
Telangana Intermediate Schedule Released
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల తేదీని శుక్రవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ రెండు వరకు పరీక్షలు నిర్వహిస్తామని టైంటేబుల్ విడుదల చేసింది. గతంలో ప్రకటించిన ప్రకారమే 30 శాతం సిలబస్‌ను తప్పించి, 70 శాతం సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. విద్యార్థులందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు.
కాగా, కోవిడ్ తీవ్రత తగ్గిందని వైద్య, ఆరోగ్య శాఖ ఆగస్టులో తెలపడంతో ఈ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నెలరోజుల క్రితమే తెలిపారు. విద్యార్థులు రెండో ఏడాది సిలబస్‌తో పాటు, వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఫస్టియర్ పరీక్షలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిని పక్కన పెట్టి ఇంటర్ బోర్డు పరీక్షల తేదీలను వెల్లడించింది.