Sajjan Kumar
-
సిక్కు అల్లర్ల కేసు: బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: సిక్కు అల్లర్ల కేసులో యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌కు బుధవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కోరిన మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. సజ్జన్ కుమార్ వైద్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరాడు. ఈ నేపథ్యంలో అధికారులు అతనికి ఎయిమ్స్ వైద్యుల చేత పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య నివేదికను పరిశీలించిన న్యాయస్థానం అతన్ని ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బెయిల్ తిరస్కరించింది. బెయిల్ దరఖాస్తుపై విచారణను జూలైకు వాయిదా వేసింది. ('సిక్కుల ఊచకోత జరిగేది కాదు') సిక్కుల ఊచకోత; దోషిగా సజ్జన్ 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ కాల్చి చంపారు. ఆ మరుసటి రోజే దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అల్లర్లలో దేశవ్యాప్తంగా 3,500 మంది సిక్కులు చనిపోగా, ఒక్క ఢిల్లీలోనే 2,800 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఇందులో ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో పలువురు నాయకులతోపాటు కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌పైనా కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేక సజ్జన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో బాధితులు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు 34 ఏళ్ల తర్వాత 2018 డిసెంబర్లో సజ్జన్‌ను దోషిగా తేలుస్తూ జీవితకాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సజ్జన్ సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే. (కమల్‌నాథ్‌పై సిక్కు అల్లర్ల కేసు!) -
సజ్జన్ కుమార్ లొంగుబాటు
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి, జీవిత ఖైదు విధించబడిన మాజీ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ సోమవారం ఢిల్లీ కోర్టు ఎదుట లొంగిపోయారు. మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ అదితి గార్గ్ ఎదుట లొంగిపోయిన సజ్జన్ కుమార్‌ను ఈశాన్య ఢిల్లీలోని మందోలి జైలుకు తరలించాలని న్యాయస్ధానం ఆదేశించింది. తనను తీహార్ జైలులో ఉంచాలన్న సజ్జన్ కుమార్ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు తనకు భద్రత కల్పించాలని, ప్రత్యేక వాహనంలో జైలుకు తరలించాలన్న వినతిని అంగీకరించింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్ కుమార్‌ను దిగువ కోర్టు తప్పించడాన్ని తోసిపుచ్చుతూ డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇక లొంగుబాటుకు నిర్ధేశించిన గడువును పొడగించాలన్న సజ్జన్ వినతినీ ఈనెల 21న కోర్టు తిరస్కరించింది. ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో ఐదుగురు సిక్కుల ఊచకోత, గురుద్వారకు నిప్పంటించిన కేసులో సజ్జన్‌ను ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారించింది. హైకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు సజ్జన్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 73 సంవత్సరాల సజ్జన్ కుమార్ ఔటర్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. -
సుప్రీంకోర్టులో సజ్జన్ కుమార్ పిటిషన్
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవశిక్ష ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సజ్జన్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో సిక్కుల తరఫు న్యాయవాది హెచ్.ఎస్.ఫూల్కా మీడియాతో మాట్లాడుతూ.. సిక్కుల ఊచకోత వ్యవహారంలో తాము గతంలోనే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. దీంతో సజ్జన్ కుమార్ పిటిషన్‌పై కోర్టు రిజిస్ట్రీ ద్వారా తమకు సమాచారం అందిందన్నారు. -
కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్ రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్ రాజీనామా చేశారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగాతేలి శిక్ష పడటంతో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సోమవారం ఢిల్లీ హైకోర్టు సజ్జన్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. 2,733 మంది మృతిచెందిన ఆ ఘటనలో శిక్ష పడిన తొలి రాజకీయ నేత సజ్జన్. 1984 నవంబర్ 1,2 తేదీల్లో జరిగిన అల్లర్లలో ఐదుగురు సిక్కులను హత్యచేసిన ఘటనలో సజ్జన్ పాత్ర నిరూపితమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన అల్లర్లలో 2,733 మంది సిక్కులు చనిపోయారు. ఇందిరకి రక్షణగా ఉన్న సిక్కులే ఆమెను హత్య చేయడంతో సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. -
ఇన్నేళ్లకు సజ్జన్‌కు శిక్ష
పట్టపగలు అందరూ చూస్తుండగా అత్యంత ఘోరమైన నేరాలు, ఘోరాలు జరిగినా దోషులు దర్జాగా తప్పించుకోవచ్చునని నిరూపించిన సిక్కుల ఊచకోత ఉదంతాల్లో తొలిసారి ఒక బడా కాంగ్రెస్ నాయకునికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ తన శేష జీవితాన్ని జైల్లో గడపాలంటూ ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. రాజకీయ ప్రాపకం ఉన్న నేరగాళ్ల ముందు అధికార వ్యవస్థలన్నీ సాగిలబడుతున్న తీరును నిశితంగా విమర్శించింది. ఈ కారణం వల్లనే ఒక దాని తర్వాత మరో ఊచకోత అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతున్నాయని అభిప్రాయపడింది. వీటిపై ఒక చట్టం తీసుకురాలేని పాలకుల తీరును ప్రశ్నించింది. ముంబైలో 1993లో జరిగిన నరమేథం, 2002నాటి గుజరాత్ నరమేథం, 2008లో ఒదిశాలోని కంథమాల్లో చోటుచేసుకున్న దురంతం, 2013నాటి ముజఫర్‌నగర్ మూకుమ్మడి హత్యకాండలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ తీర్పులో ప్రస్తావించిన సిగ్గుమాలిన ఉదంతాలన్నీ దిగ్భ్రాంతి కలిగించేవే. ఎందులోనూ బాధిత కుటుంబాలకు సరైన న్యాయం లభిం చలేదు. అది లేకపోగా కోర్టు మెట్లెక్కినందుకు సకల వ్యవస్థలూ కక్షబూని వేటకుక్కల్లా వెంటబడి వేధించిన వైనం తాజా కేసులో వెల్లడవుతుంది. తన తండ్రిని కళ్లముందే నిప్పంటించిన ఉదంతాన్ని చూసి, వారికి శిక్ష పడేలా చేయాలని ప్రయత్నించిన నిర్ప్రీత్ కౌర్‌పై ఒక దాని తర్వాత మరో కేసు బనాయించారు. చేయని నేరానికి వివిధ జైళ్లలో ఆమె తొమ్మిదేళ్లపాటు మగ్గింది. ఆమెపై అత్యంత కఠినమైన టాడా చట్టం కింద రెండు కేసులు పెట్టి జైలుకు పంపారు. కొన్నేళ్ల తర్వాత ఆ రెండు కేసుల్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. తీర్పు వెలువడ్డాక సజ్జన్‌కుమార్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన వల్ల పార్టీ ఇరకాటంలో పడకూడదని భావించి ఆయన తప్పుకున్నాడని సజ్జన్ సహాయకుడు చెబు తున్నాడు. చిత్రమేమంటే ఇలాంటి కేసులోనే నిందపడిన మరో కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ సజ్జన్‌కుమార్‌కు శిక్షపడిన రోజే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. సిక్కుల ఊచకోత కొనసాగుతుండగానే ప్రధాని పదవిని అధిష్టించిన రాజీవ్‌గాంధీ ‘వటవృక్షం నేలకొరిగినప్పుడు భూమి కంపించడం అత్యంత సహజమ’ని వ్యాఖ్యానించి అందరినీ నివ్వెర పరిచారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటున్నవారే ఈ నరమేథానికి నాయకత్వం వహిం చారని అప్పటికి ఆయనకు తెలుసునో లేదో ఎవరికీ తెలియదు. కనీసం తర్వాతైనా మీడియాలో వారి పేర్లు మార్మోగినప్పుడు చర్యలకు ఉపక్రమించి ఉంటే ఆయన ప్రతిష్ట వందల రెట్లు పెరిగేది. అది లేకపోగా బాధిత కుటుంబాలకు బెదిరింపులు రివాజుగా మారాయి. దుండగులు కొందరి ప్రాణాలు తీశారు. మరికొందరిపై దొంగ కేసులు బనాయించారు. ఈ వరసంతా గమనించి చాలా మంది పోలీసులను ఆశ్రయించడం మానుకున్నారు. హంతకులు అధికార మదంతో చెలరేగుతుంటే కేసులకు, బెదిరింపులకు జడిసిన పలు బాధిత కుటుంబాలు అనామకంగా బతికాయి. కనుకనే ఈ మాదిరి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నాయకులు ఏమీ ఎరగనట్టు, ఏమీ జరగనట్టు, తమకసలు సంబంధం లేనట్టు ఉంటున్నారు. సజ్జన్ కూడా అలాగే చెబుతూ వచ్చారు. కానీ ఆయ నపై వచ్చిన ఆరోపణల తీవ్రత, సాక్షుల పట్టుదల సంగతి పార్టీ నాయకత్వానికి బాగా తెలిసి ఉంటుంది. అందుకే ఇన్నాళ్లుగా ఆయనకు ఏ పదవీ ఇవ్వలేదు. చాలా కేసుల్లో కాంగ్రెస్‌కు చెందిన సాధారణ కార్యకర్తలకు మాత్రమే శిక్షలు పడ్డాయి. 1984 నవంబర్ 1న ఇద్దరు సిక్కు యువకులను పొట్టనబెట్టుకున్న యశ్పాల్సింగ్ అనే నేరగాడికి గత నెలలో ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో నేరగాడు నరేష్ షెరావత్కు యావజ్జీవ శిక్ష పడింది. కింది కోర్టుల్లో శిక్షలు పడిన కేసులు, నిందితులు నిర్దోషులంటూ తీర్పు వెలువడిన కేసులు ఉన్నత న్యాయస్థానాలకు అప్పీల్‌కు వెళ్లాయి. సజ్జన్ కేసు కూడా అలా అప్పీల్‌కి వచ్చిందే. ఆయనపై వచ్చిన అభియోగాలను మేజిస్ట్రేట్ కోర్టు మొదలుకొని సెషన్స్ కోర్టు వరకూ అన్నీ తోసిపుచ్చాయి. కానీ ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ కేసు లోతుపాతుల్లోకి వెళ్లి ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలు సక్రమ మైనవేనని తేల్చింది. పట్టపగలు సాగించిన ఈ దురంతాల గురించి 10 కమిటీలు, కమిషన్లు రావడం, అవి చేతగాని రీతిలో వ్యవహరించడం ఆశ్చర్యకరం. చెప్పిన విషయాల్నే ఈ 34 ఏళ్లనుంచీ ఎందరికో పదే పదే చెబుతూ వచ్చామని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకపోయినా దీన్ని కొనసాగిస్తూ వచ్చామని నిర్ప్రీత్ కౌర్ అనడం ఆమెకున్న సహనానికి, వ్యవస్థలపై ఉన్న విశ్వాసా నికి అద్దం పడుతుంది. కానీ బాధితులంతా అలా లేరు. తిరిగి తిరిగి విసిగి వేసారి మిలిటెన్సీ బాట పట్టారు. ఈ నరమేథంలో ప్రమేయమున్నదని హక్కుల సంఘాలు వెల్లడించిన ఎంపీ లలిత్ మాకెన్నూ, ఆయన భార్యనూ 1985లో మిలిటెంట్లు కాల్చిచంపడం దీనికి ఉదాహరణ. ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఆత్రుతైనా, ప్రజాస్వామికవాదుల భావనైనా సమాజంలో ఇలాంటి ప్రతీకార న్యాయానికి తావుండరాదనే. నేరం చేసింది ఎంతటివారైనా చట్టప్రకారం చర్యలు ప్రారంభిస్తే... బాధితులకు సత్వర న్యాయం లభించడానికి అన్ని వ్యవస్థలూ కృషి చేస్తే ఈ పరిస్థితి తలెత్తదు. దుర దృష్టవశాత్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా, అనంతరకాలంలో వచ్చిన వేర్వేరు కూటమి ప్రభు త్వాలైనా, ఆఖరికి ఎన్డీఏ సర్కారైనా బాధితుల విషయంలో ఉదాసీనత ప్రదర్శించాయి. వారిపైనే ఎదురు కేసులు పెట్టి జైళ్లపాలు చేస్తుంటే కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించాయి. కాబట్టే ఈ కేసులో ఇంత జాప్యం జరిగింది. కానీ ఇదింకా సుప్రీంకోర్టుకు అప్పీల్కెళ్తుంది. చివరిగా శిక్ష ఖరారు కావడానికి మరెన్నేళ్లు పడుతుందో వేచిచూడాలి. ఇలాంటి కేసులే మరో 186 ఉన్నాయి. వాటి సంగతి తేలడానికి మరెన్ని తరాలు గడవాలో చూడాల్సి ఉంది. -
ఒకరికి జైలు, మరొకరికి పదవా!?
సాక్షి, న్యూఢిల్లీ : సోమవారం నాడు దేశంలో రెండు విభిన్న పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడగా, అదే కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్‌కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి లభించింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను విచారించిన నానావతి కమిషన్ అందులో కమల్ నాథ్ హస్తం ఉందనడానికి సరైన ఆధారాలు లభించలేదని పేర్కొంది. అంతేగానీ అతను నిర్దోషి అని తేల్చలేదు. సజ్జన్ కుమార్ హస్తముందన్న విషయాన్ని నానావతి కమిషన్ అనుమానించడంతో సీబీఐ దర్యాప్తు జరిపి ఆధారాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో సజ్జన్ కుమార్‌కు హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ జర్నలిస్ట్ సహా పలువురు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఢిల్లీలోని గురుద్వార్‌పై దాడి చేసిన అల్లరి మూకను రెచ్చగొడుతూ కమల్‌నాథ్ ప్రసంగించారు. అదే పని చేసిన సజ్జన్ కుమార్‌కు శిక్ష పడింది. అదే పని చేసినట్లు సాక్షులు చెబుతున్నట్లు కమల్ నాథ్ శిక్ష నుంచి తప్పించుకోవడంతోపాటు సీఎం పదవి అనే రివార్డు కూడా లభించింది. ఈ దేశంలో నేరం చేసి తప్పించుకునే అవకాశాలు రాజకీయ నాయకులకే ఎక్కువగా ఉన్నాయి. 1984 నాటి అల్లర్ల బాధితులు అవిశ్రాంతంగా పోరాడడం వల్ల 2000 సంవత్సరంలో కేంద్రం నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సజ్జన్ కుమార్ కేసును సీబీఐ దర్యాప్తు జరపడం, కేంద్రంలో గత నాలుగేళ్లుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల రెండు కేసులను తప్పించుకున్నా మూడో కేసులో సజ్జన్ కుమార్‌కు శిక్ష పడింది. నేరం చేసిన రాజకీయ నాయకులను ఓ రాజకీయ వ్యవస్థ వెనకేసుకు రావడం వల్ల ఒకరు తప్పించుకోగలిగారు. ప్రత్యర్థికి శిక్ష పడాలని అదే రాజకీయ వ్యవస్థ కోరుకోవడం వల్ల మరొకరికి శిక్ష పడింది. ఇందులో బీజేపీ ప్రభుత్వం నిజం పక్కన నిలబడిందని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సజ్జన్ కుమార్‌కు శిక్ష విధించిన హైకోర్టే, ఇంతకుముందు దేశంలో, అంటే 1993లో ముంబైలో, 2002లో గుజరాత్, 2008లో కంధమాల్, 2013లో ముజాఫర్ నగర్లో జరిగిన అల్లర్లను ప్రస్థావించింది. ఈ అన్ని అల్లర్లు ఓ మైనారిటీ మతానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లే కాకుండా అన్నింటిలోనూ బీజేపీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి, కొన్నింట్లో కేసులు కూడా కొనసాగుతున్నాయి. అలాంటి బీజేపీని రానున్న ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ‘హస్తం’ ముందుగా శుభ్రంగా ఉండాలి. -
కాంగ్రెస్‌కు సజ్జన్ కుమార్ రాజీనామా
-
‘ఆ దాడుల వెనుక పెద్ద నాయకుల హస్తం’
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లు, ముజాఫర్‌నగర్ మారణాహోమం వంటి ఘటనలకు కారణమైన వారిని కూడా శిక్షించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌కు శిక్షను విధించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ, మిగిలిన వారికి కూడా శిక్ష పడాలన్నారు. సిక్కు అల్లర్లు, గుజరాత్, ముజఫర్‌నగర్ వంటి ఘటనల్లో పెద్ద నాయకుల హస్తముందనీ వారందరిని చట్టప్రకారం శిక్షించాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సిక్కు అల్లర్ల కేసులో చాలా అలస్యంగా తీర్పు వచ్చినా బాధిత కుటుంబాలకు కొంత సంతోషం కలిగించిందని అభిప్రాయపడ్డారు. నేరాలు చేసి వాటిని కప్పిపుచ్చుకోవడానికి దోషులు రాజకీయ నాయకులుగా చలమణి అవుతున్నారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విటర్లో స్పందించారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌కు సజ్జన్ కుమార్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారించిన మరుసటి రోజు సజ్జన్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో సజ్జన్ పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నానని రాహుల్‌కు రాసిన లేఖలో ఆయన వెల్లడించారు. కాగా, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో సజ్జన్‌ను ప్రత్యేక కోర్టు నిర్ధోషిగా పేర్కొంటూ విముక్తి కల్పించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దిగువ కోర్టు తీర్పును పక్కనపెట్టిన హైకోర్టు సజ్జన్ దోషేనంటూ స్పష్టం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లను మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. -
సజ్జన్ కుమార్ దోషే
న్యూఢిల్లీ: 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జన్ కుమార్(73)ను ఢిల్లీ హైకోర్టు దోషిగా తేల్చింది. ఆయన ఇక మిగిలిన తన జీవిత కాలమంతా జైలులోనే గడపాలని ఆదేశిస్తూ జీవిత ఖైదు విధించింది. సిక్కుల ఊచకోత జరిగిన 34 ఏళ్ల తరువాత సోమవారం కోర్టు తీర్పు వెలువరిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆనాడు రాజకీయ పలుకుబడి, మద్దతు ఉన్న వారే మతం పేరిట హింసకు పాల్పడ్డారని పేర్కొంది. సిక్కు వ్యతిరేక అల్లర్లను మానవత్వంపై జరిగిన నేరంగా అభివర్ణించిన కోర్టు..సజ్జన్ కుమార్‌పై హత్య, వేర్వేరు మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి నేరపూరిత కుట్ర పన్నడం, గురుద్వారాను అపవిత్రం, విధ్వంసం చేయడం తదితర అభియోగాలను మోపింది. ఈ కేసులో సజ్జన్‌తో పాటు ఇది వరకే దోషులుగా తేలిన మరో ఐదుగురు ఢిల్లీ వదిలి వెళ్లొద్దని, ఈ నెల 31 లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సజ్జన్ తరఫు లాయర్ వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చారిత్రకమని బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఆప్ స్వాగతించాయి. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసును ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో ముడిపెట్టొద్దని కాంగ్రెస్ పేర్కొంది. ముగ్గురు సాక్షుల పోరాట ఫలితం: ఈ కేసులో నిందితులైన సజ్జన్ కుమార్‌తో పాటు మరో ఐదుగురిపై 2010లో విచారణ ప్రారంభమైంది. మూడేళ్ల తరువాత సజ్జన్ కుమార్ మినహా మిగిలిన వారంతా దోషులని కింది కోర్టు తేల్చింది. ఈ తీర్పును సీబీఐ సవాలు చేయగా తాజాగా జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సజ్జన్ కూడా దోషి అని ప్రకటించింది. ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు జగదీశ్ కౌర్, ఆమె కజిన్ జగ్షీర్ సింగ్, నిర్ప్రీత్ కౌర్‌ల అలుపెరుగని పోరాటం వల్లే సజ్జన్‌కు శిక్ష పడిందని బెంచ్ పేర్కొంది. నిందితులకు శిక్ష పడేందుకు మూడు దశాబ్దాలు పట్టినా కూడా సత్యం గెలిచి, న్యాయం జరుగుతుందని బాధితులకు భరోసా ఇవ్వడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. సీబీఐ రంగప్రవేశం చేశాకే సాక్షులు ధైర్యంగా ముందుకొచ్చి నోరు విప్పారని పేర్కొంది. మరోవైపు, సజ్జన్ కుమార్ ఢిల్లీలోనే ఉన్నారని, డిసెంబర్ 31లోగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తరఫు లాయర్ వెల్లడించారు. ఒకవేళ ఆలోగా అత్యున్నత న్యాయ స్థానంలో తాజా తీర్పును సవాలుచేయకుంటే సజ్జన్‌కుమార్ లొంగిపోతారని తెలిపారు. కళంకితుడిని సీఎం ఎలా చేస్తారు?: జైట్లీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధించడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఇదే కేసులో సిక్కులు దోషిగా భావిస్తున్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించడాన్ని తప్పుపట్టారు. సిక్కుల ఊచకోతలో సజ్జన్‌కుమార్ ఒక మాయని మచ్చలా మిగిలిపోయారని, దేశం ఇంత పెద్ద ఎత్తున హత్యాకాండను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. సిక్కుల దృష్టిలో దోషిగా నిలబడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజే ఈ తీర్పు రావడం గమనార్హమని పరోక్షంగా కమల్‌నాథ్‌ను ఉద్దేశించి అన్నారు. 1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును రాజకీయం చేయడం సరికాదని, చట్టం తన పనిని తాను చేసుకుపోవాలని కాంగ్రెస్ పేర్కొంది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో చెలరేగిన హింసలో కమల్‌నాథ్ పాత్ర కూడా ఉందని, ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎలా నియమిస్తారని బీజేపీ, శిరోమణి అకాలీదళ్ కాంగ్రెస్‌ను నిలదీసిన సంగతి తెలిసిందే. అయితే కమల్‌నాథ్ తనపై వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఈ కేసులో తాను నిందితుడిని కాదని, తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేశాక పేర్కొన్నారు. 4 రోజుల్లో 2,733 మంది సిక్కుల ఊచకోత 1984, అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 1–4 మధ్య రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా చెలరేగిన హింసలో 2,733 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. దక్షిణ ఢిల్లీలోని పాలమ్ కాలనీలో ఐదుగురు సిక్కుల హత్య కేసులో సజ్జన్ నిందితుడిగా ఉండగా, కోర్టు తాజాగా తీర్పును ప్రకటించింది. జగదీశ్ కౌర్ భర్త, కొడుకు, ఆమె ముగ్గురు కజిన్లు కేఖర్ సింగ్, గురుప్రీత్ సింగ్, రఘువేందర్ సింగ్‌లతో పాటు నరేందర్ పాల్ సింగ్, కుల్దీప్ సింగ్..మొత్తం ఐదుగురిని అల్లరి మూకలు దారుణంగా హత్య చేశారు. తన తండ్రిని సజీవంగా దహనం చేయడాన్ని నిర్ప్రీత్ కౌర్ ప్రత్యక్షంగా చూసింది. 34 ఏళ్లు అంటే సుదీర్ఘ కాలమే అయినా నిందితుల అసలు రంగు బయటపెట్టేందుకు కృత నిశ్చయంతో పోరాడామని జగదీశ్ కౌర్, నిర్ప్రీత్ కౌర్ చెప్పారు. తాజా తీర్పు తమకు కొంత సాంత్వన చేకూర్చిందని, ఇన్నాళ్లూ తాము అనుభవించిన అన్యాయం, క్షోభ మరొకరికి రావొద్దని అన్నారు. -
ఆలస్యంగా అయినా దక్కిన న్యాయం
వటవృక్షం నేల కూలితే భూమి ఆమాత్రం కంపిం చదా? ఇది 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యా ఘటన అనంతరం దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి ఢిల్లీలో సిక్కులపై ఊచకోత ఘటనల నేపధ్యంలో తదనంతర ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన సంచలన ప్రకటన. ఆ ఊచకోత ఘటనలో 3000 మంది పైగా తమ ప్రియతములను కోల్పోయిన బాధిత కుటుంబాలను మాత్రం ఈ అసాధారణ ప్రకటన రూపంలోని ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది. నేల కూలిన వటవృక్షానికి, ఆ కాళరాత్రి ఊచకోతల్లో తాముకోల్పోయిన వారికి ఏ సంబం ధం ఉందని బాధిత కుటుంబాలు వేస్తున్న ప్రశ్న ఇప్పటికీ అరణ్య ఘోషలాగే ఉంది. ఆ మారణ కాండ జరిగిన 34 ఏళ్ల తర్వాత నాటి అల్లర్లకు బాధ్యుడిగా ఆరోపణలకు గురైన కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ని దోషిగా గుర్తిస్తూ ఢిల్లీ హైకోర్టు శిక్ష విధించడం కారుచీకట్లో కాంతిరేఖ మాత్రమే. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే, 1984 కాళరాత్రి మచ్చకు కారకుడిగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్‌కి ఢిల్లీ హైకోర్టు యావజ్జీవ శిక్షను విధించింది. అతడిపై వచ్చిన ఆరోపణలను జాతి హత్యాకాండగా, సామూహిక హత్యాకాండగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం 73 ఏళ్ల సజ్జన్ కుమార్ 1984 నవంబర్ 1 రాత్రి ఢిల్లీలోని రాజ్ నగర్లో ఒక గురుద్వారాను తగులబెట్టిన ఘటనలో ఒక కుటుంబంలోని అయిదుగురు సభ్యుల హత్యకు కారకుడయ్యాడనే ఆరోపణను కోర్టు ధృవీకరించింది. ఈ సందర్భంగా ఎన్నిసవాళ్లు ఎదురైనా సత్యం రుజువవుతుందని బాధితులకు హామీ ఇవ్వడం చాలా ముఖ్యం అని కోర్టు చేసిన వ్యాఖ్య బాధితులకు కాస్త ఉపశమనం కలిగించింది. ఎందుకంటే తమ వారిని కోల్పోయిన బాధ కంటే న్యాయం జరగాలని చేసిన పోరాటం సందర్భంగా గత 34 ఏళ్లుగా బాధితులు ఎదుర్కొన్న బెదిరింపులు, దౌర్జన్యాలు మరింత భీతి కలిగించేలా తయారయ్యాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీని 1984 అక్టోబర్ 31న సిక్కు బాడీగార్డులు కాల్చి చంపిన ఘటన అనంతరం చెలరేగిపోయిన మూకలు నవంబర్ 1 నుంచి 4 దాకా 3 వేలమంది సిక్కులను టార్గెట్ చేసి మరీ చంపారు. దేశరాజధాని ఢిల్లీలోనే 2,733 మంది సిక్కులను ఊచకోత కోశారు. ఇదే కేసులో సజ్జన్ కుమార్‌ని నిర్దోషిగా పేర్కొంటూ అయిదేళ్ల క్రితం ఢిల్లీలోని ట్రయల్ కోర్టు అతడిపై కేసు కొట్టేయడం జరిగింది. 2002 డిసెంబర్ నెలలో సెషన్స్ కోర్టు సజ్జన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. కానీ సీబీఐ 2005 అక్టోబర్ 24న అతడిపై మరొక కేసును నమోదు చేసింది. 2010లో ఈకేసును ఢిల్లీ ట్రయల్ కోర్టుకు బదలాయించారు. 2013 ఏప్రిల్ 30న ట్రయల్ కోర్టు సజ్జన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ మరో అయిదుగురిని దోషులుగా నిర్ధారించింది. తీర్పుచెప్పిన న్యాయమూర్తిపై కోర్టు హాలులోనే నిరసనకారులు చెప్పులు విసిరిన ఘటన సంచలనం రేపింది. తర్వాత సీబీఐ, బాధితురాలు, నాటి ఘటనకు సాక్షి అయిన జగదీష్ కౌర్ ట్రయల్ కోర్టు తీర్పుకు నిరసనగా అపీల్ చేశారు. మరొక ప్రధాన సాక్షి చామ్ కౌర్ 1984లో రాజధాని ఢిల్లీలోని సుల్తాన్ పురి ప్రాంతంలో మూకను ఉద్దేశించి మాట్లాడుతున్న సజ్జన్ని తాను స్వయంగా చూశానని, మన అమ్మను చంపారని, సిక్కులను మనం కూడా చంపుదామని చెబుతున్న అతడి మాటలను విన్నానని చెప్పడంతో సాక్ష్యానికి బలం చేకూరింది. నవంబర్ 2న గుంపు తన కుమారుడు కపూర్ సింగ్‌ని, తండ్రి సర్దార్జీ సింగ్‌ను దాక్కున్న చోటినుంటి లాగి చితకబాది తగులబెట్టారని కౌర్ చెప్పారు. ఈ సాక్ష్యం ఆధారంగా 2018 డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. మనుషుల్ని సజీ వంగా తగులబెట్టి చంపిన ఘటనకు బాధ్యులైన నేరస్తులు రాజకీయ అండదండలను పొంది ప్రాసిక్యూషన్‌ని, శిక్షను కూడా ఇన్నాళ్లుగా తప్పించుకుంటూ వచ్చారని కోర్టు వ్యాఖ్యానించడం న్యాయానికి ఈ దేశంలో పడుతున్న గతి ఏమిటో తేటతెల్లం చేస్తోంది. రాజకీయంగా బలంగా ఉన్న శక్తులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని తలపెట్టిన సామూహిక నేరాలకు కారకులైనవారిని శిక్షించడానికి దశాబ్దాల కాలం పట్టడం విషాదకరమని మన న్యాయవ్యవస్థను బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఈ సుదీర్ఘ జాప్యం సూచిస్తోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ దేశంలో న్యాయం రాజకీయనేతలకు, పలుకుబడి కలవాళ్లకు చుట్టంగా ఎలా మారిపోయిందో సజ్జన్ కుమార్ ఉదంతం తెలుపుతోంది. కె. రాజశేఖరరాజు -
‘ఆ పాపాలకు మూల్యం చెల్లిస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారిస్తూ దిగువ కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సజ్జన్ కుమార్‌ను దోషిగా హైకోర్టు తేల్చడం న్యాయం గెలిచితీరుతుందని కాస్త ఆలస్యమైనా వెల్లడైందన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల పాపాలకు కాంగ్రెస్ పార్టీతో పాటు గాంధీ కుటుంబం మూల్యం చెల్లించకతప్పదని వ్యాఖ్యానించారు. 1984 ఘర్షణల బాధితులకు కాంగ్రెస్ ఎలాంటి న్యాయం చేయలేదని, బాధితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసనీయతను పాదుకొల్పిందన్నారు. సిక్కు వ్యతిరేక ఊచకోత ఘటనల్లో అల్లర్లను ప్రేరేపించేలా సజ్జన్ కుమార్ ప్రసంగించారని, మత సామరస్యానికి విఘాతం కల్పించారని ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా పేర్కొంటూ జీవిత ఖైదును విధించిన సంగతి తెలిసిందే. -
సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చిన హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను 1984 సిక్కు వ్యతిరేక ఘర్షణల కేసులో ఢిల్లీ హైకోర్టు సోమవారం దోషిగా తేల్చింది. ఈ కేసులో కాంగ్రెస్ నేతకు విముక్తి కల్పిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. 1984, అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఐదుగురి హత్యకు సంబంధించిన కేసులో జస్టిస్ మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్‌తో కూడిన బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొన్న హైకోర్టు ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భరోసాను బాధితుల్లో కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సజ్జన్‌ను నిర్ధోషిగా పేర్కొంటూ మరో ఐదుగురిని దోషులుగా పేర్కొన్నప్రత్యేక న్యాయస్ధానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. మాజీ కౌన్సిలర్ బల్వాన్ కొక్కర్, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్, కిషన్ కొక్కర్, గిర్ధారి లాల్, కెప్టెన్ భాగ్మల్లను కేసులో దోషులుగా 2013లో ప్రత్యేక న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఢిల్లీలోని కంటోన్మెంట్‌కు చెందిన రాజ్‌నగర్ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని కేహార్ సింగ్, గుర్ప్రీత్ సింగ్, రాఘవేందర్ సింగ్, నరేందర్ పాల్ సింగ్, కుల్దీప్ సింగ్‌లను హత్య చేసిన కేసులో సజ్జన్ కుమార్ సహా ఐదుగురు ఇతరులు విచారణ ఎదుర్కొన్నారు. జస్టిస్ జీటీ నానావతి కమిషన్ సిఫార్సుల మేరకు సజ్జన్ కుమార్ ఇతరులపై 2005లో కేసు నమోదైంది. -
టైట్లర్, సజ్జన్లకు సొంత పార్టీ ఝలక్
న్యూఢిల్లీ : నరేంద్రమోదీ సర్కారు హయాంలో దళితులపై అకృత్యాలు పెరిగిపోయాయని, సామాజిక సామరస్యం దెబ్బతింటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. అయితే రాహుల్ గాంధీ దీక్షా స్థలానికి రావడానికి ముందే ఇద్దరు వివాదాస్పద కాంగ్రెస్ నాయకులు జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. వారిని వేదికపైకి అనుమతించకుండా పార్టీ కార్యకర్తలతో పాటు కింద కూర్చోవాలంటూ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ‘ఆ ఇద్దరు నాయకులను వేదికపైకి అనుమతించకపోవడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. ఈ నిరసనలో పార్టీ కార్యకర్తలంతా పాల్గొనవచ్చు. మాజీ ఎంపీలకు వేదికపై కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాటు చేయలేదని’ వివరణ ఇచ్చారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రధాన పాత్ర పోషించారని జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే మత సామరస్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన దీక్షలో వీరు పాల్గొంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, బీజేపీకి ఇది ఒక అస్త్రంగా మారుతుందనే కారణంగానే వారిని పక్కకు పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీబీఎస్ఈ పరీక్షా పత్రాలు లీక్ కావడం, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం, పార్లమెంటు సమావేశాలు పూర్తిగా స్తంభించిపోవడం, దళిత సంఘాలు ఈనెల 2న నిర్వహించిన భారత్ బంద్‌లో హింస చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ సర్కారును, బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు రాహుల్ ఈ నిరసన దీక్షకు పూనుకున్నారు. కాగా, ఈ విషయంపై స్పందించిన జగదీశ్ టైట్లర్ మీడియాతో మాట్లాడుతూ... ‘నన్నెవరూ వెళ్లిపొమ్మని చెప్పలేదు. నేనెప్పుడూ కార్యకర్తలతో పాటే కూర్చుంటాను. పార్టీలో నన్నెవరూ వ్యతిరేకించే వాళ్లు లేర’న్నారు. -
ఆప్ ఎమ్మెల్యే భర్తపై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ:నగరంలోని సర్వోదయ విద్యాలయా ప్రిన్సిపాల్ ను వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే బందనా కుమారి భర్త సజ్జన్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ అడ్మిషన్ విషయంలో సజ్జన్ కుమార్ తనను వేధించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంటూ సర్వోదయ విద్యాలయా ప్రిన్సిపాల్ రంజిత్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత బుధవారం సజ్జన్ కుమార్ నుంచి ఓ కాల్ వచ్చిందని.. ఆ కాల్ లో ఎటువంటి పరిచయం లేకుండానే తనను కలవాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారని రంజిత్ సింగ్ పేర్కొన్నాడు. అనంతరం సజ్జన్ స్కూల్ కు వచ్చి నానా హంగామా సృష్టించారని సదరు ప్రిన్సిపాల్ పేర్కొన్నాడు. తన స్కూళ్లో ఆయన సూచించిన వ్యక్తికి అడ్మిషన్ ఇవ్వకపోవడంతో తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని రాత పూర్వక ఫిర్యాదులో స్పష్టం చేశాడు. ఆ ఘటనకు సంబంధించి రికార్డు అయిన వీడియోను కూడా రంజిత్ సింగ్ సమర్పించినట్లు పోలీసు అధికారి తెలిపారు.దీంతో సజ్జన్ కుమార్ పై 146, 353, 506/34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు అధికారి పేర్కొన్నారు. -
టైట్లర్, సజ్జన్‌కు ఢిల్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలు?
సాక్షి, న్యూఢిల్లీ: 1984లో సిక్కు అల్లర్లను రెచ్చగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్న కారణంగా ఇంతకా లం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్దీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్‌కు ఎట్టకేలకు విముక్తి కల్పించనుంది. వారిద్దరికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కీలక బాధ్యతలను అధిష్ఠానం అప్పగించనుంది. సీనియర్ నాయకులతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమై ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. పైగా సిక్కుల అల్లర్లకు కారణమనే ఆరోపణలు ఎదుర్కొన్న టైట్లర్, సజ్జన్‌కు అవకాశం ఇవ్వడం, ఢిల్లీకి 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న షీలాదీక్షిత్‌కు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రె స్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని కొందరు ఆ పార్టీ నాయకులు అంటున్నారు. 8 మందితో కమిటీ? రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసం 8 మంది సభ్యల కమిటీని నియమించారని ఈ కమిటీలో టైట్లర్, సజ్జన్కుమార్లతో పాటు అర్విందర్ సింగ్ లవ్లీ, జై ప్రకాశ్ అగర్వాల్, హరూన్ యూసఫ్, జైకిషన్ , మహాబల్ మిశ్రా, మతీన్ అహ్మద్‌కు చోటు కల్పించారని వార్తలు వచ్చాయి. షీలాదీక్షిత్‌కు ఈ కమిటీలో చోటు దక్కలేదని తెలిసింది. కమిటీని ఏర్పాటు చేయలేదు: ముఖేష్ కానీ, కాంగ్రెస్ పార్టీ ఈ వార్తలను ఖండించింది. రాహుల్ గాంధీ ఎటువంటి కమిటీని ఏర్పాటు చే యలేదని కాంగ్రెస్ ప్రతినిధి ముఖేష్ శర్మ చెప్పారు. కమిటీ ఏర్పాటు చేయనప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ కీలక ఎన్నికల బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. సజ్జన్‌కుమార్‌కు అనధికార కాలనీలు, జుగ్గా జుగ్గీ జోపిడీవాసుల ఓట్లు తెచ్చే బాధ్యతలు, సదర్ ఓటర్ల మనసు గెలచుకునే బాధ్యతను జగదీశ్టైట్లర్కు అప్పగించారని అంటున్నారు. రాహుల్ గాంధీ బుధవారం ఉదయం జరిపిన సమావేశంలో ఈ వివాదస్పద నేతలు ఇరువురు పాల్గొన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విస్మయం: ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ సిక్కు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విశ్వప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పుండుమీద కారం చల్లిన చందంగా సిక్కు వ్యతిరేకత మూటకట్టుకొన్న జైట్లీ, సజ్జన్‌కు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించనుండడంపై రాజకీయ పరిశీలకుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఈ చర్య కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో నష్టపర్చుతుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రతినిధి సంబిత్‌పాత్ర కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ నేతల అరెస్టు, ఆపై విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్, నీటి సరఫరాలో కోతలకు నిరసనగా భారీ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు అర్విందర్ సింగ్ లవ్లీ, సజ్జన్‌కుమార్, ముఖేష్ శర్మ అదుపులోకి తీసుకున్న పోలీసులు గంట సేపటి తర్వాత విడుదల చేశారు. తొలుత వీరంతా నాంగ్లోయ్ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు యత్నించారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్, కాంగ్రెస్ ప్రతినిధి ముఖేష్ శర్మతో పాటు దాదాపు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్తర ఢిల్లీలోని నాంగ్లోయ్ రైల్వే స్టేషన్లో పట్టాలపై బైఠాయించారు. రైళ్ల రాకపోకలను ఆడ్డుకునేందుకు యత్నించారు. పట్టాలపై నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు విన్నవించినప్పటికీ కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు వారిపై వాటర్ కేనన ్లను ప్రయోగించారు. అయినప్పటికీ కదలకపోవడంతో వారిని బలవంతంగా పట్టాలపై నుంచి లేవదీసి నాంగ్లోయ్, గోండా పోలీస్ స్టేషన్లకు తరలించారు. లవ్లీ, శర్మతో పాటుకొందరు కార్యకర్తలను గోండా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గంటసేపటి తర్వాత వారినందరినీ విడుదల చేశారు. కాగా పోలీసుల చర్యను ముఖేశ్ శర్మ ఖండించారు. విద్యుత్, నీటి సరఫరా మెరుగయ్యేదాకా తాము చేపట్టిన ఆందోళన కొనసాగుతుందన్నారు. అనంతరం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్వింద్‌సింగ్ లవ్లీ మీడియాతో మాట్లాడుతూ తమను సమీపంలో ఉన్న స్టేషన్‌కు కాకుండా ముండ్కాతనా స్టేషన్‌కు పోలీసులు తరలించారన్నారు. ప్రజల గొంతును తొక్కిపెట్టడానికి ఇదొక మార్గమని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య సూత్రాల గురించి గొప్పలు చెప్పుకునే బీజేపీ ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు.ప్రభుత్వం తమను అరెస్టు చేసినా లేదా కారాగారానికి పంపినా లేదా తమపై నీటి ఫిరంగులు ప్రయోగించినా విద్యుత్, నీటి సమస్యలపై ఆందోళనను మాత్రం కొనసాగిస్తామని హెచ్చరించారు. 15 ఏళ్ల తమ పార్టీ పాలనలో నగరంలో విద్యుత్ సమస్య తలెత్తలేదని లవ్లీ చెప్పారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.