![Bank in Machilipatnam enters its 219th year](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/bank.jpg.webp?itok=Yk-Cxi02)
1806లో 14 ఎకరాల్లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌గా ఏర్పాటు
1908 జనవరి 1 నుంచి ప్రత్యేక బ్రాంచ్ ఏర్పాటు
1923లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్పు
1955 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఆవిర్భావం
ఆర్బీఐలో మసులీపట్నంగా నమోదు.. నేటికీ అదే పేరు
తొలి రోజుల్లో వందల్లోనే ఖాతాదారులు.. నేడు 50వేలు పైనే
సాక్షి, మచిలీపట్నం: ఒకవైపు సముద్రతీరం మరోవైపు కృష్ణమ్మ ఒడి.. ఒడ్డున వెలిసిన ప్రాచీన పట్టణం మచిలీపట్నం. ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యాంక్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందింది.ఈ బ్యాంక్ ఏకంగా 218 వసంతాలు పూర్తి చేసుకొని 219వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. బ్రిటీష్ పాలనలో ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు చెల్లించేందుకు ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ నేడు సామాన్య ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తోంది.
అప్పట్లో ఇది బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌గా ఆవిర్భవించి.. అనంతరం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. గుంటూరు బ్యాంక్‌కు సబ్ బ్రాంచ్‌గా ఉన్న ఈ బ్యాంక్ 1908లో ప్రత్యేక బ్రాంచ్‌గా ఆవిర్భవించింది. జనవరి 1వ తేదీతో ప్రత్యేక బ్రాంచ్ ఏర్పడి 117 ఏళ్లు పూర్తయ్యాయి.
బ్రిటిష్ కాలంలో ఓ వెలుగు వెలిగిన పట్టణం
బ్రిటీష్‌వారు తమ పాలనకు ఎంతో అనువైన పట్టణంగా మచిలీపటా్నన్ని గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రోజుల్లో మచిలీపట్నం దేశంలో మూడో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ఎందరో స్వాతంత్య్రం కోసం సాగిన పోరులో పాల్గొనడంతో పాటు రాజకీయ, సినీ, సామాజిక రంగాల్లో రాణించారు. మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్‌కు ఎంతో చరిత్ర ఉంది.
రిటైర్డ్ ఉద్యోగులు, చరిత్రకారుల వివరాల మేరకు.. 1806లో దీన్ని బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌గా 14 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా ఉద్యోగులు శిక్షణ కేంద్రం కూడా నెలకొల్పారు. 1905 నుంచి గుంటూరు బ్యాంక్‌కు అనుబంధంగా సబ్ బ్రాంచ్‌గా నిర్వహించి, 1908 జనవరి 1 నుంచి ప్రత్యేక బ్రాంచ్‌గా ఏర్పాటు చేశారు.
1923లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పడి, 1955 జూన్ 30 వరకు సేవలందించింది. అదే ఏట జూలై 1 నుంచి ఆర్బీఐలో విలీనమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. మచిలీపట్నం పేరు ఆర్బీఐలో మసులీపట్నంగా నమోదు కాగా నేటికీ అదే పేరు ఉంది.
ఉద్యోగులు, పెన్షనర్ల కోసం..
బ్రిటిష్ కాలంలో ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఇక్కడ బ్యాంక్ ఏర్పాటు చేశారు. నాడు పదిమంది లోపు మాత్రమే ఉద్యోగులు ఉండేవారు. 1955లో స్టేట్ బ్యాంక్‌గా ఏర్పడిన తరువాత ఉద్యోగుల సంఖ్య 20కి చేరింది. అప్పట్లో బ్యాంకింగ్ సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండేవి. ఆ రోజుల్లో వందల్లోనే ఖాతాదారులు, పదుల్లో లావాదేవీలు జరిగేవి.
నేడు 50 వేలకు పైగా ఖాతాదారులు ఉండగా రోజూ వెయ్యికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. 1905లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆంగ్లేయులకు అన్ని విధాలా ఉపయోగపడింది. రెండో ప్రపంచయుద్ధం (1913–1945) సమయంలో ఆంగ్లేయులు పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం ఈ బ్యాంక్‌లో భద్రపరచినట్లు పెద్దలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment