AP Intermediate admissions 2021 to be held online - Sakshi
Sakshi News home page

ఏపీ: ఇంట్లో నుంచే ఇంటర్‌ సీటు.. తొలిసారి ఆన్‌లైన్‌ అడ్మిషన్లు

Published Fri, Aug 13 2021 8:40 AM | Last Updated on Fri, Aug 13 2021 12:26 PM

AP Intermediate Online Admissions Process From August 13th - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నానికి చెందిన ఎస్సీ విద్యార్థి హరీశ్‌ టెన్త్‌లో 10 జీపీఏ సాధించాడు. కానీ దగ్గరలోని కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలో అతడికి సీటు లభించలేదు. కారణం కాలేజీ అడిగిన ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడమే. హరీశ్‌ లాంటి విద్యార్థులకు ఇక ఇలాంటి సమస్యలుండవు. వారు కోరుకున్న కాలేజీలో ఆశించిన కోర్సులో సీటు పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్, లేదా కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ ఉంటే ఇంట్లో నుంచే ఇంటర్మీడియెట్‌ కోర్సులో చేరవచ్చు. ఇప్పటివరకు ఇంటర్మీడియెట్‌ కోర్సులో ప్రవేశానికి విద్యార్థులు పడుతున్న ఇక్కట్లకు చెక్‌ పెడుతూ ఇంటర్‌ బోర్డు ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానానికి శ్రీకారం చుట్టింది.

2021–22 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌లో ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభిస్తోంది. ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, ఇన్సెంటివ్‌ జూనియర్‌ కాలేజీలు, కాంపోజిట్‌ జూనియర్‌ కాలేజీల్లోని జనరల్, ఒకేషనల్‌ ఇంటర్మీడియెట్‌ కోర్సుల్లో ప్రవేశాలన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ విధానంలోనే కొనసాగనున్నాయి.

సమస్యలకు స్వస్తి 
టెన్త్‌ పాసయిన విద్యార్థులు ఇంటర్మీడియెట్లో చేరటం ఇప్పటివరకు పెద్ద ప్రహసనంలా ఉండేది. ప్రభుత్వ యాజమాన్య కాలేజీల్లో ప్రవేశాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నా ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీలు మాత్రం అడిగిన మేర రూ.లక్షల్లో ఫీజు చెల్లించిన వారికే సీట్లు కేటాయిస్తున్నాయి. మెరిట్‌ విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానం ప్రారంభమవడంతో ఈ సమస్యలు తీరడమేగాక విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి మెరిట్‌ను బట్టి తనకు నచ్చిన కాలేజీలో సీటు లభిస్తుంది. ‘డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లో కొంత ప్రాథమిక సమాచారం ఇవ్వడం ద్వారా ఎటువంటి సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేకుండానే కాలేజీలో ప్రవేశం పొందవచ్చు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమకు నచ్చిన కాలేజీలో ఆశించిన గ్రూపులో సీటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్‌ను అనుసరించి బోర్డు ఆయా విద్యార్థుల ఆప్షన్‌ ప్రకారం సీట్లు కేటాయిస్తుంది. అది పూర్తికాగానే అభ్యర్థి వెబ్‌సైట్‌లోని అడ్మిన్‌ లెటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని నేరుగా కాలేజీలో ఫీజు చెల్లించి చేరవచ్చు. గతంలో ప్రైవేట్‌ కాలేజీల్లో సదుపాయాలు, బోధన సిబ్బంది సమాచారం తెలిసేది కాదు. ఇప్పుడు ఆన్‌లైన్‌ విధానంలో ఆయా కాలేజీల్లోని సదుపాయాలు, లైబ్రరీ, ల్యాబొరేటరీ, భవనాలు, సిబ్బంది సమాచారం కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. వాటిని పరిశీలించుకుని కాలేజీలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. 

రిజర్వేషన్ల అమలు 
ఇప్పటివరకు రిజర్వేషన్లను ప్రభుత్వ కాలేజీలు తప్ప ప్రైవేట్‌ కాలేజీలు పట్టించుకోవడం లేదు. ఆన్‌లైన్‌ విధానంలో అన్ని కాలేజీల్లోనూ రిజర్వేషన్ల కోటా ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీలకు 29 శాతం, దివ్యాంగులు, స్పోర్ట్స్‌ కోటా, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు నిర్దేశించిన కోటా ప్రకారం ఆయా కాలేజీల్లో సీట్లు భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలో మహిళలకు 33.33 శాతం కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ కేటగిరీ సీట్లకు అర్హులు లేకపోతే జనరల్‌ కోటాలో భర్తీచేస్తారు. బీసీ కోటా సీట్లను ఆయా ఉపవర్గాల వారీగా అభ్యర్థులు లేకపోతే వేరే ఉపవర్గానికి కేటాయిస్తారు. వారూ లేనిపక్షంలో జనరల్‌ కోటాలో భర్తీ చేస్తారు.

లోకల్, నాన్‌ లోకల్‌ వారీగా సీట్లు 
ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ యాక్ట్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌)–1974 ప్రకారం లోకల్‌ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, నాన్‌ లోకల్‌ అభ్యర్థులకు 15 శాతం సీట్లు ఆయా కాలేజీల్లో కేటాయిస్తారు. అభ్యర్థులకు వారికి టెన్త్‌లో వచ్చిన గ్రేడ్లు, మార్కుల ఆధారంగా మెరిట్‌ను అనుసరించి సీట్ల కేటాయింపు ఉంటుంది. నార్మలైజేషన్‌ పద్ధతిలో ఆయా అభ్యర్థులకు గ్రేడ్ల వారీగా ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల మెరిట్‌ను అనుసరించి ఆయా గ్రూపుల్లో సీట్లు కేటాయిస్తారు.

జనరల్‌ సెక్షన్‌లో 88 సీట్లు 
ప్రతి కాలేజీలో ఆయా గ్రూపుల్లో జనరల్‌ సెక్షన్‌కు 88, ఒకేషనల్‌ పారా మెడికల్‌లో 30, నాన్‌ పారా మెడికల్‌లో 40 సీట్లు ఉంటాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం అభ్యర్థులు ఓసీ, బీసీలైతే రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌ అడ్మిషన్లను సజావుగా నిర్వహించడానికి రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అడ్మిషన్‌ కమిటీలను బోర్డు ఏర్పాటు చేసింది. ఇవిగాకుండా ప్రతి జిల్లాలో జిల్లా హెల్ప్‌లైన్‌ కేంద్రాలతోపాటు కాలేజీ స్థాయిలో హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా చేయాలో పలు సూచనలతో సవివరంగా యూజర్‌ మాన్యువల్‌ను బోర్డు అందుబాటులో ఉంచింది.

1 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు
ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ తరగతులు సెప్టెంబర్‌ 1వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశాల సమయంలో విద్యార్థులు టీసీ, టెన్త్‌ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణలో ఫస్టియర్‌ ఇంటర్మీడియెట్‌ చదివిన విద్యార్థులు ఏపీలో చదవాలనుకుంటే మళ్లీ ఫస్టియర్‌లో చేరాల్సిందేనని స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement