సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డు నిర్వాకంతో విద్యార్ధుల ఆత్మహత్యల పరంపరపై బీజేపీ భగ్గుమంది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇక లక్ష్మణ్ దీక్షకు హాజరైన సీనియర్ నేతలు రాం మాధవ్, బండారు దత్తాత్రేయ, డీకే అరుణ, మురళధర్ రావులు ఆయనకు సంఘీభావం తెలిపారు.
తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతపెద్ద తప్పిదాలు ఎన్నడూ చూడలేదని, పిల్లల హక్కులను కాలరాసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని దీక్షకు ఉపక్రమించిన లక్ష్మణ్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ దేవుడెరుగు..బలిదానాల తెలంగాణగా మారుస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తల్లితండ్రులు విశ్వాసం కోల్పోకండని ఆయన కోరారు.
విద్యార్ధులు ఒత్తిళ్లకు లోనుకావద్దు : రాంమాధవ్
ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు దురదృష్టకరం. చరిత్రలో ఇదొక మచ్చగా మిగిలిపోతుంది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకూడదు. ప్రభుత్వం పిల్లలకు ఆత్మవిశ్వాసం కల్పించకపోగా అహంభావంతో వ్యవహరిస్తోంది. ఇది రాజకీయ సమస్య కాదు . పిల్లలకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం కొనసాగుతుంది.
ఇది పెను సంక్షోభం : మురళీధర్ రావు
విద్యారంగంలో ఇంత పెద్ద సంక్షోభం దేశంలో ఏ రాష్ట్రంలో రాలేదు. ఇంటర్ బోర్డ్ అవకతవకల కారణంగా ఇప్పటివరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి. ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికే ఇది పరీక్షగా మారుతుంది.
ప్రగతి భవన్ ముట్టడిస్తాం : దత్తాత్రేయ
ఇంటర్ బోర్డు అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలి. ఇంటర్ విద్యార్ధుల ఆవేదనను అర్ధం చేసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం
న్యాయవిచారణ చేపట్టాలి : జితేందర్ రెడ్డి
రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా సాగుతోంది. ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మూడున్నర లక్షల ఇంటర్ విద్యార్థులకు అన్యాయం జరిగింది. గ్లోబరీనా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇంటర్ బోర్డ్ అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయించాలి. ప్రభుత్వం విద్యారంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది
సీబీఐ విచారణ జరిపించాలి : కన్నా
సమస్యల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే తీరుగా ఉన్నారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లతో తీరికలేకుండా బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌తో ప్రభుత్వం ఆడుకుంటోంది. ఈ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇంటర్ బోర్డు నిర్వాకంపై సీబీఐ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ చేత విచారణ జరపాలి
Comments
Please login to add a commentAdd a comment