
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి గడువును మరోసారి పెంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు ఫస్టియర్‌లో ప్రవేశం పొందవచ్చని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు, సంక్షేమ కాలేజీలకు ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 1,500కు పైగా ఇంటర్ కాలేజీలున్నాయి. ఇందులో 300 ప్రైవేటు కాలేజీలకు ఇప్పటికీ ఇంటర్ బోర్డు గుర్తింపు లభించలేదు.
బహుళ అంతస్తుల భవనాల్లో (మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ) నడుస్తున్న ఈ కాలేజీలకు ఫైర్ సేఫ్టీ అనుమతి రాలేదు. కాగా, కాలేజీల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఇటీవల వాటికి అనుమతి ఇచ్చింది. అయితే ఇంటర్ బోర్డు పరిధిలో ఈ అంశం పరిశీలన దశలోనే ఉంది. దీంతో ఈ కాలేజీల్లో చేరిన లక్ష మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. కాలేజీలకు అనుమతి లభించకపోవడం, ఇంటర్ ప్రవేశాల గడువు ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు ప్రవేశాల గడువు పొడిగించింది. ఈలోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే వీలుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment