hunger stike
-
Thota Jyothi Rani: పేదరికం దేశాన్ని వదలని రుగ్మత
నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన, రూరల్ హౌసింగ్ కోసం ఇందిరా ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్స్ రోజ్‌గార్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన... ప్రభుత్వం ఇన్ని పథకాలను అమలు చేస్తోంది. ఇవన్నీ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం రూపొందించినవే. దశాబ్దాలుగా పథకాలు అమలవుతున్నప్పటికీ దేశంలో పేదరికం అలాగే ఉంది. పేదరికం మాత్రమే కాదు ఆకలి తీవ్రమవుతోంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలోని 127 దేశాల జాబితాలో మనదేశానిది 105వ స్థానం. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు అనుసరించిన పాలన పద్ధతులతో పేదరికం తగ్గలేదు సరి కదా ఆకలి పెరుగుతోందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తెలియచేస్తోందని చెప్పారు కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి. ఇంటర్నేషనల్ పావర్టీ ఇరాడికేషన్ డే సందర్భంగా పేదరికం మనదేశంలో మహిళల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో పరిశీలిద్దాం. ఫోను... లూనా... ప్రమాణాలు కాదు!మనదేశం అభివృద్ధి చెందలేదా అంటే ఏ మాత్రం సందేహం లేకుండా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. కరెంట్ వాడకం, గ్యాస్ వినియోగం పెరిగాయి. ఉల్లిపాయలు, కూరగాయలమ్మే వాళ్లు కూడా టూ వీలర్, మినీ ట్రక్కుల మీద వచ్చి అమ్ముకుంటున్నారు. జనాభాలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. వీటిని చూసి పేదరికం తగ్గిపోయిందనే అభిప్రాయానికి రావడం ముమ్మాటికీ తప్పే. అవి లేకపోతే ఆ మేరకు పనులు చేసుకోవడం కూడా సాధ్యం కాని రోజులు వచ్చేశాయి. కాబట్టి ఇప్పుడు వీటిని సంపన్నతకు ప్రతిరూపాలుగా చూడరాదు. నిత్యావసర సౌకర్యాలనే చెప్పాలి. ఈ ఖర్చులిలా ఉంటే కడుపు నింపుకోవడానికి మంచి ఆహారం కోసం తగినంత డబ్బు ఖర్చుచేయలేని స్థితిలో ఉంది అల్పాదాయవర్గం. సమాజం పేదరికాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తుంది. నిజానికది సామాజిక కోణంలో చూడాల్సిన అంశం. భారం మహిళల మీదనే!అల్పాదాయ కుటుంబంలోని మహిళ పేదరికానికి తన జీవితకాలమంతటినీ మూల్యంగా చెల్లించుకుంటుంది. పేదరికం భారం ప్రధానంగా మహిళ మీదనే పడుతుంది. పొయ్యి మీదకు, పొయ్యి కిందకు సమకూర్చుకోవడంలో నలిగిపోయేది ఆడవాళ్లే. ఒకప్పుడు అడవికి పోయి కట్టెలు తెచ్చుకునే వాళ్లు. గ్రామీణ మహిళకు కూడా ఇప్పుడా అవకాశం లేదు. తప్పని సరిగా గ్యాస్ సిలిండర్, కిరోసిన్, బొగ్గులు ఏదో ఒకటి కొనాల్సిందే. ఇంట్లో అందరికీ సరిపోయేటట్లు వండాలి. ఉన్న డబ్బులో అందరికీ పెట్టగలిగిన వాటినే వండుతుంది. ఆ వండిన పదార్థాలను ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత మిగిలింది తాను తినాలి. ఆ తినగలగడం కూడా అందరూ తినగా మిగిలితేనే. అందరికీ పెట్టి పస్తులుండే మహిళలు ఇంకా దేశంలో ఉన్నారు. బీహార్‌లో అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముసాహర్ సామాజిక వర్గంలో మహిళలు రొట్టెలు చేసి తాము సగం రొట్టెతో ఆకలి తీర్చుకుంటారు. వాళ్లు ఒక రొట్టె అంతటినీ తినగలగడం అంటే ఆ రోజు వాళ్లకు పండగతో సమానం. ఇంటి నాలుగ్గోడల మధ్య ఏం వండారో, ఏం తిన్నారో బయటకు తెలియదు. కానీ జాతీయ సర్వేలు ఈ విషయాలను బయటపెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రానిక్ ఎనర్జీ డెఫిషియెన్సీతో బాధ పడుతున్న మహిళలు నూటికి ఎనభై మంది ఉన్నారు. పట్టణాల్లో ఆ సంఖ్య యాభై ఏడుగా ఉంది. పేదరికం విలయతాండవం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఇంకే కావాలి. అభివృద్ధి గమనం సరైన దిశలో సాగకపోవడమే ఇందుకు కారణం. అభివృద్ధి క్రమం తప్పడం వల్లనే పేదరిక నిర్మూలన అసాధ్యమవుతోంది. ఆలోచన అరవై ఏళ్ల కిందటే వచ్చింది!మనదేశంలో పాలకులకు పేదరికం గురించిన ఆలోచన 1960 దశకంలోనే వచ్చింది. నేషనల్ సాంపుల్ సర్వే 1960–61 ఆధారంగా వి.ఎమ్. దండేకర్, ఎన్. రాత్ల నివేదిక దేశంలో పేదరికం తీవ్రతను తెలియచేసింది. ఉద్యోగ కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందాయి. కానీ అవి అమలులో అనుకున్న ఫలితాలనివ్వలేదు, పూర్తిగా వక్రీకరణ చెందాయి. దాంతో ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమన చర్యల వైపు చూశాయి. ఆ చర్యల్లో భాగమే పైన చెప్పుకున్న పథకాలు. ఇన్ని దశాబ్దాలుగా ఈ పథకాలు అమలులో ఉన్నప్పటికీ సమాజంలో వాటి అవసరం ఇంకా ఉందని హంగర్ ఇండెక్స్ చెబుతోంది. ప్రణాళిక బద్ధమైన ఉద్యోగ కల్పన ఇప్పటికీ జరగలేదు, ఇంకా తాత్కాలిక ఉపశమనాలతోనే నెట్టుకు వస్తున్నాం. ఇదిలా ఉంటే పంచవర్ష ప్రణాళికలను కూడా నిలిపివేసింది ప్రభుత్వం. పేదరిక నిర్మూలన సాధనలో ఉపాధి హామీ అనేది చిరుదీపం వంటిదే. అదే సంపూర్ణ పరిష్కారం కాదు. సమ్మిళిత అభివృద్ధి జరగకపోవడంతో సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. సంపన్నులు మరీ సంపన్నులవుతున్నారు. పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. పేదరికం ప్రభావం మహిళలు, పిల్లల మీద తీవ్రంగా చూపిస్తుంది. విద్య, వైద్యం కార్పొరేటీకరణ చెందడంతో ఒక్క అనారోగ్యం వస్తే కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆవిరైపోతుంది. వైద్యాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారు. – ప్రొ‘‘ తోట జ్యోతిరాణి, రిటైర్డ్ ఫ్రొఫెసర్, ఎకనమిక్స్, కాకతీయ యూనివర్సిటీ– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్
శ్రీలంక మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ శుక్రవారం 24 గంటల నిరాహారదీక్షకు దిగాడు. ప్రస్తుతం శ్రీలంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంతో పాటు 2019లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు కుటుంబాలకు న్యాయం చేకూరేందుకే తాను నిరాహారదీక్షకు దిగినట్లు దమ్మిక ప్రసాద్ తెలిపాడు. ''బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగేవరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.. దీంతో పాటు లంక ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వం పరిష్కారం చూపించాలని'' మీడియాకు తెలిపాడు. అంతకముందు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఉంటున్న గాలేలోని సెక్రటరియట్ ఎదుట ఆందోళన చేస్తున్న లంక ప్రజలకు మద్దతుగా దమ్మిక ప్రసాద్ తన నిరసనను వ్యక్తం చేశాడు. కాగా 2019లో ఈస్టర్ సండే రోజున ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 269 మంది ప్రాణాలు పోయాయి. మూడు చర్చిలు, మూడు హోటళ్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. కాగా ఈ కుట్ర వెనుక సూత్రధారులపై శ్రీలంక ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతోపాటు బాంబు దాడిలో మరణించిన బాధితుల కుటుంబాలకు కూడా ఎలాంటి నష్టపరిహారం అందించలేదు. చదవండి: Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! -
దారుణ అవమానాలు.. ఎక్కువ కాలం బతకను: మాజీ అధ్యక్షుడు
త్బిల్సి: ఎన్నికల్లో మోసానికి పాల్పడి.. విజయం సాధించారనే ఆరోపణల నేపథ్యంలో జార్జియా అధ్యక్షుడు సాకాష్విలిని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొంది. జైలులో ఉన్న సాకాష్విలి.. తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా జైలులో నిరాహార దీక్ష చేస్తున్నారు. గత 39 రోజులుగా ఆయన ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సాకాష్విలి జైలు సిబ్బందిపై సంచనల ఆరోపణలు చేశారు. జైలులో తనను తిడుతున్నారు.. కొడుతున్నారని.. త్వరలోనే చనిపోతానేమో అని భయమేస్తుంది అన్నారు. సాకాష్విలి 2004-2013 వరకు జార్జియా అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్నికల్లో మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఈ సందర్భంగా సాకాష్విలి మాట్లాడుతూ.. ‘‘జైలు సిబ్బంది నన్ను బూతులు తిట్టారు.. నా మెడ మీద కొట్టారు.. జుట్టు పట్టుకుని నేల మీద పడేసి లాక్కెళ్లారు. ఇలానే కొసాగితే.. త్వరలోనే నేను చనిపోతానని భయమేస్తుంది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. జైలులో తన పరిస్థితిని వివరిస్తూ.. తన లాయర్‌కు లేఖ రాశాడు. అంతేకాక అనారోగ్యంగా ఉన్న తనను జైలు ఆస్పత్రికి తీసుకెళ్లారని.. అక్కడ తనను చంపడమే వారి లక్ష్యమని సాకాష్విలి పేర్కొన్నాడు. (చదవండి: 400 ఏళ్ల క్రితం హత్య.. మిస్టరీని చేధించిన భారత శాస్త్రవేత్తలు ) ప్రస్తుతం ఈ లేఖ జార్జియాలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హక్కుల కార్యకర్తలు జైలు బయట కూర్చొని అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 40 వేల మంది కార్యకర్తలు నిరసలో పాల్గొని.. సాకాష్విలికి మద్దతు తెలిపారు. ఆయనను విడుదల చేయాల్సిందిగా కోరారు. సోమవారం ఉదయం, సాకాష్విలిని పరీక్షించిన వైద్యులు ఆయన శరీరంలో అనేక అవయవాలు పని తీరు ఇప్పటికే నెమ్మదించిందని.. నిరాహాదర దీక్ష మరి కొంత కాలం కొనసాగితే.. ఆయన ప్రాణాలకే ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాకాష్విలికి అత్యవసరంగా హైటెక్ క్లినిక్‌లో చికిత్స చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. (చదవండి: ఒక్కరాత్రిలో ట్రిలియనీర్ అయిన స్కూల్ విద్యార్థి?) సాకాష్విలికి అంతర్లీన రక్త రుగ్మత ఉన్నందున అతని నిరాహారదీక్ష ముఖ్యంగా ప్రమాదకరమైనదిగా మారినందున అతనికి మరణం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. సాకాష్విలిని జైలు ఆసుపత్రికి తరలించడాన్ని ఉక్రెయిన్ నిరసించింది, ఈ చర్య "అదనపు నష్టాలను సృష్టిస్తుంది" అని పేర్కొంది. చదవండి: ఆక్సిజన్ ఉండేది 100 కోట్ల ఏళ్లే.. -
పెనుబల్లిలో నేడు షర్మిల ‘నిరుద్యోగ దీక్ష’
సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల మంగళ వా రం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్నారు. ఇటీవల ఆత్మహత్య పాల్పడిన గంగదేవిపాడుకు చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. -
క్షీణిస్తున్న వైఎస్ షర్మిల ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ దీక్ష చేస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది. లోటస్‌పాండ్‌లో దీక్షను కొనసాగిస్తున్న షర్మిలను వైద్యులు పరీక్షించారు. షుగర్ లెవల్స్ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు ఆమెను పరీక్షించిన డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలంటూ 72 గంటల దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల.. గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద దీక్ష చేపట్టారు. పోలీసులు సాయంత్రం వరకే అనుమతివ్వడం, ఆ తర్వాత ఆమె పాదయాత్రగా లోటస్‌పాండ్‌కు బయల్దేరడం.. మధ్యలోనే పోలీసులు ఆమెను అడ్డుకుని ఆమె ఇంటివద్ద వదిలేయడంతో అక్కడే దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మంచినీరు మాత్రమే తాగుతూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. మీ కోసం తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేస్తా. ప్రభుత్వ రంగంలోనే కాదు.. ప్రైవేట్‌రంగం లో కూడా 11 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్సార్‌ది’అని అన్నారు. షర్మిలకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి మద్దతు తెలిపారు. ఆటో యూనియన్ నేత అమానుల్లాఖాన్ ఆటోలతో భారీ ర్యాలీగా వచ్చి షర్మిలకు మద్దతు తెలిపారు. చదవండి: కాంగ్రెస్ వడివడిగా.. -
పట్టుబట్టి పంతం నెగ్గించుకున్న యువతి
సాక్షి, మునుగోడు : పట్టుపట్టి ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన ఓ యువతి చివరకు తన పంతం నెగ్గించుకుంది. ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపించాలని ప్రియుడి ఇంటి ఎదుట మూడు రోజుల పాటు చేపట్టిన దీక్ష సుఖాంతంగా ముగిసింది. తొలుత ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆయువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ప్రియురాలి అఘాయిత్యంతో ఆ ప్రియుడు దిగొచ్చి వివాహానికి ఒప్పుకున్నాడు. వివరాలు.. మండలంలోని కల్వలపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన లింగస్వామి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే పెళ్లి చేసుకుంటాను, పెద్ద సమక్షంలో మాట్లాడుకుందామని యువతి బంధువులను గత గురువారం యువకుడి ఇంటికి పిలిపించారు. తీరా వచ్చే సరికి యువకుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో ఆ యువతి తనని పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడే ఉంటానని రెండు రోజుల పాటు అతడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. ఆత్మహత్యకు యత్నించి.. రెండు రోజుల పాటు తన ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేసినా వివాహం చేసుకునేందుకు ప్రియుడు అంగీకరించలేదు. పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చినా అతడి నిర్ణయంలో మార్పు లేదనే విషయం తెలుసుకున్న ప్రియురాలు దీక్షాస్థలిలోనే నెయిల్ పాలిష్ (గోర్ల పెయింట్), కొన్ని మాత్రలు మింగింది. గమనించి కుటుంబ సభ్యులు ఆమెను నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సదరు యు వతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిసింది. పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత దుస్థితి కల్పించిన కన్నెబోయిన లింగస్వామి, అతడి కుటుంబ సభ్యులపై చర్య తీసుకోవాలని కోరుతూ యువతి తల్లిదండ్రులతో పాటు బంధువులు శనివారం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో వారు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని పోలీసులు సముదాయించారు. పెళ్లికి ఒప్పుకున్న ప్రియుడు ప్రేమించిన యువతి ఆత్మహత్యానికి పాల్పడిన విషయం తెలుసుకున్న లింగస్వామి పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో రెండు కుటుంబాల వారు పెళ్లికి సమ్మతించడంతో మూడు రోజుల పాటు కల్వలపల్లిలో జరుగుతున్న హైడ్రామాకు తెరపడింది. అయితే సదరు యువతి ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతుండడంతో పట్టుపట్టి చివరకు పంతం నెగ్గించుకుందని గ్రామస్తులు పేర్కొన్నారు. -
‘రేపు ప్రగతి భవన్ ముట్టిడిస్తాం’
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డు నిర్వాకంతో విద్యార్ధుల ఆత్మహత్యల పరంపరపై బీజేపీ భగ్గుమంది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇక లక్ష్మణ్ దీక్షకు హాజరైన సీనియర్ నేతలు రాం మాధవ్, బండారు దత్తాత్రేయ, డీకే అరుణ, మురళధర్ రావులు ఆయనకు సంఘీభావం తెలిపారు. తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతపెద్ద తప్పిదాలు ఎన్నడూ చూడలేదని, పిల్లల హక్కులను కాలరాసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని దీక్షకు ఉపక్రమించిన లక్ష్మణ్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ దేవుడెరుగు..బలిదానాల తెలంగాణగా మారుస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తల్లితండ్రులు విశ్వాసం కోల్పోకండని ఆయన కోరారు. విద్యార్ధులు ఒత్తిళ్లకు లోనుకావద్దు : రాంమాధవ్ ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు దురదృష్టకరం. చరిత్రలో ఇదొక మచ్చగా మిగిలిపోతుంది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకూడదు. ప్రభుత్వం పిల్లలకు ఆత్మవిశ్వాసం కల్పించకపోగా అహంభావంతో వ్యవహరిస్తోంది. ఇది రాజకీయ సమస్య కాదు . పిల్లలకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం కొనసాగుతుంది. ఇది పెను సంక్షోభం : మురళీధర్ రావు విద్యారంగంలో ఇంత పెద్ద సంక్షోభం దేశంలో ఏ రాష్ట్రంలో రాలేదు. ఇంటర్ బోర్డ్ అవకతవకల కారణంగా ఇప్పటివరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి. ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికే ఇది పరీక్షగా మారుతుంది. ప్రగతి భవన్ ముట్టడిస్తాం : దత్తాత్రేయ ఇంటర్ బోర్డు అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలి. ఇంటర్ విద్యార్ధుల ఆవేదనను అర్ధం చేసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం న్యాయవిచారణ చేపట్టాలి : జితేందర్ రెడ్డి రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా సాగుతోంది. ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మూడున్నర లక్షల ఇంటర్ విద్యార్థులకు అన్యాయం జరిగింది. గ్లోబరీనా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇంటర్ బోర్డ్ అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయించాలి. ప్రభుత్వం విద్యారంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది సీబీఐ విచారణ జరిపించాలి : కన్నా సమస్యల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే తీరుగా ఉన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్లతో తీరికలేకుండా బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌తో ప్రభుత్వం ఆడుకుంటోంది. ఈ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇంటర్ బోర్డు నిర్వాకంపై సీబీఐ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ చేత విచారణ జరపాలి -
పద్మభూషణ్ వెనక్కిచ్చేస్తా: హజారే
రాలేగావ్‌సిద్ధి: కేంద్ర ప్రభుత్వం తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని సామాజిక కార్యకర్త అన్నాహజారే హెచ్చరించారు. రాలేగావ్ సిద్ధిలో చేపట్టిన ఆమరణ దీక్ష ఆదివారం నాటికి ఐదోరోజుకు చేరింది. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 1992లో ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని వాపసు చేస్తానని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. తక్షణమే లోక్‌పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సంస్కరణలు చే పట్టాలని డిమాండ్ చేశారు. కాగా, హజారేకు డాక్టర్ ధనంజయ పొటే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఐదురోజుల్లోనూ ఆయన 3.8 కేజీల బరువు తగ్గిపోయినట్లు తెలిపారు. హజారే ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాలేగావ్ సిద్ధి గ్రామప్రజలు అహ్మద్‌నగర్–పుణె జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో బైఠాయించారు. దీంతో ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
జక్కంపూడి రాజా దీక్ష భగ్నం..
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు గురువారం అర్ధరాత్రి భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి రాజా నిరాకరించారు. పురుషోత్తపట్నం రైతులకు న్యాయం చేసే వరకు దీక్ష విరమించబోనని ఆయన స్పష్టం చేశారు. రఘుదేవపురంలో పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, వరికుప్పలు కాలిపోయిన రైతులను ఆదుకోవాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, పోలవరం జలవిద్యుత్ కేంద్రం సిబ్బంది కాలనీకి భూసేకరణలో ఉన్న రైతుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ జక్కంపూడి రాజా నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్ సీపీ గోదావరి జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించి రాజాను పరామర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, అనంత బాబు ,తోట నాయుడు, విశ్వరూప్, వేణు గోపాల్ కృష్ణ, కుడుపూడి చిట్టబ్బాయి లతోపాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజాని పరామర్శించారు. ఓవైపు రైతుల కోసం జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష కొనసాగిస్తుండగా మరోవైపు ఆయన సోదరుడు గణేష్ కోరుకొండ మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్ సీపీ నవరత్నాలు గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. -
టైట్లర్, సజ్జన్లకు సొంత పార్టీ ఝలక్
న్యూఢిల్లీ : నరేంద్రమోదీ సర్కారు హయాంలో దళితులపై అకృత్యాలు పెరిగిపోయాయని, సామాజిక సామరస్యం దెబ్బతింటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. అయితే రాహుల్ గాంధీ దీక్షా స్థలానికి రావడానికి ముందే ఇద్దరు వివాదాస్పద కాంగ్రెస్ నాయకులు జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. వారిని వేదికపైకి అనుమతించకుండా పార్టీ కార్యకర్తలతో పాటు కింద కూర్చోవాలంటూ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ‘ఆ ఇద్దరు నాయకులను వేదికపైకి అనుమతించకపోవడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. ఈ నిరసనలో పార్టీ కార్యకర్తలంతా పాల్గొనవచ్చు. మాజీ ఎంపీలకు వేదికపై కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాటు చేయలేదని’ వివరణ ఇచ్చారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రధాన పాత్ర పోషించారని జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే మత సామరస్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన దీక్షలో వీరు పాల్గొంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, బీజేపీకి ఇది ఒక అస్త్రంగా మారుతుందనే కారణంగానే వారిని పక్కకు పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీబీఎస్ఈ పరీక్షా పత్రాలు లీక్ కావడం, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం, పార్లమెంటు సమావేశాలు పూర్తిగా స్తంభించిపోవడం, దళిత సంఘాలు ఈనెల 2న నిర్వహించిన భారత్ బంద్‌లో హింస చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ సర్కారును, బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు రాహుల్ ఈ నిరసన దీక్షకు పూనుకున్నారు. కాగా, ఈ విషయంపై స్పందించిన జగదీశ్ టైట్లర్ మీడియాతో మాట్లాడుతూ... ‘నన్నెవరూ వెళ్లిపొమ్మని చెప్పలేదు. నేనెప్పుడూ కార్యకర్తలతో పాటే కూర్చుంటాను. పార్టీలో నన్నెవరూ వ్యతిరేకించే వాళ్లు లేర’న్నారు. -
అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు తగదు
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విరమించుకోకపోతే ఆమరణ దీక్ష కావలి: జన జీవనాన్ని సర్వనాశనం చేసే అణు విద్యుత్ కేంద్రాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించకోకపోతే ఆమరణ దీక్ష చేపడతానని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కావలిలోని ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అణు విద్యుత్ కేంద్రాలను గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకిస్తే మన రాష్ట్రం కావలిలో ఏర్పాటు చేస్తాననడం దారుణమన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించడం చూస్తుంటే కావలిపై ఆయనకు ఎంత కక్ష ఉందో తెలుస్తుందన్నారు. కావలిలోని టీడీపీ నేతలు ఈ విషయంపై ఎందుకు స్పందించ లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న అణు విద్యుత్ కేంద్రం ద్వారా 6,660 మెగావాట్ల విద్యుదుత్పతి చేయాలని సీఎం చూస్తున్నారని తెలిపారు. ఈ కేంద్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే 100 కిలో మీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. రేడియేషన్ వ్యాపించి జీవరాసులు అంతమవుతామన్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్స్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రాణాలు అడ్డుపెట్టి అయినా ప్రజల కోసం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పార్టీ తరపున పోరాడుతానని ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రికి కావలి ప్రజల తరుపున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సమావేశంలో కావలి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు కుందుర్తి కామయ్య, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జంపాని రాఘవులు, కౌన్సిలర్ ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
జగన్‌కు మద్దతుగా కువైట్‌లో దీక్షలు
సాక్షి, హైదరాబాద్: న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సంఘీభావంగా కువైట్‌లోని పార్టీ ఎన్నారై విభాగం నేతలు మలియా ప్రాంతంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కాంగ్రెస్, టీడీపీలు ఓట్లు, సీట్ల కోసం సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నాయని, కానీ జైల్లో ఉన్నా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ జగన్ నిజమైన ప్రజానాయకుడని పలువురు నాయకులు పేర్కొన్నారు. తామంతా వైఎస్సార్సీపీ సభ్యులుగా ఉన్నందుకు గర్వపడుతున్నామని అన్నారు.