విద్యార్థులకు ఇంత ద్రోహమా? | Special interview given by Dr Venkateswarlu to Sakshi | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఇంత ద్రోహమా?

Published Sat, Sep 14 2024 5:14 AM | Last Updated on Sat, Sep 14 2024 5:14 AM

Special interview given by Dr Venkateswarlu to Sakshi

ఎన్‌ఎంసీ ఇస్తామన్న ఎంబీబీఎస్‌ సీట్లను వద్దని లేఖ రాయడం ఏంటి? 

ఇలా ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? 

వంద రోజుల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానం రద్దు చేస్తామన్నారు 

ఇటు సీట్లు తేలేదు.. అటు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రద్దు చేయలేదు 

ప్రభుత్వ చర్యలతో 700 సీట్లు విద్యార్థులు కోల్పోయారు 

తొలి నుంచి ప్రైవేటు కళాశాలలకు మేలు చేయడమే చంద్రబాబు లక్ష్యం 

ఇప్పుడూ అదే తరహాలో చేస్తున్నారు 

ఏపీ మెడికోస్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అ«ధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు

సాక్షి, అమరావతి: వైద్య విద్య చదవాలని ఆశించే రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉచిత వైద్యం అందకుండా పేదవర్గాలకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న ద్రోహం మరే రాష్ట్ర ప్రభుత్వమూ చేయదని ఏపీ మెడికోస్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు వైద్య విద్య, ఉచిత వైద్యం అందకుండా చేయాలన్న లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. 

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పులివెందుల కళాశాలకు 50 సీట్లు ఇస్తామన్న సీట్లను కూడా వద్దని లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. ఇలా ఏ ప్రభుత్వమైనా చేస్తుందా అని నిలదీశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు కేంద్రం అనుమతించి, సీట్లు కేటాయించగా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీపై ఆధారపడిన పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు కేంద్రంతో కొట్లాడి కొత్త కళాశాలలు, సీట్లు రాబట్టాల్సింది పోయి.. ఇలా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించలేకపోవడం వల్ల విద్యార్థులు 700 ఎంబీబీఎస్‌ సీట్లు కోల్పోయారని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య ఆశావహులకు తీరని అన్యాయం జరిగిందని డాక్టర్‌ వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో వెల్లడించిన అభిప్రాయాలు ఆ­యన మాటల్లోనే..  

చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం 
గత ప్రభుత్వంలో కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. రిజర్వేషన్‌ వర్గాల్లోని మెరిట్‌ విద్యార్థులపై ప్రభావం చూపుతున్న ఈ విధానాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి0ది. దీంతో వైద్య విద్య ఆశావహులు, మెడికోలు టీడీపీపై నమ్మకం పెట్టుకున్నారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని రద్దు చేసి ఉంటే ఈ విద్యా సంవత్సరంలోనే 300 ఎంబీబీఎస్‌ సీట్లు కన్వినర్‌ కోటాలోకి కొత్తగా వచ్చేవి. అయితే సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని రద్దు చేయకుండా టీడీపీ నమ్మక ద్రోహం చేసింది. 

మరోవైపు ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభిస్తే కన్వినర్‌ కోటాలో మరిన్ని సీట్లు వస్తాయని పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా తీరని నష్టం కలిగించింది. పులివెందుల కళాశాలకు 50 సీట్లు మంజూరు చేసినా, కళాశాల నిర్వహించలేమని ప్రభుత్వమే ఎన్‌ఎంసీకి లేఖ రాసి రద్దు చేయించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా చేయదు. 

కేవలం ఏయూ రీజియన్‌లో పాడేరుకు 50 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో 22 సీట్లు మాత్రమే కన్వినర్‌ కోటాకు, 11 ఓపెన్‌ కాంపిటీషన్‌కు పోగా 11 సీట్లే రిజర్వేషన్‌ వర్గాలకు లభిస్తున్నాయి. ఎస్‌వీ రీజియన్‌లో ఒక్క సీటు కూడా పెరగలేదు. పులివెందులకు 50 సీట్లు తిరస్కరించకపోయి ఉంటే కన్వినర్‌ కోటాలో రిజర్వేషన్‌ వర్గాలకు 11, ఓపెన్‌ కాంపిటీషన్‌లో 11 సీట్లు అయినా దక్కేవి. 

వాస్తవానికి కొత్త కళాశాలలు ప్రారంభమై సీట్లు పెరుగుతాయని చాలా మంది మెరిట్‌ విద్యార్థులు యాజమాన్య కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడేమో కటాఫ్‌లు అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాంటి విద్యార్థులకు అన్యాయం జరుగకుండా కనీసం యాజమాన్య కోటాలో దరఖాస్తుకు మరోసారి అవకాశం కల్పించాలి. 

ఇలాగైతే సామాన్యులకు వైద్య విద్య దూరమవుతుంది 
కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు వైద్య విద్యను అభ్యసించలేని పరిస్థితి వస్తుంది. పేదలు సైతం బోధనాస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో రోగులకంటే వైద్య విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. సరిపడా ఫ్యాకల్టీ, రోగులు ఉండరు. 

ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పజెబితే వాటిలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అక్కడ రోగులు కిటకిటలాడుతున్నారు. ఎందుకంటే వాటిలో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి కాబట్టే. అదే ప్రైవేట్‌కు కట్టబెడితే డబ్బు పెట్టి పేదలు వైద్యం పొందే అవకాశం ఉంటుందా?  

ప్రైవేట్‌ వైద్య విద్యకు పట్టం 
రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్‌ వైద్య విద్యకు పట్టం కడుతోంది. ఇంత దారుణం మరే రాష్ట్రంలోనూ ఉండదు. సీఎం చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే ప్రైవేట్‌ వైద్య విద్యకు పట్టం కట్టి, పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేయాలన్నదే ఆయన లక్ష్యమని స్పష్టమవుతుంది. 

గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రైవేట్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్య కోర్సుల్లో ఫీజులను విచ్చలవిడిగా పెంచారు. డబ్బున్న వారికే వైద్య పట్టా అన్నట్టుగా తయారు చేశారు. 2014–19 మధ్య ప్రైవేట్‌లో యాజమాన్య కోటాలో మెడికల్‌ పీజీ ఫీజును రూ.5.25 లక్షల నుంచి ఏకంగా రూ.24.20 లక్షలకు పెంచారు. 

రూ.5.25 లక్షల ఫీజు అంటే బ్యాంక్‌ లోన్‌ తీసుకొనో, బయట అప్పులు చేసో పేద, మధ్య తరగతి వైద్యులు పీజీ చేయడానికి సాహసిస్తారు. పీజీలో చేరాక వారికి వచ్చే స్టైఫండ్‌తో అప్పు తీర్చుకోవచ్చనే నమ్మకం ఉంటుంది. ఐదింతలు పెంచే సరికి ఆ అవకాశం కూడా లేక, అంత ఫీజు కట్టలేక చాలా మంది పీజీ చదవలేకపోయారు. అంతే కాదు టీడీపీ అధికా­రంలో ఉండగా రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి, మెడిసిన్‌ సీట్లు తెచ్చిన  దాఖలాలూ లేవు.

ఈడబ్ల్యూఎస్‌ కోటాపైనా ఇదే తీరు 
ఈడబ్ల్యూఎస్‌ కోటా పైనా చంద్రబాబు ప్రభుత్వం తీరు ఇలానే ఉంది. ఎంబీబీఎస్‌ సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ సీట్లు పెంచకుండా కోటా అమలుకు జీవో ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. 

కోర్టులో కేసులు వేస్తే జీవో రద్దు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిందే గానీ సీట్లు పెంచడానికి కృషి చేస్తామని మాత్రం చెప్పలేదు. అంటే రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్ల కొరత సృష్టించి, ప్రైవేట్‌ వైద్య కళాశాలలకు డిమాండ్‌ పెరిగేలా చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement