upputeru
-
అందాల దీవిలో కడలి కల్లోలం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సహజసిద్ధ ప్రకృతి అందాలతో కనువిందు చేసే సుందర ద్వీపం చిన్నగొల్లపాలేనికి కష్టం వచ్చింది. దీనిని కడలి ఏటా మింగేస్తోంది. మరికొన్నేళ్లు గడిస్తే దీవి అనవాళ్లు కనబడవేమో అనే బెంగ ఆ గ్రామ వాసులను పీడిస్తోంది. మూడువైపులా ఉప్పుటేర్లు, ఒకవైపు బంగాళాఖాతం (Bay of Bengal) ఉండటంతో చుట్టూ నీటితో నిండిన చినగొల్లపాలెం కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో ఉంది. రెండు జిల్లాల సంస్కృతి మేళవింపు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దులో రెండు జిల్లాల సంస్కృతికి అద్దం పడుతూ భౌగోళికంగానే కాక జీవన విధానంలోనూ భిన్న సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా చినగొల్లపాలెం (chinna gollapalem) నిలుస్తోంది. 1962వ సంవత్సరానికి ముందు దీవి మూడువైపులా నీటితో ఒక వైపు భూభాగంతో ద్వీపకల్పంగా ఉండేది. 1962లో కొల్లేరు పరీవాహక ప్రాంత ముంపునీరు సముద్రంలో కలిసేందుకు చినగొల్లపాలెం, పడతడిక గ్రామాల మధ్య కాలువ తవ్వారు. అప్పటి నుంచి ఇది మానవ నిర్మింత దీవిగా మారిపోయింది. నాటినుంచి దాదాపు అర్ధ శతాబ్దంపాటు బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. జల రవాణా మాత్రమే ఉండటంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉప్పుటేరుపై (Upputeru) వారధి నిర్మాణం జరిగింది. దీంతో రవాణా సంబంధాలు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ప్రతిపాదనలతోనే సరి చినగొల్లపాలెం కోత నివారణకు సీ కోస్టల్ ఏరియా (ప్రొటెక్షన్ కీ)లో భాగంగా రూ.210 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త కాలువ, పాత కాలువల పూడికతీత, రెగ్యులేటర్ల నిర్మాణాలకు, పాత కాలువపై రెగ్యులేటర్‌కు రూ.364 కోట్లు, కొత్త కాలువపై రెగ్యులేటర్ కోసం రూ.166.35 కోట్లతో పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించినప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఆగిపోయాయి. ప్రభుత్వం అక్కడి ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోత నివారణకు శాశ్వత పరిష్కారంగా రాతి కట్టడం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.సముద్ర గర్భంలో కొబ్బరి తోటలు ఆరువేల ఎకరాలకుపైగా విస్తీర్ణంతో 10వేల జనాభా గల చినగొల్లపాలెం ప్రజల భద్రతకు భరోసా లేకుండాపోయింది. ప్రస్తుతం దీవిని రెండువైపుల నుంచి సముద్రం కోతకు గురిచేస్తోంది. గతంలో ఏటిమెండి వద్ద పాతకాలువ ముఖద్వారంతో పాటు ప్రస్తుతం కొత్తకాలువ ముఖద్వారం సైతం పూడుకుపోవడంతో సముద్రం దీవిని కోసేస్తోంది. ఇప్పటికే దాదాపు 800 ఎకరాల వరకు సరుగుడు, కొబ్బరి తోటలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే దీవిని సముద్రం (Sea) మింగేయడం ఖాయమని ప్రజలు భయపడుతున్నారు.పూడిక తీయాలి సముద్రం వేగంగా కోతకు గురి చేస్తోంది. దీనికి ప్రధాన కారణం దీవికి తూర్పు, పశ్చిమ దిక్కున ఉన్న పాత, కొత్తకాలువలు పూడుకుపోవడమే. వెంటనే సముద్ర ముఖద్వారాల వద్ద పూడిక తీయాలి. ప్రకృతి ప్రసాదించిన అరుదైన సహజసిద్ధ సంపదను కాపాడాలి. – కొప్పినేటి హనుమంతరావు, మాజీ సర్పంచ్, చినగొల్లపాలెంకోతకు కళ్లెం వేయాలి మా గ్రామాన్ని సముద్రం కోసేస్తూ ఊరివైపు దూసుకువస్తోంది. ఇప్పటికే వందలాది ఎకరాల భూములు సముద్రంలో కలిసిపోయాయి. కోత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అతి త్వరలో దీవి కనుమరుగైపోతుంది. – మాసాబత్తుల శ్రీనివాసరావు, దీవి పరిరక్షణ అధ్యక్షుడు -
ఉప్పుటేరును మింగేస్తున్నారు..!
సాక్షి, కృష్ణా: సామాన్యుడి ఇల్లు రోడ్డు నిర్మాణం పేరుతో తొలగిస్తే అతనికి మరో చోటు ఆశ్రయం కల్పించడానికి సెంటు భూమి కూడా ఇవ్వలేరు.. నిరుపేదల కష్టాలు వారికి పట్టనే పట్టవు. కానీ రూ.కోట్ల విలువైన పక్కా నిర్మాణాలు చేసుకోవడానికి, భారీ స్థాయిలో వ్యాపారం చేసుకోవడానికి ఉప్పుటేరు, ఇరిగేషన్, డ్రెయినేజీ భూములను ఆక్రమించుకుని అనుమతి లేని నిర్మాణాలు చేస్తుంటే కనీసం అటువైపు అధికారులు కన్నెత్తైనా చూడటం లేదు.. ఇదీ కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలోని దుస్థితి. జిల్లాకు శివారు ప్రాంతమైన లక్ష్మీపురంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిపై అధికారులు అజమాయిషీ కొరవడటంతో భారీ కట్టడాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వంలో ఇవి మరింత జోరందుకున్నాయి. నాటి పాలకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురైపోయాయి. అంతా బంగారమే! జిల్లాకు శివారునున్న లక్ష్మీపురం పంచాయతీలో ఇప్పుడు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక్కడ భూమి విలువ ప్రధాన పట్టణాలకంటే అధికంగా పలుకుతుంది. లాకు సెంటరులో అధికంగా ఇరిగేషన్, ఉప్పుటేరు పోరంబోకు భూములున్నాయి. వీటిని స్థానికులు కొందరు ఆక్రమించుకుని భారీ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ భూముల్లో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేయడం వెనుక గతంలో రాజకీయ పెద్దల హస్తంతో పాటు, అధికారులు అండ కూడా పుష్కలంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఉప్పుటేరును పూడ్చి.. లక్ష్మీపురం లాకు సెంటర్ మీదుగా కొల్లేరు నీటిని సముద్రంలోకి చేరవేసే ఉప్పుటేరు పాయ ప్రవహిస్తుంది. దీన్ని పూడ్చుకుంటూ కొందరు కట్టడాలు నిర్మించగా, మరి కొందరు భారీ ఎత్తున వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇక్కడి నిర్మాణాలకు పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. లాకుల వద్ద ఇరిగేషన్‌న్ భూముల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు రహదారిని ఆనుకుని య«థేశ్ఛగా జరుగుతున్నా ఒక్క అధికారి కూడా పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఇళ్లు తొలగించినా.. 216 జాతీయ నిర్మాణం పేరుతో లక్ష్మీపురంలో కొందరి పేదల ఇళ్లు తొలగించారు. ఇంతవరకు బాధితులకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా కేటాయించలేదు. కాని తమ కళ్ల ముందే రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు ఈ ఆక్రమణలు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. అధికారులు స్పందిస్తారా..? కృష్ణా నది కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను ఇటీవల అధికారులు కూల్చివేసినట్టుగానే ఉప్పుటేరు, ఇరిగేషన్ భూముల్లోని అక్రమ కట్టడాల విషయంలో కూడా చర్యలు తీసుకుంటారా? అనే సందేహం ప్రజల్లో నెలకొంది. వీటిపై పంచాయతీ అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వ భూముల్లో కట్టడాలకు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు. -
నేటి వారధికి..సారథి ఆయనే..
సాక్షి, పెడన : కడలి సుడులలో కొట్టుకుంటూ బాహ్య ప్రపంచంతో బంధం లేని దీవికి వారధి రూపంలో దారి కల్పించిన దేవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇసుక తిన్నెలనే రహదారిగా చేసుకుని అలసిన పాదాల కష్టాలకు విరామాన్నిస్తూ సొగసైన రహదారి నిర్మాణం ఆయన సొంతం. గుక్కెడు నీటి కోసం అలమటించి పోతున్న వేల గొంతుల దాహం తీర్చే ఆలోచన చేసిన అపరభగీరథుడు. రెండు జిల్లాలను వంతెనతో అనుసంధానం చేసిన మహోన్నతుడు. అభివృద్ధికి ఆయన చిరునామా..పేదవాడి కష్టం తెలిసిన ప్రేమమూర్తి దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి. పెడన నియోజకవర్గంలోనే అరుదైన అభివృద్ధి సొంతం చేసుకున్న ఘనత ఆయనది. తీరప్రాంతమే కాక జిల్లాకు శివారునున్న కృత్తివెన్ను మండలానికి 2007 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రాకతో అభివృద్ధికి బీజం పడింది. నాడు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఉప్పుటేరుపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి వైఎస్సార్ వచ్చారు. బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధం లేని చినగొల్లపాలెం దీవి వంతెనకు శంకుస్థాపన చేశారు. దీవిలో దారి.. ఇసుక తిన్నెలపై ప్రయాణంతో నిత్యం ప్రత్యక్ష నరకం చూస్తున్న దీవి వాసుల కోసం ఎంతో వ్యయ ప్రయాసలైన పడవలపై ఇసుక, కంకర తరలించి రహదారి నిర్మాణానికి కృషి చేసిన ఘనత ఆయనదే. -
గంగపుత్రుల పంట పండింది
ఆకివీడు: ఉప్పుటేరులో చేపలు ఇబ్బడిముబ్బడిగా దొరుకుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొల్లేరు తీర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వందలాది ఎకరాల చేపలు, రొయ్యల చెరువులు ఏకమైపోయాయి. చాలా చెరువులకు గండ్లు పడ్డాయి. కొన్ని చెరువుల గట్లపై రెండు మూడు అడుగుల ఎత్తున ఇంకా నీరు ప్రవహిస్తోంది. దీంతో చెరువుల్లోని చేపలు, రొయ్యలు వరదనీటికి కొట్టుకుపోతున్నాయి. ఆ నీరు కొల్లేరులోకి, అక్కడి నుంచి ఉప్పుటేరులోకి చేరుతోంది. నీటి ప్రవాహంతోపాటు చేపలు గుట్టలు గుట్టలుగా ఉప్పుటేరులోకి చొచ్చుకు వస్తున్నాయి. మత్స్యకారులు వల వేస్తే చాలు దండిగా చేపలు పడుతున్నాయి. దాంతో ఉప్పుటేరులో మత్స్యకారులు వందలాది పడవలు, దోనెలతో వలలు వేసి చేపల్ని పట్టుకుంటున్నారు. వంద గ్రాముల సైజు నుంచి కేజీ లోపు చేపలుఅధికంగా వలలకు చిక్కుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా కొట్టాడ, జంగంపాడు, పెదకొట్టాడ, పందిరిపల్లె గూడెం, దుంపగడప, సిద్ధాపురం, చినమిల్లిపాడు, పెదకాపవరం, గుమ్ములూరు, చినకాపవరం తదితర గ్రామాల నుంచి వందలాది మంది మత్స్యకారులు ఉప్పుటేరులో వేటాడుతున్నారు. రోజుకు వెయ్యి నుంచి రూ.3 వేల వరకూ విలువైన చేపల్ని వేటాడుతున్నట్లు కొందరు మత్స్యకారులు తెలిపారు. కిలో చేపలు రూ.30 ఉప్పుటేరులో వేటాడిన చేపల్ని కిలో రూ.30 లకు విక్రయిస్తున్నారు. ఉప్పుటేరు గట్టు వద్దే కాటా ఏర్పాటుచేసి తూకం తూస్తున్నారు. కొందరు పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఆకివీడులోని లాంచీల రేవు వద్ద హోల్‌సేల్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. మార్కెట్లో మరికొంత లాభానికి వాటిని అమ్ముకుంటున్నారు. ఉప్పుటేరు నిండా కొంగలు చేపలు దండిగా లభిస్తున్నందున ఉప్పుటేరు నిండా కొంగలు వాలుతున్నాయి. మూడు రోజులుగా ఉప్పుటేరు పొడవునా కొంగలు బారులుతీరి కనువిందు చేస్తున్నాయి. పదేళ్లకో పండుగ పదేళ్లకో పండుగ అన్నట్లుగా ఉంది మత్స్యకారులకు. చేపలు పట్టి జీవించే మత్స్యకారులు రోజంతా వేటాడినా గతంలో వలకు అరకొరగా చేపలు దొరికేవి. ఇప్పుడు దండిగా దొరుకుతున్నందున వారికి పండుగగా ఉంది. వేటాడిన చేపలు అమ్ముకుంటే ప్రస్తుతం వారికి కాసిన్ని డబ్బులు కనపడుతున్నాయి.– గాడి సంధాని, మత్స్యకారుడు, దుంపగడప -
ఉప్పుటేరూ.. గోవిందా!
ఆకివీడు: స్వచ్ఛమైన ఈ జలసిరులు ఇక కన్పించవేమో!. ఈ పచ్చదనం భవిష్యత్‌కు వెచ్చదనంగా మారుతుందేమో!. చల్లటి ఆరోగ్యవంతమైన గాలులు ఇక వీయవేమో!. కొల్లేరు సరస్సు వల్లే సహజసిద్ధంగా ఏర్పడిన ఉప్పుటేరును కాలుష్య తిమింగలం మింగేయనుందా! అనే భయాందోళన సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఏర్పడింది. ఉప్పుటేరు కూడా కాలుష్యానికి గురికానుందని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొల్లేరు ముఖ ద్వారం నుంచి చినగొల్లపాలెం వరకూ ఉన్న ఉప్పుటేరులో గోదావరి, కృష్ణా నదుల మిగులు జలాలు కలుస్తాయి. ఏడాదిలో పది నెలలపాటు ఈ జలాలు కలవగా మిగిలిన రెండు నెలల్లో సముద్రపు నీరు ఎదురు ప్రవహించి ఉప్పుటేరులోని వ్యర్థాల్ని తీసుకుపోతుంది. సముద్ర జలాలు కలవడంతో ఉప్పు, నదీ జలాల సంగమంతో ఏరుగా పూర్వీకులు ఉప్పుటేరుగా నామకరణం చేశారు. ఉప్పుటేరును డ్రెయిన్‌గా కాకుండా ఏరుగానే ప్రజలు భావిస్తూ, దీని నీటిని నేటికీ వినియోగిస్తూనే ఉన్నారు. ఒక దశలో ఉప్పుటేరుపై మినీ జలవిద్యుత్ కేంద్రం నిర్మించాలన్న యోచన కూడా పాలకులకు కలిగింది. కృష్ణా జిల్లాలోని ఉప్పుటేరు వెంబడి ఉన్న గ్రామాలు, పశ్చిమ డెల్టాలోని పలు గ్రామాలు ఈ నీటినే వినియోగించుకుంటున్నాయి. ఎత్తిపోతల పథకం కింద నీటిని తోడుకుని సాగు చేస్తున్నారు. వేలాది ఎకరాల ఆక్వా సాగు కూడా ఉప్పుటేరుపై కొనసాగుతోంది. కొన్ని గ్రామాల ప్రజలు ఉప్పుటేరులోని నీటిని వాడకానికి, దుస్తులు ఉతుక్కునేందుకు వినియోగించుకుంటున్నారు. ఉప్పుటేరు స్వరూపం.. కొల్లేరు సరస్సు ముఖ ద్వారం పందిరిపల్లి గూడెం వద్ద 1వ మైలు రాయి నుంచి సముద్రపు ముఖద్వారం వద్ద 49వ మైలు రాయి వరకూ ఉప్పుటేరు ప్రవహిస్తోంది. సుమారు 68 కిలోమీటర్ల మేర (49 మైళ్ల) దూరం వరకూ ఉప్పుటేరు జీవధారగా ప్రవహిస్తోంది. 750 మీటర్ల నుంచి 1200 మీటర్ల వెడల్పులోనూ, 36 అడుగులు లోతులో ఉప్పుటేరు 16 వేల క్యూసెక్కుల నీటితో నిండి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉప్పుటేరు పూడుకుపోవడంతో కేవలం 28 అడుగుల లోతులోనూ, 8 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో కుంచించుకుపోయింది. పలు చోట్ల మేటలు వేసి ఉప్పుటేరు పూడుకుపోతోంది. దీంతో నీటి ప్రవాహం మందగిస్తోంది. సముద్రపు పోటు సమయంలో ఉప్పునీరు అధికంగా ఎదురు ప్రవహిస్తోంది. దిగువ ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ? ఉప్పుటేరు దిగువ ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆక్వా కాలుష్యం నుంచి ఉప్పుటేరును రక్షించి సరిహద్దు గ్రామాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆక్వా వ్యర్థాలు వేసవిలో ఉప్పుటేరు గుండా కొల్లేరు సరస్సులోకి ప్రవేశించే అవకాశం కూడా ఉందని వారు చెబుతున్నారు. ఆక్వా వ్యర్థాలకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ముప్పుటేరు
భీమవరం అర్బన్ : పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న ప్రధాన డ్రెయిన్ ఉప్పుటేరు సిల్టు, కిక్కిసతో పూడుకుపోతుంది. దీంతో వరదల సమయంలో డ్రెయిన్ పరివాహక ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. ఉప్పుటేరు కొల్లేరు నుంచి ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాలు మీదుగా కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలంలోని గొల్లపాలెంలో సముద్రంలో కలుస్తుంది. దీనిని ఆనుకుని సుమారు 80 వేల ఎకరాల్లో వరి, ఆక్వా సాగుచేస్తున్నారు. ఉప్పుటేరు అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించకపోవడంతో ఏటా వర్షాకాలంలో డ్రెయిన్ పొంగి పొర్లుతుంది. దీనికితోడు సముద్రపు ఆటుపోటులకు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఉప్పుటేరు మొగలో స్లూయిజ్ నిర్మిస్తే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు తాగు, సాగు నీరు కొరత తీరుతుందని నిపుణులు సూచిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉప్పుటేరు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుగా ఉన్న కొల్లేరు పెద్దింట్లమ్మ ఆలయ సమీపంలో కొల్లేటికోట జీరో మైలు రాయి వద్ద ప్రారంభమై ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాలు మీదుగా సముద్రంలో కలుస్తుంది. సముద్రపు ఆటుపోటులను ఎదుర్కొంటూ ఎగువ ప్రాంతాల్లో ముంపునీటిని సముద్రంలోకి తరలిస్తుంది. దీనిద్వారా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, చేపల చెరువులు, లోతట్టు ప్రాంతాలను ఉప్పుటేరు కాపాడుతుంది. అయితే ఉప్పుటేరుపై అధికారులు దృష్టి సారించకపోవడంతో చాలా చోట్ల మూడు మీటర్లు పైగా లోతు ఉండాల్సిన డ్రెయిన్ మీటరు లోతుకు పూడుకుపోయింది. పూడికతీతను మరిచారు సుమారు మూడు దశాబ్దాల క్రితం ఉప్పుటేరు పూడికతీత పనులు అధికారులు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తట్ట మట్టికూడా తీయకపోవడంతో ఉప్పుటేరు పూడుకుపోతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే వేలాది ఎకరాలు నీటమునగడంతోపాటు పరివాహక ప్రాంత గ్రామాలన్నీ ఉప్పుకయ్యలుగా మారే ప్రమాదం ఉందని జలవనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సముద్ర ముఖద్వారం నుంచి ఉప్పుటేరు ఎగువ ప్రాంతం వరకు డ్రెజ్జింగ్ చేసి పూడిక పనులు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. ముంపు తప్పట్లేదు అధిక వర్షాలు, తుపానుల సమయంలో ఉప్పుటేరు ఉగ్రరూపం దాలుస్తోంది. జిల్లాలోని ప్రధాన డ్రెయిన్లన్నీ పొంగిపొర్లుతూ ఉప్పుటేరులో కలుస్తున్నాయి. దీంతో ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తూ సముద్రం వైపు కదులుతుంది. ఇదే సమయంలో సముద్రపు ఆటుపోటుల కారణంగా సముద్రం నీరు ఉప్పుటేరులోకి ఎగదన్నడం వల్ల వర్షం నీరు గ్రామాలను ముంచెత్తుతోంది. డ్రెయిన్లన్నీ ఉప్పుటేరులోకే.. జిల్లాలోని అన్ని ప్రధాన డ్రైయిన్లు దక్షిణం వైపున ఉన్న ఉప్పుటేరులోనే కలుస్తున్నాయి. కొల్లేరుతోపాటు ప్రధాన డ్రెయిన్లయిన మొగదిండి, కొత్త యనమదుర్రు, బొండాడ, పొలిమేరతిప్ప, పాత యనమదుర్రు, సాల్ట్క్రీక్ డ్రెయిన్లు ఉప్పుటేరులో కలుస్తున్నాయి. పలు చిన్న, మధ్య తరహా డ్రెయిన్లు ఉప్పుటేరులోనే కలుస్తున్నాయి. స్లూయిజ్ నిర్మిస్తే లాభం ఉప్పుటేరు డ్రెయిన్‌కు మొగలో స్లూయిజ్ నిర్మిస్తే పంటలు సస్యశ్యామలం అవుతాయని రైతులు అంటున్నారు. ఏటా జనవరి నుంచి జూన్ నెల వరకు సముద్రం నుంచి ఉప్పునీరు కొల్లేరు వరకు ఎగదన్నడంతో ఈ ప్రాంతం ఉప్పుకయ్యలుగా మారుతోంది. స్లూయిజ్ నిర్మాణంతోనే దీనిని అడ్డుకోవచ్చని రైతులు అంటున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం భీమవరం డివిజన్లో ఉప్పుటేరు 33 మైళ్లు వరకు వ్యాపించి ఉంది. దీని పూడికతీత పనులకు సంబంధించి నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. ఉప్పుటేరు అభివృద్ధికి కృషిచేస్తాం. – సుజాత, డ్రెయిన్స డీఈ -
ఉప్పుటేరులో పసిగుడ్డు మృతదేహం
తల్లిదండ్రులపైనే పోలీసుల అనుమానం కాకినాడ క్రైం : తుని మార్కెట్‌యార్డు సమీపంలో తుప్పల్లో లభించిన కవల పిల్లల ఉదంతం, ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి సీరం పూర్ణరత్నావల్లి సాంబారు గిన్నెలో పడి మృతి చెందిన ఘటన నుంచి జిల్లా ప్రజలు తేరుకోక ముందే గురువారం మరో శిశువు స్థానిక ఉప్పుటేరు పక్కన విగతజీవిగా పడి ఉండటం కాకినాడలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పప్పులమిల్లు సమీపంలో రేకాడి వీరబాబు, భార్య కాసులమ్మ కొన్నేళ్లుగా కాపురం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల బాబు, ఇటీవలే జన్మించిన ఇరవై ఒక్కరోజుల ఆడశిశువు ఉన్నారు. మంగళవారం అర్థరాత్రి పాప కనిపించడం లేదంటూ తల్లి కుమారి, నాన్న «ధర్మారావులకు కూతురు కాసులమ్మ చెప్పింది. ఇప్పటి దాకా పాపవద్ద నువ్వు, నేను,అమ్మ పడుకున్నాం. ఇంతలో ఎలా మాయమవుతుందని వారు ఆందోళనకు లోనయ్యారు. ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో పాప కోసం చుట్టుపక్కల గాలించారు. తన పక్కలో పాప నిద్రిస్తున్నదని, రాత్రి 11.30 గంలకు బాత్రూమ్కి వెళ్లి తిరిగొచ్చేలోగా పాప కనిపించకుండా పోయిందని కాసులమ్మ తెలిపింది. ఈ విషయమై కాకినాడ ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కాసులమ్మ తెలిపింది. గురువారం ఉదయం వీరు నివసించే మూడు ఇళ్ల పక్కనున్న ఉప్పుటేరు కాలువ పక్కన పాప విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న ఎస్సై టి.రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పాప మృతదేహాన్ని పరిశీలించారు. ముఖంపై పురుగులు పట్టి ఉండటం, పాప ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లు ఉండడాన్ని గుర్తించారు. కాగా పాప మిస్సింగ్‌పై తమకెటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై తల్లిదండ్రులపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టమ్ కోసం శిశువు మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. -
జిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తాం
వంశధార రెండోదశ పూర్తి చేసి తీరుతాం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన సభలో మంత్రి అచ్చెన్నాయుడు నువ్వరేలవు( వజ్రపుకొత్తూరు): శ్రీకాకుళం జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర కార్మిక, క్రీడా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో ఆదివారం రూ.35.38 కోట్లతో ఉప్పుటేరుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వంశధార రెండో దశ పూర్తి చేస్తామని చెప్పారు. ప్రకృతితో ప్రతి ఒక్కరూ అనుసంధానం కావాలని, ఈ స్ఫూర్తితోనే నదుల అనుసందానం చేపట్టి గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. టెక్కలి, వజ్రపుకొత్తూరు మండల పరిషత్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించేందుకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళుతున్నట్టు ప్రకటించారు. ఎంపీ కె.రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ నువ్వలరేవులో పొగురు తీసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ జిల్లాలో తీరం వెంబడి 193 కిలో మీటర్ల పరిధిలో 10 వరుసల్లో సరుగుడు, తాటి చెట్లు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సంవరక్షణ బాధ్యత మహిళా బృందాలకు అప్పగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ బ్రహ్మారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, ఎంపీపీ జి.వసంతరావు, జెడ్పీటీసీ ప్రతినిధి ఉదయ్‌కుమార్, సర్పంచ్ బి. ధర్మారావు, ఉప సర్పంచ్ ఎం.రఘు పెద్ద బెహరా మధుసూదన్, స్థానిక ఎంపీటీసీ ప్రతినిధులు వెంకటేష్, ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పి. విఠల్‌రావు, ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోవిందరాజులు, వెంకట్‌కుమార్ చౌదరి, ఎంపీడీఓ వి.తిరుమలరావు, మండల పార్టీ అధ్యక్షుడు బి. శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు. -
పడవ బోల్తా : ప్రయాణికులు సురక్షితం
విజయవాడ : కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలోని ఉప్పుటేరులో మంగళవారం పడవ బోల్తా పడింది. పడవలో ప్రయాణిస్తున్న 50 మంది నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఉప్పుటేరులోని పడిన ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పల్లెపాడు నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని పాతపాడులో జరుగుతున్న సంతకు వీరు చేపల్ని తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. -
ఉప్పుటేరులో వ్యక్తి గల్లంతు
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఉప్పుటేరులో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి పంచాయతి పరిధిలోని చింతరేవులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బంగార్రాజు(45) శనివారం ఉదయం చేపల వేట కోసం వెళ్లాడు. అయితే.. వేటాడే సమయంలో ప్రమాద వశాత్తు ఉప్పుటేరులో పడిపోయాడు. ఇది గమనించిన తోటి జాలర్లు స్థానికులకు సమాచారం ఇచ్చారు. బంగార్రాజు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఉప్పుటేరు... గుండె బేజారు!
పూండి: శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు ఉప్పుటేరు పొంగి పొర్లుతుండటంతో వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక కాలిబాట వంతెన కొన్నిచోట్ల కొట్టుకుపోయింది. దీంతో పూడిలంకకు రాకపోకలు నిలిచిపోయాయి. 120 ఇళ్లు, 136 కుటుంబాలు ఉన్న ఈ గ్రామానికి వంతెన నిర్మించాలన్న డిమాండ్ 50 ఏళ్లుగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే సమస్యపై గత ఏడాది ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో ప్రచురితమైన ఫొటో కథనానికి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. అప్పట్లో కొంత హడావుడి చేసిన అధికారులు, తర్వాత దాన్ని పట్టించుకోవడం మానేశారు. గతంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించినా చర్యలు లేవు. సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు వినతులు కూడా అందజేశారు. గత ఏడాది అక్టోబర్ 12న సంభవించిన ఫై లీన్ తుపాను సందర్భంగా కొండవూరు నుంచి గ్రామానికి గ్రావెల్ రహదారి మంజూరు చేస్తామని నిన్నటి వరకు కలెక్టర్‌గా ఉన్న సౌరభ్‌గౌర్ హామీ ఇచ్చినా నెరవేరలేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకే ఉప్పుటేరు పొంగింది. కాలిబాట మూడు చోట్ల తెగిపోయింది. మరికొన్ని చోట్ల కొట్టుకుపోయింది. వర్షాల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే భారీవర్షాలు పడితే తమ గతి ఏమిటని సర్పంచ్ తిమ్మల పవిత్ర ఆందోళన వ్యక్తం చేశారు.