బాలికల విద్యలో చివరిస్థానం!
అహ్మదాబాద్ః గుజరాత్ ప్రభుత్వం బాలికల విద్యావికాసంకోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'కన్యా కెలవనీ' ప్రభావం ఆ రాష్ట్రంలో పెద్దగా కనిపించడం లేదు. డ్రాపవుట్స్ ను స్కూల్లో చేర్చుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్గే ఆ రాష్ట్రం విఫలమైనట్లు కనిపిస్తోంది. బాలికల విద్య విషయంలో చివరిస్థానానికే పరిమితమౌతోంది.
శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా నిర్వహించిన 2014 సర్వే లెక్కలను బట్టి గుజరాత్ పాఠశాలల్లో బాలికల శాతం అత్యంత తక్కువగా కనిపిస్తోంది. 15-17 ఏళ్ళ మధ్య వసుగల సుమారు 26.6 శాతంమంది బాలికలు డ్రాపవుట్స్ గా మారుతున్నట్లు సర్వేలను బట్టి తెలుస్తోంది. అంటే రాష్ట్రంలోని 26.6 శాతంమంది బాలికలు కేవలం నాలుగైదు తరగతులకు మించి చదువు కొనసాగించటల్లేనట్లు సర్వేలు చెప్తున్నాయి. భారతదేశంలో సగటున 83.8 శాతం బాలికలు పాఠశాలలకు హాజరౌతుంటే.. కేవలం గుజరాత్ లో 10 శాతం మంది మాత్రమే ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. దీంతో పదేళ్ళ క్రితంనుంచే రాష్ట్రంలో బాలికలను చదువుకు ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రామలతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 'కన్యా కెలవని', 'శాల ప్రవేశోత్సవ్' పేరిట మంత్రులు, ప్రభుత్వాధికారులు గ్రామీణ ప్రాంతాల్లో బాలికలను పాఠశాలల్లో చేర్చుకునేందుకు ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ వెనుకబడే ఉండటంతో ఆందోళన వ్యక్తమౌతోంది.
అమ్మాయిలు 5వ తరగతిలోపు చదువతున్నవారు 14.8 శాతం ఉండగా.. వారిలో కేవలం 7.3 శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారని గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్రసింహ్ ఛుడస్మా తెలిపారు. అందుకే తాము అమ్మాయిలను పాఠశాల్లో చేర్పించేందుకు, చదువు కొనసాగేట్లు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని చెప్తున్నారు. అయితే 8వ తరగతి తరువాత చదివినవారు డ్రాపవుట్స్ కావడం లేదని, దీంతో 20 శాతం కంటే నిష్పత్తి ఎక్కువగా ఉండటం లేదని ఆయనన్నారు. అందుకే తాము బాలికల చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ప్రభుత్వం బాలికల అక్షరాస్యత 100 శాతానికి చేర్చేందుకు అంకితమై పనిచేస్తోందని తెలిపారు.