
జిల్లాలో భారీగా పెరిగిన ‘గోల్డ్’ లోన్లు
అవసరానికి కొందరు.. భద్రత కోసం మరికొందరు
నగలతో బ్యాంకు మెట్లెక్కుతున్న జనం
హిందూపురం అర్బన్: బంగారం.. ఇప్పుడు అందరికీ అత్యవసర నిధి. అందుకే ధర భగ్గుమంటున్నా కొనేందుకు జనం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. చాలా మంది బంగారు ఆభరణాలు ఒంటిపై ఉంటే సమాజంలో గౌరవంగా చాలా మంది భావిస్తున్నారు. అలాగే అత్యవసర సమయంలోనూ ఆదుకునే అత్యవసర నిధిగా భావిస్తున్నారు. అందుకే ధర ఎంతగా ఎగబాకినా...కొనేందుకు జనం మొగ్గుచూపుతున్నారు.
బంగారం చేతిలో ఉంటే క్షణాల్లో రుణం..
ఏదైనా రుణం కావాలంటే బ్యాంకులకు వెళితే.. సవాలక్ష నిబంధనలు చెబుతారు. కొన్నిసార్లు నెలల తరబడి తిరిగినా రుణం మంజూరు కాని పరిస్థితి. కానీ ‘గోల్డ్ లోన్’(Gold loan) అలా కాదు. చేతిలో బంగారు నగలుంటే చాలు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు క్షణాల్లో రుణం మంజూరు చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు కోసం ‘గోల్డ్ లోన్’ తీసుకొంటున్నారు.
గ్రామగ్రామానా వెలిసిన సంస్థలు..
‘గోల్డ్ లోన్’ వ్యాపారం భారీగా జరుగుతుండగా... హిందూపురం, ధర్మవరం, కదిరి లాంటి పట్టణాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లోనూ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు వెలిశాయి. అవసరానికి అప్పులు పుట్టని చాలామంది ‘గోల్డ్‌లోన్’ తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘ప్రైవేట్’ వ్యక్తుల వద్ద తీసుకునే రుణానికి వడ్డీ కొండంత ఉండటంతో చాలా మంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తున్నారు.
బ్యాంకులతో పాటు ప్రైవేటు సంస్థలు బంగారం నాణ్యతను బట్టి లోన్ మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల బంగారానికి రూ.52 వేలకుపైగా రుణం ఇస్తున్నారు. పైగా తక్కువ వడ్డీలకే రుణాలు మంజూరవుతుండటంతో చాలా మంది ‘గోల్డ్‌లోన్’ తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రధాన బ్యాంకులతో పాటు సహకార సంఘ బ్యాంకులు, ముత్తూట్ మనీ, మణప్పరం, శ్రీరామ్ చిట్స్ తదితర సంస్థలు విరివిగా ‘గోల్డ్‌లోన్’ మంజూరు చేస్తున్నాయి. కొందరైతే బంగారాన్ని కుదవపెట్టి లోన్ తీసుకొని దాని ద్వారా వ్యాపారాలు చేస్తుండటం విశేషం.
లాకరు అద్దె ఎందుకనీ...
డబ్బున్న వారు సైతం బంగారాన్ని లాకర్లలో ఉంచడం తగ్గించేశారు. అదే బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. లేదంటే తీసుకున్న రుణంలో 90 శాతం మొత్తం నెలలోపు తీర్చేస్తున్నారు. మిగిలిన 10 శాతం మొత్తాన్ని ఏడాది తర్వాత వడ్డీతో కలిపి కట్టేస్తున్నారు. మళ్లీ బంగారాన్ని లోన్ కోసమంటూ బ్యాంకుల్లో పెట్టేస్తున్నారు. దీంతో జిల్లాలో ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని వివిధ బ్యాంకు శాఖల్లో కిలోల కొద్దీ బంగారం నగలు ఉంటున్నాయి. గోల్డ్ రుణాలు పొందేవారి సంఖ్య పెరుగుతుండటంతో బ్యాంకుల్లోని సేఫ్ లాకర్లలో నగల మూటలూ పెరిగిపోతున్నాయి.
నెలకు రూ.12 కోట్ల పైమాటే
⇒ జిల్లా వాసులు ప్రస్తుతం బ్యాంకులు, వివిధ ప్రైవేటు సంస్థల్లో నెలకు రూ.12 కోట్ల దాకా బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. గతంలో ఈ మొత్తం రూ.9 కోట్లలోపే ఉండేది. సంక్షేమ పథకాలు అమలుకాకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రజల చేతిలో డబ్బు ఉండడం లేదు. దీంతో అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది.
⇒ 80 శాతం మంది బ్యాంకుల్లోనే తాకట్టు పెడుతున్నారు. మిగిలిన 20 శాతం ప్రైవేటు సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నారు.
⇒ బంగారు రుణాలపై బ్యాంకులు 8.5 శాతం నుంచి 9 శాతం వరకు, ప్రైవేటు సంస్థలు 10 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.
⇒ గ్రామీణం, పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందేవారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది.
⇒ హిందూపురానికి చెందిన నరేష్ చిరు ఉద్యోగి. ఇద్దరు పిల్లల చదువు కోసం రూ.3 లక్షలు అవసరం కాగా, పలువురి వద్ద రుణం కోసం ప్రయత్నించినా... ఫలితం లేకపోయింది. మరోమార్గం లేక తన భార్య నగలను తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా జీతం వచ్చినప్పుడు వాయిదాలు చెలిస్తున్నాడు. అవసరానికి బంగారం లేక పోతే పిల్లలను చదివించడం కష్టమయ్యేదంటున్నాడు.
⇒ ధర్మవరానికి చెందిన బాలాజీకి అత్యవసరంగా డబ్బు అవసరమైంది. ఎవరినైనా అడగాలంటే మొహమాటం.. అడిగినా ఇస్తారో లేదోనన్న అనుమానం. దీంతో భార్యతో చర్చించి చివరకు బంగారు నగలతో బ్యాంకుకు వెళ్లి ‘గోల్డ్ రుణం’ తీసుకున్నాడు.
⇒ పుట్టపర్తికి చెందిన శిరీష్ కు ఇటీవలే వివాహమైంది. అత్తింటివారు తనకూ భార్యకు బంగారు నగలు చేయించారు. వాటిని ఇంట్లో పెట్టుకునేందుకు ధైర్యం చాలడం లేదు. బ్యాంకుకు వెళ్లి లాకర్ అడగ్గా...అందుబాటులో లేదన్నారు. పైగా ఏడాదికి అద్దె భారీగా చెల్లించాలని చెప్పారు. దీంతో శిరీష్ నగలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నాడు. నెలలో 90 శాతం మొత్తం రుణం చెల్లించాడు. మిగతా 10 శాతానికి వడ్డీ లాకర్ అద్దె కంటే తక్కువే అయ్యింది.
⇒ ఇలా అవసరానికి ఒకరు..భద్రపరిచేందుకు మరికొందరు బ్యాంకుల ద్వారా ‘గోల్డ్ లోన్’ తీసుకుంటున్నారు. ఎవరి వద్దా చేయిచాపాల్సిన అవసరం లేకుండా ఏ ఆర్థిక అవసరం వచ్చినా ‘గోల్డ్’వైపు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment