అందాల దీవిలో కడలి కల్లోలం | chinna gollapalem: raging sea disappearing island | Sakshi
Sakshi News home page

chinna gollapalem: అందాల దీవిలో కడలి కల్లోలం

Published Tue, Dec 24 2024 5:18 AM | Last Updated on Tue, Dec 24 2024 1:05 PM

chinna gollapalem: raging sea disappearing island

చిన్నగొల్లపాలెం కొబ్బరి తోటలను మింగేస్తున్న కడలి తరంగాలు 

తుపాను వచ్చిందంటే గ్రామస్తులకు హడలే 

ఇప్పటికే సముద్రంలో కలిసిపోయిన 800కు పైగా ఎకరాలు 

కోత ప్రదేశంలో రాతి కట్టడం నిర్మించాలంటున్న ప్రజలు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: సహజసిద్ధ ప్రకృతి అందాలతో కనువిందు చేసే సుందర ద్వీపం చిన్నగొల్లపాలేనికి కష్టం వచ్చింది. దీనిని కడలి ఏటా మింగేస్తోంది. మరికొన్నేళ్లు గడిస్తే దీవి అనవాళ్లు కనబడవేమో అనే బెంగ ఆ గ్రామ వాసులను పీడిస్తోంది. మూడువైపులా ఉప్పుటేర్లు, ఒకవైపు బంగాళాఖాతం (Bay of Bengal) ఉండటంతో చుట్టూ నీటితో నిండిన చినగొల్లపాలెం కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో ఉంది.  

రెండు జిల్లాల సంస్కృతి మేళవింపు 
కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దులో రెండు జిల్లాల సంస్కృతికి అద్దం పడుతూ భౌగోళికంగానే కాక జీవన విధానంలోనూ భిన్న సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా చినగొల్లపాలెం (chinna gollapalem) నిలుస్తోంది. 1962వ సంవత్సరానికి ముందు దీవి మూడువైపులా నీటితో ఒక వైపు భూభాగంతో ద్వీపకల్పంగా ఉండేది. 1962లో కొల్లేరు పరీవాహక ప్రాంత ముంపునీరు సముద్రంలో కలిసేందుకు చినగొల్లపాలెం, పడతడిక గ్రామాల మధ్య కాలువ తవ్వారు. అప్పటి నుంచి ఇది మానవ నిర్మింత దీవిగా మారిపోయింది. నాటినుంచి దాదాపు అర్ధ శతాబ్దంపాటు బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. జల రవాణా మాత్రమే ఉండటంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉప్పుటేరుపై (Upputeru) వారధి నిర్మాణం జరిగింది. దీంతో రవాణా సంబంధాలు పునరుద్ధరణకు నోచుకున్నాయి.  

ప్రతిపాదనలతోనే సరి 
చినగొల్లపాలెం కోత నివారణకు సీ కోస్టల్‌ ఏరియా (ప్రొటెక్షన్‌ కీ)లో భాగంగా రూ.210 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త కాలువ, పాత కాలువల పూడికతీత, రెగ్యులేటర్ల నిర్మాణాలకు, పాత కాలువపై రెగ్యులేటర్‌కు రూ.364 కోట్లు, కొత్త కాలువపై రెగ్యులేటర్‌ కోసం రూ.166.35 కోట్లతో పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించినప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఆగిపోయాయి. ప్రభుత్వం అక్కడి ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోత నివారణకు శాశ్వత పరిష్కారంగా రాతి కట్టడం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

సముద్ర గర్భంలో కొబ్బరి తోటలు 
ఆరువేల ఎకరాలకుపైగా విస్తీర్ణంతో 10వేల జనాభా గల చినగొల్లపాలెం ప్రజల భద్రతకు భరోసా లేకుండాపోయింది. ప్రస్తుతం దీవిని రెండువైపుల నుంచి సముద్రం కోతకు గురిచేస్తోంది. గతంలో ఏటిమెండి వద్ద పాతకాలువ ముఖద్వారంతో పాటు ప్రస్తుతం కొత్తకాలువ ముఖద్వారం సైతం పూడుకుపోవడంతో సముద్రం దీవిని కోసేస్తోంది. ఇప్పటికే దాదాపు 800 ఎకరాల వరకు సరుగుడు, కొబ్బరి తోటలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే దీవిని సముద్రం (Sea) మింగేయడం ఖాయమని ప్రజలు భయపడుతున్నారు.

పూడిక తీయాలి సముద్రం వేగంగా కోతకు గురి చేస్తోంది. దీనికి ప్రధాన కారణం దీవికి తూర్పు, పశ్చిమ దిక్కున ఉన్న పాత, కొత్తకాలువలు పూడుకుపోవడమే. వెంటనే సముద్ర ముఖద్వారాల వద్ద పూడిక తీయాలి. ప్రకృతి ప్రసాదించిన అరుదైన సహజసిద్ధ సంపదను కాపాడాలి.  
– కొప్పినేటి హనుమంతరావు, మాజీ సర్పంచ్, చినగొల్లపాలెం


కోతకు కళ్లెం వేయాలి 
మా గ్రామా­న్ని సముద్రం కోసేస్తూ ఊరివైపు దూసుకువస్తోంది. ఇప్పటికే వందలాది ఎకరాల భూములు సముద్రంలో కలిసిపోయాయి. కోత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అతి త్వరలో దీవి కనుమరుగైపోతుంది. 
– మాసాబత్తుల శ్రీనివాసరావు, దీవి పరిరక్షణ అధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement