Inter board
-
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు(AP Inter Results) శనివారం విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం, సెకండ్ ఇయర్లో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష రాసిన విద్యార్థులు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.క్లిక్ 👉🏼 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్ క్లిక్ 👉🏼 సెకండ్ ఇయర్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్‌క్లిక్ 👉🏼 ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్‌క్లిక్ 👉🏼 సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ AP Inter Results 2025.. ఎలా చెక్ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్ చేయండి.➤పైన కనిపిస్తున్న లింక్‌లపై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.➤ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్ప్లే అవుతాయి.➤ భవిష్యత్ అవసరాల కోసం డౌన్లోడ్/ప్రింట్ అవుట్ తీసుకోండి.ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో చిత్తూరు లాస్ట్‌ఇదిలా ఉంటే.. ఇంటర్లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఫస్ట్ , సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఫస్ట్ ప్లేస్‌లో కృష్ణా జిల్లా నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. ఇక.. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో లాస్ట్ ప్లేస్‌లో సీఎం సొంతజిల్లా చిత్తూరు నిలవడం గమనార్హం. సెకండ్ ఇయర్ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. -
తొలి రోజు ఇంటర్ పరీక్ష ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: చిన్నచిన్న సమస్యలు ఎదురైనప్పటికీ ఇంటర్మీడియట్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఫస్టియర్ ద్వితీయ భాష పరీక్షకు 5,14,184 మంది హాజరుకావాల్సి ఉండగా, 4,96,899 మంది హాజరయ్యారు. మొత్తంగా 17,010 (3.41 శాతం) మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 244 పరీక్ష కేంద్రాల్లో 87,523 మంది ఫస్టియర్ పరీక్ష రాశారు. వరంగల్, హన్మకొండలో రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. పరీక్షల తీరును అధికారులు ప్రతిక్షణం పరిశీలించినట్టు ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి జయప్రదాబాయ్ వెల్లడించారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య హైదరాబాద్ నారాయణగూడలోని రత్నా, జాహ్నవి, శ్రీచైతన్య కాలేజీలకు వెళ్లి పరీక్షల తీరును పరిశీలించారు. ఇతర అధికారులు కూడా నగరంలోని పలు కాలేజీలను పరిశీలించారు. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలోని 33 స్క్రీన్లను ప్రత్యేక సిబ్బంది పరీక్షలు పూర్తయ్యే వరకూ గమనించారు. పరీక్షకు సకాలంలో రావాలని ఇంటర్ బోర్డ్ పదేపదే సూచించినా కొన్నిచోట్ల విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 162 మంది 9 గంటల తర్వాత పరీక్షకు హాజరయ్యారు. అయితే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో వారిని పరీక్షకు అనుమతించారు. ఖమ్మంలోని కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల లింక్ ఆలస్యమవడంతో ప్రశ్నపత్రాల బండిల్ తెరవడం ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు పావుగంట నష్టపోవాల్సి వచ్చింది. చాలాచోట్ల కమాండ్ కంట్రోల్ రూంనుంచి సకాలంలో సీసీ కెమెరాలు లింక్ అవ్వలేదన్న ఫిర్యాదులు అధికారులకు వచ్చాయి. మారుమూల ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. వరంగల్, ములుగు, భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడంతో ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని విద్యార్థులు తెలిపారు. తాగునీటి కోసం ఏర్పాట్లు చేసినా, ఆఖరి అరగంటలో 26 పరీక్ష కేంద్రాల్లో తాగునీరు అందక విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంటర్ ఫస్టియర్ చదువుతు న్న నిర్మల్‌లోని బుధవార్‌పేట్ కాలనీకి చెందిన జుబేర్ (17) కొన్నేళ్లుగా నరాలకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అయిన ప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలకు హాజరు కావాలనే లక్ష్యంతో బుధవారం కుటుంబ సభ్యుల సహాయంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రానికి హాజరయ్యాడు. స్క్రైబ్(సహాయకుడి) సహాయంతో పరీక్ష రాశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని.. తండ్రి మృతి చెందినా పరీక్ష రాసిన కుమార్తె వర్గల్ (గజ్వేల్): తండ్రి మృతి చెందిన బాధలోనూ కుమార్తె ఇంటర్ పరీక్ష రాసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వర్గల్‌కు చెందిన పసుల లింగం (50)కు భార్య యాద మ్మ, సాయికుమార్, తేజశ్రీ సంతానం. మంగళవారం రాత్రి కారులో లింగం తూప్రాన్ వెళ్లి తిరిగొస్తుండగా నాచా రం సమీపంలో వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లింగం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కాగా, రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందడం.. బుధవారం రోజే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో.. పుట్టెడు దుఃఖంతోనూ తేజశ్రీ పరీక్షకు హాజరైంది. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,535 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్ పరీక్షలు మార్చి 15వ తేదీన ముగుస్తాయి. మైనర్, ఒకేషనల్ పరీక్షలు 20వ తేదీ వరకు ఉంటాయి. ఈ నెల ఐదో తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు 20వ తేదీతో ముగుస్తాయి. ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు. ఈ నెల 20 నుంచి హాల్‌టికెట్ల పంపిణీకి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు గత ఏడాది అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అమలు చేస్తున్నారు. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ప్రశ్నపత్రాల ట్యాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ విధానం పాటిస్తారు. ఈ విధానంలో ప్రశ్నపత్రం బయటకు వస్తే.. అది ఎక్కడ నుంచి వచ్చింది అనేది సెంటర్‌తో సహా సమస్త వివరాలు తెలిసిపోతాయి. ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేయనుంది. -
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు.. కేంద్రాల్లోకి షూస్, సాక్స్‌లకు నో ఎంట్రీ
గాంధీ నగర్ : త్వరలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ పరీక్షల నిర్వహణలో భాగంగా సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు షూస్, సాక్స్‌లు ధరించొద్దని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు ఎక్కడంటే?గుజరాత్లో ఫిబ్రవరి 27 నుంచి పదోతరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు గుజరాత్ సెకండరీ,హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ పలు సూచనలు ఇచ్చింది.పరీక్షల్లో జరిగే కాపీయింగ్‌ను అరికట్టేందుకే గుజరాత్ ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు షూస్,సాక్సులు ధరించకూడదని సూచించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు మొబైల్, ఎలక్ట్రానిక్ వాచ్ లేదా ఎలాంటి గాడ్జెట్లు ధరించకూడదని ఆదేశించింది. ఇప్పటికే 2018 నుండి బీహార్ బోర్డు ఈ తరహాలో పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే,ప్రతికూల వాతావరణం కారణంగా కొనసాగుతున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు, త్వరలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. బీహార్ బాటలో ఉత్తరప్రదేశ్ బోర్డు సైతం పరీక్షల సమయంలో కొన్ని కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు మాత్రమే షూస్,సాక్స్‌లు లేకుండా రావాలని తెలిపింది. తాజాగా,గుజరాత్ సైతం పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టే దిశగా చర్యలు తీసుకుంది. కాగా,ఈ సంవత్సరం గుజరాత్లో 10వ తరగతి, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 14.30 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. -
ఇంటర్ విద్యలో సంస్కరణలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ విద్యలో జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా సంస్కరణలను అమలు చేయనున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యలో సీబీఎస్ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో సైతం సీబీఎస్ఈ విధానంలోకి మారింది. 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశ పెట్టనున్నట్టు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.జాతీయ విద్యా విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు బోర్డు పరీక్షలను రద్దు చేసి, సాధారణ వార్షిక పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తల సూచనలు, సలహాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బోర్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లో అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. ఇంటర్ విద్యలో తీసుకురానున్న విద్యా సంస్కరణలపై బుధవారం తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చే సంస్కరణల ఫలితాలు 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశమని, అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల సూచనలు కోరుతున్నట్టు చెప్పారు. ప్రతిపాదిత సంస్కరణలను www.bieap.gov.in వెబ్సైట్లో ఉంచామని.. సూచనలు, అభ్యంతరాలను జనవరి 26వ తేదీలోగా biereforms@gmail.com మెయిల్ చేయాలన్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియేట్ సిలబస్ కొన్ని సంవత్సరాలుగా మార్చలేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తేనున్నట్టు కృతికా శుక్లా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 15కు పైగా రాష్ట్రాల్లో ఇంటర్ విద్యలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాయన్నారు. విద్యా రంగంలో అనుభవం గల నిపుణులతో ప్రతి సబ్జెక్టుకు ఒక నిపుణుల కమిటీ చొప్పున 14 కమిటీలను వేశామన్నారు. వారి సూచనలతో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్–2023కు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యలో ఈ సంస్కరణలు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రవేశ పెడుతున్నామన్నారు. ఆ పై సంవత్సరం ఇంటర్ రెండో ఏడాది సిలబస్ అందుబాటులోకి వస్తుందన్నారు. పాఠశాల విద్యా శాఖ 2024–25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టిందని, ఈ విద్యార్థులకు అనుగుణంగా 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ, 2026–27 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోను ఎన్సీఈఆర్టీ సిలబస్ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, జేఈఈ సిలబస్‌కు అనుగుణంగా సైన్స్ సిలబస్ ఉంటుందని ఆమె వెల్లడించారు.ఇంటర్ తొలి ఏడాది పరీక్షల రద్దు ప్రతిపాదనదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల బోర్డులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించడం లేదని శుక్లా తెలిపారు. అత్యధిక రాష్ట్రాల్లో ఇంటర్ బోర్డులు, యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారన్నారు. ఈ కమ్రంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలు, మూల్యాంకనంలోనూ మార్పులు తీసుకొస్తున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరానికి బోర్డు పరీక్షలు రద్దుచేసి, కళాశాలల అంతర్గత పరీక్షలుగా మార్చనున్నట్టు చెప్పారు. బోర్డు నిర్ణయించిన సిలబస్, బ్లూ ప్రింట్ ఆధారంగా కాలేజీల్లో అంతర్గతంగా నిర్వహిస్తారన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తుందన్నారు. ఈ ప్రతిపాదనలపై సలహాలను ఈనెల 26వ తేదీలోగా ఆన్లైన్లో ఇంటర్ బోర్డుకు తెలియచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కొత్త ముసాయిదా ప్రకారం ఇంటర్ పరీక్షల విధానంలో కూడా మార్పులు చేస్తామని, ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్ మార్కులతో పాటు ప్రాక్టికల్స్ తప్పనిసరి చేస్తామన్నారు. పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ఒక్క మార్కు ప్రశ్నలను ప్రతిపాదించారని, 8 మార్కుల వ్యాసరూప ప్రశ్నల స్థానంలో 5 లేదా 6 మార్కుల ప్రశ్నలు ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, మొదటి సంవత్సరం పరీక్షల రద్దు అనేది ప్రతిపాదనలు మాత్రమే అని, ఇంకా రద్దు చేయలేదన్నారు.అన్ని గ్రూపుల్లోను థియరీ, ప్రాక్టికల్ మార్కులు సీబీఎస్ఈ విధానం ప్రకారం ఇంటర్మీడియట్ అన్ని గ్రూపులకు థియరీ, ప్రాక్టికల్ మార్కులు తప్పనిసరి చేశారు. ఆర్ట్స్ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టులకు 500 మార్కులు ఇచ్చారు. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు, ఇందులో 80 మార్కులు థియరీకి, 20 మార్కులు ప్రాక్టికల్స్/ ప్రాజెక్టు వర్క్‌కు కేటాయిస్తారు. ఎంపీసీ గ్రూప్‌లో 380 మార్కులు థియరీకి, 120 మార్కులు ప్రాక్టికల్స్.. మొత్తం 500 మార్కులు ఇస్తారు. బైపీసీ గ్రూప్‌లో 370 మార్కులు థియరీకి, 130 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఇస్తారు. అన్ని గ్రూపులకు ఐచ్చికంగా ఎంచుకునే ఆరో సబ్జెక్టుకు మార్కులు ఎన్ని అనేది ఇంకా నిర్ణయించలేదు.ప్రతి గ్రూప్‌లో ఐదు సబ్జెక్టుల విధానంప్రస్తుతం ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్‌లు, నాలుగు మెయిన్‌సబ్జెక్టులు (మొత్తం ఆరు), ఆర్ట్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్‌లు, మూడు మెయిన్ సబ్జెక్టుల (మొత్తం ఐదు) విధానం అమల్లో ఉంది. మార్కుల కేటాయింపు కూడా భిన్నంగా ఉంది. దీంతో సైన్స్ గ్రూపుల విధానంపై దేశంలోని కొన్ని యూనివర్సిటీలు అభ్యంతరం పెడుతుండడంతో జేఈఈ, నీట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఐదు సబ్జెక్టులు ప్రధానంగా.. ఆరో సబ్జెక్టు ఐచ్చికంగా ఎంపిక చేసుకునే విధానం రానుంది. ఈ క్రమంలో అన్ని గ్రూపులకు ఒక లాంగ్వేజ్, నాలుగు మెయిన్ సబ్జెక్టులు (మొత్తం ఐదు), 500 మార్కుల విధానం ప్రతిపాదించారు. ఇందులో ఒక సబ్జెక్టు ఇంగ్లిష్ లాంగ్వేజ్ తప్పనిసరి. రెండో సబ్జెక్టు ‘ఎలక్టివ్’. ఇందులో ఏదైనా లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఒకటి ఎంచుకోవచ్చు. సైన్స్ లేదా ఆర్ట్స్ గ్రూపుల్లో మూడు (3, 4, 5 సబ్జెక్టులు) ప్రధాన సబ్జెక్టులు ఎంచుకోవాలి. ఎంపీసీలో మ్యాథ్స్–ఏ, బీ పేపర్ల స్థానంలో ఒకే పేపర్ ఉంటుంది. బైపీసీలో బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి ‘జువాలజీ’గా పరిగణిస్తారు. ఆర్ట్స్‌లో కోర్సులైన సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రస్తుతం ఉన్న 26 కాంబినేషన్లు ఉంటాయి. విద్యార్థులు నచ్చిన కాంబినేషన్‌ను ఎంచుకోవచ్చు. ఆరో సబ్జెక్టుగా (ఆప్షనల్ మాత్రమే.. తప్పనిసరి కాదు) ఏదైనా లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. విద్యార్థులు మొదటి ఐదు సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టు ఫెయిలై.. ఆరో సబ్జెక్టు పాసైతే అప్పుడు ఆరో సబ్జెక్టును మెయిన్ సబ్జెక్టుగా పరిగణిస్తారు. ఆరో సబ్జెక్టును పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంగ్లిష్ తప్పనిసరిగా పాసవ్వాలి. -
ఇంటర్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. నిఘా నీడలో ప్రయోగ పరీక్షలు జరగాలని బోర్డు కార్యదర్శి అన్ని జిల్లాల ఇంటర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష జరిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ఇంటర్ బోర్డ్ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ప్రయోగాలు చేయకున్నా మార్కులు! ఏటా ప్రాక్టికల్ పరీక్షలపై అనేక ఫిర్యాదులొస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో తూతూ మంత్రంగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ప్రయోగాలు చేయకపోయినా మార్కులు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.పర్యవేక్షణకు ఇన్విజిలేటర్లుగా వెళ్ళే ప్రభుత్వ లెక్చరర్లను కాలేజీలు ముందే ఆకట్టుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ కాలేజీలకన్నా, ప్రైవేటు కాలేజీ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయన్న విమర్శలున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు కొన్నేళ్ళుగా ఇంటర్ బోర్డ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మార్కులపై దృష్టి రాష్ట్రంలో ఈ ఏడాది 3,80,960 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నారు. వారిలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉన్నాయి. అలాగే అన్ని గ్రూపుల విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇందులో 1,20,515 మంది ఎంపీసీ విద్యార్థులు, 75,040 మంది బైపీసీ విద్యార్థులు ఉన్నారు. ఎంపీసీ విద్యార్థులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ప్రయోగ పరీక్షలు ఉండగా బైపీసీ విద్యార్థులకు ఈ రెండింటితోపాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ ఉన్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ప్రయోగ పరీక్షల్లో 75 శాతం మార్కులు వస్తుండగా కార్పొరేట్ కాలేజీల్లో ఏకంగా 90 శాతంపైనే మార్కులు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ కాలేజీల్లో ప్రాక్టికల్స్ చేయిస్తుండగా చాలా వరకు ప్రైవేటు కాలేజీల్లో కనీసం లేబొరేటరీలు, రసాయనాలు కూడా ఉండటం లేదని పలువురు లెక్చరర్లు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలేజీలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఆరోపణలున్న కాలేజీల సీసీ ఫుటేజ్‌ను పరీశీలించే ఆలోచన ఉందని ఓ అధికారి తెలిపారు. పరీక్షలపై రోజూ నివేదిక ఇంటర్ పరీక్షల తీరుతెన్నులపై ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలని అధికారులను ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఏ కాలేజీలో ఎందరు విద్యార్థులు ఏయే ప్రాక్టికల్స్ చేశారనే అంశాలను అందులో పొందుపర్చాలని సూచించింది. గతంలో ఒక కాలేజీకి పంపిన లెక్చరర్‌ను ఈసారి వేరే కాలేజీకి పంపాలని ఆదేశించింది. -
ఇంటర్ ప్రశ్నాపత్రాలకు ఆన్లైన్ రక్షణ
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ అర్ధ వార్షిక పరీక్షల నిర్వహణకు బోర్డు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్ష పేపర్లు ఎక్కడా బయటకు రాకుండా గతేడాది అనుసరించిన విధానాలనే అమలు చేశారు. పరీక్షకు గంట ముందు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి సంబంధిత జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ లాగిన్‌కు ప్రశ్నాపత్రాలను విడుదల చేస్తున్నారు. వెంటనే ప్రిన్సిపల్ పాస్‌వర్డ్‌తో ఆన్లైన్లోని ప్రశ్నాపత్రాలను ప్రింట్ తీసి విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ పరీక్షలను ఇదే విధానంలో నిర్వహించగా, మంగళవారం నుంచి ప్రారంభమైన అర్ధ వార్షిక పరీక్షలకు కూడా ఇదే విధానం అమలు చేశారు. దీంతో ఎక్కడా లీక్ అనే సమస్యలు గానీ, ప్రశ్నాపత్రం బయటకు వెళ్లడం గానీ జరగదని బోర్డు అధికారులు చెబుతున్నారు. గత నాలుగేళ్లలో నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు ప్రశ్నాపత్రాలను ఆన్లైన్లోనే బోర్డు నుంచి గంట ముందు ప్రిన్సిపల్‌కు పంపిస్తే ప్రింట్ తీసి విద్యార్థులకు అందించేవారు. కాగా, విద్యార్థుల మార్కులను సైతం ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను ఈ ఏడాది నుంచి అమల్లోకి తెచ్చారు. గతంలో పబ్లిక్ పరీక్షలు మినహా, మిగిలిన పరీక్షల మార్కులను మాన్యువల్‌గా సంబంధిత కళాశాలలోనే నమోదు చేసేవారు, కానీ ఈసారి పరీక్షలు పూర్తయిన తర్వాత మార్కుల నమోదుకు విద్యార్థి వివరాలతో ప్రత్యేక ఆన్లైన్ ఫార్మేట్ అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంతో విద్యార్థి రాసిన అన్ని పరీక్షల వివరాలు, ప్రతిభా స్థాయి ఉన్నతాధికారులు కూడా పరిశీలించే అవకాశం కల్పించారు. -
సిలబస్ అయ్యేదెప్పుడు? శిక్షణ ఇచ్చేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: జేఈఈ పరీక్ష జనవరి 22వ తేదీ నుంచి జరుగుతుందంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీ సెట్) గతానికంటే నెల రోజుల ముందు ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాలేజీల్లో ఇప్పటికీ 80 శాతం సిలబస్ కూడా పూర్తి కాకపోవడంతో, సిలబస్ పూర్తయ్యేదెప్పుడు? జేఈఈ శిక్షణ పొందేదెప్పుడు? అనే టెన్షన్ మొదలైనట్లు ఇంటర్ బోర్డు వర్గాలే వెల్లడిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కాలేజీలకు సిబ్బందిని ఇవ్వకపోవడంతో ఇంటర్ సిలబస్ అరకొరగానే పూర్తయింది. దీంతో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ఎలా అనే ఆందోళన విద్యార్థుల్లో కన్పిస్తోంది. ఇంటర్ బోర్డులోనూ ఆందోళన..: ఇంటర్ బోర్డు తాజాగా సేకరించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల్లో ఎక్కువ మందిలో టెన్షన్ కన్పిస్తోంది. దీంతో దీన్ని దూరం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు బోర్డు సూచించింది. మరోవైపు విద్యార్థుల్లో ఆందోళనకు సంబంధించి వైద్య, విద్యాశాఖ గత ఏడాది ఇచ్చిన నివేదిక బోర్డు అధికారులకు ఆందోళన కల్గిస్తోంది. పరీక్ష ఫెయిల్ అవుతున్న వారిలో 48 శాతం టెన్షన్ కారణంగానే విఫలమవుతున్నట్టు తేల్చారు. వీరిలో 36 శాతం తీవ్రమైన టెన్షన్‌కు లోనవుతున్నారు. 23 శాతం విద్యార్థులు పరీక్షల తేదీ ప్రకటించినప్పటి నుంచే టెన్షన్ పడుతూ, పరీక్ష అనుకున్న విధంగా రాయలేకపోతున్నారని తేలింది. మొదటి పరీక్ష ఏమాత్రం కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి ఏటా సగటున 4 లక్షల మందికి పైగా ఫస్టియర్ పరీక్షలు రాస్తున్నారు. రెండో ఏడాది పరీక్షలు 3.80 లక్షల మందికి పైగా రాస్తుండగా సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. మూడంచెల సన్నద్ధతవిద్యార్థుల్లో టెన్షన్‌ను దూరం చేసే కార్యాచరణ చేపట్టడంతో పాటు, జేఈఈ, ఈఏపీ సెట్‌కు సన్నద్ధం చేయడానికి ఇదే మంచి తరుణమని ఇంటర్ బోర్డు అధికారులు అంటున్నారు. ఇందుకు ప్రణాళికబద్ధమైన కార్యాచరణ అవసరమని సూచిస్తున్నారు. మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలని భావిస్తున్న అధికారులు, ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై అధ్యాపకులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. కొన్ని జిల్లాలపై ప్రత్యేక ఫోకస్సిలబస్ పూర్తి కాకపోవడం విద్యార్థుల్లో ఆందోళనకు ప్రధాన కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని జిల్లాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు సాధిస్తున్న జిల్లాల్లో జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ ఉండగా.. సెకండియర్‌లో మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయా జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. ప్రైవేటులో ఇప్పటికే రివిజన్ షురూరాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ఏటా ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థుల్లో సుమారు మూడు వంతులు ప్రైవేటు కాలేజీల విద్యార్థులే కావడం గమనార్హం. అంటే మొత్తం 7.8 లక్షలకు పైగా విద్యార్థుల్లో సుమారు 6 లక్షల మంది ప్రైవేటు విద్యార్థులే ఉంటున్నారు. కాగా ఈ కాలేజీల్లో ఇప్పటికే ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తయింది. రివిజన్ కూడా చేపట్టారు. దీంతో జేఈఈ ప్రిపరేషన్ దిశగా యాజమాన్యాలు సన్నాహాలు మొదలు పెట్టాయి. బోధనా సిబ్బంది, ప్రత్యేక తరగతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పట్నుంచే తర్ఫీదు ఇవ్వాలివిద్యార్థులకు ఇప్పట్నుంచే పోటీ పరీక్షల దిశగా శిక్షణ ఇవ్వాలి. చాలా కాలేజీల్లో ప్రత్యేక శిక్షణ మొదలైంది. అయితే కొత్త కాలేజీలకు తగిన సిబ్బందిని కేటాయించడం, గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడంలో జరిగిన ఆలస్యంతో ప్రైవేటు కాలేజీలతో సమానంగా ప్రభుత్వ కాలేజీలు పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బోర్డు ప్రత్యేక శిక్షణా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్ (ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
ఇంటర్ బోర్డు చొరవతో దివ్యాంగ విద్యార్థులకు మేలు
సాక్షి, అమరావతి: సాంకేతిక కారణాలతో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు వచ్చినా చేరలేకపోయిన దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర ఇంటరీ్మడియట్ బోర్డు సకాలంతో స్పందించడంతో వారికి మేలు జరిగింది. రాష్ట్రంలో ఇంటర్ చదివే దివ్యాంగ విద్యార్థులు పరీక్షల్లో ఒక సబ్జెక్టు నుంచి మినహాయింపు ఉంది. దీంతో విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం భాషల్లో (లాంగ్వేజ్ పేపర్) రాయడం లేదు. దీంతో విద్యార్థులు నాలుగు సబ్జెక్టులకే పరీక్షలు రాస్తున్నారు. అయితే, ఈ ఏడాది మద్రాస్ ఐఐటీ ప్రవేశాలకు ఐదు సబ్జెక్టుల విధానం తప్పనిసరి చేసింది. దీంతో ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్లోను ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు మద్రాస్ ఐఐటీతో పాటు పలు ఎన్ఐటీల్లోను సీట్లు సాధించారు. కానీ కౌన్సెలింగ్‌లో మార్కుల లిస్టును పరిశీలించిన అధికారులు ‘నాలుగు’ సబ్జెక్టులకే మార్కులుండటంతో వారి ప్రవేశాలను తిరస్కరించే పరిస్థితి తలెత్తింది. దీంతో గత నెలలో పలువురు దివ్యాంగ విద్యార్థులు తాడేపల్లిలోని ఇంటర్ విద్యా మండలికి చేరుకుని న్యాయం చేయాలని అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన ఇంటర్ బోర్డు అధికారులు మద్రాస్ ఐఐటీ అధికారులను సంప్రదించి, ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సబ్జెక్టు వెసులుబాటును వివరించారు. అయితే, ప్రభుత్వం నుంచి జీవో ఇస్తే చేర్చుకుంటామని చెప్పడంతో ఇంటర్ బోర్డు అధికారులు మార్గాలను అన్వేíషించారు. 1992లో పదో తరగతి దివ్యాంగ విద్యార్థుల కోసం జారీ చేసిన జీవో నం.1161 ప్రకారం ఇంటర్ దివ్యాంగ విద్యార్థులకు మేలు చేయవచ్చని ప్రభుత్వానికి ఫైల్ పంపారు. నాలుగు పేపర్లలో వచ్చిన మార్కుల సరాసరి ఆధారంగా పరీక్ష రాయని సబ్జెక్టుకు మార్కులు కేటాయించవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ జీవో నం.255 ఇవ్వడంతో దాదాపు 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందే అవకాశం దక్కింది. -
25న ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈనెల 25న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఫలితాల విడుదల తర్వాత దోస్త్ ద్వారా డిగ్రీలో ప్రవేశానికి మరో దఫా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలకు రెండు సంవత్సరాలకు కలిపి 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, ఫస్టియర్ ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన వారు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 11 లక్షల సమాధాన పత్రాలను కొన్ని రోజులుగా మూల్యాంకనం చేశా రు. గత పరీక్షల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో మరి న్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. సాంకేతిక లోపాలను, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. డీకోడింగ్, ఆన్లైన్లో మార్కులు పొందుపర్చే కార్యక్రమం పూర్తయింది. అయితే, ఉన్నతాధికారి ఒకరికి మంగళవారం సెంటిమెంట్ ఉండటంతో 25వ తేదీన ఒప్పుకుంటారా అనే సందేహం అధికారుల్లో ఉంది. గత పరీక్ష ఫలితాల విషయంలోనూ ఉన్నతాధికారి మంగళవారం సెంటిమెంట్ ముందుకు తేవడంతో అంతా సిద్ధం చేసినా ఫలితాల వెల్లడిని వాయిదా వేశారు. ఈసారి కూడా అలాంటి అడ్డంకి ఉంటే 26 లేదా 27న విడుదల చేసే వీలుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. -
AP Inter Results 2024: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎన్ని గంటలకంటే?
సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. రికార్డుస్ధాయిలో 22 రోజులలోనే ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, పరీక్షలకు 10,53,435 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, ఇంటర్ సెకండియర్ 5,35,865 మంది విద్యార్దులు హాజరయ్యారు. సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి ఇంటర్ బోర్డు అడ్డుకట్ట వేసింది. ప్రత్యేక బార్ కోడ్‌తో పాటు ప్రశ్నాపత్రంలోని ప్రతీ పేజీపై సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించింది. ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల 2024 ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు. -
‘స్పాట్’ కేంద్రాల్లోకి మొబైల్ నో
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్ వాల్యూయేషన్) ఇంటర్ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. తాజాగా స్పాట్ కేంద్రాల్లోకి అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తినట్టు ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను డిపాజిట్ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో పాటే హాలులో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమాధాన పత్రాలు తీసుకున్న దగ్గర్నుంచి, తిరిగి సంబంధిత అధికారికి ఇచ్చేవరకు హాలులోనే ఉండాలని, హాలు దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్లో నమోదు చేయాలని బోర్డు సూచించింది. విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కార్పొరేట్ కాలేజీల ప్రలోభాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు అధికారులు తెలిపారు. అధ్యాపకులు చేసే మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మూల్యాంకనంలో 20 వేల మంది ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా.. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్ కోసం ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో అధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరుగుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. పది రకాల పరీక్షల తర్వాతే ఆన్‌లైన్‌లోకి.. సమాధాన పత్రాలు మూల్యాకనం చేసిన అనంతరం పది రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కులను ఆన్లైన్లో ఫీడ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
విజయవంతంగా ఇంటర్ పరీక్షలు పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమర్థంగా నిర్వహించారు. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్‌ప్రాక్టీస్ కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇంత తక్కువ నమోదవ్వడం ఇదే తొలిసారి. 2023–24కు రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617 మంది, రెండో సంవత్సరం 5,35,056 మంది.. మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షలకు 9,99,698 మంది హాజరు కాగా, 52,900 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 75 మందిపై మాల్‌ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశారు. కాగా ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రెండో వారంలో ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నారు. ఆన్లైన్ విధానంతో తొలగిపోయిన ఇబ్బందులు.. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియెట్ కమిషనరేట్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఫీజు చెల్లింపు, నామినల్ రోల్స్ నమోదు నుంచి పరీక్ష కేంద్రాల వరకు అన్ని దశల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. విద్యార్థులకు తలెత్తే సమస్యల పరిష్కారానికి ఆయా కళాశాలల్లోనే చర్యలు తీసుకుంది. గతంలో పరీక్ష ఫీజును చలాన్ రూపంలో చెల్లిస్తే, వాటిని పరిశీలించి మదింపు చేసేందుకు బోర్డుకు చాలా సమయం పట్టేది. ఈ ఏడాది ఆన్లైన్ విధానంతో గత ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. అలాగే ప్రాక్టికల్స్ పరీక్షలు పూర్తయిన వెంటనే అక్కడికక్కడే మార్కులను బోర్డు వెబ్సైట్లో నమోదు చేశారు. మార్కుల విషయంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్లైన్లో నమోదు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. ప్రధాన పరీక్షలు జరిగిన 1,559 సెంటర్లలో ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22 వేల కెమెరాలను వినియోగించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బోర్డు కార్యాలయం నుంచి పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు జిల్లాకో అధికారిని కమిషనర్ సౌరబ్ గౌర్ నియమించారు. కేంద్రాల నుంచి పరీక్ష పత్రాలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రశ్నపత్రాలకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్’ కోడ్‌ను జోడించారు. -
పక్కా నిఘా..పటిష్ట బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరం పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 5,07,754 మంది విద్యార్థు లు పరీక్ష కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 4,88,113 మంది హాజరయ్యారు. 19,641 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. మూడుచోట్ల మాల్ ప్రాక్టీసింగ్ జరిగినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. కరీంనగర్, నిజామాబాద్, జనగాం జిల్లాల్లో ఈ మేరకు కేసులు నమోదైనట్టు తెలిపింది. తొలి రోజు ద్వితీయ భాష పేపర్–1 పరీక్ష నిర్వహించారు. మూడు సెట్ల ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపి అందులో ‘ఎ’సెట్‌ను ఎంపిక చేశారు. ప్రైవేటుపై ప్రత్యేక నిఘా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 1,521 పరీక్షా కేంద్రాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశా రు. 880 ప్రైవేటు కాలేజీల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. కార్పొరేట్ కాలేజీల జోక్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా, అసాంఘిక శక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు ఈసారి పోలీసు బందోబస్తు పెంచారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు సుడిగాలి తనిఖీలు చేపట్టాయి. 200 సిట్టింగ్ స్వా్కడ్స్ సమస్యాత్మక కేంద్రాల్లో సజావుగా పరీక్షలు జరిగేందుకు తోడ్పడ్డాయి. టెన్షన్... టెన్షన్... తొలి రోజు పరీక్ష కావడంతో పలు ప్రాంతాల్లో విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం కన్పించింది. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్షకు గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడం కన్పించింది. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనల్లో స్వల్పంగా సడలింపు ఇచ్చినట్టు జిల్లాల అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, అవి సకాలంలో అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలు విన్పించాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు సొంత రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల హాల్‌టికెట్లను బుధవారం నుంచి జారీ చేయనుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పరీక్షలు జరిగే గదుల్లో అధికారులు సీసీ కెమెరాలను అమర్చారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్ష పేపర్లకు క్యూఆర్ కోడ్‌ను జోడించారు. పేపర్‌ను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రం ప్రాంగణంలోకి ఫోన్లను అనుమతించరు. పేపర్లను భద్రపరిచే పోలీస్ స్టేషన్లో కూడా ఈసారి ఇంటర్ బోర్డు అందించే ప్రత్యేకమైన బేసిక్ ఫోన్‌ను మాత్రమే వినియోగించనున్నారు. ఇది కేవలం బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే మెసేజ్‌లను చూసేందుకే ఉపయోగపడుతుంది. తిరిగి సమాచారం ఇచ్చేందుకు, ఫోన్ చేసేందుకు సాధ్యపడదు. పైగా ఈ ఫోన్ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు ఈసారి ఇంటర్ బోర్డు పబ్లిక్ పరీక్షలకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్‌లైన్‌లోకి మార్చింది. దీంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్లైన్లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ పరీక్షలు మంగళవారం ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలోని రెండు సెంటర్లలో హాల్‌టికెట్ల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండేళ్లు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం 10,52,221 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. -
పేపర్ లీక్‌లు ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28 నుంచి ఇంటర్మిడియెట్ థియరీ పరీక్షలు మొదలుకానున్నాయి. 9 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వచ్చే నెల 18న ప్రారంభంకానున్న పదవ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరుకానున్నారు. ఈ రెండు పరీక్షలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షల నిర్వహణపై సమీక్షలు చేశారు. ముఖ్యమంత్రి కూడా పరీక్షల తీరుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గతం కన్నా భిన్నంగా పరీక్షల నిర్వహణ ఉండాలని చెప్పారు. ఎక్కడా పేపర్ లీక్‌లు ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారుల్లో టెన్షన్ కన్పిస్తోంది. ప్రతీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలుకొని, వాటిని చేరవేయడం, పరీక్షల తర్వాత సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించడం, మూల్యాంకన నిర్వహించడం, ఫలితాల క్రోడీకరణ, వెల్లడి వరకూ సిబ్బందిని మరింత అప్రమత్తం చేశారు. గతంలో ఫిర్యాదులు లేని వారినే విధుల్లోకి తీసుకునేందుకు ప్రాధాన్యమి చ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ భయం తొలగేనా? కొన్నేళ్లుగా ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణ అధికారులకు సవాల్‌గా మారుతోంది. హాల్‌టికెట్లు మొదలుకొని, ఫలితాల వరకూ ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంది. ప్రశ్నపత్రాల్లో తప్పులు సర్వసాధారణం అవుతున్నాయి. మూల్యాంకన, ఫలితాల వెల్లడిలో జరిగిన కొన్ని పొరపాట్ల కారణంగా 2019లో ఇంటర్ బోర్డ్ వ్యవహారం వివాదాస్పదమైంది. ఆ సమయంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ఇంటర్ బోర్డ్ పెద్దగా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. ఆ తర్వాత కూడా ఎక్కడో ఒకచోట ప్రశ్నపత్రాల్లో తప్పులు రావడం సమస్యలు తె చ్చిపెట్టింది. ఈసారి ఇలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా బోర్డ్ ముందే అప్రమత్తమైంది. నిపుణులతో ప్రశ్నపత్రాలను రూపొందించారు. గతంలో ఎలాంటి వివాదాలు లేని వారినే ఎంపిక చేసుకున్నారు. అధికారులు ముందే ఈ వివరాలను తెప్పించుకుని మరీ పరిశీలించారు. టెన్త్ పరీక్షలు గత ఏడాది వివాదాలకు దారి తీశాయి. పేపర్ లీకేజీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. సమస్యాత్మక కేంద్రాల్లో ఈసారి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్టు, ప్రైవేటు స్కూళ్లతో సంబంధాలున్న ఉపాధ్యాయులను విధులకు దూరంగా ఉంచుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. హాల్‌టికెట్ల ఆలస్యంపై దృష్టి : టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల ఆలస్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించనుంది. ఫీజులు చెల్లించని విద్యార్థులపై ప్రైవేటు స్కూల్, కాలేజీలు పరీక్షల సమయంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి. డౌన్లోడ్ చేసుకునే హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపల్, స్కూల్ హెచ్ఎం సంతకాలు అవసరమన్న ఆందోళన కల్గిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగానే హాల్‌టికెట్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలోతప్పిదాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలుతీసుకోవాలి. పరీక్షల సమయంలో విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు వేధించకుండా చూడాలి. పేపర్ లీకేజి వంటి ఘటనలు జరగకుండా చూడాలి. –చింతకాయల ఝాన్సీ (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) ప్రైవేటుకు కొమ్ముకాయొద్దు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సహక రిస్తున్నట్టు గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. పరీక్షలు సజావుగా, ఎలాంటి ఆందోళనలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. –టి నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) -
అటెన్షన్ ఉంటే..టెన్షన్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్ : పరీక్షల ఫోబియాతోనే ఇంటర్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సగానికి తగ్గుతోంది. హైటెన్షన్‌కు గురయ్యే విద్యార్థులు 36 శాతం ఉంటుండగా, పరీక్షల షెడ్యూల్ వచ్చాక టెన్షన్‌కు లోనయ్యేవారు 23 శాతం మంది ఉంటున్నారు. దీనికి సంబంధించి వైద్య, విద్యాశాఖలు రెండేళ్ల అధ్యయనం చేశాయి. మొదటి పరీక్ష కాస్త కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం ఫస్టియర్ పరీక్షలు 4.09 లక్షల మంది రాస్తున్నారు. సెకండియర్ పరీక్షలు 3.82 లక్షల మంది వరకూ రాస్తున్నారు. వీరిలో సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. దీంతో పరీక్షలు రాసే ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల టెన్షన్ దూరం చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రిపరేషన్‌కు ఇదే అదును రెండు నెలల ముందు నుంచే పరీక్షలకు సన్నద్ధమైతే విద్యార్థుల్లో టెన్షన్ ఉండదని ఇంటర్ అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలనుకుంటున్నారు. ముందుగా విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తారు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వడానికి నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై లెక్చరర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులోనూ విద్యార్థి వెనుకబడి ఉన్న సబ్జెక్టులు, పాఠ్యాంశాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రిన్సిపల్స్‌కు ఇస్తారు. మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ఈ 60 రోజులూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో టెన్షన్ దూరం చేయడం తేలికని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పరీక్షల టైంటేబుల్‌ను బోర్డు విడుదల చేసింది. త్వరలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తీసుకునే చర్యలపైనా జిల్లా ఇంటర్ అధికారులు టైం టేబుల్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సిలబస్ సకాలంలో పూర్తికాకపోవడం కూడా విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్‌కు ఓ కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతుందని అధ్యయన నివేదికల సారాంశం. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకొని కొన్ని జిల్లాలపై ఇంటర్ అధికారులు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు కనబరుస్తున్న జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ వంటి జిల్లాలున్నాయి. సెకండియర్‌లో మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని ముఖ్యాంశాలు... ♦ ప్రతీ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు – 7 లక్షలకుపైగా ♦ ఫెయిల్ అవుతున్న వారు – 2.5 లక్షల మంది ♦ పరీక్షల ఫోబియా వెంటాడుతున్న విద్యార్థులు – 1.02 లక్షల మంది ♦ పరీక్ష షెడ్యూల్ ఇవ్వగానే భయపడే వారు – 28 వేల మంది ♦ సిలబస్‌పై టెన్షన్ పడుతున్న విద్యార్థులు – 51 వేల మంది మానసిక ధైర్యం నింపాలి ఈ 60 రోజులూ లెక్చ రర్లది కీలకపాత్ర. పరీక్షల భయం ఉన్న వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. వెనుకబడ్డ సబ్జెక్టులపై రివిజన్ చేయించడం ఒక భాగమైతే, వీలైనంత వరకూ పరీక్ష తేలికగా ఉంటుందనే భావన ఏర్పడేలా చూడాలి. దీనివల్ల ఎగ్జామ్ ఫోబియా తగ్గుతుంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లిదండ్రులదీ కీలకపాత్రే పరీక్షల భయం వెంటాడే విద్యార్థి సైకాలజీని బట్టి అధ్యాపకులు వ్యవహ రించాలి. వారిని ప్రణాళిక బద్ధంగా చదివించే విధా నం అనుసరించాలి. సాధ్యమైనంత వరకూ పరీక్ష వెంటాడుతోందన్న భావనకు దూరం చేయాలి. చదివే ప్రతీ అంశం గుర్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా జాగ్రత్త పడాలి. పరీక్షల పట్ల భయం అనిపిస్తే నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇప్పించాలి. – రావులపాటి సతీష్‌బాబు, మానసిక వైద్య నిపుణుడు స్టడీ అవర్స్ పెడుతున్నాం విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టేందుకు 60 రోజుల పాటు ప్రత్యేక కార్య క్రమాలు చేపడుతున్నాం. వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, స్పెషల్ క్లాసులు నిర్వహించమని ఆదేశాలిచ్చాం. టెన్షన్ పడే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వమని ప్రిన్పిపల్స్కు చెప్పాం. అవసరమైతే టెలీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. – జయప్రదాబాయ్,ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి -
ఇంటర్‌లోనే ఇలా ఎందుకు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తక్కువగా ఉంటుందనే విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. 2024లో జరిగబోయే పరీక్షల్లో దీనిని అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎక్కువగా ఏ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు? వారికి రివిజన్ చేయడం ఎలా? అనే అంశాలపై జిల్లాల వారీగా నివేదికలు కోరారు. రెసిడెన్షియల్, గురుకులాల్లో మంచి ఫలితాలు వస్తున్నా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కోవిడ్ తర్వాత 70 శాతం రిజల్ట్ కష్టంగా ఉందని గుర్తించారు. మెరుగైన ఫలితాలు సాధించే సిబ్బందిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. కారణాలేంటి? 2023లో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ 4,33,082 మంది విద్యార్థులు రాయగా, వీరిలో 2,72,280 మంది ఉత్తీర్ణులయ్యారు. 63 శాతం రిజల్ట్ వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో 4,19,267 మంది పరీక్ష రాస్తే, 2,65,584 (63 శాతం) పాసయ్యారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్ సెకండియర్‌లో కనీసం 50 శాతం కూడా పాసవ్వలేదు. జగిత్యాల (23శాతం), సూర్యాపేట (30శాతం), సిద్ధిపేట (34శాతం), నిర్మల్ (49శాతం) జిల్లాలు ఈ కోవలో ఉన్నాయి. పెద్దపల్లి, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌బాద్, కరీంనగర్, వనపర్తి, జనగాం, జిల్లాల్లో 48 శాతం లోపే ఫలితాలొచ్చాయి. నారాయణపేట (100శాతం) మినహా మరే ఇతర జిల్లాలోనూ 75 శాతం ఫలితాలు కనిపించలేదు. 68 శాతం ఫలితాలు ప్రైవేటు కాలేజీల్లో ఉంటుంటే, ప్రభుత్వ కాలేజీల్లో 32 శాతం మించడం లేదు. ఈ పరిస్థితికి గల కారణాలపై ఇంటర్ అధికారులు దృష్టి పెట్టారు. సకాలంలో సిలబస్ పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. రివిజన్ ఏమాత్రం జరగడం లేదని తెలుసుకున్నారు. జనవరి రెండోవారంలో సిలబస్ పూర్తి చేసి, మిగతా రోజుల్లో రివిజన్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. సీఈసీ...హెచ్‌ఈసీలోనే ఎక్కువ ► విద్యార్థులు ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోనే చేరుతున్నారు. సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో తక్కువగా చేరినా, వారిలోనూ చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ► గత ఏడాది సీఈసీలో 98 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే అందులో 37 వేల మంది (37 శాతం) మాత్రమే 2023లో ఉత్తీర్ణులయ్యారు. ► బైపీసీ గ్రూపులో లక్ష మంది పరీక్ష రాస్తే, 64 వేల మంది (64.14) పాసయ్యారు. ► హెచ్ఈసీలో 11,294 మంది పరీక్ష రాస్తే, 3,408 మంది (30.18 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ రిజల్ట్స్ ఇలా ఉంటే.. సెకండియర్‌లో ఫలితాలు మరీ తగ్గుతున్నాయి. ► ఎంపీసీలో గరిష్టంగా 72 శాతం, బైపీసీలో 67 శాతం ఫలితాలు ఉంటే, హెచ్ఈసీలో 46 శాతం సీఈసీలో 47 శాతం ఉంటోంది. హెచ్ఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఫస్టియర్‌లో సరిగా బోధన జరగడం లేదని బోర్డు అధికారులు గుర్తించారు. ఈ రెండు గ్రూపులు ఎక్కువగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనే ఉంటున్నాయి. ఈసారి మెరుగైన ఫలితాల దిశగా క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
అత్యున్నత ఫలితాలే లక్ష్యం కావాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గుణాత్మక మార్పు తేవాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. టెన్త్, ఇంటర్మిడియెట్ పరీక్షలు స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు. అత్యున్నత స్థాయి ఫలితాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ తొలిసారిగా మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మిడియెట్ బోర్డు కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హాజరయ్యారు. ఇంటర్, టెన్త్ పరీక్షలకు సంబంధించిన సమగ్ర వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, రాబోయే ఫలితాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. గత ఏడాది పేపర్ లీకేజీ ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు. కాగా ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని ఇంటర్ అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల అతి తక్కువ సమయంలో ఫలితాల వెల్లడికి ఆస్కారం ఉందని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ దిశగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులు, వాటి సాధ్యాసాధ్యాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేటుతో సమానంగా ఫలితాలు రావాలి ప్రైవేటు విద్యా సంస్థలతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన ఫలితాలు రావాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. దీంతో గురుకులాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చా రు. ఈ క్రమంలోనే గురుకులాల్లో మాదిరిగా ప్రభు త్వ స్కూళ్లల్లోనూ ఫలితాలు పెంచాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన, పరీక్షలకు సన్నద్ధమయ్యే మెళకువలు మెరుగు పర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఇంటర్ తర్వాత జరిగే పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని సూచించారు. మండలానికో కాలేజీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విద్యార్థులకు కాలేజీలు అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. ప్రతి మండలానికి ఓ కాలేజీ ఏర్పాటు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అవసరాన్ని బట్టి అధ్యాపకులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుండటంపై ఆయన ఆరా తీశారు. పదోన్నతులు చేపడితే ఖాళీలపై స్పష్టత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, పరీక్షలు, ఫలితాల గురించి దేవసేన సీఎంకు వివరించారు. వివిధ సబ్జెక్టు టీచర్ల కొరత, ఖాళీల భర్తీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో జరిగిన కసరత్తు చర్చకు వచ్చినట్టు తెలిసింది. 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ఎన్నికల ముందు చేపట్టిన ప్రక్రియ ఆగి పోయిందని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 18 వేలకు పైగా ఖాళీలున్నాయని, పదోన్నతులు చేపడితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టమైన సమాచారం వస్తుందని వివరించారు. టెట్ ఉత్తీర్ణులకే పదోన్నతులు ఇవ్వాలన్న కోర్టు తీర్పు అడ్డంకిగా ఉందని చెప్పగా, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు సమాచారం. -
TS: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియేట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం వెల్లడిస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాల్ని విడుదల చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్ డాట్.కామ్‌లో చూడవచ్చు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరిగిన విషయం తెలిసిందే. ఫలితాల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. education.sakshi.com -
జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభించవచ్చు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ శుక్రవారం విడుదల చేశారు. జూన్ 30లోగా ప్రవేశాలు పూర్తి చేయాలని,ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులు జూన్ 1 నుంచి ప్రారంభించాలని సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని కాలేజీలకు సూచించారు. టెన్త్ గ్రేడింగ్ ఆధారంగానే ప్రవేశాలు జరపాలని ఆదేశించారు. ఇంటర్ బోర్డ్ గుర్తింపు ఉన్న కాలేజీల జాబితాను టీఎస్‌బీఐఈ అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని, ఆ కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని సూచించారు. ప్రతీ కాలేజీ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. సీట్లలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, వికలాంగులకు 3, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఇతర అర్హతలున్న వారికి 5, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం కేటాయించాలన్నారు. ప్రతీ కాలేజీ బాలికలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను బోర్డ్ విడుదల చేసింది. మార్గదర్శకాలు ఇవీ... ♦ ఇంటర్లో ప్రతీ సెక్షన్లో 88 మంది విద్యార్థులనే చేర్చుకోవాలి. అదనపు సెక్షన్లు నిర్వహించాలంటే కాలేజీ విధిగా బోర్డ్ అనుమతి తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ఏ కాలేజీ వ్యవహరించినా కఠిన చర్యలుంటాయి. ♦ విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పకుండా నమో దు చేయాలి. అడ్మిషన్ల వివరాలను ప్రతీ రోజూ కాలేజీ బోర్డుపై ఉంచాలి. ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి? ఎన్ని మిగిలి ఉన్నాయి? అప్డేట్ సమాచారం బోర్డ్‌పై ప్రదర్శించాలి. ♦ జోగిని, తండ్రి లేని పిల్లల విషయంలో పేరెంట్స్ కాలమ్‌లో తల్లి పేరు నమోదు చేయాలి. బాలికలకు అన్ని రకాల రక్షణ వ్యవస్థను కాలేజీలే క ల్పించాలి. -
అడ్డగోలు అడ్మిషన్లుచెల్లవ్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు మరింత దృష్టి పెట్టింది. అనుమతుల్లేకుండా అడ్డగోలుగా చేపట్టే అడ్మిషన్లు చెల్లవని స్పష్టంచేసింది. అలాంటి కాలేజీల వివరాలు సేకరించి తమకు పంపాలని జిల్లా ఇంటర్ అధికారులను ఆదేశించింది. ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. దీంతోపాటు ఈ ఏడాది సకాలంలో అనుబంధ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈలోగా ఎక్కడా ఏ కాలేజీ అడ్మిషన్లు తీసుకోవడానికి వీల్లేదని, కాలేజీకి గుర్తింపు రాకపోతే బోర్డు బాధ్యత వహించదని స్పష్టంచేసింది. ప్రతీ ప్రైవేటు కాలేజీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను పొందుపరుస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఏటా బోర్డు నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై గట్టి నిఘా ఉంచాలని, వాటి వివరాలను తమకు పంపాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. మెరుగైన బోధన ఉండాల్సిందే.. ఎక్కడైతే అనుబంధ గుర్తింపు పొందుతారో, అక్కడే కాలేజీ నిర్వహించాలని, ఒకచోట అనుమతి, వేరొకచోట కాలేజీ ఉంటే పర్మిషన్ రద్దు చేస్తామని ప్రైవేటు ఇంటర్ కాలేజీలను బోర్డు హెచ్చరించింది. ఈ దిశగా వివరాలు సేకరించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన బోధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇది ఒక క్యాంపస్‌కే పరిమితం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించేటప్పుడు వారి వివరాలను ఈ ఏడాది నుంచి బోర్డు ఆన్లైన్లో నమోదు చేయబోతోంది. విద్యాసంవత్సరం మొదట్లో నియమించిన అధ్యాపకులే చివరి వరకూ ఉండాలనే నిబంధన విధించింది. ఒకవేళ అధ్యాపకుడిని మారిస్తే ఆ విషయాన్ని బోర్డు అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల బోధన ఏ స్థాయిలో జరుగుతుందనేది అంచనా వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ తప్పనిసరి ఈ ఏడాది నుంచి సిబ్బంది బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయనున్నారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో బోధించే అధ్యాపకులు విధిగా పీజీ చేసి ఉండాలి. వారి వివరాలు, ఆధార్, బయోమెట్రిక్‌కు అవసరమైన వివరాలను ఆన్లైన్ ద్వారా ఫీడ్ చేస్తారు. విద్యా సంవత్సరం ముగిసే వరకూ వారి బయోమెట్రిక్ కొనసాగేలా చూస్తారు. ప్రతీ కాలేజీలో ప్రత్యేక మొబైల్ నంబర్ అందుబాటులో ఉండాలని, ఇది జిల్లా ఇంటర్ విద్యాధికారికి తెలపాలని సూచించారు. విద్యా సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్ణయించిన తేదీల్లోనే ప్రవేశాలు, తరగతులు జరగాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. -
రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఒకేసారి ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇలా ఒకేసారి ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. రేపు(బుధవారం) సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీన ప్రథమ సంవత్సరం, 16వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించబోతోంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
మే 15 కల్లా ఇంటర్, టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు మే 15 కల్లా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విద్యా శాఖ ఉన్నతాధికారుల కసరత్తు తుది దశకు చేరుకుంటోంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది, టెన్త్ పరీక్షలకు 4.90 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ మూల్యాంకన ఇప్పటికే ముగిసింది. మార్కులను మరోసారి పరిశీలించి, కంప్యూటర్ ద్వారా ఇంటర్ బోర్డ్‌కు పంపారు. డీకోడింగ్ ప్రక్రియ కూడా ముగిసినట్టు అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ జరుగుతోందని, సాంకేతిక పరమైన లోపాలు పరిశీలించిన తర్వాత ఫలితాల విడుదల తేదీ ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. మే రెండోవారం అంటే.. 15వ తేదీలోగా ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇక పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం దాదాపు ముగిసింది. కొన్ని పెద్ద కేంద్రాల్లో అక్కడక్కడా కొనసాగుతోంది. మూల్యాంకనం పూర్తికాగానే డీ కోడింగ్ చేసి, మార్కులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా బోర్డుకు పంపుతున్నారు. కాగా, టెన్త్ ఫలితాలను వచ్చే నెల 10లోగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెపుతున్నారు. -
Telangana: అఫిలియేషన్లు లేకున్నా... అడ్మిషన్లు షురూ!
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షలు పూర్తవ్వడంతో ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ప్రవేశాల ప్రక్రియను ముమ్మరం చేశాయి. నిబంధనల ప్రకారం ఇంటర్ బోర్డ్ నుంచి అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉన్నా, దీన్ని పట్టించుకోవడం లేదు. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఏకంగా బ్రిడ్జ్, క్రాష్ కోర్సులంటూ తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి మాత్రమే అన్ని కాలేజీలూ ప్రారంభించాలని ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ కూడా ఇచ్చింది. ఈలోపు అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పింది. గుర్తింపు లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ గుర్తింపు రాని పక్షంలో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. మండువేసవిలో తరగతులు నిర్వహిస్తున్నా, అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. రూ. లక్షల్లో ఫీజులు: ప్రైవేటు కాలేజీలు ఈసారి ఫీజులు భారీగా పెంచాయి. ఐఐటీ, నీట్, ఇంటెన్సివ్ కోర్సులంటూ విభాగాల వారీగా ధరలు నిర్ణయించాయి. ఓ కార్పొరేట్ కాలేజీ గత ఏడాది సంవత్సరానికి రూ.1.25 లక్షలు తీసుకోగా, ఈసారి రూ.1.75 లక్షలు డిమాండ్ చేస్తోంది. జేఈఈ కోచింగ్‌తో కలిపితే రూ. 2.25 లక్షలు చెబుతోంది. సాధారణ కాలేజీలు కూడా ఏడాదికి రూ.75 వేల నుంచి రూ. 1.25 లక్షలు డిమాండ్ చేస్తున్నాయి. రవాణా చార్జీలు కూడా 20 శాతం పెంచారని తల్లిదండ్రులు చెబుతున్నారు. హాస్టల్ కోసం ఏటా రూ.1.25 లక్షలు అడుగుతున్నారు. మొత్తం మీద ఇంటర్ పూర్తయ్యే వరకూ రూ.2 నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. గుర్తింపు ఇవ్వకుండానే...? రాష్ట్రవ్యాప్తంగా 3,111 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీలున్నాయి. వీటిలో ప్రభుత్వ కాలేజీలు తీసివేస్తే దాదాపు 1,516 ప్రైవేటు కాలేజీలు అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, లేబొరేటరీలు అన్నీ పరిశీలించిన తర్వాతే గుర్తింపు ఇస్తారు. గత ఏడాది 416 కాలేజీలకు పరీక్ష ఫీజు గడువు ప్రకటించే వరకూ గుర్తింపు ఇవ్వలేదు. బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్నాయని, అగ్రిప్రమాదాలను నివారించే వ్యవస్థ లేదనే అభ్యంతరాలున్నాయి. దీంతో లక్ష మంది విద్యార్థులు ఫీజు కట్టేందుకు ఆఖరి క్షణం వరకూ ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది మూడేళ్ల కాలపరిమితితో అఫ్లియేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేటు కాలేజీలు ఇంకా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే దశలోనే ఉన్నాయి. అయినా పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. టెన్త్ ఫలితాలొచ్చేలోగా గుర్తింపు పూర్తి: నవీన్ మిత్తల్ (ఇంటర్ బోర్డ్ కార్యదర్శి) అనుబంధ గుర్తింపు వచ్చిన తర్వాతే బోర్డ్ నిర్దేశించిన మేరకు ఫస్టియర్ ప్రవేశాలు చేపట్టాలి. ఇందుకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టినా, క్లాసులు నిర్వహించినా చర్యలుంటాయి. గతంలో మాదిరిగా కాకుండా, ఈసారి టెన్త్ ఫలితాలు వచ్చిన వెంటనే గుర్తింపు ప్రక్రియను పూర్తిచేస్తాం. ఆ తర్వాత అఫ్లియేషన్ ఇవ్వం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గుర్తింపు వచ్చిన తర్వాతే విద్యార్థులను కాలేజీల్లో చేర్చాలని కోరుతున్నాం. ఉల్లంఘనులపై చర్యలుండాలి: మాచర్ల రామకృష్ణగౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్) గుర్తింపు రాకుండా ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారం అడ్మిషన్లు తీసుకోవడం చట్టవిరుద్ధం. అధికారులు ఇలాంటి కాలేజీలపై దృష్టి పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి. టెన్త్ ఫలితాలు రాకుండా ఇంటర్ క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. -
ఈఏపీసెట్‌లో ‘ఇంటర్’కు వెయిటేజీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్–2023లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇంటర్ మార్కులకు 25 శాతం మేర వెయిటేజీ ఇచ్చి ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ర్యాంకులను ప్రకటించనున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిపివేసిన ఇంటర్ మార్కుల వెయిటేజీ విధానాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఇదే విషయాన్ని ఇటీవల విడుదలైన ఈఏపీసెట్ నోటిఫికేషన్లో కూడా పొందుపరిచింది. కాగా ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేయడానికి ఇంటర్లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని స్పష్టం చేసింది. సెట్‌కు ఆన్లైన్ దరఖాస్తులను ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుములతో మే 14 వరకు స్వీకరిస్తారు. ఇందులో భాగంగా మే 15 నుంచి 18 వరకు ఎంపీసీ విభాగం, మే 22, 23 తేదీల్లో బైపీసీ విభాగం పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. కాగా ఈఏపీసెట్ దరఖాస్తు, ఇతర అంశాల్లో విద్యార్థులకు సహకారం అందించడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనల మేరకు.. కరోనాకు ముందు వరకు ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉండేది. ఇందులో భాగంగా ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించేవారు. ఈ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. అయితే కరోనా వల్ల 2020, 2021 విద్యా సంవత్సరాల పరీక్షలు జరగలేదు. దీంతో ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం ఎత్తేసింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ ఈఏపీసెట్‌లోని మార్కులనే పూర్తిగా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను కేటాయించింది. 2022 నుంచి పరిస్థితులు సద్దుమణిగి ఇంటర్ తరగతులు సజావుగా సాగుతుండడంతో ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల మేరకు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ రాసిన విద్యార్థులు 2022లో ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను విద్యార్థులంతా పూర్తిస్థాయిలో రాయడంతో ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్–2023లో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి నివేదించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం, ఈఏపీసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించనున్నారు. సిలబస్‌పైనా స్పష్టత కాగా ఈఏపీసెట్–2023 సిలబస్‌పైనా ఉన్నత విద్యామండలి స్పష్టతనిచ్చింది. కరోనా సమయంలో తరగతులు, పరీక్షలు నిర్వహించకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడ్డారు. దీంతో ఇంటర్ బోర్డు 30 శాతం మేర సిలబస్‌ను కుదించింది. అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు కుదించిన సిలబస్‌నే పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈఏపీసెట్ పరీక్షల్లోనూ ఉన్నత విద్యామండలి.. బోర్డు నిర్ణయించిన విధానాన్నే అనుసరించాల్సి వచ్చింది. బోర్డు తీసేసిన అంశాలను సిలబస్ నుంచి మినహాయించి ఈఏపీసెట్‌ను నిర్వహించింది. 2022లో కూడా 30 శాతం సిలబస్ కుదింపు అంశాన్నే కొనసాగించింది. అప్పట్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆ 30 శాతం సిలబస్‌పై బోధన జరగలేదు. ఆ విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారు. వీరు ఇంటర్ ఫస్టియర్‌లో బోర్డు మినహాయించిన 30 శాతం అంశాలను అధ్యయనం చేయలేదు. దీంతో ఈసారి కూడా ఈఏపీసెట్ సిలబస్‌లో ఇంటర్ సెకండియర్ సిలబస్‌ను పూర్తిగా, ఫస్టియర్ సిలబస్‌ను 30 శాతం మేర కుదించి పరీక్ష నిర్వహించనున్నారు. ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే నర్సింగ్ సీట్లు కాగా ఈసారి కొత్తగా నర్సింగ్ సీట్లనూ ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి అనుబంధ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు ఏపీ ఈఏపీసెట్–2023 ర్యాంకుల ఆధారంగానే ఉంటాయని తెలిపింది. డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని వెల్లడించింది. -
Inter Exams 2023: నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించా లని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. గత కొన్ని నెలలుగా ఇంటర్ బోర్డ్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి పరీక్షలపై అప్రమత్తత అవసరమని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించినట్టు తెలిసింది. దీంతో పరీక్షల నిర్వహణపై బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం సాయంత్రం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు అవసరమైన సూచనలు చేశారు. ఇంటర్ బోర్డ్‌కు ప్రత్యామ్నాయ వ్యవస్థ నడుస్తోందని కొన్ని నెలల క్రితం ఇంటర్ బోర్డ్ కార్యదర్శి మిత్తల్ సందేహం వెలిబుచ్చారు. డేటా ట్యాంపరింగ్ జరిగిందని పోలీసులకు బోర్డ్ గతంలో ఫిర్యాదు చేసింది. ప్రైవేటు ఇంటర్ కాలేజీలతో బోర్డ్‌లోని కొంతమంది అధికారులే కలిసి పనిచేస్తున్నారనే అనుమానాలతో కొంతమందిని కీలకమైన స్థానాల నుంచి తప్పించారు. ఈ ఏడాది నుంచి ఆన్లైన్ మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించడం, దీన్ని కొంతమంది ఆక్షేపిస్తూ వివాదాస్పదం చేసే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ పరీక్షల నిర్వహణలో అప్రమత్తతను సూచిస్తున్నాయి. పేపర్ల పంపిణీ దగ్గర్నుంచి... డేటా చోరీ వ్యవహారం తెరమీదకొచ్చిన తర్వాత ఇంటర్ బోర్డ్‌లో ప్రతీ వ్యవహారంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు. కీలకమైన అంశాలపై చర్చించేందుకు ముఖ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. బోర్డ్‌లోని కొందరి సెల్‌ఫోన్లపైనా నిఘా పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుత పరీక్షల నిర్వాహకులే లక్ష్యంగా బోర్డ్ లోని వ్యక్తులు, ప్రైవేటు కాలేజీలు, మరికొంత మంది కలిసి పరీక్షల్లో అవాంతరాలు సృష్టించే వీలుందనే అనుమానాలు ఉన్నత వర్గాల్లోనూ ఉన్నాయి. దీంతో పరీక్ష పేపర్లు పంపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అన్ని పరీక్ష కేంద్రాల్లో విధిగా సీసీ కెమెరాల ముందే ప్రశ్నపత్రాలు ఓపెన్ చేయాలని ఆదేశాలిచ్చారు. అదే విధంగా జవాబు పత్రాలు సురక్షితంగా చేరే వరకూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. పరీక్ష లపై అసత్య ప్రచారం చేసేందుకు కొంతమంది సామాజిక మాధ్యమాలను వాడుకునే అవకాశముందని, ఈ అంశాలపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
సమస్యలుంటే కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీ డియెట్ పరీక్షల నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది తలెత్తినా 040– 24601010, 040– 24655027 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షల ఏర్పాట్లపై మిత్తల్ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పనిచేస్తాయని తెలిపారు. ఇవే కాకుండా ప్రతీ జిల్లాలోనూ ప్రత్యేక నంబర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. కాలేజీలతో ప్రమేయం లేకుండా విద్యార్థులే ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నా రు. మంగళవారం మధ్యాహ్నం వరకూ 50 వేల మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఉదయం 9 దాటితే పరీక్ష హాలులోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు ఎక్కడా నేలపై కూర్చొని పరీక్ష రాసే విధానం ఉండకూడదని అధికారుల ను ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 9,47,699 మంది పరీక్షలు రాస్తున్నారని, వీరిలో 4,82,677 మంది ఫస్టియర్, 4,65,022 మంది సెకెండీయర్ ఉన్నట్టు చెప్పారు. 75 ఫ్లైయింగ్ స్వా్కడ్స్ పనిచేస్తాయన్నారు. డిజిటల్ మూల్యాంకనం ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్లైన్లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్ తెలిపారు. ఇందుకు సంబంధించి రెండోసారి పిలిచిన టెండర్లకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయని, వాటి అర్హతలను పరిశీలిస్తున్నామని తెలిపారు. టెన్త్ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్ కాలేజీల అఫ్లియేషన్ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్ లేకపోతే పరీక్షకు బోర్డ్ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు. ఇంటర్ ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. -
మార్చి 15 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. మొత్తం 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. పరీక్షల ఏర్పాట్లపై బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. పరీక్షల కోసం తీసుకున్న జాగ్రత్తలు, విద్యార్థులకు ఇచ్చే సూచనలను పరీక్షల విభాగం డైరెక్టర్ జయప్రదాభాయ్ మీడియాకు వివరించారు. పకడ్బందీ ఏర్పాట్లు: మంత్రి సబిత ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లు పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తక్షణమే స్పందిస్తాం: నవీన్ మిత్తల్ ’’ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉంటాం. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగం పని చేస్తోంది. ఎలాంటి మానసిక ఒత్తిడి అన్పించినా విద్యార్థులు కౌన్సెలింగ్ తీసుకోవాలి.. మనోధైర్యం ప్రతీ విద్యార్థికి అవసరం’’అని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అన్నారు. గంట ముందే పరీక్ష హాలుకు... ♦ విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్షహాలులోకి అనుమతిస్తారు. 9 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. విద్యార్థులు హాల్ టికెట్లపై పేరు, మీడియం ఇతర వివరాలను ముందే సరిచూసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపాల్ చేత సరిచేయించుకోవాలి. హాల్‌టికెట్లను ్టటbజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా అనుమతిస్తారు. ♦ ఏ విధమైన ప్రింటింగ్, చేతిరాత మెటీరియల్, సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్ష హాలులోకి అనుమతించరు. ♦ జిల్లా పరీక్షల కమిటీ(డీఈసీ)ని ప్రతీ జిల్లాలో నియమించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి, నోడల్ అధికారి, ఇద్దరు ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్ ఇందులో ఉంటారు. వీరితోపాటు జిల్లాస్థాయి హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ♦ రెవెన్యూ, విద్య, పోలీసు శాఖల నుంచి ఒకరు చొప్పున 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రాల్లో 200 సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. ♦ జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీలో అన్ని శాఖల అధికారులుంటారు. వారు ఆర్టీసీ, హెల్త్, విద్యుత్ సేవలు అందిస్తారు. అన్ని ప్రాంతాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పరీక్షకేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తారు. ప్రతీ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. -
Telangana: వేధిస్తే ఉక్కుపాదమే!
ఇక యాజమాన్యాలదే బాధ్యత విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చదువు కోసం వచ్చే పిల్లలు తనువు చాలిస్తుంటే తప్పెవరిది? వ్యాపార ధోరణే ధ్యేయంగా పనిచేసే సంస్థలు విద్యార్థులను పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఏ ఒక్క విద్యార్థి ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయినా ఊరుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – నవీన్ మిత్తల్, కాలేజీ విద్య కమిషనర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులను వేధింపులకు గురిచేసే ప్రైవేటు కాలేజీలు, అధ్యాపకులపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం హెచ్చరించింది. విద్యార్థుల పట్ల అసభ్యంగా, అవమానకరంగా ప్రవర్తించడం, శారీరకంగా హింసించడం వంటివి చేసే లెక్చరర్‌ను రాష్ట్రంలోని ఏ కాలేజీలోనూ బోధించకుండా అనర్హుడిగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్య ఘటనల నేపథ్యంలో.. సోమ వారం ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు. కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు గౌరీ సతీశ్‌తోపాటు 14 కాలేజీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మానసిక స్థైర్యం కోల్పోవడానికి కారణాలు, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో నిబంధనల ఉల్లంఘనలు, విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి తదితర అంశాలపై చర్చించారు. వీటిని అదుపు చేయడానికి అనుసరిస్తున్న చర్యలపై కాలేజీల యాజమాన్యాలను అధికారులు ప్రశ్నించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మళ్లీ ఆత్మహత్య ఘటనలు జరగొద్దు.. సమీక్ష సందర్భంగా ప్రైవేటు కాలేజీల తీరుపై నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని, ఆదేశాలను కాలేజీల ప్రతినిధులకు వివరించారు. ‘‘విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సాత్విక్ ఘటనే ఆఖరిది కావాలి. ఇది పునరావృతమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయి. చదువు కోసం వచ్చే పిల్లలు తనువు చాలిస్తుంటే తప్పెవరిది? దీనికి యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని మీరే పరిష్కరించుకుంటారా? లేకపోతే 33 జిల్లాల అధికారులను రంగంలోకి దించాలంటారా? అధికారులు రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుంది’’ అని నవీన్ మిత్తల్ హెచ్చరించారు. ఏ ఒక్క విద్యార్థి ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయినా ఊరుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. ఈ సందర్భంగా కాలేజీల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ చేస్తున్నామంటూ యాజమాన్య ప్రతినిధులు చెప్పడాన్ని మిత్తల్ తోసిపుచ్చారని.. వ్యాపార ధోరణే ధ్యేయంగా పనిచేసే సంస్థలు విద్యార్థులను పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని నిలదీశారని తెలిసింది. గీత దాటితే వేటే.. ప్రైవేటు కాలేజీలకు నిబంధనల ఉల్లంఘన అలవాటుగా మారిందని.. విద్యార్థుల ప్రవేశాలు ఒకచోట, వారి బోధన వేరేచోట ఉండటం ఏమిటని నవీన్ మిత్తల్ ప్రశ్నించారు. ఇక మీద ఇలా చేస్తే ట్రెస్పాస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి కాలేజీలో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాల్సిందేనని, కాలేజీల్లో బోధించే అధ్యాపకుల నాణ్యత ఏమిటో దీనితో తెలుస్తుందని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు పనీపాటా లేకుండా సమావేశాలు పెడుతుందనే భ్రమల నుంచి కార్పొరేట్ కాలేజీలు బయటపడాలని.. ఇక మీద ఎప్పుడు మీటింగ్‌కు పిలిచినా కాలేజీల ప్రిన్సిపాళ్లు మాత్రమే సమావేశానికి రావాలని తేల్చిచెప్పారు. విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రైవేటు కాలేజీలు ఇస్తున్న ప్రకటనలపైనా ఇక నుంచి పరిశీలన ఉంటుందని తెలిపారు. ర్యాంకు వచ్చిన విద్యార్థిని మూడు చోట్ల చూపించి గొప్పలు చెప్పుకునే విధానాలకు స్వస్తి పలికేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. చైతన్య గుర్తింపు రద్దు: నవీన్ మిత్తల్ కాలేజీల ప్రతినిధులతో సమావేశం అనంతరం నవీన్ మిత్తల్ ‘సాక్షి’తో మాట్లాడారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన శ్రీచైతన్య నార్సింగి బ్రాంచి అనుబంధ గుర్తింపు రద్దు చేస్తున్నామని.. దీనిపై మంగళవారం ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. విద్యార్థులను దూషించే, హింసించే లెక్చరర్లపై కాలేజీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని.. తమ దృష్టికి వస్తే సదరు లెక్చరర్లను డీబార్ చేస్తామని చెప్పారు. స్టడీ అవర్స్ పేరిట వేధించే విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. మనోవేదనతో ఉన్న విద్యార్థులను ముందే గుర్తించి సరైన కౌన్సెలింగ్ ఇవ్వాలని కాలేజీలకు సూచించామన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, క్రీడలను ప్రోత్సహించేలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రైవేటు కాలేజీల ఆగడాలను ఇక మీదట ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. గ్రేడింగ్ విధానంపై కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. అరెస్ట్ చేయకుండా చర్చలా?: పీడీఎస్‌యూ కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కాలేజీల యాజమాన్యాలను అరెస్ట్ చేయకుండా, చర్చలు ఎలా జరుపుతారని పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. సోమవారం కాలేజీల యాజమాన్యాలతో భేటీ జరిగిన ఎంసీఆర్హెచ్ఆర్డీ వద్ద నిరసనకు దిగారు. అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. -
సాత్విక్: తప్పుల తడకగా అధికారులు రిపోర్ట్.. ఆవేదనలో పేరెంట్స్
సాక్షి, హైదరాబాద్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ బ్రాంచ్‌లో విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాత్విక్ ఆత్మహత్యపై ఇంటర్ బోర్డు రంగంలోకి దిగింది. అధికారులతో కమిటీ వేసింది. తాజాగా బోర్డు కమిటీ విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందించింది. అయితే, విచారణలో భాగంగా ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై తప్పుల తడకగా నివేదికను అందించారు అధికారులు. ఉస్మానియా మార్చురీలో మృతదేహం ఉంటే.. గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిపోర్టు, అధికారులపై సాత్విక్ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రిపోర్టులో సాత్విక్‌కు కాలేజీలో అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాగా, దీనిపై సాత్విక్ తల్లిదండ్రులు స్పందించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. సాత్విక్‌ను శ్రీచైతన్య కాలేజ్ పేరు మద అడ్మిషన్ చేశాం. శ్రీచైతన్య కాలేజ్ నార్సింగి క్యాంపస్‌లో జాయిన్ చేస్తామని చెప్పారు. శ్రీచైతన్యలోనే అడ్మిషన్ ఇస్తున్నామని చెప్పారు. వేరే కాలేజీలో అడ్మిషన్ ఉన్నట్టు మాకు తెలియదు. కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది. మాకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
సాత్విక్ ఆత్మహత్య ఎఫెక్ట్: శ్రీ చైతన్య కాలేజీకి షాక్!
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యార్థి ఆత్మహత్యపై తాజాగా ఇంటర్ బోర్డ్ అధికారులు.. శ్రీ చైతన్య కాలేజీ మేనేజ్మెంట్కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇంటర్ బోర్డు విచారణ చేపట్టింది. ఇక, విద్యార్థి సాత్విక్ మృతి నేపథ్యంలో డీఈవో ఆధ్వర్యంలో బోర్డు అధికారులు కాలేజీని విజిట్ చేశారు. ఈ ఘటనపై అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. కాగా, కాలేజీ మేనేజ్మెంట్ ఇచ్చే వివరణపై ఫైనల్ రిపోర్టు సిద్ధం చేసి అధికారులు.. కమిషనర్‌కు నివేదిక అందజేయనున్నారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాలేజీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు, అధికారులు.. విద్యార్థులు, పేరెంట్స్, మిగిలిన లెక్చరర్ల నుంచి కూడా సమాచారం తీసుకుని నివేదిక తయారు చేయనున్నారు. ఇదిలా ఉండగా, నివేదిక అందిన వెంటనే కాలేజీ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని నవీన్ మిట్టల్ తెలిపారు. -
నీట్, జేఈఈకి ప్రత్యేక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులు నీట్, జేఈఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందేలా పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ‘ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ సమ్మర్ కోచింగ్’ పేరిట వేసవిలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా పైసా ఖర్చు లేకుండా శిక్షణ ఇవ్వాలన్నది బోర్డు లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో ఇంటర్ సిలబస్ పూర్తి చేసి, మరో వారం రివిజన్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత జనవరి రెండో వారం నుంచి ప్రతి కాలేజీలోనూ జేఈఈ, నీట్‌కు సంసిద్ధుల్ని చేసే ప్రక్రియను మొదలు పెడతారు. మార్చి నెలాఖరుకు ఇంటర్ పరీక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ మొదలు పెడతారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కోచింగ్ వల్ల జాతీయ స్థాయి పరీక్షల్లోనే కాకుండా, తెలంగాణ ఎంసెట్‌లోనూ మంచి ర్యాంకులు పొందే వీలుందని అధికారులు వివరిస్తున్నారు. సీనియర్ లెక్చరర్లతో శిక్షణ శిక్షణలో భాగంగా నీట్, జేఈఈకి సంబంధించిన మాదిరి ప్రశ్నాపత్రాలను ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులందరికీ అందించనున్నారు. వీటి ఆధారంగా జిల్లా స్థాయిలో అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. వీరిలో మంచి మార్కులు పొందిన వంద మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో బాలురు 50 మంది ఉంటే, బాలికలు 50 మంది ఉండాలని బోర్డు మార్గదర్శకాల్లో పేర్కొంది. వార్షిక పరీక్షల అనంతరం ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని వసతులు ఉన్న చోట వీటిని నెలకొల్పుతారు. ఉచిత వసతి, భోజనం, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు స్టడీ మెటీరియల్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న సీనియర్ సబ్జెక్టు లెక్చరర్లతో శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు. అయితే ప్రత్యేక కోచింగ్ విషయంలో ప్రభుత్వ అ«ద్యాç³కులు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జేఈఈ మొదటి దశ పరీక్షలు జనవరిలో, రెండో దశ ఏప్రిల్‌లో జరుగుతాయి. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 1తో ముగుస్తాయి. ఇలాంటప్పుడు ప్రత్యేక శిక్షణకు సమయం ఎక్కడ ఉంటుందనే సందేహాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకులు రాకపోతే ఆ వైఫల్యాలను తమ పైకి నెట్టే వీలుందని కూడా అంటున్నట్టు తెలిసింది. -
ఇంటర్ ఫీజు గడువు 28
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజును రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకూ చెల్లించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు గడువు ఈ నెల 19వ తేదీతో ముగిసింది. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
మెయిన్స్ షెడ్యూల్‌పై మళ్లీ సందిగ్థం
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2023 నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జేఈఈ–2023కి సంబంధించి షెడ్యూల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలు తేదీలు ప్రచారం అవుతుండడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి జేఈఈ మెయిన్స్‌ను గతంలో ఒక్కసారే నిర్వహించేవారు. ఒకపక్క బోర్డు పరీక్షలకు తయారవ్వడం, మరోపక్క మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు తొట్రుపాటుతో తక్కువ మార్కులతో అవకాశాలు కోల్పోతున్నారు. దీనివల్ల ఐఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు మరో ఏడాదిపాటు ఆగాల్సి వచ్చేది. ఈ కారణాలతో ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా మార్పు చేశారు. జనవరి, మార్చి ఆఖరు లేదా ఏప్రిల్‌లో నిర్వహించేవారు. జనవరి సెషన్‌కు సంబంధించి నవంబర్‌కు ముందే ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసేది. కానీ, ఈసారి నవంబర్ మూడో వారంలోకి ప్రవేశిస్తున్నా ఇప్పటివరకు ఎన్టీఏ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు.. జేఈఈ పరీక్షలు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ బోర్డు సహా పలు రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఇంచుమించు అదే సమయంలో జరుగుతుంటాయని, దీనివల్ల తాము ఇబ్బందికి గురవుతామని విద్యార్థులు విన్నవిస్తున్నారు. జేఈఈ పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ ఒక స్పష్టతనిస్తే ప్రణాళిక ప్రకారం సిద్ధంకావడానికి వీలుంటుందంటున్నారు. గత ఏడాది తీవ్ర గందరగోళం.. కరోనాతో రెండేళ్ల పాటు జేఈఈ పరీక్షల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడినా 2022లో కోవిడ్ తగ్గుముఖం పట్టినందున అన్నీ సకాలంలో జరుగుతాయని విద్యార్థులు భావించారు. కానీ, జేఈఈ నిర్వహణ సంస్థ అయిన ఎన్టీఏ పలుమార్లు షెడ్యూళ్లు మార్పుచేసి విద్యార్థులను, బోర్డులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. జేఈఈ మెయిన్స్–2022 షెడ్యూల్‌ను 2021 నవంబర్, డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలను చేపట్టాలి. కానీ, ఎన్టీఏ ఐదు రాష్ట్రాల ఎన్నికల సాకుతో 2022 మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ప్రకటించి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. అలాగే, తొలి సెషన్ పరీక్షల తేదీల విషయంలో ఆయా రాష్ట్రాల బోర్డు పబ్లిక్ పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16–21 వరకు, మే 24–29 వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని తేదీలను ప్రకటించింది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహ అనేక రాష్ట్రాల ఇంటర్మీడియెట్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అంతకుముందే ప్రకటించినా వాటిని పట్టించుకోలేదు. జేఈఈ పరీక్షలను అవే తేదీల్లో ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీలను ఆ ఏడాది ఏప్రిల్ 22 తరువాత ఉండేలా మార్పులుచేసుకున్నాయి. కానీ, ఎన్టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్‌ను మార్పుచేసింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు మళ్లీ మార్పు చేసుకున్నాయి. ఆ తర్వాత ఎన్టీఏ మూడోసారి మళ్లీ షెడ్యూల్‌ను మార్పుచేసింది. 2022 జూన్, జులైలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించి ఆయా రాష్ట్రాల బోర్డులను సమస్యల్లోకి నెట్టింది. ఇలా జేఈఈ మెయిన్–2022 పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం చేయడంతో ఫలితాల విడుదలపైనా దాని ప్రభావం పడింది. మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6కల్లా ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. వీటిలో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మందిని అడ్వాన్సుకు అనుమతిస్తారు. కానీ, చివరి నిమిషం వరకు మెయిన్స్ ఫలితాలపై గందరగోళానికి గురిచేసింది. ఈసారి అలాంటి గందరగోళానికి లేకుండా పరీక్షలపై స్పష్టతనివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రక్షాళన.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డులో పాలనాపరమైన సంస్కరణలు మొదలయ్యాయి. గత కొన్నేళ్ళుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి చేతుల్లో ఉన్న అధికారాలను వికేంద్రీకరించారు. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ఏ పనికైనా ఇప్పటి వరకూ హైదరాబాద్ బోర్డ్‌కు రావాల్సిన పరిస్థితి ఉండేది. ఇక నుంచి జిల్లా పరిధిలోనే అవసరమైన పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీజోన్–1, మల్టీజోన్– 2కు ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. కాలేజీ ప్రిన్సిపల్స్ అన్ని రకాల సెలవులు ఇక నుంచి మల్టీజోన్ ఆర్జేడీ పరిధిలోనే పరిష్కరించుకోవచ్చు. సర్వీసు క్రమబ ద్ధీకరణ, సీనియారిటీ జాబితాలను మల్టీ జోన్ పరిధిలోకే తెచ్చారు. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత పొందే ప్రయోజనాలకు సంబంధించిన దస్త్రాలు కూడా ఈ పరిధిలోకే చేర్చారు. అలాగే ప్రిన్సిపల్స్, జిల్లా ఒకేషనల్ ఆఫీసర్స్, ఇతర జిల్లా అధికారులకు తమ పరిధిలో అవసరమైన అధికారాలు బదలాయించారు. ఉద్యోగుల సర్వీసులకు సంబంధించి నిర్ణయాధి కారాన్ని ఇచ్చారు. బయో మెట్రిక్ – ఈ ఆఫీస్ ఉద్యోగులు వేళకు రావడం లేదని, వచ్చినా ఫైళ్ళను చూడటం లేదనీ, కేవలం వ్యక్తిగత ప్రయోజనం ఉండే ఫైళ్ళనే ముట్టుకుంటున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులు అందేవి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్‌లో ఉద్యోగుల పారదర్శకతను పెంచుతూ అన్ని స్థాయిల్లోనూ బయోమెట్రిక్‌ను అమలు చేస్తున్నట్టు నవీన్ మిత్తల్ తెలిపారు. బయోమెట్రిక్ వల్ల జవాబుదారీతనం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక ఇంటర్ బోర్డులో అనుమతులు, ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్ళు నెలల తరబడి పరిశీలనకు నోచుకోవడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ–ఫైలింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ఫైలింగ్ ద్వారా వ్యక్తులతో సంబంధం లేకుండానే ఆన్లైన్ ద్వారా ఫైళ్ళు వెళ్ళడం, పరిశీలన, అనుమ తులు ఇవ్వడం సాధ్యమని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ విద్య కమిషనర్ సంస్కరణలను తెలంగాణ విద్య పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్ స్వాగతించారు. అవినీతి పరుల ఆటకట్టేందుకు ఈ సంస్కరణలు దోహదపడతాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
విజయవాడ శ్రీ చైతన్య కళాశాలపై ఏపీ ఇంటర్ బోర్డు చర్యలు
-
ఇంటర్లో ఇక 100% సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి, ద్వితీయ పరీక్షల్లో ఇక నుంచి వందశాతం సిలబస్‌తో ప్రశ్నప త్రాలు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తేబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగానే విద్యార్థులు సిద్ధమవ్వాలని, కాలేజీ నిర్వాహకులు కూడా 100 శాతం సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ ముందు వరకూ ఇదే విధానం కొనసాగింది. కోవిడ్ విజృంభణతో 2021లో 70 శాతం సిలబస్‌నే అమలు చేశారు. అయితే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. 2021–22లో కూడా చాలాకాలం ఆన్లైన్ క్లాసులు నడిచాయి. ఈ సదుపాయం అన్ని ప్రాంతాలు వినియోగించుకోలేదన్న ఆందోళన సర్వత్రా విన్పించడంతో 70 శాతం సిలబస్‌నే అమలు చేశారు. తొలుత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవని చెప్పినప్పటికీ ఆ తర్వాత నిర్వహించారు. ఈ పరీక్షల్లో 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 70 శాతం సిలబస్ కూడా సరిగా జరగలేదని విద్యార్థులు ఆందోళనలకు దిగారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. 2022లో మేలో జరిగిన పరీక్షల్లో 70 శాతం సిలబస్‌తోనే పరీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం సకాలంలో మొదలవ్వడంతో వందశాతం సిలబస్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే మొదటి సంవత్సరం ప్రవేశాలు సెప్టెంబర్ వరకూ జరిగాయి. బోర్డు నిర్దేశించిన సిలబస్ కూడా పూర్తవ్వలేదని విద్యార్థులు అంటున్నారు. కాకపోతే 100 శాతం సిలబస్ ఉంటుందని ముందే చెప్పడంతో సిద్ధమవ్వడానికి కొంత వ్యవధి లభించిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మోడల్ పేపర్ల తయారీపై బోర్డు దృష్టి పెట్టినట్టు లేదు. కోవిడ్‌కు ముందు ఇదే సిలబస్‌తో నమూనా ప్రశ్నపత్రాలు రూపొందించారు. వాటినే బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో ఇంటర్మీడియెట్ రెగ్యులర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా ఎంసెట్‌కు హాజరవుతారు. అయితే ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంటర్ ఫెయిల్ అయి, సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1.13 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు రాకపోవడంతో తొలిదశ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు..? ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారికి ఉన్నత విద్యామండలి ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్ 6న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ కారణంగా సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్, ఆప్షన్ల నమోదు తేదీలను పొడిగించాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం సమావేశమైన అధికారిక నిర్ణయం తీసుకునే వీలుంది. -
TS Inter Results 2022 : జూన్ 28వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను జూన్ 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ స్పష్టత నిచ్చింది.జూన్ 28వ తేదీన(మంగళవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌బోర్డు జూన్ 26వ తేదీ (ఆదివారం) ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొంది. ఫలితాలు విడుదల చేసిన 15 రోజుల్లోనే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహింస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ గతంలోనే ప్రకటించారు. మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 24న ముగిసిన విషయం తెల్సిందే. తెలంగాణ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. -
TS Inter Results 2022: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఇంటర్ ఫలితాలపై బోర్డు స్పష్టత ఇచ్చిం. గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెర దించింది. ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను రేపు(మంగళవారం) విడుదల చేస్తున్నట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారని ఆయన తెలిపారు. పరీక్షలు మే 23న పూర్తికాగా, పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని షెడ్యూల్ విడుదల చేసినప్పుడే ఇంటర్ బోర్డు ప్రకటించింది. చదవండి: సత్ఫలితాలిస్తున్న ‘నయీ కిరణ్’.. సాయం పొందండిలా! ఆ తర్వాత ఈ నెల 20వ తేదీ నాటికే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే మూల్యాంకనం పూర్తి చేశారు. అయితే, కొన్ని జిల్లాల్లో మార్కుల క్రోడీకరణలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు తెలిసింది. కొంతమంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంతో సమాధాన పత్రాలను అనేక సార్లు క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిసింది. చివరకు ఈ నెల 25న ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వ కాలేజీల్లో ఫలితాలు తగ్గడంపై ప్రభుత్వం కొంత ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా ప్రభుత్వ స్థాయిలో కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. ఈ కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యమైనట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. -
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం దరఖాస్తుల విక్రయం ప్రారంభించాలని పేర్కొంది. జూలై 1 నుంచి తరగతులు చేపట్టాలని సూచించింది. ఇంటర్ మొదటి దశ అడ్మిషన్ల షెడ్యూల్.. దరఖాస్తుల విక్రయం: జూన్ 20 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 20 అడ్మిషన్లు ప్రారంభం: జూన్ 27 అడ్మిషన్లు పూర్తయ్యేది: జూలై 20 ఫస్టియర్ తరగతులు ప్రారంభం: జూలై 1 చదవండి: ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న.. -
ఒకే గొడుగు కిందకు పాఠశాల విద్య
సాక్షి, అమరావతి: మునిసిపల్ స్కూళ్లకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ వ్యవహారాలను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తేనున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2,095 మునిసిపల్ స్కూళ్ల పర్యవేక్షణను పాఠశాల విద్యాశాఖకు కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, టీచర్ల సంఘాల ప్రతినిధులు గతంలో తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కోరారని చెప్పారు. ఈ స్కూళ్లు ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో ఉన్నందున విద్యా వ్యవహారాలు, పాలనాపరమైన అంశాలపై విద్యాశాఖ సూచనలను అనుసరించి ముందుకు వెళ్లడంలో సమన్వయ లోపం ఏర్పడుతోందని వారు తన దృష్టికి తెచ్చారన్నారు. ఇటీవల ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఒకే విభాగం పర్యవేక్షణలో అన్ని స్కూళ్లు ఉండడమే మంచిదని భావించి అందుకు ఆమోదం తెలిపారన్నారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నట్లు చెప్పారు. ఆస్తులన్నీ పురపాలక సంస్థల పరిధిలోనే మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన ఆస్తులన్నీ పురపాలక సంస్థల పరిధిలోనే ఉంటాయని, కేవలం అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను మాత్రమే విద్యాశాఖ పర్యవేక్షిస్తుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియెట్ బోర్డు విలీనంపై మంత్రి స్పందిస్తూ దీనిపై జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లలో ఎల్కేజీ, యూకేజీ మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫౌండేషన్ విద్యను బలోపేతం చేసే దిశగా కొత్త విధానంపై చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దీనిపై పాఠశాలల మ్యాపింగ్, తరగతుల మెర్జింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. శాటిలైట్ స్కూల్స్ (ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2), ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు), ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1–5 తరగతులు), ప్రీ హైస్కూల్స్ (3 నుంచి 7 లేదా 8వ తరగతి), హైస్కూల్స్ (3 నుంచి 10 తరగతి), హైస్కూల్ ప్లస్ (3 నుంచి 12వ తరగతి) విధానంలో ఉండేలా కసరత్తు చేస్తున్నామన్నారు. నాడు – నేడు ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే కాకుండా బోధనా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు తగినంత మంది టీచర్లను నియమించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. అక్రమాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు ఈసారి పదో తరగతి పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించినట్లు మంత్రి బొత్స చెప్పారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఘటనల్లో 80 మందికి పైగా ప్రభుత్వ, ప్రయివేటు టీచర్లు, ఇతర సిబ్బందిపై కూడా కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై న్యాయస్థానం తీర్పును అనుసరించి చర్యలుంటాయన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పరీక్షలలో అక్రమాలను ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్నారని, వ్యవస్థీకృత నేరంగా మారిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అలాంటి విద్యా సంస్థల గుర్తింపు రద్దు తప్పదన్నారు. ఇంటర్ అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించేందుకు వీలుగా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జూలై 4నుంచి పాఠశాలలు ప్రారంభించాలని, అంతకు ముందు ఎక్కడైనా స్కూళ్లు తెరిచినట్లు ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. 26 రోజుల్లోనే ఫలితాలు... పదో తరగతి ఫలితాల విడుదలను శనివారం వాయిదా వేయడంపై కొందరు నేతలు బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేయడం సరికాదని మంత్రి బొత్స హితవు పలికారు. గతంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు చాలా ఆలస్యంగా విడుదలయ్యేవని గుర్తు చేస్తూ ఈసారి అతి తక్కువ సమయంలోనే ఫలితాలు ప్రకటించామని చెప్పారు. 2015లో 39 రోజులకు, 2016లో 33 రోజులు, 2017లో 35 రోజులు, 2018లో 31 రోజులు, 2019లో 31 రోజులకు ఫలితాలు వెల్లడించారని చెప్పారు. ఈసారి 26 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని తెలిపారు. ఫలితాలకు సంబంధించి ఏ విద్యా సంస్థ కూడా తప్పుదోవ పట్టించే ప్రకటనలు జారీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. -
ఇంటర్ బోర్డుపై ఇంటెలిజెన్స్ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డ్ వ్యవహారాలపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు, పరీక్ష పేపర్లలో వరుస తప్పిదాలు, ప్రైవేటు కాలేజీలకు ఉన్నతాధికారులు కొమ్ముగాయడం, బోర్డులో సంబంధం లేని వ్యక్తుల జోక్యంపై కొంతకాలంగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా లిఖిత పూర్వక ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ వాస్తవ పరిస్థితిపై నిఘా వర్గాల నుంచి ప్రభుత్వం నివేదిక కోరినట్టు సమాచారం. మొత్తం ఇంటర్ బోర్డు అస్తవ్యస్తంగా తయారవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారనే ఫిర్యాదులు విద్యాశాఖ మంత్రి దృష్టికీ వచ్చాయి. వీటికితోడు ఈసారి ఇంటర్ ప్రశ్నపత్రాల్లో వరుసగా తప్పులు దొర్లాయి. హిందీభాషా ప్రశ్నపత్రం ముద్రించనే లేదు. ఇంగ్లిష్ నుంచి హిందీకి అనువాదం చేసే వ్యక్తులే లేరని బోర్డు చెప్పడంపైనా విమర్శలొచ్చాయి. ఇక పరీక్షల విభాగంలో కీలకమైన వ్యక్తుల నియామకం అడ్డదారిలో జరిగినట్టు కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆఖరుకు హాల్ టికెట్లు కూడా ముందుగా కాలేజీలకు ఇచ్చి, ఆ తర్వాతే విద్యార్థి లాగిన్‌లో ఓపెన్ అయ్యేలా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవ నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయం ఇంటెలిజెన్స్‌ను కోరినట్టు తెలిసింది. -
ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ రద్దు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్ 2022–23లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దుచేశారు. ఈఏపీ సెట్లో వచ్చిన మార్కులనే పూర్తిగా వందశాతం వెయిటేజీ కింద తీసుకోనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. సుధీర్‌ప్రేమ్‌కుమార్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఈఏపీసెట్‌లో ఇప్పటివరకు ఇంటర్ మార్కులకు 25 శాతం.. ఈఏపీసెట్‌లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి విద్యార్థులకు ర్యాంకులను ప్రకటించేవారు. అయితే.. కరోనా కారణంగా ఇంటర్మీడియెట్ తరగతుల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడడం, పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్థంగా మారడం తెలిసిందే. దీంతో ఇంటర్ బోర్డు ‘ఆల్‌పాస్’ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. 2021–22 ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుత సెకండియర్ ఇంటర్ విద్యార్థులకు గతేడాది పరీక్షల నిర్వహణలేక వారిని ఆల్‌పాస్‌గా ప్రకటించింది. మార్కుల బెటర్మెంట్ కోసం వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం (2022–23)లో కూడా ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలా? వద్దా అనే అంశంపై ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిని పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ ఈసారి కూడా ఈఏపీసెట్‌లో సెట్లో వచ్చిన మార్కులకే వందశాతం వెయిటేజీ ఇచ్చి వాటి మెరిట్ ఆధారంగా ర్యాంకులు ప్రకటించాలని ఉన్నత విద్యామండలికి సూచించింది. దీంతో మండలి తాజాగా ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 2.60 లక్షల మందికి పైగా విద్యార్థుల దరఖాస్తు ఇక ఏపీ ఈఏపీసెట్‌కు ఉన్నత విద్యామండలి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 10వ తేదీతో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 2.60 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,88,417 మంది, బైపీసీ స్ట్రీమ్‌కు 86వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఆలస్య రుసుముతో ఈ సంఖ్య మరికొంత పెరగనుంది. జూలై 4 నుంచి 8 వరకు పది సెషన్లలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు.. అలాగే, జూలై 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. -
బోర్డు మెటీరియల్ భేష్! కొన్ని సబ్జెక్టుల్లో 100 శాతం ప్రశ్నలు అక్కడి నుంచే..
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు జరిగిన ఇంటర్ పరీక్షల్లో బోర్డు ఇచ్చిన స్టడీ మెటీరియల్ విశ్వసనీయతను చాటుకుంది. ఇందులోంచే ఎక్కువ ప్రశ్నలు రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కొన్ని సబ్జెక్టుల్లో 100 శాతం ప్రశ్నలు బోర్డు మెటీరియల్ నుంచే రావడం విశేషం. ఈసారి చాయిస్ ఎక్కువ ఇవ్వడంతో సమాధానం తెలియని ప్రశ్నలను చాయిస్ కింద వదిలేసే అవకాశం ఉంది. అయితే చాయిస్లోని ప్రశ్నలు కూడా మెటీరియల్ నుంచే ఉంటున్నాయని విద్యార్థులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వల్ల ఆలస్యంగా ఇంటర్ తరగతులు మొదలయ్యాయి. దీంతో మారుమూల గ్రామాల విద్యార్థులు సరిగా పాఠాలు వినలేకపోయారు. అయితే వారిలో చాలా మంది బోర్డు మెటీరియల్‌ను అనుసరించడంతో పరీక్షలను తేలికగా రాయగలిగారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ► ఇంటర్ ఫస్టియర్ బోటనీ పేపర్లో సెక్షన్–ఏ నుంచి ఇచ్చిన 15 ప్రశ్నలు, సెక్షన్–బీలోని 14 ప్రశ్నలకు, సెక్షన్–సీలో 4 ప్రశ్నలూ మెటీరియల్లోనివే కావడం విశేషం. ► ఫస్టియర్ పొలిటికల్ సైన్స్ పేపర్లో సెక్షన్–ఏలో ఇచ్చిన ఏడు ప్రశ్నలూ బేసిక్ మెటీరియల్ నుంచే వచ్చాయి. సెక్షన్–బీలో 18 ప్రశ్నలకు 14, సెక్షన్–సీలో 25 ప్రశ్నలకు 21 ప్రశ్నలు బోర్డు మెటీరియల్ నుంచే వచ్చాయి. ► గణితం పేపర్లో సెక్షన్–ఏలో 15 ప్రశ్నలకు 11, సెక్షన్–బీలో 12 ప్రశ్నలకు 6, సెక్షన్–సీలో 10కి ఆరు ప్రశ్నలు మెటీరియల్లోనివే. ► ఇంటర్ సెకండియర్ బోటనీ పేపర్ సెక్షన్–ఏలో ఇచ్చిన 15కు 15 ప్రశ్నలు, సెక్షన్–బీలోని 14కు 14 ప్రశ్నలు, సెక్షన్–సీలో ఇచ్చిన 4 ప్రశ్నలూ మెటీరియల్ నుంచే రావడం విశేషం. ► పొలిటికల్ సైన్స్ పేపర్లోని సెక్షన్–ఏలో ఏడుకు ఏడు, సెక్షన్–బీలో 18కి 14, సెక్షన్–సీలో 25 ప్రశ్నలకు 19 ఇందులోంచే అడిగారు. ► సెకండియర్ గణితంలో సెక్షన్–ఏలో 15ప్రశ్నల కు 13, సెక్షన్–బీలో 12కు 6, సెక్షన్–సీలో పదికి 9 ప్రశ్నలు బేసిక్ మెటీరియల్ నుంచే వచ్చాయి. భయం పోయింది.. కరోనా వల్ల క్లాసులు రెగ్యులర్‌గా జరగకపోవడంతో పరీక్షలంటే కొంత భయం ఉండేది. నెల నుంచి బోర్డు స్టడీ మెటీరియల్ చదివాను. బోటనీ పేపర్లో ప్రశ్నలన్నీ మెటీరియల్ నుంచే వచ్చాయి. అనుకున్నదానికన్నా ఎక్కువ మార్కులు వస్తాయనే నమ్మకం కలిగింది. – వైద్యం అమర్త్య శాండిల్య, (ఇంటర్ సెకండియర్ విద్యార్థి, హైదరాబాద్) మెటీరియల్‌పై దృష్టి పెట్టండి.. ప్రతి విద్యార్థికీ ఇది కీలక సమయం. ప్రశ్నలన్నీ మెటీరియల్ నుంచే వస్తున్నాయి. మున్ముందు రాసే పేపర్లు కూడా ఇదే రీతిలో ఉండే వీలుంది. ఎక్కువ సమయం బోర్డ్ స్టడీ మెటీరియల్‌పై దృష్టి పెట్టండి. – ఉడిత్యాల రమణారావు (రీడర్, ఇంటర్ బోర్డ్) నూరు శాతం ఉపయోగపడాలనే.. కరోనా వల్ల జరిగిన విద్యా సంవత్సర నష్టం విద్యార్థుల పై పడకూడదనే బేసిక్ స్టడీ మెటీరియల్ అందించాం. ఇది 100% విద్యార్థులకు ఉపయోగపడాలన్న కోణంలోనే రూపొందించాం. విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు మెటీరియల్ దోహదపడాలన్నదే మా లక్ష్యం. మున్ముందు కూడా ఇదే రీతిలో స్టడీ మెటీరియల్ మేలు చేస్తుంది. – సయ్యద్ ఒమర్ జలీల్ (ఇంటర్ బోర్డ్ కార్యదర్శి) 75కు 70 మార్కులు గ్యారంటీ.. నెల నుంచి ఇంటర్ బోర్డు స్టడీ మెటీరియల్ చదివాను. ఎక్కువ ప్రశ్నలు అందులోంచే రావడంతో మ్యాథమెటిక్స్‌లో 75కు 70 మార్కులు వస్తాయనే నమ్మకం ఉంది. – టి. నిఖిత, ఇంటర్ సెకండియర్ విద్యార్థిని (వంగూర్, నాగర్‌కర్నూల్) -
ఈసారి పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో తప్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సంస్కృతం, హిందీ పేపర్లలో తప్పులురాగా.. గురువారం పొలిటికల్ సైన్స్, ఉర్దూ మీడియం మ్యాథ్స్ ప్రశ్నపత్రాల్లో పొరపాట్లతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరితో పరీక్షల విధానం ప్రహసనంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నే మారిపోయింది రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరి గాయి. సాధారణంగా విద్యార్థులు ఏ మీడియంలో పరీక్ష రాస్తే ఆ భాషలో ముద్రించిన ప్రశ్నపత్రాలను ఇస్తారు. ఇందులో భాష మారుతుందే తప్ప ప్రశ్నల్లో మార్పు ఉండదు. గురువారం ఇంగ్లిష్ మీడి యం పొలిటికల్ సైన్స్ పేపర్లో ఒక ప్రశ్న ఉంటే.. తెలుగు మీడియం పేపర్లో వేరే ప్రశ్న ఇచ్చారు. ప్రశ్నపత్రం సెక్షన్ ‘బి’లో ఐదు మార్కులకు 8వ ప్రశ్నగా "Point out the main provisi ons of the Independence of India Act 1947' అని ప్రశ్న ఇచ్చారు. ‘భారత స్వాతంత్య్ర చట్టం–1947లోని ముఖ్యాంశాలు రాయండి’అని దానికి అర్థం. కానీ తెలుగులో ఇచ్చిన పొలిటికల్ సైన్స్ పేపర్లో ‘భారత స్వాతంత్య పోరాటంలో హోమ్‌రూల్ ఉద్యమాన్ని వర్ణించండి’అనే ప్రశ్న ఇచ్చారు. ఇలా వేర్వేరుగా రావడంతో.. ఏ ప్రశ్నను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది, దేనికి మార్కులు వేస్తుందని విద్యార్థులు అయోమయంలో పడ్డారు. కొందరు ఈ ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలేశారు. మరికొందరు సమాధానం రాసినా మార్కులు రావేమోనని భయపడటం పరీక్ష కేంద్రాల వద్ద కన్పించింది. ఉర్దూలోనూ ఇదే తంతు గణితం పేపర్‌ను కొందరు విద్యార్థులు ఉర్దూ మీడియంలో రాశారు. అందులో ఇచ్చిన ఓ ప్రశ్న అర్థం లేకుండా ఉండటంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఒక లెక్కలో" FARJI'’అని ఇచ్చారు. అదేంటో ఎవరికీ అర్థం కాలేదు. విద్యార్థులు ఇదేమిటని ప్రశ్నించడంతో.. ఇన్విజిలేటర్లు, పరీక్ష కేంద్రం సిబ్బంది అప్పటికప్పుడు ఆ పదం అర్థమేంటో తెలుసుకునేందుకు హైరానా పడ్డారు. ఉర్దూ భాషా నిపుణులను సంప్రదించగా.. ఆ పదం " ZARBI' అని, లెక్కలో హెచ్చింపు అని అర్థమని చెప్పారు. ఇది పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు చేరేసరికి సమయం వృధా అయింది. వరుస తప్పిదాలు.. ఎందుకిలా? ఇంటర్‌బోర్డు నిపుణుల చేత అత్యంత గోప్యంగా పరీక్ష పత్రాలను తయారు చేయిస్తుంది. మొత్తం 12 సెట్లు రూపొందిస్తారు. అందులోంచి మూడింటిని ఎంపిక చేసి.. పరీక్ష కేంద్రాలకు పంపుతారు. పరీక్షకు సరిగ్గా అరగంట ముందు ఈ మూడు సెట్లలో ఒక సెట్‌ను ఖరారు చేస్తారు. అయితే ఈ సంవత్సరం ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో కొందరు అనుకూలమైన వ్యక్తులకు బాధ్యత అప్పజెప్పారని, వారికి అనుభవం లేకపోవడమే తప్పిదాలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు కుమ్మక్కైనట్టు విమర్శలొస్తున్నాయి. ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలోనే కార్పొరేట్ కాలేజీలతో మిలాఖత్ అయ్యారా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. హిందీ ట్రాన్స్‌లేటర్లు ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వకపోవడం వెనుక కొందరు పైరవీకారుల పాత్ర ఉందనే విమర్శలున్నాయి. ఏదేమైనా పరీక్షల విభాగంపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ కూడా విన్పిస్తోంది. వేర్వేరుగా మూల్యాంకనం పొలిటికల్ సైన్స్ పేపర్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో వేర్వేరుగా ప్రశ్నలు ఇవ్వడాన్ని గుర్తిం చాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేర్వేరుగా మూల్యాంకనం చేపడతాం. రెండు భాషల్లోనూ రెండు ప్రశ్నలకు మార్కులు వేస్తాం. – సయ్యద్ ఒమర్ జలీల్, బోర్డు కార్యదర్శి ఇలాగైతే విద్యార్థుల్లో కంగారే.. లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నప్పుడు ఇలాంటి తప్పిదాలు రాకుండా చూడాలి. పరీక్ష హాల్లో విద్యార్థులు ఇలాంటి గందరగోళానికి లోనైతే.. సక్రమంగా పరీక్ష రాసే అవకాశం ఉండదు. ఆ రోజు పరీక్షపై ప్రభావం చూపుతుంది. – పరశురాములు, జూనియర్ లెక్చరర్ -
గిట్లయితే ఎట్లా? చేతి రాతతో ప్రశ్నపత్రం.. అర్థంకాక తికమక
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల కోదాడలో ఫస్టియర్ ఇంగ్లిష్ పేపర్‌కు బదులు కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు రాగా, తాజాగా హిందీ మీడియం విద్యార్థులకు బోర్డ్ చుక్కలు చూపింది. బుధవారం ఫస్టియర్ పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. కొంతమంది విద్యార్థులు హిందీ మీడియంలో పరీక్ష రాస్తున్నారు. అయితే, ఈ ప్రశ్నపత్రాన్ని బోర్డ్ హిందీ భాషలో ప్రింట్ చేయించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఇంగ్లిష్ మాధ్యమంలో పరీక్ష కేంద్రానికి పంపే ప్రశ్నపత్రాన్నే హిందీలో తర్జుమా చేసి, విద్యార్థులకు ఇవ్వాలని బోర్డ్ ఆదేశించింది. అనువాదకులను పరీక్ష కేంద్రం వాళ్లే ఏర్పాటు చేసుకోవాలని హుకుం జారీ చేసింది. హైదరాబాద్‌లోని అంబేడ్కర్ కాలేజీ, నిజామాబాద్‌లోని మరో కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి ముందు అనువాదకులను పిలిపించి వాళ్లతో ప్రశ్నపత్రం తర్జుమా చేయించి విద్యార్థులకు ఇచ్చారు. దీంతో పరీక్ష ఆలస్యమైంది. ఇదిలాఉంటే, అనువాదకుల చేతిరాత అర్థం కాక, విద్యార్థులు తిప్పలు పడ్డారు. ఆ రాతను అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందని అంబేడ్కర్ కాలేజీలో పరీక్ష రాసిన విద్యార్థులు చెప్పారు. అర్థం కాని విషయాలను అడిగే అవకాశం కూడా చిక్కలేదన్నారు. ఈ కారణంగా పొలిటికల్ సైన్స్ పరీక్ష సరిగా రాయలేకపోయామని వాపోయారు. చేతితో రాసిన ప్రశ్నపత్రం ఎందుకీ పరిస్థితి? గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఎదురవ్వలేదని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. బోర్డ్ పరిధిలో హిందీ అనువాదకులు లేరని, ఉన్నవాళ్లంతా రిటైరయ్యారని, అందుకే కాలేజీ వాళ్లనే ఏర్పాటు చేసుకోమన్నట్టు చెబుతున్నారు. అనువాదం కోసం బయట వ్యక్తులను పిలిస్తే, పేపర్ లీక్ చేసే ప్రమాదం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకుంటున్నారు. దీన్ని బోర్డ్‌లోని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కాలేజీల్లో హిందీ మీడియంలో బోధన సాగుతున్నప్పుడు అధ్యాపకులు ఎందుకు ఉండరని ప్రశ్నిస్తున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. 8.30 గంటలకు ప్రశ్నపత్రం బండిల్ విప్పుతారు. అంటే అరగంటలో అనువాదకుడు ఇంగ్లిష్ నుంచి హిందీలోకి తర్జుమా చేయాలి. నెలల తరబడి ప్రింట్ చేస్తున్న పేపర్లలోనే తప్పులు వస్తుంటే, అరగంటలో ట్రాన్స్‌లేట్ చేస్తే వచ్చే తప్పుల మాట ఏంటని వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హిందీ మాధ్యమంలో బోధించే అధ్యాపకులతో ముందే అనువాదం చేయించి ప్రశ్నపత్రం ప్రింట్ చేయించి ఉండాల్సిందని అంటున్నారు. వాస్తవ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా బోర్డ్ వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యమా: మాచర్ల రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్) హిందీ మాధ్యమంలో ప్రశ్నపత్రాలు ప్రింట్ చేయించకుండా, విద్యార్థులను గందరగోళంలో పడేయడం ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యానికి నిదర్శనం. పరీక్షల విభాగం కొంతమంది పైరవీకారుల చేతుల్లో ఇరుక్కుపోవడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. బోర్డ్ ప్రయత్నం చేస్తే హిందీ అనువాదకులు ఎందుకు దొరకరు. అప్పటికప్పుడు తర్జుమా చేయించడం వల్ల తప్పులు దొర్లితే దానికి ఎవరు బాధ్యత వహించాలి. లెక్చరర్లు లేకనే : ఇంటర్ బోర్డ్ లెక్చరర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఫస్టియర్ హిందీ మీడియం విద్యార్థులకు ప్రశ్నప్రతాలను ప్రింట్ చేయించడం సాధ్యం కాలేదని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం రాత్రి వివరణ ఇచ్చారు. గతంలో అనువాదం కోసం బోర్డ్ హిందీ మాధ్యమానికి చెందిన రిటైర్డ్ రెగ్యులర్ లెక్చరర్ల సేవలను పొందేదని, కోవిడ్ కారణంగా పాత లెక్చరర్లు అందుబాటులో లేరని, గోప్యమైన విషయం కాబట్టి ఈ పనిని వేరే వాళ్లకు అప్పగించలేమని చెప్పారు. హిందీ మాధ్యమంలో పరీక్ష రాసే విద్యార్థులు ఫస్టియర్‌లో 32 మంది, సెకండియర్‌లో 24 మందే ఉన్నారన్నారు. అందువల్లే అందుబాటులో ఉన్న అనువాదకుల సేవలు వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్స్‌కు చెప్పినట్టు తెలిపారు. -
ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్దేశిత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. ఆయా జిల్లాల ఎస్పీలు ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నో ఫోన్ జోన్లుగా పరీక్ష కేంద్రాలు సెల్ఫోన్ల ద్వారా ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి షేర్ చేయకుండా అన్ని పరీక్ష కేంద్రాలను అధికారులు ‘నో ఫోన్ జోన్లు’గా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఏ ఒక్కరూ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. ప్రశ్నపత్రాలను ఆయా పోలీసుస్టేషన్ల నుంచి తీసుకొనే సమయంలో ఆయా విభాగాల అధికారులు, ఇతర సిబ్బంది వారి సెల్ఫోన్లను పోలీసుస్టేషన్లలో డిపాజిట్ చేయాలని బోర్డు ఆదేశించింది. అలాగే పరీక్షల విధుల్లో ఉండే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కూడా తమ సెల్ఫోన్లను చీఫ్ సూపరింటెండెంట్ల వద్ద డిపాజిట్ చేయాలి. పోలీస్స్టేషన్ల నుంచి తెచ్చిన ప్రశ్నపత్రాల బండిళ్లను సీసీ కెమెరాల ఎదుటనే విప్పి వాటిని విద్యార్థులకు అందిస్తారు. అలాగే సమాధాన పత్రాలను బండిళ్లుగా కట్టే పనిని కూడా సీసీ కెమెరాల ముందే చేయాలి. విధుల్లో ఉండేవారికి ఐడీ తప్పనిసరి.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు శుక్రవారం, సెకండియర్ పరీక్షలు శనివారం ప్రారంభమవుతాయి. పరీక్ష కేంద్రాల్లోకి మీడియాకు కూడా అనుమతి లేదు. పరీక్షల విధుల్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐడీ కార్డులను కలిగి ఉండాలి. కొన్ని కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థులు నేరుగా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ప్రతి జిల్లాలో విద్యార్థులు, పరీక్ష కేంద్రాల సంఖ్యను అనుసరించి తగినన్ని ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సదుపాయాన్ని కల్పిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు పదో తరగతి పరీక్షల సమయంలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమాలకు తెగబడటం, టీడీపీకి చెందినవారు కావాలనే కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి లీక్ అంటూ ప్రచారాలు సాగించిన నేపథ్యంలో అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా చర్యలు చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నారు. -
ఏపీలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో ఏడాది పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. జేఈఈ పరీక్షల షెడ్యూల్ మారడంతో ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు మార్పు చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని బోర్డు అధికారులు ప్రకటించారు. -
ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. కరోనా కారణంగా సెలవులు పొడిగించడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని గతంలో పేర్కొంది. తాజాగా ఈ గడువును ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడిగించారు. ప్రథమ సంవత్సరం ఆర్ట్స్, అండ్ సైన్స్ గ్రూపులకు, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ గ్రూపులకు రూ.490, ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూపులకు రూ.690 ఫీజును నిర్ణయించారు. ఒకేషనల్ కోర్సులకు ఫస్టియర్‌కు రూ.690, సెకండియర్‌కు రూ.840 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ఇంటర్ పరీక్షల ఫీజు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను ఇంటర్ బోర్డ్ గురువారం ప్రకటించింది. ఫస్టియర్ అన్ని గ్రూపులకు, సెకండియర్ ఆర్ట్స్ గ్రూపుల విద్యార్థులు రూ.490, సెకండియర్ సైన్స్ గ్రూపు విద్యార్థులు (ప్రాక్టికల్స్ కలిపి) రూ.690 చెల్లించాలని పేర్కొంది. ఒకేషనల్ సైన్స్ గ్రూపు విద్యార్థులు రూ.690, బ్రిడ్జి కోర్సు సహా ఒకేషనల్ రాసేవారు రూ.840, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులు రూ.690, బ్రిడ్జి కోర్సు అయితే రూ.840 చెల్లించాలని పేర్కొంది. ప్రైవేటు విద్యార్థులు ప్రతి సంవత్సరానికి రూ.490 చెల్లించాలని తెలిపింది. ఫస్టియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే అసలు ఫీజు రూ.490తో పాటు, ప్రతి సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని తెలిపింది. -
విద్యార్థుల ఆందోళనబాట.. బోర్డు దోబూచులాట
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డు దోబూచులాట రానురానూ వివాదాస్పదమవుతోంది. ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థుల పట్ల స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తులను ఎప్పుడు పరిశీలిస్తారు, నిర్ణయం ఎప్పుడు వెల్లడిస్తారో కూడా స్పష్టతనివ్వక పోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రెండో సంవత్సరానికి సమర్థతను బేరీజు వేసుకోవ డానికే పరీక్షలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేయ డంతో ఫెయిలైన విద్యార్థుల విషయంలో బోర్డు నిర్ణయమేంటని అయోమయం పెరుగుతోంది. అందరినీ పాస్ చేయాలని తాము ప్రభుత్వానికి సిఫార్సు చేశామని, గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని బోర్డు అధికారులు చెబుతున్నారు. నిర్ణయం తీసుకోవడం జాప్యమవు తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే నలుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందరినీ పాస్ చేయాలని రోజూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటికే 39 వేల రీ వెరిఫికేషన్ దరఖాస్తులు ఇటీవలి ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో దాదాపు 2 లక్షల మందికిపైగా ఫెయిల్ అయ్యారు. వీరిలో 39,039 మంది రీ వెరిఫికేషన్ కోసం.. 4,200 మంది రీ కౌంటింగ్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. రీ వెరిఫికేషన్ దరఖాస్తుదారులకు వారి జవాబు పత్రం ప్రతిని ఇంటికి పంపుతారు. రీ కౌంటింగ్ అయితే మార్కులను మరోసారి లెక్కి స్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా అధ్యాప కులను నియమించాలి. కానీ ఇంకా ఈ దిశగా పని మొదలుకాలేదు. అందరినీ పాస్ చేయాలనే డిమాండ్ వస్తుండటంతోనే జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఫస్టియర్‌పై నిర్ణయం రాకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దీన్ని తీవ్రం చేసేందుకూ వ్యూహాలు రచిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో మారుమూల ప్రాంతాలకు ఆన్లైన్ విద్య అందలేదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదవర్గాలకు చెందినవారే ఎక్కువ మంది ఫెయిలయ్యారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. దీంతో అలందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బోర్డు కార్యాలయం వద్ద జగ్గారెడ్డి ధర్నా ఇంటర్లో ఫెయిలైన 2.36 లక్షల మంది విద్యార్థులను తక్షణమే పాస్ చేయాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట 2 గంటలు ధర్నా చేశారు. విద్యార్థులు చనిపోతుంటే సర్కారు మొద్దు నిద్రపోతోందని విమర్శించారు. ఆన్లైన్ క్లాసులే సరిగా జరగనప్పుడు, పేదలకు ఆ విద్య చేరనప్పుడు పరీక్షలెలా రాస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ధర్నా నేపథ్యంలో బోర్డు వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. -
మూడవ రోజు ముమ్మరంగా..
నాంపల్లి/ ఉస్మానియా యూనివర్సిటీ: ఇంటర్ పరీక్షా ఫలితాల రగడ కొనసాగుతోంది. మూడవ రోజు కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఫెయిలై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో ఎంజే రోడ్డు పూర్తిగా స్తంభించిపోయింది. ఉదయం నుంచే బోర్డు కార్యాలయం గేట్లు మూసివేయడంతో కార్యాలయం ఎదుటే బైఠాయించి వారు నిరసనలు వ్యక్తం చేశారు. దీనికి తోడు సోమవారం ఎన్ఎస్యూఐ కార్యకర్తలు జాతీయ క్యాంపెయిన్ శిక్షా బచావో–దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఇంటర్మీడియట్ బోర్డుకు వందలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థులను, ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు దొరికినవారిని దొరికినట్టుగా వ్యాన్‌లో ఎక్కించి గోషామహల్ స్టేడియానికి తరలించారు. 90 మంది ఆందోళనకారులను బేగంబజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులందరినీ పాస్ చేయాలని, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాహనాల అద్దాలు ధ్వంసం.. కాగా బోర్డు కార్యాలయానికి తరలివెళ్లే క్రమంలో కొందరు యువకులు ట్రాఫిక్‌లో రెచ్చిపోయారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాల అద్దాలను పగులగొట్టారు. ఆందోళనకారుల చేతిలో రెండు ఆటోలు, రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు బంద్: ఏబీవీపీ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంటర్ బోర్డు వైఖరిని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ కాలేజీలను బంద్ చేయనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. -
అంతా సక్రమంగానే చేశాం
సాక్షి, హైదరాబాద్: ఫస్టియర్ పరీక్ష ఫలితాలు గందరగోళం రేపుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ శుక్రవారం రాత్రి స్పందించింది. విద్యార్థులను అన్ని కోణాల్లోనూ సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించామని బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లాక్డౌన్ విధించేవరకూ కొంతకాలంపాటు ప్రత్యక్ష బోధన సాగిందని గుర్తు చేశారు. ఆ తరువాత విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను 70 శాతానికి కుదించామన్నారు. అదనంగా బేసిక్ మెటీరియల్‌ను కూడా బోర్డ్ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఎక్కువ ఐచ్ఛికాలతో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షలను తేలిక చేశామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ ఫీజును తగ్గిస్తున్నాం... ఫలితాలపై సందేహాలుంటే విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు రీవెరిఫికేషన్ ఫీజు కూడా 50 శాతం తగ్గిస్తున్నామని జలీల్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జవాబు పత్రాల ప్రతిని పంపుతామన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి అసంతృప్తికి గురవ్వొద్దని, బాగా ప్రిపేరై వచ్చే ఏప్రిల్‌లో మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. -
ఇంటర్ ప్రవేశాల గడువు 30 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి గడువును మరోసారి పెంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు ఫస్టియర్‌లో ప్రవేశం పొందవచ్చని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు, సంక్షేమ కాలేజీలకు ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 1,500కు పైగా ఇంటర్ కాలేజీలున్నాయి. ఇందులో 300 ప్రైవేటు కాలేజీలకు ఇప్పటికీ ఇంటర్ బోర్డు గుర్తింపు లభించలేదు. బహుళ అంతస్తుల భవనాల్లో (మిక్స్డ్ ఆక్యుపెన్సీ) నడుస్తున్న ఈ కాలేజీలకు ఫైర్ సేఫ్టీ అనుమతి రాలేదు. కాగా, కాలేజీల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఇటీవల వాటికి అనుమతి ఇచ్చింది. అయితే ఇంటర్ బోర్డు పరిధిలో ఈ అంశం పరిశీలన దశలోనే ఉంది. దీంతో ఈ కాలేజీల్లో చేరిన లక్ష మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. కాలేజీలకు అనుమతి లభించకపోవడం, ఇంటర్ ప్రవేశాల గడువు ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు ప్రవేశాల గడువు పొడిగించింది. ఈలోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే వీలుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. -
ఇంటర్ సిలబస్ 70 శాతానికి కుదింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం వెలువరించింది. కరోనా నేపథ్యంలో ఫస్టియర్ సిలబస్‌ను గతేడాది 70 శాతం అమలు చేశారు. దీనికి కొనసాగింపు పాఠ్యాంశాలు రెండో సంవత్సరంలో ఇంతకాలం బోధించడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరో వైపు ఈ ఏడాది కూడా ప్రత్యక్ష బోధన ఆలస్యంగా మొదలైంది. ఆన్లైన్ క్లాసులు జరిగినా కొంతమంది విద్యార్థులు దీన్ని అందుకోలేకపోయారు. మారుమూల గ్రామాల్లో సరైన ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, మొబైల్ సిగ్నల్స్ అందకపోవడం వల్ల బోధన అరకొరగా జరిగిందని విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కూడా ఇదే తరహాలో సిలబస్ తగ్గింపుపై ప్రతిపాదనలు పంపింది. దీనిపై ఇంటర్ బోర్డ్ సానుకూలంగా స్పందించి, ప్రభుత్వానికి తగ్గింపుపై నివేదిక పంపింది. ఇటీవల ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో 30 శాతం సిలబస్ తగ్గింపు నిర్ణయాన్ని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. తగ్గించిన సిలబస్, నమూనా ప్రశ్నపత్రాలను విద్యార్థుల కోసం బోర్డ్ వెబ్సైట్లో అందుబాటుల ఉంచినట్టు బోర్డ్ తెలిపింది. -
అన్ని ప్రశ్నలూ అందులోంచే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేథమెటిక్స్, బొటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్–1 తేలికగా రాయగలిగామని చెబుతున్నారు. తాజా ప్రశ్నపత్రాలపై ఇంటర్ బోర్డ్ ఉన్నతాధికారులు విశ్లేషణ చేశారు. మొత్తంగా 98 శాతం ఇంటర్ బోర్డు విడుదల చేసిన ప్రాథమిక అభ్యసన దీపిక నుంచే ప్రశ్నలు వచ్చాయని అధికారులు చెప్పారు. గణితంలో 12, 13, 20 ప్రశ్నలు మాత్రమే బేసిక్ లెర్నింగ్ మెటీరియల్లోంచి రాలేదని... అయితే, వాటిని చాయస్ కింద వదిలేసినా వంద శాతం స్కోర్ చేయవచ్చని బోర్డు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని? సివిక్స్ (పొలిటికల్ సైన్స్): సెక్షన్ ఏలో 10 మార్కుల ప్రశ్నలు ఆరు ఇచ్చి మూడు రాయమన్నారు. ఇందు లో నాలుగు ప్రశ్నలు మెటీరియల్ నుంచి వచ్చాయి. సెక్షన్ బిలో ఐదు మార్కుల ప్రశ్నలు 16 ఇచ్చారు. ఇందులో 8 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. 13 ప్రశ్నలు మెటీరియల్లోంచే వచ్చాయి. సెక్షన్ సిలో రెండు మార్కుల ప్రశ్నలు 25 ఇచ్చి, 15 ప్రశ్నలు సమాధానాలు ఇవ్వమన్నారు. ఇందులో 5 మినహా అన్నీ కవర్ అయ్యాయి. గణితం: సెక్షన్ ఎలో రెండు మార్కుల ప్రశ్నలు 10 ఇంటికి పది మెటీరియలోంచే వచ్చాయి. సెక్షన్ బిలో 4 మార్కుల ప్రశ్నలు పదింటికి ఐదు రాయాలి. రెండు మినహా అన్నీ మెటీరియల్లోంచే వచ్చాయి. సెక్షన్ సిలో ఏడు మార్కుల ప్రశ్నలు తొమ్మిది ఇచ్చారు. ఇందులో అన్నీ కవర్ అయ్యాయి. బాటనీలో అన్ని సెక్షన్లలోనూ అన్ని ప్రశ్నలూ మెటీరియల్ పరిధిలోంచే వచ్చాయి. సమయం ఎంతో ఆదా : సయ్యద్ ఒమర్ జలీల్ (ఇంటర్ విద్య కమిషనర్) విద్యార్థులు అతి తక్కువ సమయంలోనే మంచి మార్కులు సాధించడానికి బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగపడుతోంది. ఇందులో మొత్తం ప్రశ్నలను వాటి సమాధానాలను క్షుణ్ణంగా చదివితే ఉత్తమ ఫలితాలు ఖాయం. ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు విజయం సాధించడానికి దోహదపడుతోంది. ఇది కరదీపికే : ఉడిత్యాల రమణారావు (రీడర్ విద్యా పరిశోధనా విభాగం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్) ప్రాథమిక అభ్యసన దీపిక విద్యార్థులకు కరదీపికగా ఉపయోగపడుతోంది. వీటిని అనుసరించిన ప్రతీ ఒక్కరూ మంచి స్కోర్ చేయవచ్చని సబ్జెక్టు పరీక్షలు రుజువు చేశాయి. బేసిక్ మెటీరియల్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకుని అనుసరిస్తే రాబోయే పరీక్షల్లో విజయం తథ్యం. -
గంట ముందే కేంద్రానికి రావాలి
సాక్షి, హైదరాబాద్: రేపటి నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. పరీక్షల మూల్యాంకనం నవంబర్ మొదటి వారంలో మొదలువుతుందని, వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. బోర్డు జాయింట్ సెక్రటరీలు శ్రీనివాసరావు, నాయక్, ఓఎస్డీ సుశీల్‌తో కలసి జలీల్ శుక్రవారం మీడియాకు పరీక్షల వివరాలు తెలియజేశారు. ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలు లేకుండా ప్రమోట్ అయ్యారని గుర్తు చేశారు. వరుసగా రెండో ఏడాది పరీక్షలు నిర్వహించలేకపోతే వారి భవిష్యత్‌కు ఇబ్బంది ఉంటుందనే ఫస్టియర్ పరీక్షలు పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నామన్నారు. 70 శాతం సిలబస్‌లోంచే ప్రశ్నాపత్రం రూపొందించామని, మునుపెన్నడూ లేని విధంగా 40 శాతం ఐచ్చిక ప్రశ్నలిస్తున్నామని తెలిపారు. తాము విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌ను అనుసరిస్తే పరీక్షల్లో విజయం సాధించడం తేలికేనని జలీల్ చెప్పారు. వ్యాక్సినేషన్ పూర్తయిన 25 వేల మంది ఇన్విజిలేటర్లను గుర్తించామని వెల్లడించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని, థర్మల్ స్క్రీనింగ్ తర్వాత అస్వస్థతగా ఉన్న విద్యార్థులను ఇందులో ఉంచుతామని చెప్పారు. పరీక్ష రాయగలిగితే ఐసోలేషన్‌లోనే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో పరీక్షకు వెళ్లవచ్చన్నారు. ఆయన చెప్పిన ముఖ్యాంశాలు... ►పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు, వి ద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించేందు కు ప్రతీ జిల్లాలోనూ కలెక్టర్ నేతృత్వంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎస్పీ, డీఐఈవో, సీనియర్ ప్రిన్సిపల్, జేఎల్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ►విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీతో సమన్వయం చేసుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మెడికల్, విద్యుత్, పోస్టల్ సిబ్బంది ప్రత్యేక సేవలందిస్తారు. పరీక్ష కేంద్రాలు, ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ►హాల్టికెట్లలో తప్పులుంటే నోడల్ అధికారిని, ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సాయం పొందొచ్చు. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రానికి అనుమతించరు. 8.45 గంటలకు ఓఎంఆర్ అందజేస్తారు. 9 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. కోవిడ్ జాగ్రత్తలు ►పరీక్ష విధుల్లో పాల్గొనే ఇన్విజిలేట ర్లు, అధికారులు, చీఫ్ సూపరింటెం డెంట్ సహా అందరినీ వ్యాక్సినేషన్ పూర్తయిన వారినే ఎంపిక చేశారు. పరీక్ష కేంద్రాన్ని శానిటైజేషన్ చేస్తారు. ప్రతీ విద్యార్థి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్‌లు తెచ్చుకోని వారికి పరీక్ష కేంద్రాల్లో అందజేస్తారు. అంతేతప్ప ఆ కారణంతో పరీక్ష రాసేందుకు నిరాకరించరు. ►పరీక్షలు జరిగే వరకూ కేంద్రంలో స్టా ఫ్ నర్సు ఉంటారు. ఒక్కో పరీక్ష కేం ద్రంలో 250కి మించి విద్యార్థులు లే కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సామాజిక దూరాన్ని దృష్టిలో ఉం చుకుని బెంచ్‌కు ఒకరు లేదా ఇద్దరిని కూర్చోబెడతారు. విద్యార్థులు 50 ఎంఎల్ శానిటైజర్లు తెచ్చుకోవచ్చు. -
Huzurabad bypoll: ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రీషెడ్యూల్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. 29,30 తేదీన జరగాల్సిన పరీక్షలను ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అక్టోబర్ 29న జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 31.. 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్ 1న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.(చదవండి: బెట్టు వీడని ఏజెంట్లు.. మెట్టు దిగని సర్కారు) ఈ నెల 25న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, 26న ఇంగ్లీష్ పేపర్-1, 27న మాథ్స్ పేపర్-1ఏ, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, 28న మ్యాథ్స్ పేపర్-1బీ, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, 31న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, నవంబర్ 1న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, నవంబర్ 2న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. చదవండి: బాలికలకు చాక్లెట్ల ఆశ చూసి.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం.. -
TS: ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అక్టోబర్ 20 వరకూ గడువును పెంచారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సహా అన్ని జూనియర్ కాలేజీలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. -
25 నుంచి తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల తేదీని శుక్రవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ రెండు వరకు పరీక్షలు నిర్వహిస్తామని టైంటేబుల్ విడుదల చేసింది. గతంలో ప్రకటించిన ప్రకారమే 30 శాతం సిలబస్‌ను తప్పించి, 70 శాతం సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. విద్యార్థులందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. కాగా, కోవిడ్ తీవ్రత తగ్గిందని వైద్య, ఆరోగ్య శాఖ ఆగస్టులో తెలపడంతో ఈ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నెలరోజుల క్రితమే తెలిపారు. విద్యార్థులు రెండో ఏడాది సిలబస్‌తో పాటు, వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఫస్టియర్ పరీక్షలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిని పక్కన పెట్టి ఇంటర్ బోర్డు పరీక్షల తేదీలను వెల్లడించింది. -
ఇంటర్ ఫస్టియర్‌లోకి.. నేటి నుంచి అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు నేటి (ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది వీటిని ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌లో చేపట్టనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శనివారం నోటిఫికేషన్ జారీచేశారు. నిజానికి ఈ విద్యా సంవత్సరంలో ఫస్టియర్ ప్రవేశాలను ఆన్లైన్లో చేపట్టేందుకు బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆన్లైన్ విధానాన్ని నిలిపివేసింది. దీంతో విద్యా సంవత్సరం మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ ఏడాది వరకు ఆఫ్‌లైన్‌లో ఫస్టియర్ అడ్మిషన్లను పూర్తిచేయాలని నిర్ణయించింది. సర్టిఫికెట్లను కాలేజీలు ఉంచుకోరాదు అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల మార్కుల మెమోల ఆధారంగా విద్యార్థులకు ప్రొవిజినల్ ప్రవేశాలు కల్పించాలి. ఎస్సెస్సీ సర్టిఫికెట్లు, స్కూల్ టీసీలు వచ్చాక ఆ ప్రవేశాలను ధ్రువీకరించాలి. ఎస్సెస్సీ, కుల ధృవీకరణ సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం వాటిని విద్యార్థులకు ఇచ్చేయాలి. ఏ విద్యాసంస్థ కూడా వాటిని తన వద్ద ఉంచుకోరాదు. విద్యార్థులకు తిరిగి ఇవ్వకుండా సర్టిఫికెట్లను తమ వద్దే ఉంచుకునే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయింపు సీట్లను రిజర్వేషన్ కోటా మేరకు ఆయా వర్గాల విద్యార్థులతో భర్తీ చేయాల్సిందేనని బోర్డు కార్యదర్శి స్పష్టంచేశారు. ఇలా చేయని సంస్థల గుర్తింపు రద్దు సహ ఇతర చర్యలు తప్పవన్నారు. అంతేకాక.. ► బాలికేతర కాలేజీల్లోని అన్ని కేటగిరీ సీట్లలో కూడా బాలికలకు 33.33 శాతం కేటాయించాలి. ► ఏ ఒక్క విద్యార్థికి కూడా కులం, మతం, ప్రాంతం తదితర కారణాలతో అడ్మిషన్లు నిరాకరించరాదు. ► అడ్మిషన్లు పూర్తిగా పదో తరగతి.. తత్సమాన అర్హతల మెరిట్ ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుసరిస్తూ మాత్రమే చేపట్టాలి. ► ముఖ్యంగా.. ఏ విద్యా సంస్థ కూడా ప్రవేశ పరీక్షలు, టాలెంట్ టెస్టులు వంటివి నిర్వహించరాదు. ► ప్రతీ కాలేజీలో బాలికల రక్షణ, భద్రతకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలి. ► విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా బోర్డు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. షెడ్యూల్ ఇలా.. ► దరఖాస్తుల అమ్మకం: సెప్టెంబర్ 19 నుంచి ► దరఖాస్తుల స్వీకరణ తుది గడువు: సెప్టెంబర్ 28 ► అడ్మిషన్ల ముగింపు: సెప్టెంబర్ 28 ► తరగతుల ప్రారంభం: సెప్టెంబర్ 29 అనుమతికి మించి ప్రవేశాలు కుదరదు ► హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి కాలేజీలోనూ మంజూరు చేసిన సెక్షన్లలో సెక్షన్‌కు గరిష్టంగా 88 మందిని మాత్రమే చేర్చుకోవాలి. ► కేవలం బైపీసీ, ఎంపీసీలే కాకుండా.. బోర్డు రూపొందించిన కాంబినేషన్లలోని (బైపీసీ, ఎంపీసీలతో పాటు సీఈసీ, హెచ్ఈసీ తదితర) సెక్షన్లన్నింటిలో కూడా ప్రవేశాలు చేపట్టాలి. ► ఏ కాలేజీలో కూడా అనుమతిలేకుండా అదనపు సెక్షన్లలో ప్రవేశాలను చేపట్టడానికి వీల్లేదు. ► అలా చేసే కాలేజీలపై పెనాల్టీలతో పాటు ఇతర చర్యలు తీసుకుంటామని రామకృష్ణ హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సెకండియర్‌లో నో అడ్మిషన్ తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ ఫస్టియర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఇక్కడ సెకండియర్‌లో నేరుగా ప్రవేశాలకు అనుమతిలేదని రామకృష్ణ నోటిఫికేషన్లో తెలిపారు. ఆయా రాష్ట్రాల ఇంటర్ సిలబస్, ఏపీ ఇంటర్ సిలబస్‌లో వ్యత్యాసాలున్నందున ఇతరులు ఏపీలోని జూనియర్ కాలేజీల్లో నేరుగా సెకండియర్‌లో ప్రవేశించడానికి అర్హులుకాదని స్పష్టంచేశారు. ఫస్టియర్‌లో మాత్రమే వారిని చేర్చుకోవాలన్నారు. అలాగే, అడ్మిషన్ల సమయంలో ప్రతి కాలేజీ ప్రవేశద్వారం ముందు 2021?–22 విద్యా సంవత్సరానికి కాలేజీకి ఉన్న అనుమతుల పత్రాలను కనిపించేలా ప్రదర్శించాలన్నారు. ఎన్ని సెక్షన్లు, ఎన్ని సీట్లకు అనుమతులున్నాయి?.. భర్తీ అయిన సీట్లు, ఖాళీల వివరాలను సెక్షన్ల వారీగా పేర్కొనాలని తెలిపారు. -
ఇంటర్ ప్రవేశాలకు ‘ఆన్లైన్’ రద్దు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం ఇంటర్ బోర్డు కొత్తగా తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టం ఫర్ ఇంటర్మీడియెట్ స్ట్రీమ్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ విద్యా సంవత్సరానికి పాత విధానంలోనే ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఆన్లైన్ ప్రవేశాలకు చట్టం చేసేందుకు, నిబంధనలు రూపొందించేందుకు ఈ తీర్పు ఏమాత్రం అడ్డంకి కాదంది. ఇదే సమయంలో ఆన్లైన్ విధానం తేవాలంటే లబ్ధిదారులందరి హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా కొత్త విధానం గురించి ముందు విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు సోమవారం తీర్పు వెలువరించారు. ప్రవేశాల నిమిత్తం ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన ఆన్లైన్ విధానాన్ని సవాల్ చేస్తూ సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ఆన్లైన్ ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఎలాంటి చట్టపరమైన దన్ను లేదన్నారు. ఈ కొత్త విధానం లబ్ధిదారులందరి హక్కులను కాపాడటం లేదని చెప్పారు. కోవిడ్ వల్ల పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన నేపథ్యంలో.. ఇంటర్ ప్రవేశాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తామని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికే లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారని ఇంటర్ బోర్డు చెబుతున్నప్పటికీ ఈ విధానాన్ని సమర్థించలేమని స్పష్టం చేశారు. ఆన్లైన్ ప్రవేశాల విషయంలో లబ్ధిదారులందరి హక్కులను పరిగణనలోకి తీసుకుని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించి ఉండాల్సిందన్నారు. ఆ అధికారాన్ని ఇంటర్ బోర్డుకు బదలాయించకుండా ఉండాల్సిందని చెప్పారు. ఈ అధికార బదలాయింపు చట్టప్రకారం చెల్లుబాటు కాదన్నారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలదని పేర్కొన్నారు. కోవిడ్ నుంచి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కాపాడేందుకే ఆన్లైన్ విధానం తెచ్చామని ఇంటర్ బోర్డు చెబుతోందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేనప్పటికీ.. నోటిఫికేషన్లోనే ఈ విషయాన్ని పొందుపరచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. -
అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాల ప్రయోజనాల కోసమే ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్లలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ విధానానికి అందరి నుంచి మంచి స్పందన లభించిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలిదశ అడ్మిషన్లకు ఇప్పటివరకు 2.60 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. బోర్డు ఎక్కడా కొత్తగా ఏ నిబంధననూ మార్పు చేయలేదని వివరించారు. గతంలో ఆఫ్‌లైన్‌లో జరిగే పద్ధతినే ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి మార్చామని పేర్కొన్నారు. తొలివిడత ఆన్లైన్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో రామకృష్ణ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు కరోనా సమయంలో కాలేజీల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుందన్నారు. ఇంట్లో నుంచే తమకు నచ్చిన కాలేజీలో, కోరుకున్న గ్రూపులో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆధార్, కొన్ని సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేసి విద్యార్థులు ఆన్లైన్ అడ్మిషన్ పొందొచ్చని చెప్పారు. ఎక్కడా ఎవరికీ ఎలాంటి ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలకు కూడా ఆన్లైన్ అడ్మిషన్లవల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తమ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులను ఫీజులు కట్టించుకొని చేర్పించుకోవడం వరకే వాటి బాధ్యత అని స్పష్టం చేశారు. రామకృష్ణ ఇంకా ఏమన్నారంటే.. నిర్దేశిత ఫీజులనే కళాశాలలు తీసుకోవాలి.. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే ఫీజులను ఖరారు చేసింది. ఆ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు ఫీజులు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా నిర్దేశిత ఫీజులను మాత్రమే చెల్లించాలి. ఏ కాలేజీ అయినా ఎక్కువ ఫీజులు డిమాండ్ చేస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వాటిని ప్రాసిక్యూషన్ చేయించే అధికారం ఇంటర్ బోర్డుకు ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ) చట్టం–1983లోని సెక్షన్ 9, 10, 11 ప్రకారం ప్రభుత్వం గతేడాది మార్చిలో జీవో 57 ద్వారా బోర్డుకు ప్రత్యేకాధికారాలు కల్పించింది. అందరికీ అందుబాటులో సీట్లు రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ సహా ఇతర యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో 6 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సీట్లు రావన్న ఆందోళన వద్దు. సెక్షన్‌కు 88 మందిని అనుమతిస్తున్నాం. రిజర్వేషన్ల ప్రకారమే ప్రతి కాలేజీలో సీట్ల భర్తీ ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల వారికి సీట్లు దక్కుతాయి. గతంలో రిజర్వేషన్ల అమలు సరిగా లేనందున కొన్ని కాలేజీల్లో కొందరికి మాత్రమే అవకాశం దక్కేది. దీంతో రిజర్వుడ్ వర్గాల పిల్లలు నష్టపోవాల్సి వచ్చేది. తొలి దశ అనంతరం మిగిలిన సీట్లకు మలివిడత ఆన్లైన్ ప్రవేశాలుంటాయి. గతేడాది మొత్తం 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కూడా అంతేస్థాయిలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నాం. విద్యార్థుల మేలుకే ఆన్లైన్ సేవలు గతంలో కొన్ని కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ముఖ్యంగా కరోనా సమయంలో పిల్లలు కాలేజీల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ–హాల్‌టికెట్లను బోర్డు ప్రవేశపెట్టింది. బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించాం. పరీక్ష ఫీజుల విషయంలోనూ కాలేజీలు విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసేవి. దీంతో ఆన్లైన్లో చెల్లించే ఏర్పాటు చేయడంతో కార్పొరేట్ కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అలాగే విద్యార్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల(టీసీ) విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో నేరుగా బోర్డు నుంచి ఈ–టీసీ జారీ చేసే ప్రక్రియపై దృష్టి సారించాం. దీని ద్వారా విద్యార్థులు నేరుగా బోర్డు వెబ్సైట్ నుంచి టీసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
188 పనిదినాలు.. 47 సెలవులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యకు సంబంధించి 2021–22 విద్యాసంవత్సరానికి ఇంటర్ బోర్డు క్యాలెండర్ విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 188 పనిదినాలున్నాయి. కోవిడ్ కారణంగా అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు, పరీక్షల నిర్వహణ వంటి ప్రక్రియలపై ఈ క్యాలెండర్ రూపొందించింది. సెకండియర్ విద్యార్థులకు జూలై 1వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన బోర్డు ఈనెల 16 నుంచి ప్రత్యక్ష తరగతులు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్టియర్ విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఈ ఏడాది ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసిన బోర్డు ఆన్లైన్ దరఖాస్తు తేదీని ఈనెల 27వ తేదీ వరకు పొడిగించింది. అడ్మిషన్లు పూర్తయిన అనంతరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఫస్టియర్ విద్యార్థులకు తరగతులను ప్రారంభించనుంది. 47 సెలవులు ఇంటర్ బోర్డు క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో 47 సెలవుదినాలున్నాయి. అన్ని రెండో శనివారాలు పనిదినాలుగానే ఉంటాయి. టర్మ్ సెలవులు లేవు. వేసవి సెలవుల్లో అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీలను మూసి ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు అన్ని ఆదివారాలు, పబ్లిక్‌సెలవుదినాలను తప్పనిసరిగా పాటించాలి. అడ్మిషన్లు పూర్తిగా బోర్డు ప్రకటించిన షెడ్యూళ్లలో మాత్రమే జరుగుతాయి. విద్యార్థులను తమ కాలేజీల్లో చేరేలా ఒత్తిడి చేయడం, తమ కాలేజీ ఫలితాలు అంటూ ఆకర్షించేలా ప్రలోభపెట్టడం వంటివి చేయరాదు. హోర్డింగులు, పాంప్లేట్లు, పత్రికలు, టీవీల్లో ప్రకటనలు చేయరాదు. పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేలా చేస్తామని హామీలివ్వడం నిబంధనలకు విరుద్ధమని, ఇలా చేస్తే చర్యలుంటాయని కాలేజీల యాజమాన్యాలకు బోర్డు స్పష్టం చేసింది. -
ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు 27 వరకు గడువు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఆన్లైన్ అడ్మిషన్ల గడువును ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌కు తొలిసారిగా ఆన్లైన్ అడ్మిషన్లను చేపట్టిన బోర్డు ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు తేదీలను ప్రకటించింది. అయితే గడువు పొడిగించాలని అనేకమంది విన్నవించడంతో దరఖాస్తు గడువును 27 వరకు పొడిగించింది. మార్చి పరీక్షలకు ఫీజు చెల్లించినవారందరికీ హాల్‌టికెట్లు కాగా, తమ మార్కులను పెంచుకునేందుకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలనుకునే ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని బోర్డు తెలిపింది. ఈ విషయంలో సబ్జెక్టులను నిర్ధారించుకునేందుకు విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించనక్కర్లేదని వివరించింది. ఇంటర్ – మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. విద్యార్థులు వారి అనుకూలతను బట్టి ఒకటి లేదా అంతకు మించిన సబ్జెక్టుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపింది. ఐపీఈ–మార్చి 2021 పరీక్షలకు ఫీజులు చెల్లించని విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలనుకుంటే నేరుగా ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించింది. దీనికోసం ప్రిన్సిపాళ్లను సంప్రదించాల్సిన అవసరం లేదని వివరించింది. -
ఏపీ: ఇంట్లో నుంచే ఇంటర్ సీటు.. తొలిసారి ఆన్లైన్ అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: విశాఖపట్నానికి చెందిన ఎస్సీ విద్యార్థి హరీశ్ టెన్త్‌లో 10 జీపీఏ సాధించాడు. కానీ దగ్గరలోని కార్పొరేట్ జూనియర్ కాలేజీలో అతడికి సీటు లభించలేదు. కారణం కాలేజీ అడిగిన ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడమే. హరీశ్ లాంటి విద్యార్థులకు ఇక ఇలాంటి సమస్యలుండవు. వారు కోరుకున్న కాలేజీలో ఆశించిన కోర్సులో సీటు పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్, లేదా కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఉంటే ఇంట్లో నుంచే ఇంటర్మీడియెట్ కోర్సులో చేరవచ్చు. ఇప్పటివరకు ఇంటర్మీడియెట్ కోర్సులో ప్రవేశానికి విద్యార్థులు పడుతున్న ఇక్కట్లకు చెక్ పెడుతూ ఇంటర్ బోర్డు ఆన్లైన్ అడ్మిషన్ల విధానానికి శ్రీకారం చుట్టింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌లో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభిస్తోంది. ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ జూనియర్ కాలేజీల్లోని జనరల్, ఒకేషనల్ ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ విధానంలోనే కొనసాగనున్నాయి. సమస్యలకు స్వస్తి టెన్త్ పాసయిన విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో చేరటం ఇప్పటివరకు పెద్ద ప్రహసనంలా ఉండేది. ప్రభుత్వ యాజమాన్య కాలేజీల్లో ప్రవేశాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు మాత్రం అడిగిన మేర రూ.లక్షల్లో ఫీజు చెల్లించిన వారికే సీట్లు కేటాయిస్తున్నాయి. మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆన్లైన్ అడ్మిషన్ల విధానం ప్రారంభమవడంతో ఈ సమస్యలు తీరడమేగాక విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి మెరిట్‌ను బట్టి తనకు నచ్చిన కాలేజీలో సీటు లభిస్తుంది. ‘డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో కొంత ప్రాథమిక సమాచారం ఇవ్వడం ద్వారా ఎటువంటి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే కాలేజీలో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమకు నచ్చిన కాలేజీలో ఆశించిన గ్రూపులో సీటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్‌ను అనుసరించి బోర్డు ఆయా విద్యార్థుల ఆప్షన్ ప్రకారం సీట్లు కేటాయిస్తుంది. అది పూర్తికాగానే అభ్యర్థి వెబ్‌సైట్‌లోని అడ్మిన్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకుని నేరుగా కాలేజీలో ఫీజు చెల్లించి చేరవచ్చు. గతంలో ప్రైవేట్ కాలేజీల్లో సదుపాయాలు, బోధన సిబ్బంది సమాచారం తెలిసేది కాదు. ఇప్పుడు ఆన్లైన్ విధానంలో ఆయా కాలేజీల్లోని సదుపాయాలు, లైబ్రరీ, ల్యాబొరేటరీ, భవనాలు, సిబ్బంది సమాచారం కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. వాటిని పరిశీలించుకుని కాలేజీలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. రిజర్వేషన్ల అమలు ఇప్పటివరకు రిజర్వేషన్లను ప్రభుత్వ కాలేజీలు తప్ప ప్రైవేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదు. ఆన్లైన్ విధానంలో అన్ని కాలేజీల్లోనూ రిజర్వేషన్ల కోటా ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీలకు 29 శాతం, దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు నిర్దేశించిన కోటా ప్రకారం ఆయా కాలేజీల్లో సీట్లు భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలో మహిళలకు 33.33 శాతం కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ కేటగిరీ సీట్లకు అర్హులు లేకపోతే జనరల్ కోటాలో భర్తీచేస్తారు. బీసీ కోటా సీట్లను ఆయా ఉపవర్గాల వారీగా అభ్యర్థులు లేకపోతే వేరే ఉపవర్గానికి కేటాయిస్తారు. వారూ లేనిపక్షంలో జనరల్ కోటాలో భర్తీ చేస్తారు. లోకల్, నాన్ లోకల్ వారీగా సీట్లు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్)–1974 ప్రకారం లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, నాన్ లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు ఆయా కాలేజీల్లో కేటాయిస్తారు. అభ్యర్థులకు వారికి టెన్త్‌లో వచ్చిన గ్రేడ్లు, మార్కుల ఆధారంగా మెరిట్‌ను అనుసరించి సీట్ల కేటాయింపు ఉంటుంది. నార్మలైజేషన్ పద్ధతిలో ఆయా అభ్యర్థులకు గ్రేడ్ల వారీగా ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల మెరిట్‌ను అనుసరించి ఆయా గ్రూపుల్లో సీట్లు కేటాయిస్తారు. జనరల్ సెక్షన్లో 88 సీట్లు ప్రతి కాలేజీలో ఆయా గ్రూపుల్లో జనరల్ సెక్షన్‌కు 88, ఒకేషనల్ పారా మెడికల్‌లో 30, నాన్ పారా మెడికల్‌లో 40 సీట్లు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తు కోసం అభ్యర్థులు ఓసీ, బీసీలైతే రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ అడ్మిషన్లను సజావుగా నిర్వహించడానికి రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అడ్మిషన్ కమిటీలను బోర్డు ఏర్పాటు చేసింది. ఇవిగాకుండా ప్రతి జిల్లాలో జిల్లా హెల్ప్‌లైన్ కేంద్రాలతోపాటు కాలేజీ స్థాయిలో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేయాలో పలు సూచనలతో సవివరంగా యూజర్ మాన్యువల్‌ను బోర్డు అందుబాటులో ఉంచింది. 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ తరగతులు సెప్టెంబర్ 1వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశాల సమయంలో విద్యార్థులు టీసీ, టెన్త్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణలో ఫస్టియర్ ఇంటర్మీడియెట్ చదివిన విద్యార్థులు ఏపీలో చదవాలనుకుంటే మళ్లీ ఫస్టియర్‌లో చేరాల్సిందేనని స్పష్టం చేశారు. -
ఏపీలో ఈ నెల 16 నుంచి ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు
-
ఏపీ: 16 నుంచి ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గత నెల 12 వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది. -
ఏపీ: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులు
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్టియర్ విద్యార్థులందరినీ కనీస ఉత్తీర్ణత మార్కులు (మినిమం పాస్ మార్కులు)తో సెకండియర్ (2021–22)లోకి ప్రమోట్ చేస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఇటీవల ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్ సెకండియర్ (2020–2021) పూర్తి చేసిన విద్యార్థులకు.. ►ఐపీఈ మార్చి 2021కు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు.. వారి మార్కులు (ఫస్టియర్, సెకండియర్) మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. ►ప్రాక్టికల్ మార్కులను పెంచుకోవడానికి మాత్రం అవకాశం లేదు. ►ఐపీఈ–మార్చి 2021/అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ► ప్రైవేటు విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావచ్చు. ►హాజరు మినహాయింపు కేటగిరీలోని విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావాలి. ►విద్యార్థులంతా నైతిక విలువలు (ఎథిక్స్), మానవ విలువలు (హ్యూమన్ వ్యాల్యూస్), పర్యావరణ విద్య (ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షల్లో) క్వాలిఫై అవ్వాలి. అలా కాని వారు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి తమ సుముఖతను తెలపాలి. ►ప్రాక్టికల్ పరీక్షల్లో తప్పిన, గైర్హాజరు అయినవారు పరీక్ష ఫీజు చెల్లించి ప్రాక్టికల్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులకు.. ►2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్‌లో చేరి ఐపీఈ–మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించినవారందరూ కనీస ఉత్తీర్ణత మార్కులతో సెకండియర్లోకి ప్రమోషన్ ►కనీస ఉత్తీర్ణత మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఒకటి లేదా అన్ని సబ్జెక్టుల పరీక్షలను రాయొచ్చు. ఈ పరీక్షలకు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ►ఈ పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులకు వారికి ఇచ్చిన కనీస ఉత్తీర్ణత మార్కులనే కొనసాగిస్తారు. ►ఐపీఈ–2021 పరీక్షలకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఫీజు చెల్లించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలి. -
ఏపీ: ప్రైవేటు కాలేజీలపై ఇంటర్ బోర్డు ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అడ్మిషన్లు చేసినట్టు తమ దృష్టికొచ్చిందని, అలాంటి చేరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కాకుండానే, ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాకుండానే కొంతమంది విద్యార్థులు కొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు పొంది.. ఫీజులు కూడా చెల్లించినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆ అడ్మిషన్లు చెల్లుబాటు కావని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఆయా కాలేజీలు వెంటనే వాపసు ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలాంటి కాలేజీలను ఆర్ఐవో(రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్)లు గుర్తించి, గుర్తింపు రద్దుతో సహా, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఆదేశించారు. -
ఇంటర్ అడ్మిషన్ @ ఆన్లైన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ 2021 – 22 ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ విధానాన్ని బోర్డు అమల్లోకి తెస్తోంది. మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీలో ఆశించిన సీటును దక్కించుకునేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటోంది. కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని స్మార్ట్ ఫోన్ ద్వారా సీటు పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆన్లైన్ విధానాన్ని గత ఏడాది అమల్లోకి తెచ్చిన బోర్డు దీనికోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించడం తెలిసిందే. 3 లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు కూడా సమర్పించారు. అయితే న్యాయస్థానం ఆదేశాలతో అప్పట్లో ఆన్లైన్ అడ్మిషన్ల విధానం నిలిచిపోయింది. ఈ ఏడాది నుంచి ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టేందుకు కోర్టు అనుమతించడంతో బోర్డు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. అనుమతులు, ప్రవేశాలు ఆన్లైన్లోనే.. ఆన్లైన్ అడ్మిషన్లకు వీలుగా ఇంటర్ బోర్డు కాలేజీలకు అనుమతుల ప్రక్రియలో పలు సంస్కరణలు చేపట్టింది. కొత్త కాలేజీలకు అనుమతులు, రెన్యువల్‌కు ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి కాలేజీలో నిర్వహించే కోర్సులు, సెక్షన్ల వారీగా ఎన్ని తరగతి గదులు ఉండాలి? ఒక్కో గది వైశాల్యం తదితరాలపై ప్రమాణాలు నిర్దేశించింది. గదులతో సహా భవనాల ఫొటోలను కాలేజీల యాజమాన్యాలు బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకుంది. ఆ ఫొటోలను కాలేజీలవారీగా విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలించేలా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కాలేజీలో ఏ కోర్సులున్నాయి? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? లాంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. వీటి ఆధారంగా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో సీటు కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. అయితే సెక్షన్‌కు 40 మందిని మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను న్యాయస్థానం నిలిపివేయడంతో ఈ ఏడాది పాత జీవో ప్రకారం సెక్షన్‌కు 88 మంది విద్యార్థుల చొప్పున గరిష్టంగా 9 సెక్షన్లుండేలా కాలేజీలకు సీట్లు కేటాయింపు చేయనున్నారు. సర్టిఫికెట్లను సమర్పించే పనిలేదు.. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజును సంబంధిత కాలేజీకి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించాలి. అయితే ఫీజులకు సంబంధించి కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త విధానం వల్ల విద్యార్థి తన సర్టిఫికెట్లను కాలేజీలో సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్ దరఖాస్తులోనే సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేసుకుని ఇంటర్ బోర్డు పరిశీలన చేసి సీట్లు కేటాయిస్తున్నందున విద్యార్థి ఒరిజినల్ ధ్రువపత్రాలను కాలేజీలకు సమర్పించాల్సిన అవసరం ఉండదు. రిజర్వేషన్లు పక్కాగా అమలు.. ఆన్లైన్ అడ్మిషన్లతో ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, క్రీడాకారులు, బాలికలకు సంబంధించిన కోటా సీట్లు ఆయా విభాగాల వారితోనే భర్తీ కానున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో కూడా అడ్మిషన్లను పక్కాగా రిజర్వేషన్ల ప్రకారం చేపట్టాలి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, దివ్యాంగులకు 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం చొప్పున ఇవ్వాలి. అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలి. అభిప్రాయాలు తెలుసుకున్న బోర్డు కార్యదర్శి ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్లో అడ్మిషన్లను చేపడుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ బుధవారం జూమ్ ద్వారా సమావేశం నిర్వహించారు. 13 జిల్లాల నుంచి అందిన సూచనలను స్వీకరించారు. సమస్యలను పరిష్కరిస్తూ ఆన్లైన్ విధానంలో అవసరమైన మార్పులు చేస్తామని వారికి వివరించారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే కొన్ని ప్రైవేట్ కాలేజీలు నిర్వహించిన అడ్మిషన్లు చెల్లుబాటు కావని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. తిరగాల్సిన అవసరం లేకుండా.. ఆన్లైన్ అడ్మిషన్ల విధానం ద్వారా విద్యార్థులకు ఇంటర్ బోర్డు పలు వెసులుబాట్లు కల్పించింది. గతంలో మాదిరిగా కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా బోర్డు ఏర్పాటు చేసిన పోర్టల్‌లో లేదా మొబైల్ యాప్ ద్వారా టెన్త్ హాల్ టికెట్ నెంబర్, పాసైన సంవత్సరం, బోర్డు పేరు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, చదివిన స్కూలు, కులం, ఆధార్ నంబర్ తదితర వివరాలతో తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఐడీ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలు, కాలేజీ, మాధ్యమాల వారీగా కోర్సులతో కూడిన వివరాలు పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. తమకు నచ్చిన కోర్సు, కాలేజీని ఎంపిక చేసుకుని ప్రాధాన్యత క్రమంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. రిజర్వేషన్లు, టెన్త్ మెరిట్ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లను బోర్డు కేటాయిస్తుంది. నోటిఫికేషన్ రాకుండానే ఇంటర్ అడ్మిషన్లా? రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అడ్మిషన్లు చేసినట్టు తమ దృష్టికొచ్చిందని, అలాంటి చేరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కాకుండానే, ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాకుండానే కొంతమంది విద్యార్థులు కొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు పొంది.. ఫీజులు కూడా చెల్లించినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆ అడ్మిషన్లు చెల్లుబాటు కావని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఆయా కాలేజీలు వెంటనే వాపసు ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలాంటి కాలేజీలను ఆర్ఐవో(రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్)లు గుర్తించి, గుర్తింపు రద్దుతో సహా, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఆదేశించారు. -
ఏపీలో సెప్టెంబర్ 15 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు–2021 సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యామండలి మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చిలో జరగాల్సిన పబ్లిక్ పరీక్షలు–2021 కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ చివరకు రద్దయిన సంగతి తెలిసిందే. ఉన్నత చదువులకు వీలుగా హైపవర్ కమిటీ సిఫార్సులను అనుసరించి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇటీవల ఇంటర్ బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఆ విద్యార్థుల టెన్త్, ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. ఫస్టియర్ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు పేర్కొంది. సెకండియర్ ఫలితాల్లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చు. ఫస్టియర్ విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్షలు రాయవలసి ఉంటుంది. పరీక్ష ఫీజును ఆగస్టు 17లోపు చెల్లించాలి. జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులంతా ఈ గడువులోగా ఫీజులు చెల్లించాలి. పబ్లిక్ పరీక్షలకు ఇంతకు ముందు ఫీజు చెల్లించిన ఫస్టియర్ విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. బెటర్మెంట్ కోసం ఈ పరీక్షలకు హాజరవుదామనుకునే సెకండియర్ విద్యార్థులు కూడా ఫీజు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఇంతకు ముందు వచ్చిన మార్కులు, ఇప్పుడు వచ్చిన మార్కుల్లో ఏవి ఎక్కువగా ఉంటే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. అటెండెన్స్ మినహాయింపుతో ప్రైవేటుగా పరీక్షలకు హాజరయ్యే హ్యుమానిటీస్ అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించాలి. 2019లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బెటర్మెంట్ మార్కుల కోసం ఈ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలే చివరి అవకాశం. పరీక్షల తేదీలను పొడిగించబోమని బోర్డు కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. -
ఏపీ: ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తాం: ఇంటర్ బోర్డు
సాక్షి, అమరావతి: ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అడ్మిషన్లకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని పేర్కొంది. కొన్ని కాలేజీలు ఆఫ్‌లైన్‌లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆఫ్‌లైన్ అడ్మిషన్లను ఇంటర్ బోర్డు పరిగణించదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్ అడ్మిషన్లు చేపట్టే ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారానే అడ్మిషన్లు పొందాలని ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది. -
సెకండియర్ విద్యార్థులంతా పాస్.. వెయిటేజీ ఇలా
సాక్షి, అమరావతి: ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి 5,19,797 మంది సెకండియర్ విద్యార్థులకు వచ్చిన మార్కులను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. వీరిలో బాలురు 2,58,310 మంది, బాలికలు 2,61,487 మంది ఉన్నారు. వీరి మార్కుల షార్ట్ మెమోలను ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి బోర్డు వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. కోవిడ్–19 కారణంగా ఈ విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహించనందున ఈ విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించారు. సెకండియర్ విద్యార్థులకు వారి టెన్త్, ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఆధారంగా మార్కులను కేటాయించారు. ప్రాక్టికల్, నైతిక విలువలు, పర్యావరణ శాస్త్రం పరీక్షలకు సంబంధించిన మార్కులను య«థాతథంగా ఇచ్చారు. ఫస్టియర్ విద్యార్థులను కనిష్ట పాస్ మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటిస్తూ రెండో సంవత్సరంలోకి ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఆదిమూలపు ఈ వివరాలు వెల్లడించారు. మార్కుల వెయిటేజీ ఇలా.. 2021 ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలను మే 5 నుంచి 23 వరకు నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లుచేసినా కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి వాయిదా వేయాల్సి వచ్చింది. అంతకుముందే.. ప్రాక్టికల్ పరీక్షలు, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ సైన్సు పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం.. సెకండియర్ విద్యార్థులకు మార్కులతో ఫలితాల వెల్లడికి ఫార్ములా నిమిత్తం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టెన్త్ మార్కులకు 30 శాతం, ఇంటర్ ఫస్టియర్ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇవ్వాలని కమిటీ సూచనలతో సెకండియర్ మార్కులను బోర్డు ప్రకటించింది. అలాగే, టెన్త్‌లో విద్యార్థులు మంచి మార్కులు సాధించిన మూడు సబ్జెక్టుల (బెస్ట్ 3) సరాసరి మార్కులను తీసుకోగా.. ఇంటర్ ఫస్టియర్లోని అన్ని సబ్జెక్టుల మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. ఇక ప్రాక్టికల్స్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ సైన్సు పరీక్షల మార్కులను య«థాతథంగా విద్యార్థుల మెమోల్లో పొందుపర్చనున్నట్లు మంత్రి సురేష్ వివరించారు. ప్రైవేటు విద్యార్థులకు పాస్ మార్కులు ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో గతంలో ఫెయిలై ఈసారి ప్రైవేటుగా పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించిన వారికి.. ఫస్టియర్‌లో ఫెయిలైన సబ్జెక్టుల కోసం ఫీజు చెల్లించిన వారికి ఆయా సబ్జెక్టులకు కనిష్ట పాస్ మార్కులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే, ఫస్టియర్ మార్కులలో బెటర్మెంట్ కోసం పరీక్ష ఫీజు చెల్లించిన వారికి గతంలో వచ్చిన మార్కులనే యథాతథంగా కేటాయిస్తున్నామన్నారు. ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి, ఫెయిలైన వారికి కూడా ఆయా సబ్జెక్టులకు కనిష్ట పాస్ మార్కులు కేటాయిస్తున్నట్లు ఆదిమూలపు వివరించారు. హైపవర్ కమిటీ సూచించిన విధానంలో కేటాయించిన మార్కులపై ఎవరికైనా అసంతృప్తి ఉంటే వారికి సెకండియర్ పరీక్షలను రాసేందుకు ఓ అవకాశమిస్తామని మంత్రి చెప్పారు. సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాక ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి సందేహాలు, ఇతర సమస్యలుంటే వాటిని నివృత్తి చేసి పరిష్కరించేందుకు వివాద పరిష్కార కమిటీని ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాటుచేస్తోంది. అలాంటి వారు బోర్డు ఏర్పాటుచేసిన ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో తమ సమస్యలను తెలియజేయవచ్చు. 26న వెబ్సైట్లో షార్ట్ మార్కుల మెమోలు ఇంటర్ సెకండియర్ మార్కుల షార్ట్ మెమోలను ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి బోర్డు వెబ్సైట్ ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ లో పొందుపర్చనున్నారు. అనంతరం విద్యార్థులు తమ మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు, సమస్యలుంటే ‘ఓయూఆర్బీఐఈఏపీఎట్దరేట్జీమెయిల్.కామ్’ మెయిల్‌కు లేదా 9391282578 నంబర్లోని వాట్సాప్‌కు మెసేజ్ ఇవ్వవచ్చని బోర్డు వివరించింది. మీడియా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, ఇంటర్ బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ, పరీక్షల నియంత్రణాధికారి రమేష్‌లు పాల్గొన్నారు. ఆన్లైన్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్, డిగ్రీ కోర్సుల అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గత ఏడాదే ఇంటర్మీడియెట్‌లో 70 శాతం ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహించామని.. మధ్యలో హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఈ ఏడాది పూర్తిగా ఆన్లైన్లోనే ప్రవేశాలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. టెన్త్ ఫలితాలను విడుదల చేయకముందే ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించడంపై మంత్రి స్పందిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సెకండియర్ విద్యార్థులందరూ పాస్ అయినట్లు ఆయన ప్రకటించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దు చేశామని, కరోనా నిబంధనలు పాటించి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్ట్‌ల యావరేజ్‌కి 30 శాతం.. ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రతిభకి 70 శాతం వెయిటేజ్‌తో ఫలితాలు ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేశామని తెలిపారు. విద్యార్థులకు ఈ ఫలితాలపై అసంతృప్తి ఉంటే కోవిడ్ తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా మార్కులే ప్రకటించామన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే బెటర్ మెంట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పదవ తరగతి ఫలితాలను వారం రోజులలో ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. అడ్మిషన్లలో అవకతవకలకి పాల్పడే కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ హెచ్చరించారు. ఫలితాల కోసం www.sakshieducation.com www.examresults.ap.nic.in www.results.bie.ap.gov.in www.bie.ap.gov.in www.results.apcfss.in -
తెలంగాణలో మరో 160 కాలేజీలు మూతపడినట్లే: ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో 160 కాలేజీలు మూతపడినట్లేనని ఇంటర్ బోర్డు తెలిపింది. కాగా గతేడాది కాలేజీల గుర్తింపు కోసం 100 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదని పేర్కొంది. ఇక 2021-22కు 1520 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయని, దీంతో 100 కళాశాలల గుర్తింపు లేనట్లేనని తెలిపింది. ఇదిలా ఉండగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకుండానే ఇంటర్ బోర్డు అడ్మిషన్లు ప్రకటించింది. -
తెలంగాణ: మరో వారంలో ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: మరో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జులై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. జులై మధ్యలో ఫస్ట్ ఇయర్ క్లాసులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చదవండి: టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్స్‌లు ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. మంత్రి తలసానికి ఊరట -
మమ్మల్నీ పాస్ చేయరూ.. ఇంటర్ విద్యార్థుల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది మార్చిలో ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన 1,92,172 మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. కరోనా కారణంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించని అధికారులు అప్పట్లో వారిని కనీస మార్కులతో పాస్ చేస్తామని మౌఖికంగా పేర్కొన్నారు. కానీ దానిపై అధికారిక ప్రకటన జారీ చేయలేదు. మరోవైపు గత మార్చిలోనే ఇంటర్ సెకండియర్ వార్షిక పరీక్షల్లో ఫెయిలైన 1.47 లక్షల మంది విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులు వేసి పాస్ చేశారు. దీంతో తమనూ కనీస మార్కులతో పాస్ చేస్తారని ఫస్టియర్ ఫెయిలైన విద్యార్థులు భావించారు. అయితే నేటికీ దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడం, పరీక్షల షెడ్యూల్ విడుదల కావడం, ఫీజు తేదీలనూ ఇంటర్ బోర్డు ప్రకటించడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఒకేసారి అన్ని పరీక్షలూ రాసేదెలా? ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న వారిలో ఫస్టియర్ ఫెయిలైన 1,92,172 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. మే 1 నుంచి ప్రారంభమయ్యే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు వారు కూడా హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు కరోనా కారణంగా వార్షిక పరీక్షలనే మేలో నిర్వహిస్తుండటంతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించే అవకాశమే లేకుండా పోయింది. ఉన్న సమయం ద్వితీయ సంవత్సర సిలబస్ చదువుకునేందుకే సరిపోతుంది. కాగా, తాము రెండేళ్ల పరీక్షలను ఒకేసారి ఎలా రాస్తామని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఫస్టియర్‌లో తమను పాస్ మార్కులతో ఉత్తీర్ణులను చేయాలని కోరుతున్నారు. లేకపోతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన 1,92,172 మంది విద్యార్థుల విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కష్టసాధ్యం. పైగా ఆయా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది. కాబట్టి వారికి పరీక్షలు నిర్వహించాలా లేదా ఉత్తీర్ణత మార్కులు వేసి పాస్ చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేస్తాం. అయితే కనీస మార్కులతో పాస్ చేయాలనే అంశాన్ని ప్రభుత్వానికి పంపే నివేదికలో పేర్కొంటాం. – సయ్యద్ ఉమర్ జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి -
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఉండనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఏప్రిల్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. (చదవండి: సిలబస్ సర్దుబాట) ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష షెడ్యూల్ మే 1న ఇంటర్ ఫస్టియర్ పేపర్-2 మే 3న ఇంగ్లిష్ పేపర్-1 మే 5న మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ-1, సివిక్స్-1 మే 7న మ్యాథ్స్ పేపర్-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1 మే 10న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్-1 మే 12న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ మే 2న ఇంటర్ సెకండయర్ పేపర్-2 మే 4న ఇంగ్లిష్ పేపర్-2 మే 6న మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ-2, సివిక్స్-2 మే 8న మ్యాథ్స్ పేపర్-2బీ, జువాలజీ-2, హిస్టరీ-2 మే 11న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్-2 మే 13న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్-2, సోషియాలజీ పేపర్-2 -
సెకండ్ ఇంటర్ పరీక్షలే ముందు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్–2021 మార్చి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియెట్ విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఈసారి ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను ఒకే షెడ్యూల్లో కాకుండా వేర్వేరుగా నిర్వహించే అవకాశాలున్నాయి. కరోనా కారణంగా 2020–21 విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారడమే దీనికి కారణం. నిజానికి ప్రస్తుత విద్యా సంవత్సరం తరగతులు జూన్‌లో ప్రారంభం కావల్సి ఉండగా కరోనా కారణంగా నవంబర్ 2 నుంచి కేవలం సెకండియర్ తరగతులు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఫస్టియర్ అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించాలనుకున్నప్పటికీ కోర్టు తీర్పుతో నిలిచిపోయాయి. ఆ తర్వాత ఈనెల 18 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం రెండో విడత ప్రవేశాలు సోమవారం వరకు కొనసాగాయి. ఈ నేపథ్యంలో.. ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో ముందుగా సెకండియర్ పరీక్షలను పూర్తిచేసేందుకు బోర్డు కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. ఫస్టియర్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 11లోగా పరీక్షల ఫీజు చెల్లించాలి ఇంటర్ సెకండియర్ విద్యార్థులు పరీక్ష ఫీజును వచ్చేనెల ఫిబ్రవరి 11లోగా చెల్లించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలైన విద్యార్థులు (జనరల్, వొకేషనల్), కాలేజీలో స్టడీ లేకుండా హాజరు మినహాయింపు పొందిన (హ్యుమానిటీస్) విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ముందుగా సెకండియర్ పరీక్షల ఫీజు గడువును ప్రకటించడం ద్వారా పరీక్షకు ఎంతమంది విద్యార్థులు ఉంటారన్న దానిపై ఒక స్పష్టత వస్తుందని, తదనంతరం పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లుచేస్తామని బోర్డు వర్గాలు ప్రకటించాయి. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణను చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం ప్రస్తుతం సెకండియర్ చదివే విద్యార్థులు తమ ఫస్టియర్ సబ్జెక్టుల మార్కుల్లో పెరుగుదల కావాలనుకుంటే అలాంటి వారికి ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడాది అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. కానీ, ఫస్టియర్‌లో అన్ని సబ్జెక్టులలో పాసైన వారు మాత్రమే ఈ ఇంప్రూవ్‌మెంటుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫస్టియర్ పరీక్ష ఫీజు రూ.490తో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున ఇంప్రూవ్‌మెంటు పరీక్షకు చెల్లించాల్సి ఉంటుంది. కాలేజీ స్టడీ లేకుండా హాజరు మినహాయింపుతో 2021 మార్చి ఫస్టియర్, సెకండియర్ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌లోనే పరీక్షలను రాయవలసి ఉంటుంది. అలాగే, విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజులను చెల్లించాలనుకుంటే ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది. ఫీజుల చెల్లింపు తేదీని పొడిగించేదిలేదని స్పష్టం చేసింది. సీఎం ఆదేశాలతో పరీక్ష ఫీజుల పెంపు నిలుపుదల ఈ ఏడాది నుంచి ఇంటర్ పరీక్షల ఫీజును పెంచాలని బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. అయితే, కోవిడ్–19ను దృష్టిలో పెట్టుకుని ఫీజులు పెంచవద్దని.. దానితో పాటు ఆలస్య రుసుమును కూడా రద్దుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని.. దీంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇక పరీక్ష ఫీజులకు సంబంధించిన వివిధ కేటగిరీల వారీ వివరాలను బోర్డు ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో పొందుపరిచింది. -
అధిక ఫీజులు వసూలు చేస్తే గుర్తింపు రద్దు
సాక్షి, అమరావతి: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసే కాలేజీల గుర్తింపు రద్దు తప్పదని రాష్ట్ర పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వేర్వేరు పేర్లతో ఫీజులు వసూలు చేయడమే కాకుండా విద్యార్థులను ఇబ్బందికి గురిచేయడం నేరమని, అలాంటి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన కమిషన్ వైస్ చైర్పర్సన్ విజయశారదారెడ్డి, సభ్యులతో కలసి మీడియాతో మాట్లాడారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత ఏడాది ఫీజులో 30 శాతం మేర కుదించి తక్కిన ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిదన్నారు. అయితే అనేక కాలేజీలు ట్యూషన్ ఫీజును పెంచేసి, ఆపై 30 శాతం తగ్గిస్తున్నట్లు చూపడం, ఇతరేతర పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని చెప్పారు. కరోనా కాలంలో, ఇటీవల కమిషన్.. దాదాపు 360 స్కూళ్లు, కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిందని తెలిపారు. తనిఖీల్లో అధిక ఫీజులతో పాటు అనేక లోపాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. 25 స్కూళ్లు, 50 కాలేజీలపై చర్యలకు సిఫార్సు చేశామన్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కు ఇవ్వని పక్షంలో తీవ్రమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాలేజీల గుర్తింపు రద్దుతో పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా వారి కోసం ఇతర కాలేజీల్లో సీట్లు పెంచేలా చూస్తామని, తల్లిదండ్రులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే చెల్లించేలా నిర్ణయం తీసుకుంటే ఇది మరింత సులువు అవుతుందని చెప్పారు. ఫీజులు ఫిక్స్ చేసి, వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. కొన్ని కాలేజీలు ఫీజు బకాయి పేరిట సర్టిఫికెట్లు ఇవ్వక పోవడం నేరం అని, అలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాట్లాడుతున్న జస్టిస్ కాంతారావు కొన్ని విద్యా సంస్థల్లో భయంకరమైన పరిస్థితులు తమ తనిఖీల్లో పలు కాలేజీల్లో భయంకరమైన పరిస్థితులను గమనించామని, పశువుల కొట్టాలకన్నా అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని వైస్ చైర్పర్సన్ విజయశారదా రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చి ఇలాంటి కాలేజీలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. కొన్ని విద్యా సంస్థల్లో ట్యూషన్ ఫీజుతో పాటు కోచింగ్, హాస్టల్, బుక్స్, లాంగ్‌టర్మ్, లైబ్రరీ ఇలా వేర్వేరు పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. కొన్ని కాలేజీలు ఏడాదికి రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా, కొన్నింటిలో రెండేళ్లకు కలిపి ఒకేసారి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. పలు కాలేజీల్లో తనిఖీల సమయంలో రికార్డులు, అకౌంటు పుస్తకాలు చూపించడం లేదని, ఇకపై కమిటీ తనిఖీల సమయంలో అకౌంటెంట్లను కాలేజీల్లో అందుబాటులో ఉంచాలని ఆమె స్పష్టం చేశారు. ఆ కాలేజీల్లో పిల్లల పరిస్థితి దయనీయం ‘శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి కాలేజీల్లో తనిఖీలు చేపట్టాం. పిల్లలను తరగతి గదుల్లో రోజూ 12 గంటలు ఉంచుతున్నారు. కనీస సదుపాయాలు కల్పించడం లేదు. తల్లిదండ్రులు, విద్యార్థులు తమ సమస్యలను కమిషన్ గ్రీవెన్స్ నంబర్ 9150281111కు తెలపవచ్చు. వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం’ అని కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ నారాయణరెడ్డి తెలిపారు. మరో సభ్యుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ ఐఐటీ, జేఈఈ, నీట్ అంటూ తప్పుడు ప్రకటనలతో కాలేజీలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయన్నారు. ఇలాంటి కోచింగ్‌లకు కాలేజీలకు ఇంటర్ బోర్డు ఎలాంటి అనుమతులు ఇవ్వదని చెప్పారు. కేవలం కోర్సులు మాత్రమే నిర్వహించాలని, ఈ కోచింగ్‌ల పేరిట లక్షల్లో ఫీజులు వసూలు చేయడం నేరం అని.. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరో సభ్యుడు అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘కొన్నింటిలో ఒకేసారి రెండేళ్లకు కలిపి రూ.5 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటున్నారు. గత ఏడాది కన్నా రెట్టింపు ఫీజులను వసూలు చేస్తున్నారు.’ అని తెలిపారు. సభ్యుడు ఏవీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ కాలేజీల్లో పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. కనీసం మూత్ర విసర్జనకు కూడా వెళ్లనీయకుండా మక్కీకి మక్కీ బట్టీ పట్టిస్తున్నారు. పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది.’ అన్నారు. -
సీట్ల కొరత లేదు: ఇంటర్ బోర్డు
సాక్షి, విజయవాడ: ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియలో ఎటువంటి గందరగోళం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ అడ్మిషన్లపై మార్చి నెలలోనే సర్క్యులర్ ఇచ్చామని పేర్కొన్నారు. సీట్ల కొరత ఉందని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇంటర్లో చేరడానికి ఎక్కడా సీట్ల కొరత లేదని తెలిపారు. కొత్తగా మంజూరైన 208 కళాశాలలతో కలిపి మొత్తం 7,42,780 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. (చదవండి: విదేశాల్లోనూ యువతకు ఉపాధి కల్పన) పదవ తరగతి పాసైన ప్రతీ ఒక్కరికి సీటు లభిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో అగ్నిమాపకశాఖ ఎన్ఓసి లేని కళాశాలలకు కూడా 60 రోజుల గడువుతో అనుమతులిచ్చామని చెప్పారు. కోర్టు ఉత్తర్వులకి లోబడి ఇంటర్ అడ్మిషన్లు కొనసాగింపు, సీట్ల సంఖ్య ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామకృష్ణ పేర్కొన్నారు. (చదవండి: ప్రణయ్ ఆత్మహత్య.. సంచలన విషయాలు) -
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం; వాళ్లందరూ పాస్!
-
సిలబస్ సర్దుబాట
సాక్షి, అమరావతి: కోవిడ్–19 కారణంగా విద్యాసంస్థలు మూతపడి విద్యాసంవత్సరంలో ఇప్పటికే నాలుగు నెలల సమయాన్ని కోల్పోవడంతో పాఠ్యప్రణాళికల పునర్వ్యవస్థీకరణపై ఆయా విభాగాల అధికారులు కసరత్తు చేపట్టారు. విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి.. ఎన్ని పనిదినాలు ఉంటాయన్న అంశాల ఆధారంగా సిలబస్‌ను కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ క్యాలెండర్, పాఠ్యప్రణాళికల రూపకల్పనపై దృష్టి సారించారు. కోవిడ్ వల్ల స్కూళ్లు మార్చి నుంచి మూతపడడంతో 2019–20 విద్యాసంవత్సరంలో చివరి పరీక్షలు నిర్వహించలేకపోయారు. – 2020–21 విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కావలసి ఉన్నా కోవిడ్ కారణంగా సాధ్యంకాలేదు. సెప్టెంబర్ 5నుంచి ఆపై అక్టోబర్ 2నుంచి తెరవాలని చూసినా కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. – తాజాగా నవంబర్ 2 నుంచి తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి స్కూళ్లు తెరవనున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే చెప్పారు. – స్కూళ్లను ఎప్పటినుంచి తెరవాలి, విద్యార్థులను ఎలా రప్పించాలనే విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదించారు. – దాదాపు అయిదు నెలల కాలం నష్టపోతున్నందున ఈ సమయాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనా వారి అభిప్రాయాలు తీసుకోనున్నారు. సంక్రాంతి, వేసవి సెలవుల్లోనూ తరగతులను కొనసాగిస్తే కొన్నిరోజులు సర్దుబాటవుతాయని భావిస్తున్నారు. – ఎన్ని పనిదినాలు ఉంటాయో తేలితే ఆమేరకు సిలబస్‌ను కుదించాలని భావిస్తున్నామని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణమండలి డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. తమ విద్యార్థులకు 50 శాతం మేర సిలబస్ తగ్గించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. – 11, 12 తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ 30 శాతం మేర సిలబస్ కుదించింది. ఇంటర్మీడియట్ బోర్డు కూడా అదే మాదిరి సిలబస్‌ను కుదించి వెబ్సైట్లో ఉంచింది. యూజీసీ మార్గదర్శకాల మేరకు డిగ్రీ సిలబస్ – యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలను అనుసరించి ఉన్నత విద్యలో డిగ్రీ తదితర కోర్సుల్లో సిలబస్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. – తొలుత కాలేజీలను నవంబర్ 2 నుంచి తెరవాలన్న యూజీసీ ఇప్పుడు నవంబర్ 18 నుంచి తెరవాలని ఆదేశించింది. – పనిదినాలు తగ్గకుండా సర్దుబాటు చేసుకోవాలని, విద్యాసంవత్సరాన్ని ఆగస్టు చివరి వరకు కొనసాగించవచ్చని పేర్కొంది. – డిగ్రీలో ఒక సెమిస్టర్‌కు 90 రోజుల చొప్పున ఏడాదికి 180 పనిదినాలు ఉండాలి. ఆగస్టు వరకు విద్యాసంవత్సరం కొనసాగిస్తే పనిదినాలు సరిపోవచ్చని, సిలబస్ కుదింపు అవసరం లేకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ఇంటర్లో 30 శాతం సిలబస్ తగ్గుదల..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌ను తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్(ప్రథమ), సెకండ్ ఈయర్(ద్వితీయ సంవత్సరం)లో 30 శాతం సెలబస్ తగ్గించింది. సీబీఎస్ఈ సూచనల ప్రకారం ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు సబ్జెక్ట్‌లో 30 శాతం సెలబస్‌ను ఇంటర్ బోర్డు తగ్గించింది. మరోవైపు ఇంటర్ సెకండ్ ఈయర్‌లో హిస్టరీ, ఏకనామిక్స్, పొలిటికల్ సైన్స్ (సివిక్స్), జియోగ్రఫ్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంటెన్సీలో సెలబస్‌ను ఇంటర్ బోర్డు తగ్గించింది. అయితే తగ్గించిన సిలబస్ 2020-21 సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని, తగ్గించిన సెలబస్‌ను ఇంటర్ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. కాగా కరోనాను నివారించేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కారణంగా, దేశ వ్యాప్తంగా నాలుగు నెలల తరగతులు నిర్వహించలేకపోయారు. అయితే ఆలస్యం కావడం వల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం (సీబీఎస్ఈ) ఈ విద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్(సంవత్సరం పాటు క్లాసులు నిర్వహించకపోవడం) నుంచి కాపాడటానికి కొన్ని సూచనలు చేసింది. తగ్గించిన సిలబస్ వివరాలను టీఎస్‌బీఐఈ అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లో సందర్శించవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. -
ఇటు ప్రవేశాలు.. అటు తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు, తరగతుల ప్రారంభం విషయంలో ఇంటర్ బోర్డు విచిత్రమైన షెడ్యూల్ జారీ చేసింది. మొదటి దశ ప్రవేశాలను బుధవారం(16వ తేదీ) నుంచి ప్రారంభిస్తున్నామని, బుధవారమే ప్రకటించిన బోర్డు, 30 వరకు ప్రవేశాలకు అవకాశం ఉన్నా, ఆన్లైన్ తరగతులను శుక్రవారం నుంచే (18వ తేదీ) ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. దీంతో ఫస్టియర్ ప్రవేశాలకు కనీసం ఐదారు రోజుల సమయం కూడా ఇవ్వకుండా, విద్యార్థుల చేరికలు మొదలుకాగానే తరగతుల ప్రారంభానికి షెడ్యూల్ ఏంటని అధ్యాపకులే ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ షెడ్యూల్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు అన్నింటికీ వర్తిస్తుందని పేర్కొంది. మొదటిసారిగా ఈడబ్ల్యూఎస్ కోటా మరోవైపు జూన్ 1న కావాల్సిన తరగతులు ఇప్పటికే ఆలస్యం అయినందున నష్టపోయిన పని దినాలను సర్దుబాటు చేసేందుకు ఫస్టియర్‌లో 30 శాతం సిలబస్‌ను తగ్గించేలా బోర్డు చర్యలు చేపట్టింది. రెండో దశ ప్రవేశాల షెడ్యూల్‌ను త్వరలోనే జారీ చేస్తామని పేర్కొంది. ప్రిన్సిపాళ్లు పదో తరగతిలో విద్యార్థుల ఇంటర్నల్ మార్కులతో కేటా యించిన గ్రేడ్ పాయింట్ ఆధారంగా ప్రవేశాలు చేపట్టాలని తెలిపింది. కాలేజీల్లో ఆయా సామాజిక వర్గాల రిజర్వేషన్లతోపాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు 10 శాతం సీట్లను కేటాయించాలని, మొత్తంగా బాలికలకు 33.33 శాతం సీట్లను కేటాయించాలని వివరించింది. ప్రతి సెక్షన్లో 88 మందినే తీసుకోవాలని, ఉల్లంఘిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించింది. జోగినీ పిల్లలకు తండ్రి స్థానంలో తల్లి పేరును నమోదు చేయాలని స్పష్టం చేసింది. అనుబంధ గుర్తింపు ఇంకా ఇవ్వలేదు.. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. పైగా ఈ నెల 22 వరకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు కాలేజీ యాజమాన్యాలకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు అదే బోర్డు బుధవారం నుంచే కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయని, 18 నుంచి తరగతు లు కొనసాగుతాయని ప్రకటించింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపే ఇవ్వకుండా ఎలా ప్రవేశాలు చేపడతారన్నది అర్థంకాని ప్రశ్నగా మారింది. పైగా అనుబంధ గుర్తింపు లేని (అఫిలియేషన్) కాలేజీల్లో చేరవద్దని, నష్టపోవద్దని ఇంటర్ బోర్డు ప్రతిసారీ ప్రకటనలు జారీచేస్తుండటం గమనార్హం. దీంతో రాష్ట్రం లోని 1496 ప్రైవేటు కాలేజీల్లో ఏ కాలేజీకి ఇం టర్ బోర్డు అనుబంధ గుర్తింపును ఇస్తుందో.. ఏ కాలేజీకి ఇవ్వదో తెలియదు. 1136 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇచ్చినట్టు మాత్రం తమ వెబ్సైట్లో పేర్కొంది. -
సప్లిమెంటరీ విద్యార్థులకు పాస్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దుచేసిన నేపథ్యంలో ఆ పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థులం దరికీ కనీస పాస్ మార్కులను ఇవ్వాలని ఇంట ర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలు రాసి, పలు సబ్జె క్టుల్లో ఫెయిలైన వారు, అపుడు పరీక్ష ఫీజు చెల్లించి ఒకటీ రెండు సబ్జెక్టులు రాయలేక పోయిన వారందరికి ప్రతి సబ్జెక్టులో 35 చొప్పున కనీస పాస్ మార్కులను ఇచ్చి పాస్ చేసేందుకు చర్యలు చేపట్టింది. రెండు, మూడు రోజుల్లో ఈ ఫలితాలను ప్రకటించనుంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా.. మేలో నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కరోనా నేప థ్యంలో ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలి సిందే. దీంతో ఆ పరీక్షలకు హాజరయ్యే అర్హత కలిగిన ప్రతి విద్యార్థి కంపార్ట్మెంటల్లో పాసై నట్లుగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా విద్యార్థి వారీగా ఫెయిలైన సబ్జెక్టులను గుర్తించి, వాటిల్లో కనీస మార్కులను వేసి, ఆయా విద్యార్థుల ఫలితాలను ప్రకంటించేలా చేపట్టిన ప్రక్రియ పూర్తి కావచ్చింది. మొత్తంగా 1,47,519 మంది విద్యార్థుల ఫలితాలను త్వరలోనే బోర్డు ప్రకటించనుంది. బ్యాక్లాగ్ విద్యార్థులకు కూడా.. ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థుల ప్రథమ సంవత్సర బ్యాక్‌లాగ్స్‌లో (ఫెయిలైన సబ్జెక్టులు) కూడా పాస్‌చేసేలా చర్యలు చేపట్టింది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన సబ్జెక్టులే కాకుండా ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సబ్జెక్టుల్లో కూడా ఆయా విద్యార్థులను పాస్ చేయనుంది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన వారు 1,47,519 మంది విద్యార్థులు ఉండగా, ప్రథమ సంవత్సర బ్యాక్‌లాగ్స్ కలిగిన విద్యార్థులు మరో 20 వేల మందికిపైగా ఉన్నట్లు సమాచారం. వీరందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 చొప్పున కనీస పాస్ మార్కులివ్వనుంది. గ్రూపుల వారీగా సెకండియర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఎంపీసీ 42,427 బైపీసీ 25,292 ఎంఈసీ 7,416 సీఈసీ 56,341 హెచ్ఈసీ 5,581 ఇతరులు 148 మొత్తం 1,47,519 -
ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిలైన వారు పాస్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ సెకండియర్–2020 పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారందరినీ కంపార్టుమెంటల్ కేటగిరీలో పాసైనట్లుగా రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. వీరికి నిర్వహించాల్సిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కోవిడ్–19 నేపథ్యంలో రద్దు చేసి ‘ఆల్‌పాస్’గా ప్రభుత్వం ప్రకటించినందున అభ్యర్థులు ఫెయిలైన సబ్జెక్టులన్నిటికీ పాస్ మార్కులు వేస్తూ కంపార్టుమెంటల్ కేటగిరీలో పాస్ చేసినట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు. అలాగే ఫస్టియర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం 2021 మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షల్లో రాసుకోవాలన్నారు. సెకండియర్ పరీక్షలతో పాటు ఫస్టియర్ సబ్జెక్టులకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
కార్పొరేట్ కాలేజీల దోపిడీ షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఇంకా అనుబంధ గుర్తింపును ప్రకటించకున్నా కార్పొరేట్ కాలేజీలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను చేర్చుకున్నాయి. కరోనా వైరస్ తాకిడి వల్ల ఓవైపు మిగతా విద్యాసంస్థలన్నీ మూతబడి ఉన్నా ఈ కాలేజీలు మాత్రం అప్పుడే ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10 వేల చొప్పున అడ్వాన్స్‌లు వసూలు చేసి మరీ ఆన్లైన్ తరగతులు ప్రారంభించేశాయి. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సాధారణ జూనియర్ కాలేజీలు ఏం చేయాలో అర్థంకాక ఆందోళనలో పడ్డాయి. కార్పొరేట్ కాలేజీల దెబ్బతో తమ కాలేజీల్లో ప్రవేశాలపై ప్రభావం పడే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆగస్టులో మొదలు కావాల్సి ఉన్నా... రాష్ట్రంలో 2,558 జూనియర్ కాలేజీలుండగా వాటిలో 1,583 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అందులో హాస్టల్ వసతిగల కార్పొరేట్ కాలేజీలు 570 వరకు ఉన్నాయి. వాటిల్లోనే ఏటా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఆ కాలేజీలే ముందస్తుగా ప్రవేశాలను చేపట్టి తరగతులను ప్రారంభించేశాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కావాలి. ద్వితీయ సంవత్సర తరగతులు కొనసాగాలి. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తరగతుల ప్రారంభం వాయిదా పడింది. మరోవైపు జూలై 20 వరకు అఫిలియేషన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయితే ఆ తరువాత అనుబంధ గుర్తింపు ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అంటే ఆగస్టులోనే ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయినా కార్పొరేట్ కాలేజీలు అప్పుడే ఆన్లైన్ తరగతులను ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుబంధ గుర్తింపుపై స్పష్టత రాకున్నా.. రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రమాదం పొంచి ఉంది. గతేడాది ఇంటర్ బోర్డు నిబంధనలను పాటించని భవనాల్లో కొనసాగుతున్న 68 కాలేజీలను హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ కాలేజీలు వేరే భవనాల్లోకి వెళ్తేనే వాటికి అనుబంధ గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే వాటిల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే కొత్తగా ఏ కాలేజీకి అనుబంధ గుర్తిం పు వస్తుందో, ఏయే కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాదో తెలియని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కార్పొరేట్ కాలేజీలు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలను చేపట్టి తల్లిదండ్రుల నుంచి ఫీజులను దండుకుంటున్నాయి. ఇంత జరుగుతున్న ఇంటర్ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. రాయితీల పేరిట టెస్టులు.. రాయితీల పేరుతోనూ కార్పొరేట్ కాలేజీలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నా యి. తమ కాలేజీలో చేరేందుకు, ఫీజు రాయితీ పొందేందుకు ముందుగా రూ. 10 వేలు చెల్లించాల్సిందేననన్న నిబంధనను విధించి తల్లిదండ్రుల నుంచి డబ్బు దండుకుంటున్నాయి. కరోనా కారణంగా ఈసారి టెన్త్ విద్యార్థులందరినీ ప్రభుత్వం పరీక్షల్లేకుండానే పాస్ చేయగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం తాము పెట్టే టెస్టులో టాప్ మార్కులు వచ్చిన వారికి ఫీజులో రాయితీ ఇస్తామంటూ పరీక్షలను నిర్వహిస్తున్నా యి. ఇటీవల నిజాంపేటలో ఓ కార్పొరేట్ కాలేజీ అడ్మిషన్ టెస్టు పెట్టగా విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అయినా టెస్టు ల పరంపర కొనసాగుతూనే ఉంది. కఠిన చర్యలు తీసుకోవాలి... ఇంటర్ తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు. అయినా కార్పొరేట్ కాలేజీలు ఆన్లైన్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాయి. భారీగా డబ్బు గుంజుతున్నా 4 వేల మంది అధ్యాపకులను ముందస్తు నోటీసులు లేకుండా తొలగించాయి. ఈ చర్యలకు పాల్పడిన కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
వారంలోగా ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలను వారంలోగా వెల్లడించేందుకు వీలుగా ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి కోవిడ్–19 నేపథ్యంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను క్లౌడ్ సర్వీస్ ద్వారా విడుదల చేయనున్నామని బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాల డేటా కావలసిన వెబ్సైట్లు, ఇతరులు తమ సమాచారాన్ని ముందుగా బోర్డుకు అందించాలన్నారు. వెబ్సైట్ల నిర్వాహకులు వెబ్సైట్ పేరు, యూఆర్ఎల్ వివరాలు అందించాలి. ఇతరులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ అందించాలి. ఈ వివరాలను probieap@gmail.comకు పంపించాలి. ఇలా ఉండగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు సంబంధించిన దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తిచేసి తదనంతర ప్రక్రియలపై బోర్డు నిమగ్నమైంది. ఇవి వారంలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. అవి పూర్తయ్యాక అన్నీ సజావుగా ఉన్నాయని తేలాకనే ఫలితాల తేదీ ప్రకటిస్తారు. -
నాడు ఉచితం.. నేడు కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన విధులకు హాజరయ్యేందుకు నాడు ఉచితంగా ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డు ఇప్పుడు ఆ చార్జీలను అధ్యాపకుల నుంచే వసూలు చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మూల్యాంకన విధులకు హాజరైనందుకు గాను అధ్యాపకులకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్‌ను ఇంటర్ బోర్డు నిలిపివేసింది. ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై అధ్యాపకులు, అధ్యాపక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కష్టకాలంలోనూ పనిచేస్తే ఇదేం పని? కరోనా నేపథ్యంలో మూల్యాంకనం ఆగిపోతే విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధ్యాపకులంతా గత నెలలో నిర్వహించిన మూల్యాంకనకు ప్రాణాలు తెగించి మరీ విధులకు హాజరయ్యారు. దాదాపు 16 వేలమంది మూల్యాంకన విధులను నిర్వర్తించారు. వారికోసం బోర్డు 362 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అందులో 25 మంది చొప్పున ప్రయాణించారు. అయితే ఒక్కో బస్సులో 50 మంది ప్రయాణం చేయాల్సి ఉందని, 25 మందే ప్రయాణించినందున మిగతా 25 మందికి సంబంధించిన చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రత్యేక బస్సుల చార్జీలు సాధారణ చార్జీల కంటే నాలుగు రెట్లు ఉంటుందని, అందులో ఒక వంతు చార్జీలు అధ్యాపకుల దగ్గర్నుంచే వసూలు చేయాలని, అందుకే మూల్యాంకనం పూర్తయినా, ఇంకా విధులకు హాజరైన వారికి రెమ్యూనరేషన్ చెల్లించడం నిలిపివేస్తూ బోర్డు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటుగా సబ్సిడీ భోజన ఖర్చు రూ. 2.5 కోట్లను కూడా మినహాయించాలని బోర్డు అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేయడం పట్ల అధ్యాపక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూల్యాంకన విధులకు హాజరైన వారిలో ప్రైవేటు అధ్యాపకులే ఎక్కువ మంది ఉన్నారు. కరోనా కారణంగా వారికి కాలేజీల నుంచి కూడా వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే పరిష్కరించాలి ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. ఇంటర్‌బోర్డు నిర్ణయంతో మూల్యాంకన విధులకు హాజరైన అధ్యాపకునికి రోజుకు వచ్చే రూ.1,500లలో రూ.800 వరకు చార్జీల కిందే పోయే ప్రమాదం ఉంది. బస్సు చార్జీలు, భోజన ఖర్చులు అధ్యాపకుల నుంచి వసూలు చేయకుండా, రెమ్యూనరేషన్ మొత్తాన్ని చెల్లించాలి. – ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి -
ఇంటర్ కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లలో తప్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన ప్రథమ సంవత్సర కెమిస్ట్రీ, కామర్స్ ప్రశ్నపత్రాల్లో పొరపాట్లు దొర్లాయి. అక్షర దోషాలు, అన్వయ దోషాలు, తప్పుడు పదాలతో విద్యార్థులు గందరగోళపడ్డారు. అయితే ఇంటర్ బోర్డు అధికారులు ఆ తర్వాత అక్షర దోషాలు, అన్వయ దోషాలు ఏయే ప్రశ్నల్లో ఉన్నాయో పరీక్ష కేంద్రాలకు సమాచారం ఇచ్చి, విద్యార్థులకు తెలియజేశారు. కామర్స్ తెలుగు మీడియం ఓల్డ్ సిలబస్‌లో 3 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని గుర్తించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. వాటికి జవా బులు రాసిన (తప్పైనా, ఒప్పైనా) వారందరికీ మార్కులు ఇస్తామని తెలిపారు. మరోవైపు ఈ పరీక్షలు రాసేందుకు 5,03,429 మంది రిజిస్టర్ చేసుకోగా.. 4,78,987 మంది హాజరయ్యారు. ఇక 26 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. పూర్తయిన ప్రథమ సంవత్సర ప్రధాన పరీక్షలు: ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మంగళవారంతో పూర్తయ్యాయి. ఈ నెల 19, 21 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి. ద్వితీయ సంవత్సర ప్రధాన పరీక్షలు ఈ నెల 18తో పూర్తికానున్నాయి. 20, 23 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి. ఇవీ ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులు.. - కామర్స్–1 తెలుగు మీడియం (ఓల్డ్ సిలబస్) సెక్షన్–డి 18వ ప్రశ్నలో డెబిట్ వైపు అప్పులకు బదులుగా క్రెడిట్ నిలువలు అని ఉండాలి. - తెలుగు మీడియం (న్యూ సిలబస్) కామర్స్–1లో 16వ ప్రశ్నలో నిలి అని ఉంది. అక్కడ నిలిపి అని ఉండాలి. - సెక్షన్–ఈ 19వ ప్రశ్నలో తేదీ 8లో చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేశారు అని ఉండాలి. - సెక్షన్–ఎఫ్‌లో 22వ ప్రశ్నలో తేదీ 5న వంశీకి అమ్మిన సరుకుకు బదులుగా వంశీ నుంచి కొన్న సరుకు అని ఉండాలి. అలాగే తేదీ 10లో వంశీకి అమ్మిన సరుకు రూ.1,200 అని ఉండాలి. ఇదీ ప్రింట్ కాలేదు. - సెక్షన్–ఎఫ్‌లో 23వ ప్రశ్నలో 2018 అని పొరపాటుగా వచ్చింది. - సెక్షన్–జీలో 31వ ప్రశ్నలో రుణగ్రస్తులు రూ.28,000 అని ఉండడానికి బదులుగా రూ.22,000 అని వచ్చింది. - కెమిస్ట్రీ–1లో (ఇంగ్లిష్ మీడియం) సెక్షన్–బి 14వ ప్రశ్నలో ప్రశ్న చివరలో ఠీజ్టీజి ్చn ్ఛ్ఠ్చఝp ్ఛ అని ఉండాలి. - సెక్షన్–జీలో 27వ ప్రశ్నలో ్కఅఐఈ ఇఏఉఖ్ఖఉ బదులుగా ్కఅఐఈ అఔఅఖఐఉ అని ఉండాలి. - కెమిస్ట్రీ–1లో (తెలుగు మీడియం) సెక్షన్–బీలో 15వ ప్రశ్నలో 10.6 శాతానికి బదులుగా 10.06 శాతం అని ఉండాలి. - సెక్షన్–బీలో 16వ ప్రశ్నలో ఏ్గఈఐఈఉకు బదులుగా ఏ్గఈఖఐఈఉ అని ఉండాలి. -
ఒక్క నిమిషం ఆలస్యంపై పిల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షలకు అనుమతించబోమని ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే ఈ నిబంధనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టును అభ్యర్థించారు. భోజన విరామ సమయంలో పిల్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. బుధవారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థులు కొద్ది నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు హాజరైతే పరీక్షలు రాసేందుకు అనుమతించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులను మానసికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసే ఈ నిబంధనను రద్దు చేయాలని, సమయ పాలనపై విద్యార్థులకు అవగాహన కల్పించాలేగానీ, ఇలాంటి షరతు విధించి ఏడాది చదువును పణంగా పెట్టేలా చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని ఆయన కోరారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,65,156 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5,46,368 మంది, సెకెండియర్ విద్యార్థులు 5,18,788 మంది ఉన్నారు. వీరికోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. -
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుర్తింపు లేని కాలేజీలు ఉన్నాయని, వాటిల్లో వేల మంది విద్యార్థులు చదువుతున్నారంటూ ఇంటర్ బోర్డు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తీరు చూస్తుంటే గుర్తింపు లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్న సంస్థల పక్షాన ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఆ కాలేజీలతో చేతులు కలిపినట్లు, కుమ్మక్కైనట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చే సింది. గుర్తింపు లేని కాలేజీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై ఏ చ ర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఇంటర్ బోర్డుతోపాటు ప్ర భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు అనుమతుల్లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్నాయని, సెలవుల్లోనూ కాలేజీలను నడుపుతున్నాయని, వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ ఉప్పల్‌కు చెందిన రాజేష్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కనీసం 20 వేల మంది విద్యార్థులు గుర్తింపు లేని కాలేజీల్లో చదువుతున్నారని, వాళ్ల జీవితాలతో ఆడుకునే అవకాశం ఇంటర్ బోర్డు క ల్పించినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. వచ్చే విద్యా సంవత్స రం ప్రారంభంలోనే కాలేజీలకు గుర్తింపు దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటామని ఇంటర్‌బోర్డు చెప్పడంపై ధర్మాసనం స్పందిస్తూ.. హత్య చేసిన వ్యక్తి ఇక ముందు హత్యలు చేయబోనని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే హంతకుడ్ని వదిలేస్తామన్నట్లుగా ఉందంది. జరిమానాలు వసూలు చేశాం..: హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇంటర్ బోర్డు కార్యదర్శి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ‘అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీలు లేకుండా ఉన్న భవనాల్లో నారాయణ 28, శ్రీచైతన్య 18 చొప్పున కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ఇంటర్ బోర్డు అనుమతి లేకుండానే వాటిలో కాలేజీ లు నిర్వహిస్తున్నాయి. ఇందులో నారాయణ 4, శ్రీచైతన్య 2 కాలేజీలు ఉన్నాయి. ఒక్కో కా లేజీకి రూ.లక్ష చొప్పున పెనాల్టీ వసూలు చే శాం. ఆ తర్వాతే వాటిని వేరే చోటకు తరలించేందుకు అనుమతి ఇ చ్చాం. సెలవుల్లో కూడా ఆ కాలేజీలు తరగతులు నిర్వహించడంతో రోజుకు రూ.50 వేలు చొప్పున జరిమానా విధించాం. రూ.17 లక్ష లు నారాయణ, రూ.10 లక్షలు శ్రీచైతన్యలకు జరిమానాగా వసూలు చేశాం. నారాయణ, శ్రీచైతన్యలకు 52 హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్‌పై హైకోర్టులో మరో కేసు విచారణలో ఉంది. హైకోర్టు ఆదేశాలిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నారాయణ 79, శ్రీచైతన్య 71 కాలేజీల్లో తనిఖీలు చేశాం’ అని కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. జరిమానాలు విధించి వదిలేస్తారా? ప్రభుత్వం తరఫున ప్రత్యే క న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వాదిస్తూ, అఫిలియేషన్ లే కుండా కాలేజీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసు కుంటామని చెప్పారు. నారాయణ 79, శ్రీచైతన్య 71 కాలేజీల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే 46, 49 చొప్పున కా లేజీలకు అనుమతిచ్చామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. మార్చిలో వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో చట్ట ప్రకారం అనుమతులు పొందాలని ఆయా కాలేజీలకు నో టీసులిచ్చినట్లు తెలిపారు. గుర్తింపు లేని కాలేజీలపై ఏ చర్యలు తీసుకున్నారో ఇంటర్ బోర్డు అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను 27కి వాయిదా వేసింది. -
ఇంటర్ బోర్డుపై టీఎస్ హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: నారాయణ, చైతన్య కళాశాలలకు సంబంధించి ఇంటర్ బోర్డు సమర్పించిన నివేదిక పై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో ఎలాంటి అంశాలను పొందు పరచలేదని హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారని ప్రశ్నించింది. ‘నారాయణ, చైతన్య కళాశాలలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు.. కళాశాలల్లో వసతులు, ఇప్పటి వరకు కళాశాలల్లో ఎంత మంది విద్యార్థులు మృతి చెందారు’ వంటి పూర్తి వివరాలతో మరోసారి నివేదిక సమర్పించాలని ఇంటర్‌బోర్డును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టులో పిల్.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వం జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదని పిల్లో పేర్కొన్నారు. జీవోలను ఎందుకు వెబ్సైట్లో ఉంచడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. (దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్‌గోపాల్ వర్మ భేటీ) -
ఆ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల్లో నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య సబ్జెక్టులలో విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణణ సాధించాల్సి ఉంది. ఇప్పటి వరకూ నామమాత్రంగా జరిగిన ఈ పరీక్షలను ఇంటర్మీడియెట్ బోర్డు కఠినతరం చేసింది. ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని వారికి సెకండియర్ పరీక్షలు పూర్తి చేసిన తరువాత ఇచ్చే పాస్ ధ్రువీకరణ పత్రాన్ని బోర్డు జారీ చేయబోదు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఆ రెండు పరీక్షలను ఈ నెల 28, 30 తేదీల్లో నిర్వహించేందుకు బోర్డు గతంలోనే షెడ్యూల్‌ను విడుదల చేసింది. 28వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నైతికత, మానవ విలువలు, 30న పర్యావరణ విద్య సబ్జెక్టుల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షల్లో పాస్ కావడానికి విద్యార్థులు 35 మార్కులు సాధించాలి. నైతికత, మానవ విలువల సబ్జెక్టులో 60 మార్కులు పరీక్షకు, 40 మార్కులు ప్రాజెక్టు వర్క్‌కు కేటాయించారు. అలాగే పర్యావరణ విద్య సబ్జెక్టులో 70 మార్కులు పరీక్షకు, 30 మార్కులు ప్రాజెక్టు వర్క్‌కు కేటాయించారు. గతంలో ఈ పరీక్షలకు హాజరుకానివారు, హాజరైనా పరీక్షలో ఉత్తీర్ణత సాధించని సెకండియర్ విద్యార్థులు తమ ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్‌తో ఈ పరీక్ష రాయవచ్చు. ఆన్లైన్ ప్రశ్న పత్రాల ద్వారా పరీక్షలు నైతికత, మానవవిలువలు, పర్యావరణ విద్య, ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్ బోర్డు ఆన్లైన్ ప్రశ్నపత్రాల ద్వారా నిర్వహించనుంది. ముద్రించిన ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపే పద్ధతికి స్వస్తి పలికింది. పరీక్ష సమయానికి ముందు ఇంటర్ బోర్డు ఈ ఆన్లైన్ ప్రశ్న పత్రాన్ని విడుదల చేయనుంది. ఈ ప్రశ్న పత్రాన్ని డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్సైట్లో పొందుపరిచినట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ ఇంటర్మీడియెట్ (జనరల్) సెకండియర్ విద్యార్థులకు, ఇంటర్మీడియెట్ (ఒకేషనల్) ఫస్టు, సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 20వ తేదీ వరకు నాలుగు దశల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలకు జంబ్లింగ్ పద్ధతిలో కేంద్రాలు కేటాయిస్తున్నారు. ఇన్విజిలేటర్లను కూడా ఇదే విధానంలో పరీక్ష కేంద్రాల్లో నియమించనున్నారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను https://bie.ap.gov.in వెబ్సైట్లో ఇంటర్ బోర్డు పొందుపరిచింది. -
సాఫ్ట్వేర్ సమస్యలన్నీ సరిదిద్దాం
సాక్షి, హైదరాబాద్: ‘సాఫ్ట్వేర్ సమస్యలన్నీ సరిదిద్దాం.. కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్నాం.. గత పరీక్షల సమయంలో దొర్లిన ప్రతి తప్పునూ సవరించాం.. విద్యార్థులు ఈసారి ఎలాంటి భయా నికి గురికాకుండా పరీక్షలు రాయవచ్చు. పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నాం’అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. వచ్చే మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 9,62,699 మంది ఫీజు చెల్లించారని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు మరికొంత మంది ఫీజు చెల్లించే అవకాశం ఉందని, అవసరమైతే ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తామని చెప్పారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఉమర్ జలీల్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పరీక్షలకు ముందు, పరీక్షల తరువాత కంప్యూటర్ ప్రాసెసింగ్‌లో దొర్లిన తప్పుల విషయంలో త్రీమెన్ కమిటీ ఇచ్చిన సిఫారసులు అన్నింటినీ అమలు చేస్తున్నామని జలీల్ స్పష్టం చేశారు. త్రీమెన్ కమిటీ లేవనెత్తిన అంశాలను, తమ దృష్టికి వచ్చిన లోపాలను పరిగణనలోకి తీసుకొని, అవేమీ దొర్లకుండా ఈసారి సొంత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని తెలిపారు. బోర్డులో ప్రత్యేకంగా ఐటీ, డొమైన్ టీమ్‌లను (ఈడీపీ) నియమించామని చెప్పారు. ఈసారి పరీక్షల నిర్వహణ బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు (సీజీజీ) అప్పగించామని పేర్కొన్నారు. బోర్డుకు, సీజీజీకి మధ్య సమన్వయకర్తగా ఈడీపీ టీం పని చేస్తుందన్నారు. గ్లోబరీనాకు ఉన్న ఒప్పందం వేరే అంశమని, దానికి ఎప్పటివరకు సమయం ఉంది.. ఎన్నాళ్లు చేయాల్సి ఉందన్నది వేరుగా పరిశీలిస్తామన్నారు. 15 వరకు సవరణలకు అవకాశం.. ఫీజు చెల్లించిన విద్యార్థుల వివరాల్లో పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు ఈ నెల 15 వరకు గడువు ఇచ్చామని జలీల్ తెలిపారు. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడాక చెబుతామని వెల్లడించారు. ఈసారి కాలేజీల అనుబంధ గుర్తింపు దరఖాస్తు గడువును జనవరి 15 వరకు పొడగిస్తామని చెప్పారు. -
మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు!
సాక్షి,హైదరాబాద్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసే రెండ్రోజుల ముందు టెన్త్ పరీక్షలు ప్రారంభిస్తుండగా...ఈ సారి కూడా అదే తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వారంలోపు పరీక్షల షెడ్యూల్‌ను ప్రభు త్వ పరీక్షల విభాగంప్రకటించే అవకాశం ఉంది. మార్చి21 నుంచి పరీక్షలు ప్రారంభించే అంశంపై అధికారులు చర్చించినప్పటికీ.. షెడ్యూ ల్లో ఒకట్రెండు రోజులు అటుఇటు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను, 5 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూలును (టైంటేబుల్) బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులకు 2020 ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను జనవరి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎని్వరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను అదే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు. వొకేషనల్ పరీక్షలకు కూడా ఇవే తేదీలను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9.5 లక్షల మంది హాజరుకానున్నారు. -
50 ప్రైవేటు కాలేజీలపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు ఇంటర్మీడియేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝళిపించింది. దసరా సెలవుల్లో నిబంధనలను అతిక్రమించి తరగతులు నిర్వహించిన 50 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు భారీగా జరిమానా విధించింది. రోజుకు రూ.లక్ష చొప్పున కొన్ని కాలేజీలకు రూ.7 లక్షల వరకు జరిమానా విధించింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహించిన ఆ 50 కాలేజీల్లో 2, 3 మినహా మిగతావన్నీ శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలే ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఆయా కాలేజీలు జరిమానా చెల్లించేందుకు నవంబర్ 2 వరకు గడువు ఇచ్చింది. ఆలోగా యాజమాన్యాలు జరిమానా చెల్లించకపోతే ఆ కాలేజీల అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామని, ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల నుంచి పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. బోర్డుకు ఫిర్యాదులు.. రాష్ట్రంలో గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల 20 వరకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది. అయితే ఆ నిబంధనలను కొన్ని కాలేజీలు అమలు చేసినా, కొన్ని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు అమలు చేయలేదు. వాటిపై తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి సంఘాలు బోర్డుకు ఫిర్యాదు చేశాయి. దీంతో బోర్డు అధికారులు సెలవు దినాల్లో తరగతులు నిర్వహించవద్దని సూచించినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు నోటీసులు జారీ చేసినా కార్పొరేట్ యాజమాన్యాలు స్పందించలేదు. దీంతో ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు సీరియస్‌గా తీసుకుని ఆయా కాలేజీలకు జరిమానా విధించింది. -
‘టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి నివేదిక కోరినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న అనామిక సోదరి ఉదయశ్రీ చదువుతున్న ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాలకు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజసింగ్ వెళ్లారు. ఈ క్రమంలో ఉదయశ్రీ కళాశాల ఫీజును మాఫీ చేయాలని యాజమాన్యాన్ని లక్ష్మణ్ కోరారు. దీనికి కళాశాల యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. ఉదయశ్రీ పుస్తకాల ఖర్చులు బీజేపీ తరపున అందిస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. అనంతరం కళాశాలలోనే 15వేల చెక్కును ఉదయశ్రీకి అందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్రిస్తుందని, దీనికితోడు ఇతర పార్టీలపై ఎదురుదాడికి దిగుతుందని ఆయన విమర్శించారు. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని, వెంటనే రాష్ట్రపతికి నివేదిక పంపించాలని డిమాండ్ చేశారు. -
గుర్తింపు లేని కాలేజీలు.. 1,338
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీల అనుబంధ గుర్తింపులో ఏటా తంటాలు తప్పడం లేదు. అనుబంధ గుర్తింపు కోసం ఏయే సర్టిఫికెట్లు అందజేయాలన్న విషయం కాలేజీ యాజమాన్యాలకు తెలిసినా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో నిబంధనల ప్రకారం అత్యధిక ప్రైవేటు జూనియర్ కాలేజీలు వ్యవహరించడం లేదు. బోర్డు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టే కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం గతేడాది డిసెంబర్లోనే నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరించినా కాలేజీలన్నీ నిర్దేశిత సర్టిఫికెట్లను అందజేయలేదు. దీంతో రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు వ్యవహారం గందరగోళంగా మారింది. ఇప్పటివరకు కూడా వాటిని ఇవ్వకపోవడంతో 1,338 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లేకుండా పోయింది. అయితే ఆయా కాలేజీల్లో ఇప్పటికే ప్రవేశాలు పూర్తయ్యాయి. చివరకు విద్యార్థులు భవిష్యత్ పేరుతో అనుబంధ గుర్తింపు పొందేందుకు ఆయా యాజమాన్యాలు చర్యలు వేగవంతం చేశాయి. అందులో 75 కార్పొరేట్ కాలేజీలు ఉండగా, అత్యధికంగా నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలకు చెందినవే కావటం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ఇంటర్ బోర్డు పరిధిలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కాకుండా పాఠశాల విద్యా శాఖ, సంక్షేమ శాఖల పరిధిలో మరో 558 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అందులో 492 కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. మరో 66 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల గుర్తింపు ప్రాసెస్ కొనసాగుతోంది. ప్రైవేటు కాలేజీలు 2,155 ఉండగా, వాటిల్లో 1,699 కాలేజీలే అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిల్లో 361 కాలేజీలకు షరతులతో కూడిన అనుబంధ గుర్తింపును బోర్డు జారీ చేసింది. వాటిలోనూ ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు లేరు. 3 నెలల్లో నియమించుకుంటామన్న షరతుతో వాటికి అనుబంధ గుర్తింపును జారీ చేసింది. మిగతా 1,338 కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపును ఇవ్వలేదు. చివరకు శానిటేషన్ సర్టిఫికెట్లూ లేవు.. రాష్ట్రంలోని ఎక్కువ శాతం ప్రైవేటు కాలేజీలకు రిజిస్టర్ లీజ్ డీడ్, ఫిక్స్డ్ డిపాజిట్ రెన్యువల్, స్ట్రక్చరల్ సౌండ్ నె‹స్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు, ఆట స్థలాలు లేవు. సరిగ్గా ఫ్యాకల్టీ లేరు. గతేడాది అంతకుముందు ఇచ్చి న అనుబంధ గుర్తింపు ఫీజులను చెల్లించలేదు. శానిటరీ, హైజీన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈ కారణాలతో 1,338 కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఇందులో ఐదారు ఫ్లోర్లు కలిగిన భవనాల్లో నడుపుతున్న 75 కార్పొరేట్ కాలేజీలున్నా యి. వాటికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు లేవు. అందులో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందినవి 25, నారాయణ విద్యా సంస్థలకు చెందినవి 26, శ్రీగాయత్రి విద్యా సంస్థలకు చెందినవి 8, ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు చెందినవి 4, ఇతర విద్యా సంస్థలకు చెందినవి 12 ఉన్నాయి. అవన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలోనే ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ కాలేజీలు అన్నింటికి అనుబంధ గుర్తింపు లేకపోవడం, విద్యార్థులను చేర్చుకున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. మరో వారం సమయం ఇస్తాం: అశోక్ అనుబంధ గుర్తింపు తీసుకోని విద్యా సంస్థలకు మరో వారం గడువు ఇస్తామని ఇంటర్ బోర్డు కార్యద ర్శి అశోక్ పేర్కొన్నారు. ఆ తర్వాత అనుబంధ గుర్తిం పు ప్రక్రియను నిలిపివేస్తామని చెప్పారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తెలిపారు. ఆయా విద్యా సంస్థలన్నీ తమకు కాలేజీలకు సంబంధించిన నిర్ధేశి త సర్టిఫికెట్లను అందజేసి అనుబంధ గుర్తింపు పొం దాలన్నారు. అలా గుర్తింపు పొందని విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వంతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. అందులో 194 కాలేజీలకు అనుబందంగా హాస్టళ్లు ఉన్నాయని వివరించారు. హాస్టళ్ల గుర్తింపు విషయంలో కేసు కోర్టులో ఉన్నందు న ఆ విషయం జోలికి వెళ్లడం లేదన్నారు. -
పెద్దింటి వారిని పరామర్శిస్తారు కానీ..
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. జీరో అవర్ చర్చలో భాగంగా తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని బుధవారం లోక్‌సభలో ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...సీఎం కేసీఆర్ విద్యను కేవలం వ్యాపార దృక్పథంతో చూస్తూ.. అనుభవం లేని గ్లోబరీనా వంటి సంస్థకు ఫలితాల విడుదలు చేసే బాధ్యతను అప్పగించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 3 లక్షలమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ముగ్గురు సభ్యుల కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ పోరాటం ఆపదు.. సీఎం కేసీఆర్ పాలన నీరో చక్రవర్తిలా సాగుతుందని ఎంపీ సంజయ్ దుయ్యబట్టారు. పెద్దింట్లో చనిపోయిన వారిని పరామర్శించేందుకు సమయం ఉండే ముఖ్యమంత్రికి.. ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు మాత్రం సమయం ఉండదా అని ప్రశ్నించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించేంత వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. -
ఆత్మహత్యలకు ఫలితాలు కారణం కాదు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాలకు విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధం లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమేనని, అయితే ఇంటర్ ఫలితాలకు వారి ఆత్మహత్యలకు సంబంధం లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 3.82 లక్షల మంది ఇంటర్ పరీక్షల్లో తప్పితే వారందరి జవాబు పత్రాలను ఎలాంటి రుసుము వసూలు చేయకుండా రీవెరిఫికేషన్ చేస్తే 1,183 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని, ఇది 0.16 శాతమని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. రీవెరిఫికేషన్ తర్వాత 460 మంది మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. లక్షల సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాసినప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థుల పత్రాల్ని రీవెరిఫికేషన్లో వెలువడిన ఫలితాల శాతాన్ని బేరీజు వేసి చూస్తే తప్పు జరిగినట్లు పరిగణించాల్సిన స్థాయిలో లేదని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది. ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం తప్పుల తడకగా జరగడంతో 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీరి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, తప్పులు చేసిన ఇంటర్ బోర్డు సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుత్‌రావు, న్యాయవాది రాపోలు భాస్కర్ వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, అయితే వారి ఆత్మహత్యలకు ఇంటర్ ఫలితాలకు సంబంధం లేదని, పిటిషనర్ కోరినట్లుగా వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించే ఆదేశాలివ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అదేవిధంగా ఇంటర్ బోర్డు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయంలోనూ ఆదేశాలివ్వలేమని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు రెండు పిల్స్‌ను తోసిపుచ్చింది. -
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఇవాళ మధ్యాహ్నం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్‌ను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన రవిశ్రీ తేజ, సెకండ్ ర్యాంక్ డి.చంద్రశేఖర్ మూడో ర్యాంక్ ఆకాశ్ రెడ్డి (హైదరాబాద్), నాలుగో ర్యాంక్ కార్తీకేయ (హైదరాబాద్) సాధించారు. ఇక ఇంటర్ వెయిటేజ్ మార్కుల కారణంగా ఎంసెట్ ఫలితాలు విడుదలలో జాప్యం జరిగింది. కాగా గత నెల 3, 4, 6, 8, 9 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,42,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో తొలి పది ర్యాంకర్లు 1. కురిచేటి రవి శ్రీతేజ (తాడేపల్లిగూడెం) 2. చంద్రశేఖర్ (హైదరాబాద్) 3. ఆకాశ్ రెడ్డి (హైదరాబాద్) 4. కార్తికేయ (హైదరాబాద్) 5. భాను దత్తా (భీమవరం) 6. సాయి వంశీ (హైదరాబాద్) 7. సాయి విజ్ఞాన్ (హైదరాబాద్) 8. ఐతేంద్ర కశ్యప్ (గిద్దలూరు) 9. వేద ప్రణవ్ (హైదరాబాద్) 10. అప్పకొండ అభిజిత్ రెడ్డి (హైదరాబాద్) అగ్రికల్చర్, ఫార్మసీలో.. 1.కుశ్వంత్ (భూపాల్పల్లి) 2. దాసరి కిరణ్ కుమార్ (రాజమండ్రి) 3. వెంకట సాయి తేజ (కాకినాడ) 4. సుంకర సాయి స్వాతి (తిరుపతి) 5. అక్షయ్ (హైదరాబాద్) 6. మోనిష ప్రియ (తమిళనాడు) 7. బుర్ర శివాని శ్రీవాత్సవ (నిజామాబాద్) 8. సిద్ధార్థ భరద్వాజ్ (విశాఖపట్నం) 9. పూజ (తిరుపతి) 10. హశిత (హైదరాబాద్) -
విద్యార్థులను ఈడ్చిపారేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటాలాడుతున్న ఇంటర్ బోర్డు తీరుపై ఏబీవీపీ కార్యకర్తలు కదంతొక్కారు. ఫలితాల వెల్లడిలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ర్యాలీగా బయల్దేరి ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు దూకి లోపలికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అక్కడి చేరుకున్న పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విద్యార్థులను దారుణంగా ఈడ్చిపారేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇంటర్మీడియట్ బోర్డులో నేటికీ సాంకేతిక తప్పిదాలు దొర్లుతూనే ఉన్నాయి. రోజుకో రకమైన సమస్యలు బయటకు వస్తూనే ఉన్నాయి. వార్షిక పరీక్షల ఫలితాల్లో సాంకేతిక తప్పిదాలతో విద్యార్థుల మార్కుల జాబితాల్లో అనేక తప్పులు ఇచ్చిన ఇంటర్ బోర్డు.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లలోనూ సాఫ్ట్వేర్ సంస్థ పొరపాట్లు చేసింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకే సబ్జెక్టులో పరీక్ష రాసే ఒకే విద్యార్థికి రెండు వేర్వేరు నంబర్లతో హాల్‌టికెట్లు జనరేట్ చేసి పంపడం వంటి తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినా.. ఇంటర్‌బోర్డు అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణి వీడటం లేదు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మారని తీరు.. విద్యార్థి తండ్రి ఆవేదన నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కళ్లు కోల్పోయిన విద్యార్థి పట్ల ఇంటర్ బోర్డు వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటి సమస్యతో ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న విద్యార్థి శుక్రవారం పరీక్ష రాయాల్సి ఉంది. అయితే నిన్న రాత్రే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సదరు విద్యార్థి పరీక్ష రాసేందుకు తనకు స్క్రైబ్ కావాలని కోరాడు. దీనికి బోర్డు అనుమతి లభిస్తేనే స్క్రైబ్‌ను ఇచ్చేందుకు వీలుంటుందని ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు చెప్పారు. ఈ క్రమంలో విద్యార్థి తండ్రి ఉదయం ఎనిమిది గంటలకే ఇంటర్ బోర్డు వద్దకు చేరుకున్నా.. సిబ్బంది ఆయనను లోపలికి అనుమతించలేదు. అయితే అప్పటికే పరీక్ష ప్రారంభమైనా గంటపాటు గ్రేస్ పీరియడ్ ఇస్తామని సెంటర్ నిర్వాహకులు హామీ ఇవ్వడంతో ఆయన ఇంకా అక్కడే వేచి చూస్తుండటం పలువురి కలచివేస్తోంది. -
ఇంటర్ బోర్డులో ఆగని తప్పిదాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ఇంకా సాంకేతిక తప్పిదాలు ఆగట్లేదు. రోజుకో రకమైన సమస్యలు బయటకు వస్తూనే ఉన్నాయి. వార్షిక పరీక్షల ఫలితాల్లో సాంకేతిక తప్పిదాలతో విద్యార్థుల మార్కుల జాబితాల్లో అనేక తప్పులు ఇచ్చిన ఇంటర్ బోర్డు.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లలోనూ సాఫ్ట్వేర్ సంస్థ పొరపాట్లు చేసింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకే సబ్జెక్టులో పరీక్ష రాసే ఒకే విద్యార్థికి రెండు వేర్వేరు నంబర్లతో హాల్‌టికెట్లు జనరేట్ చేసి పంపారు. దీంతో ఆ విద్యార్థి గందరగోళంలో పడ్డారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన న్యావనంది వినోద్ గతంలో కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం ఆ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈనెల 12న ఆ పరీక్ష ఉంది. అయితే ఆ విద్యార్థికి ఒకే సబ్జెక్టుకు రెండు హాల్‌టికెట్లు పంపించారు. 2 వేర్వేరు హాల్‌టికెట్ల నంబర్లతో వేర్వేరు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 1936316671 నంబర్‌తో ఒక హాల్‌టికెట్, 1936316509 నంబర్‌తో మరో హాల్‌టికెట్ పంపించారు. దీంతో ఏ హాల్‌టికెట్‌తో ఎక్కడ పరీక్ష రాయాలో అర్థం కాని స్థితిలో ఆ విద్యార్థి ఉన్నాడు. మరికొంత మంది విద్యార్థుల హాల్టికెట్లలో ఫొటోలు లేకుండా, ఇంకొంత మంది విద్యార్థులు హాల్టికెట్లలో ఫొటో లు ఉండి వివరాలు లేకుండా వచ్చినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బోర్డు హెల్ప్‌లైన్‌కు (040–24600110) ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదని, ఒక వేళ కలిసినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలకు అందని వొకేషనల్ మెటీరియల్ ఇంటర్మీడియట్ వొకేషనల్ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ గురువారం రాత్రి వరకు జిల్లాలకు అందలేదు. శుక్రవారం ఉదయం 7 గంట లకు చీఫ్ సూపరింటెండెంట్లు తమ సిబ్బంది ఒకరిని డీఐఈవో/ఆర్ఐవో కార్యాలయాల దగ్గరికి పంపించి వొకేషనల్ కోర్సుల పరీక్షలకు సంబంధించిన డీ–ఫారమ్స్ తీసుకెళ్లాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయితే బోర్డు ఆదేశాలు బాగానే ఉన్నా.. డీఐఈవో/ఆర్జేడీ కార్యాలయాలకు తమ కాలేజీల నుంచి వెళ్లాలంటే మూడు నాలుగు గంటలపాటు ప్రయాణం చేయాల్సినంత దూరంలో ఉన్న కాలేజీలు ఉన్నాయి. అలాంటి కాలేజీల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు హాల్ టికెట్లలో తప్పులు దొర్లితే చీఫ్ సూపరిం టెండెంట్లు డీఐఈవోల దగ్గరకు వెళ్లి కరెక్షన్ చేయించుకోవాలని బోర్డు ఆదేశాలు జారీచేసింది. అయితే వాటిల్లో హాల్‌టికెట్లు కరెక్షన్ చేస్తారు కానీ మాన్యువల్ బార్ కోడ్ షీట్లు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా జెనరేట్ అయిన హాల్‌టికెట్ ప్రకారమే ఓఎంఆర్ బార్కోడ్ షీట్లను ముద్రించి పంపిస్తారు. హాల్టికెట్లలో కరెక్షన్ చేసినా, ముందుగా జెనరేట్ చేసి పంపిన ఓఎంఆర్ బార్కోడ్ షీట్లలో మార్పు చేసే వీలుండదు. అప్పుడు మాన్యువల్ బార్కోడ్ షీట్లను వినియోగిస్తారు. దీంతో పేపర్ వ్యాల్యుయేషన్ సమయంలో సమస్యలు వస్తాయి. డౌన్లోడ్ కాని జవాబు పత్రాలు రీవెరిఫికేషన్ జవాబు పత్రాలను డౌన్లోడ్ చేసుకునేందుకు, హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు బోర్డు వెబ్‌సైట్‌ను సంప్రదిస్తే అదీ పని చేయట్లేదు. వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో వేల మంది విద్యార్థులు గురువారం తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. శుక్రవారం నుంచే పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో హాల్టికెట్లలో తప్పులు దొర్లడం, హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. -
ఇంటర్ ప్రశ్నపత్రాల పెట్టెలు మాయం
విద్యారణ్యపురి: వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో భద్రపర్చిన ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన రెండు పెట్టెలు మాయమయ్యాయి. బుధవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన చీఫ్ సూపరింటెండెంట్, కస్టోడియన్లకు ప్రశ్నపత్రాలను భద్రపర్చిన రెండు పెట్టెలు మాయమైన విషయం తెలిసింది. ఈ ఏడాది మార్చిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరిగాయి. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 23న రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి చెందిన విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు నుంచి వచ్చిన మూడు సెట్ల ప్రశ్నపత్రాలను 13 పెట్టెల్లో మిల్స్‌కాలనీ పోలీస్టేషన్లో బోర్డు అధికారులు భద్రపర్చారు. ఆ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో ఒక్కో సెట్‌ను మాత్రమే ఉపయోగించారు. మిగతా రెండు సెట్ల ప్రశ్నపత్రాలను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు వినియోగించడం కోసం పెట్టెల్లో అలాగే భద్రపరిచారు. ఈనెల 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రజిత, కస్టోడియన్లు పోలీస్టేషన్‌కు వెళ్లి పరిశీలించగా ప్రశ్నపత్రాలు కలిగిన 13 పెట్టెలలో రెండు పెట్టెలు కనిపించలేదు. దీంతో వారు ఇంటర్ విద్య డీఐఈఓ ఎం.లింగయ్య దృష్టికి తీసుకెళ్లారు. కాగా, హైదరాబాద్‌లోని బోర్డు నుంచి కూడా పలువురు అధికారులు ఈనెల 4న వచ్చి పోలీస్టేషన్లో పరిశీలించినట్లు సమాచారం. బుధవారం కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ రజిత వచ్చి మరోసారి పరిశీలించారు. రెండు పెట్టెలు తక్కువగా ఉండడంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రశ్నపత్రాల పెట్టెల గల్లంతుపై విచారణాధికారిగా ఏసీపీ నర్సయ్యను నియమించినట్లు డీసీపీ నర్సింహ తెలిపారు. ఇదిలా ఉండగా ఒకే గదిలో ఇంటర్, టెన్త్ పరీక్షల ప్రశ్నపత్రాలను పెట్టెల్లో భద్రపరిచారని, అందులో టెన్త్ పరీక్షల ప్రశ్నపత్రాల ఖాళీ పెట్టెలను సంబంధిత అధికారులు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొరపాటున ఇంటర్‌కు సంబంధించిన పెట్టెలు కూడా వారు తీసుకెళ్లారా అనేది తేలాల్సి ఉందని అంటున్నారు. -
నాంపల్లి ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత
-
మరో తప్పిదం.. అందరికీ సున్నా మార్కులే..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాలను మరువకముందే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు (టీఎస్‌ఎస్‌బీటీఈటీ)లోనూ ఇలాంటి ఘనకార్యమే వెలుగు చూసింది. పరీక్ష రాసిన విద్యార్థులందరినీ బోర్డు మూకుమ్మడిగా ఫెయిల్ చేసింది. విద్యార్థులంతా చివరి సెమిస్టర్లో సున్నా మార్కులతో ఫెయిల్ కావడం గమనార్హం. ఈ నెల 1న పాలిటెక్నిక్ డిప్లొమా చివరి ఏడాది ఫలితాలను బోర్డు విడుదల చేసింది. ఫలితాలు చూసుకున్న విద్యార్థులు ఒక్కసారి అవాక్కయ్యారు. ప్రతిభావంతులు, ఈసెట్–2019 టాప్ ర్యాంకర్లు సైతం ఫెయిల్ అవ్వడంతో లబోదిబోమంటున్నారు. అందరూ బాధ్యులే..: ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్ విద్యార్థులకు చివరి సెమిస్టర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆధారంగా ప్రయోగ విభాగంలో మార్కులు వేయాల్సి ఉంటుంది. వీటిని విద్యార్థి ప్రతిభ ఆధా రంగా కాలేజీ యాజమాన్యాలే నిర్దేశిస్తాయి. ఆ మార్కులను కాలేజీ యాజమాన్యమే బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. కానీ పలు కాలేజీ యాజమాన్యాలు బోర్డు నిర్దేశించిన తేదీల్లో అప్లోడ్ చేయలేదు. గడువు పూర్తవడంతో అప్లోడ్ ఆప్షన్‌ను బోర్డు తొలగించింది. దీనిని ఆలస్యంగా గుర్తించిన కాలేజీ యాజమాన్యాలు విషయాన్ని బోర్డుకు వివరించగా.. మార్కులను నిర్దేశిత పద్ధతిలో పంపించాలని కోరింది. దీంతో యాజమాన్యాలు మార్కులను పం పాయి. కానీ ఫలితాల్లో విద్యార్థులకు మార్కులు యాడ్ కాలేదు. సోమవారం మీర్పేట్ సమీపంలోని ఓ కాలేజీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బోర్డుకు ఫిర్యాదు చేశారు. బోరుమంటున్న విద్యార్థులు.. ఈసెట్‌లో టాప్ 100లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఫలితాల్లో ఫెయిల్ కావడంతో బోరుమంటు న్నారు. త్వరలో ఈసెట్ కౌన్సెలింగ్ జరగనున్న నేపథ్యంలో పొరపాట్లు సరిదిద్ది ఫలితాలు ప్రకటించాలని బోర్డు అధికారులను కోరుతున్నారు. -
అశోకా.. ఏంటీ లీల!
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైనట్లు వచ్చిన మార్కులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణురాలైనట్లు బోర్డు ప్రకటించింది. అయితే జవాబు పత్రాల ఫొటో స్టాట్‌లో మాత్రం 21 మార్కులే వచ్చినట్లు చూపించారు. దీంతో అనామిక పాసైనట్లా.. ఫెయిలైనట్లా..? అన్నది సందిగ్ధంగా మారింది. రీవెరిఫికేషన్ చేసిన తరువాత కూడా ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకోవడంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మెమోలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఆమెకు ఏకంగా 28 మార్కులు పెరిగినట్లు చూపించారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కి చెందిన గణేష్‌కుమార్, హారిక దంపతులకు అనామికతో పాటు ఉదయ, సీతల్, భావేష్ అనే పిల్లలున్నారు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే వీరికి పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేదు. దీంతో అనామిక సికింద్రాబాద్ చాచానెహ్రూనగర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఉమా వద్దే ఉంటూ చదువుకుంది. కింగ్‌కోఠిలోని ప్రగతి మహావిద్యాలయలో ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. చదువులోనే కాదు.. ఆటలు, ఎన్సీసీ, ఇతర కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. నాడు 20.. మెమోలో 48... ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో అనామిక (హాల్‌టికెట్ నంబర్ 1961112037)కు ఇంగ్లీష్– 64, ఎకనామిక్స్–55, సివిక్స్ –67, కామర్స్–75, తెలుగు–20 మార్కులు వచ్చినట్లు ప్రకటించింది. మిగతా సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించిన ఆమెకు తెలుగులో 20 మార్కులు మాత్రమే రావడంతో ఫెయిలైంది. పరీక్ష బాగా రాసినప్పటికీ ఎందుకు ఫెయిలైందో అర్థం కాక ఆమె ఒత్తిడికి గురైంది. అదే బాధతో ఏప్రిల్ 18న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయడంతో.. అందులో అనామిక పాసైనట్లు వెల్లడైంది. తెలుగులో ఆమెకు 28 మార్కులు పెరిగి.. మొత్తంగా 48 మార్కులు వచ్చినట్లు ఇంటర్ బోర్డు తన వెబ్ సైట్లో పేర్కొంది. తమ కుమార్తె పాసైనట్లు తేలడంతో అనామిక కుటుంబం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారులు మూల్యాంకనాన్ని సరిగ్గా చేపట్టి ఉంటే తమ చిన్నారి బతికి ఉండేదని అమ్మమ్మ ఉమ, సోదరి ఉదయ కన్నీటిపర్యంతం అయ్యారు. అయితే జావాబు పత్రంలో ఫొటో స్టాట్‌లో మాత్రం అనామికకు 21 మార్కులే వచ్చినట్లు చూపించారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. చనిపోయిన తర్వాత ఫలితాలా? అనామిక పాసైందన్న మెమోను చూసిన తరువాత ఆమె అమ్మమ్మ ఉమ, సోదరి ఉదయ మీడియాతో మాట్లాడారు. చనిపోయిన అనామిక పాసైనందుకు ఆమె ప్రాణాలను తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదేనని, ఈ అంశంపై న్యాయం కోసం కోర్టుకెళ్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఉదయ బోరున విలపిస్తూ చెప్పింది. ఫలితాలు ముందే సరిగ్గా వచ్చి ఉంటే అనామిక బతికేదని, ఇంటర్ బోర్డు అధికారులు తమ పిల్లను పొట్టనబెట్టుకున్నారని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. అనామిక పాస్ కాలేదు: ఇంటర్ బోర్డు ఆరుట్ల అనామిక పాస్ కాలేదని ఇంటర్ బోర్డు సాయంత్రం ఓ ప్రకటన చేసింది. అనామిక సోదరి ఆరుట్ల ఉదయ ఇంటర్ బోర్డు తప్పిదం కారణంగానే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణను ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఖండించారు. ఈ విషయంలో తాము హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకతతో వ్యవహరించామని, రీ వెరిఫికేషన్‌లో అనామికకు కేవలం 20 నుంచి ఒకే ఒక్క మార్కు పెరిగి 21 వచ్చాయని తెలిపారు. కానీ, క్లరికల్ మిస్టేక్ వల్ల ఫలితాల వెల్లడిలో 48 మార్కులు వచ్చినట్లు చూపించిందని వివరించారు. ఈ మేరకు అశోక్ శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. అనామిక రాసిన 24 పేజీల బుక్‌లెట్‌ను కూడా జత చేశారు. -
ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. వేసవి సెలవుల సమయంలోనూ కొన్ని కార్పొరేట్ కళాశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు, శ్రేణులు ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు కలిసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. ఎస్ఎఫ్ఐ నేతలను, శ్రేణులను అడ్డుకున్నారు. అధికారులను వారు కలువకముందే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘం నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్న పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా ఆర్ఐవోపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేట్ కళాశాలకు ఇంటర్ బోర్డు అధికారులు అమ్ముడు పోయారంటూ ఆరోపించారు. -
వేదికపైనే కొట్టుకున్న వీహెచ్, నగేశ్..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ బాహాబాహీకి దిగారు. దీంతో ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై నుంచి వీహెచ్ మాట్లాడుతుండగా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా అక్కడికి వచ్చారు. ఆయన్ను ఆహ్వానిస్తూ మైక్‌లో వీహెచ్ అనౌన్స్ చేశారు. అదే సమయంలో నగేశ్ కూడా వేదికపైకి వెళ్లారు. కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో నగేశ్ కూర్చునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నగేశ్, వీహెచ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. నగేశ్‌పై వీహెచ్ చేయి చేసుకోవడంతో నగేశ్ వీహెచ్ చొక్కా పట్టుకున్నాడు. తోపులాటలో ఇద్దరూ కిందపడిపోవడంతో అక్కడున్న వారు వీహెచ్‌ను పైకిలేపి ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి వచ్చినప్పుడు బాధ్యతగల నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం, నారాయణ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఏకంగా వేదిక మీదే కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడంతో అఖిలపక్ష నేతలు బిత్తరపోయారు. చనిపోయిన పిల్లల కుటుంబాల ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే మీరు గాంధీభవన్‌లో కొట్లాడుకోండంటూ సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. నగేష్‌ను పార్టీ నుంచి బహిష్కరించే యోచన! ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో వీహెచ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ఘర్షణ పడటాన్ని పార్టీ తీవ్రంగానే పరిగణించింది. శనివారం రాత్రి పార్టీ క్రమశిక్షణ సంఘం అత్యవసరంగా భేటీ అయింది. కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఈ గొడవపై చర్చించారు. సీనియర్ నేత వీహెచ్‌పై నగేశ్ దాడి చేసినట్లుగానే భావిస్తున్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పింది. నగేశ్‌ను పార్టీ నుంచి బహిష్కరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు... దీనికి సంబంధించి ఘటనా స్థలంలో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్ అలీ కమిటీ నివేదిక ఇవ్వాలని కుంతియా ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా నగేశ్‌పై చర్యలు తీసుకోనున్నారు. -
న్యాయం జరిగే వరకు పోరాటం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్ బోర్డు వైఫల్యంతో నష్టపోయిన విద్యార్థులకు, ఆత్మహత్యలకు పాల్పడిన 27 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయినా కనీసం స్పందించని మంత్రి జగదీశ్‌రెడ్డివే చిల్లర రాజకీయాలని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు న్యాయం చేయడంతోపాటు తప్పులకు కారణమైన గ్లోబరీనా సంస్థను తొలగించడం, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను, మంత్రి జగదీశ్‌రెడ్డిని తప్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం వెనకేసుకొస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికీ 1000కి పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత తీవ్ర సమస్యలు ఉంటే, రాజు మాత్రం తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారని సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న లాస్య ఇంటికి మంత్రి తలసాని ఇల్లు కూతవేటు దూరమే అయినా ఆయన కనీసం పరామర్శకు కూడా వెళ్లలేకపోవడం శోచనీయమన్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం వెనుకబడిన రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణ చాలా వెనుకబడి ఉందన్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే రాష్ట్రంలో టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనే అని లక్ష్మణ్ పేర్కొన్నారు. మే 23 తర్వాత రాష్ట్రంలో రెండు పార్టీల విధానం వస్తుందన్నారు. కేంద్రంలో ఎవరి మద్దతు లేకుండా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, నక్సలిజం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని పేర్కొన్నారు. రక్షణ రంగానికి పెద్ద పీట వేశారని, మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించిగలిగిందన్నారు. కేంద్రంలో హంగ్ వస్తుందని, అందులోకి వెళ్లాలని కేసీఆర్ పగటి కలలుకంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తాను ఓడిపోతానని తెలిసి ఏవేవో మాట్లాడుతున్నారని ఆయనో చచ్చిన పాముతో సమానమన్నారు. విద్యార్థుల మరణాలపై కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ లేదా సీబీఐ విచారణ కోరుతామన్నారు. వర్సిటీల్లో సిబ్బంది లేకుండా, 60 శాతం ఖాళీలతో న్యాక్ గుర్తింపు ఎలా వస్తుందని, నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. -
ఇంటర్ ఫెయిలైన వారికి ‘ఆన్ డిమాండ్ పరీక్ష’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ‘ప్రత్యేక ఆన్ డిమాండ్ పరీక్ష’ను నిర్వహించనున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ బోర్డు నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అదనంగా ఈ పరీక్షలను రాసే వీలును విద్యార్థులకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వారిలో 3 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, అందులో 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ దృష్ట్యా తాము మొదటిసారి తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని ఎన్ఐవోఎస్ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇందులో విద్యార్థులు తాము ఉత్తీర్ణులైన 2 సబ్జెక్టుల మార్కులను బదిలీ చేసుకొని (ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్), 3 సబ్జెక్టుల పరీక్షలు రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పరీక్షల ఫలితాలను నెల రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొంది. విద్యార్థులు పరీక్షలు రాసిన 3 సబ్జెక్టులు పాస్ అయ్యాక మొత్తం 5 సబ్జెక్టుల మార్కులతో మార్కుల షీట్ ఇస్తామని వివరించింది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తమ www.nios.ac.in, https://sdmis.nios.ac.in వెబ్సైట్లలో సందర్శించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్‌లో విద్యార్థులు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయం 040–24752859, 24750712 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వివరించింది. -
‘విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిన ఘనత ఆయనదే’
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డు వైఫల్యం, గ్లోబరినా సంస్థ పనితీరు, సార్వత్రిక ఎన్నికల వంటి పలు అంశాల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ స్పందించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ కాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో యూనివర్సీటీలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో పని చేసే ట్యూటర్స్‌తో ఇంటర్ పరీక్ష పేపర్లను దిద్దించారని ఆయన ఆరోపింపచారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం వెనకేసుకేసుకొస్తుందని మండిపడ్డారు. నేటికి కూడా తెలంగాణలో దాదాపు వెయ్యికి పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో ఇంత తీవ్ర సమస్యలు ఉంటే.. రాజు మాత్రం తీర్థయాత్రలకు బయలు దేరారని కేసీఆర్‌ని విమర్శించారు. మంచి చదువుల కోసం విద్యార్థులను గ్రామాల నుంచి పట్టణాలకు పంపితే ఆత్మహత్యలే దిక్కవతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఆర్డీఏ రిపోర్టు ప్రకారం వెనకబడ్డ రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణ చాలా వెనకబడి ఉందని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ఎవరి మద్దతు లేకుండానే ఎన్డీయే అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. మే 23 తర్వాత కాంగ్రెస్, టీడీపీల అడ్రస్ గల్లంతవుతుందని తెలిపారు. మోదీ హయాంలో ఇండియాలో భారీ మార్పులు వచ్చాయన్నారు. ఉగ్రవాదం, నక్సలిజం తగ్గిపోయాయని.. నిత్యావసర వస్తువుల ధరలు దిగొచ్చాయని పేర్కొన్నారు. వారణాసిలో నామినేషన్ వేసిన వారంతా టీఆర్ఎస్ ఏజెంట్లే అని లక్ష్మణ్ ఆరోపించారు. -
‘అప్పటివరకు ఉద్యమం ఆపము’
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ అవకతవకల వ్యవహారంలో దోషులను శిక్షించే వరకు ఉద్యమం ఆపమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ స్పష్టం చేశారు. తాము రాజకీయాల కోసం ఈ ఉద్యమాన్ని చేయడం లేదని, ప్రజల మద్దతు ఉందని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పట్ల ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను గాలికి వదిలేసి, కుటుంబ సమేతంగా విహార యాత్రలకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విహారయాత్రలకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాటన్నింటిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని చేస్తున్న ఉద్యమాన్ని చులకన చేసి.. ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, మంత్రి.. ఇంటర్ విద్యార్థుల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేయడంలేదన్నారు. తెలంగాణ వచ్చాక కూడా బిడ్డలు బలవుతున్నారన్నారు. రేపు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకొనే విధంగా కేంద్రాన్ని కోరుతామన్నారు. చనిపోయిన విద్యార్థుల జాబితాను కేంద్ర మంత్రికి ఇస్తామని తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ అడిగామని.. అపాయింట్మెంట్ ఇస్తే ఆయనను కలుస్తామని చెప్పారు. -
ఇంటర్ ఫలితాలు: మరో విద్యార్థిని బలి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : ఇంటర్ ఫలితాలు రాష్ట్రంలోని పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫలితాల కారణంగా 20కిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో మరో విద్యార్థిని బలయ్యారు. జిల్లాలోని జూలూరుపాడు మండలం వెంగన్న పాలెం గ్రామానికి చెందిన సాయిల మానస (17) ఇంటర్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయింది. దీంతో 20 రోజుల కిందట ఆమె పురుగులమందు తాగింది. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం మానస ప్రాణాలు విడిచింది. దీంతో మానస కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటర్ ఫలితాల వెల్లడిలో తీవ్ర అవకతవకలు జరిగినట్టు వెలుగుచూడటం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడేవిధంగా ఇంటర్ ఫలితాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇంటర్ బోర్డు తీరుపైన, ఇంటర్ ఫలితాల కాంట్రాక్ట్ దక్కించుకున్న గ్లోబరీనా సంస్థపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. -
కొనసాగుతున్న ‘ఇంటర్’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల తప్పులతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు బోర్డు నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తులను స్వీకరించిన బోర్డు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం అవుతోంది. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అనేక మంది విద్యార్థుల నుంచి డబ్బు లు కట్ అయినా వారి అప్లికేషన్ నంబరు జనరేట్ కాలేదు. కనీసం బోర్డు హెల్ప్‌లైన్ కేంద్రానికి ఫోన్ చేసి తెలుసుకుందామన్నా అదీ పని చేయకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తమ హెల్ప్‌లైన్ కేంద్రానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని బోర్డు వెబ్సైట్లో సూచించింది. కానీ అది పని చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి ఇంటర్ బోర్డుకు వస్తే అక్కడా లోపలికి రానివ్వకపోవడంతో ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇలా అనేక మంది విద్యార్థులకు ఈ సమస్య రావడంతో రీవెరిఫికేషన్ అవుతుందా లేదా అని గందరగోళంలో పడ్డారు. చివరకు హెల్ప్‌డెస్క్ మెయిల్ ఐడీకి ఫిర్యాదు పంపించినా కనీసం దానికి కూడా స్పందన లేదు. పేపర్ వెరిఫికేషన్ కోసం దాదాపు 42 వేల మంది దరఖాస్తు చేసుకుని రుసుం చెల్లించారు. డబ్బులు కట్ అయినా అప్లికేషన్ నంబరు జనరేట్ కాలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పడ్డారు. తమ జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేస్తారా.. లేదా అన్న ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. -
అవన్నీ అపోహలే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తప్పులు వచ్చినందుకే 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఒకరి మార్కులు ఇంకొకరికి వేశారన్న వాదనలోనూ నిజం లేదని తెలిపింది. సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ పకడ్బందీగా జరుగుతోందని, మూడు స్థాయిల్లో పరిశీలన తర్వాతే ఫలితాలను నిర్ధారిస్తామని పేర్కొంది. మూల్యాంకన ప్రక్రియలో సాఫ్ట్వేర్ సంస్థలకు ఎలాంటి ప్రమేయం ఉండదని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంపట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని, వారి ఆత్మహత్యలకు కారణాలేంటనే దానిపై లోతుగా విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇంటర్ ఫలితాల వెల్లడిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు బోర్డు ఆదివారం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన సారాంశం ఇదీ... ప్రజలకు నిజాలు చెప్పదలిచాం... పరీక్షలు సరిగా రాయలేదని, ఫలితాల్లో తప్పులు వచ్చాయంటూ 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపట్ల అనేక వదంతులు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలకు నిజాలు చెప్పి వాటిని నిలువరించాలని భావిస్తున్నాం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఫలితాల ప్రకటన ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయించడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హాల్‌టికెట్ల జంబ్లింగ్ ద్వారా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు. పలు మాధ్యమాల్లో వస్తున్నట్లు పరీక్ష కేంద్రాలను మాన్యువల్‌గా కేటాయించామనడంలో నిజం లేదు. ఈ బా«ధ్యతలను ఓ సాఫ్ట్వేర్ ఏజెన్సీకి అప్పగించి పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్‌టికెట్ల పంపిణీ చేశాం. ఎగ్జామినర్ల ద్వారానే మూల్యాంకనం... పరీక్షల తర్వాత మూల్యాంకన ప్రక్రియ మార్చి 15 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 12 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో ఎగ్జామినర్ల ద్వారానే మూల్యాంకనం చేయించాం. బోధనలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండి, ప్రభుత్వ, రెసిడెన్షియల్, సంక్షేమ, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులను ఎగ్జామినర్లుగా బోర్డు నియమించింది. మూల్యాంకన ప్రక్రియ అంతా బోర్డు ద్వారా జరిగింది తప్ప సాఫ్ట్వేర్ ఏజెన్సీలకు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు. సమాధాన పత్రాలకు అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన తర్వాత చీఫ్ ఎగ్జామినర్లు, సబ్జెక్టు నిపుణులు వాటిని ర్యాండమ్‌గా పరిశీలించారు. అతితక్కువ, అతిఎక్కువ మార్కులు రావడంతోపాటు కొద్ది తేడాతో ఫెయిల్ మార్కులు వచ్చిన పేపర్లను కూడా పరిశీలించారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంపుల్లో బోర్డు నియమించిన స్క్రూటినైజర్లు కూడా అన్ని పేపర్లూ పరిశీలించారు. అంటే ఒక్కో పేపర్‌ను మూడు స్థాయిల్లో పరిశీలన జరిపించాం. అయితే 99 మార్కులు వచ్చిన విద్యార్థికి 0 మార్కులు వచ్చిన ఘటన ఈ ప్రక్రియలో జరగలేదు. ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమే. మొత్తం 54 లక్షల స్క్రిప్టుల్లో తప్పు జరిగింది కేవలం ఒక్క పేపర్ విషయంలోనేనని అందరూ గమనించాలి. ఒకరి మార్కులు ఇంకొకరికి సాధ్యం కాదు... ఒకరికి వచ్చిన మార్కులు ఇంకొకరికి వేశారనే అపవాదు బోర్డుపై వచ్చింది. అయితే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మార్కులు బార్‌కోడ్‌కు లింక్ అయి ఉంటాయి. ఈ బార్కోడ్.. ఫలితాల ప్రకటన సమయంలో హాల్‌టికెట్ నంబర్‌కు లింక్ అవుతుంది. దీన్ని అనేకసార్లు పరిశీలించాం. సక్రమంగా ఉందని గుర్తించాం. ఈ ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. ఫలితాల్లో గందరగోళం తర్వాత కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ బాధ్యతలను మళ్లీ అదే సాఫ్ట్వేర్ సంస్థకు ఇచ్చామనే ఆరోపణ కూడా ఉంది. కానీ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌లో భాగస్వాములయ్యేది ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లే. ఇందులో సాఫ్ట్వేర్ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే ఈ ప్రక్రియ అనంతరం ఫలితాల ప్రాసెసింగ్‌లో సాఫ్ట్వేర్ సంస్థ పాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలపై నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ఫలితాల ప్రాసెసింగ్‌ను ప్రస్తుత సాఫ్ట్వేర్ సంస్థతోపాటు మరో స్వతంత్ర సంస్థతో కూడా చేయించాలని, ఈ రెండు సంస్థలు చేసిన ఫలితాలు సరిపోలాకే ఫలితాలు విడుదల చేయాలని సూచించింది. అందుకే ఇప్పుడు టెండర్ ద్వారా డేటాటెక్ మెథడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్వతంత్ర సంస్థను టీఎస్టీఎస్ ఎంపిక చేసింది. ఈ నెల 10కల్లా ఫలితాలు... హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ సూచనల ప్రకారం రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి మే 10కల్లా ఫలితాలు ప్రకటిస్తాం. ప్రకటించిన ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుల సమాధాన పత్రాలను 15 రోజులపాటు డౌన్లోడ్ చేసుకునే వీలు కూడా కల్పిస్తాం. ఫలితాల ప్రకటనలో పారదర్శకంగా వ్యవహరించి ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా చేస్తామని ప్రజానీకానికి బోర్డు తెలియజేస్తోంది. మీడియా, ప్రజలు, పౌరసమాజం కూడా వాస్తవాలను ప్రజలకు తెలియజేసి వదంతులకు అవకాశం లేకుండా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఆ విద్యార్థుల జవాబు పత్రాలను ప్రత్యేకంగా పరిశీలించాం... ఫలితాల్లో నెలకొన్న గందరగోళం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయన్న ఆరోపణల్లో నిజం లేదు. ఫలితాలు వచ్చిన ఒక్క రోజులోపే జరిగిన పొరపాట్లన్నింటినీ సవరించాం. చనిపోయిన విద్యార్థుల సమాధాన పత్రాలను ప్రత్యేకంగా పరిశీలన జరిపించాం. సబ్జెక్టు నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలన చేయించాక కూడా ఏ ఒక్క విద్యార్థికీ ఫెయిల్ మార్కుల నుంచి పాస్ అయ్యే మార్కులు రీ వెరిఫికేషన్‌లో రాలేదు. చనిపోయిన వారిలో 14 మంది ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. ఒక్క విద్యార్థి మాత్రం 85 శాతం మార్కులతో ఏ గ్రేడ్‌లో పాసైనా చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుల గురించి నిపుణుల కమిటీ చేత లోతుగా విశ్లేషణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం. ఇప్పటికే చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు బాధలో ఉన్నందున వారి సమాధాన పత్రాలను బయటకు వెల్లడించట్లేదు. అయితే అకాడమిక్‌గా ఉపయోగించుకునేందుకు లేదా ఈ మరణాలపై అధ్యయనం చేసేందుకు ఎవరికైనా ఆసక్తి ఉంటే బోర్డుకు తెలియజేసి వారి సమాధాన పత్రాలను పొందొచ్చు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌లో తప్పు వల్లే... మూల్యాంకన ప్రక్రియ తర్వాత ఓఎంఆర్ షీట్‌లోని పార్ట్–3 ద్వారా బోర్డుకు మార్కుల సమాచారం అందుతుంది. దీన్ని మాత్రమే సాఫ్ట్వేర్ రీడ్ చేస్తుంది. ఇక్కడి నుంచే మళ్లీ సాఫ్ట్వేర్ పాత్ర ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ప్రతి 15 పేపర్ల బండిల్లో ఏవైనా తప్పులుంటే మళ్లీ గుర్తిస్తుంది. ఈ తప్పులను కూడా గుర్తించాక ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేసి ఫలితాలు ప్రచురించాం. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌లో తప్పు జరిగిన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్ష రాసినా ఆబ్సెంట్గా వచ్చింది. పరీక్ష కేంద్రాల కేటాయింపులో జరిగిన సాఫ్ట్వేర్ తప్పిదం కారణంగా కొందరు విద్యార్థులకు వారు చదువుతున్న కళాశాలనే పరీక్ష కేం ద్రంగా కేటాయించారు. ఈ తప్పిదాన్ని ఫిబ్రవరి చివరి వారంలో గుర్తించి వారికి వేరే కళాశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించి బఫర్ బార్కోడ్ నంబర్ ఆధారంగా పరీక్షలు రాయించాం. ఈ క్రమంలో ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల సమాచారం బఫర్కోడ్ ఆధారంగా కొత్త పరీక్ష కేంద్రం నుంచి వచ్చింది. అలాగే పాత కేంద్రాల్లో ఆ విద్యార్థులు హాజరు కాకపోవడంతో ఆబ్సెంట్ అని వచ్చింది. ఈ తప్పిదాన్ని ఫలితాలు ప్రకటించిన గంటలోపే గుర్తించాం. అయితే అప్పటికే ఫలితాల సీడీలు ప్రైవేటు ఏజెన్సీ, వెబ్సైట్లకు వెళ్లిపోవడంతో సరిచేయలేకపోయాం. దీంతో గందరగోళం నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో ఆ విద్యార్థులకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాం. -
సూర్యాపేటలొ ఉద్రిక్తత
-
4న రాజ్‌భవన్ ముట్టడికి సీపీఐ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న రాజ్‌భవన్ ముట్టడికి సీపీఐ పిలుపునిచ్చింది. ఇంటర్ బోర్డు అవకతవకల వ్యవహారం పై గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ, గ్లోబరీనా యాజమాన్యంపై క్రిమినల్ కేసులు, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, బాధ్యులపై, బోర్డు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లతో ఈ ముట్టడిని చేపడుతున్నట్లు సీపీఐ హైదరాబాద్ కార్యదర్శి ఈటీ నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. గ్లోబరీనా సంస్థ అవకతవకలకు అడ్డుకట్ట వేయాలంటూ 2015 మే 15న నరసింహన్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ లేఖ రాశారని, అప్పుడు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఇంటర్బోర్డులో అక్రమాలు జరిగి ఉండేవి కావన్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఇంటర్ బోర్టు కొత్త నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఇంటర్ బోర్టు కొత్త నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాల ప్రక్రియలో గ్లోబరినాతో పాటు మరో స్వతంత్ర కంప్యూటర్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపింది. మరో స్వతంత్ర్య కంప్యూటర్ సంస్థ ఎంపిక బాధ్యతలు టీఎస్టీఎస్కు అప్పగించినట్లు వెల్లడించింది. టీఎస్టీఎస్ మరో కంప్యూటర్ ఎజెన్సీని ఎంపిక చేసిన వెంటనే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ పక్రియను పూర్తి చేస్తామని పేర్కొంది. కాగా గత సోమవారం ఇంటర్ ఫలితాల అవకతవకలపై హైకోర్టు విచారణ జరపగా.. ఇప్పటికే ఫెయిలైన మూడు లక్షల 20వేలమంది విద్యార్థులకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ జరుపుతామమని బోర్డు హైకోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. -
ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యం
సాక్షి, అమరావతి : ఏపీ ఎంసెట్ ఫలితాలు మే 3వ వారంలో వెల్లడి కానున్నాయి. ఇంటర్మీడియెట్ మార్కులు లేకపోవడంతో ఎంసెట్ ఫలితాల వెల్లడిపై సందిగ్ధత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఎంసెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఇంటర్ మార్కులు ఇవ్వాలని ఏపీ ఇంటర్ బోర్డుకు సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇచ్చినా ఎంసెట్ కోసం మార్కులు ఇవ్వాలని సీఎస్ స్పష్టం చేశారు. ఇక మార్కులు రహస్యంగా ఉంచుతారా? బహిరంగంగా వెల్లడిస్తారాన అనే దానిపై సాయంత్రంలోగా స్పష్టత రానుంది. కాగా గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో గ్రేడింగ్‌తో ఎంసెట్ వెయిటేజీ ఎలా ఇవ్వాలనే దానిపై అధికారులు తంటాలు పడుతున్నారు. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంతోనూ ఏపీ ఎంసెట్‌కు తంటాలు వస్తున్నాయి. సుమారు 20వేలమంది తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ స్పష్టత లేకపోవడంతో రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎంసెట్ పలితాలు ఎలా ఇవ్వాలో అధికారులకు అంతు చిక్కడం లేదు. దీంతో సీఎస్ సమీక్షతో నిర్వహణ అనంతరం తెలంగాణ ఇంటర్ ఫలితాలు తేలి మార్కులు అందాకే ఎంసెట్ ర్యాంకులు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
ఆ రెండు కాంగ్రెస్ పోషించినవే : బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల వివాదంలో ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సున్నితమైన అంశంపై విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయంటూ మండిపడ్డారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ఇంటర్ ఫలితాల వెల్లడిలో టెక్నికల్ సమస్య వచ్చింది నిజమేనని అంగీకరించారు. ఇంటర్ బోర్డులో కొంతమంది అధికారుల మధ్య విభేదాల కారణంగానే గందరగోళం జరిగినట్లు తెలుస్తోందన్నారు. అయితే ఇందుకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఇంటర్ బోర్డు వ్యవహారం గురించి సీఎం కేసీఆర్ అధికారులతో మాట్లాడుతున్నారని.. బాధ్యులపై త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పోషించినవే.. ‘ గ్లోబరీనా, మాగ్నెటిక్ సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం పోషించినవే. ఇంటర్ బోర్డు వ్యవహారంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. రూ. 4 కోట్ల టెండర్‌ను వేల కోట్లు అని రేవంత్ ఎలా మాట్లాడుతారు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన దొంగ ఆయన. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్ట్. అసలు గ్లోబరీనాకు ఐటీ శాఖకు సంబంధం ఏమిటి. 24 గంటల్లోగా రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి అని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. -
‘రేపు ప్రగతి భవన్ ముట్టిడిస్తాం’
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డు నిర్వాకంతో విద్యార్ధుల ఆత్మహత్యల పరంపరపై బీజేపీ భగ్గుమంది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇక లక్ష్మణ్ దీక్షకు హాజరైన సీనియర్ నేతలు రాం మాధవ్, బండారు దత్తాత్రేయ, డీకే అరుణ, మురళధర్ రావులు ఆయనకు సంఘీభావం తెలిపారు. తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతపెద్ద తప్పిదాలు ఎన్నడూ చూడలేదని, పిల్లల హక్కులను కాలరాసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని దీక్షకు ఉపక్రమించిన లక్ష్మణ్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ దేవుడెరుగు..బలిదానాల తెలంగాణగా మారుస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తల్లితండ్రులు విశ్వాసం కోల్పోకండని ఆయన కోరారు. విద్యార్ధులు ఒత్తిళ్లకు లోనుకావద్దు : రాంమాధవ్ ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు దురదృష్టకరం. చరిత్రలో ఇదొక మచ్చగా మిగిలిపోతుంది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకూడదు. ప్రభుత్వం పిల్లలకు ఆత్మవిశ్వాసం కల్పించకపోగా అహంభావంతో వ్యవహరిస్తోంది. ఇది రాజకీయ సమస్య కాదు . పిల్లలకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం కొనసాగుతుంది. ఇది పెను సంక్షోభం : మురళీధర్ రావు విద్యారంగంలో ఇంత పెద్ద సంక్షోభం దేశంలో ఏ రాష్ట్రంలో రాలేదు. ఇంటర్ బోర్డ్ అవకతవకల కారణంగా ఇప్పటివరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి. ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికే ఇది పరీక్షగా మారుతుంది. ప్రగతి భవన్ ముట్టడిస్తాం : దత్తాత్రేయ ఇంటర్ బోర్డు అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలి. ఇంటర్ విద్యార్ధుల ఆవేదనను అర్ధం చేసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం న్యాయవిచారణ చేపట్టాలి : జితేందర్ రెడ్డి రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా సాగుతోంది. ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మూడున్నర లక్షల ఇంటర్ విద్యార్థులకు అన్యాయం జరిగింది. గ్లోబరీనా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇంటర్ బోర్డ్ అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయించాలి. ప్రభుత్వం విద్యారంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది సీబీఐ విచారణ జరిపించాలి : కన్నా సమస్యల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే తీరుగా ఉన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్లతో తీరికలేకుండా బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌తో ప్రభుత్వం ఆడుకుంటోంది. ఈ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇంటర్ బోర్డు నిర్వాకంపై సీబీఐ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ చేత విచారణ జరపాలి -
మే 8లోగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్..!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల అవకతవకలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. విద్యార్థుల రీ వాల్యుయేషన్‌పై ఇంటర్‌బోర్డు తమ నిర్ణయాన్ని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే ఫెయిలైన మూడు లక్షల 20వేలమంది విద్యార్థులకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ జరుపుతామమని బోర్డు హైకోర్టుకు నివేదించింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను మే 8లోగా పూర్తి చేసి.. వివరాలు తమకు సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. బోర్డు ఇచ్చిన వివరాలు చూసిన తర్వాత 8వ తేదీ మధ్యాహ్నం ఫిటిషన్‌పై మరోసారి విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా, చనిపోయిన విద్యార్థులకు 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. -
పోలీసుల కళ్లగప్పి.. ట్యాక్సీలో వెళ్లిన లక్ష్మణ్!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం న్యాయం చేయాలన్న డిమాండ్‌తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాటకీయ పరిణామాల నడుమ నిరాహార దీక్షకు దిగారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి తొలగించాలని, ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై న్యాయ విచారణ జరపాలంటూ ఆయన సోమవారం నుంచి నిరవధిక నిరాహాక దీక్ష చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు ముషీరాబాద్‌లోని లక్ష్మణ్ క్యాంపు కార్యాలయం ముందు మోహరించారు. ఆయన బయటకు రాగానే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి ట్యాక్సీ కారులో చాకచక్యంగా ఆయన బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన వేదిక వద్ద ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఇంటర్ ఫలితాల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావిస్తోంది. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఆ కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలుపకపోగా తూ.తూ.మంత్రంగా చర్యలు తీసుకోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
ఇంటర్ పోరు తీవ్రతరం: ప్రగతి భవన్ ముట్టడి..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారడం లేదు. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సోమవారం తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఇంటర్ బోర్డు వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బోర్డు కార్యాలయాన్ని ముట్టడికి అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ముట్టడిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక, ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. సీఎం నివాసమైన ప్రగతిభవన్ ముందు పెద్దసంఖ్యలో ఏబీవీపీ విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని.. బలవంతంగా అరెస్టు చేసి.. అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. నేతల అరెస్టులు..! ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్‌ను అరెస్టు చేసి కాంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిని అరెస్టు చేసి.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గీతారెడ్డిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డిలను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాంధీ భవన్ నుంచి ఇంటర్ బోర్డ్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్, కార్యదర్శులు కురువ విజయ్‌కుమార్, అల్లం భాస్కర్‌తోపాటు ఎన్ఎస్యూఐ నేతలను నాంపల్లి చౌరస్తా అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్టేషన్‌కు తరలించారు. గృహనిర్బంధాలు.. మేడ్చల్‌లో డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌ను సైతం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ సహా తెదేపా నాయకుడు సాధినేని శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ముందస్తుగా పలువురు నాయకులను పోలీసులు గృహనిర్భందించారు. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యలను గృహనిర్భందం చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజ్‌గిరిలో 9 మంది, నేరేడ్ మెట్లో 10 మంది విపక్ష నేతలను అరెస్టు చేశారు. మేడ్చల్‌లో పాతూరి సుధాకర్ రెడ్డి సహా పలువురి నాయకులు అరెస్టయ్యారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు గృహనిర్భందం చేశారు. హైదరాబాద్ వెళ్లకుండా ఆయన ఇంటి ఎదుట పోలీసులు మోహరించారు. దద్దరిల్లిన ఇంటర్ బోర్డు ఇంటర్ బోర్డు కార్యాలయం నినాదాలు, నిరసనలతో దద్దరిల్లుతోంది. ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల శ్రేణులు ప్రయత్నించాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నాయకులు బోర్డు కార్యాలయం వద్దకు చేరుకొని.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేస్తూ ముట్టడికి దిగిన నిరసనకారులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టులు.. నిర్బంధం.. ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ బోర్డు ముట్టడికి బయలుదేరిన నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుడు అంజన్‌కుమార్ యాదవ్, టీజేఎస్ అధినేత కోదండరామ్‌ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. తమ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తుండటాన్ని ఉత్తమ్, కోదండరామ్, చాడా వెంకట్‌రెడ్డి ఖండించారు. మరోవైపు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా హైదరాబాద్‌లో సీపీఎం ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలతో తెల్లవారుజామున 4 గంటలకే జూలకంటి ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయనను హౌజ్ అరెస్టు చేసి నిర్బంధించారు. అరెస్టులపై పొన్నం మండిపాటు ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అరెస్టులు చేపడుతుండటాన్ని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, అరెస్టులు కాదు విద్యార్థులకు న్యాయం చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హక్కులను కాలరాస్తున్నారని, పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి నిర్బంధించడం అక్రమమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించిన ఏజెన్సీ తప్పిదాలపై ప్రభుత్వం స్పందించిన తీరును నిరసిస్తూ చేపట్టిన తమ పోరాటాన్ని జయప్రదం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. -
సున్నా మార్కుల ఉదంతంలో ఎగ్జామినర్‌పై వేటు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పేపర్లో ఓ విద్యార్థినికి 99 మార్కులు రాగా సున్నా మార్కులు వేసిన ఉదంతంలో ఎగ్జామినర్, పర్యవేక్షకుడిపై వేటు పడింది. ఇటీవల విడుదలై తీవ్ర దుమారం లేపిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో బాగా చర్చనీయాంశంగా మారిన వాటిల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. వివరాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఆదివారం పత్రికా ప్రకటన రూపంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కరిమల జూనియర్ కళాశాలలో సీఈసీ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన నవ్య అనే యువతికి తెలుగులో సున్నా మార్కులు వచ్చాయి. తాను పరీక్ష బాగా రాసినా, సున్నా మార్కులు రావటమేంటని ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. పునర్మూల్యాంకనం చేయగా ఆమెకు 99 మార్కులు వచ్చాయి. దీనిపై బోర్డు అ«ధికారులు విచారణ జరిపారు. ఎగ్జామినర్ బబ్లింగ్ చేసే సమయంలో జరిగిన పొరపాటుగా తేల్చారు. ఎగ్జామినర్ ఉమాదేవి (తెలుగు అధ్యాపకురాలు) 99 మార్కులకుగాను 00గా నమోదు చేసినట్టు గుర్తించారు. దీన్ని తీవ్ర తప్పిదంగా భావిస్తూ ఆమెకు రూ.5 వేల జరిమానా విధించగా ఆమె బోర్డుకు చెల్లించారు. శంషాబాద్ ఆర్బీనగర్లోని నారాయణ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నందున ఈ విషయాన్ని ఆ విద్యా సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిర్వాహకులు ఆమెను విధుల నుంచి తప్పించారు. ఇక రంగారెడ్డి జిల్లా బాలానగర్ కొత్తూరు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎస్.విజయకుమార్ స్క్రూటినైజర్ హోదాలో ఉండి ఈ తప్పిదాన్ని గుర్తించలేదు. దీంతో ఆయనను కూడా బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసేందుకు, తదుపరి విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్టు అశోక్ వెల్లడించారు. -
విద్యార్థులారా... ఆత్మహత్యలకు పాల్పడవద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో గందరగోళంపై సోమవారం (29న) ఇంటర్‌బోర్డు ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ ప్రకటించాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఇతర రాజకీయపార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వర్గాలవారు కలసి రావాలని పిలుపునిచ్చాయి. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, వారికి తాము అండగా ఉంటామని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశాయి. శనివారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో భేటీ అనంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 23 మంది మరణం హృదయవిదారకం ఇంటర్ బోర్డు తప్పులకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం హృదయ విదారకరమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఎదిగిన పిల్లలు రాలిపోయి, ఎద నిండా ఆవేదనతో తల్లిదండ్రులున్నారని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మొత్తం మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఒక కంపెనీ ప్రయోజనాల పరిరక్షణకే ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ సంస్థ మొదటి నుంచి తప్పులు చేస్తున్నా వెనకేసుకు వచ్చారని విమర్శించారు. తప్పులపై కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మొదటి నుంచి హెచ్చరిస్తున్నా బోర్డు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇంటర్ కార్యదర్శికి సమస్యలన్నీ తెలుసని, విద్యార్థులు ఫెయిలైతే డ్రైవర్లు కావచ్చని, దుకాణాల్లో పని చేసుకోవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కూడా ఉచితంగా విద్యార్థులకు వాల్యూయేషన్ చేస్తామన్నారే తప్ప ఈ సమస్యపై సమగ్ర సమీక్ష నిర్వహించలేదన్నారు. తమకు ఎమ్మెల్యేల సంఖ్య లేకపోయినా సమాజం పట్ల నిబద్ధత ఉందని, ఏదిఏమైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామన్నారు. నిద్ర నటించే సర్కార్‌ను తట్టి లేపేందుకే ఈ వ్యవహారంపై నిద్ర నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు ధర్నా నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిఫారసుతోనే పరీక్షల నిర్వహణలో అనుభవంలేని గ్లోబరీనా సంస్థకు టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ఈ సంస్థకు పరీక్షా ఫలితాల బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. ప్రతి అంశంపై ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ ఇంటర్ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిం చారు. విద్యార్థులు రోడ్డున పడితే టీఆర్ఎస్ మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ ఫ్యూడల్ మైండ్‌సెట్‌తో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేబినెట్ బాధ్యత వహించాలి: రమణ ఇంటర్ బోర్డు తప్పులకు సీఎం కేసీఆర్, కేబినెట్ బాధ్యత వహించాలని, మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై విపక్షపార్టీలుగా గవర్నర్‌ను కలిస్తే నామమాత్రంగా స్పందించారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేటీఆర్ మాత్రం ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిర్బంధాన్ని ఛేదిస్తాం: చాడ సీఎం కేసీఆర్ ప్రయోగించే నిర్బంధాన్ని, పోలీస్ వ్యవస్థను ఛేదించి 29న ధర్నా నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. తొంభై మార్కులు వచ్చిన అమ్మాయికి ఇంటర్‌బోర్డు సున్నా మార్కులు వేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి... ఇలాగే జరుగుతాయి అని చెప్తారా? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటామని, జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. -
మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామానికి చెందిన చాకలి రాజు అనే 18 ఏళ్ల విద్యార్థి.. అదే గ్రామంలోని పాఠశాలలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ గ్రూప్‌లో ఇంటర్ చదివిని రాజు...రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రగతి భవన్ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ప్రయత్నించింది. ప్రగతి భవన్ ముట్టడికి తరలివచ్చిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఇంటర్ బోర్డు వైఫల్యంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగో రోజూ ఆందోళనలు ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోర్డు తప్పిదాలపై తల్లిదండ్రులతోపాటు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో బోర్డ్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు సైతం రావల్సిన సమయం కంటే ముందుగానే బోర్డుకి చేరుకున్నారు. అయినా, ఆందోళనలు ఆగడం లేదు. మరోవైపు పరీక్షా పత్రాల రీ వాల్యుయేషన్, మార్కుల రీకౌంటింగ్ గడువు పెంచినప్పటికీ.. విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోయింది. దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ బోర్డు వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు.. పెద్దసంఖ్యలో ఇంటర్ బోర్డు వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ తప్పిదాలు.. విద్యార్థుల బలవన్మరణాలు ఇంటర్ ఫలితాల అవకతవకల నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 18మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ఇంటర్ బోర్డు తప్పిదాలకు మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిరుమలాపూర్‌కు చెందిన జ్యోతి..ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సెకండియర్ సివిక్స్ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జ్యోతి..ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన జ్యోతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. కాగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన నవీన్ (నిన్న) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు కళ్లు తెరవడం లేదు. తప్పులు సరిదిద్దుకునే చర్యలు చేపట్టడం లేదు. కళ్లేదుట తప్పులు కనబడుతున్న బోర్డు పెద్దలు ఆ తప్పును అంగీకరించడం లేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇంటర్ బోర్డు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న వారి నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదు. పైగా న్యాయం కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్ధుల్లో ధైర్యం నింపాల్సిన అధికారులు కూడా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రేపు ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ ధర్నా.. ఇంటర్ పరీక్షల నిర్వహణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల 18 మంది విద్యార్థులు తమ జీవితాలను కోల్పోయారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ల ఎదురుగా ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు. విద్యార్థుల పరీక్షాపత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇంటర్‌పై ఇంతటి నిర్లక్ష్యమా..!
బంజారాహిల్స్: వేలాదిమంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిన ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను వెంటనే తొలగించాలని, ఇంటర్మీడియట్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం మంత్రుల నివాసాలను ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. బోర్డులో ఉన్నతాధికారులకు సంబంధం ఉందని భావిస్తున్న ఎలాంటి పూర్వ అనుభవం లేని ఓ ప్రైవేట్ సంస్థకు ఫలితాల ప్రక్రియ కాంట్రాక్టు అప్పగించడం వెనక పలు అనుమానాలు ఉన్నాయన్నారు. కాంట్రాక్ట్ అప్పగించడంలో భాగం పంచుకున్న బడా నాయకులపై కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. బోర్డు చేసిన తప్పిదానికి విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటే కార్యదర్శి మాత్రం తమ తప్పు ఏమీలేదన్నట్లు వ్యవహరిస్తున్నారని, బోర్డు కార్యదర్శితో పాటు ఈ ఘటనకు బాధ్యులైన అందర్నీ శిక్షించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా పేపర్ రివాల్యూవేషన్ చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ముట్టడిలో ఏబీవీపీ గ్రేటర్ కార్యదర్శి శ్రీహరి, జాతీయ నాయకులు అయ్యప్ప, ప్రవీణ్‌రెడ్డి, ఎల్లాస్వామి, శ్రావణ్‌రెడ్డి, రమేష్, ఆనంద్, సురేష్, జీవన్, సుమన్, రాజేష్, శ్రీశైలం, బీరప్ప, మహేష్, శ్రీకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మంత్రుల నివాసాల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోనికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువరి మధ్యా వాగ్వాదంతో ఆ ప్రాంతం హోరెత్తింది. బంజారాహిల్స్ పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో.. ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని ఎత్తిచూపుతూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాలను ముట్టడించారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఆర్.కళింగరావు నేతృత్వంలో ఎస్సైలు బత్తు శ్రీను, కె.ఉదయ్, పి.డి. నాయుడు ఇక్కడ బందోబస్తు నిర్వహించారు. -
తెలంగాణలో అసమర్థ పాలన: రాపోలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితా ల్లో తీవ్ర అన్యాయానికి గురైన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి గత కొన్ని రోజులుగా ఇంటర్ బోర్డు వద్ద చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వం కంటికి కనిపించవా? అని ప్రశ్నించారు. విద్యార్థుల గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైనందుకు బాధ్యుడిగా విద్యా శాఖ మంత్రి రాజీనామా చేస్తారా అని విద్యార్థి లోకం ఎదురు చూస్తోందన్నారు. గ్లోబరీనా సంస్థకు ప్రభుత్వ పెద్దలకు ఉన్న అనుబంధంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సంశయం ఏర్పడటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకొచ్చి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపించారు. -
విచారణ కమిటీ ముందుకు అశోక్‌కుమార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తన విచారణను ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు కార్యాలమంలో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. కమిటీ విచారణకు వచ్చిన సమయంలో హైకోర్టు విచారణ నిమిత్తం ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టు విచారణ ముగియడంతో అశోక్‌కుమార్ బోర్డు కార్యాలయానికి చేరుకొని విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణం ఏమిటి? ఎలాంటి అవకతవకలు జరిగాయో? అవకతవకలు, నిర్లక్ష్యం, అక్రమాలకు బాధ్యులెవరు? అన్న కోణంలో కమిటీ అశోక్‌కుమార్ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. వెనుక గేటు నుంచి విచారణకు గ్లోబరీనా సీఈవో! ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గ్లోబరీనా సంస్థ సీఈవో రాజు ఇంటర్ బోర్డు కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం ప్రధాన గేటు నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు లోపలికి వెళ్లగా.. గ్లోబరీనా సీఈవో రాజు మాత్రం వెనుక ఉన్న ఓ చిన్న గేటు నుంచి కార్యాలయం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం బోర్డు కార్యాలయంలో సాగుతున్న కమిటీ విచారణలో ఆయన పాల్గొన్నట్టు తెలిసింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా సంస్థనే కారణమని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇంటర్ బోర్డు కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళంపై కమిటీ వివరాలు సేకరించింది. త్రిసభ్య కమిటీ విచారణ నిమిత్తం బోర్డు కార్యాలయానికి చేరుకున్న సమయంలో.. అశోక్‌కుమార్ అక్కడ లేరు. బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. ఆయన లేని సమయంలోనే త్రిసభ్య కమిటీ కార్యాలయంలో విచారణ చేపట్టడం గమనార్హం. ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల దిగజారుడు ప్రవర్తన ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పోలీసులు దిగజారి ప్రవర్తించడం.. తీవ్ర విమర్శలకు తావిచ్చింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బోర్డు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్‌ను కార్యాలయంలోకి వెళ్లకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని మాత్రం వెంటబెట్టుకొని మరి బోర్డు కార్యాలయం లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. అది కూడా కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీనిపై పోలీసులను మీడియా ప్రశ్నించడంతో సదరు టీఆర్ఎస్ నేతను బయటకు తీసుకొచ్చారు. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ ఆందోళన ఇంటర్ ఫలితాల్లో అవకతవకల నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ఉచితంగా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. -
రాసింది అరబిక్.. రిజల్ట్ వచ్చింది ఉర్దూకు
నల్లగొండ: ఇటీవల ఇంటర్‌బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో తప్పులు చోటు చేసుకోవడంతో నష్టపోయిన విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థిని.. రాసింది ఒక సబ్జెక్ట్ అయితే మరో సబ్జెక్టులో పరీక్ష రాసినట్లుగా రిజల్ట్ ఇవ్వడంతోపాటు ఆ పరీక్షలో కూడా సున్నా మార్కులు వచ్చాయంటూ మెమోలో పేర్కొన్నారు. విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ పట్టణానికి చెందిన నౌషీన్ గతేడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అయితే యునానీ మెడిసిన్ చదవాలన్న ఉద్దేశంతో ఎక్స్టర్నల్ లాంగ్వేజీ కింద ఫిబ్ర వరి 27, 28న అరబిక్ ఫస్ట్, సెకండ్ పేపర్లకు పరీక్ష రాసింది. తాజాగా విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో మాత్రం నౌషీన్ రాసిన అరబిక్ పేపర్–1, పేపర్–2 పరీక్షలకు సంబంధించి రిజల్ట్ ఇవ్వలేదు. ఆమె ఉర్దూ పరీక్ష రాసినట్లుగా, పేపర్–1, 2లో సున్నా మార్కులు వచ్చాయంటూ మెమోలు విడుదల చేశారు. మరో సంవత్సరం నష్టపోవాల్సి వస్తుంది.. యునానీ మెడిసిన్ చదవాలన్న ఉద్దేశంతో ఎక్స్టర్నల్ లాంగ్వేజీగా అరబిక్ పరీక్ష రాశానని, దానికి రిజల్ట్ ఇవ్వకపోగా వేరే పరీక్షలో సున్నా మార్కులు వచ్చాయంటూ ఫలితాలు రావడంతో తాను చాలా నష్టపోతున్నానని నౌషీన్ ‘సాక్షి’కి తెలిపింది. ‘ప్రస్తుతం నేను రాసిన అరబిక్ పరీక్ష పాస్ అయ్యానో.. లేదో తెలియదు. ఒకవేళ తిరిగి పరీక్ష ఫీజు చెల్లిద్దామన్నా ఈనెల 25 వరకే చివరి తేదీ. నేను రాయని ఉర్దూ పరీక్షకు సున్నా మార్కులు వచ్చాయి. నేను అడ్వాన్స్ పరీక్ష ఫీజు చెల్లించాలన్నా ఆన్లైన్లో ఉర్దూ అనే చూపిస్తుంది. అరబిక్ లాంగ్వేజ్ చూపించడం లేదు. దీంతో రీవాల్యుయేషన్ పెట్టుకున్నా ఆలస్యమవుతుంది. దానివల్ల మరోఏడాదిపాటు చదువు ఆగిపోతుంది’ అని పేర్కొంది. బోర్డు అధికారులకు తనకు న్యాయం చేయాలని నౌషీన్ కోరుతోంది. -
పాసా.. ఫెయిలా?
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్ ఫలితాలు వెలువడగానే ఓ విద్యార్థిని ఆత్రుతగా సంబంధిత వెబ్సైట్లో తన ఫలితాలు చూసుకుంది. ఫెయిల్ మెమో రావడంతో ఏడుస్తూ ఇంటిదారి పట్టింది. ‘పరీక్షలు అన్నీ బాగానే రాశాను మంచి మార్కులు వస్తాయనుకుంటే ఇలా జరిగిందేమిటి’అంటూ రోదిస్తూ కూర్చుంది. కొంతసేపటి తర్వాత ఆ విద్యార్థిని సోదరుడు ఫోన్ చేసి ‘కంగ్రాట్స్.. నీవు మంచి మార్కులతో పాస్ అయ్యావు’ అంటూ అభినందించాడు. ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ముస్తాబాద్‌కు చెందిన శ్రీనిధి సిద్దిపేటలోని గురుకృప కళాశాలలో ఎంపీసీ ఫస్టియర్ చదివి పరీక్షలు రాసింది. ఇంతకూ నేను పాసయ్యానా? ఫెయి లయ్యానా? అం టూ 2 మెమోలు పట్టుకుని తల్లిదండ్రులతో కలసి కళాశాలలో సంప్రదించింది. ఈ విషయాన్ని బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం తప్ప తామేమి చేయలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. శ్రీనిధి ఫస్టియర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతం ఎంపిక చేసుకుంది. అయితే ఒక మెమోలో సంస్కృతం రాగా, మరో మెమోలో తెలుగు అని వచ్చింది. అలాగే, ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థి ఒకేషనల్ కోర్సులో అన్ని ప్రాక్టికల్ పరీక్షలకు గైర్హాజరైనట్లు వచ్చింది. ఇంటర్‌బోర్డు నిర్వాకంతో పిల్లల జీవితాలు తారుమారవుతున్నాయని తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేశారు. -
ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విచారణ చేపట్టాలని.. ఇందుకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి, సంబంధిత అధికారులను బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అనుభవజ్ఞుల సూచనలతో ఇంటర్‌బోర్డు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమవారం వారు బహిరంగ లేఖ రాశారు. ‘జాగ్రఫీ విద్యార్థులకు సంబంధించిన మార్కులు మెమోల్లో కనిపించడం లేదు. సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులకు మొత్తం మార్కులకు తేడాలున్నాయి. ఫస్టియర్‌లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు సెకండియర్‌లో ఫెయిలయ్యారు. 90 మార్కులొస్తే మెమోలో సున్నా మార్కులు ముద్రించారు. రోజూ 40 పేపర్లు దిద్దాల్సిన లెక్చరర్లు 65 పేపర్లు దిద్దారు. ఇలా అనేక అవకతవకలతో ఇంటర్ విద్యార్థులు నష్టపోయారు. అవినీతిని ప్రక్షాళన చేస్తామంటూ అనేక ప్రగల్భాలు పలుకుతున్న మీరు ముందు ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలి. దాదాపు పది లక్షల కుటుంబాలు ఎదురు చూసే అత్యంత కీలకమైన ఇంటర్ ఫలితాల విషయంలో ప్రభుత్వం స్పందించే తీరు ఇలాగేనా..?’అని సీఎంను ప్రశ్నించారు. బోర్డు అధికారులు తప్పులు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అస్సలు పట్టనట్టు సీఎం వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. కనీసం బోర్డు అధికారులను పిలిపించి పరిశీలించిన దాఖలాల్లేవని అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుండెలు మండి ఏడుస్తుంటే, ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు చేస్తుంటే అధికారులు స్పందిస్తున్న తీరు హేయంగా ఉందన్నారు. పూర్తిస్థాయిలో రీకౌంటింగ్ జరపాలని, నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకోవాలని లేఖలో కోరారు. -
ఆ అధికారులను కఠినంగా శిక్షించాలి..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల వెల్లడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని, ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన నవ్యకు సున్నా మార్కులు ప్రకటించి, మరుసటి రోజే 99 మార్కులు వచ్చాయని పేర్కొనడం ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. బోర్డు తప్పులు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే అవి అపోహలంటూ ప్రభుత్వం పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. విద్యార్థుల జవాబు పత్రాల రీవాల్యువేషన్‌కు తల్లితండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడం బోర్డు దివాళాకోరుతనానికి నిదర్శమని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బోర్డు తప్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వమే రీవాల్యువేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి నిదర్శనం.. శ్రీలంకలో జరిగిన మారణకాండ అత్యంత హృదయ విదారకరమైందని చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి ఈ దాడులు నిదర్శనమని తెలిపారు. ఈ ఉగ్రవాదుల వెనక ఉన్న ఏ దేశాన్ని అయినా ఇతర దేశాలు నిలదీయాలని సీపీఐ అభిప్రాయపడుతోందని వెల్లడించారు. -
అందుకే నవ్యకు 99కు బదులు సున్నా వచ్చింది
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడిలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ అంగీకరించారు. ఇంటర్ బోర్డు పరీక్షా పత్రాలను పారదర్శకంగా, నాణ్యత కూడిన మూల్యాంకనం చేపట్టిందని, దాదాపు అంతా సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు. ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడిలో అవకతవకలు, ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాల నేపథ్యంలో సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల శ్రేణులు ఇంటర్ బోర్డు ముందు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అక్కడక్కడ కొన్ని తప్పిదాలు, పొరపాట్లు జరిగాయని, ముఖ్యంగా ముగ్గురు విద్యార్థుల పరీక్షా పత్రాలకు సంబంధించి మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని చెప్పారు. అందుకే నవ్యకు సున్నా! తెలుగులో సున్నా మార్కులు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన విద్యార్థిని జి. నవ్య అంశంపై అశోక్‌కుమార్ స్పందించారు. ఓఎమ్మార్ షీట్లో మార్కుల విభాగంలో బబ్లింగ్ చేయడంలో ఎగ్జామినర్ చేసిన తప్పిదం వల్లే నవ్యకు సున్నా వచ్చిందని ఆయన తెలిపారు. నవ్యకు 99 మార్కులకు బదులు ఎగ్జామినర్ జీరో బబ్లింగ్ చేశాడని, ఓఎమ్మార్ షీట్లో 9,9 అంకెల కిందనే సున్నా, సున్నా అంకెలు ఉంటాయని, 9-9 అంకెలను బబ్లింగ్ చేయడానికి బదులు పొరపాటున 0,0ను బబ్లింగ్ చేశారని, స్కూటినైజర్ కూడా సరిగ్గా పరిశీలించకుండా సున్నా, సున్నానే బబ్లింగ్ చేయడంతో నవ్యకు అలా మార్కులు వచ్చాయని తెలిపారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో వెంటనే స్పందించి.. వెరీఫై చేసి.. ఆ విద్యార్థినికి న్యాయం చేశామన్నారు. ఈ విధంగా మూల్యాంకనంలో తప్పులు, పొరపాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో పొరపాటు చేసిన వారిని ఇప్పటికే వివరణ అడిగామని, వారికి చార్జ్‌మెమో కూడా ఇస్తామని స్పష్టం చేశారు. 99కి బదులు సున్నా మార్కులు వేయడం చాలా పెద్ద తప్పిదమని, దీనిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నవ్య ఓఎమ్మార్ షీట్ మీడియాకు చూపించారు. ఆ వదంతులు అవాస్తవం.. ఇంటర్ పరీక్షా పత్రాలు గల్లంతైనట్టు వస్తున్న వదంతులు, ఆరోపణలు అవాస్తవమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌బోర్డుకు 12 క్యాంప్ ఆఫీసులు ఉన్నాయని, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ కార్యాలయాల్లోనే పరీక్షా పత్రాల మూల్యంకనం చేపడతామని తెలిపారు. పరీక్షా పత్రాలన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నాయని, ఏ ఒక్క పరీక్షా పత్రం మిస్ కాలేదని చెప్పారు. ఆబ్సెంట్ అయిన విద్యార్థిని కూడా పాస్ చేశారని వచ్చిన వాదనలు అపోహ మాత్రమేనని, కొందరు విద్యార్థులకు పరీక్షా కేంద్రాల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో రెండు సెంటర్లు కేటాయించామని, అందులో వారు ఒక సెంటర్లో ఆబ్సెంట్ అయి.. మరో సెంటర్లో పరీక్ష రాశారని, అందువల్ల వారికి ఏ-పీ (ఆబ్సెంట్-పాస్) అనే కోడ్ వచ్చిందని, రెండు సెంటర్లు వచ్చినవారిలో కొందరు ఫెయిల్ కావడంతో ఏ-ఎఫ్ వచ్చిందని వివరణ ఇచ్చారు. పూర్తిగా ఆబ్సెంట్ అయిన వాళ్లను పాస్ చేయడం కానీ, పాస్ అయిన వాళ్లను ఫెయిల్ చేయడం కానీ జరగలేదని తెలిపారు. 15 ఏళ్లుగా మన్టెక్ ఇన్ఫో సంస్థ సాంకేతిక సేవలు అందిస్తోందని, 15 ఏళ్లుగా ఒకే సంస్థ ఇస్తుండటంతో మార్చాలని టెండర్లు పిలువగా.. గ్లోబరెనా సంస్థ నుంచి టెండర్ వచ్చిందని, నిబంధనలకు అనుగుణంగానే ఆ సంస్థకు టెండర్ కేటాయించామని, ఆ సంస్థ మూడేళ్లు మాత్రమే ఇంటర్ బోర్డుకు సేవలు అందిస్తుందని, ఆ తర్వాత పూర్తిగా ఇంటర్ బోర్డే ఔట్ సోర్సింగ్ లేకుండా సొంతంగా సాంకేతిక సేవలను సమకూర్చుకుంటుందని అశోక్‌కుమార్ వివరించారు. రీ వాల్యుయేషన్ గడువును పెంచే అంశాన్ని పరిశీలిస్తామని, రీవాల్యుయేషన్లో మారిన మార్కులను విద్యార్థుల ఈమెయిల్‌కు పంపుతామని తెలిపారు. అశోక్‌కుమార్‌ను నిలదీసిన నిరసనకారులు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా అశోక్‌కుమార్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు నిలదీశారు. ఇంటర్ బోర్డు తప్పిదాలకు విద్యార్థులకు ఎందుకు బలి కావాలని, 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వచ్చిన విద్యార్థిని.. కలత చెంది.. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యంకనంలో టెక్నికల్ తప్పిదాలు దొర్లాయని సాక్షాత్తూ విద్యామంత్రి జగదీశ్‌రెడ్డే చెప్తున్నారని, అలాంటప్పుడు మీ తప్పిదాలకు విద్యార్థులు నష్టపోవాలా? అని నిలదీశారు. ఒకవైపు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంత పెద్ద పొరపాట్లు, తప్పిదాలా? అని ప్రశ్నించారు. నిరసనకారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో అశోక్‌కుమార్ తడబడ్డారు. చదవండి : నవ్యకు తెలుగులో 99 మార్కులు -
నవ్యకు తెలుగులో 99 మార్కులు
జన్నారం (ఖానాపూర్): తెలుగులో సున్నా మార్కులు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన విద్యార్థిని జి. నవ్యకు న్యాయం జరిగింది. ఈ నెల 21న ‘సాక్షి’మెయిన్‌లో ‘ఫస్ట్ ఇయర్లో టాప్–సెకం డియర్‌లో ఫెయిల్ ’శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పేపర్ రీవాల్యుయేషన్ చేయగా నవ్యకు తెలుగులో 99 మార్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కుల మెమోను వాట్సాప్ ద్వారా కరిమల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌కు పంపారు. ఈ విషయంపై డీఐఈవో ఇంద్రాణిని ఫోన్లో సంప్రదించగా, దీనిపై ఏవో రమేశ్‌ను విషయం కనుక్కోవాలని నేరుగా ఇంటర్ బోర్డుకు పంపినట్లు తెలిపారు. పేపర్ రీవాల్యుయేషన్ చేయించగా నవ్యకు తెలుగులో 99 మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీంతో నవ్యకు మొత్తం సబ్జెక్టుల్లో కలిపి 924 మార్కులు వచ్చాయి. విషయం తెలుసుకున్న నవ్య సంతోషం వ్యక్తం చేసింది. -
మూడు రోజుల్లో ‘ఇంటర్’ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల విషయంలో వస్తున్న అపోహలను నివృత్తి చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావుతో పాటు హైదరాబాద్ బిట్స్‌కు చెందిన ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇంటర్ ఫలితాల విషయంలో సత్వర దర్యాప్తు జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ఆదివారం ఆయన విద్యా శాఖ కార్యదర్శి జనార్దనరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల విషయంలో తల్లిదండ్రులెవరూ గందరగోళానికి గురికావద్దని సూచించారు. కొందరు అధికార అంతర్గత తగాదాల వల్లే ఈ విషయంలో అపోహలు వచ్చాయని వెల్లడించారు. ఫలితాల విషయంలో ఎలాంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ వాసన్ ఐటీ విషయంలో, నిశాంత్ పోటీ పరీక్షల నిర్వహణలో నిపుణులని, వారిచ్చే నివేదిక మేరకు ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఫలితాల్లో ఎక్కడైనా తప్పులు వచ్చాయని భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకోవాలని, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
విద్యార్థుల భవిష్యత్తుపై ప్రైవేటు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో భారీస్థాయిలో అవకతవకలకు.. లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమాగమయ్యేందుకు ఓ ప్రైవేటు సంస్థ నిర్వాకమే కారణమైంది. ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారాల్లో ఓ ప్రైవేటు సంస్థ చక్రం తిప్పడం కారణంగానే ఈ సమస్యలు ఉత్పన్నమై నట్లు స్పష్టమైంది. కనీస అర్హతలు లేకుండానే ఇంటర్మీడియట్ డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్ (డీపీఆర్పీ) బాధ్యతలను చేజిక్కించుకున్న సంస్థ.. అసలు ప్రక్రియనంతా అడ్డదిడ్డంగా చేపట్టడంతోనే పరిస్థితి తారుమారైంది. ఫలితంగా ఇటీవల వెల్లడైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీగా పొరపాట్లు చోటుచేసుకోవడంతో వేలాది విద్యార్థులు ఆందోళనకు గురికాగా.. తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఫలితాల్లో పొరపాట్లు ఎలా జరిగాయి? విద్యార్థులు పరీక్షకు హాజరైనా ఫలితాల్లో గైర్హాజరైనట్లు ఎలా రికార్డయింది? టాపర్లు, మెరిట్ రికార్డున్న విద్యార్థులు ఒక సబ్జెక్టులో.. అదీ అత్యంత తక్కువ మార్కులతో ఎలా ఫెయిలయ్యారు? అనే అంతుచిక్కని ప్రశ్నలకు బోర్డు నుంచి జవాబు రావడంలేదు. చేసిన ఘనకార్యా న్ని కప్పిపుచ్చుకునేందుకు.. అవసరమైతే రీ–కౌం టింగ్, రీ–వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొమ్మని బోర్డు సలహా ఇవ్వడం ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రైవేటు సంస్థ పాత్ర ఏంటి? ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పిదాలపై జరుగుతున్న చర్చలతో.. ఓ ప్రైవేటు సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. ఇంటర్మీడియట్ అడ్మిషన్లు మొదలు, ఫలితాల వెల్లడివరకు అవసరమైన సాంకేతిక సహకారమంతా.. మొన్నటివరకు ప్రభుత్వ రంగ సంస్థ – సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్‌గవర్నెన్స్) అందించేది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి మాత్రం ఈ బాధ్యతల్ని అన్ని అర్హతలున్న ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియకు తెరలేపింది. టెండర్లు పిలిచిన యంత్రాంగం.. తక్కువకు కోట్ (ఎల్1) చేసిన గ్లోబరీనాకు టెండర్లు ఖరారు చేసింది. దీంతో అడ్మిషన్ల నుంచి ఫలితాలు విడుదల చేసే వరకు జరిగే డేటా ప్రాసెసింగ్, ఫీజు ప్రాసెసింగ్, ఫలితాల ప్రాసెసింగ్ గ్లోబరీనా చేతుల్లోకి వెళ్లింది. తాజాగా విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలి తాల్లో పెద్దఎత్తున తప్పిదాలు జరగడంతో.. అసలు తప్పిదం ఎక్కడ జరిగిందనే దానిపై జరిగిన చర్చలో.. ఈ గ్లోబరీనా సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. అర్హత లేకున్నా అక్రమంగా: గ్లోబరీనా సంస్థకు టెండరు కట్టబెట్టడం, డీపీఆర్పీ ప్రాజెక్టు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు దక్కాలంటే ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు సంస్థ అర్హతలు సరిపోవాలి. కానీ గ్లోబరీనాకు పలు కేటగిరీల్లో అర్హత లేకున్నా అక్రమంగా డీపీఆర్పీ అధికారాలు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 3లక్షల మంది విద్యార్థులున్న ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీకి వరుసగా 5ఏళ్ల పాటు సాంకేతిక ఆధారిత పరీక్షల ప్రక్రియలో సహకారం అందించి ఉండాలి. దేశవ్యాప్తంగా ఐదు ప్రభుత్వ బోర్డులు లేదా యూనివర్సిటీలకు సాంకేతిక ఆధారిత పరీక్షలకు కచ్చితంగా పనిచేసి ఉండాలి. అందులో తప్పకుండా ఇంటర్మీడియట్ బోర్డు తప్పకుండా ఉండాలి. కానీ గ్లోబరీనాకు ఈ రెండు అర్హతలు లేనట్లు తెలుస్తోంది. టెండరు పత్రంలో సమర్పించిన వివరాల ప్రకారం.. 2.5లక్షల మంది విద్యార్థులున్న కాకినాడ జేఎన్టీయూతో గ్లోబరీనా మరో రెండు సంస్థలతో కలిసి పనిచేసినట్లు పత్రాన్ని సమర్పించింది. అదేవిధంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుతో 2017 సంవత్సరంలో 18,341 మంది విద్యార్థులు రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ ప్రక్రియలో సహకారం అందించినట్లు పత్రాన్ని సమర్పించింది. వాస్తవ నిబంధనలకు గ్లోబరీనా అర్హతలు సరిపోలకున్నా టెండర్ ఖరారు చేయడంపై అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. అనుభవం లేకపోవడంతో ఆగమాగం డీపీఆర్పీ ప్రాజెక్టు దక్కించుకున్న గ్లోబరీనాకు అర్హతలు లేకపోవడానికి తోడు సరైన అనుభవం లేకపోవడంతో ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీ తప్పిదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. డీపీఆర్పీ ప్రాజెక్టు దక్కించుకోవాలంటే అంతకు ముందు ఇంటర్మీడియట్ డాటా ప్రాసెసింగ్, రిజల్ట్ ప్రాసెసింగ్‌లో భాగస్వామ్యమై ఉంటే.. అనుభవం వచ్చేది. కానీ గ్లోబరీనాకు ఈ వ్యవహారంలో కనీస అనుభవం కూడా లేదని స్పష్టమైంది. 2018–19 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమయంలో ఓఎంఆర్ షీట్లలో పొరపాట్లు జరగడం, అంతకుముందు అడ్మిషన్ల సమయంలో డేటా ప్రాసెసింగ్ గందరగోళంగా సాగడం.. విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులు కాకుండా ఇతర పరీక్షలు ఆన్లైన్లో అప్డేట్ కావడం వంటి తప్పిదాలు చోటుచేసుకోవడం కారణంగానే.. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు తప్పుల తడకగా వచ్చినట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా? ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సం స్థకు 10లక్షల మంది వి ద్యార్థుల భవిష్యత్తును ఎలా అప్పగించారు? నిబంధనలను అనుగుణంగా అర్హతల్లేని ప్రైవేటు సంస్థకు అప్పనంగా టెండర్‌ను కట్టబెట్టడంలో ఆంతర్యమేంటనేది బోర్డు స్పష్టం చేయాలి. ఉన్నతాధికారులు చేసిన తప్పిదాలకు కిందిస్థాయి ఉద్యోగులకు బలిచేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నిస్తోంది. రహస్య ఒప్పందం ప్రకారమే గ్లోబరీనాకు టెండర్ దక్కిందనేది సుస్పష్టం. – పి.మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ -
ఫస్ట్ ఇయర్లో టాప్ సెకండ్ ఇయర్లో ఫెయిల్
జన్నారం: ఇంటర్ మొదటి సంవత్సరంలో సీఈసీ గ్రూపులో 500 మార్కులకు గాను 467 మార్కులు సాధించిన విద్యార్థిని ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో తెలుగులో జీరోమార్కులు రావడం చూసి అవాక్కయింది. ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా విద్యార్థిని తీవ్రంగా నష్టపోయినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన సత్తన్న, కవితల కూతురు నవ్య మండల కేంద్రంలోని కరిమల జూనియర్ కళాశాలలో ఇంటర్ సీఈసీ చదివింది. మొదటి సంవత్సరంలో 467 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కూడ జిల్లా టాపర్‌గా నిలువాలనుకున్నది. కష్టపడి చదివింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాలను చూసి అవాక్కయింది. మిగతా సబ్జెక్టులలో 90కి పైగా మార్కులు వచ్చి తెలుగులో సున్నా మార్కులు రావడంతో విద్యార్థిని నోట మాటరాలేదు. కళాశాల యాజమాన్యం సైతం ఆశ్చర్యపోయింది. నవ్య కళాశాల టాపర్ అని, తెలుగులో జీరో మార్కులు రావడం ఏంటని యాజమాన్యం అంటోంది. ఈ విషయాన్ని డీఐవో కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో నవ్యకు తెలుగు సబ్జెక్టులో 98 మార్కులు రాగా ద్వితీయ సంవత్సరంలో జీరో మార్కులు రావడం జీర్ణించుకోలేకపోతోంది. టాపర్‌గా నిలవాలనుకున్నా: నవ్య, విద్యార్థిని ఇంటర్లో కష్టపడి చదివా. టాపర్ కావాలనుకున్నాను. ప్రథమ సంవత్సరంలో జిల్లా టాపర్‌గా నిలిచాను. ద్వితీయ సంవత్సరంలో కూడ జిల్లా టాపర్‌గా రావలన్నది నా కల. కానీ బోర్డు నాకు అన్యాయం చేస్తుందని అనుకోలేదు. నాకు తెలుగులో తప్పకుండా 98 మార్కులు వస్తాయన్న ధీమాతో ఉన్నా. ఈ విషయంలో ప్రభుత్వం, ఇంటర్ బోర్డు నాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం న్యాయం చేయాలి: సత్తన్న, విద్యార్థిని తండ్రి నా కూతురు నవ్య చదువులో ముందుండేది. ఇంటర్ మొదటి సంవత్సరంలో టాపర్‌గా ఉన్న ఆమెకు ఇప్పుడు ఫెయిల్ అయినట్లు మెమో రావడం బాధ అనిపించింది. నా బిడ్డ మానసికంగా కుంగిపోతోంది. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని నా బిడ్డకు న్యాయం చేయాలి. ‘ఇంటర్’పై బీజేపీ ఆందోళన యోచన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో గందరగోళం నెలకొన్న అంశంపై ఉద్యమించే దిశగా బీజేపీ సమాయత్తమవుతోంది. ఇంటర్ పరీక్షలో ఫెయిలై ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో, పరీక్షలు, ఫలితాలకు సాంకేతికతను అందించిన ఓ సంస్థ నిర్వాకం కారణంగా భారీఎత్తున తప్పిదాలు దొర్లినట్టు బీజేపీ పేర్కొంటోంది. ఆత్మహత్యకు పాల్పడుతున్న విద్యార్థుల్లో కొందరు, ఈ తప్పిదాల బారిన పడినవారు ఉండే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఎలాంటి సమాధానం రానందున తొలుత ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట భారీ ధర్నాతో ఆందోళనను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఆదివారంలోగా ప్రభుత్వం స్పందించి చర్యలకు ఉపక్రమించని పక్షంలో ఇంటర్ బోర్డు ఎదుట ధర్నా చేయనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియాకు డిమాండ్ ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం పొంది కుటుంబానికి అండగా నిలవాల్సిన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడి ఆ కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చినందున.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి మేర ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేయాలని నిర్ణయించింది. బోర్డు తప్పిదాల వల్ల విద్యార్థుల కుటుంబాల్లో కల్లోలం నెలకొందని, ‘విద్యార్థులు మాస్ హిస్టీరియా బారిన పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు’అని బోర్డు ఉన్నతాధికారి మాట్లాడటం దారుణమని, ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని పట్టుబట్టబోతోంది. బోర్డు తప్పిదాల నేపథ్యంలో ఎలాంటి రుసుము లేకుండా జవాబు పత్రాలను చూపించాలని, పునర్మూల్యాంకనం కూడా ఉచితంగా జరపాలని డిమాండ్ చేస్తోంది. -
నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్/ధర్మపురి/మాచారెడ్డి: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌కావడంతో మానసికంగా కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు విద్యార్థినులున్నారు. ఆత్మహత్యకు పాల్పడినవారిలో జగిత్యాల జిల్లాలో ఇద్దరు, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని వాసవీభువన అపార్ట్‌మెంట్స్‌లో నివసించే «ధనుంజయనాయుడు, విజయలక్ష్మి కుమారుడు ధర్మారాం(17) అమీర్‌పేట నారాయణ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 18న వెలువడిన పరీక్షాఫలితాల్లో గణితంలో ఫెయిలయ్యాడు. మొబైల్‌ఫోన్, ఐప్యాడ్ వాడటం వల్లే చదువులో వెనుకబడిపోయావని, ఇక నుంచి వాటిని వాడవద్దని కుటుంబసభ్యులు అతడిని హెచ్చరించారు. కొద్దిసేపటికే ధర్మారాం అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకాడు. రక్తమడుగులో ఉన్న అతడిని వెంటనే సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ధర్మారాం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎంపీ సీఎం రమేశ్ మేనల్లుడు. జగిత్యాల జిల్లాలో... జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాములపల్లికి చెందిన దొంతరవేని కొమురయ్య, భూదమ్మ దంపతులకు కుమారుడు ప్రశాంత్ (19)ను మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో సీఈసీ చదువుతున్నాడు. సెకండియర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ శుక్రవారం బైక్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. గ్రామశివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెతకగా శనివారం మృతదేహం లభించింది. అదే జిల్లా సారంగాపూర్ మండలం పోచంపేటకు చెందిన ఒడ్నాల భూమారెడ్డి కుమార్తె శివాని(17) జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మూడు సబ్జెక్ట్‌ల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది శనివారం వేకువజామున ఇంట్లో ఉరేసుకుంది. కామారెడ్డి జిల్లాలో... కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో నివాసముంటున్న దేవాసత్ పంగి, రూప్లా కూతురు నీరజ(17) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. బాటనీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుంది. ఇంటర్ బోర్డుపై సమగ్ర విచారణ జరపాలి తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలపై సమగ్ర విచారణ జరిపించి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరశురాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు తప్పిదాల ఫలితంగా మెరిట్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, విద్యార్థుల భవిష్యత్తుతో ఇంటర్ బోర్డు ఆటలాడుకోవడం తగదన్నారు. మెరిట్ విద్యార్థులకు సైతం సున్నా మార్కులు రావడం ఆశ్చర్యకరమన్నారు. తప్పిదాలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు చేపట్టి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరపకుండానే ఏలాంటి తప్పిదాలు జరగలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్ నిర్లక్ష్య ధోరణితో సమాధానాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. -
ఇంటర్ బోర్డు ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: అడ్డగోలుగా వ్యవహరించారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడు తున్నాయి. బోర్డు ద్వారా భారీ స్థాయిలోనే తప్పిదాలు జరిగినట్లు తెలుస్తోంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులను కూడా గైర్హాజరయ్యారని పేర్కొంటూ వారిని ఫెయిల్ చేయడంపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా ఫెయిలైన వారిలో ఎక్కువ మంది టాప్ మార్కులు సాధించే విద్యార్థులే ఉండటం గమనార్హం. ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదా లను ఎత్తిచూపుతూ పిల్లల తల్లిదండ్రులు శని వారం పెద్దసంఖ్యలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగానే బోర్డు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విద్యార్థులు పరీక్షకు హాజరైనా.. గైర్హాజరయ్యారంటూ ఫెయిల్ చేయడం.. ప్రథమ సంవత్సరంలో 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సెకండ్ ఇయర్లో సింగిల్ డిజిట్ మార్కులకు పరి మితం చేయడం వంటి తప్పిదాలెన్నో ఒక్కొక్క టిగా బయటపడుతున్నాయి. కాగా, బోర్డు తప్పిదాలతో శనివారం నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో మూడ్రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 12కు చేరుకుంది. ఎందరు గైర్హాజరయ్యారు? ఇంటర్మీడియట్ ఫలితాలను పూర్తి పారదర్శకంగా ప్రకటించినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. ముగ్గురు విద్యార్థుల విషయంలో పొరపాట్లు జరిగాయని అంగీకరిస్తూ.. వాటిని సరిచేస్తా మని వెల్లడించారు. కానీ ఇలాంటి వారి సంఖ్య వేలల్లోనే ఉందంటూ పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం బోర్డు ముందు నిర్వ హించిన నిరసన కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయా కాలేజీల్లో టాపర్లుగా ఉన్న విద్యార్థులు తాజాగా ఫెయిల్ కావడం వారి కాలేజీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫెయిలైన సబ్జెకును మినహాయిస్తే మొత్తంగా వారి మార్కులు 900 దాటడం గమనార్హం. కొందరు విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో నూటికి నూరుశాతం మార్కులొచ్చినా ఒక సబ్జెక్టులో మాత్రం అనూహ్యంగా 15%–20% మార్కులు రావడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింట్లో గరిష్టంగా మార్కులు సాధించి.. ఒక సబ్జెక్టులో ఫెయిలవడంపైనా తల్లిదండ్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. మూల్యాంకనంలో పొరపాట్లు చేసి వాటికి విద్యార్థులను బలిచేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనా.. ఫలితాల్లో మాత్రం పాస్ (ఏపీ)అని చూపించారు. మరికొందరు అన్ని పరీక్షలు రాసినా ఫలితాల్లో మాత్రం ఆబ్సెంట్ ఫెయిల్ (ఏఎఫ్)గా చూపించడం గందరగోళం సృష్టిస్తోంది. జాగ్రఫీ విద్యార్థుల అయోమయం మరోవైపు, ఆర్ట్స్ విద్యార్థులు ఫలితాలు నివ్వెరపరుస్తున్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సుల్లో జాగ్రఫీ ఉన్న విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో జాగ్రఫీ థియరీతో పాటు ప్రాక్టికల్ మార్కులను పరిగణలోకి తీసుకోవల్సి ఉండగా.. కొందరికి ప్రాక్టికల్ మార్కులు యాడ్ కాలేదు. దీంతో వారి స్కోర్ భారీగా తగ్గింది. కొందరికి ప్రాక్టికల్ మార్కులు జాబితాలో చూపుతున్నా మొత్తం మార్కులతో లెక్కించలేదు. ఆర్వీ, ఆర్సీకి దరఖాస్తు చేసుకొండి ఇన్ని తప్పిదాలు కళ్లముందు కనబడుతున్నా.. ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తప్పిదాలపై తమను ప్రశ్నించాలనుకున్న తల్లిదండ్రులను కనీసం కార్యాలయం లోపలకు అనుమతించలేదు. అంతేకాదు.. కనీసం బోర్డు తరఫున ప్రతినిధులెవరూ వారికి సమాధానం ఇవ్వలేదు. అసలు ఇదేం పెద్ద సమస్యే కాదన్నట్లు వ్యవహరిస్తూ.. సాయంత్రం తాపీగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రతిఏడాది మాదిరిగానే డేటా క్యాప్చరింగ్‌ను ప్రభుత్వ రంగ సంస్థ సీజీజీ ద్వారా చేయించాం. సాంకేతిక అర్హత, ప్రభుత్వ అనుమతి ఉన్న ‘గ్లోబరీనా ఏజెన్సీ’ద్వారా హాల్‌టిక్కెట్లు జారీచేసి.. ఫలితాలను ప్రాసెసింగ్ చేశాం. శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు బోర్డుకు 146 ఫెయిల్ మార్కులు సమర్పించారు. వాటిని నిర్ధారించి వివరాలు వారికి తెలియజేశాం. ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లలేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. అనుమానాలు, అపోహలుంటే రూ.600 చెల్లించి ఆర్వీ (రీ–వెరిఫికేషన్)కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. రీ–కౌంటింగ్(ఆర్సీ)కు రూ.100 చొప్పున సబ్జెక్టుకు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు. వదంతులు నమ్మొద్దు. ఏదైనా సమాచారం కావాలంటే 040–24600110 ఫోన్ నెంబర్లో లేదా బోర్డు వెబ్సైట్లో లేదా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ)ను సంప్రదించాలి’అని పేర్కొంది. అనర్హులతో మూల్యాంకనమా? ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెల్లడైన తప్పిదాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్లు దిద్దకుండానే కంప్యూటర్ల మీద కూర్చుని మార్కులు సరిచేశారని ఆరోపించారు. పేపర్లు దిద్దకుండా మార్కులెలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు, ఫెయిలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బోర్డు ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. జవాబుపత్రాల ముల్యాంకనం అడ్డగోలుగా, అశాస్త్రీయంగా జరిగిందని.. అర్హులతో కాకుండా పదోతరగతి, ఇంటర్ చదవిన వారితో జవాబు పత్రాలను దిద్దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చే విద్యార్థులు ఒకట్రెండు మార్కులకు పరిమితం చేశారని, బోర్డు చేసిన తప్పిదంతో విద్యార్థులు డిప్రెషన్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రాష్ట్రం నలుమూలల నుంచి బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున నాంపల్లికి చేరుకోవడంతో విద్యార్థులను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఆందోళనకారులను బోర్డు కార్యాలయంలోకి వెళ్లనీయకుండా గేట్లకు తాళాలు వేశారు. దీంతో విద్యార్థుల తల్లిందండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫలితాల్లో పొరపాట్లకు బోర్డు అధికారులే బాధ్యత వహించాలని నినాదాలు చేశారు. బోర్డు కార్యదర్శి వచ్చి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి బోర్డు వ్యవహారం లోపభూయిష్టంగా మారిందని, పరీక్షకు హాజరైన విద్యార్థులను గైర్హాజరైనట్లుగా మెమోలో పేర్కొన్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. మెరిట్ స్టూడెంట్లకు సున్నా మార్కులు సాధ్యమేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాలు గతంలో కూడా జరిగాయని, అధికారులు మాత్రం తప్పులు సరిదిద్దుకోకుండా నిర్లక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన బోర్డు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బయటకు వచ్చిన బోర్డు కార్యదర్శి అశోక్‌ను ఈ సందర్భంగా విద్యార్థులు ఘెరావ్ చేశారు. బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయండి: బీజేవైఎం ఇంటర్ విద్యార్థుల పేపర్ల మూల్యాంకనాన్ని థర్డ్ పార్టీకి అప్పగించి అమాయక విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని బీజేవైఎం మండిపడింది. ఈ మూల్యాంకనంపై వెంటనే న్యాయవిచారణ చేపట్టాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్ గౌడ్ డిమాండ్ చేశారు. బోర్డు తప్పిదాలతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రీ–వెరిఫికేషన్ కోసం రూ.600 ఫీజు కట్టుకోవాలంటూ బోర్డు కార్యదర్శి అశోక్ సూచించడాన్ని తీవ్రంగా ఖండించారు. బోర్డు అధికారులు తప్పుచేస్తే విద్యార్థులు రీ–వెరిఫికేషన్‌కు ఫీజు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. విద్యార్థుల నుంచి ఇలా ఫీజు వసూలు చేయకుండా అడిగిన వారందరి పేపర్లు ఉచితంగానే దిద్దించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని.. తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను సర్వీస్ నుంచి తొలగించేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫస్టియర్‌లో 92%తో పాసయినా.. ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో మా అబ్బాయికి 92% మార్కులు వచ్చాయి. కానీ సెకండియర్ ఫలితాల్లో మాత్రం రెండు సబ్జెక్టులు ఫెయిల్ చేశారు. గణితంలో రెండు, మూడు మార్కులు చొప్పున వేశారు. 90%కు పైగా మార్కులు వచ్చిన వాడికి రెండు, మూడు మార్కులెలా వస్తాయి? – రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి తండ్రి రెండింటికీ డబ్బులు కట్టాలట మా అబ్బాయికి మూడు సబ్జెక్టుల్లో బార్డర్ మార్కులు వేశారు. వాస్తవానికి ఫస్టియర్‌లో 89% మార్కులు వస్తే.. సెకండియర్‌లో మాత్రం బార్డర్ మార్కులెలా వస్తాయి? నిర్లక్ష్యంగా పేపర్లు దిద్దడంతోనే ఇలా జరిగింది. రీ–వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోండని బోర్డు అధికారులు సలహా ఇస్తున్నారు. వాటి ఫలితాలు 15రోజుల్లో ఇస్తామంటున్నారు. మరోవైపు ఇంప్రూవ్‌మెంట్‌కు గడువు ఈనెల 25వరకే ఉంది. రీ–వెరిఫికేషన్ వివరాలు రాకుండానే ఇంప్రూవ్‌మెంట్‌కు ఎలా వెళ్లాలి? గడువు తేదీని పెంచాలని అడిగితే.. రెండింటికీ డబ్బులు కట్టుకోమంటున్నారు – మేడ్చల్ జిల్లాకు చెందిన విద్యార్థి తల్లి విచారణ చేపట్టాలి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న తప్పిదాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి. ఈ అక్రమాలకు కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. అధికారులు చేసిన పొరపాట్లకు విద్యార్థులు బలవుతున్నారు. ఏడాదంతా చదివిన పిల్లల్ని ఒకేసారి పాతాళంలోకి నెడితే ఎలా? చాలామంది మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని చర్యలు చేపట్టకుంటే ఆందోళన తీవ్రం చేస్తాం. – హైదరాబాద్ జిల్లా విద్యార్థి తండ్రి -
సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ధర్మారామ్ ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం రాత్రి తాను నివాసం ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని వాసవి భువన అపార్ట్ మెంట్ ఏడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మరోవైపు ధర్మారామ్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా తెలంగాణలో ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అధికారుల తప్పిదాలకు తమ బిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాకుండా తప్పిదాలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. పరీక్షకు హాజరు కాని విద్యార్థిని పాస్ చేసిన ఇంటర్ బోర్డు అధికారులను ఏం చేయాలంటూ .... విద్యాశాఖ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50వేల మంది విద్యార్థులు ఒక్క లెక్కల పరీక్షలోనే ఎందుకు ఫెయిల్ అవుతారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి లెక్కలేనితనానికి విద్యార్థలు బాధితులు కావాలా అని ఆవేదన వ్యక్తం చేశారు.