2024–25లో ఐదు వైద్య కళాశాలల్లో తరగతులకు ఎన్‌ఎంసీ అనుమతులు నిరాకరణ
అనుమతులకు ఏమాత్రం చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం
వీటి ప్రారంభం కోసం గత వైఎస్సార్‌సీపీ సర్కారు విశేష కృషి
కానీ, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి పట్టించుకోని చంద్రబాబు
సాక్షి, అమరావతి: అనుకున్నంతా అయింది.. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించాల్సి ఉన్న ఐదు కొత్త ప్రభుత్వ కళాశాలల ప్రారంభంపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నీళ్లుజల్లింది. ఈ ఏడు తరగతులు ప్రారంభించుకునేందుకు అనుమతివ్వలేదు. దీంతో వీటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వీటికి అనుమతులు సాధించడంలో టీడీపీ–జనసేన–బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టకపోవడమే కారణమని వైద్యశాఖ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఉద్దేశపూర్వకంగానే ఈ కొత్త కళాశాలల ప్రారంభానికి చంద్రబాబు మోకాలడ్డారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి.. 2024–25 విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరులలో ఈ కళాశాలలు ప్రారంభించడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బాటలు వేసింది. ఇందులో భాగంగా.. ఈ ఐదుచోట్ల ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, వైద్య కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా పోస్టులను మంజూరుచేసి భర్తీ ప్రక్రియ చేపట్టింది. కానీ, ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదు.
కనీసం చర్చించని బాబు సర్కారు..
గత నెల 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 25న వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికంటే ముందే సీఎస్ నియామకం, ఇతర అధికారుల మార్పు చేపట్టారు. ఈ అంశాలపై ఫోకస్ పెట్టిన బాబు అండ్ కో ప్రజల భవిష్యత్తు వైద్య అవసరాలు, విద్యార్థుల ఆకాంక్షలతో ముడిపడి ఉన్న వైద్య కళాశాలల ప్రారంభంపై మాత్రం దృష్టిపెట్టలేదు. పైగా.. సీఎం హోదాలో ఈనెల 3న వైద్యశాఖపై బాబు తొలి సమీక్ష నిర్వహించారు.
ఇందులో కూడా వైద్య కళాశాలల అంశాన్ని చర్చించలేదు. మరోవైపు.. తనిఖీల అనంతరం కళాశాలలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించిన ఎన్‌ఎంసీ పలు లోపాలపై రాష్ట్ర అధికారుల నుంచి వివరణ కోరింది. అడ్మిషన్లు ప్రారంభించే నాటికి తొలి ఏడాది విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి వీలుగా కళాశాలల్లో ల్యాబ్, లెక్చర్ హాల్, హాస్టళ్లు అందుబాటులో ఉంటే సరిపోతుంది. ఐదుచోట్ల 80 శాతం మేర ఈ సదుపాయాలున్నాయి. ఇంటీరియర్ పనులు, పలు పరికరాలను సమకూరిస్తే సరిపోతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశమున్నందున ఈలోపు వసతులను కలి్పంచడానికి వీలుంటుంది.
కానీ, ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేయలేదు. పైగా.. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మరోవైపు.. ఈ కళాశాలల్లో పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించడానికి సీఎం జగన్ ప్రభుత్వం పలు దఫాలుగా నోటిఫికేషన్లు ఇచి్చంది. నగరాలకు దూరంగా ఉన్న క్రమంలో పలు స్పెషాలిటీల్లో వైద్యులు ముందుకు రానందున ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామని కూడా ప్రకటించింది.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మూడు వారాలు.. సీఎం ప్రమాణ స్వీకారం అయ్యాక రెండు వారాల పాటు సమయం ఉన్నప్పటికీ ఈ కొత్త వైద్య కళాశాలల ప్రారంభం గురించి పైస్థాయిలో ఏమాత్రం చర్చించలేదు. అలా చర్చించి అనుమతులు రాబట్టడానికి ఫ్యాకల్టీ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువే లక్ష్యంగా..
రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువ చేయడంతో పాటు, విద్యార్థులకు వైద్య విద్యావకాశాలను పెంచడమే లక్ష్యంగా రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓ వైపు కళాశాలల నిర్మాణం చేపడుతూనే విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను గత విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లను సమకూర్చింది. ఈ ఏడాది ఐదు కళాశాలలను, మిగిలిన ఏడు కళాశాలలను 2025–26లో ప్రారంభించేలా ప్రణాళిక రచించింది.
అనుమతులు వస్తే 500 సీట్లు..
ఇదిలా ఉంటే.. ఐదు కళాశాలలకు అనుమతులు లభిస్తే ఒక్కోచోట 100 చొప్పున 500 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా సమకూరేవి. 10 లక్షల జనాభాకు వంద సీట్లు అనే నిబంధనను గత ఏడాది ఎన్‌ఎంసీ ప్రవేశపెట్టింది. అలాగే, కళాశాలలకు అనుమతులు మంజూరు కోసం కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. దీంతో రాష్ట్రం నుంచి ఐదు వైద్య కళాశాలలకు దరఖాస్తు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొనడంతో అప్పట్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి, నిబంధనల నుంచి మినహాయింపు తెచ్చుకుని దరఖాస్తు చేసింది.
అదే విధంగా.. 2023–24లో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ప్రారంభ సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి, వంద శాతం 750కు గాను 750 ఎంబీబీఎస్ సీట్లను రాబట్టింది. తొలివిడత తనిఖీల్లో విజయనగరం మినహా, మిగిలిన నాలుగు కళాశాలలకు అప్పట్లో అనుమతులు రాలేదు. భవనాలు, హాస్టళ్లు సిద్ధంగా లేకపోవడంతో పాటు, పలు అంశాల్లో కొరత ఉందని నిరాకరించారు. కానీ, అడ్మిషన్లు ప్రారంభమయ్యే నాటికి అన్ని వసతులు కలి్పస్తామని ఎన్‌ఎంసీకి హామీ ఇవ్వడం ద్వారా రెండో విడత తనిఖీల్లో అనుమతులను రాబట్టారు. ప్రస్తుతం కూడా అనుమతుల నిరాకరణపై అప్పీల్‌కు అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోతే విద్యార్థులకు తీవ్రనష్టం జరిగే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment