సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి, జీవిత ఖైదు విధించబడిన మాజీ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ సోమవారం ఢిల్లీ కోర్టు ఎదుట లొంగిపోయారు. మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ అదితి గార్గ్ ఎదుట లొంగిపోయిన సజ్జన్ కుమార్‌ను ఈశాన్య ఢిల్లీలోని మందోలి జైలుకు తరలించాలని న్యాయస్ధానం ఆదేశించింది. తనను తీహార్ జైలులో ఉంచాలన్న సజ్జన్ కుమార్ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు తనకు భద్రత కల్పించాలని, ప్రత్యేక వాహనంలో జైలుకు తరలించాలన్న వినతిని అంగీకరించింది.
సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్ కుమార్‌ను దిగువ కోర్టు తప్పించడాన్ని తోసిపుచ్చుతూ డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇక లొంగుబాటుకు నిర్ధేశించిన గడువును పొడగించాలన్న సజ్జన్ వినతినీ ఈనెల 21న కోర్టు తిరస్కరించింది. ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో ఐదుగురు సిక్కుల ఊచకోత, గురుద్వారకు నిప్పంటించిన కేసులో సజ్జన్‌ను ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారించింది.
హైకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు సజ్జన్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 73 సంవత్సరాల సజ్జన్ కుమార్ ఔటర్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment