సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి, ద్వితీయ పరీక్షల్లో ఇక నుంచి వందశాతం సిలబస్‌తో ప్రశ్నప త్రాలు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తేబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగానే విద్యార్థులు సిద్ధమవ్వాలని, కాలేజీ నిర్వాహకులు కూడా 100 శాతం సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
కోవిడ్ ముందు వరకూ ఇదే విధానం కొనసాగింది. కోవిడ్ విజృంభణతో 2021లో 70 శాతం సిలబస్‌నే అమలు చేశారు. అయితే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. 2021–22లో కూడా చాలాకాలం ఆన్‌లైన్ క్లాసులు నడిచాయి. ఈ సదుపాయం అన్ని ప్రాంతాలు వినియోగించుకోలేదన్న ఆందోళన సర్వత్రా విన్పించడంతో 70 శాతం సిలబస్‌నే అమలు చేశారు. తొలుత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవని చెప్పినప్పటికీ ఆ తర్వాత నిర్వహించారు.
ఈ పరీక్షల్లో 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 70 శాతం సిలబస్ కూడా సరిగా జరగలేదని విద్యార్థులు ఆందోళనలకు దిగారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. 2022లో మేలో జరిగిన పరీక్షల్లో 70 శాతం సిలబస్‌తోనే పరీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం సకాలంలో మొదలవ్వడంతో వందశాతం సిలబస్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
అయితే మొదటి సంవత్సరం ప్రవేశాలు సెప్టెంబర్ వరకూ జరిగాయి. బోర్డు నిర్దేశించిన సిలబస్ కూడా పూర్తవ్వలేదని విద్యార్థులు అంటున్నారు. కాకపోతే 100 శాతం సిలబస్ ఉంటుందని ముందే చెప్పడంతో సిద్ధమవ్వడానికి కొంత వ్యవధి లభించిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మోడల్ పేపర్ల తయారీపై బోర్డు దృష్టి పెట్టినట్టు లేదు. కోవిడ్‌కు ముందు ఇదే సిలబస్‌తో నమూనా ప్రశ్నపత్రాలు రూపొందించారు. వాటినే బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment