Medical education
-
మెడికల్ కౌన్సెలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి..
గుంటూరు మెడికల్ : పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని, దీని ద్వారా వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని పీజీ వైద్య విద్యార్థిని తండ్రి, గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త రఘుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరు వైద్య కళాశాలకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ ఎదుట ఆయన ఈ విధంగా మొరపెట్టుకున్నారు. మొదటి కౌన్సెలింగ్ సమయంలో ఒక ఆర్డర్, రెండో కౌన్సెలింగ్ సమయంలో మరో ఆర్డర్ ఇచ్చారని, ఇప్పుడు మూడో కౌన్సెలింగ్‌కు యూనివర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆలిండియా కౌన్సెలింగ్ ఇంకా ప్రారంభం కాలేదని, అది ప్రారంభమయ్యాకే మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఫ్రీ ఎగ్జిట్‌కు శుక్రవారం నుంచి సోమవారం ఉదయం వరకు అవకాశం ఇచ్చారని, సోమవారం క్లోజ్ చేయడం వల్ల ఆలిండియా కోటాలో ఏపీ వైద్య విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ పీజీ కోటా వారికి మేలు జరిగేలా హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తోందని ఆరోపించారు. మొదటి కౌన్సెలింగ్ అయ్యాక, కోర్టు తీర్పు వల్ల జీవో 56ను కొట్టేశారని, దీని ద్వారా వైద్య విద్యార్థుల ఫీజులు పెరిగాయన్నారు. కోర్టు తీర్పు కారణంగా పీజీ వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.కోర్టు తీర్పు వల్ల గందరగోళం అనంతరం పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియపై మీడియా మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించగా.. కోర్టు తీర్పు వల్ల ప్రస్తుతం కొంత గందరగోళం నెలకొందని తెలిపారు. అన్ని ఆలోచించి విద్యార్థులకు ఏది లాభమో అదే చేస్తామని తెలిపారు. స్పెషలిస్టులు 75 శాతం, ఇతర వైద్యులు, వైద్య సిబ్బందిలో 80 శాతం కొరత ఉందని, ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. -
అన్ని కాలేజీలకు ఒకే ఫీజు సరికాదు
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీలని్నంటిలో ఏకీకృత ఫీజు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) సిఫారసుల మేరకు 2020–21 నుంచి 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం 2020 మే 29న జారీ చేసిన జీవో 56ను రద్దు చేసింది.ఈ జీవో చట్టం ముందు నిలబడదని స్పష్టం చేసింది. ఏపీహెచ్ఈఆర్ఎంసీ అన్నీ మెడికల్, డెంటల్ కాలేజీలను ఒకే గాటన కట్టి, ఏకీకృత ఫీజు నిర్ణయించడం చట్ట విరుద్ధమన్న కాలేజీల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఫీజు ఖరారు చేయాలని, ఆపైన రెండు నెలల్లో ఆదేశాలు జారీ చేయాలని కమిషన్‌ను ఆదేశించింది.ఒకవేళ ప్రతిపాదించిన ఫీజుతో కాలేజీలు విభేదిస్తే, ఆ కాలేజీ యాజమాన్యం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. కమిషన్ ఫీజులను పెంచితే, పెంచిన మేర బ్యాలెన్స్ మొత్తాలను అభ్యర్థుల నుంచి వారిచి్చన హామీ మేరకు కాలేజీలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అదనపు ఫీజు వసూలులో నిర్ణయం అంతిమంగా కాలేజీలదేనని స్పష్టం చేసింది. జీవో 56ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది.ఏకీకృత ఫీజు వల్ల కొన్ని లాభపడుతూ ఉండొచ్చు..ఏకీకృత ఫీజు విద్యార్థుల ప్రయోజనాలకు కూడా విరుద్ధం కావొచ్చునని హైకోర్టు తీర్పులో పేర్కొంది. తక్కువ ఫీజు ఉంటే మరింత ఎక్కువ చెల్లించాలని విద్యార్థులను కాలేజీలు బలవంతం చేయవచ్చునని తెలిపింది. ఏకీకృత ఫీజు వల్ల తగిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది లేని కాలేజీలు లాభపడే అవకాశం ఉందని పేర్కొంది. మంచి సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది కల్పిస్తున్న కాలేజీలకు ఇది నష్టం కలిగించవచ్చని తెలిపింది. ఇటువంటి కాలేజీలు ఎక్కువ ఫీజులు కోరడంలో తప్పులేదని తెలిపింది.ఫీజుల ఖరారుకు ముందు కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాల వివరాలని్నంటినీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదంది. ఆచరణ సాధ్యం కాని ఫీజును నిర్ణయించడం వల్ల ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు అందించే విద్యా సంస్థలు మూతపడతాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆయా కాలేజీల నాణ్యత, సమర్థత, ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది. -
డాక్టర్ కల.. విలవిల!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవ్వకుండా అడ్డుకోవడంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా మన విద్యార్థుల వైద్య విద్య కలలు ఛిద్రమయ్యాయి. పక్కనున్న తెలంగాణా రాష్ట్రంలో ఈ ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమై, 400 ఎంబీబీఎస్ సీట్లు పెరగడంతో అక్కడి విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరిగాయి. ఇటు ఏపీలో మాత్రం పోటీకి అనుగుణంగా సీట్లలో వృద్ధి లేకపోవడంతో మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణాలో తొలి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా (కన్వినర్) సీట్లను కేటాయించారు. ఈ క్రమంలో ఏపీలో తొలి దశ ప్రభుత్వ కోటా కౌన్సెలింగ్ కటాఫ్‌లను ఓసారి పరిశీలిస్తే మన విద్యార్థులకు ప్రభుత్వం చేసిన ద్రోహం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. రిజర్వేషన్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు వైద్య కళాశాలల్లో ఒక్కో చోట 150 సీట్లతో తరగతులు ప్రారంభం కావ్వాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం బాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అనుమతులు రాకుండా మోకాలడ్డింది. దీంతో కేవలం పాడేరులో 50 సీట్లు రాగా, మిగిలిన 700 సీట్లు విద్యార్థులు నష్టపోయారు. దీంతో నీట్ యూజీలో 600 పైబడి స్కోర్ చేసిన ఓసీ, 500 పైబడి స్కోర్ చేసిన ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఏపీలో ప్రభుత్వ కోటా సీట్లు తొలి దశలో లభించలేదు. అదే తెలంగాణాతో పోలిస్తే ఏపీలో సీట్లు లభించిన చివరి కటాఫ్‌ల మధ్య వ్యత్యాసం రిజర్వేషన్ వర్గాల్లోనే 130 మార్కులకు పైగా ఉంటోంది. తొలి దశ కౌన్సెలింగ్‌లో తెలంగాణలో బీసీ–ఏ విభాగంలో 437 మార్కులకు చివరి సీట్ లభించగా, అదే ఏపీలో 568 వద్ద ఆగిపోయింది. తెలంగాణలో చివరి సీట్ దక్కించుకున్న విద్యార్థులకంటే ఏకంగా 131 మార్కులు అదనంగా సాధించినా ఏపీ విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఓసీ విభాగంలో తొలి దశలో మన రాష్ట్రంలో 615 మార్కుల వద్ద నిలిచిపోయింది. ఈ విభాగంలో తెలంగాణ విద్యార్థులకు 528 మార్కుల వరకు సీట్ దక్కింది. ఎస్సీ విభాగంలో తెలంగాణతో పోలిస్తే ఏపీలో 74 మార్కుల వ్యత్యాసం ఉంది. అక్కడ ఎస్సీ విభాగంలో 446 మార్కుల వరకు సీట్ వస్తే.. ఏపీలో 520 మార్కుల వద్దే ఆగిపోయింది.సన్నగిల్లిన ఆశలు గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచడంతో పాటు, పేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2023–24 విద్యా సంవత్సరం ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించి 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25లో ఐదు, 2025–26లో మిగిలిన ఏడు కళాశాలలు ప్రారంభించాలని ప్రణాళిక రచించారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం కొత్త కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించి, ఈ ఏడాది ఐదుకు గాను నాలుగు కళాశాలలు ప్రారంభం అవ్వకుండా అడ్డుకుంది. పక్క రాష్ట్రంలో కనీసం భవనాలు, ఆస్పత్రులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోయినా తాత్కాలిక ఏర్పాట్లతో కొత్త కళాశాలలు ప్రారంభిస్తుంటే.. గత ప్రభుత్వంలో 80 శాతం మేర భవన నిర్మాణాలు పూర్తై, పూర్తి స్థాయిలో బోధనాస్పత్రులు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం కళాశాలలను అడ్డుకోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. బాబు ప్రభుత్వం ప్రైవేట్ మోజు వల్ల ఇప్పటికే 700 సీట్లు రాష్ట్రం నష్టపోగా, వచ్చే ఏడాది ఏడు కళాశాలలు ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తద్వారా మరో 1050 సీట్లు రాష్ట్రం నష్టపోనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పిల్లలకు లాంగ్‌టర్మ్ కోచింగ్‌ల కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేసిన పేద, మధ్య తరగతి కుటుంబాలు మరో ఏడాది కోచింగ్‌కు పంపేందుకు సాహసం చేయడం లేదు. వారిలో వైద్య విద్యపై ఆశలు సన్నగిల్లి ప్రత్యామ్నాయ కోర్సులు చూసుకుంటున్నారు. -
3.16 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా నీట్లో ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో సీటు లభించింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మొదటి విడత జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న కన్వీనర్ సీట్లలో దాదాపు 4,760 సీట్లను విద్యార్థులకు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఎవరికి సీట్లు వచ్చాయో విద్యార్థులకు సమాచారం పంపించింది. గతేడాది అత్యధికంగా నీట్లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఒక ఎస్సీ విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు లభించగా.. ఈసారి బీసీ ఏ కేటగిరీలోనే 3,16,657 ర్యాంకర్‌కు సీటు లభించడం విశేషం. గత ఏడాది మొదటి విడతలో 1.31 లక్షల ర్యాంకుకు జనరల్ కేటగిరీలో సీటు వచ్చింది. ఈసారి మొదటి విడతలో 1.65 లక్షల ర్యాంకర్‌కు సీటు లభించింది. బీసీ బీ కేటగిరీలో గతేడాది మొదటి విడతలో 1.40 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.94 లక్షల ర్యాంకర్‌కు సీటు లభించింది. అలాగే గతేడాది బీసీ డీ కేటగిరీలో 1.35 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.80 లక్షల ర్యాంకర్‌కు వచ్చింది. కన్వీనర్ కోటా సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు విడతల కౌన్సెలింగ్ జరగనుంది. బీసీ ఈ కేటగిరీలో ప్రస్తుతం 2.03 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీ కేటగిరీలో 2.90 లక్షల ర్యాంకుకు, ఎస్సీ కేటగిరీలో 2.87 లక్షల ర్యాంకుకు సీటు లభించడం గమనార్హం. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో దివ్యాంగ రిజర్వేషన్ కింద 13.41 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఇలావుండగా జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి కూడా మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు.పెరిగిన సీట్లతో విస్త్రృత అవకాశాలురాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలు పెరిగాయి. అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరిగాయి. దీంతో అధిక ర్యాంకర్లకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు లభిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 64 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో మల్లారెడ్డికి చెందిన రెండు, నీలిమ మెడికల్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలయ్యాయి. వీటితో పాటు ఎయిమ్స్ మెడికల్ కాలేజీని మినహాయించి 60 మెడికల్ కాలేజీల్లోని సీట్లకు ఇప్పుడు కన్వీనర్ కోటా కింద సీట్ల కేటాయింపు జరిపారు. 2024–25 వైద్య విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా అదనంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్య కోర్సుల్లో కన్వీనర్ ఇన్‌సర్వీస్, నాన్ సర్వీస్ కోటా, యాజమాన్య కోటా ప్రవేశాల కోసం ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ–2024 అర్హత సాధించిన వైద్యులు వచ్చే నెల 4వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ ఐదు నుంచి ఏడో తేదీల మధ్య దరఖాస్తుకు అవకాశం కల్పించారు. https:// drntr.uhsap.in వెబ్సైట్లో నోటిఫికేషన్ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు. దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 9000780707, 8008250 842 ఫోన్ నంబర్లను సంప్రదించాలి్సందిగా రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు. -
‘స్థానికత’పై వర్సిటీ తీరు సరికాదు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యా అడ్మిషన్లకు సంబంధించి కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ ‘స్థానికత’పై వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. నేరుగా ప్రభుత్వం సిఫార్సు చేసిన సైనిక పాఠశాల విద్యార్థిని స్థానిక అభ్యర్థిగా పరిగణించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థిని స్థానికుడిగా పరిగణించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ సిఫార్సు మేరకు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురానికి చెందిన చేపూరి అవినాశ్ డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ స్కూల్లో 8 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. రాష్ట్ర కోటా నుంచి అతను ఎంపికయ్యారు. ఆ తర్వాత ఇంటరీ్మడియట్ తెలంగాణలో పూర్తి చేశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్ల సమయంలో అతను తెలంగాణలో 9, 10 చదవలేదని పేర్కొంటూ స్థానిక అభ్యర్థిగా పరిగణించడానికి విశ్వవిద్యాలయం నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ హైకో ర్టులో అవినాశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున ఎ.వెంకటేశ్, ప్రభుత్వం తరఫున ఏజీపీ స్వప్న, కాళోజీ వర్సి టీ తరఫున ఎ.ప్రభాకర్‌రావు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం విచారణ సందర్భంగా పిటిషనర్ స్థానిక అభ్యర్థే కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. సమస్యను పరిష్కరించాలని వర్సిటీకి సూ చించింది. అయితే గురువారం విచారణ సందర్భంగా స్థానికుడిగా పరిగణించలేమని వర్సిటీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వర్సిటీ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థి నాన్ లోకల్ ఎలా అవుతారో సర్కార్‌ను అడిగి చెప్పాలని ఏఏజీని ఆదేశించింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. -
సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్విస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేపట్టిన నిరసన సెగ సీఎం చంద్రబాబును తాకింది. బుధవారం విజయవాడలోని ఎన్డీఆర్ జిల్లా కలెక్టర్రేట్లో వరద బాధితులకు పరిహారం పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. దీంతో వందలాది పీహెచ్సీ వైద్యులు ఉదయాన్నే కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇన్సర్విస్ కోటా కుదింపు జీవో 85ను రద్దు చేయడంతో పాటు, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ పరిసరాల్లో నిరసన తెలపడానికి వీల్లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎంను కలిసి తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లే వరకూ అక్కడి నుంచి వెళ్లేది లేదని వైద్యులు తెగేసి చెప్పారు. సీఎంను కలవడానికి ఇంత మందిని అనుమతించబోమని, ఇద్దరు మాత్రమే రావాలని పోలీసులు చెప్పారు. పోలీసుల షరతుకు అంగీకరించి, ఇద్దరు వైద్యులే సీఎంను కలిశారు. మిగిలిన వైద్యులందరూ అక్కడే రోడ్డుపై గంటల తరబడి పడిగాపులు కాశారు. జీవో రద్దు చేయం వైద్యుల ప్రతినిధులు సీఎంను కలిసి జీవో 85 రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అయితే, జీవో 85ను రద్దు చేయడం కుదరదని సీఎం తేల్చి చెప్పినట్టు తెలిసింది. జీవోలో సవరణకు ఇప్పటికే సానుకూలత తెలిపామని అన్నట్లు సమాచారం. జీవో రద్దుకు పట్టుబడితే కుదరదని సున్నితంగా హెచ్చరించినట్టు వైద్యులు చెప్పారు.ఇన్సర్విస్ కోటా కుదించిన బాబు సర్కారు పీజీ వైద్య విద్యలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్)లుగా సేవలందించే ఎంబీబీఎస్ వైద్యులకు ఇన్‌సర్వీస్ రిజర్వేషన్ సౌకర్యం ఉంది. గత ప్రభుత్వం క్లినికల్ పీజీ కోర్సుల్లో 30 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం క్లినికల్‌లో ఎంపిక చేసిన స్పెషాలిటీల్లో 15 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 30 శాతానికి ఈ కోటా కుదించింది. దీంతో 2023–24లో క్లినికల్‌లో 389, నాన్–క్లినికల్‌లో 164 పీజీ సీట్లు పొందిన వైద్యులు, ఇప్పుడు క్లినికల్‌లో 270, నాన్ క్లినికల్‌లో 66 చొప్పున సీట్లను కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10 నుంచి వైద్యులు ఉద్యమం చేపట్టారు. 15వ తేదీ నుంచి పీహెచ్‌సీల్లో వైద్య సేవలకు సైతం దూరంగా ఉన్నారు. -
ప్రైవేట్ వైద్య‘మిథ్య’
తనిఖీల్లో ఏం తేలింది..? పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50% వరకు అధ్యాపకులు లేరు. ఓ కాలేజీలో 50.47%, మరో కాలేజీలో 59.3% మేరకు కొరత ఉంది. ఒక కాలేజీలో రెసిడెంట్లు, ట్యూటర్ల కొరత 66.31% వరకు ఉంది. 150 మంది విద్యార్థులుండే కాలేజీ అనుబంధ ఆసు పత్రిలో రోజూ 1,200 మంది ఓపీ ఉండాలి. ఒక చోట 849, మరో చోట 650 మందే వస్తున్నారు. ఓ కాలేజీ ఆసుపత్రిలో 650కి 542 పడకలే ఉన్నాయి. రెండు కాలేజీల ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ 9.38%, 11.97% చొప్పునే ఉంది. పలుచోట్ల లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు సరిపడా లేవు. ఒకే ప్రొఫెసర్‌ను రెండు కాలేజీల్లో చూపించారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కళాశాలల్లో ఉండాల్సిన సంఖ్యలో సగం మంది కూడా లేరు. మరోవైపు విద్యార్థులకు అవసరమైన స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా లేవు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవలి తనిఖీల్లో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫె సర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తగిన సంఖ్యలో లేకపోవడం, ల్యాబ్‌ల వంటి మౌలిక వసతుల కొరతతో అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా తయారవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయా కాలేజీల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న చాలామంది తగిన సామర్థ్యం, నైపుణ్యం లేక వృత్తిలో రాణించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేనందుకు విద్యార్థుల అడ్మిషన్లను కమిషన్ రద్దు చేసింది. తర్వాత వారిని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసింది. ఎన్ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటున్నా, చాలా మెడికల్ కాలేజీలు ఇప్పటికీ అధ్యాపకులను నియమించుకోవడంలో, మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడే ఉంటున్నాయని, వైద్య విద్యపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్న కాలేజీలు నాణ్యమైన విద్య అందించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏ కాలేజీ..ఎలా ఉండాలి: ఎంబీబీఎస్ సీట్లు 150 ఉన్న మెడికల్ కాలేజీలో 600 పడకలు ఉండాలి. 116 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 76 మంది రెసిడెంట్లు ఉండాలి. ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. స్కిల్ లేబొరేటరీ ఉండాలి. ఇలా ఉన్న సీట్లను బట్టి బోధనా సిబ్బంది, వసతులు ఉండాలి. అన్ని మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసే లేబొరేటరీ ఉండాలి. లైబ్రరీలో 4,500 పుస్తకాలుండాలి. అదే 100 సీట్లున్న మెడికల్ కాలేజీ అయితే 3 వేల పుస్తకాలు, 200 సీట్లుంటే 6 వేలు, 250 సీట్లయితే 7 వేల పుస్తకాలు ఉండాలి. లైబ్రరీ వైశాల్యం కూడా సీట్ల సంఖ్యకు అనుగుణంగా ఉండాలి. 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చదివే మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్ పేషెంట్లు అవసరం. ఆ మేరకు తప్పనిసరిగా రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇలాంటి అనేక వసతులు సరిగ్గా లేకుండానే, బోధనా సిబ్బంది తగిన సంఖ్యలో లేకుండానే నడుస్తున్నట్లు తేలింది. తనిఖీల సమయంలో ‘సర్దుబాట్లు’ రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాగా, 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కాగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. వసతులు లేవని విద్యార్థులు బయటకు చెప్పలేని పరిస్థితి ఉందని, ఒకవేళ అలా చెబితే, నిరసన వ్యక్తం చేస్తే ప్రాక్టికల్స్‌లో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోందని చెబుతున్నారు. కాగా ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చే సమయానికి కాలేజీలు సర్దుబాట్లు చేస్తున్నాయి. నకిలీ బోధనా సిబ్బందితో ప్రైవేటు యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. అనేక కాలేజీలు సింథటిక్ బయోమెట్రిక్ ద్వారా ఒకరికి బదులు మరొకరితో హాజరు నమోదు చేయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు: ఎస్ఎఫ్ఐ
తిరుపతి సిటీ/మధురానగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్నికల ముందు ‘వైద్య విద్యను గాడిలో పెడతాం..ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లు ఎన్నో మాటలు చెప్పారని, తీరా అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే విధంగా అడుగులు వేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎంసీ కి రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నేతలు తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట, విజయవాడ లెనిన్ సెంటర్లో శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 107,108 జీవోలను రద్దు చేసి వైద్య విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరంచేసే ప్రయత్నాలు చేయడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడలం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నూతన కళాశాలలను నిర్మించి మెడికల్ సీట్లు పెంచి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పులివెందుల మెడికల్ కళాశాల సీట్లు కొనసాగించాలని లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విజయవాడలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..కేంద్రంతో సంప్రదించి 5 కళాశాలలకు అనుమతులు తీసుకురావాల్సిన ప్రభుత్వం పులివెందులకు వచ్చిన 50 సీట్లు కూడా వసతులు కల్పించలేమని ఎన్ఎంసీకి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 700 సీట్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.తల్లికి వందనం ఎప్పుడు...?తిరుపతి అర్బన్: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినప్పటికి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యవర్గ సభ్యులు పూజారి రాఘవేంద్ర ప్రశ్నించారు. శుక్రవారం విద్యార్థి సంఘం నేతలు తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద నిసరన వ్యక్తం చేసి ఏవో ఝాన్సీలక్ష్మికి వినతిపత్రమిచ్చారు. సూపర్‌సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. హాస్టల్స్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలి చెప్పారు. -
మా కలలు చిదిమేసిన ప్రభుత్వం
మా కలలను ప్రభుత్వం చిదిమేసింది. మా ఆశలను అడియాశలు చేసింది. గత ఏడాది కటాఫ్ కన్నా ఎక్కువగా మార్కులు వచ్చాయన్న ఆనందాన్ని ఆవిరి చేసింది. రిజర్వేషన్ కోటాలో అయినా సీటు వస్తుందని ఎదురు చూసినా నిరాశనే మిగిల్చింది. మా భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం మాకు పెనుశాపంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వైద్య విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లు పెంచుకుంటూ వెళుతుంటే... ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే మంజూరు చేసిన కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లను సైతం వద్దని ప్రభుత్వమే అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి... అని పలువురు నీట్ ర్యాంకర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకున్న నిర్ణయాలతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయి తమ పిల్లల భవిష్యత్ తలకిందులైందని పలువురు తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని చంద్రబాబు, లోకేశ్ హామీ ఇస్తే నమ్మామని... అధికారంలోకి వచ్చాక ఆ జీవోలు రద్దు చేయకపోగా... ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ... అంటూ అసలు రూపం బయటపెట్టారు. నమ్మించిగొంతు కోశారు... అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. – సాక్షి, అమరావతి/నెట్వర్క్ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది గత ఏడాది రెండు మార్కుల తేడాతో కన్వినర్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోల్పోయాను. మేనేజ్మెంట్ కోటాలో చదవాలంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. దీంతో ఏడాదిపాటు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. కష్టపడి చదివి నీట్ యూజీ–2024లో 610 స్కోర్ చేశా. ఈ ర్యాంక్‌కు గత ఏడాది గుంటూరు మెడికల్ కాలేజీలో ఓసీకి చివరి సీట్ వచ్చింది. గత ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో 750 సీట్లు పెరిగాయి. ఈసారి కూడా మరో 750 సీట్లు పెరుగుతాయన్నారు. వాటికితోడు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని టీడీపీ చెప్పింది. ఇలా కూడా మరికొన్ని సీట్లు కలిసి వస్తాయని అనుకున్నా. మంచి స్కోర్ చేశాను. సీట్లు కూడా పెరిగితే తొలి దశ కౌన్సెలింగ్‌లోనే సీట్ వచ్చేస్తుందని కుటుంబం అంతా ఆశపెట్టుకున్నాం. కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి కొత్త కళాశాలలు ప్రారంభం కాలేదు. సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం రద్దు చేయలేదు. దీంతో సీట్లు పెరగలేదు. ఏయూ రీజియన్‌లో ఓసీ విభాగంలో 615 స్కోర్‌కు ఆఖరి సీట్ దక్కింది. రెండు, మూడు కౌన్సెలింగ్‌లలో సీట్ వస్తుందన్న నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం నిర్ణయంతో నా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. – యశ్వంత్‌రెడ్డి, నీట్ ర్యాంకర్, విశాఖపట్నం కొత్త కాలేజీలో సీటు వస్తుందని ఆశపడ్డా బీసీ–డీ సామాజికవర్గానికి చెందిన నేను నీట్లో 541 మార్కులు తెచ్చుకున్నాను. కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు కావడంతో ఎంబీబీఎస్ సీటు వస్తుందని ఆశపడ్డాను. కొత్త కళాశాలలు అందుబాటులోకి వచ్చి ఉంటే మాలాంటి పేద విద్యార్థులకు అవకాశం లభించేది. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరు కాగా, రద్దు చేయాలని ప్రభుత్వం కోరడం వల్ల మాలాంటి బీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇక డబ్బులు కట్టి పేద విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించడం కష్టమే. – దేవేశ్, నీట్ విద్యార్థి, రాజంపేట, అన్నమయ్య జిల్లా లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకున్నా.. నేను మూడేళ్లగా నీట్ కోసం లాంగ్‌టర్మ్ శిక్షణ తీసుకుంటున్నా. ఈ ఏడాది నీట్లో 500 మార్కులు సాధించాను. ఈ ఏడాది కొత్త కాలేజీలు వస్తాయనే ఆశతో బీసీ–ఈ కోటాలో ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు వస్తుందనే ఆశతో ఉన్నా. కానీ కొత్త మెడికల్ కాలేజీలు రాకపోవటం, పులివెందులకు కేటాయించిన సీట్లను ప్రభుత్వం వద్దనడంతో ఈ ఏడాది కూడా సీటు వస్తోందో.. రాదో అని భయంగా ఉంది. మా తల్లిదండ్రులు పేదలు అయినా నన్ను డాక్టర్‌గా చూడాలని లాంగ్‌టర్మ్‌లో చేర్పించారు. ఇప్పుడు సీటు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. – షేక్ తజి్మన్, దువ్వూరు, వైఎస్సార్ జిల్లా రిజర్వేషన్ ఉన్నా మా అబ్బాయికి సీటు రాలేదు గత ఏడాది బీసీ–డీలో 497 స్కోర్ వరకు కన్వినర్ కోటాలో సీటు వచ్చింది. ఈసారి మా అబ్బాయి 541 స్కోర్ చేశాడు. 83 మార్కుల మేర స్కోర్ పెరిగింది. ఈ క్రమంలో తొలి రౌండ్లో కన్వినర్ కోటా సీటు వస్తుందని ఆశపడ్డాం. కానీ, తొలి రౌండ్లో ఎస్వీయూ రీజియన్‌లో బీసీ–డీలో 560 వరకు సీటు వచ్చింది. మా అబ్బాయికి సీటు రాలేదు. గత ఏడాది నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 519 స్కోర్‌కు సీట్ వచ్చింది. ఆ ఏడాది పోటీకి తగ్గట్టుగా ప్రభుత్వ కళాశాలలు పెరిగి సీట్లు పెరగడంతో 519 ర్యాంక్‌కు ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చింది. పులివెందుల కాలేజీకి అనుమతులు వచ్చినా వద్దని లేఖ రాశారు. సీట్లు పెంచకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడి మాలాంటి వాళ్లకు ద్రోహం తలపెట్టింది. వేరే దేశానికి వెళ్లి అక్కడ ప్రైవేట్ కంపెనీల్లో పని చేసి వచ్చిన జీతంలో తిని తినక దాచిపెట్టి నా కొడుక్కు లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పించా. మంచి స్కోరు, రిజర్వేషన్ ఉన్నా ప్రభుత్వ కోటాలో సీటు రాలేదు. ఇక మాలాంటి వాళ్లు ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు ఎలా చదువుతారు. – పెంచలయ్య, నీట్ ర్యాంకర్ తండ్రి, అన్నమయ్య జిల్లా నా కల చెదిరింది వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలనుకునే నా కల చెదిరింది. కటాఫ్ పెంచి నా భవితను చిదిమేశారు. ఓసీ వర్గానికి చెందిన నేను 540 మార్కులు సాధించినా సీటు రాలేదు. గత ప్రభుత్వంలో వైద్య విద్యకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రాధాన్యత కొరవడటంతో నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం వైద్య విద్యకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. – గరికిన సత్య సంతోష్, గొడారిగుంట,కాకినాడ ఇక మెడిసిన్ కలగానే... విజయవాడలోని ఓ కోచింగ్ సెంటర్లో సంవత్సరం నుంచి నీట్ శిక్షణ తీసుకుంటున్నా. ఇంటర్లో గురుకుల పాఠశాలలో చదువుకున్నా. గత ఏడాది మొదటి సారి నీట్ రాస్తే 388 మార్కులు వచ్చాయి. ఈ సారైనా మెడికల్ సీటు సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివా. 720 మార్కులకు 524 మార్కులు వచ్చాయి. ప్రభుత్వం నూతనంగా ఐదు మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి ఉంటే 750 సీట్లు అదనంగా వచ్చేవి. దీంతో నాకు సీటు వచ్చే అవకాశం ఉండేది. అలా జరగకపోవడంతో నా లాంటి ఎంతో మంది పేద విద్యార్థుల డాక్టర్ కల కలగానే మిగిలిపోనుంది. బీసీ–బీ కురుబ అయినా నాకు సీటు రాలేదు. – ముత్తుకూరు సరిత, సంతేకుడ్లూరు గ్రామం, ఆదోని మండలం తీవ్ర నిరాశకు గురయ్యా నాన్న డాక్టర్ బి.సురేష్, రేడియాలజిస్టు. అమ్మ డాక్టర్ ఉమాదేవి గైనకాలజిస్టు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో నన్ను కూడా డాక్టర్‌ను చేయాలని వారు ఎంతో ఆశగా చదివించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా నేను కూడా ఎంతో కష్టపడి చదువుతున్నాను. మాది బీసీ–బీ కేటగిరీ. నీట్లో 527 మార్కులు తెచ్చుకున్నా సీటు రాలేదు. కటాఫ్ 556 దగ్గర ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. మన రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చి ఉంటే నాకు సీటు వచ్చి ఉండేదని లెక్చరర్లు చెబుతున్నారు. నాకు సీటు రాకపోవడంతో మా అమ్మానాన్న కూడా ఎంతో బాధపడ్డారు. – బి.ప్రణవ్, కర్నూలు సీట్లు పెరిగితే ఈ పరిస్థితి ఉండేది కాదు మాది వ్యవసాయ కుటుంబం. మాది బీసీ–ఏ కేటగిరీ. నన్ను ఎలాగైనా డాక్టర్‌ను చేయాలని మా అమ్మ వరలక్ష్మి , నాన్న వెంకటేశ్వర్లు చాలా కష్టపడి చదివిస్తున్నారు. నేను కూడా కష్టపడి చదివి మా అమ్మానాన్నల కలలను సాకారం చేయాలని ప్రయతి్నస్తున్నాను. నీట్లో 528 మార్కులు సాధించినా సీటు రాలేదు. కటాఫ్ 561 వద్దే ఆగిపోయింది. రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరిగి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. గత సంవత్సరం ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా మరికొన్ని కాలేజీలు వస్తాయని, మరో 500 నుంచి 700 వరకు సీట్లు పెరుగుతాయని భావించాను. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మాలాంటి విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగిలింది. – బి.జాహ్నవి, కర్నూలు 597 మార్కులు వచ్చినా సీటు రాలేదు ఎంబీబీఎస్‌లో కన్వినర్ కోటా కింద మొదటి కౌన్సిలింగ్లో సీట్లు కేటాయింపు పూర్తయింది. నాకు 597 మార్కులు వచ్చినా సీటు రాలేదు. పులివెందులలో మెడికల్ కళాశాల ఉండి ఉంటే ఈజీగా నాకు సీటు వచ్చి ఉండేది. నాకు సీటు రాకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. నీట్ రాసి 597 మార్కులు సాధించినప్పటికీ సీటు రాకపోవడం కలచివేస్తోంది. ప్రభుత్వ తీరు వల్లే నాకు అన్యాయం జరిగింది. – సాయి విఘ్నేశ్వరరెడ్డి, పులివెందుల, వైఎస్సార్ జిల్లా సీట్లు వదులుకోవడం సరికాదు బీసీ–ఈ కేటగిరీకి చెందిన నేను నీట్లో 545 మార్కులు సాధించాను. అయినా సీటు రాలేదు. బీసీ–ఈ కటాఫ్ 553 వద్ద ఆగిపోయింది. గత సంవత్సరం బీసీ–ఈ కేటగిరీ కటాఫ్ 496 మార్కులు. అందువల్ల ఈ ఏడాది నాకు 545 మార్కులు రావడంతో తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశపడ్డాను. దీనికి తోడు రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరుగుతాయన్న ఆశ కూడా ఉండేది. కానీ మా ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది. సీట్లు పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల పేరుతో ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలను కొనసాగించలేదు. ఎన్ఎంసీ ఇచ్చిన సీట్లు కూడా వదులుకుంది. ఫలితంగా మాలాంటి వారికి తీవ్ర అన్యాయం జరిగింది. విలువైన మెడికల్ సీట్లు వదులుకోవడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్‌సీట్లు సాధించాలి. – హెచ్ఎం ఫర్హా అన్జుమ్, కర్నూలు 570 వచ్చినా సీటు లేదు... నాకు నీట్ యూజీలో 570 మార్కులు వచ్చాయి. నేను ఓసీ కేటగిరీ. గత ఏడాది మా రీజియన్‌లో ఓసీ కేటగిరీ కటాఫ్ 542 వద్ద ఆగిపోయింది. ఓసీ కేటగిరీలో పోటీ తీవ్రంగా ఉంటుందని తెలుసు. అందుకే మొదటి నుంచి ఎంతో కష్టపడి చదువుతున్నాను. నీట్లో 570 మార్కులు సాధించినా ఫలితం లేకపోయింది. కటాఫ్ 601 వద్దే ఆగిపోయింది. గత సంవత్సరం కటాఫ్ 542 వద్ద ఆగిపోవడంతో ఈ సంవత్సరం నాకు వచ్చిన మార్కులకు తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశతో ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి, ఎన్ఎంసీ ద్వారా సీట్లు సాధించి ఉంటే మాలాంటి వారికి తప్పకుండా సీట్లు వచ్చేవి. ప్రభుత్వ చర్యల వల్ల ఈ ఏడాది మాలాంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. – వి.సాయిసృజన, కర్నూలు ఆంధ్రాలో పుట్టడమే నేరమా? నా కుమార్తెకు బీసీ–ఏ కేటగిరీలో 565 మార్కులు వచ్చినా మెడికల్ సీటు రాలేదు. పేదవాళ్లం అయినప్పటికీ మా కుమార్తెను డాక్టర్‌గా చూడాలని సుమారు రూ.4లక్షలు ఖర్చు చేసి లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పించాం. ఎంబీబీఎస్ సీటు వస్తుందని ఆశపడ్డాం. చివరకు కన్నీరే మిగిలింది. గత ఏడాది 501 మార్కులకు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ, ఈ ఏడాది 565 మార్కులు వచ్చినా నా బిడ్డకు సీటు రాలేదు. మాలాంటి వాళ్లని ఎంతోమందిని ఈ ప్రభుత్వం మోసం చేసింది. కొత్త కాలేజీలు వస్తే మాలాంటి వారి జీవితాలు బాగుపడతాయని ఎదురు చూశాం. తీరా ఇప్పుడు సీట్లు తగ్గించారు. ఆంధ్రాలో పుట్టడమే నేరమా.. అన్నట్లు ఉంది. – కె.నవీన్, విద్యార్థిని తండ్రి, టెక్కలిపేద పిల్లలకు శరాఘాతం ప్రభుత్వం కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయకపోవడంతో సీట్లు తగ్గాయి. నా లాంటి విద్యార్థులకు నష్టం కలిగింది. ఎంబీబీఎస్ పూర్తిచేయాలన్న ఆశతో కష్టపడి చదివాను. సీటు వచ్చే అవకాశం లేదు. మళ్లీ లాంగ్‌టెర్మ్ కోచింగ్‌లో చేరాను. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతం వంటిది. మెడికల్ కాలేజీలకు ప్రైవేట్‌కు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులకు శాపం. – కె.మానస, కిండం అగ్రహారం గ్రామం, బొండపల్లి మండలం మా భవిత ప్రశ్నార్థకం నేను బీసీ వర్గానికి చెందిన విద్యార్థిని. కటాఫ్ మార్కులు పెరగడంతో నీట్ సీటు చేజారింది. మాది పేద కుటుంబం. డాక్టర్ కావాలన్నది నా ఆశయం. వైద్య కళాశాలలు పెరగడంతో కచ్చితంగా సీటు వస్తుందని భావించాను. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉంటుందని ఊహించాను. అయితే ప్రభుత్వం కొత్త కాలేజీలు తీసుకురాకపోవడంతో మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. ప్రభుత్వమే ఇలా చేయడమే సరికాదు. – ఎండీ ఖాసీం, జె.రామారావుపేట, కాకినాడప్రభుత్వం వల్ల ఎంతో నష్టం నాకు నీట్లో 568 మార్కులు వచ్చాయి. గతేడాది ఎస్వీయూ రీజియన్‌లో ఓసీ కేటగిరీకి 542 మార్కులకు కూడా సీటొచ్చింది. ఈ ఏడాది కొత్తగా 5 కాలేజీలు వస్తున్నాయని.. 550కి ఓసీ కేటగిరిలో సీటు వస్తుందని మా కాలేజీ అధ్యాపకులు చెప్పారు. ఎస్వీయూ రీజియన్ పరిధిలో పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు. కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో నేను ఎంతో నష్టపోతున్నా. ఏం చేయాలో అర్థమవ్వట్లేదు. ధైర్యం చేసి లాంగ్‌టర్మ్‌కు వెళదామన్నా.. వచ్చే ఏడాది సీట్లు పెరుగుతాయన్న నమ్మకం లేదు. – లతిక, నీట్ విద్యార్థి, ఎస్వీయూ రీజియన్ -
విద్యార్థులకు ఇంత ద్రోహమా?
సాక్షి, అమరావతి: వైద్య విద్య చదవాలని ఆశించే రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉచిత వైద్యం అందకుండా పేదవర్గాలకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న ద్రోహం మరే రాష్ట్ర ప్రభుత్వమూ చేయదని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు వైద్య విద్య, ఉచిత వైద్యం అందకుండా చేయాలన్న లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పులివెందుల కళాశాలకు 50 సీట్లు ఇస్తామన్న సీట్లను కూడా వద్దని లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. ఇలా ఏ ప్రభుత్వమైనా చేస్తుందా అని నిలదీశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు కేంద్రం అనుమతించి, సీట్లు కేటాయించగా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీపై ఆధారపడిన పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు కేంద్రంతో కొట్లాడి కొత్త కళాశాలలు, సీట్లు రాబట్టాల్సింది పోయి.. ఇలా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించలేకపోవడం వల్ల విద్యార్థులు 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య ఆశావహులకు తీరని అన్యాయం జరిగిందని డాక్టర్ వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం గత ప్రభుత్వంలో కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రిజర్వేషన్ వర్గాల్లోని మెరిట్ విద్యార్థులపై ప్రభావం చూపుతున్న ఈ విధానాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి0ది. దీంతో వైద్య విద్య ఆశావహులు, మెడికోలు టీడీపీపై నమ్మకం పెట్టుకున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి ఉంటే ఈ విద్యా సంవత్సరంలోనే 300 ఎంబీబీఎస్ సీట్లు కన్వినర్ కోటాలోకి కొత్తగా వచ్చేవి. అయితే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయకుండా టీడీపీ నమ్మక ద్రోహం చేసింది. మరోవైపు ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభిస్తే కన్వినర్ కోటాలో మరిన్ని సీట్లు వస్తాయని పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా తీరని నష్టం కలిగించింది. పులివెందుల కళాశాలకు 50 సీట్లు మంజూరు చేసినా, కళాశాల నిర్వహించలేమని ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసి రద్దు చేయించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా చేయదు. కేవలం ఏయూ రీజియన్‌లో పాడేరుకు 50 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో 22 సీట్లు మాత్రమే కన్వినర్ కోటాకు, 11 ఓపెన్ కాంపిటీషన్‌కు పోగా 11 సీట్లే రిజర్వేషన్ వర్గాలకు లభిస్తున్నాయి. ఎస్వీ రీజియన్‌లో ఒక్క సీటు కూడా పెరగలేదు. పులివెందులకు 50 సీట్లు తిరస్కరించకపోయి ఉంటే కన్వినర్ కోటాలో రిజర్వేషన్ వర్గాలకు 11, ఓపెన్ కాంపిటీషన్లో 11 సీట్లు అయినా దక్కేవి. వాస్తవానికి కొత్త కళాశాలలు ప్రారంభమై సీట్లు పెరుగుతాయని చాలా మంది మెరిట్ విద్యార్థులు యాజమాన్య కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడేమో కటాఫ్‌లు అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాంటి విద్యార్థులకు అన్యాయం జరుగకుండా కనీసం యాజమాన్య కోటాలో దరఖాస్తుకు మరోసారి అవకాశం కల్పించాలి. ఇలాగైతే సామాన్యులకు వైద్య విద్య దూరమవుతుంది కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు వైద్య విద్యను అభ్యసించలేని పరిస్థితి వస్తుంది. పేదలు సైతం బోధనాస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో రోగులకంటే వైద్య విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. సరిపడా ఫ్యాకల్టీ, రోగులు ఉండరు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెబితే వాటిలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అక్కడ రోగులు కిటకిటలాడుతున్నారు. ఎందుకంటే వాటిలో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి కాబట్టే. అదే ప్రైవేట్‌కు కట్టబెడితే డబ్బు పెట్టి పేదలు వైద్యం పొందే అవకాశం ఉంటుందా? ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కడుతోంది. ఇంత దారుణం మరే రాష్ట్రంలోనూ ఉండదు. సీఎం చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కట్టి, పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేయాలన్నదే ఆయన లక్ష్యమని స్పష్టమవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్య కోర్సుల్లో ఫీజులను విచ్చలవిడిగా పెంచారు. డబ్బున్న వారికే వైద్య పట్టా అన్నట్టుగా తయారు చేశారు. 2014–19 మధ్య ప్రైవేట్‌లో యాజమాన్య కోటాలో మెడికల్ పీజీ ఫీజును రూ.5.25 లక్షల నుంచి ఏకంగా రూ.24.20 లక్షలకు పెంచారు. రూ.5.25 లక్షల ఫీజు అంటే బ్యాంక్ లోన్ తీసుకొనో, బయట అప్పులు చేసో పేద, మధ్య తరగతి వైద్యులు పీజీ చేయడానికి సాహసిస్తారు. పీజీలో చేరాక వారికి వచ్చే స్టైఫండ్‌తో అప్పు తీర్చుకోవచ్చనే నమ్మకం ఉంటుంది. ఐదింతలు పెంచే సరికి ఆ అవకాశం కూడా లేక, అంత ఫీజు కట్టలేక చాలా మంది పీజీ చదవలేకపోయారు. అంతే కాదు టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి, మెడిసిన్ సీట్లు తెచ్చిన దాఖలాలూ లేవు.ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ఇదే తీరు ఈడబ్ల్యూఎస్ కోటా పైనా చంద్రబాబు ప్రభుత్వం తీరు ఇలానే ఉంది. ఎంబీబీఎస్ సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ సీట్లు పెంచకుండా కోటా అమలుకు జీవో ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. కోర్టులో కేసులు వేస్తే జీవో రద్దు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిందే గానీ సీట్లు పెంచడానికి కృషి చేస్తామని మాత్రం చెప్పలేదు. అంటే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కొరత సృష్టించి, ప్రైవేట్ వైద్య కళాశాలలకు డిమాండ్ పెరిగేలా చేస్తున్నారు. -
కాలేజీలపై 'చంద్రబాబు' కత్తి!
ఆశలు నీరు గార్చారుప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటై కొత్తగా సీట్లు వస్తే నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు మేలు కలుగుతుంది. కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం సబబు కాదు. ఈ ఏడాది సీట్లు పెరుగుతాయని ఎంతో మంది ఆశ పెట్టుకున్నాం. మా ఆశలను ప్రభుత్వం నీరు గార్చింది. – పూర్ణిమ, నీట్ విద్యార్థిని, చిత్తూరు జిల్లాసాక్షి, అమరావతి: ‘‘కొత్తగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటై అదనంగా సీట్లు వస్తే ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. నూతన వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం సబబు కాదు. మా ఆశలను ప్రభుత్వం నీరు గార్చింది. లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయింది. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామన్న హామీకి టీడీపీ తిలోదకాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం పేద బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తోంది..’’ ఇదీ వైద్య విద్యపై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన. ప్రభుత్వ రంగంలో మనకు అదనంగా మెడికల్ సీట్లు సమకూరుతుంటే ఏ రాష్ట్రమైనా వద్దనుకుంటుందా? కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాసిన ఉదంతం ఎక్కడైనా ఉందా? కాలేజీల్లో మౌలిక వసతులు, సదుపాయాలు పూర్తి స్థాయిలో సమకూర్చుకునేందుకు మరికొంత సమయం తీసుకోవాలని కేంద్రం ఉదారంగా ఆఫర్ ఇస్తే ఎవరైనా తిరస్కరిస్తారా? సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేట్ మోజుతో అలాగే వ్యవహరిస్తున్నారు. మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం (పీ–4) అని నమ్మబలుకుతూ ప్రభుత్వ వ్యవస్థలను తెగనమ్మేందుకు సన్నద్ధమయ్యారు. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం ద్వారా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసినప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వ్యవహరించని విధంగా ఆ సీట్లు మాకొద్దంటూ కూటమి సర్కారు లేఖ రాసి దుర్మారంగా అనుమతులను రద్దు చేయించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరి తమకు తెల్ల కోటు ధరించే అవకాశం దక్కుతుందని ఆశపడ్డ వారంతా సర్కారు తీరుపై నివ్వెరపోతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేస్తామని హామీలిచ్చిన టీడీపీ ఇప్పుడు ఏకంగా వాటికి బేరం పెట్టి తీరని ద్రోహం తల పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలనూ నిలిపివేయడంతో రాష్ట్రం మరో 1,050 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగి తమకు వైద్య విద్య చదివే అవకాశం దక్కుతుందనే ఆశతో రూ.లక్షలు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్‌లు తీసుకున్న విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. ఈ నిర్వాకం ఖరీదు.. 1,750 సీట్లు వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరుల్లో ఒక్కో చోట 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా రాష్ట్రానికి సమకూరాల్సి ఉండగా కూటమి సర్కారు నిర్వాకంతో కేవలం పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లే సమకూరాయి. గతేడాది వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ఈ ఏడాదీ అదే మాదిరిగా మరో 750 సీట్లు పెరిగి తమకు ఎంబీబీఎస్ సీట్ లభిస్తుందని నీట్ రాసి అర్హత సాధించిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కారు నిర్వాకం కారణంగా ఈ ఏడాది 700 మంది, వచ్చే ఏడాది 1,750 మంది విద్యార్థులు వైద్య విద్య అవకాశాన్ని కోల్పోనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 750 సీట్లకు అనుమతులు వచ్చి ఉంటే అందులో 112 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన సీట్లన్నింటిలో మన విద్యార్థులకే అవకాశం లభించేది. ఆల్ ఇండియా కోటా సీట్లలో కూడా మన రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులు సీటు సాధించే వీలుండేది. ముఖ్యంగా ఇప్పుడు ప్రారంభం కావాల్సిన వాటిల్లో నాలుగు కళాశాలలు వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే ఉన్నాయి. తమ పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పలువురు రూ.లక్షల్లో అప్పులు చేసి విజయవాడలో ఇంటర్‌తోపాటు నీట్ యూజీ కోచింగ్‌లలో చేరి్పంచారు. గతంలో చివరి కటాఫ్ ర్యాంక్ వరకూ వచ్చి అవకాశం దూరమైన విద్యార్థులు ఈసారి సీట్లు పెరుగుతాయనే నమ్మకంతో విలువైన సమయాన్ని, డబ్బులను వెచ్చించి లాంగ్‌టర్మ్ కోచింగ్‌లు తీసుకున్నారు. ఇంత అనుకూల పరిస్థితులున్నా.. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, సీఎంలు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రత్యేకంగా కలిసి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసి మరీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు, అదనపు ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రయత్నిస్తుంటే ఏపీలో మాత్రం వింత పరిస్థితులు నెలకొన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వైరల్ అవుతున్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. బీజేపీకి చెందిన సత్యకుమార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభించి వంద శాతం సీట్లకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి.. ఎన్ఎంసీ మంజూరు చేసిన సీట్లను కూడా మాకొద్దని లేఖ రాయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2014–19 మధ్య కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగినప్పుడు కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బూచిగా చూపిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు నిరాకరించటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తొలి నుంచి ప్రైవేట్ వైద్య విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేట్‌కు కట్టబెట్టే తంతుకు తెర తీశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బుకాయించి.. బుక్ అయిన ప్రభుత్వంఐదు కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టేలా చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వం కచిన వసతుల ఆధారంగా ఎన్ఎంసీ పాడేరు కాలేజీకి 50 సీట్లకు అనుమతులు మంజూరు చేసింది. ఆ కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నందున గత్యంతరం లేక చంద్రబాబు సర్కారు మిన్నకుంది. అంతకంటే ముందు పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగా 50 సీట్లకు ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్ఓపీ) మంజూరు చేసింది. అయితే ఎల్‌ఓపీని తొక్కిపెడుతూ మీరు అనుమతులు ఇచ్చినా మేం కళాశాలను నిర్వహించలేమంటూ గుట్టు చప్పుడు కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింది. బయటకేమో ఎల్ఓపీ రాలేదని బుకాయిస్తూ వచ్చింది. ఎల్లో మీడియాలో సైతం అదే తరహాలో వార్తలు రాయించారు. ప్రభుత్వం గుట్టుగా లేఖ రాసిన విషయాన్ని ‘సాక్షి’ బట్ట బయలు చేసింది. ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతోనే ఎల్‌ఓపీని రద్దు చేస్తున్నట్లు స్వయంగా ఎన్ఎంసీ కూడా ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లూ ఎల్ఓపీ రాలేదని బుకాయించిన కూటమి సర్కార్ మోసాలు బహిర్గతమయ్యాయి.మోసం చేశారు.. ఈ ప్రభుత్వం పేద బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తోంది. ఈ ఏడాది 750 సీట్లు అదనంగా సమకూరి ఉంటే కాస్త ర్యాంకు తగ్గినా అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగేది. నా బిడ్డ నీట్ రాసింది. ఐదు కొత్త కళాశాలలు ప్రారంభమైతే సీట్ వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి? సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామన్న హామీకి టీడీపీ తిలోదకాలు ఇచ్చింది. యాజమాన్య కోటా కింద సీట్ కొనే స్థోమత మాకు లేదు. మాలాంటి వాళ్లను మోసం చేశారు. – నెహేమియా, నెల్లూరు, నీట్ రాసిన విద్యార్థి తండ్రి తప్పుడు నిర్ణయాలతో గందరగోళం ఏడాది లాంగ్‌టర్మ్ కోచింగ్ తర్వాత మా అబ్బాయి 541 స్కోర్ సాధించాడు. బీసీ–డీ రిజర్వేషన్ కింద గతేడాది 497 స్కోర్‌కు ప్రైవేట్‌లో చివరి సీట్ వచ్చింది. ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. కొత్త కళాశాలలకు అనుమతులు వస్తే మా అబ్బాయికి సీట్ వస్తుందనే ఆశ ఉండేది. ఎస్వీ రీజియన్‌లోనే మూడు కళాశాలల ఏర్పాటుతో 450 సీట్లు సమకూరేవి. లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయింది. మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనే స్థోమత లేదు. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మా బాబు భవిష్యత్ గందరగోళంగా మారింది. – కోడూరు పెంచలయ్య, అన్నమయ్య జిల్లా తల్లిదండ్రుల ఆశలతో ఆడుకోవద్దు నా కుమార్తె రష్యాలోని కజికిస్తాన్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. స్థానికంగానే మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రావడం ఎంతో శుభపరిణామం. అలాంటిది ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం చాలా బాధ కలిగించింది. పులివెందులకు వచ్చిన సీట్లనూ వద్దనుకుంది. ఈ చర్య ముమ్మాటికీ తల్లిదండ్రుల ఆశలతో ఆడుకోవటమే. స్థానికంగానే మెడికల్ సీట్లు లభిస్తే నాలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు వ్యయ ప్రయాసల కోర్చి పిల్లలను విదేశాలకు పంపే అవసరం ఉండదు. – ఎం.చెన్నయ్య, వైద్య విద్యార్థిని అమూల్య తండ్రి, ఆదోని ఉచిత వైద్యం దూరం చేసే కుట్ర మెడికల్ కాలేజీలతో పిల్లలకు ఎంబీబీఎస్ విద్యనే కాదు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ ఏర్పాటైతే దానికి అనుబంధంగా ఆస్పత్రి వస్తుంది. దాంట్లో అనుభవజు్ఞలైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. వసతులు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే వైద్యం కోసం పేదలు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. – నూర్జహాన్, వేముల, వైఎస్సార్ జిల్లా -
వైద్య విద్య కల ఛిద్రం.. ఇక ప్రైవేట్ ‘మెడిసిన్’!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేసింది. ‘పీ 4’ జపం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రకు తెర తీసింది. అందులో భాగంగానే ఐదు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాకుండా తాజాగా అడ్డుపడింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే తమకు వైద్య విద్య చదివే అవకాశం లభిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. సాధారణంగా ముఖ్యమంత్రులంతా కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టి విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. ఎన్ఎంసీ సీట్లు ఇస్తామన్నప్పటికీ మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొంది. గత ప్రభుత్వం తలపెట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ పీపీపీ మోడల్లో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు వైద్య కళాశాలలకు కుట్రపూరితంగా ప్రభుత్వమే పొగ పెట్టింది. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఇప్పటికే ప్రభుత్వం అటకెక్కించింది. వీటి ద్వారా వచ్చే ఏడాది అందుబాటులోకి రావాల్సిన వెయ్యికి పైగా ఎంబీబీఎస్ సీట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగుపడటంతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని గత ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మరింత మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయి. బోధనాస్పత్రులకు వచ్చే రోగులకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రైవేట్ రంగంలో కూడా వైద్య చికిత్స వ్యయం తగ్గుతుంది. అయితే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కారు ప్రైవేట్ పాట పాడుతోంది.సర్వం సిద్ధం చేసినా ససేమిరా..2024–25 విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించేలా వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషి చేశారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ఐదు చోట్ల బోధనాస్పత్రులను అభివృద్ధి చేశారు. కళాశాల, బోధనాస్పత్రుల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేసి ఎన్నికలు ముగిసే నాటికి 70–80 శాతం పోస్టుల భర్తీ చేపట్టారు. తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో సెమినార్ హాల్, ల్యాబొరేటరీ, లైబ్రరీ, హాస్టళ్ల నిర్మాణాలు 80 శాతం పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేట్‌పరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పొగ పెట్టింది.వద్దని ప్రభుత్వమే లేఖ..కొత్త కాలేజీల్లో తొలి విడత తనిఖీల అనంతరం ఐదు చోట్ల స్వల్పంగా వనరుల కొరత ఉందని పేర్కొంటూ ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. ఎన్ఎంసీ గుర్తించిన అంశాలను మెరుగు పరచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండానే మొక్కుబడిగా చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. అయినప్పటికీ గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగానే పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లను మంజూరు చేస్తూ ఈ నెల 6వ తేదీన ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) ఇచ్చింది. అయితే ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ 50 సీట్లతో కళాశాలలను ప్రారంభించేందుకు మనస్కరించలేదు. దీంతో 50 సీట్లు మంజూరు చేసినప్పటికీ కళాశాలలో మేం వసతులు కల్పించలేమని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ఫలితంగా చేసేదేమీ లేక 50 సీట్లతో ఇచ్చిన ఎల్‌ఓపీని విత్‌డ్రా చేసినట్టు ఎన్ఎంసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనుమతులు రద్దు చేసినట్టు స్పష్టం చేసింది.ఉసూరుమన్న విద్యార్థులు, తల్లిదండ్రులుపులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించిన అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా ఆప్షన్ల నమోదు గడువును పొడిగించింది. బుధవారం (11వ తేదీ) రాత్రితో గడువు ముగిసింది. దీంతో కొత్తగా మంజూరైన పులివెందుల కాలేజీలో ప్రవేశాలు పొందవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశ పడ్డారు. అయితే ఆ కళాశాల ఆప్షన్లలో కనిపించకపోవడంతో ఉసూరుమన్నారు.అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే..సాధారణంగా వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ తొలి విడత తనిఖీల అనంతరం వసతుల కొరత ఉంటే అనుమతులివ్వదు. ఆ లోపాలను సవరించుకుని అప్పీల్‌కు వెళితే రెండో విడత తనిఖీలు చేసి అనుమతులిస్తారు. అదే ప్రభుత్వ కళాశాలలైతే తరగతులు ప్రారంభం అయ్యే నాటికి వసతుల కల్పన చేపడతామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే ఎన్ఎంసీ ఎల్ఓపీ ఇచ్చేస్తుంది. గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలకు అండర్ టేకింగ్ ఇచ్చి వంద శాతం సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం రాబట్టింది. అదే తరహాలో ప్రస్తుతం కూటమి సర్కారు కూడా అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే వంద శాతం సీట్లకు అనుమతులు లభించి ఉండేవన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నిర్మాణాల నిలుపుదలప్రై వేట్‌పరం చేయడంలో భాగంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను సైతం కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు కళాశాలలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కళాశాలల నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లనుందని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదోని, పెనుకొండ కళాశాలల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిపివేయాలని కర్నూలు సర్కిల్ ఏపీఎంఎస్ఐడీసీ ఎస్ఈ లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా..2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు.మోసం చేశారు..నీట్ యూజీలో నేను 593, నా సోదరి 555 స్కోర్ చేశాం. గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్లు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా సీట్ రావడం కష్టంగా ఉంది. గతేడాది ఏపీకి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఈసారి కూడా 750 సీట్లు అదనంగా వస్తే వైద్య విద్య అవకాశాలు పెరిగి మా కల నెరవేరుతుందని భావించాం. కానీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాలేదు. పులివెందుల కాలేజీకి 50 సీట్లతో అనుమతులు వచ్చాయని ఎన్ఎంసీ ప్రకటించినా కౌన్సెలింగ్‌లో చూపించడం లేదు. దీనివల్ల నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ మాట నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేసింది.– నల్లగట్ల సుధీష్ రెడ్డి, రాజంపేట, అన్నమయ్య జిల్లా -
స్థానికంగా ఉంటే అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసితులైన పిటిషనర్లు 85 శాతం స్థానిక కోటా కింద అర్హులేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని.. అందువల్ల తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది. వైద్యవిద్య ప్రవేశాల కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 33లోని నిబంధన 3 (ఏ)ను సవాల్ చేస్తూ దాఖలైన 53 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం ఈ మేరకు తీర్పు చెప్పింది. ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల మేరకు ప్రతి విద్యార్ధికి స్థానిక కోటా వర్తింపజేయాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో దాదాపు 130 మంది విద్యార్థులకు ఊరట లభించనుంది. టెన్త్, ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలన్న నిబంధనతో.. ‘జీవో 33లోని నిబంధన 3 (ఏ)ను సవాల్ చేస్తూ హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన కల్లూరి నాగనరసింహ అభిరామ్‌తోపాటు మరికొందరి తరఫున న్యాయవాది కొండపర్తి కిరణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జారీ చేసిన జీవో 33 చట్టవిరుద్ధం. ఈ జీవో ప్రకారం విద్యార్థులు 9, 10తోపాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలి. పరీక్షలు ఇక్కడే రాయాలి. ఏడేళ్లు స్థానికంగా ఉండాలి. ఇది చట్టవిరుద్ధం. లోకల్‌గా పరిగణించేందుకు కొత్త నిబంధనలు తెస్తూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన జీవోను కొట్టేయాలి’అని పిటిషనర్లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివారని స్థానికులు కాదంటున్నారు.. ‘చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివారు. వారంతా తెలంగాణలోనే పుట్టి టెన్త్ వరకు ఇక్కడే చదివినా జీవో ప్రకారం వారికి స్థానికత వర్తించదు. అదే తెలంగాణలో పుట్టకపోయినా ఆ నాలుగేళ్లు ఇక్కడే చదివిన వారికి స్థానికత వర్తిస్తుంది. ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. ఫిబ్రవరి 9న నీట్‌కు నోటిఫికేష¯న్Œ వెలువడగా మే 5న పరీక్ష, జూలై 26 ఫలితాలు వెలువడ్డాయి. కానీ ఫలితాల ముందు ప్రభుత్వం జీవో జారీ చేయడం చట్టవిరుద్ధం’అని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, డీవీ సీతారామమూర్తి వాదించారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారున్నారని ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదించారు. నీట్ దరఖాస్తులో అభ్యర్థులే ఆ విషయాన్ని పేర్కొన్నారన్నారు. కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిబంధనలనే ఇక్కడ తీసుకొచ్చామని చెప్పారు. మార్గదర్శకాల మేరకు అనుమతించండి.. ‘తెలంగాణకు చెందిన విద్యార్థులకే స్థానిక కోటా వర్తింపజేయాలని ప్రభుత్వం తెచ్చిన జీవో 33లోని నిబంధన 3 (ఏ) ఉద్దేశం మంచిదే. అయితే తెలంగాణకు చెందిన విద్యార్థి ఇతర రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానికత నిరాకరించడం సరికాదు’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం రూపొందించే ‘నివాస’మార్గదర్శకాల మేరకు ప్రతి కేసును పరిశీలించాలని.. అర్హులైన పిటిషనర్లను స్థానిక కోటా కింద కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కాళోజీ వర్సిటీని ఆదేశించింది. -
స్థానికత నిబంధనను పక్కకు పెట్టి.. దరఖాస్తులు స్వీకరించండి
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ప్రస్తుతానికి స్థానికత నిబంధనల అంశాన్ని పక్కకు పెట్టి పిటిషనర్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. నేటితో దరఖాస్తుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో పిటిషనర్లు తమ వద్ద ఉన్న ఫార్మాట్లో స్థానికత సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. పిటిషనర్లు తమ పిటిషన్ వివరాలను సంబంధిత అధికారులకు ఇవ్వాలని చెప్పింది.ఈ నెల 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుతాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ‘ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల్లో తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీల అడ్మిషన్ నిబంధనలు– 2017లోని రూల్ 3(ఏ)ను సవాల్ చేస్తూ హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన కల్లూరి నాగ నరసింహా అభినామ్తోపాటు మరో 13 మంది తరఫున న్యాయవాది కొండపర్తి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ గత నెల 19న రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో 33 చట్టవిరుద్ధం. జీవో ప్రకారం విద్యార్థులు 9, 10తోపాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలి. పరీక్షలు ఇక్కడే రాయాలి. ఇది చట్టవిరుద్ధం. స్థానికతపై కొత్త రూల్స్ అంటూ వైద్యారోగ్య శాఖ జారీ చేసిన ఈ జీవోను కొట్టివేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం ఇరుపక్షాల వాద నలు వినింది. ప్రస్తుతానికి స్థానికత నిబంధనను పక్క కుపెట్టి దరఖాస్తులు స్వీకరించాలని, తుది తీర్పునకు లోబడి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. -
పునః సమీక్ష జరగాలి!
కొద్దివారాలుగా కొనసాగుతున్న వివాదం కీలక ఘట్టానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కళాశాలల్లో ప్రవేశం కోసం ఏటా జరిపే జాతీయస్థాయి పరీక్ష ‘నీట్’లో అక్రమాలు జరిగాయన్న అంశంపై విచారణ చేస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నపత్రాల లీకైనమాట నిజమంటూనే, వ్యవస్థీకృతంగా భారీస్థాయిలో లీకులు జరగనందున పునఃపరీక్ష జరపాల్సిన అవసరం లేదని తేల్చే సింది. ‘నీట్’ వివాదంతో నెలన్నరగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్న విద్యార్థులకూ, వారి తల్లితండ్రులకూ ఇది ఒకింత ఊరట, మరింత స్పష్టత. అభ్యర్థుల మానసిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని, దాదాపు 23 లక్షల మందికి పైగా హాజరైన పరీక్షను మళ్ళీ నిర్వహించాలని అనుకోకపోవడం మంచిదే. అయితే పేపర్ లీకులు, ఒకదాని బదులు మరొక ప్రశ్నపత్రం ఇవ్వడం, ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయడం, నిర్ణీత కేంద్రాల నుంచి మునుపెన్నడూ లేనంత మంది టాపర్లుగా అవతరించడం – ఇలా ‘నీట్’ నిర్వహణలో ఈసారి వివిధ స్థాయుల్లో జరిగిన అవకతవకలు అనేకం. వీటన్నిటితో వ్యవస్థపై ఏర్పడ్డ అపనమ్మకాన్ని తొలగించడం ఎలా అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. మొదట అసలు లోపాలు లేవని వాదించి, ఆనక తప్పుల్ని అంగీకరించినా కీలక చర్యలు చేపట్ట డానికి కార్యనిర్వాహక వ్యవస్థ వెనకాడడం చూశాం. చివరకు న్యాయవ్యవస్థ జోక్యంతో ప్రక్షాళన అవసరమనే అంశం చర్చకు వచ్చింది. సుప్రీమ్‌కోర్ట్ ఆదేశాలతో ‘జాతీయ పరీక్షా సంస్థ’ (ఎన్టీఏ) ‘నీట్’ పరీక్షా ఫలితాలను సవరించి, గురువారం ప్రకటించాల్సి వచ్చింది. భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నకు రెండు జవాబులూ సరైనవేనంటూ విద్యార్థులకు ఈ ఏటి పరీక్షలో గ్రేస్ మార్కులు కలిపిన ఘనత ‘నీట్’ది. అత్యధిక సంఖ్యలో టాపర్లు రావడానికీ అదే కారణమైంది. సదరు వివాదాస్పద ప్రశ్నకు సరైన జవాబు ఒకటేనంటూ సుప్రీమ్ జోక్యం తర్వాత ఐఐటీ – ఢిల్లీ నిపుణుల సంఘం ఖరారు చేసింది. దాంతో అయిదేసి మార్కులు కోతపడి, దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల మార్కులు మారాయి. జూన్ 4న తొలుత ఫలితాలు ప్రకటించినప్పుడు టాప్ స్కోరర్ల సంఖ్య 61 కాగా, ఇప్పుడీ వివాదాలు, విచారణలు, మార్పుల తర్వాత అది 17కు తగ్గింది. మార్కులు, దరి మిలా ర్యాంకుల్లో మార్పులతో తాజా జాబితాను ఎన్టీఏ విడుదల చేయాల్సి వచ్చింది. పునఃపరీక్షఉండదని కోర్ట్ తేల్చేయడంతో, సవరించిన ర్యాంకుల్ని బట్టి ఇప్పుడిక ప్రవేశాలు జరVýæనున్నాయి. ఎంబీబీఎస్ చదువు కోసం పెట్టిన ఈ దేశవ్యాప్త ‘నీట్ – యూజీ’ పరీక్షలు లోపభూయిష్ఠమనీ, మరీ ముఖ్యంగా స్థానిక విద్యార్థుల అవకాశాలకు హానికరమనీ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన ‘నీట్’ వద్దంటూ తమిళనాడు కొన్నేళ్ళుగా పోరాడుతుంటే, పశ్చిమ బెంగాల్ సైతం బుధవారం గొంతు కలిపింది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ సైతం ‘నీట్’ వద్దని గురువారం బిల్లును ఆమోదించింది. సొంతంగా రాష్ట్రస్థాయి మెడికల్ ఎంట్రన్ టెస్ట్ పెడతామంటూ తీర్మానించింది. అది చట్టపరంగా సాధ్యమేనా, కేంద్రం, సుప్రీమ్ కోర్ట్ ఏమంటాయన్నది పక్కన పెడితే, ‘నీట్’ పట్ల పెరుగుతున్న అపనమ్మకం, రాష్ట్రాల్లో అసంతృప్తికి ఇది నిదర్శనం. అసలు ఒకప్పుడు ఎక్కడికక్కడ రాష్ట్రస్థాయి ప్రవేశపరీక్షలే ఉండేవి. దేశంలో వైద్యవిద్య చదవదలచిన పిల్లలు ప్రతి రాష్ట్రంలో పరీక్షలు రాసే ఈ శ్రమ, ఖర్చును తప్పించడం కోసం జాతీయస్థాయిలో అందరికీ ఒకే పరీక్ష ‘నీట్’ను ప్రవేశపెట్టారు. మంచి ఆలోచనగా మొదలైనా, ఆచరణలో అది అవకతవకలకు ఆస్కారమిస్తూ, విద్యార్థుల్ని మరింత ఒత్తిడికి గురి చేసేదిగా మారడమే విషాదం. మళ్ళీ పరీక్ష జరపనక్కర లేదని సుప్రీమ్ ప్రకటించింది కానీ, అసలు తప్పులేమీ జరగలేదని మాత్రం అనలేదని గుర్తించాలి. ఇప్పటికైతే పాట్నా, హజారీబాగ్ – ఈ రెండుచోట్లా పేపర్ లీకైనట్టు కోర్టు నిర్ధరించింది. అలాగే, మరిన్ని వివరాలు తవ్వి తీసేందుకు సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందనీ స్పష్టం చేసింది. విద్యార్థుల కౌన్సిలింగ్ వగైరా కొనసాగించవచ్చని అనుమతిస్తూనే, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురవకుండా, పరీక్షల నిర్వహణ మరింత మెరుగ్గా ఎలా నిర్వహించాలన్న దానిపై మార్గదర్శకాలు రానున్నట్టు పేర్కొంది. అభ్యర్థుల బంగారు భవిష్యత్తు ఆధారపడిన పరీక్ష లపై ఎన్టీఏలో నిర్లక్ష్యం ఎంతగా పేరుకుందో ఇటీవలి ‘నీట్’, యూజీసీ– నెట్ వివాదాలే నిదర్శనం. పరీక్షా కేంద్రాల ఎంపిక మొదలు కీలకమైన పనిని బిడ్డింగ్‌లో అవుట్ సోర్సింగ్‌కు అప్పగించడం దాకా లోపాలు అనేకం. అసలు ముందుగా ఎన్టీఏను ప్రక్షాళన చేయాలంటున్నది అందుకే. ‘నీట్’ సంగతే తీసుకున్నా పెన్ను– పేపర్ల విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత ఆఫ్‌లైన్ పరీక్షకు మారాలని నిపుణుల మాట. ‘జేఈఈ’లో లాగా రెండంచెల పరీక్షా విధానం ఉండాలనే సూచనా వినిపిస్తోంది. సంపూర్ణ అధ్యయనం, సమగ్ర చర్చతో తగిన చర్యలు చేపట్టడం ఇక భవిష్యత్ కార్యాచరణ కావాలి. అసలు ఇవాళ దేశంలో అనేకచోట్ల చదువుల్లో పరీక్షా పత్రాల మొదలు పోటీపరీక్షల ప్రశ్నపత్నాల వరకు అన్నీ విపణిలో యథేచ్ఛగా లభిస్తున్న దుఃస్థితి. ఈ లీకుల జాడ్యాన్ని అరికట్టకపోతే ప్రతిభకు పట్టం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. రకరకాల పేపర్ లీకులతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బిహార్ సైతం ఎట్టకేలకు లీకు వీరులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వ పరీక్షల (అక్రమాల నిరోధక) బిల్లును అసెంబ్లీలో బుధవారం ఆమోదించింది. అన్నిచోట్లా ఇలాంటి కఠిన చట్టాలు అవస రమే. అయితే, అమలులో చిత్తశుద్ధి, అంతకన్నా ముందు ఆ చట్టాల దాకా పరిస్థితిని రానివ్వ కుండా లీకులకు అడ్డుకట్ట వేయడం ముఖ్యం. ‘నీట్’ పునర్నిర్వహణకు కోర్టు ఆదేశించకున్నా, తప్పులు జరిగాయని తేటతెల్లమైంది గనక మన పరీక్షా వ్యవస్థలు, విధానాలపై పునఃసమీక్ష, ప్రక్షాళనకు దిగాలి. అదీ పారదర్శకంగా జరగాలి. ‘నీట్’ లీకువీరులకు కఠిన శిక్షతో అందుకు శ్రీకారం చుట్టాలి. -
Supreme Court: రెండిట్లో ‘సరైన’ సమాధానం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్–యూజీ, 2024 పరీక్షలో పేపర్ లీకేజీ ఉదంతంపై పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టులో సోమవారం ఒక ప్రశ్నపై తీవ్రమైన చర్చ జరిగింది. ఒక ప్రశ్నకు ఇచి్చన ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయని, వీటిల్లో ఒకటి ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులేసి రెండోది ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులు వేయలేదని దీనిపై తేల్చాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జసిŠట్స్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం విచారించింది. రెండింటిలో సరైన సమాధానం ఏది? అనే దానిపై స్పష్టత వస్తే అభ్యర్థుల తుది జాబితా మెరిట్ లిస్ట్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై తొలుత పిటిషన్ల తరఫు న్యాయవాది వాదించారు. ‘‘ఈ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయతి్నంచిన అభ్యర్థుల్ని మూడురకాలుగా విడగొట్టాలి. ఎందుకంటే రెండు ‘సరైన’ సమాధానాల్లో ఒకదానికి ఎంచుకున్న వాళ్లకు నెగిటివ్ మార్కింగ్ కారణంగా ఐదు మార్కులు పోయాయి. రెండో సమాధానం ఎంచుకున్న వాళ్లకు నాలుగు మార్కులు పడ్డాయి. రెండింటిలో ఏది కరెక్టో తేల్చుకోలేక, నెగిటివ్ మార్కింగ్ వల్ల మార్కులు పోతాయన్న భయంతో సమాధానం రాయకుండా వదిలేసిన వాళ్లూ ఉన్నారు’’ అని న్యాయవాది వివరించారు. దీంతో ధర్మాసనం స్పందించింది. ‘‘ ఫిజిక్స్ విభాగంలో అణువుకు సంబంధించిన ప్రశ్నలో నాలుగు ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయన్న వాదనల నడుమ అసలైన సమాధానాన్ని తేల్చాల్సిన సమయమొచి్చంది. అందుకోసం ముగ్గురు విషయ నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేయండి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు మాకు సరైన సమాధానమేంటో నివేదించండి’’ అని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌కు చేరేలా చూడాలని సుప్రీంకోర్టులో సెక్రటరీ జనరల్‌కు ధర్మాసనం సూచించింది. ‘పరీక్ష నిర్వహణలో లోపాలు చూస్తుంటే ఇది వ్యవస్థాగత వైఫల్యమని తెలుస్తోంది. గుజరాత్లో ఒక విద్యార్థి 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడుగానీ నీట్ పరీక్షలో చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కొన్ని కేంద్రాల్లో అడ్రస్ వెరిఫికేషన్ చేయలేదు. మరి కొన్నింటిలో సీసీటీవీ కెమెరాలే లేవు’ అని లాయర్ నరేందర్ హూడా వాదించారు.కొలిక్కి వస్తున్న నీట్–యూజీ వివాదం! నీట్ యూజీ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని దాదాపు 40 పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. పరీక్ష రద్దు చేయాలంటూ, రద్దు చేయొద్దంటూ దాఖలు చేసిన వారి వాదనలు సుప్రీంకోర్టులో పూర్తయ్యాయి. ఇక కేంద్రం తరఫు వాదనలు మిగిలి ఉన్నాయి. మంగళవారం కేంద్రం వాదనలు పూర్తయితే త్వరగా తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. -
పిల్లల భవితకు పెద్ద పరీక్ష!
సంస్కరణ అనుకొని తెచ్చినది తీరా సమస్యగా మారడమంటే ఇదే. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం పదకొండేళ్ళ క్రితం అప్పటి యూపీఏ సర్కార్ తెచ్చిన జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తోంది. పేపర్ లీకులు, ఇతర అక్రమాలు సహా అనేక వివాదాలు ముసురుకున్న తాజా ‘నీట్ – యూజీ 2024’ వ్యవహారమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అవకతవకలకు ఆలవాలమైన జాతీయ పరీక్షా ఏజెన్సీ (ఎన్టీఏ) – కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరుతున్న అభ్యర్థులు – అందుకు ససేమిరా అంటున్న కేంద్రం – సత్వర నిర్ణయానికి బదులు సన్నాయి నొక్కులు నొక్కుతున్న సుప్రీమ్ కోర్ట్... వీటన్నిటి మధ్య నీట్ ఓ అంతులేని కథ. మళ్ళీ పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీమ్ గురువారం ప్రకటించడంతో ఈ సీరియల్‌కు సశేషం కార్డు పడింది. ఈసారి వైద్యవిద్యలో ప్రవేశాలు ఆశించిన 24 లక్షలమందితో పాటు అర్హత సంపాదించిన 13 లక్షలమంది పరిస్థితి అగమ్య గోచరమైంది. లీక్ కథ బయటకొచ్చి ఇన్ని వారాలైనా, పునఃపరీక్ష మినహా మరో మార్గం కనబడట్లేదు. ఒకపక్క కోర్ట్ నిర్ణయం జాప్యమవుతుండగా... మరోపక్క రీ–టెస్ట్‌పై సంబంధిత పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నిజానికి, ఉత్తరాదిన కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రం లీక్ సహా అనేక అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే మీడియాలో బాహాటంగా వెల్లడైంది. సాక్షాత్తూ సుప్రీమ్ సైతం లీకేజీ నిజమేనని అభిప్రాయపడింది. కాకపోతే, వ్యవస్థీకృతంగా లీక్ జరిగిందా, ఏ మేరకు ఎలా జరిగింది, భవిష్యత్తులో కట్టుదిట్టంగా పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్న వివరాలు ఇవ్వాలంటూ కేంద్రాన్నీ, ఎన్టీఏనూ జూలై 8న ఆదేశించింది. అందుకు జవాబిచ్చే క్రమంలో కేంద్ర సర్కార్ పాత పరీక్ష రద్దు చేసి కొత్త పరీక్ష పెట్టడం హేతుబద్ధం కాదు పొమ్మంటోంది. అదేమంటే, విస్తృత స్థాయిలో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవంటూ ఐఐటీ – మద్రాస్ తాజాగా ఇచ్చిన సమగ్ర నివేదికను వత్తాసు తెచ్చుకుంటోంది. సహజంగానే ఎన్టీఏ సైతం కేంద్ర సర్కార్ వాదననే సమర్థిస్తోంది. పైగా, నీట్ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో లీకైనట్టు వచ్చిన వీడియోనే ఫేక్ అనేసింది.ఏ విషయంలోనైనా అనుమానాలు రాకూడదు. వస్తే సమూలంగా నివృత్తి చేయాలి. అంతేకానీ అనుమానం పెనుభూతమైన వేళ... పాలకులు, ప్రభుత్వ సంస్థలు భీష్మించుకు కూర్చుంటే ఎలా? పైగా, లక్షలాది విద్యార్థుల భవితతో, వారి కుటుంబాల మానసిక ఆరోగ్యంతో ముడిపడిన అంశాన్ని వారి దృక్కోణం నుంచి సానుభూతితో చూడకపోవడం మరీ ఘోరం. నీట్ ఫలితాల్లో ఏవైనా నగరాల్లో, కేంద్రాల్లో పెద్దయెత్తున విద్యార్థులకు అనుచిత లబ్ధి చేకూరిందా అని తేల్చడం కోసం ఉన్నత విద్యాశాఖ అభ్యర్థన మేరకు ఐఐటీ– మద్రాస్ డేటా ఎనాలసిస్ చేసింది. మంచిదే! 2023, 2024ల్లోని టాప్ లక్షా నలభై వేల ర్యాంకులను ఈ ఎనాలసిస్‌లో భాగంగా విశ్లేషించారట. ఎక్కడా ఏ అక్రమం జరగలేదనీ, టాప్ ర్యాంకులు అన్ని నగరాలకూ విస్తరించాయనీ ఐఐటీ మాట. ఇక్కడే తిరకాసుంది. ప్రత్యేకించి ఈ ఏటి పరీక్షలో కొన్ని కేంద్రాల్లో చేతులు మారిన డబ్బులు, ముందస్తు లీకులు, డబ్బులిచ్చిన పిల్లలకు జవాబుల ప్రత్యేక శిక్షణ జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఆ నిర్ణీత కేసులు వదిలేసి సర్వసాధారణంగా నీట్ నిర్వహణలో అక్రమాలే లేవంటూ క్లీన్చిట్ ఇస్తే సరిపోతుందా? గోధ్రా, పాట్నా లాంటి కొన్ని కేంద్రాలకే లీక్ పరిమితమైందన్న ఎన్టీఏ వాదన సరైనది కాదు. భౌగోళిక సరిహద్దుల్ని చెరిపేసిన సోషల్ మీడియా శకంలో ఒకచోట లీకైన పేపర్ అక్కడికే ఆగుతుందనుకోవడం అజ్ఞానం. పైగా రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, బెంగాల్లోనూ లీకువీరుల అరెస్టులే నిదర్శనం. సీబీఐ దర్యాప్తును బట్టి దోషులైన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హామీ ఇస్తోంది. అక్రమ ర్యాంకర్లపై చర్యలు సరే... వాళ్ళ నేరం వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బంది పడి, ర్యాంకుల్లో వెనకబడ్డ లక్షలాది విద్యార్థుల మాటేమిటి? వారికి న్యాయం చేసేదెట్లా? ఇకపై పేపర్, పెన్ను వాడే ఓఎంఆర్ విధానం వదిలి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మారతారట. ప్రైవేట్ ఏజెన్సీలపై అతిగా ఆధారపడే ఆ పరీక్షలూ అంత నిర్దుష్టమేమీ కాదని ఎన్టీఏనే నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష రద్దుతో ఇటీవలే తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో పరీక్షా విధానమే కాదు, ఎన్టీఏ సహా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళించడం అవసరం. రీ–టెస్ట్ పెట్టాలా వద్దా అన్న చర్చ కన్నా అది ఇంకా కీలకం. నిజానికి, ప్రతిభకు పెద్ద పీట వేయడానికి ఉద్దేశించిన పరీక్షా వ్యవస్థలు లోపభూయిష్ఠంగా మారుతున్న తీరు విచారకరం. చదువులు, ప్రవేశ పరీక్షల మొదలు ఉద్యోగాల పోటీ పరీక్షల దాకా అన్నిటి మీదా నీలినీడలే. ప్రశ్నపత్రాల లీకుల దగ్గర నుంచి జవాబు పత్రాల మూల్యాంకనంలో లోటుపాట్ల దాకా ప్రతి స్థాయిలోనూ నిత్యం వివాదమే. గత 7 ఏళ్ళలో, 15 రాష్ట్రాల్లో 70 లీకులతో 1.4 కోట్లమంది బాధితులే. వెరసి పరీక్షల ప్రాథమిక లక్ష్యమే దెబ్బతింటోంది. ఆగి, ఆలోచించాల్సిన తరుణమిది. మన పరీక్షల విధానం, వాటి ప్రాథమిక లక్ష్యం, ప్రయోజనాలపైన మథనం జరపాల్సి ఉంది. జ్ఞాపకశక్తిని పరీక్షించే పద్ధతుల నుంచి పక్కకు వచ్చి, జ్ఞానాన్ని పరిశీలించే మార్గాల వైపు ఇప్పటికైనా మన పరీక్షా వ్యవస్థలు మళ్ళాల్సి ఉంది. ప్రతి పరీక్షనూ వ్యాపారంగా మారుస్తూ, తప్పుడు మార్గాలు వెతుకుతున్న చీడపురుగుల్ని ఏరివేసేందుకు ప్రభుత్వాలు ఉపక్రమించాలి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి పాఠశాల బోర్డ్ దాకా పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధానికి జూన్ 21 నుంచి పార్లమెంట్ ఓ కొత్త చట్టం తెచ్చింది. అది ఏ మేరకు అవతవకల్ని అరికడుతుందో చూడాలి. ఏమైనా, పరీక్ష జ్ఞానానికి గీటురాయిగా ఉండాలే కానీ, ప్రతిసారీ పిల్లలకు శిక్షగా మారితేనే కష్టం. -
యూజీసీ–నెట్ రద్దు
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన నీట్ పరీక్షలో బయల్పడిన అవకతవకల నీలినీడలు యూజీసీ–నెట్ పరీక్ష పైనా పడ్డాయి. దీంతో మంగళవారం నిర్వహించిన యూజీసీ–నెట్ పరీక్షను రద్దుచేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కరోజులోనే ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్(ఓఎంఆర్) విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్టణాల్లోని 1,205 పరీక్షా కేంద్రాల్లో యూజీసీ–నెట్ పరీక్ష మంగళవారం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో మళ్లీ నెట్ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ నెట్ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకత, సమగ్రత, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. పరీక్షలో అక్రమాలు జరిగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం మేరకు ‘యూజీసీ–నెట్ జూన్ 2024’ను రద్దుచేస్తున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది నెట్ పరీక్షకు 11,21,225 మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం పూర్తయిన ఈ పరీక్షను 9,08,580 మంది అభ్యర్థులు రాశారు. నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నెట్ పరీక్షలో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కు ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ మేరకు పరీక్షకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఈ వివరాలను యూజీసీకి పంపింది. ఐ4సీలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలైటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది. ఐ4సీ అనేది కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది. నీట్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే ఈ నెట్ పరీక్షనూ చేపట్టింది. యూజీసీ–నెట్ ఎందుకు రాస్తారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్– నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్( యూజీసీ–నెట్) పరీక్షలో ఉత్తీర్ణులైతే సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనకు అవకాశం లభిస్తుంది. పరిశోధన వైపు వెళ్లొచ్చు లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనారంగం వైపూ వెళ్లొచ్చు. దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరొచ్చు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో నడిచే ప్రయోగ, పరిశోధనాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది. ఇలా శాస్త్రవేత్తగా ఎదగొచ్చు. పీహెచ్డీ చేసేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వరంగ ఓఎన్జీసీ వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. నెట్‌కు క్వాలిఫై అయిన వారికి విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. 80కిపైగా సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు. -
NEET UG 2024: ‘నీట్’ గ్రేసు మార్కులు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్‌తోపాటు ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)–2024లో 1,563 మంది అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దుచేసి, వారికి మళ్లీ పరీక్ష నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నియమించిన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఆయా అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం చెప్పిన విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. 1,563 మంది అభ్యర్థుల ప్రస్తుత స్కోరు కార్డు రద్దుచేసి, వాస్తవ మార్కులు కేటాయించి, జూన్ 23న వారికి మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామన్న ఎన్టీఏ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయమైనవి, సహేతుకమైనవి, సమర్థనీయమైనవి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మే 5న నిర్వహించిన నీట్–యూజీ పరీక్షలో వివిధ కారణాలతో 1,563 మందికి గ్రేసు మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేయడంతోపాటు నీట్–యూజీ–2024ను మొత్తంగా రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కనూ అగర్వాల్ వాదనలు వినిపించారు. 1,563 మందికి ఇచ్చిన గ్రేసు మార్కులు రద్దుచేసి, వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నీట్‌కు హాజరైన అభ్యర్థుల్లో భయాందోళన తొలగించడానికి ఎన్టీఏ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 1,563 మంది అభ్యర్థుల స్కోరు కార్డును రద్దు చేయాలంటూ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. గ్రేసు మార్కులు రద్దయిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామని ఎన్టీఏ తరఫు సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ జూలై 6 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. గ్రేసు మార్కులు రద్దయినవారికి రెండు ఐచి్ఛకాలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు మరోసారి పరీక్ష రాయవచ్చు లేదా గ్రేసు మార్కులు రద్దయిన తర్వాత వచ్చిన వాస్తవ మార్కులతో కౌన్సిలింగ్‌కు హాజరు కావొచ్చని వెల్లడించింది. జూలై 6న ప్రారంభం కానున్న కౌన్సెలింగ్‌ను నిలిపివేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం.. ‘‘కోర్టు ముందుంచిన అన్ని అంశాలనూ పరిశీలించాం. జూన్ 12న ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయబద్ధంగా, సహేతుకంగా, సమర్థనీయంగా ఉన్నాయి. 1,563 మందికి మళ్లీ నీట్ నిర్వహించడానికి ఎన్టీఏకు అనుమతిస్తున్నాం. ఈ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం. పరిహార మార్కులకు సంబంధించి అన్ని అంశాలను మూసివేసినట్లే. ఇతర సమస్యలకు సంబంధించి ప్రతివాదుల స్పందనకు రెండు వారాల గడువు ఇస్తున్నాం. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు వెలువరించింది. అసలు ఏమిటీ వివాదం? ఈ ఏడాది నీట్–యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు మారడంతోపాటు మేఘాలయా, హరియాణా, ఛత్తీస్‌గఢ్, సూరత్, చండీగఢ్‌లోని మొత్తం ఆరు ఎగ్జామ్ సెంటర్లలో ఓఎంఆర్ షీట్లు చిరిగిపోవడం, ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ఇవ్వడం, తద్వారా పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1,563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేసు మార్కులు ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించారు. వీరందరికీ 720కి 720 మార్కులు రావడం గమనార్హం. ఇలా జరగడం ఎన్టీఏ చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది కేవలం ఇద్దరికే ఫస్టు ర్యాంకు వచ్చింది. ఈసారి ఫస్ట్ట్ ర్యాంకు సాధించిన 67 మందిలో గ్రేసు మార్కులతో ఫస్టు ర్యాంకు కొట్టినవారు 50 మంది ఉన్నారు. ఫిజిక్స్ ఆన్సర్ కీలో మార్పుల వల్ల 44 మంది, ఎగ్జామ్‌లో సమయం కోల్పోవడం వల్ల ఆరుగురు గ్రేసు మార్కులు పొందారు. కొందరికి ఇచ్చిన గ్రేసు మార్కుల వల్ల తాము నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఈ మార్కుల కేటాయింపులో డబ్బు చేతులు మారిందని విమర్శించారు. కోర్టును ఆశ్రయించారు. అలాగే పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని, ఎగ్జామ్‌లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చివరకు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే అభ్యర్థులకు గ్రేసు మార్కులు ఇచ్చామని, ఇందులో తమ సొంత నిర్ణయం ఏమీ లేదని నీట్‌ను నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. అభ్యర్థుల్లో పోటీతత్వం పెరగడం వల్లే ఈసారి ఎక్కువ మందికి ఫస్టు ర్యాంకు వచ్చిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొంటోంది. మరోవైపు, అభ్యర్థులకు ఇచ్చిన గ్రేసు మార్కులను పునఃసమీక్షించడానికి కేంద్ర విద్యా శాఖ యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. -
ఎంబీబీఎస్‌లో ఏ ర్యాంక్‌కు ఎక్కడ సీటొస్తుంది?
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2024 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జాతీయ స్థాయిలో 23.33 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా 13.16 లక్షల మంది అర్హత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే అర్హులైన విద్యార్థుల సంఖ్య 1.70 లక్షలు పెరిగింది. రాష్ట్రంలో 64,931 మంది పరీక్ష రాయగా, 43,858 మంది అర్హత సాధించారు. కాగా, జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కళాశాలలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కళాశాలలో సీటు వచ్చే అవకాశాలున్నాయో విద్యార్థులు అంచనా వేసుకుంటున్నారు. ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు కళాశాలల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,935 సీట్లు 16 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే అవకాశం కల్పిస్తోంది. అందరి చాయిస్ ఆంధ్ర కళాశాల రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కళాశాలలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కళాశాలలో గత ఏడాది ఎస్టీ విభాగంలో 490 స్కోర్‌తో 118377 ర్యాంక్ సాధించిన విద్యారి్థకి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 545తో 67614 ర్యాంక్, బీసీ–ఏలో 596తో 31456, బీసీ–బి 612తో 22315, బీసీ–సిలో 591తో 34134, బీసీ–ఈలో 548తో 24384, ఓసీ కేటగిరీలో 621తో 17976, ఈడబ్ల్యూఎస్‌లో 608తో 24384 ర్యాంకు వరకు సీట్లు పొందారు. -
నీట్ ‘ఎస్టీ’ టాపర్ మనవాడే
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్’పరీక్షలో ఎస్టీ కేటగిరీలో ఆలిండియా టాప్ ర్యాంకర్‌గా తెలంగాణకు చెందిన గుగులోత్ వెంకట నృపేష్ నిలిచాడు. రెండో ర్యాంకర్‌గా లావుడ్య శ్రీరామ్ నాయక్ ప్రతిభ చాటాడు. టాప్ ర్యాంకర్‌గా నిలిచిన నృపేష్‌కు 720 మార్కులకుగాను, 715 వచ్చాయి. జాతీయస్థాయిలో అతను జనరల్ కేటగిరీలో 167వ ర్యాంకు సాధించాడు. అలాగే తెలంగాణ రాష్ట్రస్థాయి టాపర్‌గా అనురాన్ ఘోష్ ప్రతిభ చాటాడు. అతను జాతీయస్థాయిలో జనరల్ కేటగిరీలో 77వ ర్యాంకు సాధించాడు. ఆలిండియా టాప్ ర్యాంకర్‌గా నిలిచిన మహారాష్ట్రకు చెందిన వేద్ సునీల్ కుమార్ షిండే సహా 67 మందికి ఫస్ట్ ర్యాంకులు ప్రకటించారు. ఫస్ట్ ర్యాంకర్‌కు 99.997129 పర్సంటైల్ రాగా, తెలంగాణ ఫస్ట్ ర్యాంకర్, జాతీయస్థాయి 77వ ర్యాంకర్ అనురాన్ ఘోష్‌కు 99.996614 పర్సంటైల్ వచ్చింది. ఎస్టీ టాపర్ నృపేష్‌కు 99.987314, అదే కేటగిరీలోని రెండో ర్యాంకర్ లావుడ్య శ్రీరామ్ నాయక్‌కు 99.969357 పర్సంటైల్‌లు వచ్చాయి. గతంలో తెలంగాణ నుంచి టాప్ ర్యాంకర్లు ఎక్కువగా ఉండేవారనీ, ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో ర్యాంకర్లు లేరని ఒక విద్యా నిపుణుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి 47,371 మంది అర్హత ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 5న నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. గతేడాది దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 20.38 లక్షల మంది హాజరు కాగా, ఈసారి 23.33 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది 11.45 లక్షల మంది అర్హత సాధించగా, ఈసారి 13.16 లక్షల మంది అర్హత సాధించడం విశేషం. రాసినవారూ అర్హత సాధించివారూ పెరిగారు. తెలంగాణ నుంచి గతేడాది 72,842 మంది హాజరుకాగా, 42,654 మంది అర్హత సాధించారు. ఈసారి 77,849 మంది హాజరు కాగా, 47,371 మంది అర్హత సాధించారు. అర్హత మార్కు జనరల్ కేటగిరీ 164 ఈసారి అర్హత మార్కు పెరిగింది. నీట్ పరీక్ష సులువుగా ఉండటం వల్లే ఈసారి అర్హత మార్కు పెరిగిందని నిపుణులు అంటున్నారు. గతేడాది జనరల్ కేటగిరీ/ ఈడబ్ల్యూఎస్‌లో అర్హత మార్కు 137 ఉండగా, ఈసారి అది 164 ఉండటం గమనార్హం. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీహెచ్, ఎస్సీ అండ్ పీహెచ్‌ల అర్హత మార్కు గతేడాది 107గా ఉండగా, ఈసారి 129గా ఉంది. అన్ రిజర్వుడు/ఈడబ్ల్యూఎస్ అండ్ పీహెచ్‌ల అర్హత మార్కు గతేడాది 121 ఉండగా, ఈసారి 140గా ఉంది. ఎస్టీ అండ్ పీహెచ్‌లో గతేడాది అర్హత మార్కు 108 ఉండగా, ఈసారి 129గా ఉంది. గతేడాది 450 మార్కులు వచ్చిన వారికి జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో సీటు రాగా, ఈసారి 500 మార్కులు దాటిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీటు రావొచ్చని శ్రీచైతన్య సంస్థల డీన్ శంకర్రావు విశ్లేషించారు. గతేడాది 600 మార్కులు వచ్చిన వారికి ఆలిండియా ర్యాంకు 30 వేలు ఉండగా, ఈసారి అదే మార్కు వచ్చినవారికి 82 వేల ర్యాంకు రావడం గమనార్హం. అంతేకాదు గతేడాది 720కి 720 మార్కులు వచ్చినవారు దేశవ్యాప్తంగా ఇద్దరు మాత్రమే ఉండగా, ఈసారి 67 మంది ఉన్నారు. త్వరలో రాష్ట్రస్థాయి ర్యాంకులు ఆలిండియా ర్యాంకులు ప్రకటించిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)... తదుపరి రాష్ట్రాల వారీగా అభ్యర్థుల జాబితాను తయారు చేస్తుంది. అనంతరం ఆ డేటాను రాష్ట్రాలకు పంపిస్తుంది. ముందుగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆలిండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. అభ్యర్థులు తమ రాష్ట్రానికి దరఖాస్తు చేసినప్పుడు, వారు రాష్ట్ర కేటగిరీ జాబితా ప్రకారం విభజిస్తారు. రాష్ట్ర కౌన్సెలింగ్ అధికారులు తదనుగుణంగా వారి మెరిట్ జాబితాను తయారు చేస్తారు. 15 శాతం ఆలిండియా కోటా సీట్లను డీమ్డ్ వర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూలోని ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థులు మరింత సమాచారం కోసం www.mcc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అభ్యర్థులు 15 శాతం ఆలిండియాకోటా సీట్లకు దరఖాస్తు చేస్తారు. సీట్లు అయిపోయిన తర్వాత కౌన్సెలింగ్ నిలిపివేస్తారు. కౌన్సెలింగ్ వివరాలు, షెడ్యూల్‌ను ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహా రాష్ట్రాల వైద్య విద్యా డైరెక్టరేట్ల వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్ల కోసం అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలిండియా ర్యాంక్ ఆధారంగా సంబంధిత కౌన్సెలింగ్ అధికారులతో మెరిట్ జాబితా తయారు చేస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన కౌన్సెలింగ్ కూడా సంబంధిత స్టేట్ కౌన్సెలింగ్ అథారిటీనే నిర్వహిస్తుంది. నీట్ ఫలితాల డేటాను బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు కూడా వినియోగించుకోవచ్చు. గుర్తింపు పొందిన వెటర్నరీ కళాశాలల్లో 15 శాతం కోటా కింద బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుల అడ్మిషన్లకూ ఈ ఫలితాల డేటాను ఉపయోగించుకోవచ్చు. -
కిర్గిజిస్తాన్ భద్రమేనా!
ఉపాధి కోసమో, విద్యార్జన కోసమో మనదికాని చోటుకు పిల్లలను పంపినప్పుడు కన్నవాళ్ల హృదయం వారి కోసం నిత్యం ఆరాటపడుతుంది. సక్రమంగా ఉన్నారా, తిన్నారా అన్న ఆలోచనలే అనుక్షణమూ వారిని వేధిస్తుంటాయి. ప్రపంచం మునపట్లా లేదు గనుక ఇటువంటి భయాందోళనలు ఇప్పుడు మరింత పెరిగాయి. దేశంలో ఉన్నత విద్యారంగం, మరీ ముఖ్యంగా వైద్య విద్య బాగా విస్తరిస్తే అందరికీ అందుబాటులోకొస్తే మన విద్యార్థులు దూరతీరాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలా లేకపోబట్టే విద్యార్థులు అనుకోకుండా జరిగే పరిణామాల్లో చిక్కుకుని అవస్థలు పడాల్సివస్తోంది. రెండున్నరేళ్లక్రితం ఉన్నట్టుండి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి తెగబడినప్పుడు అక్కడి మన వైద్య విద్యార్థులు ప్రాణాపాయంలో చిక్కుకోవటం, ఇబ్బందులు పడటం చూశాం. మన దేశంతోపాటు అన్ని దేశాలూ తమ తమ విద్యార్థులను సురక్షితంగా వెనక్కు తీసుకెళ్లగలిగాయి. సరిగ్గా వారం క్రితం కిర్గిజిస్తాన్లోనూ విద్యార్థులకు సమస్య ఎదురైంది. ఈనెల 13న పాకిస్తాన్, ఈజిప్టు విద్యార్థులతో ఏర్పడిన తగవు ఆసరా చేసుకుని వందలాదిమంది స్థానికులు విద్యార్థుల హాస్టళ్లపై విరుచుకుపడి ధ్వంసం చేశారు. అనేకమంది విద్యార్థులను గాయపరిచారు. విద్యార్థినులను సైతం వేధించటం, దౌర్జన్యం చేయటంతో ఎప్పుడేమవుతుందో తెలియక విద్యార్థులంతా ఏడెనిమిది గంటలపాటు చీకటి గదుల్లో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోలీసులు రంగంలోకి దిగినా దుండగులను అదుపు చేయలేకపోయారు. ఆ తర్వాత అరెస్టులు జరిగాయి. అది వేరే సంగతి. హాస్టళ్లకూ, విదేశీ విద్యార్థులుండే అపార్ట్మెంట్లకూ రక్షణ కల్పిస్తున్నారు. కానీ ఘటన జరిగివారం కావస్తున్నా ఎక్కడా భయాందోళనలు చల్లారలేదు. దాంతో స్వస్థలాలకు పోవటమే ఉత్తమమని శుక్రవారం కూడా వందలాదిమంది పాకిస్తానీ విద్యార్థులు ఇంటి బాట పట్టారు. వారి ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. మన విదేశాంగశాఖ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బిషెక్‌లోని మన రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. వేరే దేశాలకు పోయినప్పుడు అక్కడి భాష, సంస్కృతీ సంప్రదాయాలు, పద్ధతులపై అవగాహన పెంచుకుని వాటిని గౌరవించటం అలవాటు చేసుకోవాలి. తమ దేశానికి చెందినవారితోనే సన్నిహితంగా మెలగటం, స్థానికులను చిన్నచూపు చూసే స్వభావం అనవసరమైన అపార్థాలకు దారితీస్తుంది. తమ సంస్కృతే ఘనమైనదని, ఇతరులు అల్పులన్న భావన స్వదేశంలో ఎంతోకొంత చెల్లుబాటవుతుంది. వేరేచోట మాత్రం సమస్యలు తెస్తుంది. దీన్ని గుర్తించబట్టే విశ్వవిద్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్థానికులతో కలిసిమెలిసివుండేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. కిర్గిజిస్తాన్‌లో మూడేళ్లక్రితం కూడా గొడవలు జరిగాయి. అప్పుడూ ఇప్పుడూ కూడా పాకిస్తాన్ విద్యార్థులే గొడవలకు కారకులయ్యారు. రౌడీయిజం, స్థానిక సంప్రదాయాలను కించపరచటం, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనటం వంటివి సమస్యలు తెచ్చిపెడుతున్నాయన్నది స్థానికుల ఆరోపణ. సాధారణంగా ఒకరిద్దరి ప్రవర్తన వల్ల గొడవ జరిగితే అది వారికే పరిమిత మవుతుంది. ఎవరో ఒకరి జోక్యంతో అంతా సద్దుమణుగుతుంది. కానీ సామాజిక మాధ్యమాల హవా పెరగటం, ఆ గొడవ తాలూకు వీడియో క్షణాల్లో అందరికీ చేరటం భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. ఉద్రిక్తతలు రేపుతోంది. దీనికితోడు విదేశీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తమకు లేకపోవటం, వారి జీవన ప్రమాణాలు మెరుగ్గా కనబడటం ఆర్థికంగా అంతంతమాత్రంగా బతుకీడ్చే స్థానికులకు సహజంగానే ఆగ్రహం కలిగిస్తుంది. తమను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తూ విదేశీ విద్యార్థులను అందలం ఎక్కించటం అసంతృప్తికి దారితీస్తుంది. పుండు మీద కారం జల్లినట్టు వారిని కించపరచటం లాంటి చేష్టలకు పాల్పడితే ఇక చెప్పేదేముంది? ఇలాంటి సమయాల్లో కారకులెవరన్న విచక్షణ ఉండదు. విదేశీయులందరినీ ఒకే గాటనకడతారు. కనుక ఎవరికి వారు పద్ధతిగా ఉంటే సరిపోదు. తోటి విద్యార్థులపై ఓ కన్నేసివుంచాలి. సమస్య తలెత్తవచ్చన్న సందేహం కలిగితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. నిజానికి మధ్య ఆసియా దేశమైన కిర్గిజిస్తాన్ వేరే దేశాలతో పోలిస్తే ఎంతో ప్రశాంతమైనది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థానికులు ప్రధానంగా సంచార జీవనానికి అలవాటుపడినవారు. విదేశీ అతిథులను ఆదరించటం, గౌరవించటంలో వారు ఎవరికీ తీసిపోరు. కిర్గిజిస్తాన్ విద్యాలయాల్లో మన విద్యార్థులు 15,000 మంది ఉంటారని అంచనా. పాకిస్తాన్ నుంచి వచ్చినవారి సంఖ్య 11,000. వీరుగాక ఇంకా బంగ్లాదేశ్, కొన్ని అరబ్, ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా చదువుకోవటానికి వస్తారు. తమ దేశాల్లో వైద్య విద్య ఖరీదైన వ్యవహారంగా మారడమే ఇందుకు కారణం. పూర్వపు సోవియెట్ యూనియన్‌లో భాగం కావటం వల్ల పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కిర్గిజిస్తాన్ వైద్య విద్య ఎంతో ప్రామాణికమైనది. అంతర్జాతీయంగా అనేక దేశాలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కూడా దానికివుంది. వేరే దేశాల్లో చదవాలని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని తహతహలాడే పిల్లలు దూరాభారాలు లెక్కచేయక విదేశాలకు వెళ్తారు. కానీ ఇక్కడ చదువుకోవాలనుకునేవారికి మన వైద్యవిద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవటం ప్రభుత్వాల బాధ్యత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ పెట్టాయి. వేరే రాష్ట్రాలు కూడా ఆ పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం అందుకు సహాయసహకారాలు అందించాలి. -
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
సాక్షి,విజయవాడ: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష నీట్ రేపు (మే5) జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 25 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారు. ఏపీ నుంచి75 వేల మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు.ఏపీలో 29 నీట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు మద్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకే పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్దులికు సెంటర్లోకి అనుమతి ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు. -
అబ్బాయిలతో కలిసి ఉంటేనే వైద్య విద్య
విశాఖ సిటీ: వైద్యురాలుగా స్థిరపడాలనుకుంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఎంత ఖర్చయినా తన కుమార్తెను డాక్టర్‌గా చూడాలని తల్లిదండ్రులు తాపత్రయపడ్డారు. నగరానికి చెందిన కన్సల్టెన్సీ ద్వారా కజకిస్తాన్‌లో ఒక యూనివర్సిటీలో సీటు సంపాదించారు. కోటి ఆశలతో విదేశీ యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే విద్యార్థికి వేధింపులు ప్రారంభమయ్యాయి. అక్కడ హాస్టల్లో అబ్బాయిలతో కలిపి వసతి కల్పించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పాశ్చాత్య పోకడలకు ఇమడలేని విద్యార్థిని ఇంటికి వెళ్లిపోతానని వేడుకున్నప్పటికీ.. పాస్‌పోర్ట్ తీసుకొని మొత్తం ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో విద్యారి్థని తన పరిస్థితిని తల్లిదండ్రులకు చెప్పుకొని దేశం కాని దేశంలో తిండీ, నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతోంది. అక్కడి పరిస్థితులను, ఆమె బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన జి.భవాని విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఇందుకోసం గాజువాకలో ఉన్న జీవీకే కన్సల్టెన్సీ అనే సంస్థను సంప్రదించారు. దాని ద్వారా కజకిస్తాన్ దేశంలో ఆల్మటీ నగరంలో కాస్పియన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటుకు డబ్బు చెల్లించారు. ఆ సమయంలోనే అక్కడి వసతి ఏర్పాట్లపై భవాని తండ్రి జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో స్పష్టంగా మాట్లాడారు. గరŠల్స్, బాయ్స్‌కు ప్రత్యేక హాస్టళ్లు ఉంటాయని చెప్పడంతో వారు సీటు కోసం డబ్బు చెల్లించారు. భవాని ఈ నెల 11వ తేదీన కజకిస్తాన్‌కు వెళ్లింది. యూనివర్సిటీలో ఒక భవనంలోనే అబ్బాయిలకు, అమ్మాయిలకు వసతి కలి ్పంచారు. కొద్ది రోజులపాటు సర్దుకున్న భవాని అక్కడి వాతావరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అబ్బాయిలతో కలిసి ఉండడం, వారు సిగరెట్, ఇతర అలవాట్లను చూసి భరించలేక ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీనిపై జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించారు. తన కుమార్తెను వేరే హాస్టల్‌కు మార్చాలని కోరాడు. చెప్పిన కొద్దిసేపటికే భవాని రూమ్‌కు కొంత మంది సీనియర్ అబ్బాయిలు వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా తమతో కలిసే ఉండాలని హెచ్చరించారు. అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా వసతి కల్పించినట్లు చెప్పాలని బలవంతం పెట్టడంతో భయపడిన భవాని మళ్లీ తన తండ్రికి ఫోన్ చేసి వేరే హాస్టల్‌కు మార్పించినట్లు చెప్పింది. డబ్బు చెల్లిస్తేనే పాస్‌పోర్ట్ ఇస్తామంటూ.. అక్కడి వాతావరణాన్ని భరించలేని భవాని తాను అక్కడ ఉండలేనని, ఇంటికి పంపించేయాలని కళాశాల వాళ్లను వేడుకుంది. ఫీజు మొత్తం డబ్బు చెల్లిస్తేనే తిరిగి పంపిస్తామంటూ ఆమె పాస్‌పోర్ట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని తండ్రి జగదీష్ కు చెప్పింది. హాస్టల్లో పరిస్థితులు బాగోలేవని, తాను ఇంటికి వెళ్లేందుకు సహాయం చేయాలని అధికారులను కోరుతూ సెల్ఫీ వీడియో తీసి పంపించింది. దీనిపై తండ్రి జగదీష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు తిరిగి విశాఖకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాడు. -
వైద్య విద్యలో ‘వెనుకబాటు’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో అణగారిన వర్గాల సంఖ్య తక్కువగా ఉంటోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఇతర మైనారిటీలు తక్కువగా ఉంటున్నారు. ఎంబీబీఎస్‌లో కొంతమేరకు ఫర్వాలేదు కానీ, ఆపై స్థాయి మెడికల్ కోర్సుల్లో ఆయా వర్గాల శాతం తక్కువగా ఉండటంపై సామాజిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఓసీలు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా విభాగం చేపట్టిన సర్వేలో వెల్లడైంది. 2021–22లో వైద్య కోర్సుల్లో పాసైన వారిని ఆధారం గా చేసుకొని ఈ సర్వే నిర్వహించారు. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో 75 శాతం కాలేజీలను సర్వే చేశారు. ఎంబీబీఎస్, ఎండీ కోర్సుల్లో మహిళలు ఎక్కువగా ఉంటున్నా, ఎంఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు వచ్చేసరికి వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఆ కోర్సులు సాధించడం, వాటిని పూర్తి చేయడానికి వయసు మీద పడటం ఒక కారణంగా చెబుతుండగా, పెళ్లి, పిల్లలు తదితర కారణాల వల్ల కూడా వాటిని చదవడానికి ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్‌లో ఓబీసీలు 24.4% సర్వేలో భాగంగా ఎంబీబీఎస్ పాసైన 54,547 మందిని ఎంపిక చేశారు. వారిలో పురుషులు 26,474 మంది (49 శాతం), మహిళలు 28,073 (51 శాతం) మంది ఉన్నారు. ఎంబీబీఎస్‌లో ఎస్సీలు 4,539 మంది (పురుషులు 2,310 మంది, మహిళలు 2,229 మంది) ఉండగా, వీరి శాతం 8.3గా ఉంది. ఇక ఎస్టీలు 2,100 మంది (పురుషులు 1008, మహిళలు 1092 మంది) ఉన్నారు. వీరి శాతం 3.8 శాతంగా ఉంది. ఓబీసీల్లో మొత్తం 13,350 మంది (పురుషులు 6,682, మహిళలు 6,668 మంది) ఉండగా, వీరు 24.4 శాతంగా ఉన్నారు. దివ్యాంగులు 112 (0.2 శాతం) మంది ఉన్నారు. ముస్లింలు 2,005 మంది ఉన్నారు. వారిలో పురుషులు 929 మంది, మహిళలు 1079 మంది ఉన్నారు. వీరి శాతం 3.6 శాతంగా ఉంది. ఇతర మైనారిటీలు 1,178 (2.1శాతం) ఉన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో 210 (0.4 శాతం) మంది ఉన్నారు. ఇక ఓసీలు 57 శాతం మంది ఉన్నారు. ఎండీల్లో ఎస్సీ, ఎస్టీలు 11.3% ఎండీ కోర్సుల్లో జనరల్ మెడిసిన్, అనెస్థీíÙయా, చెస్ట్, రేడియాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్ వంటివి వస్తాయి. ఎండీ కోర్సుల్లో 15,732 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 7,343 (46 శాతం), మహిళలు 8,389 (54 శాతం) మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 1220 (7.7 శాతం) మంది, ఎస్టీలు 561 (3.6 శాతం) మంది, ఓబీసీలు 3,404 (22 శాతం) మంది, దివ్యాంగులు 12 (0.08%) మంది, ముస్లింలు 543 (3.5%) మంది, ఇతర మైనారిటీలు 357 (2.2%) మంది, ఈడబ్ల్యూఎస్ 187 (1.2%) మంది ఉన్నారు. ఓసీలు 59 శాతంగా ఉన్నారు. ఎంఎస్ కోర్సుల్లో ముస్లింలు 3.3% ఎంఎస్ కోర్సుల్లో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, చెవి, ముక్కు, కంటి తదితర సర్జరీ కోర్సులు వస్తాయి. ఎంఎస్‌లో 4,713 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 2,521 (53%) మంది, మహిళలు 2,192 (47%) మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 337 (7.1%) మంది, ఎస్టీలు 128 (2.7%), ఓబీసీలో 1021 (21.6%) మంది, ముస్లింలు 155 (3.3%) మంది, ఇతర మైనారిటీలు 102 (2.1%) మంది, ఈడబ్ల్యూఎఎస్లో 8 (0.2%) మంది ఉండగా, ఓసీలు 63 శాతంగా ఉన్నారు. డీఎం కోర్సుల్లో ఓసీలు 89 శాతం మెడికల్ సూపర్ స్పెషాలిటీ (డీఎం కోర్సులు)ల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ తదితర కోర్సులు వస్తాయి. వీటిల్లో 469 మందిని సర్వే చేశారు. అందులో పురుషులు 362 (77%), మహిళలు 107 (23%) మంది ఉన్నారు. ఎస్సీలు ఏడుగురు (1.49%), ఎస్టీలు ముగ్గురు (0.6%), ఓబీసీలు 29 (6%), ముస్లింలు 0.6%, ఇతర మైనారిటీలు 9 (1.91%) మంది ఉండగా, ఓసీలు 89 శాతం మంది ఉన్నారు. ఎంసీహెచ్ కోర్సుల్లో మహిళలు 15 శాతమే ఎంసీహెచ్ (సర్జికల్ సూపర్ స్పెషాలిటీలు) జీర్ణకోశ, యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, వ్యాసు్కలర్ సర్జరీ తదితర కోర్సులు ఉంటాయి. వీటిల్లో 337 మందిని సర్వే చేశారు. పురుషులు 287 (85%), కేవలం మహిళలు 50(15) మంది మాత్రమే ఉన్నారు. ఎస్సీలు ఏడుగురు (2%), ఎస్టీలు ముగ్గురు (1%), ఓబీసీలు 15 (4.4%), ముస్లింలు ఒకరు, ఇతర మైనారిటీలు ముగ్గురు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో ఒకరు ఉండగా, ఓసీలు 90 శాతంగా ఉన్నారు. సూపర్ స్పెషాలిటీల్లో తగ్గుతున్న మహిళలు: డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ ఎంబీబీఎస్, ఎండీ కోర్సుల్లో మహిళలు ఎక్కువగా చేరుతుంటే, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో పురుషుల శాతమే ఎక్కువగా ఉంటోందని నివేదిక చెబుతోంది. ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్ వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులకు వెళ్లేసరికి మహిళల శాతం చాలా తక్కువగా ఉంటోంది. దీనికిగల కారణాలను అన్వేషించాల్సిన అవసరముంది. ఆ మేరకు మహిళలకు వెసులుబాటు కల్పించాలి. దీనిపై జాతీయ మెడికల్ కమిషన్ దృష్టిసారించాలి. -
రెండు దరఖాస్తులు చాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో వైద్య విద్య కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సరళతరం చేసింది. ఎయిమ్స్ వంటి జాతీయస్థాయి మెడికల్ కాలేజీలతోపాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జరిగే కౌన్సెలింగ్లకు పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లకు కేవలం రెండు దరఖాస్తులతో పోటీపడొచ్చు. ఇందులో ప్రైవేటు కాలేజీల కోసం ఒకటి, ప్రభుత్వ కాలేజీల కోసం మరో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సీటు వస్తే అక్కడ చేరవచ్చు. విద్యార్థి కోరుకున్నచోట సీటు రాకుంటే.. తదుపరి కౌన్సెలింగ్‌లలో పాల్గొనవచ్చు. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నాయని ఎన్ఎంసీ వర్గాలు తెలిపాయి. 2024–25 వైద్య విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రానుందని వెల్లడించాయి. జాతీయ స్థాయి మెరిట్ అయినా వేర్వేరుగా..: దేశవ్యాప్తంగా 681 మెడికల్ కాలేజీల్లో 1.04 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్, ఎండీ, డీఎన్బీ ఇలా 67,802 పీజీ మెడికల్ సీట్లున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి రెండింటిలోనూ సీట్లను నీట్ ప్రవేశపరీక్ష ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం అఖిల భారత ర్యాంకు ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తున్నారు. అభ్యర్థులు తమ రాష్ట్ర పరిధిలో దరఖాస్తు చేసుకున్నప్పుడు.. వారిని రాష్ట్ర కేటగిరీగా గుర్తించి, తదనుగుణంగా మెరిట్ జాబితాలను తయారు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజీల్లోని 15శాతం ఆలిండియా కోటా సీట్లకు, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ నిర్వహించేది. అభ్యర్థులెవరైనా ఈ 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్లకోసం అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాల్లోని కాలేజీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ అధికారులు కూడా.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లకు ఆలిండియా ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితాలు తయారు చేసి అడ్మిషన్లు చేస్తారు. ప్రైవేట్ సీట్లకూ జాతీయస్థాయి కౌన్సెలింగ్ ప్రస్తుతం రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లకు ఆయా రాష్ట్రాల్లోనే కౌన్సెలింగ్ జరుగుతోంది. వాటిలో కనీ్వనర్ కోటాకు వేరుగా, బీ కేటగిరీ, ఎన్నారై కోటాల సీట్లకు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వీటిలోని ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కౌన్సెలింగ్ కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తోంది. ఎన్ఎంసీ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని వివిధ కేటగిరీల సీట్లకు ఒకే దరఖాస్తు సరిపోతుంది, ఒకేసారి కౌన్సెలింగ్ జరుగుతుంది. ► ఉదాహరణకు తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్న బీ కేటగిరీ సీట్లలో 85శాతం స్థానికులకు కేటాయించగా, మిగతా 15శాతం ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఏ రాష్ట్రం వారైనా పోటీపడొచ్చు. ఈ ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. ఒకే దరఖాస్తు ద్వారా ఆయా రాష్ట్రాల్లోని కాలేజీల్లో ఎక్కడో ఒకచోట సీటు పొందవచ్చు. నచ్చినచోట చేరవచ్చని, లేకుంటే తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ఎన్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ► గత ఏడాది దేశవ్యాప్తంగా 20.87 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. మొత్తం 11,45,976 మంది అర్హత సాధించగా.. అందులో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది ఉన్నారు. ఒకేసారి విస్తృతంగా కౌన్సెలింగ్ ప్రస్తుత నిబంధనల మేరకు అభ్యర్థులు జాతీయ స్థాయి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. డీమ్డ్ వర్సిటీల్లోని కాలేజీలకు వేరుగా, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇలా పదుల సంఖ్యలో, కొందరైతే 50 నుంచి 60 దరఖాస్తులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రాల్లోని కాలేజీల్లో 15% జాతీయ స్థాయి ఓపెన్ కోటాకు ఏ రాష్ట్రంవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీటికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ జరిగేది. ఆ కౌన్సెలింగ్ పూర్తయ్యాక రాష్ట్రాల్లోని మిగతా కనీ్వనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరిపేవారు. ఈ ఏడాది నుంచి జాతీయ, రాష్ట్రస్థాయి సీట్లన్నింటికీ ఒకేసారి.. అంటే ఒకే తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
14న 5 వైద్య కళాశాలల ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వరంగ వైద్య విద్యలో నూతనాధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త కాలేజీలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఈ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతున్నాయి. ఈ 5 కాలేజీల్లో ఒక్కో కళాశాలలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ద్వారా ఆల్ ఇండియా కోటా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. నూతన కాలేజీల్లో 111 ఆలిండియా కోటా సీట్లకు గాను 69 భర్తీ అయ్యాయి. రాష్ట్ర కోటాకు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసింది. ఈ కౌన్సెలింగ్‌లో 516 సీట్లు భర్తీ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు 585 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 10న ఆల్ ఇండియా కోటా మూడో విడత, రాష్ట్ర కోటా రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతాయి. వీటిలో మిగిలిన సీట్లు భర్తీ అవుతాయి. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు విజయనగరంలో వైద్య కళాశాల ప్రారంభించడానికి సీఎం జగన్ నేరుగా హాజరై, మిగిలిన నాలుగు కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మరో ఐదు కళాశాలల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – మురళీధర్ రెడ్డి, ఎండీ ఏపీఎంఎస్ఐడీసీ -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమో దు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులు శాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. -
వైద్య విద్య పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇప్పటికే నిర్వహించిన కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రవేశాల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కన్వినర్, యాజమాన్య కోటా సీట్లకు తొలి దశలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు గురువారం వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఉత్తర్వులిచ్చారు. కర్నూలు జిల్లా శాంతిరామ్ వైద్య కళాశాలలోని పలు కోర్సుల్లో పీజీ సీట్ల పెంపుదలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతులు వెలువడ్డాయి. ఈ అంశంపై ఎన్ఎంసీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌ను హెల్త్ యూనివర్సిటీ అధికారులు రద్దు చేశారు. ఫోర్జరీ అనుమతుల ఘటన వెలుగు చూడటంతో అప్రమత్తమైన అధికారులు మిగిలిన వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల అనుమతులు సరిగా ఉన్నాయో, లేదో పరిశీలిస్తున్నారు. ఆయా కళాశాలలకు మంజూరైన సీట్లను, ఎన్ఎంసీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన సీట్లతో సబ్జెక్టుల వారీగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్ఎల్, శాంతిరామ్, మహారాజా కళాశాలల్లో అనుమతించిన పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్ల సంఖ్య మధ్య వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అంశంపై వివరణ కోరుతూ అధికారులు ఎన్ఎంసీకి లేఖ రాశారు. ఎన్ఎంసీ నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చాక కొత్తగా సీట్ మ్యాట్రిక్స్‌ను రూపొందించనున్నారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్ ఇస్తామని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. -
మరో 5 వైద్య కళాశాలల ప్రారంభానికి కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2024–25)లో మరో 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి సిద్ధమవుతోంది. వీటిలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి నిర్ణయించింది. ఈమేరకు కొత్త పోస్టులను కూడా మంజూరు చేసింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా ప్రభుత్వం రూ.8480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కళాశాలల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభిస్తున్నారు. ఆ కళాశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కళాశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. 3530 పోస్టుల సృష్టి ఈ ఐదు కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా కొత్త పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే సృష్టించింది. ఒక్కో వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేసింది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ ఇలా వివిధ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు, నర్సింగ్, మెడికల్, నాన్‌మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులను మంజూరు చేసింది. వైద్య పోస్టుల భర్తీకి ఇప్పటికే మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. ఈ ఐదు చోట్ల ఏపీవీవీపీ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేస్తున్నారు. సమకూరనున్న మరో 750 ఎంబీబీఎస్ సీట్లు 17 కొత్త వైద్య కళాశాలల ద్వారా ఏకంగా 2550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఈ విద్యా సంవత్సరంలో ఐదు కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే 5 కాలేజీల్లో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు వస్తాయి. మిగిలిన ఏడు కళాశాలలను 2025–26లో ప్రారంభించేలా ప్రణాళిక రచించారు. వేగంగా నిర్మాణాలు ఐదు చోట్ల వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల నిర్మాణం వేగంగా సాగుతోంది. 2024–25 సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల అనుమతులకు ఎన్ఎంసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే పోస్టులు మంజూరు చేసింది. ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల నియామకం జరిగింది. ఇతర వైద్యులు, సిబ్బంది నియామకాలు వేగంగా పూర్తి చేసి ఐదు కళాశాలలు ప్రారంభించడానికి ఎల్వోపీ కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేస్తాం. 2023–24 విద్యా సంవత్సరానికి 5 కళాశాలలకు అనుమతులు తెచ్చిన అనుభవం ఈ సారి సులువుగా పనులు పూర్తి చేయడానికి దోహద పడుతుంది. – ఎం.టి. కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో 87 శాతం మంది ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష (ఎఫ్ఎంజీఈ) పాసవడం కష్టతరంగా మారింది. ఇటీవల జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలో 13 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులైనట్లు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీఈ) ప్రకటించింది. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుపై విమర్శలు వస్తున్నాయి. నాణ్యమైన వైద్య విద్య ఆయా దేశాల్లో ఉండటం లేదన్న ఆరోపణలకు ఈ ఫలితాలు నిదర్శనంగా చెబుతున్నారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మన దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు, లైసెన్స్ పొందడానికి, మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్‌కు, పీజీ మెడికల్ చదవడానికి ఎఫ్ఎంజీఈ పాస్ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షకు ఆ నాలుగేళ్లలో 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు హాజరుకాగా, 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది. అంటే ఆ నాలుగేళ్లలో కేవలం 14.22 శాతమే పాస్ అయ్యారు. ఈ ఏడాది అది మరింత తక్కువగా ఉండటం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది జూలైలో 24,269 మంది ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయగా, కేవలం 3,089 మందే పాసయ్యారు. మిగిలిన 21,180 మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఏకంగా 87 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. చైనా, రష్యాలకు ఎక్కువగా వెళుతుండగా, ఆయా దేశాల్లో చదివినవారిలో తక్కువ శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ విద్యార్థి ఈ ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు మాత్రమే అవకాశముంటుంది. కొన్ని దేశాలు, కొన్ని కాలేజీల్లో నాసిరకమైన వైద్య విద్య ఉండటం, మన దేశంలోని వైద్య విద్యకు సమాన స్థాయిలో ప్రమాణాలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. పైగా చైనా, రష్యాల్లో ఆయా దేశ భాషలోనే వైద్య విద్య నేర్చుకుంటారు. ఇక్కడకు వచ్చాక ఎఫ్ఎంజీఈ పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. దీనివల్ల చాలామంది ఫెయిల్ అవుతున్నారు. పైగా ఎఫ్ఎంజీఈ పూర్తిగా థియరీగా ఉండటం వల్ల కూడా ఫెయిల్ అవుతున్నట్లు చెబుతున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకేల్లో ఎంబీబీఎస్ లేదా తత్సమాన వైద్య విద్య పూర్తి చేసినవారికి మన దేశంలో ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయాల్సిన అవసరంలేదు. . ఎక్కువ ఫీజుతో విదేశాలకు దేశంలో ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని పెరుగుతున్నా, డిమాండ్‌కు తగినంతగా సీట్లు లేకపోవడంతో అనేకమంది విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 20.38 లక్షల మందికి విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, అందులో 11.45 లక్షల మంది అర్హత సాధించారు. కానీ మన దేశంలో కేవలం 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్లే ఉన్నాయి.దీంతో మన దేశంలో సీటు రానివారు, విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్తుంటారు. మరికొందరు మన దేశంలోనే ఎండీఎస్ లేదా ఆయుష్ కోర్సులు చేస్తుంటారు. ఇక మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కాగా, తెలంగాణ నుంచి ఈ ఏడాది 72,842 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. అందులో 42,654 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే ఇంకా చాలామంది సీటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు ఎక్కువగా ఉంటాయి. కోర్సు పూర్తి చేయాలంటే బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు ఫీజు రూ. 23.10 లక్షల వరకు ఉంటుంది. ఆయా దేశాల్లో ఫీజు తక్కువే కానీ.. అదే విదేశాల్లో చదివితే దేశాన్ని బట్టి ఎంబీబీఎస్ కోర్సు మొత్తం పూర్తి చేసేందుకు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల ఫీజు మాత్రమే ఉంటుంది. దీంతో చాలామంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, పిలిఫ్పైన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా తదితర దేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. -
రామోజీ ‘కడుపు మంట కథ’
సాక్షి, అమరావతి: చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రంలో వైద్య రంగాన్ని, వైద్య విద్యని బలోపేతం చేస్తూ అటు విద్యార్థులకు, ఇటు ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రామోజీరావు మరో ఏడుపుగొట్టు కథనాన్ని ప్రచురించారు. రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తూ మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచుతూ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఇది భరించలేని రామోజీరావు వైద్య కళాశాలల ఏర్పాటుపై గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు. గత నెల 20న పలు వక్రీకరణలు, అవాస్తవాలతో ఈనాడులో కథనం ప్రచురించారు. నెల తిరక్కుండానే మరోసారి ‘వైద్య విద్యనూ అమ్మేశారు!’ అంటూ బుధవారం కథనం రాసుకొచ్చారు. ప్రభుత్వ రంగంలో వైద్యవిద్యను బలోపేతం చేయడంపై రామోజీరావు కడపుమంటను బయటపెట్టుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రైవేటు వైద్య కళాశాలలను ప్రోత్సహించి వైద్య విద్యను అమ్మేసి తన వాళ్ల జేబులు నింపుతున్నప్పుడు రామోజీరావు నిస్సిగ్గుగా ఎందుకు ఊరకుండిపోయారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పేద విద్యార్థులకు తీరని నష్టం చేసింది మీ బాబే 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో (ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రంలో) ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు 12 (11+1 పద్మావతి వైద్య కళాశాల) మాత్రమే ఉన్నాయి. 2014–19 మధ్య ఐదేళ్లలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ, ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా నెలకొల్పలేదు. పైగా, తన అనుంగులతో ప్రైవేటు వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిభ ఉన్నప్పటికీ అందుబాటులో తగినన్ని సీట్లు లేక బడుగుబలహీన వర్గాల విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యారు. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నష్టం చేయడం కాదా రామోజీ? చంద్రబాబు చేసిన నష్టంపై ఏ రోజైనా చిన్న వార్త అయినా రాశారా? వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ రంగంలోనే 17 కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సీట్లు పెరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకూ మేలు జరుగుతోంది. 2019 వరకు 12 ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే. కొత్తగా 17 కళాశాలల ఏర్పాటుతో మరో 2,550 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలోనే విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలు ప్రారంభమవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం మరో ఐదు, 2025–26లో మిగిలిన ఏడు అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రభుత్వ రంగంలో 29 మెడికల్ కాలేజీలు ఉంటాయి. వీటిలో ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 4,,910కి పెరుగుతాయి. ఇది విద్యార్థులకు మంచి చేసినట్టే కదా? ఇంత దుర్మార్గపు రాతలా? ఈ విద్యా సంవత్సరం ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కొత్తగా ప్రారంభమవుతున్నాయి. వీటి ద్వారా ఏకంగా 319 కన్వీనర్ కోటా సీట్లు సమకూరాయి. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకూ సీట్లు పెరుగుతాయి. కొత్త కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా పోను మిగిలిన సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం భర్తీ చేసింది. 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్, 15 శాతం ఎన్నారై కోటాకు కేటాయించారు. ఐదు కాలేజీల్లో 750 సీట్లు ఉండగా 113 సీట్లు ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. మిగిలిన 637 సీట్లలో 319 సీట్లు కన్వీనర్ కోటాకే ఇచ్చారు. దీంతో పాత 12 కళాశాలల్లోని 2,360 కన్వీనర్ కోటా సీట్లకు 319 అదనంగా చేరాయి. ప్రభుత్వ రంగంలోని పాత వైద్య కళాశాలలు, కొత్తగా వచ్చిన ఐదు కళాశాలల్లో, ప్రైవేట్‌లోని కన్వీనర్ కోటా సీట్లలో 2022–23, 2023–24 ప్రవేశాలను పరిశీలిస్తే విద్యార్థులకు ఎటువంటి నష్టం లేదని అర్థం అవుతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాల కల్పన కోసమే కొత్తగా ఏర్పాటు చేస్తున్న కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్నారై కోటా కింద వచ్చే డబ్బేమీ నారాయణ, ఇతర వైద్య విద్యతో వ్యాపారాలు చేసే ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్లదు. వాటితో సంబంధిత మెడికల్ కాలేజీలో సౌకర్యాలు, నిర్వహణను మెరుగు పరుస్తూ సమర్థంగా నిర్వహిస్తారు. మన విద్యార్థులకు మంచి వాతావరణం, సదుపాయాలు కలిగిన అత్యున్నత స్థాయి వైద్య కళాశాలలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఉత్తమ బోధన, ఉన్నత ప్రమాణాలతో పోటీ ప్రపంచంలో మనగలుగుతాయి. అక్కడకు వచ్చే పేద రోగులపై ఎలాంటి భారమూ ఉండదు. అంతిమంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఒక్కటీ తగ్గకపోగా అదనంగా మరిన్ని అందుబాటులోకి వస్తాయి. వ్యవస్థలు సజావుగా నడిచేందుకు పారదర్శక విధానాన్ని తెస్తుంటే రామోజీకి నచ్చదు. ఆయన జేబులో మనిషి చంద్రబాబులా అన్నీ అనుంగులకు కట్టబెట్టడమే కావాల్సింది. సీఎం వైఎస్ జగన్ ప్రజలకు మేలు చేయడమే రామోజీ కడుపు మంటకు కారణం. ప్రభుత్వ వైద్యం బలోపేతం ఇలా ♦ నాలుగేళ్లలో 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు. పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. ♦ గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే వైద్య సేవలు. ♦ దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు. ఇప్పటివరకూ 1.70 కోట్ల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం. ♦ వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కి పెంపు. రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి. 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. ♦ 108, 104 సేవలు బలోపేతం. కొత్తగా 768 అంబులెన్స్‌లు. ♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు. -
ఈ ఏడాది నుంచి ఒకేసారి 5 కొత్త వైద్య కళాశాలలు.. డాక్టర్ ‘ఏపీ’!..
సాక్షి, అమరావతి: తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని కోరుకుంటున్న వారి కలలు సాకారం కావడంతో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ కావడంతో పేదలకు ఆరోగ్య భరోసా చేకూరుతోంది. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి ఒకేసారి 5 కొత్త వైద్య కళాశాలలను సీఎం జగన్ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. దీంతో ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రావడంతో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం కొత్త మెడికల్ కాలేజీల్లో 2023–24 ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్లోనే కొత్త వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. రెండు మూడు రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కేటాయింపు కూడా పూర్తి కానుంది. రిజర్వేషన్ వర్గాలకు భారీ మేలు కొత్తగా ప్రారంభిస్తున్న వైద్య కళాశాలల్లో ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటాకు కేటాయించారు. గతేడాది వరకూ ప్రభుత్వ రంగంలోని 12, 18 మైనారిటీ, ప్రైవేట్ కళాశాలల్లో 3,360 కన్వీనర్ కోటా సీట్లు ఉండేవి. ఈ ఏడాది ఐదు కొత్త కళాశాలల ఏర్పాటుతో ఒక్కో చోట 64 చొప్పున 320 సీట్లు కన్వీనర్ కోటాలో అదనంగా వచ్చి చేరాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మెరిట్ విద్యార్థులకు భారీ మేలు చేకూరింది. వలసలకు తెర వైద్య విద్య డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో కజకిస్తాన్, ఉక్రెయిన్, చైనా, రష్యా తదితర దేశాలకు మన విద్యార్థులు వలస వెళుతున్నారు. వీటిని అరికట్టడంతోపాటు ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు చేరువ చేసేందుకు సీఎం జగన్ రూ.8,480 కోట్ల వ్యయంతో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నారు. ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలల్లో 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. వచ్చే విద్యా సంవత్సరం మరో ఐదు, ఆ తర్వాత ఏడాది మిగిలిన ఏడు వైద్య కళాశాలలను ప్రారంభించనున్నారు. మొత్తం 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా ఏకంగా 2,550 సీట్లు అదనంగా పెరగనున్నాయి. వైద్య విద్య సీట్ల పెరుగుదలతో మన దగ్గర డాక్టర్ చదువులకు అవకాశాలు విస్తృతమై వలసలకు తెర పడనుంది. అన్ని వసతులతో తొలి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం కొత్త ఆస్పత్రుల్లో అన్ని వసతులను కల్పించారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా బోధనాస్పత్రి, కళాశాలలను అభివృద్ధి చేశారు. ఐదు చోట్ల ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసిన ప్రభుత్వం వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాలను పూర్తి స్థాయిలో సమకూర్చింది. కళాశాలల్లో హైఎండ్ ఏవీ సదుపాయంతో లెక్చర్ గ్యాలరీలు, 3 వేల పుస్తకాలు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ మెడికల్ జర్నల్స్ సేకరణతో సెంట్రల్ లైబ్రరీ, రీడింగ్ ఏరియా, అత్యాధునిక పరికరాలతో ల్యా»ొరేటరీలు, టీచింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. హ్యూమన్ అనాటమీ, క్లినికల్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ/హెమటాలజీ, సెంట్రల్ ల్యాబొరేటరీ, స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ ల్యాబ్‌లలో అన్ని వనరులు సమకూర్చారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు హాస్టళ్లు సిద్ధం చేశారు. భవిష్యత్ తరాలకు బలమైన పునాదులు ఏ దేశం, రాష్ట్రం అభివృద్ధికైనా విద్య, వైద్య రంగాలు గట్టి పునాదులు. యూరప్‌తోపాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, క్యూబా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు అనేక రంగాల్లో ముందంజలో ఉండటానికి ప్రధాన కారణం ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడమే. దూరదృష్టితో సీఎం జగన్ రేపటి తరాల భవిత కోసం విద్య, వైద్య రంగాలను బలోపేతం వేస్తున్నారు. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఎన్నో ప్రయోజనాలు.. ఇన్నాళ్లూ ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు వచ్చినా ఫీజుల భారాన్ని భరించలేక ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. అక్కడ కోర్సు పూర్తి చేయడానికి ఐదేళ్లు పడుతోంది. ఇక ఎన్ఎంసీ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులై హౌస్ సర్జన్ పూర్తి చేసే క్రమంలో రెండు మూడేళ్లు వృథా అవుతోంది. అంతేకాకుండా అక్కడ చదివితే పీజీ ప్రవేశాల్లో నాన్–లోకల్‌గా పరిగణిస్తున్నారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన విద్యార్థులకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వ రంగంలోనే కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కావడం శుభ పరిణామం. ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో పలు ప్రయోజనాలుంటాయి. బోధనాస్పత్రుల్లో అపారమైన క్లినికల్ మెటీరియల్, అనుభవజ్ఞులైన సిబ్బంది ఉంటారు. – డాక్టర్ బాబ్జీ, వైస్ చాన్సలర్, డా. వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం క్లినికల్ స్కిల్స్ పెరుగుతాయి.. ప్రైవేట్ కళాశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా కొత్త వైద్య కళాశాలల్లో ఎంతో మెరుగైన సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. 25 ఏళ్లకుపైగా అనుభవం కలిగిన ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కళాశాలలు, ఆస్పత్రుల్లో నియమించారు. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వనరులున్నాయి. దశాబ్దాలుగా సేవలందిస్తున్న జిల్లా ఆస్పత్రులనే బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేశాం. దీంతో ఐపీ, ఓపీ, ఇతర సేవలు మెరుగ్గా కొనసాగుతున్నాయి. ఈ తరహా ఆస్పత్రులకు అనుసంధానమైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదవడం విద్యార్థులకు ఎంతో మంచిది. విద్యార్థుల్లో క్లినికల్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి. ఇది వారి భవిష్యత్‌కు ఎంతో మేలు చేస్తుంది. – డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, చైర్మన్, ఏపీఎంఎస్ఐడీసీ త్వరలో తరగతులు ప్రారంభం ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో తరగతులు ప్రారంభిస్తాం. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త వైద్య కళాశాలలను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు. – డాక్టర్ నరసింహం, డీఎంఈ -
‘వైద్యం’లో తెలంగాణ నంబర్ వన్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): వైద్యం, వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్యలో రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉండేదని, నిజామ్, బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులే ఉండేవని గుర్తుచేశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్యరంగంలో ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని హరీశ్ అన్నారు. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నామని, అలాగే పీజీలో 8 సీట్లతో రెండవ స్థానంలో ఉన్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తితో పాటు వైద్యులను తయారు చేయడంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. ఎంబీబీఎస్ ఫీజులు రాష్ట్రంలోనే తక్కువని, వైద్య విద్యార్థులకు అందించే స్టైఫండ్ అన్ని రాష్ట్రాలకంటే ఇక్కడే ఎక్కువ అని చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు పీజీలో రిజర్వేషన్ సదుపాయం కల్పి స్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. నగరం నలుదిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్ గ్లోబల్ హెల్త్ హబ్‌గా మారిందని, ఇతర దేశాలకు చెందినవారంతా వైద్యసేవలు, చికిత్సల కోసం హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారని తెలిపారు. త్వరలోనే గాంధీ ఆస్పత్రిలో అవయవ మార్పిడి, ఫెర్టిలిటీ, ఎంసీహెచ్ భవనాలు, అధునాతన అపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు, సదుపాయాలు కల్ప0చామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ అందజేశారు. డీఎంఈ రమే‹Ùరెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, పలువురు హెచ్ఓడీలు, ఆర్‌ఎంఓలు, వైద్యులు, వైద్యవిద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కోటాలో రాలిన మరో విద్యా కుసుమం.. ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకొని..
కోటా(రాజస్తాన్): రాజస్తాన్‌లోని కోటా పట్టణంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకొని ఊపిరాడని స్థితిలో ప్రాణాలు తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన మన్జోత్ చాబ్రా కోటాలోని ఓ శిక్షణా కేంద్రంలో ‘నీట్’ కోచింగ్ తీసుకుంటున్నాడు. గురువారం ఉదయం తన హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. మన్జోత్కు అతని తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వారు హాస్టల్ వార్డెన్‌ను అప్రమత్తం చేశారు. విద్యార్థి గది తలుపులను బద్దలు కొట్టి చూడగా మృతదేహం కనిపించింది. కోటాలో ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్‌కి యాంటీ సూసైడ్ పరికరాలు అమర్చారు. దీంతో మన్జోత్ తన ముఖానికి, తలకి ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ని చుట్టుకొని, దానికి ఒక బట్టను గట్టిగా కట్టి ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసు అధికారి ధర్మవీర్ సింగ్ వెల్లడించారు. తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ అతడి గదిలో ఒక లేఖ లభ్యమైనట్లు చెప్పారు. మన్జోత్ చాలా తెలివైనవాడని, అందరితో జోక్స్ వేస్తూ సరదాగా ఉంటాడని అతని స్నేహితులు చెప్పారు. కోటాలో ఈ ఏడాది బలవన్మరణం చెందిన విద్యార్థుల సంఖ్య 19కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కోటా ప్రసిద్ధి గాంచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. చదువుల్లో ఒత్తిడి వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. -
‘మెడికల్’ రికార్డు..!
వడ్డే బాలశేఖర్–మచిలీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: వందల ఏళ్ల క్రితమే సముద్రయానం ద్వారా వర్తక వాణిజ్యంతో అలరారిన మచిలీపట్నం నగరం క్రీ.శ. మూడో శతాబ్ధం నాటిదని చరిత్ర చెబుతోంది. ఆధునిక కాలంలో బ్రిటీష్ పాలకులు బందరు తీరం నుంచి వాణిజ్య కార్యకలా పాలు నిర్వహించారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక నగరంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో తీర ప్రాంత ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమైతే 70 కి.మీ ప్రయాణించి విజయవాడ వెళ్లాల్సిందే. ఈ అవస్థలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బందరు మెడికల్ కాలేజీని మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపారు. 64.3 ఎకరాల్లో రూ.550 కోట్లతో మచిలీపట్నం వైద్య కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణానికి 2021 జూలై 7 సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేశారు. 150 ఎంబీబీఎస్ సీట్లతో నూతన వైద్య కళాశాల తరగతులు ప్రారంభించేలా సదుపాయాలను సమకూర్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మచిలీపట్నం వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించారు. బందరు తీర ప్రాంత ప్రజలకు ఆరోగ్య భద్రత తొలి ఏడాది ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులకు అకడమిక్ కార్యకలాపాల కోసం అడ్మినిస్ట్రేషన్, ల్యాబొరేటరీ, లెక్చర్ గ్యాలరీ, ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్, హాస్టళ్లతో కలిపి 7 బ్లాక్‌లను నిర్మించారు. లెక్చర్ గ్యాలరీ బ్లాక్‌లో 184 మంది కూర్చునే సామర్థ్యంతో ఎల్ఈడీ స్క్రీన్స్, ప్రొజెక్టర్స్, సెంట్రల్ ఏసీ లాంటి అత్యాధునిక వసతులతో రెండు లెక్చర్ హాల్స్, ఇన్సైడ్, అవుట్‌సైడ్ రీడింగ్ రూమ్స్, జర్నల్, స్టాఫ్ రీడింగ్, లైబ్రరీ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిల కోసం విడివిడిగా రెండు హాస్టల్ బ్లాక్‌లు సిద్ధం చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా హ్యూమన్ అనాటమీ, క్లినికల్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ/హెమటాలజీ, సెంట్రల్ ల్యాబొరేటరీ, స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుగుణంగా అన్ని వనరులు సమకూర్చారు. ఆయా బ్లాక్‌లలో ఫర్నిచర్ సమకూర్చే సమకూర్పు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరు లోపు భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. మచిలీపట్నం తరహాలోనే నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలు కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అన్ని చోట్ల నేడో రేపో కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బంది కొత్తగా నిర్మించిన తమ చాంబర్లలో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి సమకూరనున్నాయి. ఆంధ్రా మెడికల్ కాలేజీ 1923లో ఏర్పాటు కాగా వందేళ్ల తరువాత ప్రభుత్వ రంగంలో ఒకే ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. విద్య, వైద్యం.. రెండు రకాల లాభాలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ కానున్నాయి. ఐదు చోట్ల సేవలు అందించిన జిల్లా ఆస్పత్రుల స్థానంలో బోధనాస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. సేవలు రెట్టింపవుతాయి. అధునాతన వైద్య పరికరాలు, ల్యాబ్‌లు సమకూరడంతో వైద్య సేవలు, రోగ నిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల వల్ల వివిధ రకాల వ్యాధులు, జబ్బులపై రీసెర్చ్ జరుగుతుంది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌లో చేరనున్న విద్యార్థులు నాలుగేళ్ల అనంతరం హౌస్ సర్జన్లుగా సేవలు అందిస్తారు. 24/7 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటంతో సేవలు మరింత మెరుగవుతాయి. మరోవైపు ఎన్ఎంసీ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ అడాప్షన్ విధానం ద్వారా ప్రతి విద్యార్థి ఐదు కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య బాధ్యతలను పర్యవేక్షిస్తారు. నాలుగైదేళ్ల తర్వాత పీజీ సీట్లు కూడా సమకూరడంతో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరుగుతుంది. వైద్యుల నిష్పత్తి పెరుగుతుంది కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు విస్త్రృతంగా పెరుగుతాయి. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. మన దేశంలో వెయ్యి మందికి ఒకరి కంటే తక్కువ వైద్యులున్నారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో ఎక్కువ మంది వైద్యులు అందుబాటులోకి వస్తారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ కర్నూలు జీజీహెచ్ శరవేగంగా పెండింగ్ పనులు ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభించడానికి వీలుగా పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 31 నుంచి ఆల్ ఇండియా కోటా సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్ట్ చేస్తారు. పెండింగ్ పనులన్నీ శరవేగంగా నెలాఖరులోగా పూర్తి చేసేలా పర్యవేక్షిస్తున్నాం. వచ్చే ఏడాది మరో ఐదు కళాశాలలను ప్రారంభించేలా కసరత్తు చేపట్టాం. – ఎం.టి.కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నాలుగేళ్లలో వైద్యరంగం బలోపేతం ఇలా.. ► రూ.16 వేల కోట్లతో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం. ► నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 51 వేల వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసేలా సీఎం జగన్ ఆదేశాలు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. ► గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు. ► దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. నెలకు రెండు సార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ఇప్పటివరకూ 1.70 కోట్ల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. ► 108, 104 అంబులెన్స్‌ల సేవలు బలోపేతం. కొత్తగా 768 అంబులెన్స్‌ల సేవలు అందుబాటులోకి. 2020 జూలై నుంచి 33.35 లక్షలకు పైగా అత్యవసర కేసుల్లో సేవలందించిన అంబులెన్స్‌లు. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు. స్థానికులకు ఎంతో మేలు ఇప్పటిదాకా బందరు ప్రాంతంలో మెరిట్ విద్యార్థులు వైద్య విద్య చదవాలంటే కాకినాడ, విజయవాడ, వైజాగ్ వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడే వైద్య కళాశాల ఏర్పాటుతో స్థానికులకు ఎంతో మేలు జరగనుంది. పూర్తి స్థాయిలో బోదనాస్పత్రి సిద్ధం అయింది. భవిష్యత్తులో పీజీ విద్యార్థులు కూడా వస్తారు. బందరు చుట్టు పక్కల ప్రాంత ప్రజలకు ఆరోగ్య భద్రత చేకూరుతోంది. – డాక్టర్ బి.శ్రీనివాసాచార్య, ఐఎంఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంగ్, మచిలీపట్నం మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి ప్రతి చోటా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆమేరకు నంద్యాలలో కొత్త వైద్య కళాశాలను నెలకొల్పారు. త్వరలోనే తరగతులు ప్రారంభం కానున్నాయి. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతోంది. విద్యార్థుల వైద్య విద్య కల కూడా నెరవేరుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్యం మరింత చేరువ అవుతుంది. – చెన్నకేశవ, నంద్యాల 17 కొత్త కాలేజీలు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా స్పెషలిస్ట్ వైద్య సేవలను చేరువ చేసేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా సమకూరుస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం 5 కాలేజీలు ప్రారంభం అవుతుండగా వచ్చే విద్యా సంవత్సరం మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కాలేజీలను ప్రారంభిస్తారు. మిగిలిన వాటిని 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా నోటిఫై చేసింది. -
వైద్యవిద్య పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి వైద్యవిద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రవేశాలకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్ విడుదల చేసింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు, డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 100 శాతం సీట్లకు ఈ నెల 27 నుంచి ఆగస్టు ఒకటో తేదీ మధ్య నీట్–పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి ఆగస్టు రెండో తేదీ మధ్య వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు మూడు, నాలుగు తేదీల్లో సీట్లు కేటాయిస్తారు. ఏడో తేదీ నుంచి 13వ తేదీలోగా కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 16వ తేదీకి తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు రెండోవిడత, 7వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10వ తేదీ మధ్య ఉంటుంది. రాష్ట్రంలో సీట్లకు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి 2023–24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య, డెంటల్ కళాశాలలు, స్విమ్స్ తిరుపతిలో రాష్ట్ర కోటా పీజీ, ఎండీఎస్ సీట్ల భర్తీకి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ ప్రవేశాల కోసం http://pgcq.ysruhs.com/ ఎండీఎస్ ప్రవేశాల కోసం https://mdscq. ysruhs.com/ వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వాలి. శనివారం (నేడు) ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 31వ తేదీ సాయంత్రం ఆరు గంటల్లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ పీజీ–2023, ఎండీఎస్–2023లో అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. నియమ, నిబంధనల్లో సందేహాల నివృత్తికి 8978780501, 7997710168, 9391805238, 9391805239, సాంకేతిక సమస్యలపై 7416563063, 7416253073, 90634 00829, పేమెంట్ గేట్‌వేపై స్పష్టత కోసం 8333883934 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్ర్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలి పారు. అభ్యర్థనలను appgadmissions2021 @gmail. comM మెయిల్ కూడా చేయవచ్చని పేర్కొన్నారు. -
కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటుతో వైద్య విద్యలో నూతన శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంది పలికారు. ఉమ్మడి రాష్ట్రానికి ముందు, తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ వైద్య కళాశాలలను ప్రైవేటు కాలేజీలకు దీటుగా నిర్వహించడంలో భాగంగా ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు బుధవారం జారీ చేశారు. ఈ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లలో 15 శాతం ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు. మిగిలిన వాటిని మూడు విభాగాలుగా చేశారు వాటిలో 50 శాతం జనరల్ విభాగం, 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయనున్నారు. జనరల్ విభాగంలో ఏడాదికి రూ.15 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్‌లో రూ.12 లక్షలు, ఎన్ఆర్ఐ విభాగంలో రూ. 20 లక్షలు చొప్పున ఫీజులు నిర్ణయించారు. సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ సీట్ల ద్వారా వచ్చే ఫీజులను ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్పొరేషన్ (ఏపీ మెర్క్)లో డిపాజిట్ చేస్తారు. ఈ నిధులతో ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి చేపడతారు. రూ.12,300 కోట్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.16 వేల కోట్లతో నాడు–నేడు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా రంగం రూపురేఖలు మారుస్తున్నారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల బలోపేతానికి రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇలా మొత్తం రూ.12.300 కోట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలకు వెచ్చిస్తున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మించిన నూతన కళాశాలలను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె, పాడేరు కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టారు. ఈ వైద్య కళాశాలలన్నింటికీ కొత్తగా పోస్టులు మంజూరు చేశారు. మిగిలిన 7 వైద్య కళాశాలలు 2025–26లో ప్రారంభించాలని నిర్ణయించారు. -
పారదర్శకంగా వైద్యవిద్య అడ్మిషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో 2023–24 సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్లు పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వీసీ డాక్టర్ కోరుకొండ బాబ్జి తెలిపారు. అందుకు సంబంధించి అడ్మిషన్స్ విభాగం వారితో కలిసి మూడుసార్లు మాక్ ట్రయల్ నిర్వహించామన్నారు. యూనివర్సిటీ పరిధిలోని సీట్లు, అడ్మిషన్ల ప్రక్రియ వంటి అంశాలను గురువారం ఆయన ‘సాక్షి’కి వివరించారు. తెలంగాణ జీవోపై నిర్ణయం.. 2014 జూన్ రెండు తర్వాత తెలంగాణలో కొత్తగా వచ్చిన వైద్య కళాశాలల్లోని యూజీ సీట్లలో 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇచ్చేది లేదని అక్కడి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల్లో మంజూరైన ఎంబీబీఎస్ సీట్లతో పాటు, పీజీ సీట్లు కూడా అన్ రిజర్వుడ్ కోటాలో తెలంగాణ విద్యార్థులకు నిలిపివేసే విషయంలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల వైద్య కళాశాలల్లో 750 సీట్లు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,109 సీట్లు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 15 శాతం ఆలిండియా కోటాలో పోగా, మిగిలిన సీట్లకు ఇక్కడ అడ్మిషన్లు జరుపుతామన్నారు. 18 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 3,000 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, వాటిలో 50 శాతం.. 1,500 సీట్లను ఏ కేటగిరిలో భర్తీ చేస్తామని వీసీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి డైనమిక్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చిందని వీసీ తెలిపారు. ఏపీ, తెలంగాణలకు విభజన ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, వచ్చే ఏడాది నుంచి నూతన విధానాన్ని అనుసరిస్తామని కేంద్రానికి చెప్పినట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పీజీ, యూజీ అడ్మిషన్లు నిర్వహిస్తామని వివరించారు. -
ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లకు ఇక నెక్ట్స్
సాక్షి, అమరావతి: దేశంలో వైద్య విద్యలో నాణ్యతను పెంచడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎంబీబీఎస్ తుది సంవత్సరం విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్ట్స్) నిర్వహించనుంది. ఈ ఏడాది ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులతోనే నెక్ట్స్ ప్రారంభించనున్నారు. దీనిని స్టెప్–1, స్టెప్–2గా రెండు పరీక్షలుగా నిర్వహిస్తారు. ఎంబీబీఎస్ పాస్‌కు, మెడికల్ ప్రాక్టీస్‌కు లైసెన్స్, రిజిస్ట్రేషన్‌కు ఈ పరీక్ష ఉతీ్తర్ణత తప్పనిసరి. దీంతో పాటు పీజీ మెడికల్ సీటులో ప్రవేశాలకూ ఈ అర్హతే ఆధారం కానుంది. విదేశాల్లో చదివిన వారికి కూడా ఈ పరీక్ష ద్వారానే గుర్తింపు ఇస్తారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో నెక్ట్స్‌పై అవగాహన కల్పించడం కోసం వచ్చే నెల 28న స్టెప్–1 మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ మాక్ టెస్ట్‌కు దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభించారు. వచ్చే నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలు దరఖాస్తుకు చివరి గడువు. ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో మాక్ టెస్టు నిర్వహిస్తారు. https://www.aiimsexams.ac.in/ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంచారు. జనరల్/ఓబీసీ విద్యార్థులు రూ. 2 వేలు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ. వెయ్యి దరఖాస్తు రుసుము చెల్లించాలి. వికలాంగులకు దరఖాస్తు రుసుము మినహాయించారు. మూడు స్టేజ్లలో మాక్ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. మూడు రోజులు స్టెప్–1 స్టెప్–1 పరీక్షను మూడు రోజులు నిర్వహించాలని ఎన్ఎంసీ ప్రతిపాదించింది. పూర్తిగా మల్టిపుల్ చాయిస్(ఎంసీక్యూ) విధానంలో స్టెప్–1లో ఆరు పేపర్లు ఉంటాయి. రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. స్టెప్–1 అనంతరం ఆరోగ్య విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రాక్టికల్స్‌లో ఉత్తీ ర్ణులవ్వాలి. వీరికి హౌస్ సర్జన్ చేయడానికి అర్హత ఉంటుంది. హౌస్ సర్జన్ అనంతరం స్టెప్–2 పరీక్ష ఉంటుంది. స్టెప్–1లోని ఆరు సబ్జెక్ట్లతో పాటు ఆర్థోపెడిక్స్, ఫిజికల్ మెడిసిన్ రీహబిలిటేషన్ (పీఎంఆర్)లో ఎవల్యూషన్ మెథడ్‌లో క్లినికల్ ప్రాక్టికల్స్ ఉంటాయి. -
వైద్యవిద్యలో ‘నెక్ట్స్’ లెవెల్
సాక్షి, హైదరాబాద్: వైద్యవిద్యలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఈ ఏడాది నుంచే దాన్ని అమలులోకి తేవాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం ఎంబీబీఎస్ పాస్‌కు, తర్వాత రిజిస్ట్రేషన్, మెడికల్ ప్రాక్టీస్‌కు కూడా ఈ పరీక్ష పాస్ కావడం తప్పనిసరి. అలాగే పీజీ మెడికల్ సీటులో ప్రవేశం కూడా నెక్ట్స్ అర్హతతోనే ఉంటుంది. అంటే నీట్ పీజీ పరీక్ష రద్దవుతుంది. అలాగే విదేశీ వైద్యవిద్యకు గుర్తింపు కూడా ఈ పరీక్ష ద్వారానే ఉంటుంది. అంటే వీటన్నింటికీ ఇదే కీలకమైన పరీక్షగా ఉంటుంది. నెక్ట్స్‌ను ఈ ఏడాది ఎంబీబీఎస్ పూర్తయ్యే విద్యార్థులతో ప్రారంభిస్తారు. నెక్ట్స్–1, నెక్ట్స్–2 అనే పరీక్షలు నిర్వహిస్తారు. నెక్ట్స్–1 ఏటా మే, నవంబర్ నెలల్లో రెండుసార్లు ఉంటుంది. ఆ పరీక్ష జరిగిన నెలలోపే ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఏడాది మొదటిసారిగా నవంబర్‌లో పరీక్ష జరగనుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్సు పూర్తయ్యేవారు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. నెక్ట్స్–1 తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ తర్వాత హౌస్‌సర్జన్ పూర్తిచేశాక నెక్ట్స్–2ను జూన్ మూడో వారం లేదా డిసెంబర్లో నిర్వహిస్తారు. నెక్ట్స్–2కు సప్లమెంటరీ పరీక్ష ఉంటుంది. ఏటా మార్చి లేదా సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. నెక్ట్స్–1ను దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. నెక్ట్స్–2 పూర్తిగా ప్రాక్టికల్ పరీక్షే. దీన్ని సంబంధిత ఆరోగ్య విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అర్హత కటాఫ్ 50 శాతం.. నెక్ట్స్–1 పరీక్షకు అర్హత కటాఫ్ 50% ఉంటుంది. అప్పుడు ఉత్తీర్ణత సాధించినట్లుగా పరిగణిస్తారు. ఇంటర్న్‌షిప్ ప్రారంభించడానికి అర్హులు. ఇంటర్న్‌షిప్ తర్వాత పీజీ సీట్లను కేటాయించడంలో నెక్ట్స్–1లో సాధించిన స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు. పీజీ ప్రవేశ ర్యాంకింగ్ కోసం నెక్ట్స్ పరీక్ష స్కోర్ మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. అయితే నెక్ట్స్–2 పరీక్ష పీజీ సీట్ల కేటాయింపునకు దోహదం చేయదు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. నాణ్యతను పెంచడమే లక్ష్యంగా... అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా వైద్యవిద్యలో నాణ్యతను పెంచడమే లక్ష్యంగా ఎన్ఎంసీ నెక్ట్స్ పరీక్షకు శ్రీకారం చుడుతోంది. జాతీయ స్థాయిలో ఏకీకృత పరీక్షను పెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా ఒకే నాణ్యమైన వైద్యవిద్యను అందించాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) నిర్వహిస్తున్నారు. అందులో పాసైతేనే ఇండియాలో డాక్టర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, ప్రభుత్వ వైద్య ఉద్యోగాల్లో చేరడానికి అనుమతి ఉంది. అయితే ఎఫ్ఎంజీఈ పరీక్ష ఎంతో కఠినంగా ఉండటంతో పరీక్ష రాసే వారిలో 20 శాతానికి మించి అర్హత సాధించలేకపోతున్నారు. దీంతో అనేకసార్లు ఈ పరీక్ష రాయాల్సి వస్తోంది. చాలా మంది అర్హత సాధించలేక ఇతరత్రా వృత్తుల్లో స్థిరపడిపోయినవారున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా నెక్ట్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇది పాస్ కాకుంటే ఎంబీబీఎస్ పట్టా ఇవ్వరు. దేశంలో వైద్యవిద్యకు ఒకే పరీక్షగా, వైద్యవిద్యను క్రమబద్ధీకరించడానికి ఇది నిర్వహించాలన్నది ఎన్ఎంసీ ఉద్దేశమని చెబుతున్నారు. వచ్చే నెల 28న మాక్ టెస్ట్... నెక్ట్స్‌పై అవగాహనకు ఈ ఏడాది ఎంబీబీఎస్ చదివే విద్యార్థుల కోసం మాక్ టెస్ట్ నిర్వహించాలని ఎన్ఎంసీ నిర్ణయించింది. వచ్చే నెల 28న ఆ పరీక్ష నిర్వహిస్తారు. అందుకోసం బుధవారం (జూన్ 28) నుంచి దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు ఎన్ఎంసీ సూచించింది. నెక్ట్స్–1 మాక్ టెస్టును ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. నెక్ట్స్–1ను ఎంబీబీఎస్ థియరీ పరీక్షకు బదులుగా నిర్వహిస్తున్నందున మూడు రోజులపాటు రోజు విడిచి రోజు ఈ పరీక్ష ఉంటుంది. మెడిసిన్ ఆలైడ్ సబ్జెక్టు పరీక్ష 3 గంటలపాటు నిర్వహిస్తారు. 120 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. అలాగే సర్జరీ, ఆలైడ్ సబ్జెక్టుల నుంచి 120 ప్రశ్నలు 3 గంటలపాటు ఉంటుంది. ఓబీజీ 120 ప్రశ్నలు, మూడు గంటలు ఉంటుంది. పీడియాట్రిక్స్ పరీక్ష 60 ప్రశ్నలకు గంటన్నరపాటు ఉంటుంది. ఈఎన్టీ పరీక్షకు 60 ప్రశ్నలు... గంటన్నర సమయం ఉంటుంది. ఆఫ్తాల్మాలజీ పరీక్ష 60 ప్రశ్నలు... మూడు గంటలు ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో పరీక్ష నిర్వహిస్తారు. నెక్ట్స్–2 పరీక్ష పూర్తిగా ప్రాక్టికల్ పరీక్ష మాత్రమే. క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రోగులను పరీక్షించే పరీక్ష నిర్వహిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. నెక్ట్స్ పరీక్షకు సంబంధించి కొంత గందరగోళం ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీకి లేఖ రాయాలని వర్సిటీ నిర్ణయించింది. -
వైద్య విద్య ప్రక్షాళన అత్యవసరం
ప్రస్తుతం ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి ప్రాక్టికల్ అంశాలపై అవగాహన నాస్తి. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరడమెలా అన్నదానిపైనే విద్యార్థి దృష్టి కేంద్రీకృతమై ఉంటోంది. కానీ ఎంబీబీఎస్ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మూడొంతుల వరకూ తక్కువ. అయినా అత్యధికులు పీజీ కోసం పోటీపడుతూంటారు. సహజ సామర్థ్యం, అభిరుచులకు అనుగుణంగా పీజీ కోర్సులను ఎంచుకునే సౌలభ్యం వారికి ఉండాలి. దానికోసం ప్రాంతీయ, దేశ అవసరాలకు తగ్గట్టుగా పీజీ సీట్ల సంఖ్యలో మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించుకోవాలి. దేశంలో వైద్యవిద్య ఎదుర్కొంటున్న ఇంకో సవాలు, నాణ్యత! వైద్య విద్య బోధనాంశాలను సమీక్షించి, మార్పులు చేయాల్సిన అవసరముంది. ఈ మార్పుల్లో ప్రాక్టికల్ అంశాలపై శ్రద్ధ పెట్టడం ఒకటి. ఇటీవల వార్తా పత్రికల్లో ప్రచురితమైన రెండు వార్తలు పరస్పర విరుద్ధంగా కనిపించాయి. ఒకటేమో ప్రభుత్వం యాభై కొత్త వైద్య కళాశాలలకు అనుమతిచ్చిందన్నది. ఈ రెండు కాలేజీల చేరికతో దేశంలోని మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,07,000కు చేరుకుంటుంది. రెండో వార్త ఏమిటంటే, దేశం మొత్తమ్మీద కనీసం 38 వైద్యకళాశాలు తమ గుర్తింపును కొన సాగించేందుకు అవసరమైన ప్రమాణాలను పాటించడం లేదన్నది! ఇంకో వంద కాలేజీలూ ఇదే స్థితిలో ఉన్నట్లు ఈ వార్త చెబుతోంది. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలను ఇవి పాటించడం లేదన్నది ఆరోపణ. సిబ్బంది బయోమెట్రిక్ పద్ధతుల్లో అటెండెన్ ్స ఇవ్వాలన్న అంశంతోపాటు మరికొన్ని ఉల్లంఘనల కారణంగా వీటి గుర్తింపు రద్దయ్యే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. బహుశా ఈ సమస్య కళాశాలల్లో తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల ఉత్పన్నమై ఉండ వచ్చు. లేదా, సిబ్బంది ఒక చోట కాకుండా, మరిన్ని కళాశాలల్లో బోధనకు అంగీకరించి ఉండటమూ కావచ్చు. దేశంలో ప్రస్తుతం ఉన్న వైద్యులు ఎంతమంది? 2002 జూన్ నెలలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం ప్రకారం 13,08,009 మంది అల్లోపతి వైద్యులు ఉన్నారు. వీరిలో పదవీ విరమణ చేసినవారు, మరణించిన వారు లేదా ఇతర దేశాలకు వలస వెళ్లినవారు ఉజ్జాయింపుగా 20 శాతం మంది ఉన్నారని అనుకున్నా ప్రస్తుతం పది లక్షలకుపైగా వైద్యులు అందుబాటులో ఉన్నట్లు తేలుతుంది. ఆయుష్ వైద్యులు 5.75 లక్షల మందిని కూడా చేర్చితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉన్నట్లు అవుతుంది. 2014లో దేశంలోని మొత్తం వైద్య కళాశాలలు 387 కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 695కి చేరింది. మరో 75 జిల్లా ఆసుపత్రులను వైద్యకళాశాలలుగా మార్చేందుకు ఇటీవలే ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిల్లో కొన్నింటిని ఇప్పటికే మార్చేశారు కూడా. జిల్లా ఆసుపత్రి కానీ, ఈఎస్ఐ ఆసుపత్రి కానీ రాత్రికి రాత్రి వైద్య కళా శాలగా మారిపోదు. ఇందుకు శిక్షణ పొందిన సిబ్బంది, మౌలిక సదుపాయాల కూర్పు వంటి అనేక మార్పులు, చేర్పులు అవసర మవుతాయి. దేశంలో ఇప్పటిమాదిరిగానే రాన్నున ఐదు, ఏడేళ్లలో ఏటా ఒక లక్ష మంది కొత్త ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులోకి వస్తారని అనుకుందాం. అప్పటికి దేశ జనాభా సుమారు 150 కోట్లకు చేరుకుంటుంది. వైద్యుల సంఖ్య కూడా 15 లక్షల వరకూ ఉంటుంది. కాబట్టి ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉంటాడు. ఈ దశలోనే పరిస్థితులు ఆసక్తికరంగా మారతాయి. ఏటా ఎంతమంది వైద్యులు అవసరం? వారందరితో సమర్థంగా పనిచేయించుకోగల పరిస్థితులు ఉన్నాయా? ప్రస్తుతం ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి ప్రాక్టికల్ అంశాలపై అవ గాహన నాస్తి. ఎందుకంటే పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరడమెలా అన్నదానిపైనే విద్యార్థి దృష్టి కేంద్రీకృతమై ఉంటోంది. కానీ ఎంబీబీఎస్ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మూడొంతుల వరకూ తక్కువ. అయినా ఎంబీబీఎస్ చదివిన వారిలో అత్యధికులు పీజీ కోసం పోటీపడుతూంటారు. పడాలి కూడా. సహజ సామర్థ్యం, అభిరుచు లకు అనుగుణంగా పీజీ కోర్సులను ఎంచుకునే సౌలభ్యమూ వారికి ఉండాలి. ప్రాంతీయ, దేశ అవసరాలకు తగ్గట్టుగా పీజీ సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు కల్పించుకోవాలి. ఉదాహరణకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఫ్యామిలీ మెడిసిన్ లో పీజీ చేసిన వారిని ఎంపిక చేయవచ్చు. బోధన, పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్నవారిని వైద్య కళాశాలలకు ఉపాధ్యాయులుగా శిక్షణ అందించాలి. ఆరోగ్య రంగంలో నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య తీవ్ర అంతరం ఉంటోంది. మూడింట రెండొంతుల జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నా, అక్కడ పనిచేస్తున్న వైద్యులు మొత్తం వైద్యుల్లో 30 శాతాన్ని కూడా చేరడం లేదు. గ్రామీణ ఆరోగ్య రంగ గణాంకాల ప్రకారం 2021– 22లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది కొరత యాభై శాతం కంటే ఎక్కువే! అంతేకాదు... రాష్ట్రాల వారీగా చూసినా ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పంపిణీలో తేడా ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, ఢిల్లీలతో పోల్చితే... జార్ఖండ్, యూపీ, బిహార్ రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఇంకో ఆసక్తికరమైన అంశం... కర్ణాటకలోని మొత్తం వైద్యుల్లో 40 శాతం రాజధాని బెంగళూరులోనే ఉండటం! ఫలితంగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఇప్పటికీ దూరంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లను పెంచాలన్న విధాన నిర్ణయం తీసుకోవటం అసలు లక్ష్యమేమిటి? నగరాల్లో తగినంత మంది వైద్యులు అందుబాటులోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంత అవసరాలను తీర్చడమా? మౌలిక సదుపాయాలు లేకపోవడం అనే కారణంతో చాలామంది వైద్యులు పల్లె ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడరు. పల్లెల్లో పనిచేస్తే పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి లేదన్న భావన కూడా కొంతమంది వైద్యుల్లో, మరీ ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల్లో చదివిన వారిలో ఉంటుంది. దేశంలో వైద్యవిద్య ఎదుర్కొంటున్న ఇంకో సవాలు, నాణ్యత! వైద్య విద్య బోధనాంశాలను అప్పుడప్పుడు సమీక్షించి, మార్పులు చేయాల్సిన అవసరముంది. ఈ మార్పుల్లో ప్రాక్టికల్ అంశాలపై శ్రద్ధ పెట్టడం ఒకటి. కొత్త కాలేజీలు ఏర్పాటవుతున్నంత వేగంగా మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదు. చాలా రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషలిస్టుల పోస్టులకు దరఖాస్తులే రాకపోవడం దీనికి ఒక ఉదాహరణ! తగిన మౌలిక సదుపాయాలు, పరికరాలు, పనిచేసుకునేందుకు తగినంత స్వేచ్ఛ ఉన్న ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మాత్రం ఈ పరిస్థితి లేదు. ఎంబీబీఎస్‌లోకి ప్రవేశాలను నియంత్రించేందుకు ‘నీట్’ ద్వారా గట్టి ప్రయత్నమే జరిగింది. అయితే సగం కాలేజీలు ప్రైవేట్‌వి కావడం, అక్కడి విద్యార్థుల ర్యాంకులు అతి తక్కువగా ఉండటం వల్ల దేశంలోని విద్యా ప్రమాణాల్లో సమానత లేదని తెలుస్తుంది! టెలి మెడిసిన్ టెక్నాలజీ ద్వారా దేశం మొత్తమ్మీద ఒకే రకమైన వైద్య విద్యను ఎందుకు అందించలేకపోతున్నామన్నది ప్రశ్న! ఏతావతా... దేశంలో వైద్యవిద్యను సమూలంగా మార్చాల్సిన అవసరముంది. 1910లో ఫ్లెక్స్నర్ నివేదిక తరువాత అమెరికాలో జరిగిన మార్పుల మాదిరిగా అన్నమాట. అప్పట్లో బోధనాంశాలు మొత్తాన్ని రివైజ్ చేశారు. కాలేజీల సంఖ్యను 155 నుంచి తగ్గించారు. ప్రతి అంశానికి సంబంధించిన కనీస ప్రమాణాలు, శిక్షణ, అవధులను నిర్ణయించారు. తరువాతి కాలంలో కెనడా, యూరప్‌లలోనూ ఇదే పద్ధతిని అనుసరించడం గమనార్హం. భారత్‌లో వైద్య కళాశాలల సంఖ్యను హేతుబద్ధీకరించాల్సిన అవసరముంది. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఎంబీబీఎస్ వైద్యులు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులను సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు 2025లో మనకు చిన్న పిల్లల వైద్యులు, కంటి వైద్యుల అవసరం ఎక్కువ అనుకుందాం. అదే సమయంలో ఐదేళ్ల తరువాత న్యూరోసర్జన్లు, ఫిజీషియన్ల అవసరం ఉందని అనుకుంటే... అందుకు తగ్గట్టుగా పీజీ కోర్సులు, సీట్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు చేసుకోవాలి. రాకేశ్ కోచర్ వ్యాసకర్త ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ మాజీ అధ్యక్షులు(‘ద ట్రిబ్యూన్’ సౌజ్యంతో) -
పీజీ వైద్య సీట్ల పంట
సాక్షి, అమరావతి: ఇటు ఎంబీబీఎస్ సీట్లు.. అటు పీజీ సీట్లు! ఒకేసారి కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లతోపాటు అదనంగా 510 పీజీ వైద్య సీట్లతో రాష్ట్ర వైద్య విద్యా రంగంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్ గేమ్ ఛేంజర్‌గా అవతరిస్తోంది. ఒక్క ఏడాదిలోనే వీటిని సాధించడం ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్ర వైద్య విద్యా రంగం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పీజీ సీట్లు పెరుగుతున్నాయి. వైద్య విద్యను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గత నాలుగేళ్లలో ఏకంగా 702 పీజీ సీట్లు కొత్తగా సమకూరడం గమనార్హం. అధికారంలోకి రాగానే ప్రభుత్వ వైద్య రంగాన్ని తీర్చిదిద్దుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తూనే అప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో వసతులను మెరుగు పరిచారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా కళాశాలల్లో వైద్యులు, సిబ్బందిని సమకూర్చడంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించారు. ఫలితంగా 1956 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో వైద్య సీట్లు పెరిగాయి. పీజీ సీట్లు ఇంకా పెరిగే చాన్స్ రాష్ట్రంలో పది వైద్య కళాశాలల్లో నాలుగేళ్ల క్రితం వరకూ 966 పీజీ సీట్లు మాత్రమే ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఏసీఎస్ఆర్ కళాశాలలో ఒక్క పీజీ సీటు కూడా లేదు. అలాంటిది నాలుగేళ్లలో వరుసగా 2020లో 24 సీట్లు, 2021లో 31 సీట్లు, 2022లో 137 సీట్లు చొప్పున రాష్ట్రానికి అదనంగా పీజీ సీట్లు సమకూరాయి. 2023లో 737 సీట్లు పెంచాలని ఎన్ఎంసీకి ప్రతిపాదించగా ఇప్పటి వరకు 510 సీట్లు మంజూరయ్యాయి. మిగిలిన సీట్ల పెంపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విద్యా సంవత్సరంలో పీజీ సీట్ల ప్రవేశాలకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈలోగా మరికొన్ని సీట్లు రాష్ట్రానికి దక్కే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గత నాలుగేళ్లలోనే ఏకంగా 702 సీట్లు పెరగడంతో ఇప్పటికే 1,668 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 42.08 శాతం సీట్లు పెరిగాయి. ఏసీఎస్ఆర్ కళాశాల కూడా పీజీ సీట్లలో బోణీ కొట్టింది. ప్రస్తుతం ఆ కళాశాలలోనూ 24 పీజీ సీట్లు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా సమకూరాయి. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ వైద్యులు, స్పెషలిస్ట్ వైద్యుల అందుబాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మెరుగైన స్థానంలో ఉంది. పీజీ సీట్లు పెరగడంతో స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీ వైద్యుల సంఖ్య మరింత పెరగనుంది. తద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది. వైద్య రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు సత్వరమే, నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళుతున్నాం. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీట్ల పెంపుతో పలు లాభాలు వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరగడం వల్ల చాలా లాభాలుంటాయి. రీసెర్చ్ కార్యకలాపాలు, రోగులకు వైద్యుల అందుబాటు పెరుగుతుంది. మన ఆస్పత్రుల్లో నిత్యం వేల సంఖ్యలో ఓపీలు, ఐపీలు నమోదవుతుంటాయి. వీటిద్వారా రీసెర్చ్ కార్యకలాపాలు పెరుగుతాయి. ప్రభుత్వం సైతం రీసెర్చ్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవచ్చు. పీజీ సీట్లు పెరగడంవల్ల చిన్నచిన్న పట్టణాల్లో కూడా స్పెషలిస్టులు అందుబాటులోకి వస్తారు. – కంచర్ల సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ భారీగా పోస్టుల భర్తీ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం వైద్య సీట్లు పెరగాలంటే ఆయా విభాగాల్లో తగినంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్లు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది విధిగా ఉండాలి. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఒక్కో ప్రొఫెసర్‌కు 3 పీజీ సీట్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 2 పీజీ సీట్ల చొప్పున ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక డీఎంఈలో 106 ప్రొఫెసర్, 312 అసోసియేట్ ప్రొఫెసర్, 832 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కొత్తగా సృష్టించారు. వీటితో కలిపి 1,585 పోస్టులను ఇప్పటివరకూ భర్తీ చేశారు. పదోన్నతుల ద్వారా 500 వరకూ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ అయ్యాయి. -
ఏపీలో పెరగనున్న స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య
-
ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
భూదాన్‌పోచంపల్లి: వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్‌కు వెళ్లిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లికి చెందిన గూడూరు రాంరెడ్డి, రాధ దంపతుల కుమారుడు మణికాంత్‌రెడ్డి(21) ఫిలిప్పీన్స్‌లోని దావో మెడికల్ కాలేజీలో 2020లో ఎంబీబీఎస్‌లో చేరాడు. కరోనా కారణంగా కొద్దిరోజులు ఆన్లైన్లో క్లాసులు విన్నాడు. గత ఏడాది ఆగస్టులో ఫిలిప్పీన్స్ వెళ్లాడు. ప్రస్తుతం థర్డ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నాడు. అయితే.. ఆదివారం తెల్లవారుజామున మణికాంత్‌రెడ్డి ఉంటున్న హాస్టల్ మేనేజర్ రాంరెడ్డికి ఫోన్‌చేసి మీ కుమారుడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడని, కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్‌చేసి మెట్లపై నుంచి జారి పడి మృతిచెందాడని చెప్పారు. మణికాంత్‌రెడ్డి మృతదేహం ఫొటో, వీడియో పంపించారు. కాగా.. హాస్టల్ వెనుక డ్రెయినేజీలో మణికాంత్‌రెడ్డి మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. హాస్టల్ యాజమాన్యం, పోలీసులు చెప్పిన తీరు వేర్వేరుగా ఉండటంతో కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మణికాంత్‌రెడ్డి డ్రెయినేజీలో పడి ఉండటం,తలకు గాయం ఉండటంతో హత్యేనని ఆరోపిస్తున్నారు. కచ్చితంగా ఎవరో హత్య చేసి డ్రెయినేజీలో పడేసి ఉంటారని అంటున్నారు. 15 రోజుల క్రితం హాస్టల్లో మనదేశానికే చెందిన విద్యార్థులకు, మణికాంత్‌రెడ్డికి మధ్య గొడవ జరిగిందని, వారిలో ఎవరైనా ఘాతుకానికి పాల్పడ్డారా అనిఅనుమానిస్తున్నారు. మణికాంత్‌రెడ్డి మృతదేహాన్ని వెంటనే ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మంత్రి కేటీఆర్‌ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి, ఫిలిప్పీన్స్‌లోని ఎంబసీతో పాటు, అక్కడి ఎన్ఆర్ఐలతోనూ మాట్లాడి.. మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. మేమెట్టా బతికేది నాలుగురోజుల కిందట మాట్లాడినం. హాస్టల్ ఫీజు కావాలంటే పంపించిన. ‘పరీక్షలు నడుస్తున్నయి, నేనే ఫోన్ చేసి మాట్లాడుతా’అన్నడు. శనివారం ఫోన్ చేస్తే కలువలేదు. ఆదివారం చేద్దామనుకొన్నం. ఈ లోపు ఘోరం జరిగిపోయింది. నా కొడుకు లేకుండా మేమెట్లా బతికేది. – గూడూరు రాంరెడ్డి, మృతుడి తండ్రి -
నీట్ ప్రవేశపరీక్షకు రికార్డు దరఖాస్తులు
న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ ప్రవేశ పరీక్ష రాయడానికి ఈ ఏడాది 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేశంలోనే అతి పెద్దదైన ఈ ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 20.87 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ సంఖ్య 2.57 లక్షలు ఎక్కువ. ఈసారి అమ్మాయిలు ఎక్కువ మంది పరీక్ష రాస్తూ ఉండడం విశేషం. మొత్తం రిజిస్ట్రేషన్లలో అమ్మాయిలు 11.8 లక్షలున్నారు. అబ్బాయిల కంటే 2.8 లక్షలు అధికంగా మెడికల్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షకి హాజరుకానున్నారు. మే 7న నీట్ పరీక్ష జరగనుంది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా అభ్యర్థులు ప్రవేశ పరీక్షలకు హాజరు కానుండగా, ఆ తర్వాత స్థానంలో యూపీ నిలిచింది. -
నారాయణ మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ సాక్షి, అమరావతి: ‘తమ బిడ్డలకు వైద్య విద్య థియరీ పరీక్షల్లో 90 శాతం, 88 శాతం మార్కులొచ్చాయి. అయితే ప్రాక్టికల్ పరీక్షల్లో మాత్రం ఫెయిల్ చేశారు.’ ఇది అన్యాయమంటూ పలువురు వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం నగరంలోని నారాయణ మెడికల్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు సరిగా ప్రాక్టికల్స్ చేయలేదని యాజమాన్యం చెబుతోందని తెలిపారు. అయితే, థియరీ పరీక్షల్లో 90, 88, 85 మార్కులు ఎలా వచ్చాయో తెలపాలంటూ డిమాండ్ చేశారు. వైద్యకళాశాల డీన్, అధ్యాపకులు మళ్లీ పరీక్షలు రాసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు తమ వద్దకు ట్యూషన్‌కు రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. వైద్య కళాశాల వద్ద ఆందోళన అనంతరం పలువురు మెడికోల (వైద్య విద్యార్థులు) తల్లిదండ్రులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు కళాశాల డీన్ మాట్లాడుతూ గత నెలలో నారాయణ కళాశాలలో నిర్వహించిన ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ పార్ట్–2 ప్రాక్టికల్ పరీక్షల్లో కొంత మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. ఇందుకు కళాశాలను నిందించడం దురదృష్టకరమన్నారు. అంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణమేంటి? ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్–2 పరీక్షల్లో నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్ కావడంతో పలువురు తల్లిదండ్రులు ఈ విషయాన్ని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బాబ్జీ దృష్టికి తీసుకువచ్చారు. యాజమాన్యం చేసిన తప్పిదాల వల్లే తమ పిల్లలు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలియజేయాలని నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్‌ను విశ్వవిద్యాలయం వివరణ కోరింది. కళాశాలలో సుమారు 250 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉండగా, 106 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. వీరిలో 56 మంది ప్రాక్టికల్స్, థియరీ రెండింటిలో ఫెయిల్ అవ్వగా, 50 మంది థియరీలో ఉత్తీర్ణత సాధించి, ప్రాక్టికల్స్‌లో మాత్రమే ఫెయిల్ అయ్యారు. -
విజయనగరం వైద్య కళాశాలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్యలో సువర్ణాధ్యాయం లిఖించేలా కీలక ముందడుగు పడింది. విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు నిర్వహించేలా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్ఎంసీ నుంచి వైద్య శాఖకు మంగళవారం ఉత్తర్వులు అందాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా 17 వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐదుచోట్ల జిల్లా ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన బోధనాస్పత్రులుగా తీర్చిదిద్దడంతోపాటు ఒక్కోచోట 150 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లకు అనుమతులు కోరుతూ ఎన్‌ఎంసీకీ గత ఏడాది దరఖాస్తు చేసింది. దీంతో ఈ నెల మొదటి వారంలో 5చోట్ల ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అనంతరం విజయనగరం వైద్య కళాశాలలో అడ్మిషన్లకు ఆమోదం లభించింది. మిగిలిన నాలుగు కళాశాలలకు ఆమోదం లభించాల్సి ఉంది. వీటికి కూడా ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరుతాయి. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో చివరిసారిగా 2014లో నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. ఈ కళాశాల ఏర్పాటుకు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే అడుగులు పడ్డాయి. అనంతరం టీడీపీ హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కాలేదు. అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఏర్పాటుకు కృషి చేసిన దాఖలాలు లేవు. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుకు కొమ్ముకాసింది. సీఎం వైఎస్ జగన్ కృషితో తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటైంది. వైద్య రంగంలో మరో మైలురాయి విజయనగరం వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ఇచ్చేందుకు ఎన్ఎంసీ ఆమోదం ఇవ్వడం శుభపరిణామం. దీంతో రాష్ట్ర వైద్య రంగంలో మరో మైలురాయి వచ్చి చేరింది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో తొలుత విజయనగరం కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు లభించాయి. విజయనగరం వైద్య కళాశాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సంరక్షణ సమకూరుతుంది. మరో 4 కళాశాలలకు కూడా అనుమతులు లభిస్తాయని దృఢ నిశ్చయంతో ఉన్నాం. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో ఆ సీట్లను 1,249 కు పెంచుకోగలిగాం. మరో 637 సీట్ల పెంపుదల కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఇప్పటివరకు 90 సీట్లను అదనంగా సాధించగలిగాం. – విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి -
5 కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది అడ్మిషన్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్యకు మహర్దశ పట్టనుంది. వరుసగా మూడేళ్లలో 750, 750, 1,050 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వైద్య విద్యా రంగంలో విద్యార్థులకు విస్తృత అవకాశాలు కలగనున్నాయి. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.8,480 కోట్లు వ్యయం చేస్తోంది. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదు కొత్త వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. 2024–25లో మరో ఐదు కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యుద్ధ ప్రాతిపదికన.. రానున్న విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రిల్లో కొత్త వైద్య కళాశాలల అకడమిక్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా తీర్చిదిద్దుతున్నారు. మచిలీపట్నం మినహా మిగిలిన నాలుగు చోట్ల ప్రీ–ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీటిల్లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా వచ్చే ఏడాది రాష్ట్రంలో 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరనున్నాయి. అదనపు భవనాలు, పడకలు 2024–25లో అకడమిక్ కార్యకలాపాలు మొదలయ్యే వాటిల్లో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలున్నాయి. పాడేరులో ఇప్పటికే 150 పడకల ప్రభుత్వాస్పత్రి ఉండగా మిగిలిన నాలుగు చోట్ల వంద పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వాస్పత్రులున్నాయి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలంటే 330 పడకల సామర్థ్యం కలిగిన బోధనాస్పత్రి అందుబాటులో ఉండాలి. ఈ క్రమంలో ఆయా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా తీర్చిదిద్ది అదనపు భవనాల నిర్మాణం, పడకల పెంపు చేపట్టనున్నారు. మిగిలిన ఏడు వైద్య కళాశాలలు 2025–26లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయనున్నారు. చేరువలో స్పెషాలిటీ వైద్యం కొత్త వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలపై లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. వచ్చే విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలు మొదలవుతాయి. అనంతరం మరో ఐదు కళాశాలల్లో ప్రారంభించేలా కృషి చేస్తున్నాం. పెద్ద ఎత్తున వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యతోపాటు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత చేరువ చేయడం సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి -
తెలంగాణ వైద్య విద్య దేశానికే ఆదర్శం
చౌటుప్పల్: తెలంగాణలోని వైద్యవిద్య దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సమైక్య పాలనలో వైద్యవిద్యను అభ్యసించాలంటే విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్ దేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రస్తుతం వైద్యం, వైద్య విద్య గ్రామీణ ప్రాంతాలకే వచ్చిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను మంగళవారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 107 కళాశా లలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. సమైక్య పాలనలో తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రుల్లో మాత్రమే కిడ్నీ డయాలసిస్ సెంటర్లు ఉండేవని, వీటిని 102కు పెంచామన్నారు. ప్రతి ఏడాది డయాలసిస్ సెంటర్లకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, కిడ్నీ బాధితులపై ఒక్క పైసాకూడా భారం పడకుండా సేవలు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తామంటే బీబీనగర్‌లోని రూ.500 కోట్ల విలువ చేసే భూమి, భవనాలను కేంద్రానికి అప్పగించా మని, నాలుగేళ్లలో అక్కడ తట్టెడు మట్టికూడా పోయలేదని ధ్వజమెత్తారు. -
ఎఫ్ఎంజీ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం బట్టబయలు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశంలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీ) ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణం వెలుగు చూసింది. దాంతో సీబీఐ మన రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని 91 నగరాలు, పట్టణాల్లో గురువారం విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎఫ్ఎంజీ ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు మనదేశంలో వైద్యవృత్తి చేపట్టాలంటే ఎఫ్ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఈ పరీక్ష నిర్వహిస్తుంది. కాగా, ఇందులో ఉత్తీర్ణులు కాకుండానే ఉత్తీర్ణులైనట్టుగా దేశంలో 73మంది ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు సీబీఐ గుర్తించింది. ఆ ఫేక్ సర్టిఫికెట్లను ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు సైతం ఆమోదించడం గమనార్హం. దీనిపై సీబీఐ ఈ నెల 22న కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈ ఫేక్ సర్టిఫికెట్లతో ప్రమేయం ఉన్న పలువురు ఎఫ్ఎంజీ గ్రాడ్యుయేట్లు, అందుకు సహకరించిన మెడికల్ కౌన్సిళ్లు, వైద్య సంస్థలను గుర్తించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ ప్రకటించింది. మన రాష్ట్రంలోనూ నకిలీ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ ఎఫ్ఎంజీ ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో సీబీఐ అధికారులు ఈ నెల 23న తనిఖీలు నిర్వహించారు. 12 గంటలపాటు ఏకబిగిన కొనసాగిన ఈ సోదాల్లో 2014 నుంచి 18 మధ్య విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల వివరాలను పరిశీలించారు. ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నంతసేపు కార్యాలయంలో అధికారులు, సిబ్బందిని బయటకు కూడా పంపించలేదు. కాగా గురువారం విజయవాడలోని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌తోపాటు విశాఖపట్నంలోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. -
TS:వైద్య విద్య చరిత్రలో రికార్డు.. 6.50లక్షల ర్యాంకుకు ఎంబీబీఎస్ సీటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో రికార్డు ఇది. ఎన్నడూ లేనంతగా ఇప్పుడు లక్షలాది ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కూడా ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కుతున్నాయి. గతేడాది ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ సీటు నీట్లో 2.70 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు రాగా, ఈసారి ఏకంగా 6.50 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా సీట్లు దక్కడం రికార్డు అని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఎన్ఆర్ఐ కోటాలోనైతే గతేడాది 9 లక్షల ర్యాంకుకు సీటు రాగా, ఈసారి దాదాపు 10 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా సీటు వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 85% రిజర్వేషన్‌తో తగ్గిన కటాఫ్ రాష్ట్రంలో ప్రస్తుతం 17 ప్రభుత్వ, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో ఈసారి కొత్తగా ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా సీట్ల సంఖ్య పెరిగింది. ప్రభుత్వంలో అన్నీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లు కనీ్వనర్ కోటా కింద సీట్లు కేటాయిస్తారు. ప్రైవేట్‌లో సగం సీట్లు యాజమాన్య కోటా కింద కేటాయిస్తారు. 50 శాతంలో 35 శాతం బీ కేటగిరీ, మరో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయిస్తారు. కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వంలో రూ. 10 వేలు, ప్రైవేట్‌లో రూ. 60 వేలు ఏడాది ఫీజు ఉంటుంది. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ ఫీజు రూ. 11.55 లక్షలు ఏడాదికి, ఎన్ఆర్ఐ ఫీజు బీ కేటగిరీకి రెట్టింపు వరకు వసూలు చేసుకోవచ్చు. ప్రభుత్వం పెంచిన మెడికల్ కాలేజీలతో మంచి ర్యాంకులు వచి్చన విద్యార్థులకు అందులో కన్వీనర్ కోటా సీట్లు రాగా, మిగిలిన విద్యార్థులకు బీ–కేటగిరీ సీట్లు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బీ–కేటగిరీలో 85% స్థానిక రిజర్వేషన్ తీసుకురావడంతో వెయ్యికి పైగా సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు దక్కాయి. అందుకే ఇతర రాష్ట్రాల విద్యార్థులు తక్కువ మంది దర ఖాస్తు చేసుకున్నారు. దీంతో 6.50 లక్షల ర్యాంకు వచి్చన విద్యార్థులకు కూడా ఈసారి బీ– కేటగిరీలో సీట్లు దక్కా యని చెబుతున్నారు. దీంతో భారీగా కటాఫ్ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన సీట్లు 188.. ప్రస్తుతం అన్ని కేటగిరీలకు చెందిన సీట్లకు మాప్ రౌండ్ వరకు సీట్ల కేటాయింపు పూర్తయింది. మరో స్పెషల్ రౌండ్ నిర్వహించాలని భావిస్తున్నారు. వాస్తవానికి మాప్ రౌండ్‌తోనే కౌన్సెలింగ్ ముగిస్తారు. కానీ బీ, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ల మిగులుతో మరో రౌండ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. లెక్కల ప్రకారం బీ,సీ–కేటగిరీల్లో 188 ఎంబీబీఎస్ సీట్లు మిగిలాయి. గతేడాది 144 ఎంబీబీఎస్ సీట్లు మిగిలా యి. కొందరు చేరాక సీట్లు వదులుకోవడం, కొందరు బ్లాక్ చేయడం, కొన్ని కాలే జీల్లో ఎన్ఆర్ఐ సీట్లకు భారీ ఫీజులు ఉండటంతో చేరకపోవడం ఇందుకు కారణం. చదవండి: విదేశీ కొలువు.. బహు సులువు.. 140కి చేరిన రిక్రూటింగ్ ఏజెన్సీలు.. -
PG Medical Seats: కేంద్రం కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్‌కు 630 పీజీ వైద్యసీట్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో పీజీ వైద్యసీట్ల పంట పండింది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ప్రభుత్వం ఒకేసారి 630 పీజీ వైద్యసీట్లను తెచ్చింది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అండర్ సెక్రటరీ చందన్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ సర్కారుకు అనుమతిస్తూ లేఖ రాశారు. ఈ మేరకు ఎంవోయూ పంపిస్తున్నామని, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలేజీల వారీగా ఎంవోయూకు ఆమోదం తెలపాలని సూచించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యకళాశాలలు పీజీలు, సీనియర్ రెసిడెంట్లతో కళకళలాడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. ఆయా కాలేజీలు రెండునెలల కిందట సెంట్రల్ స్పాన్సర్షిప్ కింద 688 సీట్లకు ప్రతిపాదన పంపించాయి. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ 630 పీజీ వైద్యసీట్లకు ఆమోదముద్ర వేసింది. భారీగా నియామకాలు చేసినందునే.. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనివినీ ఎరుగని రీతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిపినందునే పీజీ సీట్లు మంజూరు చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. గత మూడున్నరేళ్లలో దాదాపు 455 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. 2,500 మందికిపైగా పారామెడికల్ సిబ్బందిని నియమించారు. దీంతోపాటు నాడు–నేడులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇవన్నీ చేయడం వల్లనే కేంద్రం కొత్త పీజీ వైద్యసీట్లకు ఆమోదముద్ర వేసింది. తాజాగా మంజూరైన సీట్లలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ ఇలా సుమారు 18 విభాగాలకు సంబంధించిన పీజీ వైద్యసీట్లు ఉన్నాయి. అత్యధికంగా ఆంధ్రా మెడికల్ కళాశాలకు 128 సీట్లు రాగా అత్యల్పంగా నెల్లూరు మెడికల్ కాలేజీకి 5 సీట్లు వచ్చాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు కొత్తగా పీజీ వైద్యసీట్లతో పాటు సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్తగా సీట్లొచ్చాయి. దీనివల్ల సామాన్యులకు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ పరిధిలో సీట్లు పెరగడం పేద వైద్యవిద్యార్థులకూ మంచి పరిణామం. – డాక్టర్ హరిచరణ్, వైస్ ప్రిన్సిపాల్, కర్నూలు మెడికల్ కాలేజీ -
స్థానిక భాషల్లో వైద్య విద్యా?
భారతదేశంలో సుమారు 600 వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు తమ రాష్ట్రం వెలుపలి కాలేజీల్లో అడ్మిషన్లను పొందే స్వేచ్ఛ ఉంది. ఇంగ్లిష్ ఉపయోగాన్ని త్యజించడం వల్ల అలాంటి అవకాశం వీరికి కష్టమవుతుంది. హిందీ మీడియం విద్యార్థి ఇకపై కర్ణాటక లేక మహారాష్ట్రలో చదవటం కష్టమైపోతుంది. అక్కడ బోధనా మాధ్యమం ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో ఉంటుంది. ఇలాంటి విద్యార్థులు విదేశీ డిగ్రీ చదవడం ఇంకా కష్టసాధ్యమైన విషయం. హిందీ వైద్య పాఠ్యపుస్తకాలను ప్రారంభించడాన్ని మన విద్యా రంగంలో పునరుజ్జీవనం, పునర్నిర్మాణంగా కేంద్ర పాలకులు కొనియాడుతున్నారు. కానీ నిజమైన పునరుజ్జీవనం భారతీయ భాషల్లో కొత్తదైన మూల జ్ఞానాన్ని సృష్టించడంతోనే సాధ్యపడుతుంది. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువదించిన మూడు సెట్ల వైద్య పాఠ్య పుస్తకాలను గత వారాంతంలో భోపాల్‌లో అట్టహాసంగా విడుదల చేశారు. మధ్య ప్రదేశ్‌లో ఎంబీబీఎస్ కోర్సు కోసం హిందీని బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నంలో ఈ పాఠ్యపుస్తకాలు భాగం. నూతన విద్యావిధానం అమలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన ఆదేశాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తోంది. ఇతర అంశా లతోపాటు, భారతీయ భాషల్లో సాంకేతిక, వైద్య కోర్సుల బోధనను నూతన విద్యావిధానం నొక్కి చెబుతోంది. వృత్తివిద్యా కోర్సుల కోసం జాయింట్ ఎంట్రెన్స్ పరీక్షలు వంటి అన్ని ప్రధానమైన పోటీ పరీక్షలను ఇప్పటికే ఇంగ్లిష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వ హిస్తున్నారు. యూనివర్సిటీలలో గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశం కోసం ఇటీవలే ప్రారంభించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్షలో కూడా ఈ విధానాన్నే అమలు పరుస్తున్నారు. ఉన్నత విద్య స్థాయిలో భారతీయ భాషల్లో బోధన పూర్తిగా కొత్త విషయం కాదు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు వివిధ భారతీయ భాషల్లో పీహెచ్డీ స్థాయి వరకు కోర్సులను ప్రతిపాదిస్తున్నాయి. ఆయుర్వేదిక్ వైద్య కోర్సులను హిందీ, ఇతర భారతీయ భాషల్లో బోధిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, తమిళనాడు ప్రభుత్వం తమిళంలో వైద్య విద్యా బోధన చేయాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో 1918 నుంచి 1948 వరకు ఉర్దూలో మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులను బోధించారు. భోపాల్‌లో పాఠ్య పుస్తకాలను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా హిందీలో ఎంబీబీఎస్ కోర్సుల వెనుక లాజిక్ ఏమిటంటే– ఇంగ్లిషులో కంటే మాతృభాషలో విద్యా బోధన చేస్తే ఆలోచించడం, మననం చేయడం, హేతుపూర్వకంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి అభిజ్ఞా నైపుణ్యాలు నేర్చుకోవడంలో పిల్లలు మెరుగ్గా ఉంటారన్నదే. మాతృభాషల్లో విద్యాబోధన వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ మార్పును మరీ తొందరగా మొదలెట్టినట్లు కనిపిస్తోంది. సాంకే తిక, శాస్త్రీయ అంశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను అనువదిం చడంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే, శాస్త్రీయ పదజాలాన్ని ఉపయో గించడమే. ఇంగ్లిష్‌లోని మూల పదజాలాన్ని అలాగే ఉంచాలా, భార తీయ భాషల్లోకి అనువదించవచ్చా? భోపాల్‌లో విడుదల చేసిన మూడు మెడికల్ పుస్తకాల (అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ) టైటిల్సు చూసినట్లయితే, ఇంగ్లిష్‌లో సుపరిచితమైన పదాలను యథా తథంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అంటే వివరణాత్మక విషయాన్ని హిందీలో అందుబాటులో ఉంచుతారు. అది సంస్కృతీకరించిన హిందీలా కాకుండా, వాడుక భాషలోనే ఉంటుందని ఆశిద్దాము. ఏవిధంగా చూసినా సరే, వైద్య పుస్తకాలను అనువదించటం కష్టమైన ప్రయత్నం. ఎందుకంటే ఈ వైద్యవిద్యా పట్టభద్రులు మానవుల ప్రాణాలతో వ్యవహరిస్తారు. పైగా పాఠ్యపుస్తకాలు అనేవి వైద్య కోర్సులో ఒక భాగం మాత్రమే. పాఠ్యపుస్తకాలతోపాటు, వంద లాది రిఫరెన్స్ పుస్తకాలు, మాన్యువల్స్ కూడా వీరు తిరగేస్తారు. ఇవి చాలావరకు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. ఒక డాక్టర్ శిక్షణ, బాధ్యతల నిర్వహణలో ఇవి చాలా ముఖ్యమైనవి. హిందీ, ఇతర భారతీయ భాషల్లో శిక్షణ పొందిన వైద్యులకు తదుపరి చదువులు, కెరీర్ అవకా శాలు సవాలుగా నిలుస్తాయి. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్, సూపర్ స్పెషలైజేషన్, మెడికల్ రీసెర్చ్ వంటివి ఇంగ్లిష్‌లోనే కొనసాగుతాయి. వైద్య బోధనను భారతీయ భాషల్లోనే చేయాలని ఆతృత ప్రదర్శిస్తున్నవారు వీటిని కూడా అనువదించి ఇస్తారా, ఇది ఎలా సాధ్యపడుతుంది అనేది స్పష్టం కావడం లేదు. పాఠ్యపుస్తకాలు, ‘కోర్స్‌వేర్’తో పాటు శిక్షణ పొందిన టీచర్లు, పరీక్ష యంత్రాంగం, బహు భాషా రీసెర్చ్ జర్నల్స్ వగైరాలు కూడా అవసరమే. జాతీయ వైద్య కమిషన్ లేక రాష్ట్ర వైద్య విద్యా విభాగాలు దీనికి సంబంధించి ఏదైనా బ్లూప్రింట్‌ను రూపొందించి ఉంటే దాన్ని ప్రజలకు అందు బాటులో ఉంచాలి. ప్రస్తుతం, భారతదేశంలో 600 వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు తమ రాష్ట్రం వెలుపలి కాలేజీల్లో అడ్మిషన్లను పొందే స్వేచ్ఛ ఉంది. ఇంగ్లిష్ ఉపయోగాన్ని త్యజించడం వల్ల అలాంటి అవకాశం వీరికి కష్టమవుతుంది. ఉదాహరణకు, మధ్యప్రదేశ్ నుండి హిందీ మీడియం డిగ్రీ ఉన్న ఒక విద్యార్థి ఇకపై కర్ణాటక లేక మహా రాష్ట్రలోని కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటం కష్టమైపోతుంది. ఎందుకంటే అక్కడ బోధనా మాధ్యమం ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి విద్యార్థులు విదేశీ డిగ్రీ చదవడం ఇంకా కష్టసాధ్యమైన విషయంగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో వైద్య విద్యలో కోర్సులు బోధిస్తు న్నప్పుడు విద్యార్థులందరికీ ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండటం తప్పని సరిగా ఉండేది. పాఠ్యపుస్తకాలు కూడా ఆంగ్లంలో ఉండేవి. ఉర్దూలో బోధన ప్రారంభం కావడానికి ముందే, ఒక అనువాద బ్యూరోని ఏర్ప ర్చారు. శాస్త్రీయ పదజాలంతో వ్యవహరించడానికి అనువాద మెథడా లజీ వృద్ధిచేశారు. రవీంద్రనాథ్ టాగూరు సహా దేశమంతటి నుంచి విద్యా నిపుణులను సంప్రదించేవారు. ప్రస్తుత సందర్భంలో అలాంటి పథకం లేదు. విద్యార్థి బృందంతో సహా విద్యతో సంబంధమున్న ప్రతి ఒక్కరితోనూ విస్తృత సంప్రదింపులు జరపడం కూడా ఇప్పుడు లేకుండా పోయింది. పలు భారతీయ భాషల్లోకి పాఠ్య పుస్తకాలు అనువదించినట్లయితే, అనుకూలత లేదా సమరూపతకు హామీ ఇవ్వ డానికి సాంకేతిక పదాలను ప్రామాణీకరించాలి. మాతృభాషలో సాంకేతిక కోర్సులను బోధించడాన్ని సమర్థించే వారు జపాన్ను ఉదాహరణగా చూపుతున్నారు. జపనీస్ భాషలో బోధన ద్వారా జపాన్ గొప్ప సాంకేతిక, పారిశ్రామిక ముందంజ వేయగలిగిందని చెబుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా అప్పట్లో జపాన్ నుండి ప్రేరణ పొందింది. 1920లలో హైదరాబాద్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్ సయ్యద్ రాస్ మసూద్‌ను జపనీస్ సాంకేతిక విద్యా నమూనా అధ్యయనం కోసం జపాన్ పంపించారు. చైనా, రష్యా, జర్మనీ కూడా తమతమ భాషల్లోనే సాంకే తిక విద్యలను బోధించేవి. ఇవి దశాబ్దాలపాటు శాస్త్ర సంబంధ పదజాలాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. ఈ దేశాలకూ, భారతదేశానికీ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, అవి చాలావరకు ఏక భాషా సమాజాలు. భారత్ బహు భాషల నిలయం. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కూడా భారతీయ భాషల్లో కోర్సులను ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సెల విచ్చారు. ఇంజినీరింగ్ విద్యను భారతీయ భాషల్లోనే బోధించడానికి పది రాష్ట్రాల్లో సన్నాహాలు చేస్తున్నామని అమిత్ షా చెప్పారు. తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ భాష ల్లోకి ఇంజినీరింగ్ పుస్తకాలను అనువదిస్తున్నట్లు తెలిపారు. భారతీయ భాషల్లో బోధనలో పదజాలం, ఇతర సమస్యలతో పాటు అలాంటి ఇంజినీరింగ్ కోర్సులు కీలక రంగాల్లో పోటీతత్వాన్ని హరింప జేస్తాయి. ప్రత్యేకించి ఔట్ సోర్సింగ్ పరిశ్రమలో పోటీ ఎంతగా ఉంటుందో తెలిసిందే. సాఫ్ట్వేర్, ఐటీ ఆధారిత సేవల్లో భారత్ అగ్రగామిగా ఉండటానికి ఆంగ్లంతో సుపరిచితమైన ఇంజినీరింగ్ వర్క్ ఫోర్స్ కారణం అని చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఇతర దేశాలు కూడా పోటీ పడుతున్నప్పుడు, సాధారణ ఉద్యోగాల స్థానంలో యాంత్రికీకరణ వేగంగా ప్రవేశిస్తున్నప్పుడు ఈ మార్కెట్లో భారత్ తన స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. హిందీ వైద్య పాఠ్యపుస్తకాలను ప్రారంభించడాన్ని మన విద్యా రంగంలో పునరుజ్జీవనం, పునర్నిర్మాణంగా కొనియాడుతున్నారు. నిజమైన పునరుజ్జీవనం అనేది భారతీయ భాషల్లో కొత్తదైన మూల జ్ఞానాన్ని సృష్టించడంతోనే సాధ్యపడుతుంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త వైజ్ఞానిక అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
హిందీలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలు
భోపాల్: వైద్య విద్యను హిందీలో అందించే లక్ష్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్ మూడు సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందిస్తున్న మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అని అన్నారు. ఇది స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని అభివర్ణించారు. ఆదివారం భోపాల్ మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్‌లోని మెడికల్ బయో కెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించారు. సాంకేతిక, వైద్య విద్యను మరో 8 భాషల్లోనూ ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. ఇంగ్లిష్ తమకు రాదనే ఆత్మనూనతతో విద్యార్థులు బాధపడాల్సిన పనిలేదన్నారు. మాతృభాషల్లోనూ విద్యను కొనసాగించవచ్చని తెలిపారు. ఈ పాఠ్యపుస్తకాలను 97 మంది వైద్యులతో కూడిన బృందం రూపొందించిందని సీఎం చౌహాన్ చెప్పారు. కాగా, ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో తీసుకురావడం వైద్యవిద్యలో సానుకూల పరిణామమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు
భోపాల్: హిందీలో వైద్య విద్యను అందించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రికార్డు సృష్టించనుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. హిందీలో వైద్య విద్య పూర్తిచేసిన డాక్టర్లు ఇకపై ప్రిస్కిప్షన్లపై తొలుత ‘శ్రీహరి’ అని రాసి తర్వాత మందుల పేర్లు రాయొచ్చన్నారు. ‘‘పిల్లల్లో హిందీ పట్ల అభిమానాన్ని పెంచాలి. ఇంగ్లిష్ మందుల పేర్లను హిందీలో రాస్తే వచ్చి ఇబ్బంది ఏమిటి?’’ అన్నారు. మధ్యప్రదేశ్‌లో వైద్య విద్యను హిందీ భాషలో బోధించేందుకు రంగం సిద్ధమయ్యింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం భోపాల్‌లో హిందీలో వైద్య పాఠ్యపుస్తకాలను విడుదల చేయనున్నారు. -
చైనాలో వైద్య విద్యపై జాగ్రత్త
బీజింగ్: చైనాలో కరోనాతో కారణంగా ఆగిన వైద్య విద్యను కొనసాగించాలనుకునే, అక్కడ కొత్తగా మెడిసన్ చేయాలనుకునే భారత విద్యార్థులకు చైనాలోని ఇండియన్ ఎంబసీ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. అక్కడ చదివిన వారిలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటం, చైనా భాషను నేర్చుకోవడం, తిరిగొచ్చాక కఠినమైన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష (ఎఫ్ఎంజీ) పాసవడం వంటివి దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ► 2015–2021 కాలంలో 40,417 మంది ఎఫ్ఎంజీ పరీక్ష రాస్తే 6,387 మందే గట్టెక్కారు. ► వీరంతా చైనాలోని 45 వర్సిటీల్లో చదివినవారే. ► ఇక నుంచి చైనాకు వెళితే ఈ 45 కాలేజీల్లోనే చదవాలి. అదీ ఇంగ్లీష్ మాధ్యమంలోనే. ► చైనీస్ భాషలో మెడిసన్ చేయకూడదు. ఇంగ్లీష్–చైనీస్ ద్విభాషగా చేసినా చెల్లుబాటు కాదు. ► చైనా అధికారిక భాష పుతోంగ్వాను హెచ్ఎస్కే–4 లెవల్ వరకు నేర్చుకోవాలి. లేదంటే డిగ్రీ ఇవ్వరు. ► చైనాలోనే ప్రాక్టీస్ చేయాలనుకుంటే మళ్లీ లైసెన్స్‌ను సాధించాలి. ఐదేళ్ల మెడిసిన్ తర్వాత ఏడాది ఇంటర్న్‌షిప్ చేయాలి. తర్వాత చైనీస్ మెడికల్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ► చైనా నుంచి మెడికల్ క్వాలిఫికేషన్ పొందాలంటే ముందు భారత్‌లో నీట్–యూజీ పాసవ్వాలి. ► చైనా నుంచి వచ్చే వారూ నీట్–యూజీలో ఉత్తీర్ణత సాధించాకే ఎఫ్‌ఎంజీఈకి అర్హులౌతారు. ► కనుక విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగా సంబంధిత పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలి. -
NEET UG Rank 2022: నీట్ ఏ ర్యాంక్.. ఎక్కడ సీట్..?
సాక్షి, అమరావతి: వైద్య విద్య కోర్సుల ఔత్సాహికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)–యూజీ 2022 ఫలితాలు బుధవారం అర్ధరాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? ఆ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది? అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంచనాలు వేసుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి నీట్లో అర్హత పొందిన వారి సంఖ్య పెరిగింది. 2021లో రాష్ట్రం నుంచి 57,721 మంది పరీక్ష రాయగా 33,841 మంది అర్హత సాధించారు. ఇక ఈ ఏడాది (2022)లో 65,305 మంది నీట్‌కు హాజరు కాగా 40,344 మంది అర్హులుగా నిలిచారు. అంటే 61.77% మంది నీట్లో క్వాలిఫై అయ్యారు. ఈ లెక్కన నీట్–2021తో పోలిస్తే 2022లో రాష్ట్రంలో 16.11 శాతం మంది అధికంగా అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో 59.27 శాతం మంది మాత్రమే అర్హత సాధించగా రాష్ట్రంలో అంతకు మించి అర్హత పొందడం విశేషం. 20 శాతం పెరుగుదల దేశవ్యాప్తంగా వైద్య విద్యకు ఏటా క్రేజ్ పెరుగుతోంది. 2019తో పోలిస్తే దేశవ్యాప్తంగా నీట్ రాసిన వారి సంఖ్య 2022 నాటికి 20 శాతం మేర పెరిగింది. 2019లో దేశవ్యాప్తంగా 14,10,755 మంది నీట్ రాయగా, ఈ ఏడాది 17,64,571 మంది పరీక్ష రాశారు. ఇక రాష్ట్రం విషయానికి వస్తే 2021తో పోలిస్తే 2022లో నీట్ రాసిన విద్యార్థుల సంఖ్య 11.61 శాతం మేర పెరిగింది. మరోవైపు వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారిలో అమ్మాయిలే ఎక్కువ మంది ఉంటున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 6.18 లక్షల మంది అబ్బాయిలు, 8.63 లక్షల మంది అమ్మాయిలు పరీక్ష రాశారు. ఈ ఏడాది 7.63 లక్షల మంది అబ్బాయిలు, 10 లక్షల మందికి పైగా అమ్మాయిలు పరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రా వైద్య కళాశాలలో ఇలా.. సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల మొదటి చాయిస్ విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాలకే ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ 2021–22లో ఎస్టీ కేటగిరీలో 472 స్కోర్‌తో 1,10,270 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీల్లో 79,876 ర్యాంక్ వరకు, బీసీ కేటగిరీల్లో 32,693 ర్యాంక్ వరకు, ఓసీల్లో 15,824 ర్యాంక్ వరకు, ఈడబ్ల్యూఎస్‌లో 20,137 ర్యాంక్ వరకు చివరి సీట్లు వచ్చాయి. మరోవైపు డెంటల్ కోర్సులకు సంబంధించి విజయవాడ ప్రభుత్వ డెంటల్ కళాశాలలో ఓసీ కేటగిరీలో 86,787 ర్యాంక్ వరకు, బీసీ కేటగిరీలో 1,38,271 ర్యాంక్ వరకు, ఎస్సీ కేటగిరీలో 1,65,600 ర్యాంక్ వరకు, ఎస్టీ కేటగిరీలో 2,09,406 ర్యాంక్‌కు చివరి సీటు వచ్చింది. -
9/11 మాస్టర్ మైండ్ జవహరీ హతం.. 15 ఏళ్లకే జవహరీ ఉగ్రబాట
వాషింగ్టన్: అల్–జవహరీ ఈజిప్టు రాజధాని ౖకైరోలో 1951లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే ‘జమాత్ అల్–జిహాద్’ పేరిట సొంతంగా ఒక సంస్థను స్థాపించాడు. విరోధులను అంతం చేయడమే దీని లక్ష్యం. ఇది ఈజిప్టులో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందింది. 1981 అక్టోబర్ 6న ఉగ్రవాద దాడుల్లో ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ బలయ్యారు. ఈ దాడుల్లో ‘జమాత్ అల్–జిహాద్’ హస్తం ఉన్నట్లు తేలింది. జవహరీ వైద్య విద్య అభ్యసించాడు. కొన్నాళ్లు సర్జన్‌గా పనిచేశాడు. జీవ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఒక ల్యాబ్‌ను నడిపించాడు. గతంలో ఓ కేసు విచారణలో భాగంగా జవహరీ కోర్టుకు హాజరయ్యాడు. ‘‘మేము త్యాగాలు చేశాం. ఇస్లాం విజయం సాధించేవరకూ ఎన్ని త్యాగాలు చేయడానిౖకైనా సిద్ధంగా ఉన్నాం’’ అంటూ కోర్టు గదిలో గట్టిగా అరిచాడు. లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు గాను జవహరీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక దక్షిణాసియాకు చేరుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించాడు. 1988లో ఒసామా బిన్ లాడెన్ అల్‌ఖైదాను స్థాపించాక అందులో చేరాడు. చురుగ్గా కార్యకలాపాలు సాగించాడు. 1990 తర్వాత తన ‘జమాత్ అల్–జిహాద్’ సంస్థను అల్‌ఖైదాలో విలీనం చేశాడు. అతి తక్కువ కాలంలోనే లాడెన్‌కు నమ్మిన బంటుగా మారాడు. 1990వ దశకంలో పశ్చిమ దేశాల నిఘా సంస్థలు తొలిసారిగా జవహరీపై దృష్టి పెట్టాయి. అల్‌ఖైదా ముఠాలో అతడి ప్రతిష్ట విపరీతంగా పెరిగిపోయింది. అల్‌ఖైదా నిర్వహించే విలేకరుల సమావేశాల్లో లాడెన్ పక్కనే జవహరీ తప్పనిసరిగా కనిపించేవాడు. 1997లో అఫ్గానిస్తాన్‌లో ఉన్నప్పుడు ఈజిప్టు పర్యాటకులను చంపేందుకు ప్లాన్ చేశాడు. 1998లో లాడెన్ అల్‌ఖైదా ఉప నాయకుడిగా జవహరీ పేరును ప్రకటించాడు. అంటే ఉగ్రముఠాలో లాడెన్ తర్వాతి స్థానం జవహరీదే కావడం గమనార్హం. అణ్వాయుధాలు సంపాదించుకోవాలన్న అల్‌ఖైదా ఆశయం వెనుక జవహరీ ప్రోత్సాహం ఉంది. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో.. ఆత్మాహుతి దాడులకు వ్యూహాలు రచించడంలో జవహరీ దిట్ట. నిధులు సేకరించడంలోనూ నేర్పరి. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ అల్–జవహరీని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. పదేళ్ల క్రితం అమెరికా నేవీ సీల్స్ దాడుల్లో లాడెన్ హతమయ్యాక జవహరీ అల్‌ఖైదా పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. చెల్లాచెదురైన అల్‌ఖైదాను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాడు. ఇస్లామిక్ దేశాల్లో ఉన్న అల్‌ఖైదా సభ్యులకు సుప్రీంలీడర్‌గా దిశానిర్దేశం చేశాడు. అఫ్గాన్‌పై అమెరికా సేనలు పట్టు బిగించడంతో జవహరీ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జవహరీ చనిపోయాడన్న వాదనలు సైతం వినిపించాయి. కానీ, అమెరికా నిఘా సంస్థలు నమ్మలేదు. ఓపికగా వేట కొనసాగించాయి. చివరకు అఫ్గానిస్తాన్‌లోనే అంతం చేశాయి. అమెరికన్లను హతమార్చడమే లక్ష్యం 1998 ఆగస్టు ఏడో తేదీన టాంజానియా, కెన్యాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. జవహరీ నేతృత్వంలోనే ఈ దాడులకు వ్యూహాలు రూపొందించారు. అప్పుడు అతడి వయసు 47 సంవత్సరాలు. ఇక అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ‘2001 సెప్టెంబర్ 11’ దాడుల వెనుక లాడెన్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికన్లను, వారి మిత్రులను అంతం చేయడమే ప్రతి ముస్లిం వ్యక్తిగత విధి. అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే హతమార్చాలి’’ అని 1998లో తన మేనిఫెస్టోలో జవహరీ స్పష్టంగా రాసుకున్నాడు. ‘సెప్టెంబర్ 11’ దాడుల తర్వాత అమెరికాలో మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అఫ్గానిస్తాన్‌లో జీవ ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాడు. కానీ, అఫ్గాన్‌పై అమెరికా దండెత్తడంతో అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారసుడు ఆదెల్? జవహరీ మరణంతో అల్ ఖైదా నాయకునిగా ఈజిప్టు మాజీ సైనికాధికారి మహ్మద్ సలాహ్ అల్ దిన్ జైదన్ అలియాస్ సైఫ్ అల్ ఆదెల్ (60) పేరు గట్టిగా వినవస్తోంది. అల్ ఖైదా అగ్ర నేతల్లో పిన్న వయస్కుడితడే. ఎవరీ ఆదెల్? ఈజిప్టుకు చెందిన ఆదెల్ మాజీ కల్నల్. అల్‌ఖైదా వ్యవస్థాపక సభ్యుడు. అమెరికా, బ్రిటిష్ సైనికులనెందరినో చంపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర రిక్రూట్మెంట్లు, నిధుల కోసం 1980ల్లో ఒసామా బిన్ లాడెన్ నెలకొల్పిన మక్తాబ్ అల్ ఖిద్మత్ (ఎంఏకే)తో కూడా అనుబంధముంది. లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గానూ వ్యవహరించాడు. అప్పుడే జవహరీతోనూ పరిచయమేర్పడింది. 1993లో సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు 19 మంది అమెరికా సైనికులను చంపి మృతదేహాలను వీధుల గుండా ఈడ్చుకెళ్లారు. ఈ దాడి ఆదెల్ కనుసన్నల్లోనే జరిగింది. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై 1998లో జరిగిన దాడులు, పెంటగాన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై జరిగిన దాడులతోనూ ఇతడికి సంబంధముంది. దీంతో అమెరికా ఆదెల్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చి అతడి తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. లాడెన్ మరణం తర్వాత కీలక వ్యూహకర్తగా ఎదిగాడు. 20 ఏళ్లుగా ఇరాన్‌లోనే ఉన్నట్టు అనుమానం. సిరియాలోని ఉగ్ర ముఠాలకు టెలిగ్రాం ద్వారా సూచనలిస్తాడని చెబుతారు. లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్‌ను కూడా 2019లో అమెరికా సైన్యం మట్టుబెట్టింది. అల్‌ఖైదా పగ్గాలు ఇతని చేతుల్లోకే వెళ్తాయని మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ అంటోంది. -
ఫీ'జులుం' సాగడంలేదిక్కడ
ఎంబీబీఎస్ చదివిన ప్రతి విద్యార్థికీ ఇప్పుడు పీజీ తప్పనిసరి. ఇందుకోసం వైద్య విద్యార్థులు అహోరాత్రాలూ కష్టపడతారు. తీరా నీట్ పరీక్ష రాసి, ర్యాంకులు వచ్చాక.. ప్రభుత్వ కళాశాలల్లో సీటు రాక, ప్రైవేటు కళాశాలల్లో చేరలేక నిరుత్సాహ పడిపోతారు. ఫీజులు అత్యధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఇలా పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత వైద్య విద్యకు దూరమవుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇదే విషయంపై ఆలోచన చేశారు. వెంటనే భారీగా ఫీజులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పరిస్థితి మారింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సీటు పొందాలని ప్రయత్నిస్తున్నారు. – నాగా వెంకటరెడ్డి చంద్రబాబు దుర్మార్గం.. జగన్ మానవత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచుకునేలా నిర్ణయం తీసుకున్నారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టగానే ఆయన బంధువుకు చెందిన విశాఖలోని గీతం మెడికల్ కళాశాలకు డీమ్డ్ హోదా కల్పించి, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, డెంటల్, పీజీ సీట్ల ఫీజులు ఇష్టానుసారం పెంచుకొనే అవకాశమిచ్చారు. ఇందుకు అడ్డు చెప్పిన అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను తప్పించి మరీ నిర్ణయం తీసుకున్నారు. 2015లో రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో బి కేటగిరీ పీజీ వైద్య ఫీజు ఏడాదికి రూ.11 లక్షలు ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం 2017లో ఏడాదికి రూ.24.20 లక్షలకు పెంచేసింది. అంటే రెండింతలకు పైగా పెంచింది. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు అనేకమంది ఉన్నత వైద్య విద్యకు దూరమయ్యారు. ఏపీని సాకుగా చూపుతూ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు కూడా ఫీజులు పెంచేశాయి. జగన్ సర్కారు వచ్చిన తర్వాత మానవతా దృక్పధంతో ఆలోచించింది. సీఎం జగన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య నేతృత్వంలో ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను నియమించారు. దేశంలోని మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను పరిశీలించారు. సహేతుకత ఆధారంగా 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను తగ్గించారు. దీంతో ప్రైవేటు కళాశాలల్లో బి కేటగిరీ ఫీజు రూ.24.20 లక్షల నుంచి రూ.8.64 లక్షలకు దిగొచ్చింది. అంటే ఏడాదికి రూ.15.56 లక్షలు చొప్పున మూడేళ్ల కోర్సుకు రూ.46.68 లక్షల భారం తల్లిదండ్రులకు తగ్గింది. దీంతో అన్ని రాష్ట్రాల విద్యార్థులూ ఏపీ వైపు చూస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో బి కేటగిరి సీట్లకు తీవ్రమైన పోటీ ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.శ్యాంప్రసాద్ తెలిపారు. ఫీజులు తక్కువ కావడంతో పాటు ఏపీలో కోర్సు పూర్తయిన తరువాత సర్వీసు బాండ్లు అమల్లో లేవు. ఇది కూడా విద్యార్థులకు సానుకూల అంశమని వైద్య కళాశాలల ప్రతినిధులు చెబుతున్నారు. పీజీ అయ్యేలోగా రుణం తీర్చేసుకోవచ్చు ఆంధ్రలో బి కేటగిరిలో పీజీ సీటు తెచ్చుకోగలిగితే పేద, మధ్య తరగతి వారు కూడా ధైర్యంగా చేరవచ్చు. బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని కోర్స్ పూర్తయ్యేలోగా స్టయిఫండ్‌తో, సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేస్తూ అప్పు తీర్చేసుకోవచ్చు అని ఓ వైద్య విద్యార్థి అభిప్రాయపడ్డారు. మెడికల్ కాలేజీల్లో ఫీజులు ఇలా.. జగన్ సర్కారు చర్యల కారణంగా మెడికల్ పీజీ క్లినికల్ డిగ్రీ, పారా క్లినికల్ డిగ్రీ/ డిప్లొమా, ప్రి క్లినికల్ కోర్సుల కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఇన్స్టిట్యూషనల్/ఎన్ఆర్ఐ కోటా ఫీజులు మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి. ► క్లినికల్ డిగ్రీ కన్వీనర్ కోటా ఫీజు రూ.4.32 లక్షలు కాగా, మేనేజ్మెంట్ కోటా రూ.8.64 లక్షలు. ఎన్ఆర్ఐ కోటా ఫీజు రూ.50 లక్షలుగా ఉండగా కళాశాలల యాజమాన్యాలు కోర్సు డిమాండ్ ఆధారంగా అధికమొత్తంలో వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. క్లినికల్ డిగ్రీ బి కేటగిరి కింద ఏపీలో మూడేళ్లలో చెల్లించే ఫీజు 25.92 లక్షలు. అదే తెలంగాణలో ఏడాదికి రూ.23 లక్షలు చొప్పున మూడేళ్లలో రూ.69 లక్షలు చెల్లించాలి. ఇది ఏపీలో కన్నా 62.43 శాతం అధికం. ► పారా క్లినికల్ డిగ్రీ/ డిప్లొమా కన్వీనర్ కోటా ఫీజు రూ.1.35 లక్షలు కాగా, మేనేజ్మెంట్ కోటా రూ.2.70 లక్షలు. ఎన్ఆర్ఐ కోటా ఫీజు రూ.15 లక్షలు. తెలంగాణలో ఇవే రూ.4.30 లక్షలు, రూ.5.30 లక్షలు, రూ.15.90 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇవి ఏపీలోకన్నా 68.60, 49.06, 5.66 శాతం అధికం. ► ప్రి క్లినికల్ కోర్సు ఫీజుల్లోనూ ఇదే విధంగా తేడాలు ఉన్నాయి. ► కర్ణాటక, కేరళలోనూ ఫీజులు ఏపీలోకన్నా ఎక్కువే. కర్ణాటక ప్రైవేటు మెడికల్ కాలేజీలో పీజీ సీటుకు కోర్సును బట్టి రూ.11.50 లక్షల నుంచి వసూలు చేస్తున్నారు. అదే డీమ్డ్ యూనివర్శిటీల్లో పీజీ బి కేటగిరి సీటు ఏడాది ఫీజు 25.30 లక్షలు. క్లినికల్ డిగ్రీ ఫీజు కేరళలో ఏపీలోకన్నా 42.4 శాతం అధికం. పారా క్లినికల్ డిగ్రీ/ డిప్లొమో కోర్సుల ఫీజులు ఏకంగా 70.35 శాతం ఎక్కువ. పీజీ మెడికల్ సీట్లు ఇలా.. ► 2021– 2022 ప్రకారం రాష్ట్రంలోని 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మొత్తం పీజీ సీట్లు 2,358. ► ప్రభుత్వ కాలేజీల్లో 1,034 సీట్లు కాగా ఆల్ ఇండియా కోటా కింద 505, స్టేట్ కోటా కింద 529 ఉన్నాయి. ► ప్రైవేటు కాలేజీల్లో సీటు 1,324 కాగా కాంపిటెంట్ కోటా కింద 639, మేనేజ్మెంట్ కోటా 685 ఉన్నాయి. థ్యాంక్యూ.. జగన్ అంకుల్ ‘నీట్’లో ర్యాంకు వచ్చింది. ‘బీ’ కేటగిరిలో ఆం్ర«ధాలో సీటు వచ్చింది. పెంచిన ఫీజుల భారాన్ని భరించే ఆర్థిక పరిస్థితులు లేక అమ్మనాన్నలను, ఆంధ్రాను వదిలి 2016లో కర్ణాటకకు రావాల్సి వచ్చింది. నాకన్నా మెరుగైన ర్యాంకులు పొందిన నా ప్రెండ్స్ ఫీజులు భరించలేక వైద్య విద్యకు దూరమయ్యారు. ఏపీలో 2014 వరకు ఎంబీబీఎస్ సీటు బీ కేటగిరిలో ఏడాదికి రూ.2.50 లక్షలు ఉండేది. దాన్ని రూ.11 లక్షలకు పెంచుకునేలా చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏపీని చూసి కర్ణాటకలోనూ పెంచేశారు. బాధాకరమైన విషయం ఏమిటంటే మంచి ర్యాంకులు తెచ్చుకుని డబ్బు లేనివారు మెడిసిన్‌కు దూరమవుతున్నారు. ఆంధ్రాలో బీ కేటగిరీలో పీజీ సీటు వచ్చేలా ర్యాంకు తెచ్చుకోవాలని.. ఇక్కడ సీటొస్తే కుటుంబమంతా కలిసి ఉండవచ్చని అమ్మానాన్నలు పదేపదే చెపుతున్నారు. ఈ ఆకాంక్ష మా ఒక్కరిదే కాదు.. తల్లిదండ్రులందరిదీ. థాంక్యూ జగన్ అంకుల్. – ఎం.కావ్య (ఎంబీబీఎస్), కర్ణాటక -
NEET PG Exam 2022: నీట్ పీజీ వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ పీజీ–22 పరీక్ష వాయిదా కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కొట్టే సింది. ఇలా వాయిదా వేసుకుంటూ పోతే వైద్యులు అందుబాటులోకి రాక ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించింది. ‘‘పరీక్ష వాయిదా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ఇలాంటప్పుడు పరీక్ష వాయిదా కుదరదు’’ అని పేర్కొంది. పరీక్ష ఈ నెల 21న జరగనుంది. అప్పుడే నీట్–పీజీ–2021 కౌన్సెలింగ్ ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు వైద్యులు కోర్టుకెక్కారు. -
ఉక్రెయిన్ విద్యార్థుల భవితపై త్వరలో స్పష్టత
సాక్షి, న్యూఢిల్లీ: వైద్యవిద్య కోసం విదేశాలకు వెళ్లకుండా స్వరాష్ట్రంలోనే చదువుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు డాక్టర్ సంజీవకుమార్, గొడ్డేటి మాధవి, బి.వి.సత్యవతి, గురుమూర్తి, చింతా అనూరాధ మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు మొత్తం 918 మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్నారన్నారని తెలిపారు. దేశంలో కంటే వైద్యవిద్య విదేశాల్లో ముఖ్యంగా ఉక్రెయిన్‌లో ఖర్చు తక్కువగా ఉన్నందువల్లే విద్యార్థులు అక్కడ చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను ఆంధ్రప్రదేశ్‌కు వేగంగా రప్పించేందుకు మేడపాటి వెంకట్, చంద్రహాసరెడ్డి, రత్నాకర్, రవీందర్‌రెడ్డిలను సీఎం జగన్ పంపించారని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల విషయమై ఈ నెల 24న ప్రపంచ దేశ ప్రతినిధుల సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఉక్రెయిన్ విద్యార్థుల భవిష్యత్తుపై ఎన్.ఎం.సి.తో, కేంద్రంతో చర్చిస్తామన్నారు. గ్రామాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వెయ్యి జనాభాకు ఒక డాక్టర్, ప్రతి రెండువేల జనాభాకు ఒక పి.హెచ్.సి. ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ప్రతి పదివేల మందికి ఒక డాక్టర్ ఉన్నారని తెలిపారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. -
భారత్‌లో చదువుతామంటూ...‘ఉక్రెయిన్’ విద్యార్థుల పిటిషన్
న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఆగిపోయిన తమ వైద్య విద్యను భారత్‌లో పూర్తి చేసేందుకు అనుమతించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు శనివారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 21న విచారణ జరిగే అవకాశముంది. ‘‘ఉక్రెయిన్ నుంచి 20,000 మంది భారత వైద్య విద్యార్థులు తిరిగి వచ్చారు. యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేనందున వారి చదువుపై అనిశ్చితి నెలకొంది’’ అని వారి తరఫున కేసు వేసిన ప్రవాసీ లీగల్ సెల్ పేర్కొంది. (చదవండి: పార్శిల్లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు) -
విజయవాడ జీజీహెచ్.. ఇక ఇ–ఆస్పత్రి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి ‘ఇ’(ఎల్రక్టానిక్) ఆస్పత్రిగా రూపాంతరం చెందనుంది. పేపర్ రహిత డిజిటల్ వైద్య సేవలందించేందుకు రాష్ట్రంలోనే మోడల్ ఆస్పత్రిగా ఎంపికైంది. ఈ విషయాన్ని శుక్రవారం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు ఎం.రాఘవేంద్రరావు ప్రకటించారు. ఇ ఆస్పత్రిగా మార్చే పనులు 15 రోజులుగా చేస్తున్నారు. ఈ నెలాఖరుకు అత్యాధునిక పరికరాలు రానున్నాయి. దీంతో మార్చి 15 నాటికి సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ డివిజన్ హెల్త్ మిషన్‌లో భాగంగా ఇ ఆస్పత్రిగా మారుస్తున్నారు. చదవండి: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. ప్రతి రోగికి ఒక శాశ్వత ఐడీ.. ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతి రోగికి ఆధార్ అనుసంధానిత గ్లోబల్ బేస్డ్ ఐడీని క్రియేట్ చేస్తారు. ఒకవేళ ఆ రోగికి అప్పుడే ఐడీ ఉంటే, దాని ప్రకారమే సేవలు అందిస్తారు. ఒకసారి ఐడీని క్రియేట్ చేస్తే, ఆ నంబరు జీవితాంతం ఉండిపోతుంది. రోగి ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నంబరు చెబితే అతని పూర్వ చికిత్స వివరాలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటివి రోగి చెప్పకుండానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దేశంలోనే కాకుండా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ ఐడీ నంబర్ పనిచేస్తుంది. ఒకవేళ రోగి ఐడీ నంబర్ మర్చిపోయినా, ఆధార్ నంబర్ ఆధారంగా తెలుసుకునే వీలుంది. పేపర్ రహిత సేవలు.. ఎల్రక్టానిక్ ఆస్పత్రిగా రూపొంతరం చెందిన అనంతరం ఆస్పత్రిలో పేపర్ రహిత వైద్య సేవలు అందించనున్నారు. రోగి ఓపీకి ఐడీ ఆధారంగా రిజి్రస్టేషన్ చేయడంతో పాటు, వైద్యులు పరీక్షలు చేసి, వారు గుర్తించిన లోపాలు, రక్త పరీక్షా ఫలితాలు, సీటీ స్కాన్ , ఎంఆర్ఐ రిపోర్టులు ఇలా అన్నీ రోగి ఐడీ ఆధారంగా ఆన్లైన్లోనే ఉంచుతారు. వారి మెడికల్ రికార్డులు సైతం ఆన్లైన్లోనే ఉంటాయి. ఇన్‌పేషెంట్‌గా చేరినా రికార్డులన్నీ ఎలక్ట్రానిక్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆన్లైన్లోనే పొందుపరుస్తారు. ఒక్క క్లిక్‌తో హిస్టరీ అంతా.. ప్రతి రోగికి ఒక ఐడీని క్రియేట్ చేసి, తన రిపోర్టులన్నీ ఆన్లైన్ చేయడం ద్వారా ఒక్క క్లిక్‌తో రోగి పూర్వ పరిస్థితిని (స్టరీ) వైద్యులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. రోగి ఐడీని ఓపెన్ చేస్తే పాత హిస్టరీ అంతా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మోడల్ ఆస్పత్రిగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిని ఇ ఆస్పత్రిగా మారుస్తుండగా, అనంతరం రాష్ట్రంలోని ఇతర బోధనాస్పత్రులు, జిల్లా ఏరియా ఆస్పత్రులతో పాటు, ప్రైవేట్ ఆస్పత్రులను సైతం మార్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. మార్చి 15కి పూర్తి.. ఎల్రక్టానిక్ ఆస్పత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మార్చి 15 నాటికి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటుంది. అందుకోసం ప్రతి వార్డులో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను ఏర్పాటు చేసి, రికార్డులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తాం. ప్రతి రిపోర్టు ఆన్లైన్లోనే ఉంటుంది. పేపర్ రహిత వైద్య సేవలు అందించనున్నాం. రోగి హిస్టరీ అంతా ఐడీ నంబర్‌తో తెలుసుకోవచ్చు. – డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్, సూపరింటెండెంట్ -
మీరక్కడ క్షేమమేనా!
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్–రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్‌లో ఉంటున్న తెలుగు వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఎప్పుడు, ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందోనని భీతిల్లుతున్నారు. నిత్యం తమ వారితో ఫోన్లలో మాట్లాడుతున్నా క్షేమంగా స్వదేశానికి వచ్చేస్తే మంచిదని చెబుతున్నారు. యుద్ధం అనివార్యమైతే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, స్వదేశానికి తిరిగి వెళ్లిపోదామా? వద్దా? అనే మీమాంసలో అక్కడి తెలుగు వారు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. విద్య, ఉపాధి నిమిత్తం ఏపీకి చెందిన పలువురు ఉక్రెయిన్‌లో ఉంటున్నారు. ఏపీ నుంచి వైద్య విద్య అభ్యసించడం కోసం ఎక్కువ మంది విద్యార్థులు ఉక్రెయిన్‌కు వెళ్తుంటారు. వినిచా, డ్నిప్రో, కైవ్, బోగోమోలెట్స్ యూనివర్సిటీల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారు. వినిచా యూనివర్సిటీలో 200 నుంచి 250 మంది, మిగిలిన యూనివర్సిటీలు కూడా కలుపుకుంటే 2 వేల మంది ఏపీ విద్యార్థులు ఉంటారని అంచనా. ప్రస్తుతం భయాందోళనలకు గురయ్యేంత పరిస్థితులు ఉక్రెయిన్‌లో లేవని, ప్రశాంత వాతావరణమే నెలకొందని ఉందని అక్కడి వారు చెబుతున్నారు. రష్యాకు సరిహద్దున ఉన్న నగరాల్లో కొంత ఆందోళనకర వాతావరణం ఉన్నట్టు స్పష్టం చేస్తున్నారు. మేం బాగానే ఉన్నాం మాది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు. ఉక్రెయిన్‌లోని వినిచా వర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులందరి వివరాలను సేకరిస్తోంది. ఆన్లైన్లో మా వివరాలను ఎంబసీకి పంపించాం. భారత్‌కు వెళ్లాలనుకున్న వారు వెళ్లొచ్చని అధికారులు చెప్పారు. అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు. యుద్ధం అనివార్యమై ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి స్వదేశానికి చేరుస్తామని ఎంబసీ చెప్పింది. మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఇంటినుంచి తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు. దేశానికి తిరిగి వచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి. – భానుప్రకాష్, ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థి ప్రశాంత వాతావరణమే ఉంది నేను రష్యా సరిహద్దుల్లోని సేవరో దోనెస్క్‌లో ఉంటాను. ఇక్కడ అంతా ప్రశాంత వాతావరణమే ఉంది. 2014లో యుద్ధ సమయంలో నేను ఇక్కడే ఉన్నాను. అప్పటితో పోలిస్తే యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న భారతీయులపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – డాక్టర్ కుమార్, తెలుగు వైద్యుడు, ఉక్రెయిన్ -
పేద విద్యార్థినుల కల నిజం చేసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పేదరికం వల్ల సమాజానికి ఉపయోగపడే వైద్య విద్యను చదువుకోలేకపోతున్నామని ఆందోళనలో ఉన్న ఇద్దరు బాలికలకు మంత్రి కె.తారకరామారావు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సహాయం అందించి ఎంబీబీఎస్ చదువాలనుకున్న వారి కలను సాకారం చేశారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి అఖిల ఇంటర్మీడియట్లో 98 శాతం మార్కులతో ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. అఖిల తండ్రి ప్రభాకర్ ఒక రైతు, తల్లి గృహిణి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకున్న అఖిల ఫీజులు ఎలా చెల్లించాలో వారికి అర్థం కాలేదు.ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో అఖిల విద్యాభ్యాసానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇవ్వడమే కాకుండా.. సోమవారం ఆమెకు అవసరమైన ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో తనను కలిసిన అఖిల కుటుంబంతో మంత్రి మాట్లాడారు. అండగా ఉంటానని, బాగా చదువుకొని ఉన్నతస్థితికి రావాలని అఖిలకు సూచించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన 95 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. స్పందన తల్లిదండ్రులు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ ఆమెను చదివించారు. వారి పరిస్థితి కూడా కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో స్పందనతో పాటు ఆమె కుటుంబసభ్యులను ప్రగతిభవన్‌కు పిలిపించి ఎంబీబీఎస్‌కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. తమ ఎంబీబీఎస్ ఆశ నెరవేరదన్న ఆందోళనతో ఉన్న తమకు, మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం చేయడంపై అఖిల, స్పందన సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి తమ వంతు సేవ చేస్తామని తెలిపారు. -
ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకుగాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని విశ్వవిద్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. -
జనరల్ మెడిసిన్ వైపు చూపు
సాక్షి, అమరావతి: మెడికల్ విద్యార్థుల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఇదివరకు ఎంబీబీఎస్ తర్వాత పీజీలో ఆర్థోపెడిక్స్, రేడియాలజీ సీట్ల పట్ల అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఇప్పుడు చాలా మంది జనరల్ మెడిసిన్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కోర్సు చేస్తే సూపర్ స్పెషాలిటీలో మంచి కోర్సులు చేయొచ్చన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. జనరల్ మెడిసిన్ (ఎండీ) చేశాక, మెడికల్ ఆంకాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ (డీఎం) కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఇవి లీడింగ్ కోర్సులుగా పేరుంది. అందుకే అన్ని కాలేజీల్లో జనరల్ మెడిసిన్ సీట్లు హాట్ కేకుల్లా తొలి కౌన్సెలింగ్‌లోనే భర్తీ అవుతున్నాయి. ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, జనరల్ సర్జరీ, గైనిక్ వంటి కోర్సులు రెండవ ప్రాధాన్యత కోర్సులుగా అభ్యర్థులు భావిస్తున్నారు. రెండు మూడేళ్లుగా ఆఫ్తాల్మాలజీ, డెర్మటాలజీ కోర్సులకూ గిరాకీ పెరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు, కాకినాడలోని రంగరాయ వంటి కాలేజీల్లో పీజీ వైద్య సీటు కోసం అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రైవేటు కాలేజీల్లో 1,226 సీట్లు రాష్ట్రంలో 18 ప్రైవేటు కాలేజీలు ఉన్నప్పటికీ, 14 కాలేజీల్లో మాత్రమే 1,226 పీజీ వైద్య సీట్లున్నాయి. ఇందులో అత్యధికంగా నారాయణ మెడికల్ కాలేజీలో 150 సీట్లున్నాయి. కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీలో ఈ ఏడాది తొలిసారి 25 సీట్లు వచ్చాయి. ప్రైవేటు కాలేజీల్లో మంచి ఇన్స్టిట్యూట్లో సీటు కంటే ప్రభుత్వ పరిధిలోని సాధారణ కాలేజీలో సీటు మంచిదని అభ్యర్థులు భావిస్తున్నారు. ఈ ఏడాది 7 వేల మంది వరకు పీజీ వైద్య పరీక్షలు రాశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండీఎస్ (ఎండీ దంత వైద్య సీట్లకు) పోటీ తక్కువేమీ కాదు. ప్రభుత్వ పరిధిలో 20, ప్రైవేటు పరిధిలో 379 సీట్లు ఉన్నాయి. సుమారు మూడు వేల మందికి పైగా బీడీఎస్ అభ్యర్థులు ఈ ఏడాది ఎండీఎస్ సీట్లకు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ పరిధిలో విజయవాడ, కడపలో మాత్రమే డెంటల్ సీట్లున్నాయి. మిగతా 379 సీట్లు ప్రైవేటు పరిధిలోని 13 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో ఉన్నాయి. త్వరలోనే రాష్ట్ర ర్యాంకులు కొద్ది రోజుల్లో పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పీజీ వైద్య విద్య సీట్లు ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది. రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కాలేజీలు, 14 ప్రైవేటు వైద్య కాలేజీల్లో ఈ ఏడాది పీజీ సీట్లకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే నీట్ జాతీయ ర్యాంకులు వెలువడ్డాయి. త్వరలోనే రాష్ట్ర ర్యాంకులు వెలువడనున్న నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అత్యధికంగా ఆంధ్రా మెడికల్ కాలేజీలో 212 పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో పీజీ, పీజీ డిప్లొమా కలిపి 943 సీట్లున్నాయి. -
NEET UG 2021: నీట్ కటాఫ్ 460!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి గత నెలలో జరిగిన నీట్–21 పరీక్ష ఓఎంఆర్ ఆధారిత ప్రాథమిక కీ శుక్రవారం విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ వెబ్సైట్లో కీని అందుబాటులో పెట్టింది. ప్రస్తుతం విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈనెల 18వ తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అనంతరం తుది కీని విడుదల చేస్తారు. కాగా ఈనెల 20 నుంచి 22వ తేదీల మధ్య ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాథమిక కీలో ఫిజికల్ సైన్స్ కేటగిరీలో ఒకట్రెండు మినహా మిగతావాటికి సమాధానాలు దాదాపు సరిగ్గానే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కటాఫ్ తగ్గొచ్చు.. ఈ సారి ఎంబీబీస్ ప్రవేశాల్లో కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతేడాది కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్న చివరి అభ్యర్థి మార్కులు 493కాగా, ఈ సారి పేపర్ తీరుతో కటాఫ్ మార్కులు తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా విడుదలైన ప్రాథమిక కీ ఆధారంగా ఇప్పటికే పలు కార్పొరేట్ విద్యా సంస్థలు కటాఫ్ మార్కులపై అంచనా వేశాయి. ఈ ఏడాది 460 మార్కులు వచ్చిన వారికి కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
సీఎం వైఎస్ జగన్‌తో తమిళ ఎంపీల భేటీ
సాక్షి, అమరావతి: తమిళనాడు ఎంపీలు సోమవారం సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి కేంద్రం నిర్వహిస్తున్న ‘నీట్’ను వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ రాసిన లేఖను సీఎం జగన్‌కు ఎంపీలు అందించారు. సీఎంను కలిసిన వారిలో చెన్నై ఉత్తరం ఎంపీ డాక్టర్ కళానిధి వీరాస్వామి, రాజ్యసభ ఎంపీ ఇళంగోవన్ ఉన్నారు. ‘నీట్’ అడ్మిషన్ విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, రాష్ట్రాల హక్కులను హరిస్తోందని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వైద్య కళాశాలల ప్రవేశాల్లో కేంద్రం జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీనికోసమే భాజపాయేతర రాష్ట్రాల సీఎంలకు తమ నాయకుడు స్టాలిన్ లేఖ రాసినట్లు తమిళనాడు ఎంపీలు.. సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. -
ఏ ప్రాతిపదికన రూ.8 లక్షల పరిమితి విధించారు ?
న్యూఢిల్లీ: నీట్ ప్రవేశాల్లో వైద్య విద్య కోర్సుల్లో చేరే ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు రూ.8 లక్షల వార్షిక ఆదాయం పరిమితిని కేంద్రం విధించడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన రూ.8 లక్షల పరిమితిని వర్తింపజేశారో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం ఆదేశించింది. రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉంటేనే ఈడబ్ల్యూఎస్‌గా పరిగణిస్తామనడంపై అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ, కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖలకు కోర్టు సూచించింది. నేషనల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌ను ఆధారంగా చేసుకుని ఆదాయ పరిమితిని నిర్ణయించామని, ఇది కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ వివరణ ఇచ్చారు. దీనిపై కోర్టు స్పందించింది. ‘వేర్వేరు రాష్ట్రాలు, పట్టణాల్లో జీవన వ్యయాలు వేరుగా ఉంటాయి. యూపీలోని చిన్న పట్టణాలతో పోలిస్తే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఖర్చులు ఎక్కువ. అలాంటపుడు ఒకే రకమైన ఆదాయ పరిమితిని ఎలా విధిస్తారు? కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం అని చెప్పి తప్పించుకోలేరు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. నీట్లో ఈడబ్ల్యూఎస్ కోటాకు వార్షిక ఆదాయ పరిమితిపై సుప్రీంకోర్టు -
ఈ ఏడాది పాత పద్ధతిలోనే నీట్ ఎస్ఎస్ పరీక్షలు
న్యూఢిల్లీ: వైద్య విద్యలో స్పెషలైజేషన్ కోర్సుల కోసం ఉద్దేశించిన నీట్ సూపర్ స్పెషాలటీ పరీక్షలు ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే జరుగుతాయని సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 2022–23 విద్యా సంవత్సరం నుంచి మార్పుల్ని అమలు చేస్తామని వెల్లడించింది. కేంద్ర నిర్ణయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి బుధవారం సుప్రీం బెంచ్‌కి తెలిపారు. ‘పాత విధానంలో పరీక్షలకు సిద్ధమైన విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ మెడికల్ కమిషన్, జాతీయ పరీక్షల బోర్డుతో సంప్రదించిన తర్వాత వచ్చే ఏడాది నుంచి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది’ అని ఆమె తెలిపారు. నవంబర్ 13–14 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షల్ని వాయిదా వేసే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ఈ ఏడాది నుంచే నీట్ పరీక్షలో మార్పులుంటాయని నోటిఫికేషన్ వెలువడ్డాక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 41 మంది పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టర్లు, ఇతర వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టుకెక్కడంతో అత్యున్నత న్యాయస్థానం మంగళవారం వారి పిటిషన్లు విచారించింది. కేంద్రం తీరుపై సుప్రీం బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరీక్షకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సిలబస్ మార్చడం ఏమిటని కేంద్రాన్ని నిలదీసింది. -
ప్రతి జిల్లాలో పీజీ వైద్య కళాశాల
జైపూర్: పోస్టు–గ్రాడ్యుయేట్(పీజీ) వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల లేదా విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వైద్య విద్య, ఆరోగ్య సేవలను అందించడం మధ్య అంతరం తగ్గుతోందని తెలిపారు. ఆయుర్వేదం, యోగాను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. దేశంలో గత ఆరేళ్లలో 170కిపైగా మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని, కొత్తగా మరో 100 కాలేజీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గురువారం రాజస్తాన్‌లో నాలుగు నూతన వైద్య కళాశాలల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ’ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైద్య వ్యవస్థను సమూలంగా మార్చడానికే ఎంసీఐ స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను తీసుకొచి్చనట్లు ఉద్ఘాటించారు. ఈ కమిషన్‌తో ఇప్పటికే సానుకూల ఫలితాలు వస్తున్నాయని వివరించారు. దేశంలో సంప్రదాయ, ఆధునిక వైద్యం నడుమ అంతరం ఉందని, దీన్ని తొలగించాలి్సన అవసరం ఉందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే కొత్తగా నేషనల్ హెల్త్ పాలసీని తీసుకొచ్చినట్లు వివరించారు. ఎయిమ్స్ లేదా మెడికల్ కాలేజీలు.. వాటి నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అన్ని మూలలకూ విస్తరింపజేయాలని సూచించారు. దేశంలో గతంలో కేవలం 6 ఎయిమ్స్‌లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 22కుపైగానే ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో కేవలం 82,000 అండర్–గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.40 కోట్లకు చేరిందని వెల్లడించారు. చాలా మంది విద్యార్థులకు ఆంగ్ల భాష పెద్ద అవరోధంగా మారిందని, నూతన విద్యా విధానంలో భాగంగా భారతీయ భాషల్లోనూ వైద్య విద్యను అభ్యసించే వెలుసుబాటు లభిస్తోందని తెలిపారు. -
రెండేళ్లలో కొత్తగా 2,400 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యపై దృష్టి సారించింది. వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తుండటంతో కొత్త వైద్య కళాశాల విషయంలో ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల స్థాపించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎక్కువమంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు అవకాశం దక్కనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ కళాశాలలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్ల గొండ, సూర్యాపేటల్లో కొత్త కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో కలిపి ప్రస్తుతం 9 ప్రభుత్వ వైద్య కళాశాల లున్నాయి. వాటిల్లో 1,640 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో..మొదటి ఏడాది 1,200, రెండో ఏడాది 1,200 సీట్ల చొప్పున మొత్తం 2,400 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఒక్కో కాలేజీలో 150 సీట్లు 2022–23లో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్ కర్నూల్, రామగుండంలో కాలేజీలు ఏర్పాటు చేస్తారు. 2023–24లో వికారాబాద్, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాలతో పాటు మరో 4 జిల్లాల్లోనూ కొత్తగా వైద్య కళాశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఒక్కో మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 28వ తేదీన ముందుగా 8 మెడికల్ కాలేజీలకు అనుమతులు కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మిగిలిన 8 కళాశాలలకు వచ్చే సంవత్సరం దరఖాస్తు చేస్తారు. -
మరో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్య పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే ఏడాది నుంచి 7 వైద్య కళాశాలలు అందుబాటులోకి రానుండగా, ఆ తర్వాత ఏడాది అంటే.. ఎన్నికల నాటికి మరో 4కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వికారాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, కామారెడ్డిలలోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని తాజాగా సీఎం నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 మెడికల్ కాలేజీలు ఉండగా, గతం లో ప్రకటించిన ఏడు (సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్) కలిపి మొత్తం 11 కొత్త కాలేజీలు రానుండటం విశేషం. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రస్తుత సంఖ్యకు రెట్టింపునకు పైగా కాలేజీలు రాష్ట్రంలో ఏర్పాటు కానుండటం గమనార్హం. ముఖ్యమంత్రి స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షిస్తుండటంతో ఇది సులభ సాధ్యమైందని అధికారులంటున్నారు. ఈ 11 కాలేజీల ద్వారా వచ్చే రెండేళ్లలో 1,650 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఏం కావాలో చెప్పండి వైద్య ఆరోగ్యశాఖపై ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. ‘వైద్య ఆరోగ్యశాఖ నా వద్దే ఉంది. అందువల్ల ఇప్పుడే వీలైనంత అభివృద్ధి పనులు చేపట్టండి. మీకు ఏం కావాలో చెప్పండి’ అని అన్నట్లు తెలిసింది. -
NEET: బయాలజీ చాలా సులువు.. కెమిస్ట్రీ కఠినం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ పరీక్ష తెలంగాణలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని వైద్య విద్య నిపుణులు వెల్లడించారు. అందరికీ మార్కులు తగ్గే అవకాశముందన్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది పరీక్ష సులువుగా ఉండగా, అప్పట్లో 720 మార్కులకుగాను, 700కుపైగా మార్కులు సాధించినవారు చాలామంది ఉన్నారు. ఈసారి ఆ సంఖ్య చాలావరకు తగ్గే అవకాశముంది. గతేడాది నీట్ ఆలిండియాస్థాయిలో 625 మార్కులకు 10వేల ర్యాంకు రాగా, 2019లో 560 మార్కులకు, 2018లో 540 మార్కులకు ఈ ర్యాంకు వచ్చింది. తెలంగాణలో గతేడాది జనరల్ కేటగిరీలో 497 మార్కులు వచ్చినవారికి ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. ఈసారి 470 నుంచి 480 మార్కులకు వచ్చే అవకాశముంది. 130 మార్కులొస్తే అర్హత! ఇక బయాలజీ పేపర్ చాలా సులువుగా ఉంది. అన్ని ప్రశ్నలూ సులువుగానే ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం కొంచెం కఠినంగానే ఉంది. ప్రశ్నతోపాటు అన్ని జవాబులను కూడా జాగ్రత్తగా చదివి సమాధానం రాయాల్సినవి ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫిజిక్స్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలన్నీ కఠినంగానే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి క్యాలిక్యులేషన్స్ సుదీర్ఘంగా ఉన్నాయి. 45 ప్రశ్నల్లో 30 నుంచి 35 వరకు ఎక్కువమంది చేయగలిగేలా ఉన్నాయి. 10 నుంచి 15 ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులకు సమయం సరిపోలేదు. టాప్ 10 ర్యాంకులు సాధించగలిగే విద్యార్థులు మాత్రమే మొత్తం ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది జనరల్ కేటగిరీలో నీట్ అర్హత మార్కు 147 కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో 113 అర్హత మార్కుగా ఉంది. 2019లో జనరల్ కేటగిరీలో నీట్ అర్హత మార్కు 134గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో ఇది 107గా ఉంది. ఈసారి జనరల్ కేటగిరీలో 130 మార్కులొస్తే అర్హత సాధించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 105 మార్కులు ఉండే అవకాశముంది. 112 కేంద్రాల్లో పరీక్ష నీట్ పరీక్షను రాష్ట్రంలో పలు నగరాల్లోని 112 కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 55 వేల మంది దరఖాస్తు చేయగా, 97 శాతం మంది హాజరైనట్లు చెప్పారు. కరోనా జాగ్రత్తలు, పరీక్ష నిబంధనల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడినా ప్రశాంతంగానే జరిగినట్లు చెబుతున్నారు. జేఈఈ మెయిన్స్‌లో అక్రమాలు జరిగిన నేపథ్యంలో నీట్ పరీక్షపై నిఘా పెట్టారు. పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సీసీటీవీల ద్వారా నిఘా ఉంచారు. కాగా, ‘నీట్’కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 95 శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈసారి దుబాయ్, కువైట్‌లోనూ ఈ పరీక్ష నిర్వహించారు. ఫిజిక్స్ కఠినం బాటనీ, జువాలజీ సులువుగా ఉన్నా, కొన్ని ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకున్నాయి. జువాలజీలోని ఒక ప్రశ్న మినహా అన్ని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే ఉన్నాయి. చాలా ప్రశ్నలు మెమరీ ఆధారంగా ఉన్నాయి. కాన్సెప్ట్ ప్రశ్నలు చాలా తక్కువగా ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. అన్ని ప్రశ్నలూ ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే వచ్చాయి. కొన్ని ప్రశ్నలకు అత్యంత సమీపంగా ఆప్షన్లు ఇచ్చారు. ఐదు నుంచి పది ప్రశ్నల వరకు కఠినంగా ఉన్నాయి. మూడు ప్రశ్నలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఫిజిక్స్ పేపర్ కఠినంగా, సుదీర్ఘంగా ఉంది. సాధారణ విద్యార్థులకు సమయం సరిపోలేదు. – శంకర్రావు, డీన్, శ్రీచైతన్య కాలేజీ, కూకట్పల్లి మధ్యస్థంగా ప్రశ్నలు కెమిస్ట్రీ, ఫిజిక్స్ పేపర్లలో ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. బయాలజీ సులువుగా ఉంది. మొత్తంగా నీట్ పరీక్ష ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. నాకు 650 నుంచి 670 మార్కులు వచ్చే అవకాశముంది. – రోహన్ కృష్ణ వడ్లమూడి, విద్యార్థి, హైదరాబాద్ -
దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్ పరీక్ష
-
దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్ పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సు (యూజీ)ల్లో ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం ఆదివారం నిర్వహిస్తున్న ‘నీట్’(జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నీట్ పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలోని కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. ఏపీ నుంచి ఈ ఏడాది 59 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. తెలంగాణలో... దాదాపు 60 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కేంద్రాలలో పరీక్ష జరుగుతోంది. చదవండి: నా పిల్లలే నా తొలి విద్యార్థులు – మేఘన మనోగతం -
నీట్ ఎగ్జామ్ 2021: డ్రెస్ కోడ్ తప్పనిసరి, ఆ వస్తువులు తెచ్చుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య కోర్సు(యూజీ)ల్లో ప్రవేశాలకు సంబంధించి నీట్–21కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కేటాయించింది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది 94 శాతం మంది విద్యార్థులు ‘నీట్’కు హాజరు కాగా... ప్రస్తుతం హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం జరిగే నీట్‌కు ఎన్టీఏ కఠిన నిబంధనలు విధించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ప్రకటించింది. అబ్బాయిలు పొడుగు చేతుల చొక్కాలు, బూట్లు ధరించి రావొద్దని స్పష్టం చేసింది. అలాగే అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు వంటి ఆభరణాలు పెట్టుకోవద్దని ఆదేశించింది. నిబంధనలివే.. ►నీట్ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు దుస్తులే ధరించాలి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు వేసుకోవద్దు. ఒకవేళ మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే.. సదరు విద్యార్థులు మధ్యాహ్నం 12.30 గంటలకే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలి. ►అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. తక్కువ ఎత్తు ఉండే చెప్పులు మాత్రమే వేసుకోవాలి. ►వ్యాలెట్, పౌచ్, గాగుల్స్, టోపీలు, హ్యాండ్ బ్యాగులు వంటివి తీసుకురావొద్దు. ►పెన్సిల్, కాలిక్యులేటర్, స్కేల్, రైటింగ్ ప్యాడ్ వంటివి కూడా అనుమతించరు. ►మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్, హెల్త్‌బ్యాండ్, వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దు. ►అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు, ముక్కు పుడక, నెక్లెస్, బ్రాస్లెట్ వంటి ఆభరణాలు, అబ్బాయిలు చైన్లు, బ్రాస్లెట్లు వేసుకోవద్దు. ►అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు కూడా తీసుకురావొద్దు. ►హిందీ, ఇంగ్లిష్తో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ►మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ►అభ్యర్థులు కనీసం ఒక గంట ముందే పరీక్షాకేంద్రానికి రావాలి. ►కరోనా నేపథ్యంలో అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయనున్నారు.