
ఎన్నడూ లేని రీతిలో 12 ప్రశ్నల తొలగింపు.. పరీక్షలో సిలబస్‌లో లేని ప్రశ్నలు
ఏటా పెరుగుతున్న తప్పులు
పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏపై విమర్శలు
సాక్షి, ఎడ్యుకేషన్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జేఈఈ – మెయిన్. కొద్ది రోజుల క్రితం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తొలి దశ జేఈఈ మెయిన్(JEE Main 2025 exam)ను నిర్వహించింది.
ఈ క్రమంలో ప్రశ్నల్లో లోపాలు, అనువాద దోషాలు, సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు అడగడం, తుది ఆన్సర్ కీలో తొలగిస్తున్న ప్రశ్నల సంఖ్య పెరగడంపై విద్యార్థులు, అధ్యాపకులు విమర్శలు చేస్తున్నారు. జేఈఈ–మెయిన్ – 2025 జనవరి సెషన్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్‌లో లోపాలపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏపై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి.
పన్నెండు ప్రశ్నల తొలగింపు
జేఈఈ – మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది.. పలు షిష్ట్‌లలో నిర్వహించిన పరీక్షల్లో తొలగించిన ప్రశ్నల సంఖ్యే ఇందుకు నిదర్శనమని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది మొత్తం పది షిఫ్ట్‌లలో జేఈఈ మెయిన్ నిర్వహించగా.. ఏకంగా 12 ప్రశ్నలను తొలగించారు. ఇందులో అత్యధికంగా ఫిజిక్స్ నుంచి 8 ప్రశ్నలు ఉంటే.. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీల నుంచి రెండు చొప్పున నాలుగు ప్రశ్నలు ఉన్నాయి.
దీనికి సాంకేతిక లోపం, మానవ తప్పిదం కారణమని ఎన్టీఏ పేర్కొంది. జాతీయ స్థాయిలో జేఈఈ–మెయిన్‌తోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)–యూజీ, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్), తదితర పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్టీఏ వాటిని సమర్థంగా నిర్వహించడంలో విఫలమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నలు రూపొందించే ఎగ్జామినర్స్ విషయంలోనూ, అదే విధంగా వాటిని పకడ్బందీగా పరిశీలించే విషయంలోనూ ఎన్టీఏ అప్రమత్తంగా ఉండట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా తప్పులే..
జేఈఈ – మెయిన్ పరీక్ష తీరును పరిగణనలోకి తీసుకుంటే.. గత కొన్నేళ్లుగా ఏటా ప్రశ్నల్లో తప్పుల సంఖ్య పెరుగుతోంది. 2024 సెషన్–1లో ఆరు ప్రశ్నలు; సెషన్–2లో నాలుగు ప్రశ్నలు తొలగించగా.. 2023లో సెషన్–1లో నాలుగు ప్రశ్నలు, 2022 సెషన్–1లో నాలుగు, సెషన్–2లో ఆరు ప్రశ్నలు తొలగించారు. ఇలా తొలగించిన ప్రశ్నల విషయంలో అభ్యర్థులకు పూర్తి మార్కులు (4 మార్కులు) కేటాయిస్తామని ఎన్టీఏ పేర్కొంది. అయితే ఇలాంటి తప్పుల కారణంగా విద్యార్థులు పరీక్ష హాల్లో సమయం వృథా చేసుకోవాల్సి వస్తోందని, లోపాలు లేని ప్రశ్నలు ఇచ్చే విధంగా ముందుగానే ఎన్‌టీఏ పటిష్ట చర్యలు తీసుకోవాలని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు.
సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు..
జేఈఈ – మెయిన్ విషయంలో ఎన్‌టీఏ నిర్లక్ష్యానికి నిదర్శనంగా.. సిలబస్‌లోని ప్రశ్నలు రావడాన్ని ఉదహరిస్తున్నారు. 2025 జనవరి సెషన్ పరీక్షలనే పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పది షిఫ్ట్‌లలో నిర్వహించిన పరీక్షల్లో.. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ చాప్టర్‌కు సంబంధించి న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ నుంచి 22 ప్రశ్నలు, అదే విధంగా కార్నెట్ లా నుంచి కూడా ఒక ప్రశ్న అడిగారని అంటున్నారు.
అయితే గత ఏడాది నుంచి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్‌ను, అంతకుముందు ఏడాది కార్నెట్ లాను సిలబస్‌లో తొలగించారని సబ్జెక్ట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇలా సిలబస్‌లో లేని ప్రశ్నలు అడగడం కారణంగా విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని, ఇది ఫలితంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
రాధాకృష్ణన్ కమిటీ స్పష్టంగా..
జాతీయ స్థాయిలో వివిధ ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత కోసం పలు సిఫార్సులు చేసిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ సైతం.. జేఈఈలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని తేల్చిచెప్పింది. అన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించాలని స్పష్టం చేసింది. కానీ.. దీనికి భిన్నంగా ఎన్టీఏ వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నీట్–యూజీపై ఆందోళన..
జేఈఈ– మెయిన్‌లో తప్పుల నేపథ్యంలో.. మే 4న నిర్వహించనున్న నీట్–యూజీ నిర్వహణ విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు కూడా దాదాపు పది లక్షల మంది హాజరవుతారు. దీంతో ప్రశ్నల్లో తప్పులు, అనువాద దోషాలతో నీట్ – యూజీ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని.. ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎన్‌టీఏ ఇప్పటి నుంచే పకడ్బందీగా ప్రశ్న పత్రాల రూపకల్పనలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జేఈఈ మెయిన్ జనవరి సెషన్‌లో తొలగించిన ప్రశ్నల కోడ్ నంబర్లు..
⇒ ఫిజిక్స్: 656445270, 7364751025, 656445566, 6564451161, 656445870, 7364751250, 564451847, 6564451917
⇒ కెమిస్ట్రీ: 656445728, 6564451784
⇒ మ్యాథమెటిక్స్: 6564451142, 6564451898
డేటాను నిరంతరం సమీక్షించాలి..
కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో.. ముందుగానే నిర్దిష్ట అల్గారిథమ్స్ రూపొందించి ప్రశ్నలు అడిగే వి«ధానాన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అంటే.. ఏదైనా ఒక చాప్టర్ నుంచి నాలుగు ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఆ మేరకు ముందుగానే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో మొదటగానే ఒక ప్రశ్న తప్పుగా ఉంటే అదే పునరావృతం అవుతుంది. దీనికి పరిష్కారంగా ఎప్పటికప్పుడు కొశ్చన్స్ డేటా బ్యాంక్‌ను సమీక్షిస్తుండాలి. పెన్ పేపర్ విధానంలో స్పష్టంగా రాసే వీలున్న స్క్వేర్ రూట్స్, ఇతర సైంటిఫిక్ సింబల్స్ కంప్యూటర్‌లో సరిగా ప్రతిబింబించవు. ఇది కూడా ప్రశ్నల్లో తప్పులకు కారణం అవుతోంది. మొత్తంగా 12 ప్రశ్నలను తొలగించడం అనేది అసాధారణ పరిణామమే. – ఆర్. వి. శ్రీధర్, జేఈఈ–మెయిన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment