syllabus
-
నెల రోజుల్లో టెన్త్ సిలబస్ పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి సిలబస్‌ను జనవరి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సిలబస్ అయిన వెంటనే పునశ్చరణ చేపట్టాలని సూచించింది. టెన్త్ పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించేందుకు ప్రతీ హెచ్ఎం శ్రద్ధ తీసుకోవాలని కోరింది. మంచి ఫలితాలు సాధించే స్కూళ్లకు ఈసారి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నా రు. ప్రైవేటు బడులతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫలితాలు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్య మని విద్యాశాఖ పేర్కొంది. ఈ ఏడాది కొత్తగా 11,062 మంది టీచర్ల నియామకం కూడా చేపట్టారని, పుస్తకాలు కూడా సకాలంలో అందించామని, ఫలితాలు తక్కువగా వస్తే స్కూల్ హెచ్ఎంలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. 30 రోజుల పక్కా ప్రణాళిక.. మార్చి నెలలో టెన్త్ పరీక్షలు జరుగుతాయి. ప్రభు త్వ స్కూల్ విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. ఉదయం గంట, సాయంత్రం గంట ఇప్పటికే ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. సిలబస్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రివిజన్‌పైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో సబ్జెక్టులో ముఖ్యమైన, కష్టమైన చాప్టర్లపై దృష్టి పెట్టాలని హెచ్ఎంలను జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. 30 రోజుల పాటు ప్రణాళిక బద్ధంగా రివిజన్ చేయాలని తెలిపారు. బదిలీలు, పదోన్నతులతోనే కాలం పూర్తి.. జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయడం ఎలా సాధ్యమని పలువురు టీచర్లు ప్రశి్నస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లలో కొంతమేర టీచర్ల కొరత లేదని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉందంటున్నారు. కొన్ని పాఠశాలల్లో 40 శాతం మేర సిలబస్ మాత్రమే పూర్తయిందని డీఈవోలు ఇటీవల విద్యాశాఖకు తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతానికి మించి సిలబస్ పూర్తవ్వలేదంటున్నారు.డీఎస్సీ నియామకాలు చేపట్టే వరకూ అనేక చోట్ల టీచర్ల కొరత ఉంది. అక్టోబర్‌లో టీచర్లు వచి్చనా బోధన వెంటనే చేపట్టడం సాధ్యం కాలేదంటున్నారు. ఈ ఏడాది విద్యారంభంలోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. దీంతో చాలా స్కూళ్లలో టెన్త్ బోధన ఆలస్యంగా మొదలైందని చెబుతున్నారు. జనవరి 10 నాటికే సిలబస్ పూర్తవ్వాలనే లక్ష్యం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని వారంటున్నారు. -
సిలబస్ అయ్యేదెప్పుడు? శిక్షణ ఇచ్చేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: జేఈఈ పరీక్ష జనవరి 22వ తేదీ నుంచి జరుగుతుందంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీ సెట్) గతానికంటే నెల రోజుల ముందు ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాలేజీల్లో ఇప్పటికీ 80 శాతం సిలబస్ కూడా పూర్తి కాకపోవడంతో, సిలబస్ పూర్తయ్యేదెప్పుడు? జేఈఈ శిక్షణ పొందేదెప్పుడు? అనే టెన్షన్ మొదలైనట్లు ఇంటర్ బోర్డు వర్గాలే వెల్లడిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కాలేజీలకు సిబ్బందిని ఇవ్వకపోవడంతో ఇంటర్ సిలబస్ అరకొరగానే పూర్తయింది. దీంతో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ఎలా అనే ఆందోళన విద్యార్థుల్లో కన్పిస్తోంది. ఇంటర్ బోర్డులోనూ ఆందోళన..: ఇంటర్ బోర్డు తాజాగా సేకరించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల్లో ఎక్కువ మందిలో టెన్షన్ కన్పిస్తోంది. దీంతో దీన్ని దూరం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు బోర్డు సూచించింది. మరోవైపు విద్యార్థుల్లో ఆందోళనకు సంబంధించి వైద్య, విద్యాశాఖ గత ఏడాది ఇచ్చిన నివేదిక బోర్డు అధికారులకు ఆందోళన కల్గిస్తోంది. పరీక్ష ఫెయిల్ అవుతున్న వారిలో 48 శాతం టెన్షన్ కారణంగానే విఫలమవుతున్నట్టు తేల్చారు. వీరిలో 36 శాతం తీవ్రమైన టెన్షన్‌కు లోనవుతున్నారు. 23 శాతం విద్యార్థులు పరీక్షల తేదీ ప్రకటించినప్పటి నుంచే టెన్షన్ పడుతూ, పరీక్ష అనుకున్న విధంగా రాయలేకపోతున్నారని తేలింది. మొదటి పరీక్ష ఏమాత్రం కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి ఏటా సగటున 4 లక్షల మందికి పైగా ఫస్టియర్ పరీక్షలు రాస్తున్నారు. రెండో ఏడాది పరీక్షలు 3.80 లక్షల మందికి పైగా రాస్తుండగా సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. మూడంచెల సన్నద్ధతవిద్యార్థుల్లో టెన్షన్‌ను దూరం చేసే కార్యాచరణ చేపట్టడంతో పాటు, జేఈఈ, ఈఏపీ సెట్‌కు సన్నద్ధం చేయడానికి ఇదే మంచి తరుణమని ఇంటర్ బోర్డు అధికారులు అంటున్నారు. ఇందుకు ప్రణాళికబద్ధమైన కార్యాచరణ అవసరమని సూచిస్తున్నారు. మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలని భావిస్తున్న అధికారులు, ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై అధ్యాపకులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. కొన్ని జిల్లాలపై ప్రత్యేక ఫోకస్సిలబస్ పూర్తి కాకపోవడం విద్యార్థుల్లో ఆందోళనకు ప్రధాన కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని జిల్లాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు సాధిస్తున్న జిల్లాల్లో జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ ఉండగా.. సెకండియర్‌లో మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయా జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. ప్రైవేటులో ఇప్పటికే రివిజన్ షురూరాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ఏటా ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థుల్లో సుమారు మూడు వంతులు ప్రైవేటు కాలేజీల విద్యార్థులే కావడం గమనార్హం. అంటే మొత్తం 7.8 లక్షలకు పైగా విద్యార్థుల్లో సుమారు 6 లక్షల మంది ప్రైవేటు విద్యార్థులే ఉంటున్నారు. కాగా ఈ కాలేజీల్లో ఇప్పటికే ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తయింది. రివిజన్ కూడా చేపట్టారు. దీంతో జేఈఈ ప్రిపరేషన్ దిశగా యాజమాన్యాలు సన్నాహాలు మొదలు పెట్టాయి. బోధనా సిబ్బంది, ప్రత్యేక తరగతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పట్నుంచే తర్ఫీదు ఇవ్వాలివిద్యార్థులకు ఇప్పట్నుంచే పోటీ పరీక్షల దిశగా శిక్షణ ఇవ్వాలి. చాలా కాలేజీల్లో ప్రత్యేక శిక్షణ మొదలైంది. అయితే కొత్త కాలేజీలకు తగిన సిబ్బందిని కేటాయించడం, గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడంలో జరిగిన ఆలస్యంతో ప్రైవేటు కాలేజీలతో సమానంగా ప్రభుత్వ కాలేజీలు పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బోర్డు ప్రత్యేక శిక్షణా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్ (ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
సత్తా చాటేలా సిలబస్!
ఇంజనీరింగ్ కోర్సుల్లో పాఠ్యాంశాలు వచ్చే 20 ఏళ్ల సాంకేతికతను అందిపుచ్చుకొనేలా ఉండాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్‌లో ఈ మార్పు అనివార్యమని అంటోంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఏఐసీటీఈ నిపుణుల కమిటీ గతేడాది సరికొత్త సీఎస్సీ బోధనాంశాలను ప్రతిపాదించింది. దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులతో చర్చించిన ఈ కమిటీ... సైబర్ సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి బోధనాంశాలను కోర్సుల్లో చేర్చాలని సూచించింది. ప్రస్తుతం మూడేళ్లకోసారి యూనివర్సిటీలు ఇంజనీరింగ్ సిలబస్‌లో మార్పులు చేస్తున్నప్పటికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుత పాఠ్యాంశాలు లేవని ఏఐసీటీఈ అభిప్రాయపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్విద్యార్థికి గణిత శాస్త్రంపై పట్టు ఉండాలి. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దీన్ని నాలుగు రెట్లు పెంచేలా బోధనాంశాలుండాలి. కానీ ఇప్పుడున్నసిలబస్లో ఈ నాణ్యతకనిపించట్లేదు. ఇంటర్‌లోని సాధారణ గణితశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలే కోర్సులో ఉంటున్నాయి. » రాష్ట్రవ్యాప్తంగా ఏటా 75 వేల మంది కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో చేరుతున్నారు. క్లిష్టమైన గణిత సంబంధ కోడింగ్‌లో 20 వేల మందే ప్రతిభ చూపుతున్నారు. సీఎస్ఈ పూర్తి చేసినా కంపెనీల్లో ఉపయోగించే కోడింగ్‌ను అందుకోవడం వారికి కష్టంగా ఉంటోంది.» మెషీన్ లెరి్నంగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజైన్ థింకింగ్ వంటి సరికొత్త ప్రోగ్రామింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆల్జీబ్రా, అల్గోరిథమ్స్‌పై పట్టు ఉంటే తప్ప ఈ కోర్సుల్లో రాణించడం కష్టం. ఈ తరహా ప్రయత్నాలు ఇంజనీరింగ్ కాలేజీల్లో జరగట్లేదనేది ఏఐసీటీఈ పరిశీలన.» ఇంజనీరింగ్‌లో కనీసం వివిధ రకాల మైక్రో స్పెషలైజేషన్ కోర్సులు అందిస్తే తప్ప కొత్త కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు పరిణతి చెందరు. ఈ మార్పును ఇంజనీరింగ్ కాలేజీలు అర్థం చేసుకోవట్లేదు. దీంతో డీప్ లెరి్నంగ్, అడ్వాన్స్డ్ లెరి్నంగ్ వంటి వాటిలో వెనకబడుతున్నారు. ఏఐసీటీఈ సూచించిన మార్పులేంటి? » ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో గణిత విభాగాన్నివిస్తృతం చేయాలి. పలు రకాల కంప్యూటర్ కోడింగ్‌కు సంబంధించిన అల్గోరిథమ్స్, ఆల్జీబ్రాతో కూడిన పాఠ్యాంశాలను కొత్తగా జోడించాలి. » కంప్యూటర్స్ రంగంలో వస్తున్న నూతన అంశాలగురించి విద్యార్థులు తెలుసుకొనేలా ప్రాక్టికల్ బోధనాంశాలను తీసుకురావాలి. వాటిపై కాలేజీల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లలో ప్రాక్టికల్స్ నిర్వహించాలి. » ఎథికల్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ, రీసెర్చ్ అండ్‌అండర్‌స్టాండింగ్, హ్యూమన్ వాల్యూస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి సబ్జెక్టులను కోర్సుల్లో చేర్చాలి.దీనివల్ల విద్యార్థులకు సామాజిక అవగాహన కూడా అలవడుతుంది. నాణ్యత పెంచాల్సిందే ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత వేగంగా మారుతోంది. ఇంజనీరింగ్ విద్యలో మార్పులు అనివార్యం. భవిష్యత్ తరాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికతతో బోధన ప్రణాళిక అవసరం. కొన్ని కాలేజీల కోసం ఈ మార్పును ఆపడం ఎలా సాధ్యం? ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శిప్రత్యేక క్లాసులు తీసుకోవాలి కొత్త సిలబస్‌ను స్వాగతించాలి. స్థాయిని అందుకోలేని విద్యార్థులకు అదనపు అవగాహనకు తరగతులు నిర్వహించాలి. కాలేజీలే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన బోధనాంశాలు ఉండాలని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ప్రొఫెసర్ డి.రవీందర్ ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీసమస్యేంటి?రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో 78 కాలేజీలు అటానమస్ హోదా పొందాయి. గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీ అందించే సిలబస్‌లో 80 శాతాన్ని ఈ కాలేజీల్లో అమలు చేయాలి. మిగతా 20 శాతం సిలబస్‌ను సొంతంగా తయారు చేసుకోవచ్చు. మారుతున్న సిలబస్‌ను ఈ కాలేజీలు స్వాగతిస్తున్నాయి. కానీ మిగతా కాలేజీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమ కాలేజీల్లో లక్షపైన ర్యాంకు పొందిన విద్యార్థులు చేరుతున్నారని.. వాళ్లు అత్యున్నత బోధనా ప్రణాళిక స్థాయిని ఎలా అందుకుంటారని ప్రశి్నస్తున్నాయి. అయితే నాణ్యతలేని ఇంజనీరింగ్ విద్యను చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతుందని యూనివర్సిటీలు అంటున్నాయి. -
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
న్యూఢిల్లీ: సిలబస్‌ను కాషాయీకరణ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ స్పందించారు. ఆదివారం(జూన్16) పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన మాట్లాడారు. విద్యార్థులకు వాస్తవాలను తెలియజేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. చరిత్రను తెలియజేసే అంశాలను బోధిస్తామని, యుద్ధానికి మద్దతుగా బోధన ఉండదన్నారు. బాధ్యత గల పౌరులను మాత్రమే సమాజానికి అందించాలనుకుంటున్నామని దినేశ్ తెలిపారు. ‘పుస్తకాల ద్వారా చిన్నారులకు అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి సమాజంలో నేరాలు, హింస ఎలా సృష్టించాలనే విషయాలను మన విద్యార్థులకు బోధించాలా ఇదేనా విద్య ముఖ్య ఉద్దేశం. అసలు అల్లర్ల గురించి చిన్న వయసులో పిల్లలకెందుకు. రామ జన్మభూమిపై సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే దాన్ని పుస్తకాల్లో చేర్చకూడదా.. కొత్త పార్లమెంటును నిర్మిస్తే వాటి గురించి మన విద్యార్థులు తెలుసుకోవద్దా.. ఇటువంటి అంశాలనే సిలబస్‌లో చేర్చాం. చారిత్రక విషయాలతో పాటు సమకాలీన అంశాలను సిలబస్‌లో చేర్చడం మా బాధ్యత’అని సక్లానీ తెలిపారు. -
టెట్.. టఫ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినవారితోనే టెట్ రాసేందుకు సర్విస్‌లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్‌లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్విస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకూ టెట్ సిలబస్‌ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. టెట్ దరఖాస్తులను ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకూ స్వీకరించాల్సి ఉంది. మే 20 నుంచి జూన్ 3 వరకూ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల్లో మార్పు తప్పదా? టెట్ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్విస్‌లో ఉన్న ఉపాధ్యాయులూ కొత్తవారితో కలిసి టెట్ రాసేందు కు వీలుగా జీఓ వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే, ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్‌పై అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. సిలబస్ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ రాయ డం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వా రు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు తేలికగా టెట్ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచ ర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీని పై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది. ఈ కారణంగానే టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్ నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 80వేల మంది వరకూ ఉన్నారు. స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్, ఎస్ఏల నుంచి హెచ్ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక టెట్ పెట్టి తీరాలి ప్రత్యేక టెట్ పెట్టకపోతే సర్వీస్‌లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడో బీఈడీ, టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్‌తో టీచర్లకు టెట్ పెట్టాలి. భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్షణమే గైడ్‌లైన్స్ ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం టెట్ గైడ్‌లైన్స్ విడుదల చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. విధివిధానాలు వస్తే తప్ప నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్ సమగ్ర నోటిఫికేషన్‌కు ఎదురుచూస్తున్నారు. టెట్ సకాలంలో జరిగి, ఫలితాలు వెలువడినా, డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – రావుల మనోహర్‌రెడ్డి తెలంగాణ బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
ఏపీలో విద్యా విధానం భేష్
మధురవాడ (భీమిలి): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక (కరికులమ్)బాగున్నాయని ఐబీ సిలబస్ అంతరాత్జీయ ప్రతినిధులు యూఎస్ఏకి చెందిన సీనియర్ కరికులమ్ డిజైన్ మేనేజర్ ఆర్డర్, యూకేకి చెందిన అసోసియేట్ మేనేజర్ మైఖేల్ ప్రశంసలు కురిపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో నార్త్ డివిజన్లో 10 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ మహానగరంలోని చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం సందర్శించారు. ఇక్కడ కరికులమ్, కంప్యూటర్ విద్య, వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, విద్యార్థులు పాఠాలను ఎలా అర్థం చేసుకుంటున్నారనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐఎఫ్‌పీ ప్యానల్స్, ట్యాబ్స్ ఉపయోగం, పిల్లల టాలెంట్స్‌ను పరిశీలించారు. బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్ పిల్లలకు ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయాలతోపాటు బోధన తీరును కూడా పరిశీలించారు. సైన్స్‌డేని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన మోడల్స్, వాటి గురించి వివరిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఈఆర్టీ ఆచార్యులు శ్రీనివాసరావు, డీఈఓ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ.. ఐబీ సిలబస్ ప్రతినిధులు ఇక్కడి విద్యావిధానం బాగుందని చెప్పారన్నారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకున్న ఐబీ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా వేర్వేరు పాఠశాలలు, తరగతులను పరిశీలిస్తున్నారన్నారు. -
రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్ సిలబస్‌లో హిట్‌మ్యాన్ పేరిట ఉన్న 35 బంతుల టీ20 సెంచరీని పాఠ్యాంశంగా పొందుపరిచారు. రోహిత్ శతకాన్ని ఉదాహరణగా తీసుకుని గణిత శాస్త్రంలోని ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ కాన్సెప్ట్‌పై పలు ప్రశ్నలు అడిగారు. రోహిత్ క్రికెటింగ్ కెరీర్‌లోని ఘనతలను పాఠ్యాంశంగా పొందుపరచడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఓ అప్పర్ ప్రైమరీ స్కూల్ పాఠ్యపుస్తకంలో ఇతనికి సంబంధించిన అంశాలను పాఠ్యాంశంగా చేర్చారు. Captain Rohit Sharma featured in the 11th Class Maths Text book. 👌 pic.twitter.com/mSgDnHm6Ye — Johns. (@CricCrazyJohns) February 26, 2024 కాగా, పాఠ్యాంశంగా మారిన రోహిత్ టీ20 సెంచరీ 2017 డిసెంబర్లో చేసింది. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 35 బంతుల్లో 10 ఫోర్, 12 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. కొద్ది నెలల కిందటి వరకు ఇది అంతర్జాతీయ టీ20ల్లో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది. గతేడాది చివర్లో జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా.. రోహిత్, డేవిడ్ మిల్లర్ పేరిట సంయుక్తంగా ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చెరిపేశాడు. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీని బాదాడు. అయితే, కుశాల్ పేరిట ఈ రికార్డు ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇవాళ (ఫిబ్రవరి 27) నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ కుశాల్ రికార్డును బద్దలు కొట్టాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో లాఫ్టీ కేవలం 33 బంతుల్లోనే శతక్కొట్టి, టీ20 ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. -
ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’ విద్య అమలుకు ఒప్పందం
భావి తరాలకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో ముఖ్యం. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలవాలన్నా నాణ్యమైన విద్యే కీలకం. – ఐబీతో ఒప్పందంలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్యా బోధన దిశగా కీలక ఘట్టం పూర్తి అయ్యింది. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బెగుయిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ ఈ కార్యక్రమంలో జెనీవా నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో ఐబీని భాగస్వామ్యం చేయడం గొప్ప సంతృప్తినిస్తోందన్నారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైందని, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమంగా అభివర్ణించారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా, ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పరిస్థితి ఇక మారుతుంది: సీఎం జగన్ భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అత్యవసరమని, ఇప్పుడున్న విధానాలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ చెప్పారు. సాంకేతికత, పాఠ్య ప్రణాళిక తదితర అంశాలను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. సమస్యా పూరణ సామర్థ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వినియోగం లాంటివి చాలా కీలకమని, ఐబీ ద్వారా ఇది సాధ్యమన్నారు. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైందని, రానున్న విద్యా సంవత్సరంలో టీచర్లకు, సిబ్బందికి ఐబీ విధానాలపై శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ఐబీ విద్య సంపన్నులకు మాత్రమే అనే పరిస్థితి ఇప్పుడు మారుతుందని వ్యాఖ్యానించారు. పేదలకు, అణగారిన వర్గాలకూ ఇకపై ఐబీ బోధన అందుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలై 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతుల్లో ఐబీ బోధన ప్రారంభమవుతుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ, ఐబీ భాగస్వామ్యంతో విద్యా బోధన కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు. ఇతర దేశాలకు ఈ ఒప్పందం స్ఫూర్తి: ఓలి పెక్కా తమది లాభాపేక్ష లేని సంస్థ అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై చాలా నిబద్ధతతో ఉన్నామని ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. విద్య ద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత సమాజాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇంత పెద్దస్థాయిలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం ఇదే ప్రథమమని, ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఈ ఒప్పందం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. దీనిద్వారా భారత్‌తో విద్యారంగంలో తమ సంబంధాలు మరింత మెరుగుపడతాయని, నాణ్యమైన విద్యకోసం ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య మంచి వాతావరణాన్ని కల్పించి సామర్థ్యాలను పెంచుతామన్నారు. పిల్లలు, స్కూళ్లు, తల్లిదండ్రులు, యూనివర్శిటీలతోనూ తమ సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఏపీలో కొత్త తరహా విద్యా విధానంలో తొలుత ప్లే బేస్డ్ లెర్నింగ్ విధానంతో పిల్లల్లో ఆసక్తిని కలిగించేందుకు ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్‌తో పాటు మాతృ భాషల్లోనే కాకుండా పిల్లలు విదేశీ భాషలను నేర్చుకోవడంపైనా దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. దీనివల్ల పిల్లల్లో కొత్త సామర్థ్యాలు అలవడతాయన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, సింగపూర్, ఎస్తోనియా, ఫిన్లాండ్, కెనడా దేశాల్లోని విద్యామంత్రులతో ఇటీవల నాణ్యమైన బోధన, అభ్యాసాలపై చర్చించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (ఇన్ఫ్రా) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్.శోభిక, ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీ భాగస్వామ్యంపై జీవో పాఠశాల విద్యలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుకు అనుగుణంగా ఎస్సీఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యంపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో నంబర్ 5 జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో భవిష్యత్ సాంకేతికత, సిలబస్, బోధన, సదుపాయాలు తదితర అంశాలపై ఐబీ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. 21 మంది ఐబీ ప్రతినిధుల బృందం వచ్చే నెల రోజుల్లో 40 పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాలను పరిశీలించి అధ్యయనం నిర్వహిస్తుంది. ఎగ్జామినేషన్ విధానాలను సైతం పరిశీలించి మార్పుచేర్పులపై సూచనలు చేస్తారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు శిక్షణ, సిలబస్‌పై సూచనలు ఇచ్చేందుకు ఎస్సీఈఆర్టీలోని 19 మంది నిపుణులతో పాటు ఐబీకి చెందిన 26 మంది నిపుణులు చర్చించనున్నారు. మొత్తం ప్రక్రియను 2025 మే నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధనను ప్రవేశపెట్టనున్నారు. -
ఏపీలో భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా..: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఐబీ’ విద్య అమలుకు శ్రీకారం చుట్టింది జగనన్న ప్రభుత్వం. ఈ క్రమంలో.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో SCERT, IB మధ్య ఒప్పందం కుదిరింది. తద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్ పేద పిల్లలకు చేరువ కానుంది. ఐబీ సిలబస్ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు సీఎం జగన్ సమక్షంలో ఏపీ విద్యాశాఖతో ఒప్పందం చేసుకున్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బిగిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జెనీవా నుంచి వర్చువల్‌గా ఐబీ డైరెక్టర్ జనరల్ ఒల్లి పెక్కా హీనోనెన్ పాల్గొన్నారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. ‘‘ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం నాకు గొప్ప సంతృప్తి నిస్తోంది. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కాకు, ఆన్లైన్ ద్వారా హాజరైన వారితో పాటు ఇక్కడకు వచ్చిన ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది నేను భావిస్తున్నా. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం ఇది గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమం. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యం. భవిష్యత్తు తరాలు.. మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్ ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలవాలన్నా భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరం. .. ఇప్పుడున్న విద్యావిధానాలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య ప్రపంచంతో పోల్చిచూస్తే సాంకేతికత, పాఠ్యప్రణాళిక తదితర అంశాల్లో అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. సమస్యా పూరణ సామర్ధ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్‌ని వినియోగం వంటివి చాలా కీలకం. ఐబీ ద్వారా ఇది సాధ్యమని విశ్వసిస్తున్నాం. ఐబీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైంది. ముందు టీచర్లకు, సిబ్బందికి కెపాసిటీని పెంచేలా శిక్షణ కార్యక్రమాలు రానున్న విద్యాసంవత్సరంలో అమలవుతాయి. సంపన్నులకు మాత్రమే అందే ఐబీ విద్య అన్న పరిస్థితి ఇప్పుడు మారుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పదేళ్లలో 2035నాటికి పదోతరగతి, 2037 నాటికి పన్నెండు తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పేదలకు, అణగారిన వర్గాలకూ ఐబీ బోధన అందుతుంది. ఎస్ఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యం కావడం వల్ల విద్యా బోధన, అభ్యాసాలు పరిణామం చెందుతాయి. ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు. దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్(పాఠశాల మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ బి శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్. శోభికా, ఐబీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘అడ్వాన్స్డ్’ మోతాదూ తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సిలబస్ తగ్గింపుపై కసరత్తు జరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దీనిపై త్వరలో స్పష్టత ఇచ్చే వీలుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ సిలబస్ ను తగ్గించారు. మేథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పది టాపిక్ల వరకూ తీసేశారు. ఇదే తరహాలో అడ్వాన్స్‌డ్‌లోనూ నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పె రుగుతోంది. అన్ని రాష్ట్రాలూ సిలబస్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్టీఏ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. నిపుణు ల నుంచి సలహాలు తీసుకున్నారు. సిలబస్‌లో ఏ తరహా మార్పులు చేయాలనే అంశంపై పలు దఫా ల చర్చలు జరిగినట్లు ఎన్టీఏ వర్గాల ద్వారా తెలిసింది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా 2020 నుంచి 2022 మధ్య బోధన పూర్తిస్థాయిలో సాధ్యపడనందున టె న్త్, ఇంటర్ సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గించారు. 2024లో జరిగే జేఈఈ పరీక్షకు ఈ విద్యార్థులే హాజరు కా నుండటంతో జేఈఈ మెయిన్స్ సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గిస్తున్నట్లు ఎన్టీఏ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. విద్యార్థుల్లో ‘అడ్వాన్స్డ్’ఆందోళన... గత కొన్నేళ్లుగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జేఈఈ మెయిన్స్ అర్హు ల్లో టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మందికే అడ్వాన్స్డ్ రాసే అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఐదేళ్లుగా అ డ్వాన్స్‌డ్ రాస్తున్న వారి సంఖ్య 1.60 లక్షలు దాట డం లేదు. దరఖాస్తు చేసిన వారిలో 15 శాతం మంది పరీక్షకే హాజరు కావట్లేదని ఎన్టీఏ గుర్తించింది. అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు లభిస్తున్నా అన్ని ఐఐటీలలో కలిపి సీట్లు 16 వేలకు మించి లేవు. ఇందులోనూ టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన వరకే అగ్రశ్రేణి ఐఐటీల్లో సీట్లు వస్తున్నాయి. అడ్వాన్స్డ్ పేపర్ కొన్నేళ్లుగా కష్టంగా ఉండటంతో విద్యార్థులు పోటీ పడేందుకు భయపడుతున్నారు. జేఈఈ ర్యాంకుతో ఎన్ఐటీల్లో సీటు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సిలబస్‌లో మార్పులు తేవాలని వివిధ రాష్ట్రా లు అడ్వాన్స్డ్ నిర్వాహక ఐఐటీలను డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో తొలగించిన టాపిక్స్ అడ్వాన్స్‌డ్‌లో కొనసాగించే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. మేథ్స్‌లో ఆ టాపిక్స్ ఉండకపోవచ్చు నిపుణుల కమిటీ ఇటీవల ఎన్టీఏకు అందించిన నివేదిక ప్రకారం గణితంలో కొన్ని టాపిక్స్‌ను తొలగించే వీలుందని తెలుస్తోంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్, టాన్జంట్స్ అండ్ నార్మల్స్, ప్లాన్ ఇన్ డిఫరెంట్ ఫామ్స్, మేథమెటికల్ రీజనింగ్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ వంటి టాపిక్స్ ఉండకపోవచ్చని సమాచారం. -
మార్పుతో మేలు జరిగేనా?
సాక్షి, హైదరాబాద్: ఈసారి జరిగే జేఈఈ మెయిన్స్‌లో గణనీయమైన మార్పులు తెచ్చారు. ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కొన్ని టాపిక్స్ ఎత్తేశారు. ఈ పరిణామంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్‌కు ఇప్పటికే విద్యార్థులు సన్నద్ధమయ్యారు. ఈ దశలో సిలబస్ మార్పులను ఎన్టీఏ ప్రకటించడంతో ఇది రాష్ట్ర విద్యార్థులపై కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సిలబస్ నుంచి తొలగించిన టాపిక్స్‌కు కూడా విద్యార్థులు ప్రిపేరయ్యారు. ఇప్పుడు వాటిని తప్పించడంతో మిగిలిన టాపిక్స్‌లో పోటీ తీవ్రంగా ఉండే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సిలబస్‌తో ఇంటర్ చేసే వాళ్లు మరికొంత శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని... అలాగే వారంతా ఏప్రిల్‌లో జరిగే రెండో దశ మెయిన్స్‌కు హాజరు కావడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగేనా? సిలబస్ తగ్గించడంతో ఈసారి మెయిన్స్ రాసేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కటాఫ్ మార్కుల విషయంలోనూ కొన్ని మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. వాస్తవానికి జేఈఈ రాసేవారి సంఖ్య కొన్నేళ్లుగా తగ్గుతోంది. 2014లో దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుకాగా 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. వాస్తవానికి రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉండగా ప్రస్తుతం 1.30 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో రాష్ట్ర ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలు ఉండగా 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. రాష్ట్ర ఎంసెట్ ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందుతారు. జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు. సిలబస్ కఠినంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుసరించే సిలబస్ చదివితే తప్ప మెయిన్స్ గట్టెక్కలేమనే భావన విద్యార్థుల్లో ఎక్కువవుతోంది. దీంతో చాలా మంది రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్‌ను ఎంచుకుంటున్నారు. సిలబస్‌లో మార్పులు తేవడంతో ఈసారి జేఈఈ రాసే వారి సంఖ్య కొంతమేర పెరిగే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. మేథ్స్ ఇక కఠినం కానట్టేనా? కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్స్ రాస్తున్న వారు ఎక్కువగా గణితం కష్టంగా ఉందని చెబుతున్నారు. కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా స్కోర్ చేస్తున్న అనుభవాలున్నాయి. ఫిజిక్స్ నుంచి వచ్చే ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఇది దక్షిణాది విద్యార్థులకన్నా ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులను కలవరపెడుతోంది. మేథ్స్‌లో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు పట్టు ఉంటోంది. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సరైన శిక్షణ అందుకోలేకపోతున్నారు. జేఈఈలో ఇచ్చే గణితంలో సుదీర్ఘ ప్రశ్నలుంటున్నాయి. దీనివల్ల ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మేథ్స్‌లో ట్రిగ్నామెట్రిక్ ఈకే్వ షన్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ప్రిన్సిపుల్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్ వంటి టాపిక్స్ వచ్చే అవకాశం లేదని ఎన్టీఏ తెలిపింది. దీనివల్ల తేలికగానే జేఈఈ మెయిన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
NCERT: పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్!
ఢిల్లీ: దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి NCERT ప్యానెల్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని కోరుతూ మండలికి సిఫార్సు చేయనుంది. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, కొత్త సిలబస్, మార్పులు చేర్పులు, 2020 పాలసీకి సవరణలు, ఇతర ప్రణాళికల్ని ఖరారు చేసేందుకు 25 మందితో కూడిన ప్రత్యేక కమిటీ ఒక ఏర్పాటైంది. అయితే.. ఇండియా బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు NCERT ప్యానెల్ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్ చైర్మన్ ఐజాక్ బుధవారం వెల్లడించారు. కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ ఉంటుందని స్పష్టం చేశారాయన. చాలాకాలంగా ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. తాజాగా ఏకగ్రీవంగా సభ్యులంతా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారాయన. ఎన్సీఈఆర్టీ తరపున అన్ని పుస్తకాల్లో ఈ మార్పు రాబోతుందని ప్యానెల్ ఆశిస్తున్నట్లు తెలిపారాయన. అలాగే.. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కూడా ప్యానెల్ సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు.. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. చరిత్రలో ఇప్పటిదాకా మన ఓటముల ప్రస్తావనే ఉంది. కానీ, మొఘలుల మీద, సుల్తానుల మీద మన విజయాల గురించి ప్రస్తావన లేదు అని అంటున్నారాయన. అయితే ఢిల్లీ ఎన్సీఈఆర్టీ ప్రధాన కార్యాలయానికి ఈ ప్రతిపాదన మాత్రమే వెళ్లిందని.. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఈ దశలో ఈ పరిణామంపై స్పందించడం అవసరమని ఎన్సీఈఆర్టీ అంటోంది. ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ ఛైర్మన్ దినేష్ సక్లానీ స్పష్టంచేశారు. -
పవన్‌కు ఎందుకంత కడుపుమంట?
ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం సీబీఎస్ఈ టోఫెల్ , ఐబీ సిలబస్ ఎందుకు? ఇది నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యున్నత సిలబస్‌ను అందించడంపై తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు పవన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యలో రాష్ట్ర సిలబస్‌ను బోధిస్తున్నారు. దీని వల్ల సాంప్రదాయ విద్యాబోధన అందుతోంది. అయితే మారిన పరిస్థితులు, పోటీ ప్రపంచంలో భాగంగా ప్రైవేట్ స్కూళ్లు అన్నీ కొత్త సిలబస్‌ను ఎంచుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే CBSE అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూళ్లు ఎంచుకున్నాయి. ఇక మరికొన్ని కార్పోరేట్ స్కూళ్లు IB సిలబస్ అంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్.. (దీన్నే లాటిన్ నామంలో The International Baccalaureate® (IB) గా పిలుస్తారు) ఎంచుకున్నాయి. సాధారణంగా.. డబ్బున్న కుటుంబాలకు చెందిన పిల్లలు ఇప్పుడు IB సిలబస్‌ను మాత్రమే ఎంచుకుంటున్నారు. దీంట్లో చదవడం ద్వారా విద్యార్థులకు ప్రపంచ అవగాహన కలగడంతో పాటు భవిష్యత్తులో సులభంగా అంతర్జాతీయ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందగలుగుతారు. అలాగే అక్కడి కరిక్యులమ్‌కు అనుగుణంగా సులభంగా మారిపోగలరు. దీని విశిష్టతను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి IB సిలబస్‌ను ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్‌కేంటీ అభ్యంతరం పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తే.. ఆ కుటుంబ భవిష్యత్తుకు ఎంతో భరోసా. ఉన్నత చదువులు ఎక్కువ మంది చదువుకోగలిగితే.. సమాజం అభివృద్ధి చెందుతుంది. డబ్బున్నవాళ్లే కాదు.. పేదవాడు కూడా చదువుకోవడం.. ఇప్పుడు చాలా మంది ఓర్వలేకుండా ఉన్నారు. ఐబీ సిలబస్‌ను ఉచితంగా పేద విద్యార్థికి ఎలా అందిస్తారన్న కడుపు మంట ఈ వ్యాఖ్యల్లో బయటపడుతోంది. తమ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూళ్లకు మాత్రమే పంపే ఈ నియో రిచ్ నాయకులు.. పేదలకు మాత్రం ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు భాష మీద నెపం మోపుతారా? తెలుగు భాష అమ్మ అయితే ఇంగ్లిష్ భాష నడిపించే నాన్న. మారిన ప్రపంచీకరణ వల్ల జీతం, జీవితం ఇంగ్లిష్‌పై ఆధారపడుతోంది. ఇటీవల ఐక్యరాజ్యసమితికి వెళ్లిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చూసి యావత్తు దేశం అబ్బురపడింది. అంతర్జాతీయ యవనికపై వారి భాష, ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం ఏపీ ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్యకు అద్దం పట్టింది. ఇప్పుడు పిల్లలంతా చదువుకుని ప్రయోజకులయితే తమ సంగతి ఏంటన్న ఆందోళనలో పచ్చపార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. హఠాత్తుగా వీరికి తెలుగుభాష మీద ప్రేమ పుట్టింది. తెలుగులో చదువుకోకపోతే ఎలా అంటూ దీర్ఘాలు తీస్తున్న వీరి అసలు ఉద్దేశ్యం మాత్రం కడుపు మంటే. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు.. చైనా విద్యాసంస్థలను ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరూ చేరకుండా చేశాడు. ఇప్పుడు పేదవాడు బాగుపడుతున్నాడంటే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లలకు మనమిచ్చే నిజమయిన ఆస్థి విద్య అని భావించిన సీఎం జగన్ ప్రభుత్వం 70 వేల కోట్లు ఖర్చు చేసింది. అందుకే ఐబీ అయినా టోఫెల్ అయినా ప్రతీ సామాన్యుడికి అందాలన్న ఆశయం దిశగా అడుగులేస్తోంది. -
సర్కారు బడుల్లో సిలబస్ తంటాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బడుల్లో సిలబస్ పూర్తవ్వకపోవడం విద్యాశాఖలో సరికొత్త వివాదానికి దారితీస్తోంది. దీనికి పాఠశాల హెచ్ఎంలు, సంబంధిత టీచర్లను బాధ్యులను చేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ భావించడం కొత్త సమస్యను సృష్టిస్తోంది. ఈ పరిస్థితికి విద్యాశాఖ అధికారులే కారణమని ఉపాధ్యాయులు నిందిస్తున్నారు. నేరం తమపై మోపితే సహించేదే లేదని చెబుతున్నారు. సిలబస్ పూర్తికాని బడుల వివరాలను పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇటీవల తెప్పించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో దసరా సెలవులలోపు 80 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉండగా, ఎక్కడా 40 శాతానికి మించి పూర్తవ్వలేదని డీఈవోలు చెబుతు న్నారు. కొన్ని చోట్ల 25 శాతం మాత్రమే అయిందంటున్నారు. ఇలాంటి బడుల హెచ్ఎంలు, టీచర్ల నుంచి వివరణ కోరాలని పాఠశాల విద్య డైరెక్టర్ డీఈవోలకు సూచించినట్టు తెలిసింది. దీంతో డీఈవోలు సంబంధిత బడుల హెచ్ఎంల నుంచి వివర ణ కోరేందుకు సన్నద్ధమయ్యారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక సమయమెక్కడిది? పాఠశాల విద్యశాఖ సూచించిన లక్ష్యం పూర్తవ్వకపోవడంతో, భవిష్యత్‌లో సిలబస్ సమగ్రంగా పూర్తి చేయడం అసాధ్యమని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. స్కూళ్లు తెరిచిన రెండు నెలల వరకూ పాఠ్యపుస్తకాలు అందలేదని, ఈ కారణంగా బోధన చేపట్టలేదని టీచర్లు చెబుతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతుల అంశాన్ని తెరమీదకు తెచ్చిం ది. దీంతో బోధన కొంతమేర కుంటుపడింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడంతో మరో రెండు నెలలపాటు టీచర్లు ఇదే హడావిడిలో ఉంటారు. చాలామంది పోలింగ్ విధులకు వెళ్లాల్సి ఉంటుంది. వారికి కొన్ని రోజులపాటు శిక్షణ ఇస్తారు. వీటితో బోధన జరిగేందుకు వీలుకాని పరిస్థితి ఉంటుందని టీచర్లు చెబుతున్నారు. అదీగాక, చాలాచోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఇతర స్కూళ్ల నుంచి సర్దుబాటు చేయడంలో అధికారులు జాప్యం చేశారని టీచర్లు ఆరోపిస్తున్నారు. కాబట్టి వందశాతం సిలబస్ పూర్తి చేయడంపై వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ పరీక్షలపై ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే తమనే బాధ్యులను చేయడమేంటని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. -
3 నుంచి ఎఫ్ఏ 2 పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మ«ద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది. కాగా, ఈ నెల 14 నుంచి 24 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. -
ఐబీ సిలబస్ అమలుపై అధ్యయనం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం మొదలైంది. ఇప్పటికే గుంటూరు, విజయవాడల్లోని ఐబీ స్కూళ్లలో సిలబస్ అమలును పాఠశాల విద్యా శాఖ పరిశీలించింది. అయితే, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ రెండేళ్లుగా అమలవుతోంది. ఈ క్రమంలో శనివారం పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ నేతృత్వంలోని బృందం అక్కడి పాఠశాలలను పరిశీలించింది. ఐబీ సిలబస్ బోధిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాలు, విద్యార్థులకు బోధిస్తున్న విధానంపై అధ్యయనం చేసింది. ఏపీలో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు ఉపాధ్యాయుల శిక్షణ, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ ఆవశ్యకతను అర్థం చేసుకునేందుకు, విధివిధానాలను తెలుసుకునేందుకు ఢిల్లీ వెస్ట్ వినోద్నగర్లోని సర్వోదయ కన్య విద్యాలయ (ఎస్కేవీ)ను వీరు సందర్శించారు. ఒకటి, మూడు, ఐదో తరగతి విద్యార్థులతో మమేకమై వివిధ అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, ఐబీ సిలబస్ అమలుపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ఇటీవల స్టీరింగ్ కమిటీని నియమించిన నేపథ్యంలో ఆ కమిటీ ఢిల్లీ స్కూళ్లను పరిశీలించింది. -
ఐబీ సిలబస్ అన్నది సవాల్‌తో కూడుకున్నది: సీఎం జగన్
-
ఐబీ సిలబస్ సవాల్‌తో కూడుకున్నది: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జగనన్న సర్కార్‌లో.. ఏపీ ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు పడింది. ప్రభుత్వ బడి పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు.. అందుబాటులోకి ఐబీ సిలబస్ రానుంది. ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో ఐబీ సంస్థతో ఎంవోయూ memorandum of understanding (MOU) జరిగిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ‘‘విద్యలో నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యం. మా పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకోసమే మీ సహకారాన్ని కోరుతున్నాం. ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నది మా ఉద్దేశం. ఐబీ సిలబస్ అనేది సవాల్‌తో కూడుకున్నది. అందులోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం అనేది ఇంకా పెద్ద సవాల్. కానీ సంకల్పం ఉంటే సాధ్యంకానిది లేదు. పాఠశాల విద్యను బలోపేతంచేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. అవన్నీ మీ దృష్టికి వచ్చే ఉంటాయి. ఏపీలో పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దాం. స్కూళ్లను బాగుచేయడం దగ్గరనుంచి డిజిటలైజేషన్ వరకూ అనేక చర్యలు తీసుకున్నాం. బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తీసుకు వచ్చాం. పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రతిరోజూ ఒక పీరియడ్ టోఫెల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నాం. అన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో బోధిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఐబీని తీసుకు వచ్చాం. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదు. ఒకటో క్లాసుతో మొదలు పెడితే దీని ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయి. ఇలా చూసుకుంటే పూర్తిస్థాయిలో రావడానికి పదేళ్లు పడుతుంది. దిగువస్థాయిలో ఉన్న పేదల వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే మా ఉద్దేశం. దేవుడి దయ వల్ల ఈ లక్ష్యం సిద్ధిస్తుంది. ఐబీ భాగస్వామ్యానికి కృతజ్ఞతలు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఇవాళే ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాతే ఐబీ సంస్థతో ఎంవోయూ కార్యక్రమం జరిగింది. సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ Olli-Pekka Heinonen, ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ Matt Costello పాల్గొని మాట్లాడారు. ఐబీ అంటే ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ అని అర్థం. ఈ విద్యా విధానంలో చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెర్నింగ్ లాంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్-మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నతా విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. -
ఏపీలోనే ఏఎన్ఎంలు ఎక్కువ
రోగులకు వైద్యసేవల కల్పన, వారి సంరక్షణలో కీలకపాత్ర పోషించే నర్సుల అందుబాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రభాగాన ఉంది. క్షేత్రస్థాయిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ముఖ్యపాత్ర పోషించే ఏఎన్ఎంలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా మనదే కావడం గమనార్హం. నర్సులు, ఏఎన్ఎం, జీఎన్ఎంల సంఖ్యలో సంబంధిత విద్యలో ఏపీ ముందంజలో ఉందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి 2021–22 వార్షిక నివేదికను ఐఎన్‌సీ విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. నర్సులు, జీఎన్ఎం, ఏఎన్ఎంల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలు ముందున్నాయి. – సాక్షి, అమరావతి ఏపీలో 1.39 లక్షల మంది ఏఎన్ఎంలు.. దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ ఏఎన్ఎంలు 9.82 లక్షల మంది ఉన్నారు. అయితే, ఏపీలోనే అత్యధికంగా 1.39 లక్షల మంది ఉన్నారు. రాజస్థాన్‌లో 1.10 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 75వేల మంది ఉన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కేవలం 10,219 మందితో 19వ స్థానంలో ఉంది. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి సచివాలయానికొక ఏఎన్ఎంను నియమించిన విషయం తెలిసిందే. రిజిస్టర్డ్ నర్సులు దేశవ్యాప్తంగా 24.71 లక్షల మంది ఉన్నారు. తమిళనాడులో అత్యధికంగా 3.32 లక్షల మంది ఉండగా, కేరళలో 3.15 లక్షల మంది, మూడోస్థానంలో ఉన్న ఏపీలో 2.62 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ 53,314 మందితో 14వ స్థానంలో ఉంది. కొత్త కోర్సులు.. సెమిస్టర్ విధానం నర్సింగ్ విద్యలో కౌన్సిల్ అనేక మార్పులు చేసింది. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక మార్పుల నేపథ్యంలో సిలబస్‌లో సవరణలు చేసింది. బీఎస్సీ నర్సింగ్ విద్యలో ఇప్పుడు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరమే ఇది అమల్లోకి వచ్చింది. మరోవైపు.. డాక్టర్ ఆఫ్ నర్సింగ్ ప్రోగ్రాంను, ఈ–లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఫౌండేషన్, కోర్, ఎలక్టివ్ కోర్సులు ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో పేషెంట్ సెంటర్డ్ కేర్‌ను తీసుకొచ్చింది. ఇందులో రోగి వ్యక్తిగత ప్రాధాన్యతలు, అవసరాలను గుర్తించి సంపూర్ణమైన సేవలు అందించాల్సి ఉంటుంది. నర్సింగ్ కౌన్సిల్ కొన్ని సూచనలు కూడా చేసింది. అవి.. ♦ హెల్త్‌కేర్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ♦ రోగి విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ♦ వ్యక్తిగత పనితీరుతో రోగికి ఎలాంటి ప్రమాదం కలిగించకుండా వ్యవహరించాలి. ♦స్కిల్ ల్యాబ్, క్లినికల్ లెర్నింగ్ పద్ధతులపై దృష్టి సారించాలి. నర్సింగ్ విద్యలోనూ టాప్–5లో.. ఇక నర్సింగ్ విద్యలోను ఏపీ దేశంలోని టాప్–5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ సీట్లకు సంబంధించి కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 19,860 సీట్లు ఉండగా, తమిళనాడులో 12వేలు, మధ్యప్రదేశ్‌లో 9వేలు, రాజస్థాన్‌లో 8,165 ఉన్నాయి. ఏపీ 8,030 సీట్లతో ఐదో స్థానంలో ఉంది. తెలంగాణ 4,980 సీట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక ఏఎన్ఎం విద్యకు సంబంధించి 910 సీట్లతో ఏపీ దేశంలో 12వ స్థానంలో, 455 సీట్లతో తెలంగాణ 17వ స్థానంలో ఉంది. మరోవైపు.. జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ) సీట్లు తెలంగాణలో 3,962 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 7,125 ఉన్నాయి. ఇవి దేశంలోనే అత్యధికంగా కర్ణాటకలో 24,731 సీట్లున్నాయి. ఇక ఏఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31 ఉండగా, తెలంగాణలో 16 మాత్రమే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 545 స్కూళ్లు ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ 18వ స్థానంలో ఉంది. జీఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 163 ఉండగా, తెలంగాణలో 88 ఉన్నాయి. కర్ణాటకలో ఇవి అత్యధికంగా 520 ఉన్నాయి. -
'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగింపు
ప్రసిద్ధ గేయం 'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్ కౌన్సిల్ శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని చట్టసభ్యులు ధృవీకరించారు. భారత్ విభజనకు ముందు ఉన్న సియోల్కోట్లో 1877లో జన్మించిన పాక్ కవి అల్లామా ఇక్బాల్‌గా పిలిచే ముమహ్మద్ ఇక్బాల్ ఈ ప్రముఖ గేయం 'సార్ జహాన్ సే అచ్ఛా'ని రాశారు. ఆయన గురించి ఉన్న పాఠ్యాన్ని బీఏలోని పొలిటికల్ సిలబస్ నుంచి తొలగించారు. దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏపీవీపీ) స్వాగతించింది. పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో మార్పుకు సంబంధించి తీర్మానం తీసుకురావడమే గాక ఆ పార్యాంశాన్ని తొలగించినట్లు కౌన్సిల్ సభ్యుడు తెలిపారు. వాస్తవానకి 'మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్' అనే సబ్జెక్టు బీఏలోని ఆరవ సెమిస్టర్ పేపర్లో బాగం. దీన్ని ఇప్పుడూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాజకీయా ఆలోచనలోని గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది యూనివర్సిటీ. ఈ కోర్సులో భాగంగా సిలబస్‌లో రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు భీమ్రావ్ అంబేద్కర్ తదితరులు గురించి ఉంది. అంతేగాదు ఆధునిక భారతీయ ఆలోచనలపై విమర్శనాత్మక అవగాహనతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ఈ కోర్సును ఏర్పాటు చేశారు. ఆయా ప్రముఖుల ఆలోచనల నేపథ్య అన్వేషణ తోపాటు చారిత్రక పథంలో ముఖ్యమైన విషయాలపై సమయోచిత చర్చలను గుర్తించడం సంబంధిత వారి రచనలలో ప్రదర్శించబడిన విభిన్న అవకాశాలను విద్యార్థులకు తెలుసుకోవాలనే లక్ష్యంతో పాఠ్యాంశాల్లో భాగం చేశారు. సిలబస్‌లో మొత్తం ఆయా ప్రముఖుల గూర్తి మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ఇదిలా ఉండగా, భారత రాజకీయ ఆలోచనలను గూర్చి తెలసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీఏ ఆరవ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు చేర్చిన దీనిలో ఆ మతోన్మాద పండితుడు మొహమ్మద్ ఇక్బాల్‌ని గూర్చి పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించింది అకడమిక్ కౌన్సిల్. నిజానికి ఇక్బాల్‌ని పాకిస్తాన్ తాత్విక తండ్రిగా పిలుస్తారు. అతను ముస్లిం లీగ్‌లో జిన్నాను నాయకుడిగా స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడని, ఇక్బాల్ కూడా జిన్నా వలే భారతదేశ విభజనకు కారణమని యూనివర్సిటీ ఆరోపించింది. (చదవండి: ఆక్రమణ నిరోధక డ్రైవ్‌లో షాకింగ్ దృశ్యాలు..పోలీసులు మహిళ జుట్టు పట్టి లాగి, తన్ని..) -
కావాల్సింది ‘వర్గ పోరాటాల చరిత్ర’
విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, ‘ఉభయ’ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన కొన్ని పాఠ్యపుస్తకాలలో వున్న చరిత్రకి సంబంధించిన కొన్ని పాఠాల్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తీసివెయ్యడం ఆరు నెలల కిందట (2022 జులైలో) జరిగింది. అది ఇప్పుడు ఒక వివాదంగా వుంది. కేంద్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగానూ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో రకంగానూ చరిత్ర పాఠాల్లో ఈ మార్పులు జరుగుతూ వచ్చాయి! గతంలో, ఎప్పుడు ఎలాంటి మార్పులు చేశారు– అనే వివరాలలోకి వెళ్ళడం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు జరుగుతోన్న వివాదాన్నే ప్రధానంగా చూడాలి. సెంట్రల్ సిలబస్‌లో 6వ తరగతి నించీ 12వ తరగతి వరకూ వున్న సోషలూ, చరిత్రా పాఠాలు పిల్లలకి భారంగా తయారయ్యాయి కాబట్టి కొన్ని పాఠాల్ని తీసివెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్రభుత్వం అంటే, అధికార పార్టీకి అనుకూలంగా వుండే ప్రొఫెసర్ల కమిటీ అన్నమాట! ‘సిలబస్ హేతుబద్ధీకరణ’ అనే పేరుతో, కొన్ని పాఠాలు తీసేశారు. వాటిలో అతి ప్రధానమైనది, దాదాపు 4 వందల యేళ్ళు పాలించిన మొఘల్ చక్రవర్తుల చరిత్ర. అలాగే, గాంధీ హత్యా, గుజరాత్లో మత కల్లోలాలూ, వగైరా, వగైరా. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో మొఘలుల పాలనకు విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చారనీ, ప్రాచీన హిందూ రాజుల చరిత్రకి ప్రాధాన్యత లేదనీ, దక్షిణ భారత దేశాన్నీ, ఈశాన్య భారతాన్నీ ఏలిన రాజుల్ని పట్టించుకోలేదనీ, కాంగ్రెసు మీద బీజేపీ సమర్థకుల విమర్శ. ముస్లిం మైనారిటీలను బుజ్జగించి, వారి ఓట్లను పొందడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లిం పాలకులకు అంత ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెసు మీద బీజేపీ ఆరోపణ. అయితే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మార్పులు, మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఎన్నికల్లో మెజారిటీ హిందూ మతస్తుల ఓట్లను రాబట్టడా నికి చేసిన కుట్ర అని ప్రతిపక్షాల వాదన! విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ అనేది ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. ఆ ప్రభుత్వ జోక్యానికి వుండే పెట్టు బడిదారీ వర్గ స్వభావాన్ని కార్మికవర్గ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చాలని, ఆ ప్రణాళిక ఉద్దేశం. ఆ దృష్టితో చూసినప్పుడు కాంగ్రెస్సూ, బీజేపీ, రెండూ బూర్జువా వర్గ ప్రయోజనాలను కాపా డేవే. అలా కాపాడడం కోసం, అధికార పీఠం ఎక్కడానికి, అవి ఎంచుకునే పద్ధతులు తేడాగా వుంటాయి. ఉదాహరణకి, బీజేపీ ఎందుకు హిందూ మెజారిటీ ఓట్లమీద ఆధారపడుతుందీ అనే విషయం అర్థం చేసుకోవాలంటే, 1906లో ఏర్పడ్డ ‘ముస్లిం లీగ్’ గురించీ, 1915లో ఏర్పడ్డ ‘హిందూ మహాసభ’ గురించీ తెలుసుకోవాలి. అప్పుడు ఆ మతాలకు చెందిన భూస్వాములకూ, పరిశ్రమాధిపతు లకూ, వర్తకులకూ, రాజకీయ నాయకులకూ, అటువంటి వారి ప్రయోజనాల మధ్య వున్న వైరుధ్యాలను పరిశీలించాలి. అదంతా ఇక్కడ వీలుకాదు. సారాంశం ఏమిటంటే, మత సంస్థలు గానీ, మతంతో ముడిపడి వున్న రాజకీయాలు గానీ, నిజంగా మతాలకు సంబంధించిన అంశాలు కావు. ఇప్పుడే కాదు, కొన్ని వందల ఏళ్ళ కిందట మతం పేరుతో జరిగిన యుద్ధాల్లో కూడా, ఎంగెల్సు చెప్పి నట్టు, ‘స్పష్టమైన భౌతిక వర్గ ప్రయోజనాలు వుండినాయి’! ‘ఆ నాటి వర్గపోరాటాలు మత నినాదాల దుస్తులలో వుండి, వేరువేరు వర్గాల ప్రయోజనాలూ, అవసరాలూ, డిమాండ్లూ వంటివి, మతం అనే తెరవెనక మరుగు పడ్డాయ’నే విషయాన్ని ‘జర్మనీలో రైతు యుద్ధం’ అనే పుస్తకం లో ఎంగెల్సు చాలా వివరంగా చెపుతాడు. అది ఈ నాటికీ వాస్తవమే. పైకి, తక్షణంగా, ఒక కారణం (ఉదా: గోద్రా రైలు దహనం, ఆ తర్వాత జరిగిన మత కల్లోలాలు) కనిపించినప్పటికీ, అనేక లింకుల ద్వారా చరిత్రని పరికిస్తే, మనకి పాలకవర్గ ప్రయో జనాలు కనిపిస్తాయి. ‘వర్గ ప్రయోజనం’ అన్నప్పుడు రెండు వేరు వేరు వర్గాలు– అనే కాదు; ఒకే వర్గంలోనే, రెండు వేరు వేరు సెక్షన్ల ప్రయోజనాల మధ్యకూడా వైరుధ్యాలు ఉంటాయి. వర్గాలుగానూ, ఉపవర్గాలుగానూ, చీలివున్న సమాజంలో, పాలక వర్గ ప్రయోజనాలను కాపాడడానికి, ఒకే ఒక్క రాజకీయ పార్టీయే వుండదు. అనేక పార్టీలు వుంటాయి. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. ఈ చరిత్ర పుస్తకాలలో రాజుల్నీ, చక్రవర్తుల్నీ, చిత్రించేటప్పుడు, ఒక పక్షం మేధావులు అన్ని మతాల పాలకుల్నీ కొంత ‘సంస్కరణ వాద దృక్పథం’తో చూపుతారు. ఇంకో పక్షం మేధావులు హిందూ పాల కుల్ని మాత్రమే గొప్ప చేస్తూ, ముస్లిం రాజుల్ని దుష్టులుగా చూపు తారు. చిత్రం ఏమిటంటే, ఉభయ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులే స్వయంగా దోపిడీ దారులనీ, వాళ్ళు శ్రామిక జనాలనించీ లాగిన కౌలూ, వడ్డీ, లాభాల వంటి శ్రమ దోపిడీ ఆదాయాల మీదే బతికిన వాళ్ళనీ మాత్రం గుర్తించరు. వాళ్ళ వీరత్వం గురించీ, యుద్ధ కళల గురించీ, కళా పోషణల గురించీ, వాళ్ళ పాండిత్య ప్రతిభల గురించీ, మత సామరస్యాల గురించీ, వాళ్ళ దైవభక్తి గురించీ, దానశీలతల గురించీ... ఇలా, ఇలా చిత్రించుకుంటూ పోతారు, ఇరుపక్షాల వారూ కూడా! అంతేగానీ, ఆ రాజులూ, యువరాజులూ, రాణులూ, యువ రాణులూ, ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేవారు కాదనీ, వాళ్ళది వందలాది సేవక పరివారం మీద ఆధారపడిన పరమ సోమరి జీవితం అనీ మాత్రం, ఎక్కడా ఒక్క ముక్క అయినా రాయరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమమీదా, చేతి వృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు (స్కూలు పుస్తకాల్లో కాదు గానీ, చరిత్రకి సంబంధించిన ఇతర రచనల్లో, వర్గాల గురించీ, వర్గ పోరాటాల గురించీ రాసిన మేధావులు కొందరైనా వున్నారు). చరిత్రకి సంబంధించిన పాఠ్యపుస్తకాల వివాదం చూశాక, శ్రామిక వర్గ పక్షం వహించే రచయితలు చెయ్యాల్సింది ఏమిటి? ‘పిల్లల కోసం వర్గపోరాట చరిత్ర పాఠాలు’ రాయడం! ‘పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం’ పేరుతో రాసినట్టు, వర్గ దృక్పధంతో కొన్ని చరిత్ర పాఠాలు రాయాలనివుంది నాకు. బీజేపీ ప్రభుత్వం అంటే భయం లేదుగానీ, నా ‘హెర్నియా’ జబ్బు రాయనిస్తుందో లేదో చూడాలి! వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ -
‘పది’ గట్టెక్కేదెలా?.. సిలబస్ పూర్తి కాని వైనం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులను గటెక్కించడం విద్యాశాఖకు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మహానగరంలోని సర్కారు బడుల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు సిలబస్ పూర్తి కాక పోవడం వంటివి తలకు మించిన భారంగా మారాయి. తాజాగా సర్కారు బడుల్లో మంచి ఫలితాల సాధన కోసం నిర్వహించ తలపెట్టిన ప్రత్యేక తరగతులు, వారాంతపు పరీక్షల అమలు ప్రశ్నార్థకంగా మారాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులో అభ్యసన సామర్థ్యాలు తగ్గడంతో పాటు సబ్జెక్టులపై కనీస పట్టులేకుండా పోయింది. వాస్తవంగా సబ్జెక్టు నిపుణుల కొరతతో ప్రధాన సబ్జె క్టుల్లో పాఠ్యాంశాల బోధన అంతంత మాత్రంగా తయారైంది. ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతోనే ప్రధానోపాధ్యాయులు బోధన కొనసాగిస్తున్నారు. కరోనా, ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో కొత్త అడ్మిషన్లు బాగానే పెరిగాయి. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని సాక్షాత్తు ప్రధానోపాధ్యాయులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్కారు బడుల్లో వంద శాతం ఫలితాలు సాధించడానికి అధికారులు మాత్రం ఏటా మొక్కుబడిగా ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నా అందుకు అనుగుణంగా టీచర్ల ఖాళీల భర్తీ ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం కావడంతో మరింత వెనుకబాటు తప్పడం లేదు. సరికొత్త ప్రణాళిక ► సర్కారు బడుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులను అధిగమించకుండా పదవ తరగతి పరీక్షలో మంచి ఫలితాల కోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆరీ్ట) తొలిసారిగా ► సరికొత్త ప్రణాళిక రూపొందించింది. వాస్తవంగా పదవ తరగతి పరీక్షల నేప«థ్యంలో జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులు, పరీక్షలపై ప్రణాళిక రూపొందించి అమలు చేసేవారు. ఆయితే సర్కారు బడుల్లో తగ్గుతున్న పదవ తరగతి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక రూపొందించడం విశేషం. 40రోజులు ప్రత్యేక తరగతులు.. ► పదవ తరగతి విద్యార్థులు సబ్జెక్టులపై మరింత పట్టు సాధించేందుకు 40 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. జనవరి 3 నుంచి మార్చి 10వ వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. పాఠశాల ప్రారంభ సమయం కంటే ముందు ఉదయం 8.30నుంచి 9.30 గంటల వరకు ఒక సబ్జెక్టు, పాఠశాల సమయం అనంతరం ► సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మరో సబ్జెక్టులో తరగతులు నిర్వహిస్తారు. రోజుకు రెండు సబ్జెక్టులు బోధిస్తారు. వాటిపైనే వారం వారం పరీక్షలు నిర్వహిస్తారు. 3 నుంచి వారాంతపు పరీక్షలు ► పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యేవిధంగా ప్రతి ఆదివారం, రెండో శనివారాల్లో వారాంతపు పరీక్షలు జరుగుతాయి. ప్రతి వారం ఒకే రోజు రెండు పరీక్షలు ► ఉదయం 9 నుంచి11 గంటల వరకు ఒక పరీక్ష, 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండో పరీక్ష నిర్వహించాల్సి ఉంది.. చదవండి: ఐటీ కారిడార్‌కు మరో మణిహారం.. కొత్త సంవత్సరం కానుకగా ఫ్లై ఓవర్.. -
కొత్త సిలబస్‌తో జేఈఈ అడ్వాన్స్డ్–2023
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 పరీక్షలు కొత్త సిలబస్‌తో జరగనున్నాయి. సిలబస్‌లో మార్పులు చేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన జాయింట్ అడ్మిషన్ బాడీ (జేఏబీ) ఇప్పుడు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ jeeadv. ac.in లో పొందుపరిచింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మూడు సబ్జెక్టుల్లోనూ సిలబస్ మార్చింది. 2023 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొత్త సిలబస్‌ను అనుసరించాల్సి ఉంటుంది. పాత సిలబస్‌లోని కొన్ని అధ్యాయాలను తొలగించి, కొత్తగా కొన్ని చేర్చారు. జేఈఈ మెయిన్‌తో అనుసంధానంగా ఉండేలా నూతన సిలబస్‌ను రూపొందించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కోచింగ్ తీసుకోని విద్యార్థులు కూడా విజయం సాధించడం సిలబస్ మార్పు ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. మార్పులు ఇలా జేఈఈ అడ్వాన్స్డ్ గణితంలో కొత్తగా గణాంకాలు (స్టాటిస్టిక్స్)ను జోడించారు. దీనికి బదులుగా త్రిభుజం పరిష్కారం (సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్) అంశాన్ని తొలగించారు. భౌతిక శాస్త్రంలో సెమీకండక్టర్లు, కమ్యూనికేషన్ అంశాలను మినహాయించారు. వీటికి బదులుగా జేఈఈ మెయిన్‌లోని కొన్ని అంశాలు జోడించారు. మెయిన్‌లోని ఫోర్స్డ్ అండ్ డాంపడ్ ఆసిల్లేషన్స్, ఈఎమ్ వేవ్స్, పోలరైజేషన్ అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చారు. అదే విధంగా కెమిస్ట్రీలోనూ మార్పులు చేశారు. సీబీఎస్ఈ విద్యార్థులకు సులువు కొత్త సిలబస్‌లో ఎక్కువగా సీబీఎస్ఈ అంశాలను చేర్చారు. దీనివల్ల సీబీఎస్ఈ విద్యార్థులకు కొంత సులువుగా ఉంటుందని, ఇంటర్మీడియట్ చదివే వారికి కొంత ఇబ్బందికరమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ విద్యార్థులు గతంలోకంటే ఎక్కువ సిలబస్‌ని అనుసరించాల్సి వస్తుందన్నారు. కొత్త సిలబస్ జేఈఈ మెయిన్‌కు అనుసంధానంగా ఉండేలా చేయడం వల్ల మెయిన్‌కి ప్రిపేర్ అయిన వారు అవే అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. సిలబస్‌ను పెంచినప్పటికీ, పరీక్ష సులువుగా మారే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. మెయిన్‌లోని అధ్యాయాలు అడ్వా న్స్‌డ్‌లో చేర్చినందున సిలబస్ పెరిగినట్లు పైకి కనిపించినప్పటికీ, అవే అంశాలు కనుక అంతగా భారం ఉండదని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. ఐఐటీలలో వివిధ కోర్సులు చదవాలనుకొనే వారు కొత్త ఫార్మాట్ ఆధారంగా ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. పరీక్షలు ఇలా.. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీఈఈడీ), అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (యూసీఈఈడీ) కింద ఈ కొత్త పేపర్ నమూనా, సిలబస్ ప్రవేశపెట్టినట్లు జేఏబీ ప్రకటించింది. కొత్త విధానంలో ప్రవేశ పరీక్ష పార్ట్–ఎ, పార్ట్–బిలుగా రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్–ఎ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మూడు విభాగాలలో ప్రశ్నలు ఉంటాయి. న్యూమరికల్ ఆన్సర్ టైప్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (ఎన్ఏటీ, ఎంఎస్క్యూ, ఎమ్సీక్యూ) ఉంటాయి. పార్ట్–బి లో రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒకటి డ్రాయింగ్, మరొకటి డిజైన్ ఆప్టిట్యూడ్. పార్ట్ – బి లోని ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించేలా ఇస్తారు. అభ్యర్థులు దానికి సమాధానాన్ని ఇన్విజిలేటర్ అందించిన జవాబు పుస్తకంలో మాత్రమే రాయాలి. ప్రశ్నలకు సంబంధించిన చిత్రాల డ్రాయింగ్ అందులోనే చేయాలి. -
ఇంటర్లో ఇక 100% సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి, ద్వితీయ పరీక్షల్లో ఇక నుంచి వందశాతం సిలబస్‌తో ప్రశ్నప త్రాలు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తేబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగానే విద్యార్థులు సిద్ధమవ్వాలని, కాలేజీ నిర్వాహకులు కూడా 100 శాతం సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ ముందు వరకూ ఇదే విధానం కొనసాగింది. కోవిడ్ విజృంభణతో 2021లో 70 శాతం సిలబస్‌నే అమలు చేశారు. అయితే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. 2021–22లో కూడా చాలాకాలం ఆన్లైన్ క్లాసులు నడిచాయి. ఈ సదుపాయం అన్ని ప్రాంతాలు వినియోగించుకోలేదన్న ఆందోళన సర్వత్రా విన్పించడంతో 70 శాతం సిలబస్‌నే అమలు చేశారు. తొలుత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవని చెప్పినప్పటికీ ఆ తర్వాత నిర్వహించారు. ఈ పరీక్షల్లో 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 70 శాతం సిలబస్ కూడా సరిగా జరగలేదని విద్యార్థులు ఆందోళనలకు దిగారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. 2022లో మేలో జరిగిన పరీక్షల్లో 70 శాతం సిలబస్‌తోనే పరీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం సకాలంలో మొదలవ్వడంతో వందశాతం సిలబస్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే మొదటి సంవత్సరం ప్రవేశాలు సెప్టెంబర్ వరకూ జరిగాయి. బోర్డు నిర్దేశించిన సిలబస్ కూడా పూర్తవ్వలేదని విద్యార్థులు అంటున్నారు. కాకపోతే 100 శాతం సిలబస్ ఉంటుందని ముందే చెప్పడంతో సిద్ధమవ్వడానికి కొంత వ్యవధి లభించిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మోడల్ పేపర్ల తయారీపై బోర్డు దృష్టి పెట్టినట్టు లేదు. కోవిడ్‌కు ముందు ఇదే సిలబస్‌తో నమూనా ప్రశ్నపత్రాలు రూపొందించారు. వాటినే బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. -
Telangana: ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచి వందశాతం సిలబస్‌ను అమలు చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డ్ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటర్ సిలబస్‌ను కుదించారు. 30 శాతం తొలగించి 70 శాతం మాత్రమే బోధిస్తున్నారు. పరీక్షల్లోనూ 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తున్నారు. జాతీయ పోటీ పరీక్షల్లో మాత్రం ఈ నిబంధన అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది విద్యా సంస్థలను సకాలంలో తెరవడంతో, సిలబ స్ను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ కళాశాలలను ఆదేశించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది నుంచి వంద శాతం సిలబస్ పూర్తి చేసి, పరీక్షల్లో ప్రశ్నపత్రాలను కూడా ఇదే స్థాయిలో రూపొందిస్తామని స్పష్టం చేసింది. (క్లిక్: రాకేశ్ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ)