జక్కంపూడి రాజా దీక్షను భగ్నం చేస్తున్న పోలీసులు
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు గురువారం అర్ధరాత్రి భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి రాజా నిరాకరించారు. పురుషోత్తపట్నం రైతులకు న్యాయం చేసే వరకు దీక్ష విరమించబోనని ఆయన స్పష్టం చేశారు.
రఘుదేవపురంలో పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, వరికుప్పలు కాలిపోయిన రైతులను ఆదుకోవాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, పోలవరం జలవిద్యుత్ కేంద్రం సిబ్బంది కాలనీకి భూసేకరణలో ఉన్న రైతుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ జక్కంపూడి రాజా నిరాహార దీక్ష చేపట్టారు.
వైఎస్సార్ సీపీ గోదావరి జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించి రాజాను పరామర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, అనంత బాబు ,తోట నాయుడు, విశ్వరూప్, వేణు గోపాల్ కృష్ణ, కుడుపూడి చిట్టబ్బాయి లతోపాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజాని పరామర్శించారు. ఓవైపు రైతుల కోసం జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష కొనసాగిస్తుండగా మరోవైపు ఆయన సోదరుడు గణేష్ కోరుకొండ మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్ సీపీ నవరత్నాలు గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment