
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది.
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు నోటీసులిచ్చారు. రాజకీయ కక్ష సాధింపు కోసం మహిళలను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పదే పదే విచారణకు పిలిచి పేర్ని నాని కుటుంబాన్ని అవమానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ నాడు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.
మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బందరు తాలుకా పీఎస్‌కు పేర్ని నాని సతీమణి జయసుధ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పీఎస్‌కు వెళ్లారు. ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించారు.
ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందే..
స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతూ జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందేనని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ సమయంలో జయసుధతో పాటు లాయర్లను పోలీసులు అనుమతించలేదు. జయసుధతో పాటు వచ్చిన వైఎస్సార్‌సీపీ మహిళా నేతలను సైతం పోలీసులు బయటికి పంపించేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
అనారోగ్యంతో ఉన్నప్పటికీ జయసుధ విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ తరఫు న్యాయవాది వరద రాజులు మీడియాతో మాట్లాడుతూ, న్యాయస్థానం విధించిన షరతులకు లోబడి పోలీసుల విచారణకు జయసుధ హాజరయ్యారయ్యారని.. జయసుధ స్పైనల్ కార్డ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ విచారణకు హాజరయ్యారన్నారు. గంట నుంచి పోలీసులు విచారిస్తున్నారని.. ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసుల విచారణకు జయసుధ సహకరిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరి ష్యూరిటీ సర్టిఫికెట్లను పోలీసులకు అందజేశామని వరద రాజులు తెలిపారు.
అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది.

ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు..