సాక్షి, రాజమండ్రి: వరద బాధితులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
‘వరద బాధితులకు ప్రభుత్వం నిత్యవసరాలు పంపిణీ చేయటం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు. వరద ప్రాంతాల్లో కేవలం ఫొటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో పరిహారం, రేషన్, అందించడంలో ముందుంది. ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు. బ్రిడ్జిలంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నీటి మునిగిన జాతీయ రహదారులను వెంటనే పునరుద్ధరించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలి. లైఫ్ జాకెట్ లేకుండా వరద నీటిలో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
.. వాలంటీర్లకు పదివేల రూపాయలు స్టైఫండ్ ఇస్తానని చెప్పి వ్యవస్థనే నిర్మూలించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నిరుద్యోగ భృతి ఊసేత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీలు ఎత్తెస్తాడేమో అనిపిస్తుంది. తల్లికి వందనం పథకానికి మంగళంపాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కన్నా డ్రామాలాడే వాడే నయం. ప్రజలను దారుణంగా వంచిస్తున్నారు. సంపద సృష్టిస్తామన్నారు.. ఇప్పటివరకు ఏమి సృష్టించలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా ఎక్కడుంది. సహాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
.. ఇసుక కొండలు ఏమైపోయాయి. ఇసుక గుట్టలను స్థానిక ఎమ్మెల్యేలు మింగేశారు. నాలుగు రోజుల్లోనే బకాసురుల్ల మింగేశారు. స్థానిక ఎమ్మెల్యే నాలుగు రోజుల్లోనే రూ. 10 కోట్లఇసుక మింగేశారు. ఉచిత ఇసుక ఎవరికిచ్చారు? రాజమండ్రి వ్యాప్తంగా సెటిల్‌మెంట్ బ్యాచ్‌లే నడిపిస్తున్నాయి. పేకాట క్లబ్ నడుపుకుంటామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాళ్లే దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలి? జిల్లా పోలీసు అధికారులను పేకాట డబ్బులు నడుపుకుంటామని ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. ఇదెక్కడి ప్రభుత్వం. గతంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇసుక వల్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతి వ్యాపారి వద్దకు వెళ్లి కమిషన్ కట్టమని ఒత్తిడి తీసుకొస్తున్నారు’అని భరత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment