ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?: జక్కంపూడి రాజా | YSRCP Leader Jakkampudi Raja Fires At Chandrababu | Sakshi
Sakshi News home page

ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?: జక్కంపూడి రాజా

Jan 28 2025 5:06 PM | Updated on Jan 28 2025 5:53 PM

YSRCP Leader Jakkampudi Raja Fires At Chandrababu

వైఎస్‌ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే,

సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్‌ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే, చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ పేదలకు ఇంటి కోసం సెంటు స్థలం కూడా కేటాయించిన పాపాన పోలేదని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో 72 వేల ఎకరాలు సేకరించి, వాటిలో 17 వేల కాలనీల్లో పూర్తి మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందు కోసం ఏకంగా రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. తమ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి సంపద సృష్టిస్తే, దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజా ఆక్షేపించారు.

చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు: 
నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న ముని శాపం ఉండటం వల్లనేమో చంద్రబాబు ఏనాడూ నిజాలు చెప్పడు. వైఎస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోందని ఊరూరా తిరిగి తప్పుడు ప్రచారం చేశాడు. రాష్ట్రం అప్పులపై కూటమి నాయకులంతా కలిసిమెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. తాను అధికారంలోకి వస్తే 40 ఏళ్ల అనుభవంతో సంపద సృష్టించి రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు నమ్మబలికాడు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుని.. తీరా అధికారంలోకి వచ్చాక బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అనేలా పాలన సాగిస్తున్నాడు. అసలే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనం అల్లాడుతుంటే, కొత్తగా రకరకాల పన్నుల రూపంలో ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ఇప్పటికే కరెంట్‌ బిల్లుల రూపంలో ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం మోపాడు.

నాడు అప్పులపై దుష్ప్రచారం:
ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రం అప్పులు రూ. 14 లక్షల కోట్లని ప్రచారం చేసి, తీరా అధికారంలోకి వచ్చాక అప్పులు రూ.4.6 లక్షల కోట్లని కూటమి ప్రభుత్వమే ప్రకటించింది. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లని చెబుతూనే చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలిచ్చారు. ఈ రోజు వాస్తవ అప్పులు రూ. 4.6 లక్షల కోట్లే అని తెలిసినా హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం ఆయన అసమర్థతకు నిదర్శనం. గత వైఎస్‌ జగన్‌ పాలనలో తీవ్రమైన కరోనా సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాల అమల్లో సాకులు చెప్పి తప్పించుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం వాగ్ధానాలను అమలు చేయలేక చేతులెత్తేశారు.

ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?. తాజాగా ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు 50 శాతం పెంచబోతున్నట్టు ప్రకటించారు. ఆదాయార్జనే ధ్యేయంగా ప్రజల నడ్డి విరచడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎంత వీలైతే అంత దోచుకోవడానికి వ్యూహరచనలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పిన విజనరీ ఏడు నెలల్లోనే ఒక్క పథకం కూడా అమలు చేయకుండానే చేతులెత్తేశాడు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌ బుక్‌ రాజ్యాంగం వల్ల చంద్రబాబు దావోస్‌ వెళ్లినా పారిశ్రామికవేత్తులు పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. అందుకే ఒక్క రూపాయి పెట్టుబడులు తీసుకురాలేకపోయారు.

సెంటు స్థలం కూడా ఇవ్వని బాబు:
సుదీర్ఘకాలం సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదవారికి ఇంటి కోసం సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఆయన మాత్రం హైదరాబాద్‌లో ఇంద్ర భవనం నిర్మించుకుని విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు. దివంగత వైఎస్సార్‌ హయాంలో పేదవారికి ఇళ్ల పంపిణీ జరిగింది. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఏకంగా 31 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయడంతోపాటు ప్రభుత్వం తరఫున ఇంటి నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ భూములతోపాటు రైతుల నుంచి భూములు సేకరించడం జరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు మా పథకానికి పేర్లు మార్చి తానే చేస్తున్నట్టు కలరింగ్‌ ఇస్తున్నాడు.

ఇంటి పట్టాల కోసం 71,811 ఎకరాలు సేకరణ
రూ.11,343 వేల కోట్లు వెచ్చించి 25 వేల ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుంటే ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దాని విలువ రూ. 31,832 కోట్లు.. బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం చూస్తే 71,811 ఎకరాల భూమి విలువ కనీసం రూ.75 వేల కోట్లకుపైనే ఉంటుంది. దీంతో పాటు ఇళ్ల స్థలాలకు మౌలిక వసతుల కల్పనకు రూ. 32,909 కోట్లు వెచ్చించడం జరిగింది.

ఇళ్ల పట్టాలు పొందిన వారిలో 22 లక్షల మందికి రూ. 1.80 లక్షల చొప్పున హౌసింగ్‌ శాంక్షన్‌ ఇచ్చాం. దీంతోపాటు అదనంగా డబ్బులు అవసరం అనుకుంటే పూర్తిగా సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాం. ఇందుకోసం రూ. 57,375 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా రూ. 1.27 లక్షల కోట్లు పేదల ఇళ్ల నిర్మాణం కోసం గత జగన్‌ ప్రభుత్వ ఖర్చు చేయడం జరిగింది. 

వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలతో ఊర్లకు ఊర్లే రూపుదిద్దుకున్నాయి. దాదాపు 17వేలకుపైగా కాలనీలు ఏర్పడ్డాయి. ఆయా కాలనీల్లో అప్రోచ్‌ రోడ్లు, ఇంటర్నల్‌ గ్రావెల్‌ రోడ్లు, సైడ్‌ డ్రైన్లు, వాటర్‌ ట్యాంకుల నిర్మాణం, కరెంట్‌ పోల్స్‌ వంటి మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉచితంగా ఎలక్ట్రిక్‌ మీటర్లు కూడా బిగించాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ సబ్‌ స్టేషన్లతో పాటు అంగన్‌వాడీ సెంటర్లు ఏర్పాటు చేశాం.

ప్రైవేట్‌ లేఅవుట్లకు దీటుగా అందంగా తీర్చిదిద్దాం. ఇంటి పట్టాను కూడా మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్‌ చేసి వారి గౌరవాన్ని మరింత పెంచాం. పేదలకు మంచి చేయాలని ఇంత గొప్పగా ఆలోచిస్తే చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూశారు. అమరావతి రాజధానిలో పట్టాలు పంపిణీ చేస్తే సోషల్‌ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని కోర్టుకెళ్లిన దిక్కుమాలిన ఆలోచన చేసిన ఘనుడు చంద్రబాబు అని జక్కంపూడి రాజా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement