ఉప్పుటేరులో పసిగుడ్డు మృతదేహం
ఉప్పుటేరులో పసిగుడ్డు మృతదేహం
Published Thu, Jan 5 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
తల్లిదండ్రులపైనే పోలీసుల అనుమానం
కాకినాడ క్రైం : తుని మార్కెట్‌యార్డు సమీపంలో తుప్పల్లో లభించిన కవల పిల్లల ఉదంతం, ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి సీరం పూర్ణరత్నావల్లి సాంబారు గిన్నెలో పడి మృతి చెందిన ఘటన నుంచి జిల్లా ప్రజలు తేరుకోక ముందే గురువారం మరో శిశువు స్థానిక ఉప్పుటేరు పక్కన విగతజీవిగా పడి ఉండటం కాకినాడలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పప్పులమిల్లు సమీపంలో రేకాడి వీరబాబు, భార్య కాసులమ్మ కొన్నేళ్లుగా కాపురం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల బాబు, ఇటీవలే జన్మించిన ఇరవై ఒక్కరోజుల ఆడశిశువు ఉన్నారు. మంగళవారం అర్థరాత్రి పాప కనిపించడం లేదంటూ తల్లి కుమారి, నాన్న «ధర్మారావులకు కూతురు కాసులమ్మ చెప్పింది. ఇప్పటి దాకా పాపవద్ద నువ్వు, నేను,అమ్మ పడుకున్నాం. ఇంతలో ఎలా మాయమవుతుందని వారు ఆందోళనకు లోనయ్యారు. ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో పాప కోసం చుట్టుపక్కల గాలించారు. తన పక్కలో పాప నిద్రిస్తున్నదని, రాత్రి 11.30 గంలకు బాత్‌రూమ్‌కి వెళ్లి తిరిగొచ్చేలోగా పాప కనిపించకుండా పోయిందని కాసులమ్మ తెలిపింది. ఈ విషయమై కాకినాడ ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కాసులమ్మ తెలిపింది. గురువారం ఉదయం వీరు నివసించే మూడు ఇళ్ల పక్కనున్న ఉప్పుటేరు కాలువ పక్కన పాప విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న ఎస్సై టి.రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పాప మృతదేహాన్ని పరిశీలించారు. ముఖంపై పురుగులు పట్టి ఉండటం, పాప ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లు ఉండడాన్ని గుర్తించారు. కాగా పాప మిస్సింగ్‌పై తమకెటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై తల్లిదండ్రులపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టమ్ కోసం శిశువు మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.
Advertisement
Advertisement