండగానే వీరు ప్రాణాలకు తెగించి ఇల్లిల్లూ తిరిగారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనాల ఆధారంగా దగ్గరుండి హింసాకాండ నడిపించిన ఆనాటి కాంగ్రెస్ నాయకుల పేర్లు సైతం దానిలో ప్రచురించారు.
అందులో సజ్జన్‌కుమార్ ఒకరు. ఢిల్లీలోని సుల్తాన్‌పురి, కంటోన్మెంట్ తదితరచోట్ల సజ్జన్ రెచ్చగొట్టే ఉపన్యాసాలిచ్చి ఉన్మాద ముఠాల్లోని ప్రతి ఒక్కరికీ వందేసి రూపాయలు, మద్యం సీసా అందించా డని ప్రత్యక్ష సాక్షులు ఫిర్యాదు చేశారు. హంతక మూకలను ఉసిగొల్పిన నాయకుల్ని వదిలి ప్రత్యక్ష సాక్షులను భయపెట్టేందుకు, కేసులు ఉపసంహరింపజేయటానికి పోలీసులు ఒత్తిడి తెచ్చిన ఉదంతాలు కోకొల్లలు. ఢిల్లీ కౌన్సిలర్‌గా, మూడుసార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఇంతగా బరితెగించటం ఊహించలేం. ఈయనే కాదు... హెచ్‌కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ వంటి అనేకమంది నాయకులకు ఢిల్లీ ఊచకోతలో ప్రమేయం ఉండొచ్చని దాదాపు డజను కమిషన్‌లు భావించాయి. అయినా తమ దర్యాప్తులో సాక్ష్యాధారాలు దొరకలేదని సీబీఐ తేల్చింది.
వ్యక్తులకు భావోద్వేగాలుంటాయి. రాగద్వేషాలుంటాయి. కానీ వ్యవస్థ వీటికి అతీతంగా ఉండాలి. తటస్థంగా మెలగాలి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలి. కానీ ఢిల్లీ ఊచ కోత నిందితులకు ఆనాటి రాజ్యవ్యవస్థ అండదండలిచ్చింది. అందుకే నలభైయ్యేళ్లు గడుస్తున్నా చాలా కేసులు ఇంకా కింది కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నాయి. కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో వీగిపోయాయి. ఇలాంటి పరిస్థితులే ప్రతీకారేచ్ఛకు పునాదులవుతాయి.
పంజాబ్‌ను దాదాపు దశాబ్దంపాటు అట్టుడికించిన ఉగ్రవాదానికి మూలం సిక్కుల ఊచకోతనే. వెనువెంటనే నిందితులను అరెస్టుచేసి వారికి సత్వరం శిక్షలుపడేలా చేస్తే ఈ బెడద ఉండేదే కాదు. ఈ మారణకాండపై అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని ప్రశ్నించినప్పుడు ‘వటవృక్షం నేలకూలినప్పుడు భూమి కంపించటం సహజమే’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. ఆ తర్వాత కాలంలో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనాటి ఊచకోతకు క్షమాపణ చెప్పారు.
అలాగని నిందితులను శిక్షించే ప్రక్రియను వేగవంతం చేయలేకపోయారు. ఇలాంటి ధోరణులు మరిన్ని హత్యాకాండలను ప్రోత్సహిస్తాయి. 2002లో గుజరాత్‌లో జరిగిన నరమేధం అందుకు ఉదాహరణ. ఆ దారుణ ఉదంతంలోనూ కొద్దిమంది దోషులకు శిక్షపడినా చాలామంది తప్పించుకున్నారు. కాలం గాయాలను మాన్పుతుందని చెబుతారు. కానీ తమ ఆప్తులను కళ్లెదుటే హతమార్చినవారిని నిర్లజ్జగా నెత్తిన పెట్టుకునే వ్యవస్థలుంటే అది ప్రతీకారానికి పురిగొల్పుతుంది. క్షతగాత్ర హృదయం చల్లారదు. అది నిత్యమూ రగులుతూనే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment