
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఆన్‌లైన్ అడ్మిషన్ల గడువును ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌కు తొలిసారిగా ఆన్‌లైన్ అడ్మిషన్లను చేపట్టిన బోర్డు ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు తేదీలను ప్రకటించింది. అయితే గడువు పొడిగించాలని అనేకమంది విన్నవించడంతో దరఖాస్తు గడువును 27 వరకు పొడిగించింది.
మార్చి పరీక్షలకు ఫీజు చెల్లించినవారందరికీ హాల్‌టికెట్లు
కాగా, తమ మార్కులను పెంచుకునేందుకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలనుకునే ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని బోర్డు తెలిపింది. ఈ విషయంలో సబ్జెక్టులను నిర్ధారించుకునేందుకు విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించనక్కర్లేదని వివరించింది. ఇంటర్ – మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. విద్యార్థులు వారి అనుకూలతను బట్టి ఒకటి లేదా అంతకు మించిన సబ్జెక్టుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపింది. ఐపీఈ–మార్చి 2021 పరీక్షలకు ఫీజులు చెల్లించని విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలనుకుంటే నేరుగా ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించింది. దీనికోసం ప్రిన్సిపాళ్లను సంప్రదించాల్సిన అవసరం లేదని వివరించింది.