టీచర్లకు శిక్షణ ఎప్పుడు?
కరీంనగర్‌ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : పదో తరగతి సిలబస్‌ను మార్చిన విద్యా శాఖ అధికారులు దానిని బోధించే ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన శిక్షణ గురించి మరిచారు. వేసవి సెలవుల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇవ్వలేదు. సెలవులు ముగుస్తున్నా తరుణంలో ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఎప్పుడు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పేపర్ల సంఖ్య కుదించడం, కొత్త సిలబస్ కావడంతో వచ్చే విద్యా సంవత్సరం ఉపాధ్యాయులకు తిప్పలు తప్పేలా లేవు.
పరీక్ష విధానంలో సంస్కరణలు..
ఈ విద్యాసంవత్సరం పదో తరగతి పరీక్షల్లోనూ విద్యాశాఖ సంస్కరణలు ప్రవేశపెట్టింది. గతంలో హిందీ మినహా తెలుగు, ఇంగ్లిష్, గణితం, సోషల్, సైన్సు సబ్జెక్టులకు రెండేసి పేపర్ల చొప్పున విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇకపై నూతన విధానంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్(లాంగ్వేజ్‌స్) పరీక్షలు ఒక్కో పేపరు వంతున, సైన్సు, గణితం, సోషల్ సబ్జెక్టులకు రెండేసి పేపర్ల వంతున పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఒక్కో సబ్జెక్టుకు 28 మార్కులు, 20 మార్కులకు ఇంటర్నల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో 7 మార్కులు విద్యార్థి తెచ్చుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్నల్స్‌లో కలిపి 35 మార్కులు తెచ్చుకుంటే విద్యార్థి ఉత్తీర్ణత సాధించినట్టు.
15 ఏళ్ల త ర్వాత..
జాతీయ పాఠ్యప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన మండలి మార్పు చేసింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత 2012-13 విద్యా సంవత్సరంలో మొదటిగా ఒకటి, రెండు, మూడు, ఆరు, ఏడు తరగతుల పుస్తకాలను, 2014-15 విద్యా సంవత్సరంలో పదో తరగతి పాఠ్యపుస్తకాల సిలబస్‌ను మార్చారు. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత తిరిగి పాఠ్య పుస్తకాలను మార్పు చేయడంతోపాటు పరీక్షా విధానంలో మార్పు చేసినట్లయింది. అయితే ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్‌లోనే నూతన పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు అందజేయడం శుభపరిణామం.
కృత్యాధారిత బోధనకు ప్రాధాన్యం
మారిన సిలబస్‌లో ఎక్కువగా కృత్యాధారిత బోధనకు ప్రాధాన్యం ఇచ్చారు. పాఠ్యపుస్తకాల్లో విషయ అవగాహనకు ప్రాముఖ్యం ఇచ్చేవిగా ఉన్నాయి. విద్యార్థులు ఆలోచించడం, నేర్చుకున్న విషయాన్ని వ్యక్తీకరించడం, విశ్లేషణ చేసే విధంగా, వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా పాఠ్యపుస్తకాలు రూపొందించారు. అంతేకాకుండా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు స్త్రీల సాధికారత, వారిని గౌరవించడం తదితర విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చేలా పాఠ్యాంశాల్లో పొందుపరిచారు.
శిక్షణ ఎప్పుడో..
మరో 7 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మారిన సిలబస్‌కు అనుగుణంగా బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అయితే విద్యాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాత సిలబస్‌కు అలవాటు పడ్డ ఉపాధ్యాయులకు నూతన సిలబస్‌లో బోధన మెళకువలను, నూతన పరీక్ష విధానంపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. సకాలంలో ఉపాధ్యాయులకు పాఠ్యాంశాల బోధన, పరీక్ష విధానంపై స్పష్టత ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవని ఉపాధ్యాయులు వాపోతున్నారు.