
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్(Sajjan Kumar)కు జీవితఖైదు పడింది. అల్లర్లలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని నిర్దారించిన ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం.. ఇదివరకే దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు శిక్ష ఖరారు చేస్తూ స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆదేశాలు జారీ చేశారు.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల(Anti Sikh Riots)లో భాగంగా నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చింది. ఆపై ఆ ఇంట దోపిడీకి పాల్పడింది. ప్రత్యక్ష సాక్షి, జస్వంత్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.
సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని, ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని పేర్కొంటూ ఫిబ్రవరి 12వ తేదీ స్పెషల్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. సజ్జన్ కుమార్‌కు మరణశిక్ష విధించాలన్న జస్వంత్ భార్య పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఆయనకు జీవితఖైదు(Life Imprisonment) విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అయితే 2015లో అమిత్ షా(Amit Shah) చొరవతో అప్పట్లో ఈ కేసును సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది.
ఎవరీ సజ్జన్ కుమార్?
ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్‌కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

సజ్జన్‌కు శిక్ష-ఎప్పుడు ఏం జరిగిందంటే..
1991: అల్లర్లలో జస్వంత్, తరుణ్ దీప్ సింగ్‌ల హత్యపై కేసు నమోదు
1994: జులై 8 సరైన ఆధారాలు లేవని చెబుతూ సజ్జన్ కుమార్ విచారణకు ఢిల్లీ కోర్టు నిరాకరణ
2015 ఫిబ్రవరి 12: సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
2016 నవంబర్ 21: మరింత దర్యాప్తు అవసరమని కోర్టుకు తెలిపిన సిట్
2021 ఏప్రిల్ 06: సజ్జన్ కుమార్ అరెస్ట్
2021 మే 5 : సజ్జన్‌పై పోలీసుల ఛార్జ్‌షీట్ నమోదు
2021, జులై 26: ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం
2021, అక్టోబర్ 1: కోర్టులో వాదనలు ప్రారంభం
2021, డిసెంబర్ 16: సజ్జన్ కుమార్‌పై అభియోగాలు నమోదు చేసిన కోర్టు
జనవరి 31, 2024: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తుది వాదనలు విన్న కోర్టు
2024, నవంబర్ 8: వాదనలు పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు
2025, ఫిబ్రవరి 12: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు
2025, ఫిబ్రవరి 25: సజ్జన్ కుమార్‌కు జీవితఖైదు ఖరారు
నానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో మొత్తం 2,733 మంది మరణించారు. మొత్తం 587 ఎఫ్‌ఐఆర్‌లలో కేవలం 28లో మాత్రమే 400 మందికి శిక్షలు పడ్డాయి.
ఇప్పటికే యావజ్జీవం
ఇక ఢిల్లీ కంటోన్మెంట్(Delhi Cantonment)లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.