సజ్జన్ కుమార్, జగదీశ్ టట్లర్
న్యూఢిల్లీ : నరేంద్రమోదీ సర్కారు హయాంలో దళితులపై అకృత్యాలు పెరిగిపోయాయని, సామాజిక సామరస్యం దెబ్బతింటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. అయితే రాహుల్ గాంధీ దీక్షా స్థలానికి రావడానికి ముందే ఇద్దరు వివాదాస్పద కాంగ్రెస్ నాయకులు జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. వారిని వేదికపైకి అనుమతించకుండా పార్టీ కార్యకర్తలతో పాటు కింద కూర్చోవాలంటూ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ విషయమై ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ‘ఆ ఇద్దరు నాయకులను వేదికపైకి అనుమతించకపోవడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. ఈ నిరసనలో పార్టీ కార్యకర్తలంతా పాల్గొనవచ్చు. మాజీ ఎంపీలకు వేదికపై కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాటు చేయలేదని’ వివరణ ఇచ్చారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రధాన పాత్ర పోషించారని జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే మత సామరస్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన దీక్షలో వీరు పాల్గొంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, బీజేపీకి ఇది ఒక అస్త్రంగా మారుతుందనే కారణంగానే వారిని పక్కకు పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సీబీఎస్‌ఈ పరీక్షా పత్రాలు లీక్ కావడం, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం, పార్లమెంటు సమావేశాలు పూర్తిగా స్తంభించిపోవడం, దళిత సంఘాలు ఈనెల 2న నిర్వహించిన భారత్ బంద్‌లో హింస చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ సర్కారును, బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు రాహుల్ ఈ నిరసన దీక్షకు పూనుకున్నారు.
కాగా, ఈ విషయంపై స్పందించిన జగదీశ్ టైట్లర్ మీడియాతో మాట్లాడుతూ... ‘నన్నెవరూ వెళ్లిపొమ్మని చెప్పలేదు. నేనెప్పుడూ కార్యకర్తలతో పాటే కూర్చుంటాను. పార్టీలో నన్నెవరూ వ్యతిరేకించే వాళ్లు లేర’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment