2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్
2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం
కనీసం ఇద్దరు పిల్లల్ని కనండి
మచిలీపట్నంలో ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రాన్ని 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారాలని సీఎం చంద్రబాబు కోరారు. బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చిన ఆయన మహాత్మాగాందీ, లాల్ బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగా స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా గాం«దీజీ, లాల్ బహదూర్‌శాస్త్రి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పి0చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి, చెత్త ప్రభుత్వం అనిపించుకుందన్నారు. ఆ చెత్త పన్నును ఈ రోజు నుంచి రద్దు చేస్తున్నామని ప్రకటించారు. 2015లో స్వచ్ఛ ఏపీకి శ్రీకారం చుట్టామన్నారు.
పట్టణాల్లో 2.43 లక్షల మరుగుదొడ్లు, 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించి, 110 మునిసిపాలిటీలను ఓడీఎఫ్‌గా ప్రకటించామన్నారు. 2019 ఎన్నికల్లో భూతం వచ్చి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని, ఎక్కడ చూసినా కుప్పలుగా చెత్తను పెట్టారని పేర్కొన్నారు. 9,538 సాలిడ్ వేస్టే మేనేజ్‌మెంట్ కేంద్రాలను నిర్మించామని, వాటిని గత ప్రభుత్వం వినియోగించుకోకుండా రంగులు వేసుకుందన్నారు.
మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు
1919లో కృష్ణా జిల్లాలో సత్యాగ్రహ సభలో గాం«దీజీ పాల్గొన్నారని, ఈ గడ్డపై పుట్టిన పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను గాం«దీజీకి అందించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పింగళి వెంకయ్య పేరును మచిలీపట్నం మెడికల్ కళాశాలకు పెడతామన్నారు. ఆంధ్ర జాతీయ కళాశాలలో ఎందరో మహానుభావులు విద్యనభ్యసించారని, కానీ కొందరు స్వార్థపరులు ఆ కాలేజీ స్థలాన్ని కబ్జా చేయాలని చూశారన్నారు. ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వ ఆ«దీనంలో నిర్వహిస్తామని తెలిపారు.
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు
ఎన్నికల హామీ ప్రకారం దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ పథకానికి తానే శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. 2025 మార్చి నాటికి ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు, 2027 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత మంచి నీళ్లిస్తామని, 2025 నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని, అమరావతి రాజధానిని కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆయన బందరు పోర్టు నిర్మాణ పనులను పరిశీలించి.. 2025 డిసెంబర్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. బందరు–రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి చొరవ తీసుకుంటామన్నారు.
మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ నిరి్మస్తామని, బందరు లడ్డు, రోల్డ్ గోల్డ్ నగల తయారీ పరిశ్రమల కోసం ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని, కలంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేస్తామన్నారు. ప్లెక్సీల వాడకాన్ని నిర్మూలించేందుకు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 2047 నాటికి వందేళ్ల స్వతంత్ర భారత్‌లో స్వర్ణాంధ్ర లక్ష్యమన్నారు.
జనాభాను పెంచాలి
జనాభా తగ్గుముఖం పట్టడంతో వృద్ధుల సంఖ్య అధికంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కనీసం ఇద్దరు పిల్లల్ని కనాలని సూచించారు. గత పాలకుల పాపంతోనే బుడమేరుకు గండ్లు పడి వరదలు వచ్చాయని, దీంతో విజయవాడ అతలాకుతలమైందన్నారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని, వారికి మంచినీరు, భోజనాలు అందించలేక పోయామని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు రథం తగలబెట్టి.. ఆ నెపం టీడీపీపై నెట్టాలని చూశారని, నేరం చేసిన రెండు నిమిషాల్లోనే నిందితుల్ని పట్టుకునే వ్యవస్థ ప్రభుత్వం వద్ద ఉందన్నారు. రాముడి తల నరికితే నిందితులను పట్టుకోలేదని, దుర్గమ్మ వెండి సింహాలు మాయం చేసిన వారిపై చర్యలు లేవన్నారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు పూర్తి అయినా ఇంతవరకు ఎందుకు చెత్తపన్నును రద్దు చేయలేదని నెటిజన్లు సోషల్‌మీడియాలో సీఎంను ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment