సాక్షి, అమరావతి: సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట సుజనా చౌదరీ ఈ కాలేజీ ఏర్పాటు చేశారు. 2002లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీ కింద ఏటా వంద మెడికల్ అడ్మిషన్లు యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించేవారు. ఫిబ్రవరి 2017 నుంచి సీట్ల సంఖ్య 150కి పెరిగింది. ఈ కాలేజీ పలు అక్రమాలకు పాల్పడినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) గుర్తించింది.
40 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెడికల్ కాలేజీని 2001-02లో నిర్మించగా 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో మెడికల్ ఆడ్మిషన్లకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ప్రస్తుతం ఈ కాలేజీలో 750 మంది MBBS విద్యార్థులు, 150 మంది PG విద్యార్థులు ఉన్నారు. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న ఆస్పత్రికి రోజూ ఔట్ పేషేంట్లు వస్తారు. ఆస్పత్రిలో 13 డిపార్ట్ మెంట్లు ఉన్నాయి.
ప్రతీ ఏటా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నేషనల్ మెడికల్ కమిషన్ వివిధ మెడికల్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ తనిఖీల్లో భాగంగా కాలేజీల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా? విద్యార్థుల సంఖ్యకు సరిపడా అధ్యాపకులు ఉన్నారా? కాలేజీల్లో ఉన్న టీచింగ్ ఆస్పత్రులకు పేషేంట్లు వస్తున్నారా? అన్న విషయాలను నేషనల్ మెడికల్ కమిషన్ టీం పరిశీలించింది.
సుజనాకు సంబంధించిన ఈ మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్ మెంట్ వ్యవహరిస్తున్నట్టు తేలింది. దీంతో MCI ఈ కాలేజీకి నోటీసులిచ్చినట్టు తెలిసింది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కాలేజీ గుర్తింపు రద్దు చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment