మచిలీపట్నం మెడికల్ కాలేజీ భవనాలు
వడ్డే బాలశేఖర్–మచిలీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: వందల ఏళ్ల క్రితమే సముద్రయానం ద్వారా వర్తక వాణిజ్యంతో అలరారిన మచిలీపట్నం నగరం క్రీ.శ. మూడో శతాబ్ధం నాటిదని చరిత్ర చెబుతోంది. ఆధునిక కాలంలో బ్రిటీష్ పాలకులు బందరు తీరం నుంచి వాణిజ్య కార్యకలా పాలు నిర్వహించారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక నగరంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో తీర ప్రాంత ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమైతే 70 కి.మీ ప్రయాణించి విజయవాడ వెళ్లాల్సిందే.
ఈ అవస్థలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బందరు మెడికల్ కాలేజీని మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపారు. 64.3 ఎకరాల్లో రూ.550 కోట్లతో మచిలీపట్నం వైద్య కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణానికి 2021 జూలై 7 సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేశారు. 150 ఎంబీబీఎస్ సీట్లతో నూతన వైద్య కళాశాల తరగతులు ప్రారంభించేలా సదుపాయాలను సమకూర్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మచిలీపట్నం వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించారు.
బందరు తీర ప్రాంత ప్రజలకు ఆరోగ్య భద్రత
తొలి ఏడాది ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులకు అకడమిక్ కార్యకలాపాల కోసం అడ్మినిస్ట్రేషన్, ల్యాబొరేటరీ, లెక్చర్ గ్యాలరీ, ఎగ్జామినేషన్ డిపార్ట్‌మెంట్, హాస్టళ్లతో కలిపి 7 బ్లాక్‌లను నిర్మించారు. లెక్చర్ గ్యాలరీ బ్లాక్‌లో 184 మంది కూర్చునే సామర్థ్యంతో ఎల్‌ఈడీ స్క్రీన్స్, ప్రొజెక్టర్స్, సెంట్రల్ ఏసీ లాంటి అత్యాధునిక వసతులతో రెండు లెక్చర్ హాల్స్, ఇన్‌సైడ్, అవుట్‌సైడ్ రీడింగ్ రూమ్స్, జర్నల్, స్టాఫ్ రీడింగ్, లైబ్రరీ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిల కోసం విడివిడిగా రెండు హాస్టల్ బ్లాక్‌లు సిద్ధం చేశారు.
నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా హ్యూమన్ అనాటమీ, క్లినికల్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ/హెమటాలజీ, సెంట్రల్ ల్యాబొరేటరీ, స్కిల్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుగుణంగా అన్ని వనరులు సమకూర్చారు. ఆయా బ్లాక్‌లలో ఫర్నిచర్ సమకూర్చే సమకూర్పు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరు లోపు భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
మచిలీపట్నం తరహాలోనే నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలు కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అన్ని చోట్ల నేడో రేపో కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బంది కొత్తగా నిర్మించిన తమ చాంబర్లలో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి సమకూరనున్నాయి. ఆంధ్రా మెడికల్ కాలేజీ 1923లో ఏర్పాటు కాగా వందేళ్ల తరువాత ప్రభుత్వ రంగంలో ఒకే ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
విద్య, వైద్యం.. రెండు రకాల లాభాలు
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ కానున్నాయి. ఐదు చోట్ల సేవలు అందించిన జిల్లా ఆస్పత్రుల స్థానంలో బోధనాస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. సేవలు రెట్టింపవుతాయి. అధునాతన వైద్య పరికరాలు, ల్యాబ్‌లు సమకూరడంతో వైద్య సేవలు, రోగ నిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది.
రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల వల్ల వివిధ రకాల వ్యాధులు, జబ్బులపై రీసెర్చ్ జరుగుతుంది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌లో చేరనున్న విద్యార్థులు నాలుగేళ్ల అనంతరం హౌస్ సర్జన్‌లుగా సేవలు అందిస్తారు. 24/7 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటంతో సేవలు మరింత మెరుగవుతాయి. మరోవైపు ఎన్‌ఎంసీ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ అడాప్షన్ విధానం ద్వారా ప్రతి విద్యార్థి ఐదు కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య బాధ్యతలను పర్యవేక్షిస్తారు. నాలుగైదేళ్ల తర్వాత పీజీ సీట్లు కూడా సమకూరడంతో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరుగుతుంది.
వైద్యుల నిష్పత్తి పెరుగుతుంది
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు విస్త్రృతంగా పెరుగుతాయి. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. మన దేశంలో వెయ్యి మందికి ఒకరి కంటే తక్కువ వైద్యులున్నారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో ఎక్కువ మంది వైద్యులు అందుబాటులోకి వస్తారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి.
– డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ కర్నూలు జీజీహెచ్
శరవేగంగా పెండింగ్ పనులు
ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభించడానికి వీలుగా పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 31 నుంచి ఆల్ ఇండియా కోటా సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్ట్ చేస్తారు. పెండింగ్ పనులన్నీ శరవేగంగా నెలాఖరులోగా పూర్తి చేసేలా పర్యవేక్షిస్తున్నాం. వచ్చే ఏడాది మరో ఐదు కళాశాలలను ప్రారంభించేలా కసరత్తు చేపట్టాం.
– ఎం.టి.కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
నాలుగేళ్లలో వైద్యరంగం బలోపేతం ఇలా..
► రూ.16 వేల కోట్లతో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం.
► నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 51 వేల వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసేలా సీఎం జగన్ ఆదేశాలు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఏర్పాటు.
► గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు.
► దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. నెలకు రెండు సార్లు గ్రామాలకు పీహెచ్‌సీ వైద్యులు. ఇప్పటివరకూ 1.70 కోట్ల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం.
► వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో
విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం.
► 108, 104 అంబులెన్స్‌ల సేవలు బలోపేతం. కొత్తగా 768 అంబులెన్స్‌ల సేవలు అందుబాటులోకి. 2020 జూలై నుంచి 33.35 లక్షలకు పైగా అత్యవసర కేసుల్లో సేవలందించిన అంబులెన్స్‌లు.
► ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు.
స్థానికులకు ఎంతో మేలు
ఇప్పటిదాకా బందరు ప్రాంతంలో మెరిట్ విద్యార్థులు వైద్య విద్య చదవాలంటే కాకినాడ, విజయవాడ, వైజాగ్ వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడే వైద్య కళాశాల ఏర్పాటుతో స్థానికులకు ఎంతో మేలు జరగనుంది. పూర్తి స్థాయిలో బోదనాస్పత్రి సిద్ధం అయింది. భవిష్యత్తులో పీజీ విద్యార్థులు కూడా వస్తారు. బందరు చుట్టు పక్కల ప్రాంత ప్రజలకు ఆరోగ్య భద్రత చేకూరుతోంది.
– డాక్టర్ బి.శ్రీనివాసాచార్య, ఐఎంఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంగ్, మచిలీపట్నం
మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి ప్రతి చోటా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆమేరకు నంద్యాలలో కొత్త వైద్య కళాశాలను నెలకొల్పారు. త్వరలోనే తరగతులు ప్రారంభం కానున్నాయి. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతోంది. విద్యార్థుల వైద్య విద్య కల కూడా నెరవేరుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్యం మరింత చేరువ అవుతుంది.
– చెన్నకేశవ, నంద్యాల
17 కొత్త కాలేజీలు
రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా స్పెషలిస్ట్ వైద్య సేవలను చేరువ చేసేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా సమకూరుస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం 5 కాలేజీలు ప్రారంభం అవుతుండగా వచ్చే విద్యా సంవత్సరం మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కాలేజీలను ప్రారంభిస్తారు. మిగిలిన వాటిని 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా నోటిఫై చేసింది.
Comments
Please login to add a commentAdd a comment